top of page

మమతల మధువు ఎపిసోడ్ 12


'Mamathala Madhuvu Episode 12' New Telugu Web Series

Written By Ch. C. S. Sarma

'మమతల మధువు తెలుగు ధారావాహిక' ఎపిసోడ్ 12

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ..

కొడుకు ఆదిత్య రాసిన ఉత్తరం చూసి ఉద్వేగానికి లోనవుతుంది గౌరి.

భర్తతో ఫోన్ లో మాట్లాడుతుంది. ఆమెను ఊరడించి కొడుకును కలుద్దామని చెబుతాడు ఆమె భర్త గోపాల్. వైజాగ్లో ఉన్న గోపాల్, ఆపరేషన్ జరిగిన శాంతిని కలుస్తాడు. హాస్పటల్ కి వెళ్లి శాంతి పరిస్థితి గురించి వాకబు చేస్తాడు. బావమరిది మురారితో చెప్పి తను గౌరీ దగ్గరకు బయలుదేరుతాడు.


హాస్పిటల్ కి వెళ్లి శాంతిని కలుస్తాడు గోపాల్ తండ్రి భీమారావు. ఆమెను జాగ్రత్తగా చూసుకోమని మురారితో చెబుతాడు. ఆమె కొడుకు ఆనంద్ ని తన దగ్గరకు తీసుకొని రమ్మని రామకోటికి చెబుతాడు.

ఆనంద్ చేస్తున్న ఉద్యోగ వివరాలు కనుక్కుంటాడు భీమారావు. అతనికి బెంగళూరులో ఉన్న తన కంపెనీలో ఉద్యోగం ఇస్తానని చెబుతాడు. గోపాల్ ఇంటికి చేరుకుంటాడు.


తండ్రికి శాంతి విషయం తెలిసిపోయిందని మురారి ద్వారా తెలుసుకుంటాడు గోపాల్. భార్య గౌరితో కలిసి మంగళూరు వెళ్లి, కొడుకు ఆదిత్యను కలుస్తాడు. ఆదిత్య బాల్యం గుర్తు చేసుకుంటాడు

ఆవేశాన్ని తగ్గించుకోమని ఆదిత్యకు చెబుతుంది అతని మరదలు ప్రేమ. తనమీద దాడి చేసిన పాండూని ఎదిరిస్తాడు ఆది. ఆ ఘర్షణలో తలకు బలంగా దెబ్బ తగలడంతో పాండూ మరణిస్తాడు.

ఆది తాత భీమారావు, మధ్యస్థం చేసి, గొడవలు జరక్కుండా చూస్తాడు. ఆదిని బోర్డింగ్ స్కూల్ లో చేరుస్తాడు.


గతకాలపు ఆలోచనలు పూర్తయి, వర్తమానంలోకి వస్తాడు ఆది.

హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన శాంతి, కొడుకు ఆనంద్ తో బెంగళూరు వెళ్ళడానికి ఒప్పుకుంటుంది.

ప్రేమకు తనమీద మునుపటి అభిమానం లేదని గ్రహిస్తాడు ఆది.

ఆది అంటే తనకిష్టం లేదని, ఆనంద్ తన స్నేహితుడని తల్లి భవానీతో చెబుతుంది ప్రేమ.

ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న ఆది పై దాడి చేస్తాడు వీరగోవిందయ్య.

ప్రొఫెసర్ రామాచారి గారి కూతురు ప్రేమ సపర్యలతో కోలుకుంటాడు ఆది.

ఎన్నికల్లో గెలుస్తాడు.


ఇక మమతల మధువు ఎపిసోడ్ 12 చదవండి..



ధనుంజయరావు బెంగుళూరు చేరారు. హాస్టల్కు వెళ్ళి ప్రేమను కలిశారు. హాస్టల్ నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్పి.. ప్రేమతో నెల్లూరికి బయలుదేరాడు. కార్లో వారు నెల్లూరు చేరేటప్పటికి సమయం రాత్రి ఎనిమిదిగంటలు.


ప్రేమ మౌనంగా తన గదికి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొనీ.. తల్లిని.. నానమ్మను పలకరించి.. తనకు ఆకలిగా లేదని, నిద్రవస్తూ వుందని తన గదిలోనికి.. వెళ్ళి తలుపును మూసేసింది.

ఆమె మదినిండా కలవరం. తన మాటలకు శాంతి ఏ నిర్ణయం తీసుకొంది?.. ఆనంద్ తో ఏం మాట్లాడి వుంటుంది? ఆనంద్ ఏ నిర్ణయాన్ని తీసుకొన్నాడు?.. తనతో ఎంతో చనువుగా సరదాగా తిరిగీ.. మనం పెండ్లి చేసికొందాం అని తను అన్నప్పుడు 'సరే' అని ఎందుకు అనలేదు?.. ఆనంద్ తన వివాహానికి తన తల్లిదండ్రులు అంగీకరిస్తారా!.. లేదా!.. వీరు కాదంటే తనేం చేయాలి?.. యీ ప్రశ్నలన్నీ.. ప్రేమకు ఎంతో ఆవేదనను కలిగించాయి. ఆలోచించి.. ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. వుదయాన్నే లేచి.. తాతయ్యను.. మామ గోపాల్ ఆత్త గౌరీని కలిసి తన నిర్ణయాన్ని వారికి తెలియజేయాలి. వారు అమ్మా నాన్నలను ఒప్పించగలరు. తనంటే వారికి ఎంతో యిష్టం. తన సమస్యను వారు పరిష్కరించగలరు. యీ నిర్ణయం ప్రేమకు కొంత వూరట కలిగించింది. కళ్ళు మూసుకొంది.


భవానీ.. ధనుంజయరావులు.. ప్రేమ చర్యకు.. ఆశ్చర్యపోయారు. పడకగదిలో చాలాసేపు ఆమెను గురించి చర్చించారు. తను ప్రేమించిన ఆ అబ్బాయి ఎవరు?.. అతని తల్లిదండ్రులు.. కులగోత్రాలు.. వూరు పేర్లు.. స్థితి గతులు ఏమిటి?.. ఈ వివరాలన్నీ ప్రేమను రేపు అడిగి తెలుసుకోవాలి. మనవాళ్ళందరితో.. కలసి మాట్లాడి దాని మనస్సు మారేలా చేయాలి. మనమంతా ఒకటై.. ఒక మాట మీద నిలబడితే.. తను మనమాట వినకుండా ఏం చేస్తుంది. వింటుంది. యీ నిర్ణయానికి వచ్చి వారూ శయనించారు.

***

ప్రేమ తండ్రి.. ధనుంజయరావుతో బెంగుళూరు నుండి బయలుదేరే సమయంలో.. గోపాల్.. ఒక కాంట్రాక్టు ఫయినలైజేషన్ విషయంలో వైజాగ్ వెళ్ళాడు.


మధ్యాహ్నం భోంచేసి.. భీమారావు ఆదిత్య ప్రేమ ఆఫీసు వెళ్ళారు. గౌరి భోంచేసి ఒక గంటసేపు టీవీ చూచీ, ఆది పడక కవర్లును మార్చే దానికి పనిమనిషి వీరమ్మతో ఆదీ గదికి వెళ్లింది. పరుపు కవర్ తీసినప్పుడు ఒక కవరు క్రింద పడింది. దాన్ని వీరమ్మ గౌరికి అందించింది. దీపాయ్పై దాన్ని వుంచి.. దిండ్లకు పరుపుకు కవర్లు మార్పించింది గౌరి. తన పని ముగిశాక వీరమ్మ.. వెళ్ళిపోయింది.

సోఫోలో కూర్చున్న గౌరి కళ్ళు.. టీపాయ్ పై తను వుంచిన కవరు మీద లగ్నమయింది. కవర్ను చేతికి తీసుకొంది. లోనవున్న కాగితాలను చూచింది. వ్రాత.. తన భర్త చేతివ్రాత. ఆశ్చర్యపోయింది.

అది గోపాల్.. తను గతంలో చేసిన నేరాన్ని.. తండ్రికి తెలియజేస్తూ వ్రాసిన ఆనాటి యధార్థగాధ. గౌరి చదవడం ప్రారంభించింది.


'పూజ్యులు.. దైవసమానులైన నాన్నగారికి మీ., గోపూ పాదాభివందనం.

“నాన్నా!.. నేను గత యిరవై నాలుగు సంత్సరాలుగా నాకు.. మన కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్య విషయాన్ని.. మీతో చెప్పకుండా దాచాను. ఆ విషయం.. యిప్పుడు మీకు తెలిసింది. తెలిసినా.. మీరు.. ఆ విషయాన్ని గురించి నన్ను యింతవరకూ ఒక్కమాట కూడా అడగకుండా.. నా సమస్యను మీ సమస్యగా భావించి.. మీరు తీసుకొన్న నిర్ణయం.. నాకు తెలిసిన తర్వాత కూడా నేను యధార్థాన్ని మీకు తెలియజేయకపోతే.. నన్ను ఆ భగవంతుడు కూడా క్షమించడు. అందుకే.. నా గత చరిత్రను మీకు తెలియజేస్తున్నాను.


నాన్నా!.. అది 1990 సంవత్సరం. మనం క్రొత్త లేలెండ్ లారీని కొన్నాము. మొదటి లోడ్లో నేను మురారి.. కలకత్తాకు బయలుదేరాము. అది రాత్రి పదిగంటలసమయం. బండి రాజమండ్రి దాటి పదికిలోమీటర్ల దూరాన ముందుకు వెళుతూ వుంది.


బండిని నేను నడుపుతున్నాను. రోడ్డు.. ప్రక్కన ఒక ఆడపిల్లను యిరువురు తరుముతూ పరుగెత్తడాన్ని చూచాను. బండిని ఆపి దిగి నేను మురారీ ఆమెను సమీపించాము. ఆమె ఏడుస్తూ నా కాళ్ళు పట్టుకొని వాళ్ళు నన్ను చరచాలని వెంబడిస్తున్నారని.. రక్షించమనీ ఏడుస్తూ చెప్పింది.

ఆ యిరువురూ మమ్మల్ని సమీపించారు. పిల్లను వదలమని మాపై చేయి చేసికొన్నారు. మేమూ వారిని తన్ని, వెనకన వున్న ఆమె తల్లి.. తమ్ముడి వద్దకు ఆమెను చేర్చాము. ఆ పెద్దావిడ.. వారికి ఎవరూ లేరని.. యీ రీతిగా కుర్రకారు కూతురిని నాశనం చేయాలని చూస్తున్నారని.. వూరి విడిచి వేరే వూరికి వెళు తున్నామని ఏడుస్తూ చెప్పింది.


మురారి.. శ్రీకాకుళంలో వున్న తన పిన్ని సీతమ్మ బాబాయి పోలయ్యకు పిల్లలు లేరని.. వారి యింటికి వీరిని చేర్చితే హాయిగా వుంటారని చెప్పాడు. వారిని శ్రీకాకుళంలో మురారి బాబాయిగారి యింటికి చేర్చి.. విషయాన్ని చెప్పాము. వారు దయతో ఆ ముగ్గురికీ ఆశ్రయాన్ని.. యిచ్చారు. మేము కలకత్తాకు వెళ్ళిపోయాము.



నెలరోజుల తర్వాత.. కలకత్తాకు లోడ్తో వెళ్ళుతూ శ్రీకాకుళం నేను మురారి వెళ్ళాము. ఆనాటికి ఆ ముగ్గురూ ఆ యింటి మనుషులుగా మారిపోయారు. మురారి పిన్ని.. చిన్నాన్న వారిని గురించి గొప్పగా చెప్పి మాకు బిడ్డలు లేని లోటు తీరిందని సంతోషించారు.

ఆరునెలల కాలంలో వారిని నాలుగుసార్లు కలిశాము. వాళ్ళలోని ఆనందం.. వారు మాయందు చూపే ఆదరాభిమానాలు నాకు మురారికి ఎంతో సంతోషాన్ని కలిగించాయి.


ఆమె పేరు శాంతి. తల్లి నాంచేరు. తమ్ముడు రవి. శాంతి నన్ను ఎంతగానో అభిమానించేది. నాకూ ఆమెపట్ల అభిమానం.. గౌరవం ఏర్పడ్డాయి.


యిరుగు పొరుగు వారితో కలసి వారంతా విజయవాడ.. భద్రాచలం.. శ్రీశైలం.. మంత్రాలయం యాత్రకు బస్సులో వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు రాత్రి సమయంలో బస్సు విశాఖ దాటిన తర్వాత పాతిక కిలోమీటర్ల దూరాన బండి బ్రేక్ ఫెయిలైనందున రోడ్డు ప్రక్కన పడిపోయింది. సీతమ్మ.. పోలయ్య.. నాంచారు.. రవి మరణించారు. శాంతికి కాలు విరిగి ఎడమపాదం చితికిపోయింది.

యీ విషయం మాకు.. నేను మురారీ కలకత్తా లోడ్ రాజమండ్రిలో వుండగా అటువైపు నుంచి వచ్చిన లారీల డ్రయివర్లు చెప్పారు. వారి యాత్రా విషయం నాకు మురారికి తెలిసి వున్నందున విశాఖ.. జి.హెచ్. కి వెళ్ళి విషయాన్ని తెలుసుకొన్నాము.


డాక్టర్లు శాంతి పాదాన్ని తీసేయాలని చెప్పారు. నా స్నేహితుడు.. శ్యాంను శాంతి వద్ద వుంచి నేను మురారి ఆ.. నలుగురి శవాలను యాంబులెన్సులో శ్రీకాకుళానికి తరలించాము. సీతమ్మ పోలయ్యలకు.. మురారి నాంచారమ్మకు.. రవికి, నేను, అంతిమ సంస్కారాలను నిర్వహించాము. వైజాగ్ తిరిగి వచ్చాము. డాక్టర్లు శాంతి పాదాన్ని తీసివేశారు. పదిహేను రోజుల తర్వాత హాస్పటల్ నుంచి డిచ్ఛార్జి చేశారు. శ్యాం శాంతిని తన యింటికి తీసుకొని వెళ్ళాడు. అతని తల్లి.. చెల్లెలు శాంతిని వూరడించి ఆశ్రయాన్నిచ్చారు. మురారి పినతండ్రి మూడు సంవత్సరాల క్రిందట.. తన అస్థిపాస్థులను మురారి పేర వ్రాసి.. లాయర్ వద్ద వుంచారు. ఆ లాయర్ గారు ఆ పత్రాలను మురారికి యిచ్చాడు.


తను అనాధనైపోయానని.. వికలాంగురాలినని.. నన్ను చూచి శాంతి ఏడ్చింది. ఆమెకు జీవితాన్ని యివ్వాలనుకొన్నాను. వివాహం.. రిజిష్టరాఫీస్లో మురారి.. శ్యాంల సమక్షంలో చేసికొన్నాను. కొన్న రాయల బూటన్ లాటరీ టిక్కెట్టుకు పది లక్షలు డబ్బు వచ్చింది. శ్యాం' యిల్లు వున్న కొత్తవలస ప్రాంతంలో రెండు గ్రవుడ్ల స్థలాన్ని కొన్నాను. మురారి తన చిన్నానగారి ఆస్థిపాస్థులను యిరవై లక్షలకు అమ్మేడు.. కొత్తవలసలో ప్రక్క ప్రక్కన రెండు యిళ్ళను నిర్మించాము. మురారి జయ

అనే అమ్మాయిని వివాహం చేసికొన్నాడు. అతను శాంతిని సొంత అన్నలా అభిమానించాడు. అండగా వుండేవాడు. యిళ్ళు ప్రక్క ప్రక్కన అయినందున.. శాంతి, మురారి జయల అండన దిగులు వదలి ప్రశాంతంగా వుండేది.


నేను నెలకు.. రెండు నెలలకు ఒక పర్యాయం వెళ్ళి రెండు మూడు రోజులు శాంతి దగ్గర వుండేవాణ్ణి. శాంతికి డాక్టర్లు కృత్రిమ పాదాన్ని అమర్చారు.

శాంతితో నా వివాహం అయిన మూడు మాసాల్లో అమ్మ ఆర్యోగం చెడిపోవడం.. ఆమె క్యాన్సర్.. లాస్టుస్టేజ్లో వున్నందున, యీ విషయం తెలిసిన మీరు.. అమ్మ కోర్కె ప్రకారం.. నాకూ గౌరీకి వివాహం నిశ్చయించారు.


అనేక పర్యాయాలు నేను.. నాయీ గత చరిత్రను మీకు తెలియజేయాలని ప్రయత్నించినా మీకు వున్న వ్యాకులత కారణంగా.. సాహసం చేసి మీకు ఆ నిజాన్ని చెప్పలేకపోయాను. గౌరితో నా వివాహం జరిగిన రెండువారాల్లో అమ్మ మనలను వీడిపోయింది. ఆమె మరణం మిమ్మల్ని.. నన్ను ఎంతగానో బాధించింది. ఆ కారణంగా నేను మీతో ఏమీ చెప్పలేకపోయాను.


సంవత్సరం లోపలే శాంతి మొగశిశువుకు జన్మనిచ్చింది. వాడే ఆనంద్. నేను రెండు నెలలకు.. మూడు నాలుగు నెలలకు ఒకసారి శాంతిని వాడిని కలవటం కారణంగా వాడు వూహ తెలిసేకొలదీ.. నన్ను అసహ్యించుకోసాగాడు. నేను యింటికి వెళితే వాడు బయటి వెళ్ళిపోయేవాడు. చదువు విషయంలో నేను శాంతికి చెప్పి.. శాంతి వాడికి చెప్పగా నా కోర్కె ప్రకారం చదివాడు. నాన్నా!.. యీనాటి వరకూ వాడు నన్ను ‘నాన్నా' అని పిలవలేదంటే మీరు నమ్మగలరా!.. యిది నా గత చరిత్ర.


యిరవై నాలుగు సంవత్సరాలుగా నా హృదయంలో దాచుకొన్న నా హీన చరిత్ర.

పరిస్థితులకు నేను లొంగిపోవలసి వచ్చిందేకానీ నేను.. ఎవరినీ మోసం చేయలేదు. ఎవరికీ అన్యాయం చేయలేదు. యదార్ధం చెప్పాలంటే.. నేను గౌరినే శాంతి కంటే ఎక్కువ అభిమానిస్తున్నాను. కారణం ఆమె మీ అక్క కూతురు. నా అనే ప్రతి వ్యక్తినీ మీరు ఎంతగా అభిమానిస్తారో.. ప్రేమిస్తారో నాకు తెలుసు కదా నాన్నా!..


యీ నా తప్పుకు మీరు నాకు ఎలాంటి శిక్ష వేసినా నేను అనుభవించాలి. కారణం.. నేను చేసింది అందరి దృష్టిలో నేరం కాబట్టి. యిరవై నాలుగు సంవత్సరాలుగా.. నాలోనే దాచుకొని మీ కెవ్వరికీ చెప్పలేదు కాబట్టి. అందుకు నేను సంసిద్ధంగా వున్నాను నాన్నా!.. మీరేం చేసినా మీ మీద నాకు కోపం రాదు. ఎందుకంటే.. నేరం చేసింది నేను కదా నాన్నా!.. నేరానికి శిక్ష ప్రాయశ్చిత్తం అవుతుంది కదా..”

ఇట్లు

మీ.. 'గోపు'


గౌరి చదవడం ముగించింది. ఆమె చేతిలోని కాగితాలు జారిపోయి నేలపై పడ్డాయి. ఆమె వదనంలో రంగులు మారాయి. శాంతి పేరును తలచుకొంటే మనస్సున ఎంతో ఆవేదన, గోపాల్ మీద కసి.. కోపం అసహ్యం. తన వాడని నమ్మి సర్వస్వాన్ని అర్చించిన తన్ను మోసం చేశాడే అని విచారం. దుఃఖం.

ముఖం కళా విహీనమయింది. మనస్సున ఎంతో వ్యాకులత. మస్తిష్కం వేడితో నిండిపోయింది. నయనాలు అశ్రుపూరితాలైనాయి. శరీరానికి చమట పట్టింది. బోరున ఏడుస్తూ తన గదిలోనికి వెళ్ళి తలుపు మూసి.. పడకపై వాలిపోయింది గౌరి. గంట తర్వాత..


పనిమనిషి వీరమ్మ వచ్చి తలుపు తట్టి.. “అమ్మా!.. రాత్రికి భోజనానికి ఏం చేయాలి..” అడిగింది వీరమ్మ.

“నాకు ఒంట్లో బాగలేదు. నీకు తోచింది చెయ్యి.” గౌరి మాటలు.. వీరమ్మ చెవులకు వింతగా.. వినిపించాయి

“అమ్మా!.. నేను లోనికి వచ్చి మీకు..”


"నీవు వచ్చి నాకు ఏమీ చేయనవసరంలేదు. వెళ్ళి నీ పని చూచుకోపో.." వీరమ్మ తన మాటను పూర్తి చేయక ముందే ఆవేశంగా చెప్పింది గౌరి.

విషయం అర్థంకాక.. వీరమ్మ మౌనంగా.. వంటగది వైపుకు నడిచింది. సాధారణంగా అందరూ రాత్రిపూట చపాతీలు తింటారు కాబట్టి ఆ పనిని ప్రారంభించింది.


సాయంత్రం ఆరున్నర అయింది. వీరమ్మ తన పనినంతా ముగించింది. గౌరి గదిని సమీపించి "పనంతా అయిందమ్మా!.. నేను యింటికి వెళతుండా.!..” చెప్పి, కొద్దిక్షణాలు జవాబు కోసం తలుపు ముందు నిలబడింది. గౌరి నుండి జవాబు లేదు. నిద్రపోయిందని నిర్ణయించుకొని వరండాలోనికి వచ్చింది.


కారు వచ్చి పోర్టికోలో ఆగింది. భీమారావు ఆదిత్యా ప్రేమ.. కారు నుండి దిగారు. వీరమ్మ భీమారావును సమీపించింది..

"పెద్దయ్యగోరూ!.. అమ్మకు ఒంట్లో బాగలేదంట. వారి గదిలో పడుకోనున్నారు.

నా పని అంతా ముగిసిందయ్యా!.. నేను యింటికి ఎలతుండా!.." వినయంగా చెప్పింది వీరమ్మ.

"మంచిది వీరమ్మా!.." సాలోచనగా చెప్పాడు భీమారావు,


వీరమ్మ వెళ్ళిపోయింది. అది.. ప్రేమ.. వేగంగా యింట్లోకి ప్రవేశించారు. గౌరీ ఉన్న గదిని సమీపించారు.

"అమ్మా!..”


జవాబు లేదు. కొద్ది సెకండ్ల తర్వాత మరలా పిలిచాడు. జవాబు లేదు.

"ఐ బిలీవ్ షి ఈజ్ స్లీపింగ్ ఆది. లెట్ హర్ టేక్ రెస్టు.” అంది ప్రేమ.

భీమారావు వారిని సమీపించారు. తాతయ్యను చూచి ఆది..


"తాతయ్యా.. పిలిచాను. అమ్మ పలకలేదు. నిద్రపోతున్నట్లు వుంది. మనం ఫ్రెష్ అయ్యి వచ్చి అమ్మను కలుద్దాం.”


ముగ్గురూ.. వారి వారి గదులకు వెళ్ళిపోయారు. ఆది తన గదిలో ప్రవేశించాడు. దిండు కవర్లు బెడ్ కవర్ మార్చి వుండడాన్ని గమనించాడు. సోఫాలో కూర్చుని బూట్ విప్పుతుండగా.. అతని కళ్ళు టీపాయ్ క్రింద పడివున్న పేపర్ల మీదకు మళ్లాయి. వంగి ఆ కాగితాలను చేతికి తీసుకొన్నాడు. అవి తాను పరుపు.. క్రింద దాచినవి. ఆశ్చర్యపోయాడు. వాటిని కవర్లో వుంచాడు.


అతడికి విషయం అర్థం అయింది. 'యీ కాగితాలను అమ్మ చదివి వుంటుంది'.. అందువల్లనే ఆమె పూర్తిగా అప్సెట్ అయ్యి తన గదిలో.. తలుపుబిగించుకొని పడుకొంది. అనే నిర్ణయానికి వచ్చాడు. అతని మనస్సులో తల్లిని గురించి కలవరం.


గుడ్డలు విప్పి.. బాత్రూమ్కు వెళ్ళి.. స్నానం చేశాడు. మదినిండా తల్లినిగురించిన ఆలోచనలే. త్వరగా స్నాం ముగించి.. డ్రస్ తగిలించుకొని తాతయ్య రూమ్ కి వెళ్లాడు ఆది.


భీమారావు స్నానం ముగించి.. టీవీలో న్యూస్ వింటున్నాడు. తలుపు గడియ పెట్టనందున.. తట్టి.. తాతగారి గొంతువిని ఆది గదిలో ప్రవేశించాడు.తాతగారి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. ఆది ముఖంలోని విచారాన్ని చూచి కారణం అడిగాడు భీమారావు. ఆది మౌనంగా తన చేతిలోని కవర్ను భీమారావుకు అందించాడు.


"యిది నాన్న మీకు వ్రాసిన లేఖ!..”

టీవీని ఆపేసి.. భీమారావు కవర్ను అందుకొన్నాడు. కాగీతాలను చూచాడు. నిట్టూర్చి.. “యిది నాకు తెలిసిన కథే!.. కానీ.. నాకు తెలియంది.. యీ కవర్ నీ దగ్గరకు ఎలా వచ్చింది ఆదీ!.." ఆశ్చర్యంతో అడిగాడు భీమారావు.


"మొదటిరోజున.. నాకు మీరు పంపిన కాగితాలు.. ఫైల్సుతో పాటు ఇది టేబుల్ కి వచ్చింది. చదివాను. నా మంచం పరుపు క్రింద దాచి వుంచాను. యీ రోజు యిది అమ్మ కంటబడింది. ఆమె ఆ స్థితికి నేరస్థుణ్ణి నేనే తాతయ్యా!.." విచారంగా చెప్పాడు ఆది. యిరువురూ వ్యాకుల వదనాలతో వారి వారి ఆలోచనలతోవారు వుండిపోయారు శిలా ప్రతిమల్లా.


గది తలుపులు తెరచి.. “మామయ్యా!.. ఆదీ భోజనానికి రండి." పిలిచింది గౌరి.

ఆమె గొంతు వినగానే యిరువురూ వులిక్కిపడి ద్వారం వైపు చూచారు. నవ్వుతూ గౌరి నిలబడి వుంది. ఆమె వెనకాల ప్రేమ.


ఆ యిరువురూ.. లేచారు ద్వారాన్ని సమీపించారు.

"రా ప్రేమా!..” గౌరి.. డైనింగ్ టేబుల్ను సమీపించింది. ముగ్గురికీ కంచాలను పెట్టి భోజనాన్ని వడ్డించింది.


ప్రేమ.. “నేను మీతో తింటానమ్మా!..” ఒక కంచాన్ని ప్రక్కకు జరిపింది.

“ఒద్దు. కూర్చో.. చపాతీలేగా.. నేనూ కూర్చుంటున్నాను” నాల్గవ కంచంలో కూడా వడ్డించింది.

నలుగురూ కుర్చీలల్లో కూర్చున్నారు. తినడం ప్రారంభించారు.


ఏమీ జరగనట్లుగా.. మామూలుగా నవ్వుతూ ఆ ముగ్గురికీ కొసరి కొసరి వడ్డించింది గౌరి, తనూ తింటూ.

ఆది భీమారావులు ఒకరి ముఖాలొకరు చూచుకొన్నారు. గౌరి ప్రశాంతంగా వున్నందుకు లోన ఆనందించారు.

భోజనానంతరం ఎవరి గదులకు వారు వెళ్ళిపోయారు.


అరగంట తర్వాత.. తలుపును తట్టిన శబ్దాన్ని విని ఆది వెళ్ళి తలుపు తెరిచాడు.

ఎదురుగుండా నిలబడి వున్న తల్లిని చూచి ఆశ్చర్యపోయాడు.


"ఆదీ!.. నీతో మాట్లాడాలి."

"లోనికి రామ్మా!.."

గౌరి లోనికి నడిచి సోఫాలో కూర్చుంది. ఎదుటి సోఫాలో కూర్చొని తల్లి ముఖంలోకి చూచాడు ఆది.

"ఆ కాగితాలు నీకు ఎవరు యిచ్చారు?..


"తాతయ్యగారు.”

"తాతయ్యా!.. "

"అవునమ్మా!..'

గౌరి కొద్దిక్షణాలు ఆది ముఖంలోకి చూస్తూ మౌనంగా వుండిపోయింది. తర్వాత..

“ఆ విషయం నీవు నాకు ఎందుకు చెప్పలేదు?..”


“నా ప్రేమకోసం. అంటే నాకు మీరందరూ నా వారుగా కావాలి. ముఖ్యంగా నీవు నాన్నా.. నేను మీ అందరికీ ఎంతో కాలం దూరంగా వున్నాను. జీవితాంతం మనం అందరం కలసి వుండాలని నా కోరిక. పాపం.. నాన్న చాలా మంచివాడమ్మా!.. పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన అలా చేయవలసి వచ్చింది. నీకూ యీ విషయం అర్థం అయివుంటుందనుకొంటున్నాను అమ్మా!.. నేను మాట్లాడింది తప్పుగా తోస్తే.. నన్ను క్షమించు. అబద్ధం చెప్పడం.. నాకు చేతగాదన్న విషయం.. నీకూ తెలుసు.” దీనంగా తల్లి కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు ఆది.


అక్కడికి వచ్చిన భీమారావు ఆది మాటలను విన్నాడు. లోనికి వచ్చాడు. గౌరి లేచి నిలబడింది.

“కూర్చో తల్లీ. కూర్చో” సోఫాలో ఆది ప్రక్కన కూర్చున్నాడు. గౌరి ముఖంలోకి చూచాడు.


“అమ్మా.. గౌరీ.. నా బిడ్డ నీకు నాకు తెలిసి.. ఎవరికి ఏమీ తక్కువ చేయలేదు. పరిస్థితుల ప్రభావానికి లోనై.. నీలాంటి ఓ ఆడబిడ్డను రక్షించే దానికోసం.. వాడు యీ తప్పు చేశాడు. మీ.. అత్తయ్య కోరిక ప్రకారం నీకు వాడికి నేను వివాహాన్ని నిర్ణయించినప్పుడు.. ఆ తల్లి ఆనందం కోసం.. నోరు విప్పలేక పోయాడు. వాడు ప్రయత్నించినా.. నేను వాడికి ఆ అవకాశాన్ని యివ్వలేదు. యీ యిరవై నాలుగు సంవత్సరాలుగా ఆ చేదు నిజాన్ని మనకు చెప్పలేక.. తనలో తాను ఎంతగా కుమిలిపోయివుంటాడో ఒక్కసారి ఆలోచించు. నేను.. యీ కుటుంబానికి పెద్దను.నా అన్న వాళ్ళంతా నా జీవిత కాలంలో ఆనందంగా వుండాలనేది నా కోరిక.. ఆశయం. ఆ కారణంగానేనమ్మా నాకు యీ విషయం తెలిసినా నీకు చెప్పలేకపోయాను. అందుకు నీవు నన్ను క్షమించాలి తల్లీ." దీనంగా చేతులు జోడించాడు భీమారావు.


గౌరి ఆయన చేతులను వేరుచేసి.. “యీ చేతులు నన్ను ఎప్పుడూ ఆశీర్వదించాలి మామయ్యా!.. నన్ను ఆశీర్వదించాలి.” గద్గద స్వరంతో చెప్పింది గౌరి.


“నా బిడ్డ మనస్సు..” భీమారావు ముగించక ముందే..

"నా బావ మనస్సు నాకు తెలియదా మామయ్యా!.. వూహించని విషయం తెలిసిన తర్వాత.. ఎంతగానో తల్లడిల్లి పోయాను. ధర్మాధర్మాలను గురించి ఆలోచించాను. యిప్పుడు నా మనస్సులో నా బావ మీద ఎలాంటి కోపమూ లేదు. కొన్ని గంటల నా ప్రవర్తన.. మాటలు.. మీ యిరువురినీ నొప్పించి వుండవచ్చు. నన్ను మీరే క్షమించాలి మామయ్యా!.." భీమారావు పాదాలను తాకింది గౌరి అశ్రు పూరిత నయనాలతో.


“అమ్మా!.. పరిస్థితుల ప్రభావం వలన తప్పు చేయడం మానవ సహజం. తను చేసిన నేరపు ప్రభావాన్ని తనవారి మీద పడకుండా వర్తించడం కొందరికే సాధ్యం. క్షమాగుణానికి సాటైనది వేరొకటి లేదు. కుటుంబ సభ్యుల మనసుల్లో'మమతలమధువు, నిండి వుండాలమ్మా!.. అటువంటి కుటుంబాన్నే ఆదర్శ కుటుంబం అంటారు. నా జీవిత కాలంలో నా కుటుంబం అలా వుండాలమ్మా. అంతిమ శ్వాసవరకూ నేను అదే ప్రయత్నంలో వుంటాను. అదే నాకు ఆనందం." ఎంతోఅనునయంగా చెప్పాడు భీమారావు.


“నిండుగా.. నూరేళ్ళు.. పసుపు కుంకుమలతో చల్లగా వర్థిల్లు తల్లీ." కుడిచేతిని ఆమె తలపై వుంచీ మనసారా దీవించాడు భీమారావు,

“మామయ్యా!.. నాది ఒక కోరిక.”

"ఏమిటమ్మా!.."

"అక్కయ్యను మన యింటికి తీసుకొని రండి."


భీమారావు.. ఆదిత్య ఆశ్చర్యంతో గౌరి ముఖంలోకి చూచారు.

"మా బావ ఆనందమే నా ఆనందం. మామయ్య.. నా మాటను కాదనకండి." చేతులు జోడించి.. గౌరి ఆ గదినుండి వెళ్ళిపోయింది.


ఆదిత్య ఆనందంతో తాతయ్యను కౌగిలించుకొన్నాడు. ఆ యిరువురి మనస్సుల నిండా ఆనందం.

****

=============================================================


ఇంకా వుంది



=============================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.


47 views0 comments
bottom of page