#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #MathrumurthiMeliMatalu, #మాతృమూర్తిమేలిమాటలు, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 10
Mathrumurthi Meli Matalu - Somanna Gari Kavithalu Part 10 - New Telugu Poems Written By - Gadwala Somanna Published In manatelugukathalu.com On 30/01/2025
మాతృమూర్తి మేలి మాటలు - సోమన్న గారి కవితలు పార్ట్ 10 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
అక్షరాల వెలుగులో
అజ్ఞానం తుడుచుకో!
అంతులేని ఆనందము
జీవితాన నింపుకో!
పుస్తకాల పఠనంతో
మస్తకం వెలిగించుకో!
మహనీయుల స్ఫూర్తితో
ఆశయాన్ని చేరుకో!
సత్సంబంధాలతో
సమాజాన వెలిగిపో!
సత్కార్యాలతో
జనం మదిలో మిగిలిపో!
కీర్తినిచ్చు పనులతో
చరిత్రలో ఉండిపో!
స్ఫూర్తినిచ్చు పలుకులతో
మహాత్ముల్లో చేరిపో!

ఎందుకు! ఎందుకు!! ఎందుకు!!!
----------------------------------------
పూవులు లేని తోటలు
రాజులు లేని కోటలు
ఎందుకు!ఎందుకు!!ఎందుకు!!
ఉపకరించని మాటలు
తారలు లేని రాత్రులు
తావులు లేని పూవులు
ఎందుకు!ఎందుకు!!ఎందుకు!!
పిల్లలు లేని గృహములు
మమతలు లేని మనసులు
మంచి చేయని మనుషులు
ఎందుకు!ఎందుకు!!ఎందుకు!!
విలువలు లేని బ్రతుకులు
ఫలములు లేని తరువులు
ప్రకాశించని ప్రమిదలు
ఎందుకు!ఎందుకు!!ఎందుకు!!
సంస్కారమివ్వని చదువులు
కలువలు లేని కొలనులు
వలువలు లేని తనువులు
ఎందుకు!ఎందుకు!!ఎందుకు!!
నెమ్మది లేని బ్రతుకులు
సహకరించని చేతులు
వట్టిగా వాగే జిహ్వలు
ఎందుకు!ఎందుకు!!ఎందుకు!!
నవ్వులు విరియని ముఖములు

పిల్లల ప్రతిన!
----------------------------------------
మొక్కలెన్నొ నాటుతాం
పచ్చదనము పంచుతాం
అక్కరలో సాయపడి
చుక్కల్లా వెలుగుతాం
శ్రమదానం చేసేస్తాం
పరిశుభ్రత పాటిస్తాం
పెద్దలను గౌరవించి
వినయాన్ని చూపిస్తాం
దేశకీర్తి నిలబెడుతాం
దేశభక్తి చూపెడుతాం
ఎచ్చోటికి వెళ్ళినా
అచ్చోట ఎదిగేస్తాం
నీతినే కల్గియుంటాం
జ్యోతిలా ప్రకాశిస్తాం
ప్రీతినే పంచిపెట్టి
భీతినే తరిమిస్తాం
నిప్పులాగ జీవిస్తాం
నిజాయితీని చాటుతాం
క్రమశిక్షణ కల్గియుండి
కాంతిపుంజమవుతాం
చదువులెన్నో చదువుతాం
జీవితాన ఎదుగుతాం
దేశానికి పేరు తెచ్చి
భరతమాతను మెప్పిస్తాం

ఆశల పందిరి
----------------------------------------
వికసించిన పువ్వుల్లా
నవ్వులు వెదజల్లుతాం!
వెలుగుతున్న దివ్వెల్లా
చీకటిని తరిమేస్తాం
నింగిలోని తారల్లా
జగతిలోన వెలుగుతాం
ప్రవహించే యేరుల్లా
నలుగురికి సాయపడతాం
సరిహద్దు సైనికుల్లా
త్యాగగుణము చూపిస్తాం
తెలుగు వెలుగు ప్రేమికులై
మాతృభాష రక్షిస్తాం
కలం చేత పట్టుకుని
కావ్యాలు వ్రాసేస్తాం
కవన వనంలోన మేం
కలకాలం జీవిస్తాం
పూలలోని తావిలా
పాలలోని తెలుపులా
పదిమందికి కనిపిస్తాం
ఎద ఎదనూ మీటుతాం

గురుదేవులు పూజ్యులు
----------------------------------------
పగటిపూట భానుడు
రాత్రివేళ చంద్రుడు
గురువంటే జ్ఞానము
కనిపించే దేవుడు
చూపించును మార్గము
చేర్చు తుదకు గమ్యము
లోపాలు సవరించి
బాగుచేయు జీవితము
వెలుగులీను దీపము
ప్రేమకు ప్రతిరూపము
క్రమశిక్షణ నేర్పించి
కల్పించు ఘన స్థానము
నేర్పును అక్షరాలు
మార్చును తలరాతలు
పాఠాలు బోధించి
దిద్దును జీవితాలు
గురువు లేని చదువులు
వట్టి ఎండమావులు
గాలిలోని రాతలు
నీటి మీద బుడగలు
పూజనీయుడు గురువు
భువిలో కల్పతరువు
సంస్కారమందించి
నిలబెట్టునోయ్! పరువు
ఎదిగితే విద్యార్థులు
సంబరపడి పోతాడు
ప్రయోజకులైతే
పరవశించి పోతాడు
గురువును గౌరవించు
దొరుకునోయ్! దీవెనలు
మనసారగ సేవించు
బాగుపడును బ్రతుకులు

నిజమే కదా!!
---------------------------------------
పసి పిల్లలు నవ్వితే
సిరిమల్లెలు విరిస్తే
కనువిందే చేయదా!
జాబిలిని తిలకిస్తే
వృక్షాలను పెంచితే
మమకారం పంచితే
నందనవనం కాదా!
సమ సమాజం రాదా!
ఘన కార్యాలు చేస్తే
జన హితమే కోరితే
సంబరాలు జరుగవా!
సమైక్య గీతి పాడితే
కలహాలే వీడితే
కలసిమెలసి బ్రతికితే
జగతి ప్రగతి పెరుగదా!
చేయి చేయి కలిపితే

మనోభిలాష
---------------------------------------
ఆధ్యాత్మిక క్షేత్రంలో
ఆ దేవుని నీడలో
యేరు ప్రక్క మొక్కలా
వర్ధిల్లుము బ్రతుకులో
గురువు చూపు దారిలో
వారి చేయు బోధలో
అనుకున్నది సాధించు
ఉన్నతంగా విద్యలో
కన్నవారి సేవలో
భగవంతుని భక్తిలో
గడపాలోయ్! అనుదినము
కావాలోయ్! సార్ధకము
ఇలవేల్పు సన్నిధిలో
వారి గొప్ప కరుణలో
తలరాతలు మారాలి
మనశ్శాంతి పొందాలి

ప్రాస పద గేయము
---------------------------------------
అమూల్యమైన చెలిమి
అదే తరగని కలిమి
శ్రేష్టమైనది చూడ
జీవితాల్లో బలిమి
అందమైనది ఊరు
దాని ప్రక్కన యేరు
ఏడాది కొకమారు
ముస్తాబగును తేరు
ఇంటి దీపము తల్లి
భువిని ద్రాక్షావల్లి
మనసెంతో గొప్పది
పరిమళించే మల్లి
ఆకాశాన చుక్క
మా ఇంటిలో అక్క
అవనిలో పరుకింప
అనురాగాల మొక్క

మహా ఘనుడు దేవుడు
---------------------------------------
దైవాన్ని నమ్మితే
ఎన్నడూ చెడిపోడు
ముంగిట ప్రణమిల్లితే
కరుణించే దేవుడు
మనసులోని శంకలు
పాడుచేయు బ్రతుకులు
నమ్మిక బహు గొప్పది
కల్గియున్న మంచిది
దేవునితో ఆటలు
తగలబెట్టు నిప్పులు
కాదు కాదు క్షేమము
అదే పెను ప్రమాదము
సృష్టిలోన దైవము
కాంతులీను దీపము
కరుణకు మారు పేరు
భక్తుని మేలు కోరు

నిత్య సత్యాల సరాలు
---------------------------------------
కీర్తితెచ్చును గళము
కడుపునింపును ఫలము
అన్నదాతల ఆస్తి
పంటనిచ్చే పొలము
అనుసరిస్తే నీతి
వచ్చి తీరును ఖ్యాతి
అక్షరాల సత్యము
మంచితనమే జ్యోతి
మానవత్వం ధనము
నూరు శాతము నిజము
కల్గియుంటే మదిని
గౌరవించును జనము
మస్తకాలకు ఎరువు
భువిని కామధేనువు
పూజనీయుడు మహిని
జ్ఞానమిచ్చును గురువు
***
-గద్వాల సోమన్న
Bình luận