top of page

మలిజీవితం


'Mali Jeevitham' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

'మలిజీవితం' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

స్కూలు మాస్టరుగా పనిచేస్తున్న విశ్వనాధన్ భార్య సుశీల, కొడుకు సుధీర్ తో సంతోషంగా ఉంటున్నాడు. విద్యార్థులకు క్రమశిక్షణను, సత్ప్రవర్తనను అలవాటు చేస్తూ మంచిగా విద్యను బోధించే ఆయనంటే ఆ స్కూలు విద్యార్థులందరికీ చాలా గౌరవాభిమానాలున్నాయి.


ఆ ఊరి ప్రజలు ఆయనమీద గౌరవంతో ఒక పెంకుటిల్లును కట్టించి ఇచ్చారు. వాళ్లు తమ తోటలో పండిన కూరలు, పండ్లు, తమ గేదల పాలు కూడా పంపిస్తూంటారు. సుశీల భర్తకు తగిన ఇల్లాలు. ఉన్నంతలో గుట్టుగా, గౌరవంగా బ్రతుకుచూ సంంసారం నడుపుతోంది. ఆ ఊరిలో ఎవరికి ఏ సాయం కావాలన్నా ఆ దంపతులు ముందు ఉంటూ అందరికి తలలో నాలుక లాగా ఉంటారు. వాళ్లని చూసి ఆదర్శ దంపతులు అని అందరూ మెచ్చుకొంటూ ఉంటారు.


సుధీర్ బాగా చదువుతూ మంచి మార్కులతో పాసవుతూ చదువులో రాణిస్తున్నాడు. అతను పదవతరగతి పాసవగానే కాలేజీ చదువుకి పట్నంలో హాస్టలు వసతిని ఏర్పాటు చేశాడు. సుధీర్ హాస్టలు లో ఉంటూ కాలేజీకి వెళ్లి వస్తున్నాడు. వారాంతంలో ఇంటికి వచ్చి తనకు కావలసిన డబ్బులు, తల్లి చేసిన పచ్చళ్లు, పిండివంటలు వగైరా తీసికెళ్లేవాడు.


ప్రతి ఆదివారం రాగానే కొడుకు వస్తాడని వేయి కళ్లతో ఎదురుచూస్తూ అతనికి కావలసినవన్నీ అమరుస్తూ ఉంటారు సుశీల దంపతులు. కొన్ని రోజుల తర్వాత విశ్వనాధన్ కి ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్ వచ్చింది. తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఆ ఊరి ప్రజలు ఆయనని అభినందించడం చూసి సుశీల సంతోషించింది. ఇంటికి వచ్చిన సుధీర్ తండ్రిని మనస్ఫూర్తిగా అభినందించాడు.


కాలం సాగుతోంది. సుధీర్ ఇంటర్ పాసయి ఇంజనీరింగ్ లో సీటు సాధించి అందులో చేరాడు. ఇంజనీరింగ్ ఆఖరి సం..లో అతనికి ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ శుభవార్తను విన్న విశ్వనాధన్ దంపతుల ఆనందానికి అవధులు లేవు. ఊర్లోని అందరికీ ఆ సంతోష వార్తను చెప్పుకుని తమ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ఊర్లోని అందరూ సంతోషించారు.


ఆరోజు సుధీర్ ఉద్యోగంలో చేరే మొదటి రోజు. తల్లి తండ్రుల పాదాలకు నమస్కరించిన కొడుకుని ప్రేమతో హత్తుకున్నారు ఆ దంపతులు. అతనికి ఇష్టమైనవన్నీ చేసి ఎన్నో జాగ్రత్తలు చెప్పి కొడుకుని బెంగళూరుకు ఉద్యోగం కోసం పంపారు. సుధీర్ ఉద్యోగం చేస్తూ నెలకి రెండు రోజులు ఇంటికి వచ్చిపోతున్నాడు. రోజులు సాఫీగా సాగుతున్నాయి. కొన్నాళ్లకు సుధీర్ తన సహోద్యోగి రమ్యతో ప్రేమలో పడ్డాడు. రమ్య కూడా అతనిని ప్రేమించింది. రోడ్డు ప్రమాదంలో చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన రమ్యని ఎవరో అనాధాశ్రమానికి చేర్చగా అక్కడే పెరిగి పెద్దయి కొంతమంది దాతల సహకారంతో కష్టపడి చదివి ఇంజినీరింగ్ ను పూర్తి చేసింది. ఆమె కష్టానికి గుర్తింపు లభించి మంచి కంపెనీలో ఉద్యోగం పొందింది. హాయిగా ఉద్యోగం చేసుకుంటూ సుధీర్ తో ప్రేమలో పడింది.


సుధీర్ తన ప్రేమ విషయాన్ని ఇంట్లో తలిదండ్రులకు తెలియచేశాడు. వాళ్లు రమ్యను చూడాలని అంటే ఒకసారి రమ్యను తీసికెళ్లి వాళ్లకు పరిచయం చేశాడు. రమ్యను చూశాక వాళ్లు సంతృప్తిచెంది వాళ్ల పెళ్లికి సుముఖత చూపారు. ఒక శుభముహూర్తాన వాళ్లిద్దరికీ ఘనంగా పెళ్లి జరిపించారు విశ్వనాధన్ దంపతులు. రమ్య, సుధీర్ లు బెంగళూరులో కాపురం పెట్టి సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు భార్యతో తల్లితండ్రుల వద్దకు వచ్చి రెండు రోజులు ఉండి వెళుతున్న ఆ జంటను చూసి ఆనందిస్తున్నారు సుశీలావాళ్లు.


రెండేళ్ల తర్వాత సుధీర్, రమ్యలకు ఉద్యగంలో ప్రమోషన్ వచ్చి మంచి హోదాలో ఉన్నారు. ఏడాది తర్వాత బాంకులోను కొంత తీసుకుని, తాము దాచుకున్న డబ్బుతో మంచి ఇల్లు కొన్నారు. విషయం తెలిసి విశ్వనాధన్ దంపతులు చాలా సంతోషించి బెంగళూరుకు వెళ్లి వాళ్ల చేత గృహప్రవేశం చేయించి వాళ్లతో నాలుగు రోజులుఉండి వచ్చారు.


కాలం హాయిగా గడుస్తోంది. కొన్నాళ్లకు సుశీల నిద్రలోనే కార్డియాక్ అరెస్టుతో శాశ్వతంగా కన్నుమూసింది. జరిగిన దారుణానికి విశ్వనాధన్ రోదించాడు. జరిగింది సుధీర్ కు తెలుపగా సుధీర్, రమ్యలు హుటాహుటిన వచ్చి చాలా బాధపడ్డారు. బంధువులు, చుట్టుప్రక్కల జనం అందరి సమక్షంలో సుశీల అంత్యక్రియలు యధావిధిగా జరిపాడు సుధీర్. ఆతర్వాత పది రోజులు అక్కడే ఉండి తండ్రిని జాగ్రత్తగా చూసుకుని ఉద్యోగం నిమిత్తం భార్యతో బెంగళూరుకు వెళ్లాడు. విశ్వనాధన్ ని తమతో రమ్మని కోరితే ఆయన అంగీకరించక ఇక్కడే ఉంటాననేసరికి 'సరే' అని వెళ్లారు.


విశ్వనాధన్ కి రోజులు భారంగా నడుస్తున్నాయి. రోజూ ఆయన విధిగా నడకన వెళ్లి సమీపమున ఉన్న పార్కులోకి వెళ్లి కూర్చుని కాసేపు ప్రశాంతంగా గడపడం అలవాటు చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ పార్కుకు తనకి కాస్త దూరంలో వేరే బెంచీమీద ఒకావిడ వచ్చి ఏకాంతంగా కూర్చుని గడిపి వెళ్లడం గమనించిన విశ్వనాధన్ ఒకరోజు చనువు తీసుకుని తనని పరిచయం చేసుకుని ఆవిడని మర్యాదపూర్వకంగా పలకరిస్తే ఆవిడ ముభావంగా జవాబిచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఆవిడతో మాటలు కలిపిన విశ్వనాధంతో ఆవిడ చక్కగా మాట్లాడింది. క్రమేణా ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. విశ్వనాథన్ తన గురించి పూస గుచ్చినట్టు అంతా చెప్పి ఆవిడ గురించిన వివరాలు అడిగాడు.


ఆవిడ తన పేరు 'సీత' అని, ప్రైవేటు ఉద్యగం చేస్తున్న తన భర్త కలరా వ్యాధి తో పోయి ఏడాది గడిచిందనీ, పిల్లలు లేని తనకు అయినవాళ్లెవరూ లేరని చాలా బాధపడుతూ చెప్పింది. ఉన్న కాస్త డబ్బుతో ఈ పార్కుకు దగ్గరలోనే అద్దె ఇంట్లో గౌరవంగా బ్రతుకుతున్నానని, ఉద్యోగప్రయత్నంలో ఉన్నానని చెప్పింది. అంతా విన్న విశ్వనాధన్ ఆవిడకు ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత ఏవో పిచ్చాపాటీ కబుర్లు మాట్లాడాక ఇద్దరూ ఎవరిదోవన వాళ్లిళ్లకు వెళ్లారు.


విశ్వనాధన్ కి ఆ రాత్రి సీత గురించిన ఆలోచనలతో సరిగా నిద్రపట్టలేదు. ఆవిడ కేదైనా దారి చూపాలనిపించి పరిపరి విధాల ఆలోచనలు చేశాడు. చివరకు ఒక ఆలోచన మదిలో మెదిలి దాన్ని ఆవిడకు ఆ మరురోజు చెబుదామని మనసులో అనుకుని నిద్రపోయాడు. తెల్లవారాక రోజూలాగానే పార్కుకు వెళ్లాడు విశ్వనాధన్. కాసేపటికి సీత వచ్చి పలుకరించినాక కబుర్ల మధ్యలో "సీతా! రాబోయే జీవితం గురించి నేనొక నిర్ణయం తీసుకున్నాను. నీకిష్టమైతే అంగీకరించు. బలవంతమేమీలేదు. వింటానంటే చెబుతాను. నన్ను తప్పుగా అపార్థం చేసుకోవద్దు" అన్నాడు విశ్వనాధన్.


"చెప్పండి" అంది సీత.


"సీతా! నా గురించి నీకంతా లోగడ చెప్పాను. నీగురించి కూడా అంతా నీవు చెప్పావు. చిగురించిన మన స్నేహం పవిత్రమైన బంధంగా మారితే బావుంటుందనిపించింది. నీకిష్టమైతే నేను నిన్ను వివాహం చేసుకుందామనుకుంటున్నాను. నాకు నీవు, నీకు నేను తోడుగా మనిద్దరం మలిదశలో క్రొత్త జీవితం గడుపుదామనుకుంటున్నాను. ఈ వయసులో కామవాంఛలతో కాదు నేను నిన్ను కోరుకుంటున్నది. ఆదరణ, ఆప్యాయత, స్వాంతన, ఒకరికొకరం చేదోడు, వాదోడు మనిద్దరికీ ఈ వయసులో మనకి చాలా అవసరం. నీకిష్టమైతే నేను మనస్ఫూర్తిగా నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. నీవు బాగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు." అన్నాడు విశ్వనాధన్.


కాసేపు సీత మౌనం వహించి "రేపటికి నా నిర్ణయం మీకు చెపుతాను" అని వెళ్లింది. ఆ తర్వాత విశ్వనాధన్ కూడా ఇంటికి వెళ్లాడు. ఆ రాత్రికి ఆయనకి కలత నిదురే అయింది. సీత కూడా ఆ రాత్రంతా ఆయన గురించి, ఉదయం ఆయన చెప్పిన మాటల గురించి బాగా ఆలోచించి మనసులో ఒక స్ధిర నిర్ణయం తీసుకుని ప్రశాంతంగా నిద్రపోయింది. ఆ మరుసటిరోజు యధావిధిగా పార్కుకు వెళ్లాక విశ్వనాధన్ కనిపించారు. వాళ్లు రోజూ కూర్చునే చోటున కూర్చున్నారు. సీత ఏ నిర్ణయం చెబుతుందా? అని ఆతృతలో ఎదురుచూస్తున్న ఆయన మనసుని అర్థం చేసుకున్నదై "మీతో వివాహానికి నేను సమ్మతము. మనిద్దరం రిజిస్టర్ మారేజ్ చేసుకుని సంతోషంగా మలిజీవితం కడదాకా గడుపుదాము" అంది సీత.


విన్న విశ్వనాధన్ ముఖం వేయివోల్టుల బల్బుతో వెలిగింది. సంతోషంగా ఆమె చేతిని దగ్గరకు తీసుకున్నాడు. సీత నవ్వుతూ ఆయనవైపు చూసింది. కాసేపు కబుర్లతో, నవ్వుతూ గడిపి ఇద్దరూ ఎవరిళ్లకు వాళ్లెళ్లారు. ఆ సాయంత్రం విశ్వనాధన్ సుధీర్, రమ్యలకు ఫోన్ చేసి సీత గురించి అంతా వివరించి తాము. పెళ్లి చేసుకోబోతున్న నిర్ణయాన్ని తెలిపాడు. అది విన్న సుధీర్, రమ్యలు సంతోషంగా విషెస్ చేశారు.


ఒక మంచిరోజున రిజిస్ట్రార్ ఆఫీసులో విశ్వనాధన్, సీతలు వివాహం చేసుకుని దంపతులయ్యారు. సీత తన అద్దె ఇంటిని వదిలి విశ్వనాధన్ వద్దకు వచ్చింది. రెండు రోజులు శెలవు పెట్టి సుధీర్, రమ్యలు వచ్చి ఈ దంపతులను చూసి సంతోషంగా వాళ్లతో గడిపి బెంగళూరుకు వెళ్లారు. సుధీర్, రమ్యలను ప్రేమగా చూసింది సీత. తల్లి పోయిన తర్వాత తన తండ్రికి మంచి తోడు దొరికిందని సంతోషంగా ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలిపాడు సుధీర్.


రోజులు హాయిగా గడుస్తున్నాయి. సీత విశ్వనాధన్ ని అనుక్షణం కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఆయన కూడా సీతని అదేరీతిలో చూసుకుంటున్నాడు. మాట, మనసు ఒకటిగా ఆ జంట సంతోషంగా తమ మలిజీవితాన్ని గడుపుతున్నారు.

.. సమాప్తం.

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు



"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏





68 views1 comment

1 Comment


sudershanap44
Aug 31, 2023

కథ చాలా బాగుంది-అభినందనలు.

Like
bottom of page