top of page
Original.png

మలి వయస్సులో మరో జీవితం - పార్ట్ 1

#YasodaPulugurtha, #MaliVayassuloMaroJeevitham, #మలివయస్సులోమరోజీవితం, #యశోదపులుగుర్త, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Mali Vayassulo Maro Jeevitham - Part 1/2 - New Telugu Story Written By Yasoda Pulugurtha Published in manatelugukathalu.com on 18/02/2026

మలి వయస్సులో మరో జీవితం - పార్ట్ 1/2 - తెలుగు కథ

రచన: యశోద పులుగుర్త 

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత


“ఏమండీ, ఒకసారి ఇలా వస్తారా?” అంటూ కామేశ్వరి పిలిచేసరికి, భార్య గొంతుక ఏమిటో నీరసంగా, బలహీనంగా అనిపించింది హాల్లో పేపర్ చదువుకుంటున్న దాశరథికి. వెంటనే లేచి లోపలకు వెళ్లాడు. వాష్ బేసిన్ దగ్గర వాంతి చేసుకుంటున్న భార్యను చూడగానే గబుక్కున వెళ్లి ఆమెను పొదివి పట్టుకున్నాడు.


“ఏమైంది కామూ! ఏమిటి పొద్దున్నే పొద్దున్నే వాంతి చేసుకుంటున్నావు? ఒంట్లో బాగాలేదా? చెప్పొచ్చు కదా?”


“ఏమిటో బ్రష్ చేసుకుందామని వచ్చేసరికి వికారం అనిపించిందండీ. ఒకటే తల తిరుగుతోంది. భళ్లున వాంతి అయిపోయింది. రెండు రోజుల నుండి ఒంట్లో ఏదోలా ఉంటోంది.”


“బాగో లేకపోతే చెప్పాలి. డాక్టర్ దగ్గరకు వెళ్లే వాళ్లం కదా? ఇలా నిర్లక్ష్యం చేసి రోగాలు ముదరపెట్టుకోవడమా?”


“ఈరోజు ఆఫీస్‌కి సెలవు పెడతాను. డాక్టర్ మాలతి దగ్గరకు వెడదాం. ఏ పనీ చేయకుండా కాసేపు పడుకో కామేశ్వరీ. కాఫీ ఇస్తాను, తాగుదువుగాని.”


డాక్టర్ మాలతి చెప్పిన మాటలకు తృళ్లిపడింది కామేశ్వరి. తను నాలుగో నెల గర్భవతిని నిర్ధారించింది ఆవిడ.


“ఇదెలా సంభవం!?”


తను మెనోపాజ్‌కి దగ్గర పడుతున్నానని భావించింది ఇన్నాళ్లూనూ. నెల నెలా వచ్చే పీరియడ్స్ సక్రమంగా, టైమ్‌కి రావడం లేదు ఒక ఆరు నెలల నుండి. ఇంక ఆగిపోతాయేమో అనుకుంటున్న దశలో, డాక్టర్ చెప్పిన మాట విని “ఇదేమిటిరా దేవుడా!” అనుకుంది. డాక్టర్ మాలతి, దాశరథిగారిని కూడా పిలిచి చెప్పింది. డాక్టర్ మాలతి వాళ్ల ఫ్యామిలీ డాక్టర్. విషయం విన్న ఆయన కూడా ఒక్కసారిగా స్టన్ అయ్యాడు.


“డాక్టర్, మీరు తప్పుగా భావించకపోతే ఒక విషయం చెప్తాను. యాభై రెండు నిండిన నాకు ఇప్పుడు గర్భం రావడం సిగ్గుగా ఉంది. పైగా ఇంత వయస్సులో కనడం రిస్క్ ఏమోనన్న భయం కూడా కలుగుతోంది. ఇది మంచో, చెడో తెలియదు గానీ, నేనీ గర్భాన్ని ఉంచుకోలేను. దయచేసి టర్మినేట్ చేయగలరా?” దీనంగా అడుగుతున్న కామేశ్వరి వైపు చూస్తూ, “ఇప్పుడు అలా చేయడం కష్టం కామేశ్వరిగారూ. నాలుగో నెల నడుస్తోంది. రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. లోపల బిడ్డ గ్రోత్ హెల్దీగా ఉంది. ఇప్పుడు మీరున్న పరిస్థితిలో సాధ్యం కాదమ్మా.


“అయినా ఏమైందని ఇప్పుడు?!” యాభై రెండేళ్ల వయస్సులో గర్భం వచ్చినా, లోపల బిడ్డ ఆరోగ్యంగా రూపు దిద్దుకోవడం, ఇది అపూర్వమైన విషయమే కదా కామేశ్వరిగారూ! మీరు కూడా ఏ ఆరోగ్య సమస్యలూ లేకుండా హెల్దీగా ఉన్నారు. పోతే, అందరూ ఏమనుకుంటారోనని మీరు సిగ్గుపడుతున్నారేమో. ఇందులో సిగ్గేముంది? సహజ సిద్ధమైన సృష్టికార్యాన్ని నిరోధించడానికి మనం ఎవరమని? మీ కడుపులో రూపు దిద్దుకుంటున్న బిడ్డను బయట ప్రపంచంలోకి ఆహ్వానించండమ్మా. ప్రతి నెలా వచ్చి చూపించుకోండంటూ” ధైర్యం చెప్పి పంపించిందావిడ.


దాశరథి గారేమీ పైకి తేలడం లేదు గానీ, కామేశ్వరి చాలా టెన్షన్ పడిపోతోంది.


కొడుకూ, కూతురూ ఈ విషయం విని ఏమనుకుంటారో? బంధువులందరూ ఏమనుకుంటారో? అమ్మమ్మా, నానమ్మా అయిపోయిన వయస్సులో తను మరో బిడ్డను కనబోతోంది. అందరూ తన వెనుక నవ్వుకోరా? ఎందుకో సిగ్గుతో కుంచించుకు పోతూ ముభావంగా తిరుగుతోంది కామేశ్వరి. దాశరథి మామూలుగా ఆఫీస్‌కి వెళ్లి వస్తున్నాడు. ఇంకా ఆయనకు మూడేళ్ల సర్వీస్ ఉంది.


కామేశ్వరి అత్తవారింటికి వచ్చేనాటికి పంతొమ్మిదేళ్ల వయస్సు. ఇంటర్ పాస్ అయిన మరుసటి సంవత్సరమే పెళ్లి చేసి పంపించేశారు ఆమె తల్లిదండ్రులు. పెళ్లైన సంవత్సరానికే కొడుకుని కనేసింది. మరో రెండు సంవత్సరాలకు కూతురుని కన్నది. వాళ్ల చదువులూ, పెళ్లిళ్లూ అయిపోయి ఉద్యోగరీత్యా తలో చోటా స్థిరపడ్డారు. కూతురు వైష్ణవికి అయిదేళ్ల కూతురు, సంవత్సరంన్నర కొడుకు కూడా. కొడుకు ఆదిత్యకు మూడేళ్ల కొడుకు. ఇప్పుడు కోడలు మరో మూడు నెలల్లో మరో బిడ్డను కనబోతోంది. ఇటువంటి పరిస్థితిలో తను ఇప్పుడు గర్భం దాల్చడం ఎంత అవమానం, సిగ్గు? పిల్లలతో ఈ విషయం ఎలా చెప్పాలోనని సతమతమవుతున్న తరుణంలో, “కాగల కార్యం గంధర్వులే తీరుస్తారన్నట్లుగా”, వైష్ణవి పిల్లలతో చెన్నై నుండి సడన్‌గా పుట్టింటికి వచ్చింది. అత్తగారి తరఫున బంధువుల ఇంట్లో పెళ్లి ఉందని, భర్తకు రావడం కుదరని మూలాన, తాను పిల్లలతో వచ్చానని చెప్పింది. తల్లి ఎందుకో అదోలా ఉండడం, ఆమెలోని శారీరక మార్పులను గమనించిన వైష్ణవి, “అమ్మా, ఏమిటి అలా డల్‌గా ఉన్నావు, ఒంట్లో బాగోలేదా?” అని అడిగేసరికి కూతురిని బెడ్ రూమ్ లోకి తీసుకుపోయి తలుపులు వేసేసి కూతురిని పట్టుకుని ఏడ్చేసింది. వైష్ణవి కంగారుపడిపోయింది.


“ఏమీ లేదే వైషూ! నీకు ఎలా చెప్పాలో ఏమిటోనని తల్లడిల్లి పోతున్నాను. ఈ వయస్సులో మీ అమ్మ గర్భవతి అయిందంటే నమ్ముతావా? మరో అయిదు నెలల్లో నీకు తమ్ముడో, చెల్లెలో పుట్టబోతున్నారు.”


“ఏంటమ్మా! నీవు జోకులు కూడా వేస్తావా?” కాస్త సీరియస్ అయింది వైష్ణవి.


“జోక్ కాదే, నిజం. వారం క్రితం డాక్టర్ కన్‌ఫర్మ్ చేసింది.”


“వ్వాట్!”


“ఛ! అయినా ఇదేమిటమ్మా, ఈ వయస్సులో!” నవ్విపోదురుగాక. ఈ విషయం తెలిస్తే మా అత్తగారింట్లో అందరూ నవ్వుకోరా? అయినా టర్మినేట్ చేయించుకోక సంబరంగా మరో బిడ్డను కనేయాలనే?”


కామేశ్వరి తెల్లబోతూ కూతురు వైపు చూసింది. కూతురి మాటలకు ఆమె ముఖం పాలిపోయింది. అసలుకే తను సిగ్గు, అవమానంతో నలిగిపోతోంది. వైష్ణవి తనకు ధైర్యం చెప్తుందని ఎంతో ఆశించింది. కానీ మరింత కుంచించుకు పోయేటట్లు మాట్లాడేసరికి కామేశ్వరి బిక్కచచ్చిపోయింది.


“టర్మినేట్ చేయడం ఇప్పుడు కుదరదని డాక్టర్ చెప్పింది.” కూతురికి మరో మాటకు అవకాశమివ్వకుండా అక్కడ నుండి వెళ్లిపోయింది.


ఆ రాత్రి భర్తతో చెప్పుకుని ఏడ్చింది. “కామేశ్వరీ! నా తరపున సారీ చెప్తున్నాను. జరిగిన దానికి ఇద్దరం బాధ్యులమే. ఇలా ఎందుకు జరిగిందని బాధపడుతూ, ఏడుస్తూ ఆరోగ్యం పాడుచేసుకుంటావా? ఏం, ఇందులో తప్పేముంది, కాని పని ఏముంది? ధైర్యంగా ఉందాం. చక్కని ఆరోగ్యవంతమైన బిడ్డను కను. ఎవరైనా ఫరవాలేదు. పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేద్దాం. నాకు ముగ్గురు బిడ్డలుంటే బాగుండేదని అప్పుడప్పుడు అనుకునేవాడిని. ఇదిగో ఇప్పుడు ఆ కోరిక తీరబోతోంది.


“అవును, బిడ్డను కంటామని అందరికీ సంతోషంగా చెప్పు. నీవు ఇలా సిగ్గుతో నలిగిపోతుంటే మన వెనుక నవ్వుకునేవాళ్లే ఎక్కువ మంది ఉంటారు. ఎవరి మాటలూ పట్టించుకోకు కామూ, నేను నీ పక్కనే ఎప్పుడూ ఉంటానని భర్త ధైర్యం చెప్పేసరికి” ఆమె దుఃఖం ఉపశమించింది.


కోడలి పుట్టిల్లు కూడా హైదరాబాదే అయ్యేసరికి, ఎప్పుడూ రాని వియ్యపురాలు ఒక రోజు హడావిడిగా చెప్పా పెట్టకుండా వచ్చేసింది వీరింటికి.


వస్తూనే, “వదినా! ఎలా ఉన్నారంటూ?!” కామేశ్వరిని నఖశిఖపర్యంతం చూపులతో తినేసింది.


“బాగానే ఉన్నాను వదినగారూ” అంటూ చిరునవ్వు నవ్వింది.


“వచ్చే నెలలో మా అమ్మాయిని, అదే మీ కోడలిని పురిటికి తీసుకు వస్తున్నాను.”


“ఆ.. పురుడంటే గుర్తుకు వచ్చింది. స్రవంతి చెప్తే నమ్మలేకపోయాను. మీకు అయిదో నెలట కదా? కోడలితో పోటీ పడ్తున్నారన్న మాట.” ఆవిడ మాటల నిండా వెటకారమే.


“స్రవంతి తో నాకు పోటీ ఏమిటి రాజ్యలక్ష్మి గారూ?”


జీవితంలో మనం ఊహించనివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. యాదృచ్ఛికం అంటే తెలిసే ఉంటుంది మీకు. కొన్నింటికి సమాధానం ఉండదు. కర్మ నుండి ఎవరం తప్పించుకోలేం. ఆ కర్మ ఫలితాన్ని స్వీకరించక తప్పదు. ఇదీ అంతే.


కామేశ్వరికి నెలలు నిండాయి. అటు కూతురు గానీ, కొడుకు గానీ, “అమ్మా, దిగులు పడకు, పురిటి సమయంలో మేము వస్తాం” అని ఎవరూ ధైర్యం చెప్పలేదు. దాశరథిగారు వంట మనిషిని పెట్టారు. ఆయన లాంగ్ లీవ్ పెట్టి భార్యను చూసుకుంటున్నారు.


డాక్టర్ ఇచ్చిన డేట్‌కే కామేశ్వరి పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆరోగ్యంగా, అందంగా మెరిసిపోతున్న ఆ పసిపిల్లను హృదయానికి హత్తుకుంది. ఇది నా బిడ్డ, చక్కగా పెంచుకుంటాను అని మురిసిపోయింది.


మూడో నెలలో బారసాలకు వచ్చారు కూతురు, కొడుకు కుటుంబాలు. ఏదో మొక్కుబడిగా వచ్చినట్లుంది వారి ప్రవర్తన చూస్తుంటే. కోడలికి మళ్లీ కొడుకు. ఆరు నెలలు నడుస్తున్నాయి వాడికి.


ఇల్లంతా పిల్లలతో హడావిడిగా ఉంది.


ఆ రోజు కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. కామేశ్వరికి పుట్టిన పాపకు ‘వేద’ అని నామకరణం చేశారు. పాప తెల్లగా, బూరి బుగ్గలతో మెరిసిపోతోంది. తన కూతురు గానీ, కొడుకు గానీ పాప వైపు సరిగ్గా చూడనైనా లేదు. చేతుల్లోకి తీసుకోలేదు. ఒకే రక్తం పంచుకు పుట్టిన చిన్నారి చెల్లెలు అన్న ఉద్విగ్నతను కూడా చూపని వారి స్వభావానికి కామేశ్వరి నిరుత్తరాలైంది.


ఆ రోజు రాత్రి కామేశ్వరి మంచినీళ్లు తాగుదామని వంటింట్లోకి వెళ్లబోతుంటే, కూతురు గదిలో నుండి ఏవో మాటలు వినపడడం, అందులో స్పష్టంగా తన ప్రసక్తి రావడంతో అక్కడే ఆగిపోయిందో క్షణం.


***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :  

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.








Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page