top of page

మాతృ మూర్తి శతకము

#SudarsanaRaoPochampally, #సుదర్శనరావుపోచంపల్లి, #MathruMurthiSathakamu, #మాతృమూర్తిశతకము, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #ఆటవెలది

ree

Mathru Murthi Sathakamu - New Telugu Poems Written By - Sudarsana Rao Pochampally 

Published In manatelugukathalu.com On 08/09/2025

మాతృ మూర్తి శతకము - తెలుగు పద్యాలు

రచన : సుదర్శన రావు పోచంపల్లి

 

1.)అవని యందు అమ్మె అనగను వేలుపు

శ్రేష్ట మిచ్చి బెంచి శ్రేష్టు జేయు

అక్ష రంబు నేర్పు అమ్మయె మనకును

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

2.)గోరు ముద్ద బెట్టి గొణుగక దినిపించు నింగి చంద మామ నిలువ జూపు

కడుపు నిండ దిన్న కలుగును తృప్తియె

మహిలొ మిన్న యన్న మాతృమూ ర్తి

 

3.)పాట లెన్నొ పాడి పడుకొన జూచును

నిదుర బోవ జూచి నికను గదులు

అలికి డేది గాక హవణుగ గనుచుండు

మహిలొ మిన్న యన్న మాతృమూ ర్తి

 

4.)పలుక బలప మిచ్చి పలుమార్లు వల్లించి

అక్ష రంబు లన్ని అమ్మె నేర్పు

బుద్ధి గల్గి నేర్వ బుగ్గలు ముద్దాడు

మహిలొ మిన్న యన్న మాతృ మూ ర్తి

 

5.)పలుక బలప మిచ్చి పలుమార్లు వల్లించి

అక్ష రంబు లన్ని అమ్మె నేర్పు

బుద్ధి గల్గి నేర్వ బుగ్గలు ముద్దాడు

మహిలొ మిన్న యన్న మాతృ మూ ర్తి

 

6.)ఏడ్చు చుండ జూచి ఎత్తును చంకకు

కక్ష దింప బోదు కనులు దుడుచు

నిదుర కొచ్చె ననుచు నిదురింప దలుచింక

మహిలొ మిన్న యన్న మాతృ మూ ర్తి

 

7.)తలకు చమరు అంటి తలబుడ్క మనబోయు

ఉడుకు నీళ్ళ తోడ ఉదయ మందె

కొడుకు బిడ్డ లందు కోరుచు శుభ్రము

మహిలొ మిన్న యన్న మాతృమూ ర్తి

 

8.)కొడుకు తప్పు సేయ కోపము పడుచును

బుద్ధి జెప్ప బూను బుదగ రించి

ఒద్దు నాన్న యంటు ఓపిక దెచ్చుక

మహిలొ మిన్న యన్న మాతృ మూ ర్తి

9.)రాళ్ళు మోయు చండు రమణిని జూడగ

చంక దింప బోదు చంటి నెపుడు

బరువు పనులు అయిన భారము అనబోదు

మహిలొ మిన్న యన్న మాతృ మూ ర్తి

 

10.)నెత్తి నిసురు రాయి నెత్తుక నడుచుచు

చంక నందు చంటి చద్ది మూట

కాళ్ళ చెప్పు లెండ కనబోవ నుండవు

మహిలొ మిన్న యన్న మాతృ మూ ర్తి

 

11.)ఉన్న పాత చీర ఊయల బిగగట్టి

తనయు పడుకొ బెట్టు తరువు నీడ

తాను ఎండ లోన తనకలి భరియించు

మహిలొ మిన్న యన్న మాతృ మూ ర్తి

 

12.)ఉగ్గు గుడువ బెట్టి ఉప్పును దిప్పేసి

దిష్టి దోష మంటు దిగులు బడుచు

తల్లి జేయు క్రియలు తనయుల మేలని

మహిలొ మిన్న యన్న మాతృ మూ ర్తి

 

13.)ఇందు కాంత యందు ఇంపుగ వినుచుండ

తల్లి జెప్పు కథలు తనయు లెరుగ

నీతి గలిగి యుండు నిజమగు కథలను

మహిలొ మిన్న యన్న మాతృ మూ ర్తి

 

14.)వడ్డె రమ్మ దాను వచ్చెడి వరకును

కల్లు దాపు శిశువు కళ్ళు మూయ

తిరిగి వచ్చు వరకు తిప్పలు పడకుండ

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

15.)మేను రక్త మేను మేలగు పాలుగ

తల్లి గుడుపు సుతుకు తనర నుండ

కడుపు నిండ కున్న కన్నీరు గార్చును

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తె


16.)నలత జెంద సుతుడు నయమగు వరకును

మొక్కు లెన్నొ మొక్కి మోర బెట్టు

తాను పస్తు లుండు తగ్గెడు వరకును

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

17.)పుస్తె లమ్మ జూచు పుత్రుని జదువుకు

అమ్మ త్యాగ మదియె అవని యందు

అమ్మ లేక మనిషి అక్కర దీరదు

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి.

 

18.)పిల్ల పాప లింట పిడికెడు మెతుకులు

కడుపు నిండ దిన్న కనగ క్షణము

తల్లి జెందు నపుడె తనరగ దృప్తిని

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

19.)కొత్త బట్ట లంటు కొడుకులు కోరగ

తండ్రి కంటె ముందె తల్లి కొనును

అమ్మ ప్రేమ యనగ అవనిలొ అధికము

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

20.)విద్య యందు ధ్యాస విడువక నుండగ

తల్లి బోధ నెంతొ తనయు లందు

బాధ్య తంటు జేయు బతుకను సుఖమని

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

21.)ఆడ పిల్ల బుట్ట ఆనంద బడుచును

ఇంట లక్ష్మి గలుగ ఇంక సుఖము

అనుచు తల్లి దలుచు ఆయింట మేలని

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

22.)సుతిని సుఖము తనది సుంతయు గోరక

సంతు నందు సుఖమె సతత మరయు

ఉండి లేము లనక ఉర్విన కనగను

మహిలొ మిన్న యాన్న మాతృ మూర్తి

 

23.)స్వార్థ చింత నేది స్వయముగ దెలుపగ

కాన బోము నెపుడు కలికి మదిని

త్యాగ మేను తలుచు తల్లియు ఎపుడును

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

24.)మంచి పిల్ల జూచి మనుమాడ బొమ్మని

కొడుకు పెళ్ళి జేయ కోరు తల్లి

కొడుకు సుఖమె ఎపుడు కోరేది దల్లియె

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి.

 

25.)అత్త ఇంట బంప అల్లుని వెదకుచు

ఆస్తి పాస్తి జూచు అమ్మ మనసు

దాని తోడు బుద్ధి దనరగ నుండను

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

26.)వసువు వస్త్ర మంటు వధువుకు బెట్టను

తనకు తోచి నట్టు తల్లి గొనును

వరుని కన్న స్నుషకు వట్టము అనకను

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి.

 

27.)తల్లి జూచు నెపుడు తనయుల క్షేమమె

తాను కష్ట పడును తనయు కొరకు

వారు కష్ట పడగ వలదని వారించు

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

28.)సంతు గలుగ గానె సంతోష మొందుచు

పోలి కలను జూచి పొంగి పోవు

వేడు కలను జరుప వెచ్చించు ధనమెంతొ

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

29.)తనయు లెంద రున్న తల్లనదు బరువు

తనది కడుపు పంట తనయు లనుచు

తనివి దీర బెంచు తనయుల సుఖమొంద

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

30.)తిండి దినెడి అపుడు దిష్టియు దగులని

కొంచె కొంచ మనుచు కొసరి పెట్టు

కడుపు నిండ దినగ కంచము యందున

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి.

 

31.)రవిక ఉండ బోదు రమణికి దొడుగను

చివుకు చీర గట్టు శీల మనుచు

సవము సాద శ్రమకె సాహస పడుచుండు

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

 32.)అమ్మ జేయు వంట అదియెంతొ కమ్మన

తిన్న దెలుసు దాని తీపి యెంతొ

అమృత మంటె వేరు అనగను కనబోము

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి


33.)బరువు అనెడు మాట భావము ఎరుగదు

కరువు కాల మెంత కనగ తల్లి

పుడమి దేవ తంటె పుత్రుల కమ్మయె

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి.

 

34.)రామ కృష్ణ లాంటి రాజులు ఐనను

మాతృ ప్రేమ నొందె మహిలొ కీర్తి

బాగ పొంది యుండి భరణిన అజులైరి

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

35.)అమ్మ లేక అజుడు అవతార మెత్తుచు

అమ్మ కడుపు జొచ్చె అవని యందు

అమ్మ ప్రేమ బొంది అరిగెను దివికిక

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

36.)ఎలమి మాట బుట్టె ఎరుగగ తలినుండె

విశ్వ మంత వ్యాప్తి వినగ నిజము

తల్లి లేని ప్రుథ్వి తనరగ నుండున

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

37.)కోటి దేవు లకును కోరుచు మ్రొక్కిన

అమ్మ వంటి వేల్పు అవని లేదు

అడుగ కుండ దీర్చు అమ్మేను కోరిక

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి.

 

38.)అమ్మ ప్రేమ అంటె అంగడి దొరకదు

కమ్మ నైన తిండి కాన బోము

అవని అమ్మ అనగ ఆమెయె దేవత

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

39.)అలిగి పన్న నాడు అమ్మయె బ్రతిమాలు

తిండి దినెడు వరకు దినదు తల్లి

అదియె అమ్మ ప్రేమ అవనిలొ జూడగ

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

40.)కొడుకు పయన మవగ కోరుతు క్షేమము

దీవె నిచ్చు తల్లి దిరిగి సుఖము

రమ్ము అంటు బలుకు రంధితొ తానుండి

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

41.)సుతులు ఏది గోర సుంతయు గాదన

మనసు ఒప్ప బోదు మాత గాన

వ్యయము ఎంత ఐన వారించ బోదింక

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి.

 

42.)అమ్మ కడుపు జూచి అడుగును తినగను

ఆలి గూడ జూచు అడుగ బెట్ట

అమ్మ ఆలి నడుమ అంతర మదియేను

మిహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

43.)అతివ పృథ్వి నందు అమ్మగ జన్మించి

సంతు గనుచు నుండి సాదు చుండ

వేరు దైవ మేది వెతుకను గనబోము

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి.

 

44.)తప్పు జేయ నుండ తనయుని దరిబిల్చి

తల్లి గొట్టు సుతుని తానె ఏడ్చు

మాత మనసు యెంతొ మండ్రాడు జూడగ

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

45.)స్వాప తేయ మనగ సరిపోను లేకను

తనయు జెందు బాధ తల్లి జూసి

దాచు కున్న సొమ్ము దనయున కిచ్చును

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి.

 

46.)కొడుకు పిల్ల లందు కొండంత ప్రేమతొ

తల్లి ముద్దు లాడు తన్వి దీర

నాయ నమ్మ నయితి ననుచును హర్షించు

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

47.)తనకు సమము గుండ తనయుండు బెరిగిన

తల్లి జూడ బోదు తనయు నందు

పెద్ద తనము అంటు ప్రేమకు అడ్డని

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి.

 

48.)పెద్ద కంచ మందు పెట్టదు అన్నము

దిష్టి తగులు నంటు దిగులు తోడ

తనయు లందు జూపు తల్లిది ప్రేమది

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

49.)కొడుకు రసన రుచులు కోరగ వెంటనె

తల్లి వండి పెట్టు తడయ కుండ

అమ్మ ప్రేమ అంటె అదియేను పుడమిన

మహిలొ మిన్న యన్న మాతృమూర్తి

 

50.)మాతృ ప్రేమ జూడ మహినిండి యుండగ

ఆక సంబు హద్దు అనను లేము

అమ్మ ప్రేమ అంటె అదియేను స్వర్గము

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి


51.)తల్లి బెంచ బూను తనయల తనయుల

ఏక తీరు గుండ ఎరుగ నుండ

ఈర్ష్య గలుగ కుండ ఇద్దరి యందున

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి.

 

52.)పుడమి నందు అమ్మ పుత్రుల గనుచును

ప్రేమ పాలు బోసి పెంచు చుండు

బుద్ధు లెన్నొ నేర్పి బుధులను జేయును

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

53.)చలికి వణుక కుండ చంకన ఎత్తుక

అమ్మ బిడ్డ లందు అమిత ప్రేమ

అంబ రాంత మంత అనుకూల మనిగప్పు

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి.

 

54.)సంతు ఆట పాట సరిగను నేర్వగ

అమ్మె వెంబ డుండి అన్ని జెప్పు

ఉర్వి యంత ఓర్పు ఉండగ తల్లికి

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

55.)సుతుకు స్వస్థ తంటు సుంతయు జెడినను

కూడు ముట్ట కుండ కుములు తల్లి

మేను బాగు గాగ మెరియును ముఖమందు

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

56.)తల్లి భుజము మీద తనయలు చీయేసి

ఆడు కొనగ బూన అమ్మ కెంతొ

తనివి గలుగు చుండు తనయల పైనను

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

57.)అమ్మ వెంట తనయ అమ్మమ్మ ఊరికి

తాను వత్తు నంటు తగవు జేయ

అమ్మ బొందు నెంతొ ఆనంద మనగను

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

 

58.)ముందు చూపు తోడ ముదముతొ తల్లియె

తామ రసము గొనుచు దాచు యింట

వివహ మందు నీయు విషయము ఎరుగుచు

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

59.)తల్లి చెంత పాలు తాగెడు పిల్లలు

తల్లి మెడలొ ఉండు తాళి తడుమ

పగడ మొక్క టుంచు పరిశేష ణుంచక

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి.

 

60.)దారి లోన ఆడ ధర్మము గాదంటు

తల్లి బుద్ధి జెప్పు తనయు లకును

అదియె అమ్మ నేర్పు అనువైన పాఠము

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

61.)బుద్ధు లెన్నొ జెప్పు బుధులను జేయగ

తల్లి పుడమి నందు తనయు లకును

తల్లి మురియు నింక తనయుడు ఘనతన

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

62.)కోడి పిల్ల గద్ద కొనబోవ వచ్చిన

నింగి కైన కోడి నిలువ కెగురు

తల్లి ప్రేమ అదియె తార్క్ష్యము అయినను

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

63.)వివహ మయెడు వరకు విడువక తల్లియె

సంతు అవస రంబు సరిగ జూచు

వివహ అయిన తడవె విడుచును పట్టింపు

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

64.)సుతిని జూచు ఎపుడు సుతులును బాగుండ

కష్ట మేది రాగ కరక రిపడు

మాతృ హృదయ మన్న మహిలోన మహిమయె

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

 65.)తండ్రి కోప గించ తల్లియె అడ్డొచ్చు

సుతుల గొట్ట కుండ జూచు చుండు

సుతుల మంద లించు సున్నిత చూపుతొ

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

66.)మాతృ హృదయ మెంతొ మమకార మొందుచు

సతము సుతుల యందె చనువు గుండు

ఇతర యోచ నేది ఇసుమంత గనబోదు

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

67.)సతిప తులలొ తగవు సతతము ఉన్నను

సుతుల యందు ప్రేమ సుంత యైన

తగ్గ బోదు జూడ తల్లికి హృదయాన

మహిలొ మిన్న యన్న మాతృ ప్రేమ

 

68.)తల్లి దిట్ట బోదు తనయుల నెపుడును

దోష మెరుగు మాట దోన యంత

ఏమి చెడుపొ అనుచు ఎదలోన దలుచుచు

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

69.)అరుబ దేండ్ల సుతుడు అయినను సృత్వరి

క్షేమ మేను గోరు క్షేత్ర జందు

అదియె తల్లి ప్రేమ అనగను జగమున

మహిలొ మిన్న యన్న మాతృ మూర్థి

 

70.)బాల కృష్ణు కైన బాగుగ సద్దిని

ఆల మంద లందు ఆడి తినగ

అమ్మ గట్టి యిచ్చె అదియెంత ప్రేమనొ

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

71.)తల్లి మనసు నందు తనయులు అందరు

భేద మెంచ కుండ బెంచు చుండు

అధిక ఆక లనగ అదియును గనిపెట్టు

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

 72.)తనయు లొకరి కొకరు తగవులు ఆడగ

సహన మెంతొ గలిగి సమసి పోను

తల్లి మంద లించు తగుతీరు సుతులను

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి.

 

73.)కన్న తల్లి బెంచు క్రమశిక్ష నిచ్చుచు

కొడుకు లెదుగు టందు కోరి నట్టు

అమ్మ లేని కొడుకు అవనిలొ మృగమేను

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

 74.)అవని అమ్మె మొదలు అటుపైన ఇతరులు

ప్రేమ నిధుల తోడ బెంచ నుండు

తరుగు లేని ఇంపు దలువగ తలిచెంతె

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

75.)నిధులు ఎన్నొ చేత నిలిచియు ఉన్నను

ప్రేమ నిధులు లేక పెరుగ బాధ

అమ్మ ప్రేమ లుండు అవనిన నిధులన

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

76.)అమృత భాండ మంటె అదియుండు తలిచెంత

నిండు ప్రేమ యుండి నిలుచు నెపుడు

అమ్మ పంచు చుండు అదియేమి కుదియక

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

77.)ప్రేమ కెన్ని యేని పేర్లుయు ఉన్నను

అమ్మ ప్రేమ స్థిరము అవని యందు

ఇతర ప్రేమ లన్ని ఇంకును ఎపుడోను

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి.

 

78.)దేశ మందు ప్రభువు దెసలన్ని పాలించ

అమ్మ దృష్టి యందు అతడు కొడుకె

అమ్మ పెంపు వలెనె అతడును రాజాయె

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

 79.)ఏక వింశ తనియు ఏకాంగు డవతార

మెత్తె నమ్మ కడుపు మేది నందు

అమ్మ ప్రేమ రుచులు అందుట కొరకేను

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి.

 

80.)కోప మనెడు మాట కొద్దిదె తలియందు

అదియు సుతుల గొడవ అణచు కొరకు

మిగత సమయ మందు మీరను పోబోదు

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

81.)శక్తి మించి పనులు శాలిని జెప్పిన

తల్లి జెప్ప బోదు తనయు కెపుడు

తల్లి మదిలొ ఎపుడు తనయుండు సుకుమారె

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

82.) నలుగు పిండి తోటి నగజాత సృష్టించె

పుష్టి కాంతు డనుచు పుష్ఠి నిలిపి

మంద రమణి జంప మరిపోరి బతికించె

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

83.)లవుడు కుశుడు దెలియ లావగు శూరులె

తండ్రి చెంత పంప తల్లి సీత

బాగ బతిమి లాడె పాత్రము యెరుగంగ

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

84.)మతము కులము అంటు మంకుతొ ఉన్నను

ప్రేమ పెళ్ళి జేయ పెద్ద మనసు

తల్లి కేను ఉండు తనయుల పైనను

మహిలొ మిన్న యన్న మారృ మూర్తి.

 

85.)మంచి పేరు బెట్టు మంచిది దినమని

అమ్మ నాన్న కన్న అనియె బిలుచు

అమ్మ ప్రేమ యెంతొ అందరు ఎరుగంగ

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

86.)బోసి నవ్వు జూసి భోంచేయ కుండను

తల్లి గనును తనయు తన్వి జెంది

ఆక లెరుగ బోదు ఆడుచు నుండును

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

 87.)ఆట పాట నేర్పి అల్లరి మాన్పించు

మొదటి గురువు గుండి మోద మొంది

సుగుణు లనగ జేయ సుతులను తల్లియె

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

88.)స్వార్థ చింత నేది సమకూర కున్నను

సుతులు బుట్ట గానె సుంత గలుగు

అదియె అమ్మ మనసు అవనిన సుతులందు

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

 89.)పాచి పనులు జేస్తు పక్కన గూర్చుండ

బెట్టు కొనును సుతుల బెంగ లేక

ఇంట నుంచి రాను ఇరకాట మనుకుంటు

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి.

 

90.)క్షోణి తలము నందు క్షోభలు ఎన్నున్న

మాతృ ఒడిన సుతులు మాత్ర ముంద్రు

కష్ట మంటె ఏమొ కనకను సతతము

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

 91.)అంద లంబ నగను అమ్మది ఒడియేను

సుతులు మెచ్చు చుండ సురభి యందు

అంత గొప్ప తేరు అవనిన కనబోము

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

92.)రాజు ప్రభువు ఇంక రారాజు ఎన్నన్న

అవని యందు సుతుడె అమ్మ చెంత

అమ్మ ఇచ్చు బిరుదు అదియేడ గనబోము

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

93.)వేది కెక్కి సుతుడు వేదాలు జదివిన

అమ్మ సంబు రంబు అందు నింగి

అదియె అమ్మ ప్రేమ అవనిన జూడగ

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి 

 

94.)దాన ధర్మ మంటు దనయుడు దల్వగ

తల్లి కెంతొ ప్రీతి తనయు నందు

లోభి గాక మెలుగ లోకము నందున

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

95.)భరువు కంచ మైన బరువగు సితగిన్నె

కయిన అమ్మ చేత కలిపి పెట్ట

అదియె అమృత మనగ అవనియె స్వర్గము

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

96.)ముందు బతుకు నందు ముప్పును గనిపెట్టి

అమ్మ నేర్పు చుండు అణిగి యుండు

విధము సుతులు సుతలు వినుచును పాటించ

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

97.)మనుషు లందె గాదు మరియింక మహిలోన

మృగము పక్షు లందు మృగ్య మనక

ప్రేమ గలిగి యుండు పెరుగను జీవులు

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

98.)అమ్మ లేని జీవి అవనిన గనబోము

అమ్మె విశ్వ మందు అనుగు మూర్తి

ప్రేమ నుండె జీవి పెరుగుచు ఉండును

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి 

 

 99.)అమ్మ ప్రేమ లేక అసురుల జాతైన

పెరుగ బోవు పృథ్వి పెద్ద గాను

జాలి కరుణ యన్న జగమున తలిచెంతె

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

100.)పుణ్య కార్య మెంచ పుడమిన తనయులు

తల్లి దీవ నొంది తరల సుఖము

అమ్మ దీవె నుండ అగునింక జయమేను

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి.

 

101.) కూడు గుడ్డ లేక కుదులుచు తల్లియు

తనయు చంక దింపి తరల బోదు

కూలి పనియు జేస్తు కూర్చొన బెట్టును

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

102.)పాఠ శాల యందు పఠనము జేయను

తనయు డరుగు చుండ తల్ల డిల్లి

జాగ్ర తంటు జెప్పు జననియె పలుమార్లు

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి.

 

103.)వేకు వందు లేచి వేడగు నీ ళ్ళతొ

ఒడలు రుద్ది బోసి ఒనర సుతుల

బడికి సిద్ధ పరచి బంపును అమ్మయె

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

104.)మాతృ గాత్ర మందు మలమూత్ర మంటగ

సహన మెంతొ దలచి సంతు నెంతొ

శుభ్ర పరచ బూను సుతినియె ప్రేమతొ

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

105.)భర్త దేవు డంటు భార్యయె అనుచండ

అట్టి భర్త తోటె అక్క సనును

తనయు నందు కినుక తండ్రియె బూనంగ

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి.

 

106.)వీర నారు లనగ వీపున పుత్రుతొ

అశ్వ మెక్కి పోరు అనగ సల్ప

వారి పేరు చరిత వాసికి ఎక్కంగ

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి.

 

107.) అన్య దేశ మరిగి అర్థము నార్జించ

అడ్డు జెప్ప బోదు అమ్మ మనసు

తనకు కష్ట మైన తానేను పురిగొల్పు

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి

 

108.)కొడుకు ఖ్యాతి నెపుడు కోరుచు తల్లేను

తనది చేవ యంత దార బోయు

సంప్ర సారు డైన సంతోష పడుచుండు

మహిలొ మిన్న యన్న మాతృ మూర్తి.

                                                          

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


Comments


bottom of page