మలిసంధ్య
- Bharathi Bhagavathula

- Jul 22, 2024
- 4 min read
Updated: Feb 16
విజయదశమి 2024 కథల పోటీలో విశిష్ట(ప్రత్యేక) బహుమతి పొందిన కథ

'Malisandhya' - New Telugu Story Written By Bhagavathula Bharathi
Published In manatelugukathalu.com On 22/07/2024
'మలిసంధ్య' తెలుగు కథ
రచన: భాగవతుల భారతి
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
"అక్కడినుంచి ఇక్కడికి ఎంత దూరమో.. ఇక్కడినుంచి అక్కడికి అంతేదూరం.. ఓసారి రారాదూ!" అన్నాడతను.
"ఐతే! మీరే రావచ్చుగా!" ఆమె అడిగింది.
"అక్కడికి వస్తే మాకేమిస్తారో!" కొసిరాడు.
"ఏమిస్తాం? మా సిగ్గు దొంతరలు దోసిట్లో పెట్టి అందిస్తాం"
వినబడింది కానీ, ఫోన్ లో ఆమె ఫీలింగ్స్ కనబడలేదు.
"అబ్బో! ఘనకార్యమే చేస్తారు. అక్కడిదాకా ఎందుకూ?
సిగ్గు దొంతరలు ఇక్కడ ఏరుకోలేమా?"
"అయితే అక్కడే ఏరుకోండీ!" అందామె.
"ఇంతలోనే అలకా?" అతను అలక తీర్చటానికి అన్నాడు.
"ఏంలేదు" ఆమె బుంగమూతి కనబడకపోయినా అతను ఊహించాడు.
"వచ్చేస్తున్నా " అన్నాడు. ఆమె దగ్గరకి వచ్చాడు.
"ఇంత వెన్నెలరాత్రి, చందమామనూ తోడు తెచ్చుకున్నారే?! ఒంటరిగా రావటానికి భయమా?" కొంటెగా అడిగింది ఆమె.
"ఏం సవతిపోరు భరించలేక పోతున్నావా?" అన్నాడతను.
"అబ్బ! నేనందగత్తెనని, చెప్పీ చెప్పకుండా ఎంత లౌక్యంగా పొగిడారూ! పొంగిపోయాంలెండి" కిలకిలా నవ్వింది.
ఇద్దరూ బెంచ్ పై కూర్చున్నారు.
"అంతదూరం కూర్చున్నావు. ఏం! కాస్త దగ్గరకు జరగొచ్చుగా! ఇందులో మొహమాటం ఎందుకు? ఐ లవ్ యు" చెవిలో గుసగుసగా అన్నాడతను.
దగ్గరగా జరిగిందామె.
ఓ వాట్సాప్ గ్రూప్ లో పరిచయం అయిన వాళ్ళిద్దరి భావాలు కలిసి, ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇద్దరూ పరస్పరం తెలీదు.
కానీ, ఏడాది తర్వాత ఒకరంటే ఒకరికి ప్రాణమైన ప్రేమజంట.
తర్వాతి ఏడాది, ఆదర్శమైన మురిపాల పెళ్లిజంట. దాంపత్యపు పూదోటలో, పిల్లల రూపంలో రెండు పూలుపూసి, అవి వికసించి, చదువు సంధ్యలు పూర్తి చేసుకుని, రెక్కలొచ్చి, విదేశాలకు, వెళ్లిపోతే, ఒంటరిగా మిగిలి, ఒకరి అనురాగం ఒకరు ఆస్వాదించే మలిసంధ్య వేళల్లో,
ఓ గువ్వను, కాన్సర్ రూపంలో కంబళిస్తే,
రెండో గువ్వ ఒంటరిదై, పలవరించే వేళ..
------------------
సోఫాలో వెనుకకు వాలి కళ్ళు మూసుకుని గతంలోకి తొంగిచూసుకుంటున్న వాసుదేవ్ కాలింగ్ బెల్ మోతకి, కళ్ళుతుడుచుకుని ఊతకర్ర సాయంతో లేని ఓపిక తెచ్చుకుని, తలుపుతీసి, "వావ్ మీరా! అప్పుడే ఇంకో సంవత్సరం తిరిగి వచ్చిందా " అని నవ్వాడు.
"72 వ జన్మదిన శుభాకాంక్షలు సార్ ” అన్నాడు కొరియర్ బాయ్.
ఆ సమయంలో వాసుదేవ్, ముఖం వెయ్యి చంద్ర కాంతుల ధగధగలు మెరవడం కొరియర్ బాయ్ చూస్తుండగానే, చుట్టు ప్రక్కల అపార్ట్మెంట్ వాళ్ళంతా బయటికి వచ్చి, ' హ్యాపీ బర్త్ డే టు యూ 'అంటూ కోరస్ లో అరిచారు.
కళ్ళల్లో కాంతులతో పాటు బోసినవ్వులతో అందరివంకా, అభివాదం రూపంగా, తలాడించి, మెల్లిగా కళ్ళు తుడుచుకున్నాడు.
"అంకుల్ ఈరోజు మీరు మాఅందరితో కలిసి భోజనం చేయాలి. వదిలేదేలేదు" అన్నారు ఆప్యాయంగా..
"లేదు! మీరందరూ నామీద అభిమానంతో, వండుకునే ఓపిక లేనప్పుడు, రోజుకొకరు వంతులేసుకుని భోజనం పెడుతూనే ఉన్నారుగా! కానీ ఈరోజు నేను మాత్రమే కాదు. నాలో సగభాగం, నా సుధీష్ణ నాకోసం, నాతో ఉంటుంది. నేనే వండుతా తనకోసం. "
"అదీ!” అంటూ ఒకరిముఖాలొకరు చూసుకున్నారు.
"ఆమె చనిపోలేదు. నాతోనే ఉంది. ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిందంటే, దేహంతో లేకపోయినా, ప్రాణంగా ఉన్నట్లేగా!
ఈరోజుకు నన్ను వదిలేయండి. తనతో గడపాలి. భార్యాభర్తలు అంటే, వృద్ధాప్యం లో ఒకరికోసం ఒకరు, ఒకరి తలపులలో ఒకరు బ్రతకటం. సరే! నేను సాయంత్రం కలుస్తా. "
నిదానంగా తలుపుమూసి, కళ్ళజోడు సవరించుకుంటూ వచ్చి, సోఫాలో కూర్చుని, గ్రీటింగ్ కార్డ్ ఓపెన్ చేసాడు.
'ఆరుబయట కూర్చుంటే
మలయమారుతం వీస్తుంటే,
ఆదమరచి చూస్తున్నా
ఆలకించి వింటున్నా
మనసు రెక్కవిప్పి
తెమ్మెర వోలె తేలే
మరులై, విరులై, వింజామరలై
విరహపు జ్వాలై, వినిపించనా
వీనులవిందుగా, గొంతులో ఒంపేసి
మధువులూరు ప్రియనాదంబది
ఐ.. లవ్.. యు.. '
హ్యాపీ వాలెంటైన్స్ డే రోజు ఆమె చెవిలో తను చెప్పింది గుర్తుచేసుకుంటూ వ్రాసింది.
తనకు కాన్సర్ ఫోర్త్ స్టేజ్ అని తెలిసినప్పుడే,
పక్కనే కూర్చోబెట్టుకొని, సుధీష్ణ దాదాపుగా పాతిక కవితలు రాసి, వాటిని, పాతిక గ్రీటింగ్ కార్డులు, పాతిక కవర్లలో పెట్టి, అడ్రస్ లు అతికించి తాను తరచుగా వెళ్ళే, ఓ గుడి యజమానికి అప్పగించి, ప్రతి సంవత్సరం తన ప్రతీ పుట్టినరోజున ఓ కార్డ్ అందేటట్లు ఏర్పాటు చేయబోతున్నట్లు తనకు ఆరోజు తెలియదు.
ఇదిగో! ఈ కవిత తన చేతనే రాయించింది.
ఇన్ని సంవత్సరాల తర్వాత చదువుకుంటుంటే, చాలా ఆనందంగా ఉంది.
ఇప్పటికి పది అందుకున్నాడు తాను.
ఇంకెన్నాళ్ళు, ఎన్నేళ్ళు అందుకుంటాడో తెలీదు. ఈ శ్వాస ఎప్పుడాగుతుందో తెలీదు.
రోజూ అన్ని గ్రీటింగ్ కార్డులూ తీసి, వాటిల్లో తన సుధీష్ణ పొందుపరిచిన ప్రేమనంతా, ఓసారి చదువుకుంటుంటే తను కళ్ళముందే ఉన్న ప్రత్యక్షానుభూతి.
ఇదిగో! క్రితం సంవత్సరం కార్డ్ పై.. ఎంత చక్కగా ఉందీ? కవిత.
'నీ ఊహల ఊయలలో
నే తేలిపోతున్నా
నీ పాద సవ్వడులకు
నా గుండె లయల చిరుతాళం వేస్తున్నా
ప్రణవనాదంలా మోగే
నా హృదయ సవ్వడి వినవా!?
శరత్ వెన్నెలలా వస్తావని
చకోరంలా నిరీక్షిస్తున్నా.. '
‘ఇలా చదువుకుంటూ, ఈవయసులో ఒంటరితనం మరిచిపోయి ఎప్పుడూ తన జ్ఞాపకాలలో బతుకుతుంటే ఎంత బాగుందో!’ అనుకుంటూ.. కళ్ళజోడు సరిచేసుకుంటూ లేచి వెళ్ళి, పెన్నూ, పేపర్ తీసుకువచ్చి.. సోఫాలో చతికిల పడి.. గోడకు తగిలించిన ఫొటో వంక చూసి "సుధీష్ణా! నువ్వేనా! కవితలు రాసేదీ? నేనూ నేర్చుకున్నాను. ఇదిగో! ఈరోజు నీకోసం నేనూ ఓ కవిత రాస్తా " అంటూ కవితరాసాడు.
‘నువ్వు జ్ఞప్తికి రాగానే నా కళ్ళు చెమ్మగిల్లాయ్!
మరి! శరీరానికేనా ఎదురుచూపు
మనసుకు వద్దూ!?
గోడ పక్కనే వెలుగుతాయా దీపాలూ?
కళ్ళల్లో కూడా!
మరి! శరీరానికేనా వెలుతురూ!
మనసుకు వద్దూ!?
స్పర్శ కేవలం ఆనందం కోసమేనా?
ఓదార్పు కోసం కూడా!
మరి! శరీరానికేనా ఉపశమనం?!
మనసుకు వద్దూ?!
ఇక్కడిలాగే స్వర్గం లోనూ తలుచుకుంటున్నావా?!
మరి! శరీరానికేనా కలిసుండటం?!
మనసుకు వద్దూ!?’
అంటూ.. పేపర్ మీద రాసాడు వాసుదేవ్, మనసులోని భావాన్ని కవి కాకపోయినా, తనదైన శైలిలో..
ఆ కవితను కన్నీళ్లు కమ్మేస్తుండగా
మరోసారి చదివాడు. కొరియర్ బాయ్ తెచ్చిన లెటర్ కవర్ లోనే, ఈ లెటర్ నూ పెట్టి..
"చూసావా! సుధీ! ఇద్దరం ఒకే కవర్ లో ఎలా ఇమిడి పోయామో!" అంటూ కళ్ళు తుడుచుకున్నాడు.
పిల్లల దగ్గర నుండి, ఫోన్ లు, అనేక దేవాలయాల నుండి ఆశీర్వదిస్తూ ఫోన్లూ, వికలాంగుల అనాధాశ్రమం నుండి,
"పుట్టినరోజు శుభాకాంక్షలు, మీచేతులతో వీళ్ళకి వడ్డన చేసుకుందురుగాని రండి. "
అనాధాశ్రమం నుండి, ఆహ్వానం, ఇది కూడా సుధీష్ణ ఏర్పాటే! ఎన్ని దానాలు చేసిందనీ!?
ఏ దానం చేసినా, తన పుట్టినరోజు కి లింక్ పెట్టి, ఈరోజున ప్రతి గుడి లోనూ, అనాధాశ్రమాలలోనూ, పూజలు, అన్నదానాలు జరిగేటట్లు, ఏర్పాటు చేసి, తను బ్రతుకుతున్నది.. ఈ ఒక్కరోజు కోసమని, ఏడాదంతా ఎదురుచూస్తూ, బ్రతకాలనే కాంక్షను పెంచింది.
పిల్లల దగ్గరకు, వెళ్ళాలనే కోరికకూడా లేదు.
ఎందుకూ!? తన పక్కన సుధీష్ణ ఉందిగా!
తన చేత్తో వడ్డనచేసి, వాళ్ళు ఆనందంగా తింటుంటే, ఐదువందల మంది
అనాధలలో సుధీష్ణ దృష్టిలో తాను,
తనలో సుధీష్ణా బ్రతికే ఉన్నామని,
మలిసంధ్య అంటే, వృద్ధాప్యం కాదనీ,
భార్యాభర్తల బంధం అంటే..
అందమైన జ్ఞాపకాల సమాహారమనీ,
నేటి తరానికి చెప్పటానికి లేచాడు వాసుదేవ్.
===========
భాగవతుల భారతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం
ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.
ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో
బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.






Comments