మళ్ళీ మొదలైంది
- Divakarla Venkata Durga Prasad

- Sep 4
- 7 min read
#DVDPrasad, #డివిడిప్రసాద్, #మళ్ళీమొదలైంది, #MalleeModalaindi, #కొసమెరుపు, #TeluguCrimeStory, #హర్రర్

Mallee Modalaindi- New Telugu Story Written By - D V D Prasad
Published In manatelugukathalu.com On 04/09/2025
మళ్ళీ మొదలైంది - తెలుగు కథ
రచన: డి వి డి ప్రసాద్
పట్టణానికి దూరంగా విశాలమైన స్థలంలో ఉన్న ఓ పాత బంగళాను చౌకగా కొన్న జయదేవ్ దాన్ని రిమోడలింగ్ చేయించి, గృహప్రవేశం చెయ్యడానికి ముహూర్తం పెట్టుకున్నాడు. అతని భార్య జానకికి కూడా ఆ బంగళా బాగా నచ్చింది. జయదేవ్ వృత్తి పరంగా సివిల్ ఇంజీనీర్ అవడం చేత, దగ్గరుండి అద్భుతంగా దాన్ని డిజైన్ చేసాడు. ఇంటీరియర్ కోసమే కొన్ని లక్షలు ఖర్చుపెట్టాడు. బంగళా చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ, ఇంటి ముందు ఆకుపచ్చటి లాన్ తో ఠీవిగా కనిపిస్తోందా బంగళా. బంధు మిత్రులను పిలిచి, ఘనంగా గృహప్రవేశం చేసాడు. పాత బంగళాను అంత చక్కగా మార్చడం చూసిన అతని స్నేహితులు, బంధువులు చాలా ఆశ్చర్యపోయారు.
జయదేవ్ స్నేహితుడైన గిరిధర్ ఆ ఇంటిని చూడగానే ముచ్చట పడ్డాడు. "పాత బంగళాని చాలా బాగా రిమోడలింగ్ చేయించావు! నాకూ ఇదే మోడల్లో బంగళా కట్టించుకోవాలని ఉంది!" అని మెచ్చుకున్నాడు. గిరిధర్ కళ్ళలో అసూయ స్పష్టంగా కనిపించింది అతనికి. అదే మొదటిసారి కాదు అతను అలా అనడం! జయదేవ్ ఆ బంగాళా కొని, పని ప్రారంభించే ముందు గిరిధర్ అన్న మాటలు గుర్తుకువచ్చాయి.
"నేను ఈ బంగళాను చూసి, బేరం కుదుర్చుకొనే లోపలే నువ్వు కొనేసావు! కావాలంటే నీకు మరో కోటి రూపాయలు ఇస్తాను, నాకు అమ్మెయ్యరాదూ!" అని అడిగాడు కూడా.
జయదేవ్ జవాబేమీ ఇవ్వకుండా నవ్వేసి ఊరుకున్నాడు.
అతిథులందరూ వెళ్ళేసరికి రాత్రి పదకొండు గంటలు దాటింది. ఉదయం నుండి బాగా అలసిపోయిన దంపతులు నిద్రకు ఉపక్రమించారు. వెంటనే నిద్రపట్టేసింది ఇద్దరికీ.
హఠాత్తుగా ఎందుకో నిద్రభంగం అయింది జయదేవ్ కి. పక్కకి తిరిగి చూసాడు. జానకి ఆదమరచి నిద్రిస్తోంది! ఎందుకు తనకు నిద్రాభంగమైందా అని చుట్టూ చూసాడు. లేత నీలం రంగు బెడ్ లైట్ వెలుతురు గదంతా పరుచుకొని ఉంది. తలుపులకు, కిటికీలకు వేళ్ళాడుతున్న పింక్ కలర్ పరదాలు ఫ్యాన్ గాలికి కదులు తున్నాయి.
అప్పుడు.. అప్పుడు వినిపించింది! ఏడుపు.. సన్నగా ఏడుపు.. ! ఉలిక్కిపడ్డాడు జయదేవ్! ఆ ఏడుపు వలనే తనకి నిద్రాభంగమైనట్లు గ్రహించాడు. ఎక్కణ్ణుంచి వస్తోందా ఏడుపు అని చెవులు రిక్కించి వినసాగాడు. కొద్దిసేపు తర్వాత వంటింట్లోంచి ఆ ఏడుపు వస్తోందని అతనికి అర్ధమైంది. తల తిప్పి జానకి వైపు చూసాడు. ఆమె గాఢ నిద్రలో ఉంది! ఆమె లేస్తే భయపడొచ్చు! మెల్లగా లేచి, చప్పుడు చేయకుండా వంటింటి వైపు వెళ్ళాడు. అప్పటి వరకూ వంటింట్లో వెలుగు తున్న చిన్న లైటు హఠాత్తుగా ఆరిపోయింది.
నిశ్చేష్టుడైయ్యాడు జయదేవ్! ఎలా ఆరిపోయింది? కరెంటు పోలేదే! ఎవరు ఆర్పారు? వంటింట్లో ఎవరైనా ఉన్నారా? ఒక్క అంగలో వంటిట్లోకెళ్ళి లైటు వేసాడు. ఒక్కసారి వెలుతురు వంటిల్లంతా పరుచుకుంది. వంటింట్లో ఎవరూ లేరు!
అప్పుడు అతని దృష్టి నేలపై పడి ఒక్కసారి భయకంపితుడైయ్యాడు. ఎర్రటి, చిక్కటి రక్తం మరకలు అక్కడకెలా వచ్చాయి? జానకి లేచి చూస్తే భయపడవచ్చు. వెంటనే మోప్ తీసుకొని శుభ్రంగా తుడిచేసి, వెనుతిరిగాడో లేదో మళ్ళీ ఎక్కణ్ణుంచో అదే సన్నటి ఏడ్పు వినిపించింది. ఇప్పుడు ఆ ఏడుపు వంటింట్లోంచి రావటం లేదు. వీధిలోంచి వస్తోంది! రాన్రానూ ఆ ఏడుపు పెద్దదవుతోంది.
జానకి లేస్తే జడుసుకుంటుందని మనసులో అనుకొని, ఎక్కణ్ణుంచి ఆ ఏడుపు వస్తోందో తెలుసుకోవడానికి వీధి తలుపు దగ్గరకు వెళ్ళాడు! వెంటనే ఏడుపు ఆగిపోయింది! సందేహం లేదు, ఎవరో కావాలని ఈ పని చేస్తున్నట్లుంది, అనుకొని తిరిగి బెడ్ రూం వైపు నడిచాడు.
అప్పుడే 'కెవ్వు!' అని భయంకరంగా వినిపించిన అరుపుకి అతని గుండె ఒక్కసారి జలదరించింది. కాళ్ళు వణికాయి! అది జానకి గొంతు! జానకికేమీ ఆపద కలగలేదు కదా! పరుగుపరుగున బెడ్ రూముకు చేరుకున్నాడు. మంచంపై కూర్చున్న జానకి గడగడా వణుకుతోంది.
"ఏమైంది జానకీ.. ఏమైంది?" ఒక్క అంగలో ఆమె దగ్గరకు చేరి అడిగాడు.
నోటమాట రాక బిర్రబిగుసుకుపోయింది ఆమె! అమె చూపులు కిటికీ మీద ఉన్నాయి. భుజం పట్టుకు కుదిపాడు ఆమెను, "ఏమైంది జానకీ?" అని.
వేలు కిటికీ వైపు చూపించి, మళ్ళీ గడగడ వణికిపోసాగిందామె. అప్పటివరకూ చూడలేదు గాని, తెరిచి ఉంచిన కిటికీ మాటున ఎవరో తచ్చాడుతున్నట్లు అనిపించింది. కిటికీకున్న పరదా రెపరెప లాడుతోంది. వెంటనే అక్కడికి నడిచి, పరదా లాగాడు!
ఒక భయంకర ఆకారం అతని మొహంలోకి చూసింది! ఆ ఆకారాన్ని చూసిన అతనికి వెన్నులోంచి చలి పుట్టుకొచ్చింది. అది మనిషి ఆకారంలోనే ఉన్నా, తల స్థానంలో ఎర్రటి పుర్రె ఉంది! కళ్ళ స్థానంలో ఎర్రని జ్యోతుల్లాగా ఏవో వెలుగులు విరజిమ్ముతున్నాయి. అప్రయత్నంగా పరదాని వదిలిపెట్టాడతను. మరుక్షణం ఆ ఆకారం మాయమైంది!
మళ్ళీ ఎక్కణ్ణుంచో సన్నటి ఏడుపు వినిపించసాగింది. ఒక్కసారి కిటికీ తలుపులు టపటపా కొట్టుకున్నాయి. అప్పటికే బెంబేలెత్తిపోయి ఉన్న జానకి మరింత భయపడిపోయింది. ఎప్పుడూ భయం ఎరుగని జయదేవ్ కి కూడా వెన్నులో చలి పుట్టుకొచ్చింది.
"ఏమండీ! ఏమిటండీ ఇదంతా? ఇది దయ్యాల కొంపా?" అంది ఎలాగో నోరు పెగల్చుకొని.
"ఛ! ఎవరో కావాలని భయపెడుతున్నట్లున్నారు! అంతే!" బయటకు అన్నాడు కానీ, అతనికీ ఇప్పుడు భయంవేస్తోంది. లేకపోతే, వంటింట్లోకి రక్తపు మరకలు ఎలా వచ్చాయి? ఆ భయంకర ఆకారం ఎవరిది? ఎవరు మాటి మాటికీ అలా ఏడుస్తున్నారు? ఒకొక్కసారి ఒకొక్క చోటునుండి ఏడుపు ఎలా వస్తోంది? ఒక్కటీ సమాధానం లేని ప్రశ్నలే!
పోనీ..ఎవరికైనా ఫోన్ చేస్తే! అప్పుడు గుర్తుకు వచ్చింది ముందు గదిలో ఫోన్ ఛార్జింగ్ లో పెట్టిన సంగతి! ముందు గదికి వెళ్ళడానికి ధైర్యం చాలలేదు. ఇంకా ప్రస్తుతం, ఇంత పెద్ద బంగళాలో నలుగైదు గదులే వాడుకలో ఉన్నాయి. మిగతా గదులన్నీ తాళాలు బిగించి ఉన్నాయి.
రాత్రంతా ఇద్దరూ లైటు వేసుకొని, నిద్రలేకుండా బిక్కుబిక్కు మంటూ మంచం మీద కూర్చునే ఉన్నారు. మధ్యమధ్య ఉలిక్కిపడుతున్నారు! ఎప్పుడు ఏ భయంకర ఆకారం వచ్చి మీద పడుతుందో తెలియని పరిస్థితి మరి! ఎప్పుడు తెల్లరుతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు.
**** **** ****
తెల్లారిన తర్వాత కొద్దిగా ధైర్యం వచ్చింది జయదేవ్ కి. జానకి కూడా లేచి బాత్రూం కెళ్ళి స్నానం చేసి కాఫీ పెట్టాలని వంటింట్లోకి వెళ్ళింది. బ్రష్ చేసుకోవడానికి వెళ్ళిన జయదేవ్ హృదయ విదారకమైన జానకి కేక విని, వంటింట్లోకి పరిగెట్టుకు వచ్చాడు. ఆమె నిలువెల్లా వణికిపోతోంది!
అటువైపు చూసిన జయదేవ్ కి కూడా వెన్నులోంచి చలి పుట్టుకొచ్చింది. డైనింగ్ టేబుల్ మీద ఓ పుర్రె ఉంది. దాని కళ్ళు మెరుస్తున్నాయి. నిన్న చూసిన భయంకరాకారం గుర్తుకు వచ్చింది జయదేవ్ కి.
అప్పుడే ఆగకుండా కాలింగ్ బెల్ మోగడంతో ఉలిక్కిపడ్డారిద్దరూ! జయదేవ్ తలుపు తెరిచాడు. బయట ఎవరో ఆజానుబాహువైన అపరిచిత వ్యక్తి ఉన్నాడు. కాషాయ రంగు దుస్తులతో, మెళ్ళో రుద్రాక్ష మాలతో, నుదిటిమీద అడ్డంగా నామాలతో ఉన్న ఆ వ్యక్తెవరో అర్ధం కాలేదు అతనికి. జానకి కూడా అతనివైపు వింతగా చూస్తోంది.
"నన్ను కాపాలికుడు అంటారు! శాకినీ, ఢాకినీ..ఎలాంటి దుష్ట శక్తులనైనా బంధించగల శక్తి కలవాణ్ణి! ఇటు వైపు వెళ్తున్న నాకు, ఇక్కడ ఏదో దుష్ట శక్తి తిరుగాడుతున్నట్లు తోచింది. అందుకే మీ తలుపు తట్టాను. " అన్నాడతను తనను తాను పరిచయం చేసుకుంటూ.
జయదేవ్ సంభ్రమంగా ఆయనవైపు చూసాడు. నిజానికి అతనికి దయ్యాలు, భూతాలు లాంటి మూఢనమ్మకాలు లేకపోయినా, క్రితం రోజు జరిగిన సంఘటనల వల్ల మనసు కొయ్యబారిపోయింది. ఏదీ ఆలోచించే స్థితిలో లేడతను. అది గమనించి జానకి ముందుకు వచ్చి, "స్వామీ! రండి లోపలికి!" అని అతన్ని అహ్వానించింది.
క్రితం రాత్రి జరిగిన సంఘటనలన్నీ వాళ్ళ నోటంట నిదానంగా విన్నాడు కాపాలికుడు.
"సందేహం లేదు! ఇక్కడ ఏదో దుష్ట శక్తి తిరుగుతోంది! లేకపోతే నా దారిన నడిచి వెళ్తున్న నేను ఇక్కడ ఆగిపోవడమేమిటి?" అని కళ్ళు మూసుకుని ధ్యానం లోకి వెళ్ళాడు ఓ ఐదు నిమిషాలపాటు.
అతనివైపు ఆత్రంగా చూస్తూ కూర్చున్నారు ఆ దంపతులు. ఐదు నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి, తన సంచీలోని సరంజామా అంతా తీసి నేలమీద పెట్టాడు. ఓ మూడు నిమ్మకాయలు, నాలుగు రుద్రాక్షలు, కుంకుమ, ఓ చిన్న సీసా, రంగురంగుల గోళీ కాయలు వంటివి.. ఇలా తమకు తెలియని వస్తువులేవో పెట్టి, తెల్లటి ముగ్గు పిండితో ముగ్గులు వేసి, ఏవో మంత్రాలు పఠించసాగాడు అతను. ఓ రెండు గంటలసేపు సాగిందా తంతు. వాళ్ళిద్దరూ చూస్తూండగానే, ఏదో నీలం రంగు వాయువు ఆ చిన్న సీసాలోకి వెళ్ళింది. వెంటనే దాని మూత బిగించాడతను.
"మీకింకేం భయం లేదు! పాతికేళ్ళుగా ఇక్కడ యధేచ్ఛగా తిరుగుతున్న దుష్ట శక్తిని బంధించాను. " అన్నాడు లేస్తూ.
అప్పుడు గుర్తుకు వచ్చింది జయదేవ్ కి. తనంతట తానే వచ్చి ఈ కార్యక్రమమంతా చేసి డబ్బులు ఏమీ అడగకుండానే వెళ్ళిపోతున్నాడన్న సంగతి. జానకి కూడా భర్త వైపు చూసి, డబ్బులు ఏమైనా ఇవ్వమన్నట్లు సైగ చేసింది. వెంటనే జయదేవ్ లేచి వెళ్ళి చేతికి అందిన డబ్బులు తెచ్చి, కాపాలికుడి చేతిలో పెట్టాడు.
"స్వామీ.. అనుకోకుండా దేవుడు పిలిచినట్లు వచ్చి, మాకు సాయం చేసి, మా భయం తొలగించారు!" అన్నాడు.
"దానిదేముంది నాయనా! నాకు ఎలాంటి లాభాపేక్షా లేదు! లోక కళ్యాణమే నా ధ్యేయం!" అన్నాడు వెళ్ళిపోతూ.
ఒక్కసారి పెద్దగా నిట్టూర్చాడు జయదేవ్. జానకి కూడా ధైర్యంగా ఉందిప్పుడు. అంత పెద్ద సమస్య చాలా సులభంగా పరిష్కారమైనందుకు నిశ్చింతగా సోఫాలో వెనక్కు వాలాడు జయదేవ్. జానకి వంటింట్లోకి వెళ్ళింది కాఫీ పెట్టడానికి. కాపాలికుడు ఉండగానే డైనింగ్ టేబుల్ పై ఉన్న పుర్రె మాయమవడంతో ఎలాంటి భయమూ లేకుండా ఫ్రిజ్ తెరిచిందామె. మరుక్షణం ఆమె పెట్టిన భయంకరమైన పోలికేకకి ఉలిక్కిపడి అక్కడికి పరుగెట్టుకు వెళ్ళాడు జయదేవ్.
నిలువెల్లా వణికిపోతున్న జానకిని చూసాడు. ఆ తర్వాత అతని దృష్టి తెరిచిన ఉన్న ఫ్రిజ్ పై పడింది. ఇందాక మాయమైంది అనుకున్న పుర్రె ఇప్పుడు ఫ్రిజ్ లోంచి తొంగి చూస్తోంది. దాని కళ్ళు వింతవింత కాంతులు వెదజల్లుతూ వాళ్ళిద్దరి మతులూ పోగొడుతున్నాయి. పరుగుపరుగున బయటకు వచ్చారిద్దరూ. మళ్ళీ కథ మొదటికొచ్చింది. కాపాలికుడు బంధించిన దయ్యం ఎలా బయటపడింది? మున్ముందు ఏం జరగనుందో జయదేవ్ కి అంతుబట్టలేదు.
ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి కట్టించిన ఆ బంగళాలో ఉండటానికి జానకి ససేమిరా అనడంతో మరో చోట ఇల్లు అద్దెకు తీసుకొని అందులోకి మారాడు జయదేవ్. హోమాలు, పూజలు చేయించాడు జయదేవ్. అటు హేతువాద శాస్త్రజ్ఞులను, ఇటు తాంత్రికులను పిలిపించినా ఎటువంటి ప్రయోజనం కలగలేదు. దయ్యాల కొంప అని ప్రచారం కావటంతో అక్కడికి రావడానికి కూడా అందరూ భయపడ్డారు. చివరకు విసిగి వేసారిపోయి, కొన్న ధర కన్నా తక్కువకు అమ్మవలసి వచ్చింది.
**** **** ****
"దొరా! మీరు చెప్పినట్లే చేసాను దొరా! వాళ్ళిద్దరూ అప్పటికే చాలా భయపడి ఉన్నారు! కానీ.. " అతని ముందు చేతులు నులుముకుంటూ నిలబడ్డాడు కాపాలికుడు.
పెద్దపెట్టున నవ్వాడు సోఫాలో కూర్చున్న వ్యక్తి. ఓ చేతిలో సిగరెట్, మరో చేతిలో విస్కీ గ్లాస్ ఉంది. గ్లాస్ నోటి దగ్గరకు చేర్చి, ఓ గుక్క తాగాడు. "భేష్.. నేను చెప్పినట్లు బాగా నటించావు! ఇంద నీకిస్తానన్న డబ్బులు!" అని జేబు లోంచి ఓ నోట్ల కట్ట తీసి అతనివైపు విసిరాడు ఆ వ్యక్తి.
ఆ డబ్బును జేబులో పెట్టుకుంటూ, "దొరా! నేను నటించడం కాదు కానీ, నిజంగానే అక్కడ కొన్ని ప్రేతాత్మలు తిరుగుతున్నాయి. సీసాలో బంధించినట్లు గారడీ చేసి చూపించానుగానీ, వాటి మీద నా మంత్ర ప్రభావం ఏ మాత్రం పని చెయ్యలేదు. " చెప్పాడు కాపాలికుడు.
మరోసారి పెద్దపెట్టున నవ్వాడతను.
"నేను మందు తాగితే, నిషా నీకు ఎక్కినట్లుంది! అక్కడసలు దయ్యాలు ఉంటేగా! డైనింగ్ టేబుల్ మీద పుర్రె పెట్టడానికి, దాన్ని మాయం చేసి ఫ్రిజ్ లో పెట్టడానికీ, ముందు రోజు రాత్రి కిటికీ దగ్గర తచ్చాడటానికి నేనే కొంతమంది మనుష్యులను రహస్యంగా ఏర్పాటు చేసాను. అలాగే పాత టేప్ రికార్డర్ ద్వారా ఏడుపు వినిపించాను కూడా!
నువ్వు వెళ్ళన తర్వాత కూడా వాళ్ళను బెదరగొట్టడానికి కొంతమందిని పురమాయించాను, ఎందుకంటే ఆ దయ్యాలు మంత్రగాడికి కూడా లొంగవని వాళ్ళకి తెలియపర్చడానికి! తెలిసిందా! అంతకుమించి దయ్యాలూ లేవు, ఆత్మలూ లేవు! దెబ్బకి జడిసి ఇల్లు అమ్మేసాడు, పూర్ ఫెలో!" అన్నాడతను.
"అది సరే కాని దొరా.. అక్కడ మాత్రం నిజంగా ప్రేతాత్మలు తిరుగుతున్నాయి! ఇది నిజం.. ! పచ్చి నిజం!!" అంటూ ఇంకా ఏదో చెప్పబోయేసరికి, అతని మాటలకు అడ్డువస్తూ,
"ఇంకేం మాట్లాడకు! నీకు డబ్బు ముట్టిందిగా, నువ్విక కదులు!" అని కసరడంతో మరేం అనలేక తలగోక్కుంటూ అక్కణ్ణుంచి కదిలాడు కాపాలికుడు.
**** **** ****
ఎలాంటి ఆర్భాటం లేకుండా ఆ బంగళాలో దిగాడు దాన్ని జయదేవ్ నుండి కొనుక్కున్న వ్యక్తి.
'నాతో పోటీపడి మరీ కొంటాడా! ఎక్కువ డబ్బులిస్తానన్నా అమ్మడానికి ఒప్పుకోడా! ఇప్పుడేమైంది? తను ముందు ఇస్తానన్నదానికన్నా చౌకగా అమ్మలేదూ!’ అనుకుంటూ మంచం మీద విశ్రమించాడు అతను. పక్కన అతని భార్య శారద ఆదమరచి నిద్రపోతోంది.
గడియారం పన్నెండు గంటలు కొట్టింది! అప్పుడే చిన్నగా నిద్రపట్టిన అతను ఒక్కసారి ఉలిక్కిపడి లేచాడు. ఎక్కణ్ణుంచో సన్నగా ఓ స్త్రీ ఏడుపు వినిపిస్తోంది. రాన్రానూ.. ఆ ఏడుపు పెద్దదయింది. శారదకి ఇంకా మెలుకువ రాలేదు. ఆ ఏడుపు వంటింట్లోంచి వస్తోందని భావించి, లేచెళ్ళి లైటు వేసి చూసాడు.
ఆశ్చర్యం! అక్కడ ఎవరూ లేరు, కానీ ఏడుపు మాత్రం ఆగకుండా వినిపిస్తోంది. అంతలోనే, కెవ్వుమని శారద అరచిన అరుపులకి హడలిపోయి, బెడ్ రూముకి పరుగు తీసాడు. శారద మంచం పైన కూర్చొని వణికిపోతోంది! ఆమె చూపు కిటికీ దగ్గర ఉండటం చూసి, అటు పరుగెత్తాడు. కిటికీలోంచి చూసిన అతనికి మతిపోయింది. అలాంటి భయంకరాకారం ఎన్నాడూ చూసి ఉండలేదు.
ఆ భయంకర దృశ్యానికి అతని రోమాలు నిక్కబొడుచుకున్నాయి. మనిషికి పుర్రె తల అతికించినట్లుంది. దాని కళ్ళు ఎర్రగా మెరుస్తూ, తీక్షణంగా అతనికేసే చూస్తున్నాయి. ఒక్కసారి కిటికీ తలుపు తెరిచి, అది అతని మొహం మీద గట్టిగా చరిచింది! అంతే.. కళ్ళు బైర్లు కమ్మి స్పృహ తప్పి కిందపడిపోయాడు అతను.
అతను.. అతను.. మరెవరో కాదు! బంగళాలో ప్రేతాత్మలు తిరుగుతున్నాయని జయదేవ్ ని భయపెట్టించి, కాపాలికుణ్ణి అతని దగ్గరకు పంపిన ఆ వ్యక్తి.. గిరిధర్! ఆ బంగళాని చౌకగా స్వంతం చేసుకున్నానని విర్రవీగిన గిరిధర్!
ఆ బంగళాలో ఉత్పాతాలు సృష్టించడానికి అతను పంపిన మనుష్యులు కూడా అక్కడ జరిగిన సంఘటనలు చూసి భయపడి ఆ చోటకి మరి వెళ్ళలేదని అతనికి తెలీదు! అతను ఇవ్వజూపిన డబ్బు మీద ఆశతో వాళ్ళు అతనికేమీ చెప్పలేదు మరి! కథ మళ్ళీ మొదలైందని తెలీని గిరిధర్ ఏం చెయ్యనున్నాడో ఏమో మరి!
******
దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.




Comments