top of page

మానవత్వం.. మనిషిలా..

#Thirumalasri, #తిరుమలశ్రీ, #ManavatvamManishila, #మానవత్వంమనిషిలా, #TeluguHeartTouchingStories, #కొసమెరుపు

ree

Manavatvam Manishila - New Telugu Story Written By Thirumalasri

Published In manatelugukathalu.com On 19/08/2025

మానవత్వం.. మనిషిలా - తెలుగు కథ

రచన: తిరుమలశ్రీ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

రాత్రి పది గంటలు అవుతోంది. గదిలో టేబుల్ ల్యాంప్ వెలుతురులో మెడికల్ జర్నల్ ఏదో చదువుకుంటున్నాడు అరవింద్. మంచం మీద నిద్రిస్తూన్న నాలుగేళ్ళ శశాంక్ హఠాత్తుగా లేచి కూర్చుని, “నాన్నా! అమ్మ ఎప్పుడు వస్తుంది?” అనడిగాడు. 


అరవింద్ ఉలికిపడి, లేచి బాబు దగ్గరకు వెళ్ళాడు. పక్కలో కూర్చుని, “పని పూర్తవగానే వచ్చేస్తుంది, బాబూ!” అన్నాడు.


“అదే..ఎప్పుడూ అని?”


“త్వరలోనే వచ్చేస్తుందిగా!”


“ఫోఁ! నువ్వు ఎప్పుడూ ఇలాగే చెబుతావు” మారాముగా అన్నాడు బాబు. “రేపే వచ్చేయమని చెప్పు. లేకపోతే నేను బువ్వ తిననంతే!” బుంగమూతి పెట్టాడు.


“అలాగే. నువ్వు బజ్జో..” పడుకోబెట్టి జోకొట్టాడు అరవింద్. కాసేపటికి బాబు ఏదో కలవరిస్తూ నిద్రలోకి జారిపోయాడు. 


అరవింద్ చిన్నగా నిట్టూర్చి, మళ్ళీ టేబుల్ వద్దకు వెళ్ళాడు. జర్నల్ తెరచి చదవడానికి ప్రయత్నించాడు కాని, మనసు దాని మీద లగ్నం కావడంలేదు. గతాన్ని నెమరువేసుకోవడానికి ఉపక్రమించింది..

*

అరవింద్ తండ్రి నరసయ్య ఓ చిన్నకారు రైతు. రెండెకరాల స్వంత పొలానికి తోడు మూడెకరాల మాగాణీని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. ఓ ఎకరం పొలం అమ్మివేసి కూతురికి పెళ్ళి చేసేసాడు. కొడుకును డాక్టర్ని చేయాలన్న అభిలాష. అరవింద్ తెలివైనవాడు. చదువు పట్ల శ్రద్ధాసక్తులు కలవాడు. ఎమ్సెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడంతో మెడిసిన్ లో సీటు వచ్చింది. అప్పు చేసి కొడుకును మెడిసిన్ లో చేర్పించాడు నరసయ్య. కొడుకు పెద్ద డాక్టరయి పేదలకు సేవచేయాలన్నది అతని ఆశయం. 


అయితే, విధివిలాసం మరోలా ఉండడంతో.. అరవింద్ రెండవ సంవత్సరంలో ఉండగా నరసయ్యకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. గ్రామంలో తగు వైద్యసదుపాయం లేదు. ఉన్న ఒక్క ఆరెమ్పీ డాక్టరూ సమయానికి అందుబాటులో లేడు. పొరుగూళ్ళో ఎవరికో వైద్యం చేయడానికి వెళ్ళాడు. అతనికి కబురు అంది వచ్చేలోపునే నరసయ్య గుండె ఆగిపోయింది. సమయానికి వైద్యం అందక తండ్రి అసువులు బాయడం అరవింద్ ని కృంగదీసింది. 


అరవింద్ చదువు ఆపేసి ఏదైనా ఉద్యోగం చూసుకుంటానన్నాడు. తల్లి రమణమ్మ ఒప్పుకోలేదు. గ్రామపెద్దలను పట్టుకుని, లోకల్ ఎమ్మెల్యే సాయంతో బ్యాంకులో విద్యారుణం తీసుకుంది. దానికి తోడు మెరిట్ విద్యార్థి కావడంతో అరవింద్ కి స్కాలర్షిప్ కూడా లభించింది. పట్టుదలతో చదివి ఎమ్బీబియెస్ ఫస్ట్ ర్యాంకులో పాసయ్యాడు. ఛారిటీ ఫౌండేషన్ ఒకటి స్వంత ఖర్చులతో అతన్ని ఎమ్మెస్ నిమిత్తం విదేశాలకు పంపించింది. కొన్నాళ్ళకు గొప్ప సర్జన్ గా తిరిగివచ్చాడు.


అనుభవంకోసం పట్టణంలోని ఓ సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్లో చేరాడు అరవింద్. ఆధునిక వైద్యసదుపాయాలు, పరికరాల వినియోగం వగైరాలలో తగు అనుభవం సంపాదించాక గ్రామం పైన దృష్టి సారించాలనుకున్నాడు. 


దూరపు బంధువుల అమ్మాయితో అరవింద్ వివాహం జరిపించేసింది రమణమ్మ. అరవింద్ భార్య మంజుల అందగత్తె. డిగ్రీ వరకు చదివింది. వారి కాపురం అన్యోన్యంగా సాగింది. వ్యవసాయం అంటూ పల్లెలోనే ఉండిపోయింది రమణమ్మ. 


ఉద్యోగంలో చేరి ఆర్నెల్లు అయేసరికి వైద్యవృత్తిలోని సాధకబాధకాలు బాగానే తెలిసివచ్చాయి అరవింద్ కి. ఇంటా బైటా ఉత్పన్నమయే సమస్యలు ఆకళింపుకు వచ్చాయి. కేవలం విషయపరిజ్ఞానము, తెలివితేటలు, వృత్తిపట్ల శ్రద్ధాసక్తులు ఉంటే చాలదనీ.. ఆ వృత్తిలో నెగ్గుకు రావడానికి ఇంకేదో ఉండాలనీ అర్థమయింది. అది అత్యంత ఒత్తిడితో కూడుకునియున్న వృత్తి. రోగులు, రోగాలే వైద్యుడి లోకం.


రేయింబవళ్ళు– వేళాపాళా లేకుండా– శ్రమించకతప్పదు. ఎప్పటికప్పుడు వైద్యరంగంలో వచ్చే పరిణామాలను, కొత్తగా తయారయ్యే మందులు వగైరాలను గురించీ తెలుసుకునే నిమిత్తం.. నిరంతరం మెడికల్ జర్నల్స్ నీ, పుస్తకాలనూ చదువుతూనే ఉండాలి. స్వంత సౌఖ్యాన్ని, ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టాలి. అరవింద్ కు అందుకు బాధ లేదు. 


సమస్య అంతా కార్పొరేట్ వ్యవస్థతోనే! దురాశాపరులైన కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, మెడికల్ ఇన్ష్యూరెన్స్ కంపెనీలు, ఫార్మాస్యుటికల్ కంపెనీలు, మెడికల్ ఎక్విప్మెంట్, పార్ట్ లు సరఫరాచేసే కంపెనీలు– అందరిదీ వ్యాపార ధోరణే. తమ లాభాల బాటలో రోగుల కష్టసుఖాలతో వారికి పనిలేదు. 


అతను పనిచేస్తున్న ఆసుపత్రిదీ అదే ధోరణి. వచ్చిన ప్రతిరోగికీ అవసరం ఉన్నా లేకపోయినా వివిధ పరీక్షలు తప్పనిసరిగా జరిపించాలి. అవి కూడా తమ ఆసుపత్రిలోనే. ఒక్కో టెస్టుకీ వేలలో ఛార్జీలు. అవసరం లేకపోయినా, ‘పరిశీలన’ సాకుతో ఇన్-పేషెంటుగా చేర్పించడం, రోగులను ఐ.సి.యు. లో పెట్టడం వగైరాలు సర్వసాధారణం అయిపోయాయి. 


ఏడాది తిరక్కుండానే సమర్థుడైన సర్జన్ గా గుర్తింపు పొందాడు అరవింద్. కీలకమైన ఆపరేషన్లు అతనికే అప్పగింపబడుతున్నాయి. జీతం రెట్టింపు అయింది. కాని, విశ్రాంతి కరవయింది. కేసులతో ఊపిరి సలపకుండా ఉంది. దాని ప్రభావం గృహస్థ జీవితం పైన పడనారంభించింది. 


బొత్తిగా ఇంటిపట్టున ఉండకుండా రాత్రులు సైతం వేళాపాళా లేకుండా రోగులు, రోగాలు, సర్జరీలు, ఎమెర్జెన్సీలు అంటూ వెళ్ళిపోయే భర్త పట్ల క్రమేపీ అసంతృప్తి, అసహనం పెరగసాగాయి మంజులలో. పెళ్ళయిన ఏడాదికి బాబు పుట్టాడు. వాడికి శశాంక్ అని పేరు పెట్టుకున్నారు. వాడి ముచ్చట్లు చూడడానికి, ముద్దు పలుకులు వినడానికి కూడా భర్తకు తీరిక లేకపోవడం తీవ్ర అశాంతికి గురిచేస్తోంది మంజులను. 


వృత్తిధర్మంలో కొన్ని వ్యక్తిగత సౌఖ్యాలను వదలుకోక తప్పదంటూ నచ్చజెప్పబోయే భర్త పట్ల చిరాకు ప్రదర్శించేది. డాక్టర్ని పెళ్ళాడి తప్పుచేసానా అన్న భావన అప్పుడప్పుడు ఆమెను దొలిచేది.. అరవింద్ తన ఆశయాన్ని మరువలేదు. ఆ ఆసుపత్రిలో చేరి మూడేళ్ళయిపోయింది. వీలయినంత త్వరగా పల్లెకు మకాం మార్చేందుకు తగు ప్రయత్నాలను ఆరంభించాడు.


ఓసారి హాస్పిటల్ ఎమ్.డి. నుండి అరవింద్ కు పిలుపు వచ్చింది. “నీకిచ్చిన టార్గెట్ గురించి పట్టించుకోవడంలేదు నువ్వు. దిసీజ్ వెరీ బ్యాడ్!” అన్నాడు మందలిస్తూ.

ఆ ఆసుపత్రిలో పనిచేసే ప్రతి డాక్టరూ తన జీతానికి కనీసం ఐదు రెట్లయినా ఆసుపత్రికి రెవెన్యూ జనరేట్ చేయవలసివుంది- టెస్టులు, అడ్మిషన్స్ వగైరాల రూపంలో! వారి ఉద్యోగపు షరతులలో అదొకటి. 


“నెలకు లక్ష రూపాయలు జీతం తీసుకుంటున్నావు. కనీసం ఐదు లక్షలైనా సంపాదించకపోతే, హాస్పిటల్ ఎలా నడుస్తుంది?” అన్నాడు ఎమ్.డి. 


“సారీ, సర్! అవసరంలేని టెస్టులు వగైరాలతో రోగుల్ని ఇబ్బందిపెట్టడం నాకిష్టంలేదు. ఆ విషయం నేను ఆరంభంలోనే చెప్పాను” అన్నాడు అరవింద్.


“నీకంటె సీనియర్స్ సైతం హాస్పిటల్ యొక్క నిబంధనను పాటిస్తుంటే, నీకు వచ్చిన అభ్యంతరమేమిటీ?” విసుక్కున్నాడు ఎమ్.డి.


“వృత్తిధర్మానికి ద్రోహం చేయడం నాకిష్టంలేదు. మీరు కాదుకూడదంటే నేను రాజీనామా చేసేస్తాను” దృఢంగా అన్నాడు అరవింద్. 


ఎమ్.డి. అవాక్కయ్యాడు. సమర్థుడైన సర్జన్ గా పేరు తెచ్చుకున్న అరవింద్ ని వదలుకోవడానికి ఆసుపత్రి సిద్ధంగా లేదు. అందుకే తగ్గివచ్చాడు. 


“ఐ అప్రిషియేట్ యువర్ ఐడియల్స్, మై బాయ్! ప్రస్తుత కార్పొరేట్ వ్యవస్థలో వైద్యవృత్తి వ్యాపారంగా మారిందన్న వాస్తవాన్ని మనం విస్మరించలేం. ఈ రంగంలో ఎంతటి గట్టి పోటీ ఉన్నదో నువ్వు ఎరుగనిది కాదు. సో, హాస్పిటల్ సక్రమంగా నడవాలన్నా, రోగులకు మరిన్ని సదుపాయాలను కల్పించాలన్నా, మన జీతాలు పెరగాలన్నా మన వంతుగా మనం యాజమాన్యంతో సహకరించడంలో తప్పులేదు..” అన్నాడు.


అరవింద్ భుజాలు ఎగరేసి మౌనంగా అక్కణ్ణుంచి నిష్క్రమించాడు. 

లోగడ ఎప్పుడో ప్రభుత్వోద్యోగానికి పెట్టుకున్న దరఖాస్తుకు జవాబుగా ఇప్పుడు ఇంటర్వ్యూకి పిలవబడ్డాడు అరవింద్. మెడికల్ ఆఫీసరుగా ఎంపికయ్యాడు. అతని కోరిక మేరకు ఓ ప్రైమరీ హెల్త్ సెంటర్ (పి.హెచ్.సి.) కి పోస్ట్ చేయబడ్డాడు. పట్టణానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నదది. చుట్టుపక్కలనున్న పది గ్రామాలకు అదొక్కటే ప్రభుత్వ ఆసుపత్రి. 


అన్ని పి.హెచ్.సి. ల లాగే అక్కడా మందులు, పరికరాలు, సిబ్బంది కొరత ఎక్కువగానే ఉంది. అంతకుమునుపు ఏ డాక్టర్ ని పోస్ట్ చేసినా ఆసుపత్రికి రెగ్యులర్ గా వచ్చేవారు కాదు. పట్టణంలోని తమ ప్రైవేట్ ప్రాక్టీసును చూసుకునేవారు. కాంపౌండరే అన్నీ చూసుకునేవాడు. రోగులకు ఆయా కట్లు కట్టేది. 


అరవింద్ జాయిన్ కాగానే ఉన్నతాధికారుల వెంటపడి, డిపార్ట్మెంట్ చుట్టూ పలు చక్కెర్లు కొట్టీ, లోకల్ ఎమ్మెల్యేని పట్టుకునీ మందులు, మెడికల్ పరికరాలు వగైరాలు సమకూడేలా చేసుకున్నాడు. స్వంత ఖర్చుతో ఓ ఆపరేషన్ థియేటర్ ని కూడా అమర్చాడు. ఓ నర్సింగ్ సిస్టర్ని పోస్ట్ చేయించాడు. 


డాక్టరు, సిబ్బందీ రెగ్యులర్ గా రావడం, మందుల సరఫరా సక్రమంగా జరగడంతో రోగులు రాసాగారు. ఆసుపత్రిలో లభ్యం కాని మందులను స్వంత డబ్బులతో తెప్పించి రోగులకు ఇచ్చేవాడు అరవింద్. ఆసుపత్రి మీద, డాక్టర్ మీద విశ్వాసం ఏర్పడింది గ్రామ ప్రజలకు. 


ఐతే, మంజులకు భర్త వ్యవహారం బొత్తిగా నచ్చలేదు. పట్టణంలోని కార్పొరేట్ హాస్పిటల్లో లక్షరూపాయల జీతం వదలుకుని, కేవలం నలభై వేలకు ప్రభుత్వోద్యోగంలో చేరడం, ఎక్కడో మారుమూలనున్న పి.హెచ్.సి. లో పోస్టింగు.. జీర్ణించుకోలేకపోయింది ఆమె. కార్పొరేట్ హాస్పిటల్ లోనే కొనసాగుతూ ప్రైవేట్ ప్రాక్టిస్ పెట్టమని పోరింది. తగు వైద్య సదుపాయం లేని పల్లెలకు తనలాంటివారి అవసరం ఎంతో ఉందన్నాడు అతను. 


మంజుల సగటు మహిళ. తాను, తన సంసారమే ముఖ్యం ఆమెకు. సంపాదన తరువాతే సేవాతత్పరత. ఆ విషయమై దంపతుల మధ్య పెద్ద ఘర్షణే జరిగింది. ఆమె పల్లెకు రాననడంతో, పట్టణంలోనే కాపురం పెట్టి, రోజూ నలభై కిలోమీటర్ల ప్రయాణం చేయసాగాడు. ప్రొద్దుటే వెళ్ళినవాడు దాదాపు అర్థరాత్రికి గాని ఇంటికి చేరుకోకపోవడం ఇద్దరి నడుమా దూరాన్ని పెంచింది. 


అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న మంజుల బావ ఆ మధ్య ఇండియాకి రావడంతో, బాబును తీసుకుని పుట్టింటికి వెళ్ళింది మంజుల. మూణ్ణెల్లయినా తిరిగిరాలేదు. విడాకుల నోటీసు వచ్చింది. 


విభ్రాంతికి గురైన అరవింద్ అత్తారింటికి పరుగెత్తాడు. పెద్దల సలహాలను కూడా లెక్కచేయలేదు మంజుల. అతనితో కాపురం చేయడం తనవల్ల కాదని తెగేసి చెప్పేసింది..


కేసు ఫ్యామిలీ కోర్టులో ఏడాదిపాటు నడచింది. చివరకు పరస్పర ఒప్పందంతో విడాకులు మంజూరుచేయబడ్డాయి. పిల్లవాణ్ణి అరవింద్ కే వదిలేసి బావతో అమెరికా వెళ్ళిపోయింది మంజుల. 


అంతకుమునుపు ఓ అమెరికన్ యువతిని పెళ్ళి చేసుకున్నాడు మంజుల బావ. రెండేళ్ళకే అతనికి విడాకులు ఇచ్చేసింది ఆమె. అప్పట్నుంచీ అవివాహితుడిగానే ఉండిపోయాడు. బావామరదళ్ళు పెళ్ళి చేసుకోబోతున్నారన్న వార్త హల్ చల్ చేసింది.

 తల్లికోసం ఏడ్చే పసివాణ్ణి సముదాయించలేక తల్లిని రప్పించుకున్నాడు అరవింద్. రమణమ్మ అతన్ని మళ్ళీ పెళ్ళి చేసుకోమని పోరింది కాని, అతను ససేమిరా అన్నాడు.


కొడుక్కి జరిగిన అన్యాయనికి కుమిలిపోతూ ఆర్నెల్లు తిరక్కుండానే గుండెపోటుతో కన్నుమూసింది రమణమ్మ. అది మరో అశనిపాతం అయింది అరవింద్ కి. 


చంటివాడి ఆలనా పాలనా చూసుకునేందుకు ఆయాను నియమించాడు. వాడు అమ్మ కావాలని మారాము చేస్తుంటే ఏం చేయాలో పాలుపోయేది కాదు. అప్పటికి ఏదో సర్దిచెప్పి ఊరుకోబెట్టాడానికి ప్రయత్నించేవాడు.. 


పి.హెచ్.సి. లో పనిచేస్తున్న నర్సింగ్ సిస్టర్ స్నేహ కేరళకు చెందినది.

ముప్పయ్యేళ్ళుంటాయి. డాక్టర్ అరవింద్ పట్ల ఆరాధనను పెంచుకుంది ఆమె. అతనికి వచ్చిన కష్టానికి మిక్కిలి బాధపడింది. వీలయినపుడల్లా అరవింద్ ఇంటికి వెళ్ళి బాబుతో ఆడుకునేది. బొమ్మలవీ తెచ్చి ఇచ్చేది. పార్క్ కి తీసుకువెళ్ళి ఆటలాడించేది. దాంతో ఆమెకు మచ్చికయ్యాడు శశాంక్. 

*

శశాంక్ కి ఇప్పుడు ఏడేళ్ళు. రెండవ తరగతి చదువుతున్నాడు. స్నేహ సాంగత్యంలో నూతనోత్సాహాన్ని పుంజుకున్నాడు. అరవింద్ కి రోగులతో తీరిక చిక్కదు. అందువల్ల స్నేహే వీలయినపుడల్లా శశాంక్ ని ఔటింగుకు తీసుకువెళ్ళేది. పిల్లాడు చదువులో చురుకుదనమే కాక, ఈత కూడా నేర్చుకుంటున్నాడు.. 


ఓ రోజున రోడ్డు ప్రమాదానికి గురైన కుటుంబం ఒకటి పి.హెచ్.సి. కి తీసుకురాబడింది. ట్రక్ ఒకటి వారి కారును ఢీకొనడంతో ఆ ప్రమాదం జరిగింది. కోల్ కత్తాకి చెందిన ఓ లాయర్ కుటుంబం చెన్నైకి వెళుతూండగా ఆ దుర్ఘటన జరిగింది. కారును డ్రైవ్ చేస్తున్న లాయర్, టీనేజ్ కొడుకు, కూతురు స్వల్పగాయాలతో బైటపడితే, భార్య మాత్రం తీవ్రంగా గాయపడింది. 


సమయానికి అరవింద్ ఆసుపత్రిలో లేడు. సిస్టర్ కూడా లేదు. కాంపౌండరు, ఆయాలే ఉన్నారు. క్షతగాత్రులకు ప్రథమచికిత్స చేసి కట్లు కట్టారు వాళ్ళు. లాయర్ భార్యకు అత్యవసర సర్జరీ అవసరం. పట్టణంలో వున్న అరవింద్ కి ఫోన్ చేసి పరిస్థితిని తెలియపరచాడు కాంపౌండర్. తాను బైలుదేరి వస్తున్నానంటూ, ఆలోపున చేయవలసిన ప్రొసీజర్ని వివరించాడు అరవింద్. 


లాయర్, భార్య స్థితికి ఆందోళనచెందుతూ, సమయానికి డాక్టర్ లేనందుకు ఆగ్రహం వ్యక్తంచేసాడు. డాక్టర్ రాక ఆలస్యమయేకొద్దీ అతనిలో ఆందోళన, అసహనం, ఆగ్రహం అధికం కాసాగాయి. డాక్టర్ పట్టణంలో ఉంటాడని తెలిసి చిందులుత్రొక్కాడు. కాంపౌండర్ మీద అరచాడు.


అరవింద్ రావడానికి అరగంట పైనే పట్టింది. భార్యను గూర్చిన ఆందోళన తారాస్థాయికి చేరుకున్న బెంగాలీబాబు ఆవేశంతో అతని మీద విరుచుకుపడ్డాడు. అరవింద్ సహనం కోల్పోకుండా, “ముందుగా పేషెంటుకు అటెండ్ కానివ్వండి,” అంటూ తప్పించుకుని లోపలికి వెళ్ళిపోయాడు. క్షతగాత్రురాలిని పరీక్షించి, తక్షణ సర్జరీకి పూనుకున్నాడు. 


దాదాపు గంటసేపు పట్టిన ఆ సర్జరీ విజయవంతమయింది. పోస్ట్-ఆపరేటివ్ కేర్ గురించి కాంపౌండర్ కి తగు సూచనలు చేసి బైటకు వచ్చాడు అరవింద్. ఆత్రుతతో సతమతమవుతూన్న బెంగాలీబాబుతో, “షి ఈజ్ ఔటాఫ్ డేంజర్. ప్రస్తుతానికి ఇక్కడే ఆబ్జర్వేషన్ లో ఉంచి, తెలివిలోకి రాగానే పట్టణంలోని పెద్దాసుపత్రికి తరలించుదాం” అని చెప్పాడు. తాను మళ్ళీ వచ్చి చూస్తానంటూ కారు వద్దకు నడచాడు. 


కాని, బెంగాలీబాబు అరవింద్ ను అడ్డుకున్నాడు, “నా భార్యకు తెలివి వచ్చేంతవరకు నువ్వు ఇక్కణ్ణుంచి కదలడానికి వీల్లేదు” అంటూ. 


అరవింద్ సహనాన్ని కోల్పోకుండా, తాను వెళ్ళకతప్పదనీ, తప్పకుండా తిరిగివస్తాననీ, పేషెంట్ పూచీ తనదనీ హామీ ఇస్తూ నచ్చజెప్పబోయాడు. ఐనా అతను తన పట్టు వదల్లేదు. డాక్టర్ యొక్క నిస్సహాయతను గమనించిన కాంపౌండర్, కారుకు అడ్డుగా నిలుచున్న లాయర్ ని బలవంతంగా పక్కకు లాగేసాడు. అరవింద్ కారు వెళ్ళిపోయింది.


“డామిట్! నా భార్యకు ఏమైనా అయితే ఆ డాక్టర్ని వదలిపెట్టను. కోర్టుకు ఈడ్చి మూడు చెరువుల నీళ్ళు త్రాగిస్తాను” అంటూ ఆవేశంతో అరచాడు బెంగాలీబాబు.


అంతవరకు సంయమనం పాటించిన కాంపౌండర్ ఇక ఊరుకోలేకపోయాడు. “ఏమని కేసు పెడతారు? విధినిర్వహణను నిర్లక్ష్యం చేసారనీ, మానవత్వంలేని మనిషనీ డాక్టర్ గారిని దూషిస్తున్నారు మీరు.. ఆయన గురించి మీకేం తెలుసనీ?” అంటూ, ఆవేశంతో అతను చెప్పిన సంగతులు ఆలకించిన ఆ లాయర్ కొయ్యబారిపోయాడు. 


‘ఏడేళ్ళ శశాంక్ ఎప్పటిలాగే ఆ రోజూ ఈత నేర్చుకోవడానికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. సమయానికి కోచ్ సమీపంలో లేకపోవడంతో ఆ పసివాణ్ణి కాపాడేవారు లేకపోయారు. ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న కొడుకు అకాలమృత్యువు పాలవడంతో తీవ్ర విభ్రాంతికి గురయ్యాడు అరవింద్.


డ్యూటీలో వుండగా ఫోన్ రావడంతో ఇంటికి బైలుదేరాడు. స్నేహ అతని వెంట వెళ్ళింది. పసివాడి బాడీకి పోస్ట్ మార్టెం వగైరాలు పూర్తిచేయించి ఇంటికి తీసుకువచ్చేసరికి, ఆ యాక్సిడెంట్ పేషెంట్ విషయం తెలిసింది అరవింద్ కు. పుట్టెడు దుఃఖంలో ఉండికూడా, కొడుకు మృతదేహాన్ని బంధుమిత్రులకు వదలి తక్షణమే బైలుదేరి వచ్చాడు. పేషెంటుకు ప్రాణాపాయాన్ని తప్పించి.. కర్మకాండలను జరిపి కొడుకును పూడ్చిపెట్టే నిమిత్తం వెళ్ళాడు. అచ్చటి తంతు ముగియగానే, పేషెంట్ ను చూడడానికి తిరిగివస్తానని చెప్పాడు..’


వాస్తవచిత్రం కళ్ళముందు ఆవిష్కరణ కావడంతో బెంగాలీబాబులో పశ్చాత్తాపం వెల్లివిరిసింది. డాక్టర్ తో అనుచితంగా ప్రవర్తించినందుకు బాధపడ్డాడు. అరవింద్ యొక్క అసాధారణ మానవతాదృక్పథానికి, వృత్తిధర్మం పట్ల అతనికి గల నిబద్ధతకూ మదిలోనే జోహార్లు అర్పించాడు. 


‘మానవత్వం..మనిషిలా..ఇతని రూపంలో..’ అన్న పలుకులు నోటి నుండి వెలువడగా అప్రయత్నంగా చేతులు జోడించాడు.

************

తిరుమలశ్రీ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం :

‘తిరుమలశ్రీ’ గారి అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ఎమ్.ఎ. (సోషియాలజి), ఎల్.ఎల్.బి., సి.ఎ.ఎస్. భారతప్రభుత్వపు CSIR అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి చెందిన వీరు, జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ అఫ్ అడ్మినిస్ట్రేషన్' గా పదవీ విరమణ చేసారు…వీరి మరో కలంపేరు 'విశ్వమోహిని'. తెలుగులో వీరివి అన్ని జేనర్స్లోను, ప్రక్రియలలోను(బాలసాహిత్యంతోసహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. సుమారు185 నవలలు ప్రచురితమయ్యాయి. పలుకథలు, నాటికలు, నాటకాలు ఆలిండియా రేడియోలోప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్లో ప్రసారంకాగా, మరికొన్నిరంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి. పలుకథలు బహుమతులను అందుకున్నాయి. కొన్నికథలు హిందితోపాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. ఓ మాసపత్రికలో రెండు కాలమ్స్ నిర్వహించారు. ప్రతిలిపి 'కథాకిరీటి', 'కథావిశారద', మరియు 'బాలకథాబంధు' (బాలసుధ-బాలసాహితీసంస్థ, విజయనగరం) బిరుదాంకితులు. 'కలహంస పురస్కార' గ్రహీతలు. ఆంగ్లంలో సుమారు100 కథలు, ఆర్టికల్స్ ప్రముఖ పత్రికలలోను, జాతీయ దినపత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని బహుమతులను అందుకున్నాయి. ఓ ప్రముఖ ఆంగ్ల జాతీయ దినపత్రికలో వీక్లీ (లిటరరీ) కాలం వ్రాసారు. ఓ జర్మన్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా 20 ఈ బుక్స్ ప్రచురిత మయ్యాయి... స్టోరీ మిర్రర్ (ఆంగ్లం), ‘లిటరరీ బ్రిగేడియర్’ బిరుదాంకితులు, మరియు ‘ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020’ నామినీ… హిందీలో అరడజను కథలు ప్రచురితం కాగా,ఓ బాలల నాటిక ఆలిండియా రేడియోలో ప్రసారితమయింది.

''స్టోరీ మిర్రర్- 'ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020' అవార్డ్స్ (రీడర్స్ చాయిస్- ఫస్ట్ రన్నరప్ & ఎడిటర్స్ చాయిస్- సెకండ్ రన్నరప్) ట్రోఫీలు లభించాయి..."





Comments


bottom of page