మెరిసే పుట్టగొడుగులు
- Pulletikurthi Krishna Mohan
- Sep 4
- 10 min read
#KrishnaMohanPulletikurthi, #పుల్లేటికుర్తికృష్ణమోహన్, #మెరిసేపుట్టగొడుగులు, #MerisePuttagodugulu, #TeluguCrimeStory, #హర్రర్

Merise Puttagodugulu - New Telugu Story Written By - Krishna Mohan Pulletikurthi
Published In manatelugukathalu.com On 04/09/2025
మెరిసే పుట్టగొడుగులు - తెలుగు కథ
రచన: కృష్ణమోహన్ పుల్లేటికుర్తి
నల్లమల ఫారెస్ట్, సమయం మధ్యాహ్నం మూడు గంటలు.
జీప్ మెల్లగాఆత్మకూర్ వైపు వెళ్ళసాగింది.
ఫారెస్ట్ గార్డ్ దృష్టంతా రోడ్డు మీద పెట్టి డ్రైవ్ చేస్తున్నాడు.
“అంత సీరియస్ గా డ్రైవ్ చేస్తున్నావేంటి, తెలిసిన రోడ్డే కదా” అడిగాడు ప్రొఫెసర్ రాజగోపాల్.
“సార్. ఎంత తెలిసిన రోడ్డయినా చాలా ప్రమాదకరమైంది, అప్పుడప్పుడు రోడ్డు మీదకి ఏవో జంతువులు అడ్డంగా వస్తుంటాయి. బండికికూడా చిన్న ప్రాబ్లం ఉంది ”
ప్రొఫెసర్ రాజగోపాల్ రోడ్డుకి ఇరువైపులా ఉన్న అడవి అందాలని చూస్తున్నాడు. ఆకుపచ్చ చీర కట్టిన అందమైన యువతిలా మనోహరంగా ఉంది నల్లమల. చుట్టూ ఎత్తైన కొండలు, మహావృక్షాలు, జలపాతాలు. మధ్యన ఈ దారి.. ఆహా అద్భుతం. ఎప్పుడూ వినడమే గానీ చూడలేదు.
నల్లమలలో దొరికే వనమూలికలు, ఔషదమొక్కలు, చెంచుల జీవన విధానం, వాళ్ళ ఆరోగ్య సమస్యలు, పరిశీలించడానికి ఆంధ్రాయూనివర్సిటీ బాటనీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడకు పంపించారు. ఈ అవకాశం కోసం ఎందరో ఎదురు చూశారు, కానీ తనకి వచ్చింది. తన కన్నా ఎక్కువ అర్హతలు ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ వయసు కొంచం ఎక్కువ, ఆ కారణంగా తనని ఎంచుకున్నారు.
నిజం చెప్పాలంటే వైస్ ఛాన్సలర్ తో ఉండే స్నేహం ఒక కారణం. లేక పోతే ఈ అవకాశం రావాల్సింది లేడీ ప్రొఫెసర్ బృందాకి.
“సార్ ” అన్న పిలుపుతో ఏమిటన్నట్టు ప్రక్కకు చూశాడు.
“విశాఖపట్నం నుండి ఇక్కడకు వస్తున్నారని మా ఫారెస్ట్ రేంజర్ గారు చెప్పారు ఎందుకో తెలుసుకోవచ్చా ”
“నేను ఆంధ్రాయూనివర్సిటీలో బాటనీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను, నల్లమల ఫారెస్ట్ లో ప్రజలను, ఇక్కడ వాతావరణాన్ని పరిశీలించడానికి మా డిపార్ట్మెంట్ వాళ్ళు పది రోజులకి ఇక్కడకు పంపారు.
గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఉంది. అందుకే నిన్ను నాతో పంపారు. నువ్వే నాకు ఈ అడవిని పరిచయం చేయాలి.”
“సార్, ఇంతకు ముందు చాలా మంది వచ్చి, అనేక పరిశోధనలు చేశారు. నివేదికలు ఇచ్చారు. కానీ, ఇక్కడ ప్రజలలో పెద్ద మార్పేమీ లేదు సార్.”
విచిత్రమైన శబ్ధంతో జీప్ ఆగింది. ఎదురుగా ఒక నిండు గర్భిణీని డోలీ లో మోసుకుంటూ రోడ్డు దాటుతున్నారు కొంతమంది చెంచులు.
“ఆమెను ఆత్మకూరు హెల్త్ సెంటర్ కి తీసుకు వెళ్తున్నట్టున్నారు మనం వెళ్ళేది అదే త్రోవ కదా జీప్ లో తీసుకు వెళ్దాం ”
“కాదు సార్. ఇక్కడి వాళ్ళు ఇంగ్లీష్ వైద్యాన్ని నమ్మరు”
“మరెలా”
వాళ్ళ వైద్యుడు వేరే ఉన్నాడు. ఎటువంటి జబ్బుకైనా వైద్యం చేస్తాడు. అతని దగ్గరే పురుడు పోయడానికి మహిళలు కూడా ఉన్నారు. పట్నంలోలా ప్రతీ చిన్న దానికి ఆపరేషన్లు, డబ్బులు, మోసాలు ఉండవు. కడుపుమీద ఏదో పసరు పూస్తారు అంతే..”
“నాటు వైద్యం చాలా ప్రమాదం, కొన్ని సార్లు ప్రాణాలు పోతాయ్ కూడా ” ఆవేదనగా అన్నాడు.
“ఇంతవరకూ ఏ ప్రమాదమూ జరగలేదు, నేను కూడా అతని దగ్గరకు వెళ్ళాను సార్”.
ఎందుకన్నట్టు చూశాడు.
“కడుపు ఎప్పుడూ ఉబ్బరంగా ఉండేది. సంవత్సరం, ఇంగ్లీష్ మందులు వాడా లాభం లేదు. సిర్రోసిస్ ఆఫ్ లివర్ అన్నారు. అప్పుడు కలిశాను. ఏవో మూడు చూర్ణాలు ఇచ్చాడు. ఆరునెలలు వాడమన్నాడు. రెండునెలలలోనే గుణం కన్పించింది. పథ్యం మాత్రం గట్టిగా ఉంటుంది సార్. అప్పటి నుండి ఇంట్లో తప్పా బయట ఎక్కడా తినను. జీవితాంతం వేపుడు వంటలు తినకూడదని చెప్పాడు. ” చక చకా చెప్పుకు పోతున్నాడు.
“తాగుడు అలవాటుందా”
“ఒకప్పుడు బాగా ఉండేది, ఇప్పుడు లేదు సార్”
“అదే పథ్యం తీసుకొని ఇంగ్లీష్ మందులు వాడితే తగ్గేది కదా, ఇంగ్లీష్ మందులంటే పథ్యం పాటించరు. అదే సమస్య. ”
అతన్ని పరిశీలనగా చూశాడు, వయసు సుమారు యాబై ఉంటుంది. తలపై డెబ్బై శాతం రాలిపోయింది. బాణపొట్ట చూస్తుంటే, జబ్బు తగ్గినట్టు లేదు. పథ్యం వలన రిలీఫ్ ఇచ్చింది అంతే.
“నేనే కాదు సిటీ నుండి కూడా చాలా మంది వస్తుంటారు. అతను మామమూలు మనిషి కాదు సార్. అందరూ అతన్ని అడవి దేవుడంటారు.”
“అతని పేరు”
“కన్నప్ప”
*
సమయం సాయంత్రం 4 గంటలు.
వాతావరణం చల్లగా ఉంది, ఇంకా ఆత్మకూరు 10 కిలో మీటర్లు ఉందనగా జీప్ చిన్న మలుపు తిరిగింది. అక్కడ రోడ్డు ప్రక్కన ఒక టీ బడ్డీ ఉంది.
“ఆపండి టీ తాగుదాం”
“మీరు తాగండి సార్, నేను తాగను” మెల్లగా జీప్ ఆపాడు.
రాజగోపాల్ వళ్లు విరుచుకుంటూ దిగాడు. ఇలాంటి ప్రాంతంలో టీ తాగడం ఒక మంచి అనుభూతిలా ఉందతనికి. ఫిబ్రవరి నెల కావడంతో బాగా చలిగా ఉంది. ముఖం మీద నీరెండ పడసాగింది.
టీబడ్డీ చిన్నదే కానీ, చాలా నీట్ గా ఉంది, చెక్కబెంచ్ మీద ముగ్గురు టీ తాగుతున్నారు.
“సార్ టీ కావాలా ? అన్నాడతను. అవునన్నట్టు తలూపాడు.
గాజు గ్లాసులో టీ డికాక్షన్ వేసి ఇచ్చాడు అతను.
ఇదేమిటన్నట్టు చూశాడు.
“పాలు దొరకవు సార్” అన్నాడు.
చల్లటి వాతావరణంలో ఏదో ఒకటి వేడిగా.. అనుకున్నాడు.
ఇంతలో నలుగురు వ్యక్తులు పొడవాటి కర్రలు పట్టుకొని రోడ్డు మీద వెళ్తున్నారు.
“ఈ మధ్యన కొంతమంది పై చిరుత దాడి చేసింది, అప్పటి నుండి సాయంత్రం అయితే సింగిల్గా ఎవరూ వెళ్లరు. ”
ఆశ్చర్యంగా చూశాడు రాజగోపాల్.
జీపెక్కారు.
చీకటి పడకుండా చేరుకోవడం మంచిది, గొణుక్కున్నాడు.
ఊరుచేరేవరకు ఇద్దరూ మాట్లాడుకోలేదు.
“సార్ గెస్ట్ హౌస్ వచ్చింది. మీరు ఇక్కడే ఉండాలి. రేపు ఉదయం 10 గంటలకు వస్తాను.”
“థాంక్స్. బండి బాలేదన్నావు కానీ కరెక్ట్ గా తీసుకొచ్చావు. ఇంతకీ నీ పేరు చెప్పలేదు ”
“వీర్రాజు ”
***
మరునాడు ఉదయం పదిగంటలకు, గెస్ట్ హౌస్ ముందు రెడీ గా ఉన్నాడు వీర్రాజు.
హడావుడిగా రెడీ అయ్యి వస్తున్నాడు రాజ గోపాల్. అతని వయసు సుమారు ముప్పై అయిదు ఉంటుంది. చామనచాయ రంగయినా చూడ్డానికి బానే ఉంటాడు. మంచిగా కనిపిస్తాడు, ఎటువంటి వాడో తెలియదు.
“వెళ్దామా వీర్రాజు ” అంటూ జీపెక్కాడు రాజగోపాల్. ఆలోచన నుండి బయటపడ్డాడు.
“దగ్గరలో మంచి హోటల్కి పదా, నిన్నటిలాంటి బడ్డీ కొట్టు వద్దు సుమా”
“ఇక్కడ దగ్గరలో రాజుగారి కాలనీ ఉంది సార్, అక్కడ మంచి హోటల్ ఉంది, అన్నీ దొరుకుతాయి.”
వీర్రాజు హోటల్ బయటే ఉన్నాడు, హోటల్ లో ఏమీ తినడు. బయట ఫుడ్ మానేసి చాలా కాలం అయింది.
టిఫెన్ చాలా బాగుందంటూ బయటకు వచ్చాడు రాజగోపాల్.
“మధ్యాహ్నం అయితే బొంగులో చికెన్ కూడా దొరుకుతుంది.”
”అయితే మధ్యాహ్నం ఇక్కడకే వద్దాం, ఇప్పుడు మాత్రం కన్నప్పను కలవాలి. అక్కడకు పదా ”
గిద్దలూరు వైపు బయల్దేరారు, రోడ్డు కిరువైపులా పెద్ద పెద్ద చెట్లు దగ్గర దగ్గరగా ఉండడం వలన ఎండ పెద్దగా పడడం లేదు. చుట్టూ పరిశీలిస్తున్నాడు రాజగోపాల్.
“రాత్రి గెస్ట్ హౌస్ లో బాగా నిద్ర పట్టిందా సార్ ”
“రాత్రంతా ఒకటే గొడవగా ఉంది, వెనుక రూంలో ఎవరో కుర్ర బ్యాచ్ ఉన్నట్టున్నారు. వాళ్ళతో ఎందుకని ఊరుకున్నాను”
“సార్ ఇక్కడది మామూలే. దగ్గరలో టూరిజం ప్లేస్లు, పవిత్ర దేవాలయాలు ఉండడం వలన చాలా మంది, బ్యాచ్లుగా వస్తుంటారు.” ఆగాడు.
“అంతే కాదు, కాకతీయ రాజులు ఇక్కడ నిధులు దాచారని కొంత మంది నమ్మకం.”
“అయితే నిధులు దొరుకుతాయా ?” ఆత్రంగా అడిగాడు.
“లేదు సార్, కానీ కొంత మంది దొంగ స్వామీజీలు అంజనం వేసి ఫలానా ప్రాంతాలలో గుప్తనిధులు ఉన్నాయని చెపుతారు. అది నమ్మి కొంత మంది రాత్రి పూట త్రవ్వకాలు జరిపి ఏమీ దొరక్క నిరాశతో తెల్లమొకం వేస్తారు. కొంతమందైతే చచ్చిపోతారు. ” ఆపాడు.
“ఎలా చచ్చిపోతారు ” అడిగాడు రాజగోపాల్.
“పాము కాటుకి. ఇక్కడ అనేక క్రూర జంతువులతోపాటూ చాలా విషసర్పాలు కూడా ఉన్నాయి. కొంత మంది స్వార్ధపరులు అడవిలో చేసే కార్యకలాపాల వలన అవి తరచుగా మనుషుల మధ్యకు వస్తుంటాయి”.
మాటల్లోనే కన్నప్ప ఉన్న తండాకు చేరుకున్నారు.
ఎత్తైన ప్రదేశంలో ఒక ఆశ్రమంలా ఉంది. ఒక రకమైన ప్రశాంతతతో పాటూ సువాసనతో కూడిన గాలి శరీరం మీద నుండి మెల్లగా తాకుతుంటే కొత్త ఉత్సాహం శరీరంలో ప్రవేశిస్తున్నట్టు ఉంది. రాతితో చేసిన మెట్లమార్గంలో పైకి వెళ్తున్నారు.
త్రోవలో అనేక ఆయుర్వేద మొక్కలు లోనికి ఆహ్వానిస్తున్నట్టు ఉన్నాయి, పట్టణాలలో కనిపించే కాగితప్పూలచెట్టు మొదలు అశ్వగంధ, గలిజేరు, శతావరి, భృంగరాజ్, అనేక ఆయుర్వేద మొక్కలు కనిపించాయి. ఎంత అనుభవం ఉన్నా కొన్ని మొక్కలు మాత్రం గుర్తించలేక పోయాడు రాజగోపాల్.
బయటకు పెద్ద పర్ణశాలలా ఉంది, లోపల విశాలంగా.. మట్టితో అలికిన నేల. కొంత మంది గ్రామ ప్రజలు, క్రిందనే కూర్చున్నారు. బహుశా వాళ్ళు పేషెంట్లు కావచ్చు.
ఎదురుగా ఆజాను బాహుడు “కన్నప్ప” కోయదొర ఆహార్యంలో ఉన్నాడు. ముఖంలో తేజస్సు ఉట్టి పడుతుంది. వయసు సుమారు యాబైఅయిదు పైన ఉంటుంది. అయినా, కండలు తిరిగిన శరీరం, ఒక్క చేత్తో పులిని చంపగల వీరుడిలా ఉన్నాడు.
అలికిడికి తమ వైపు చూశాడు.. రండి.. సాదరంగా ఆహ్వానించాడు, కూర్చోమని చాప చూపించాడు. సింహం మాటాడితే ఎలా ఉంటుందో అలా ఉంది అతని గొంతు.
రాజగోపాల్కి అర్ధం కాలేదు తనని చూడగానే అందరూ గౌరవిస్తారు, కానీ ఇతను కిందని కూర్చో మన్నాడు. వీళ్ళ పద్దతులు వేరు. అంటే తనని కూడా ఒక పేషెంట్ అనుకొని ఉండవచ్చు. సరే అని కిందని కూర్చోడానికి ప్రయత్నించాడు.. కానీ కాలేదు.
కన్నప్ప నవ్వుతూ “ఫర్వాలేదు నిలుచోండి” అన్నాడు.
ఇంతలో ఒక రోగి ఏదో చెప్తున్నాడు.. నాడి పట్టుకొని పరీక్షిస్తున్నాడు కన్నప్ప.
ఆశ్చర్యంగా చూస్తున్నాడు రాజగోపాల్.
“ఎండుచేపలు తింటున్నావా ” అడిగాడు.
అవునన్నట్టు నసిగాడు
“అవి మానమని ఎన్ని సార్లు చెప్పాను.. నీకిదే ఆఖరి మందు, మరివ్వను ” అంటూ మూడు మూలికలను దంచి అతనికి ఇచ్చి “ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వేసుకో ” చిరుకోపంతో అన్నాడు.
పరీక్షగా చూస్తునాడు రాజగోపాల్, రెండు మూలికలు తనకు తెలుసు.. అశ్వగంధ, అర్జున. మూడవది తెలియదు. గదంతా పరిశీలిస్తునాడు, విచిత్రమైన మూలికలు ఉన్నాయి ఒక దగ్గర ఎండిపోయిన పుట్టగొడులు కొన్ని ఉన్నాయి. కానీ కొంచం నీలంగా ఉన్నాయి. ఎందుకు ఉపయోగిస్తారో తనకు తెలియదు, అవి విషపూరితం అని తెలుసు.
“చెప్పండి దొరా ”
ఆలోచనల నుండి బయటకు వచ్చాడు. తాను వచ్చిన విషయం చెప్పాడు.
“చూడు దొర. మీకు చెప్పేంత గొప్పోడిని కాను.. కానీ ఇక్కడ వనమూలికల గురించి తెలుసుకోవాలంటే మన జీవితమంతా చాలదు. అన్ని రకాలు ఉన్నాయి. అయినా నాకు తెలిసినంత వరకూ.. మీరు ఇక్కడున్నంత వరకూ చెప్తాను. ఈరోజు రోగులు ఎక్కువ ఉన్నారు. రేపటినుండి రండి.” అన్నాడు.
“అలాగే కానీ నాకు చిన్న అనుమానం.. అక్కడ ఉన్నది పుట్టగొడుగులే కదా. వాటిని గురించి కొంచెం చెప్తారా ” ఉత్సాహంగా అడిగాడు.
“అవి నీలిరంగు పుట్టగొడుగులు. అడవిలో రాత్రి పూట చీకట్లో మాత్రమే కనిపిస్తాయి. తినడానికి పనికిరావు. కొన్ని మందులలో వాడతారు. మీరేమంటారో నాకు తెలియదు. మా భాషలో “కర్కరోగం”. నేను ఒక పద్దతిలో మందు తయారు చేసి ఒకరికి ఇచ్చాను, మంచి గుణం కనిపించింది. మాకు అన్ని రకాల పరీక్షలు తెలియవు దొరా. కేవలం లక్షణాలు తెలుసుకొని మందిస్తాను. రేపటి నుండి ఓ గంట సేపు మీదగ్గరకు వస్తాను ”
బయటకు నడిచారు ఇద్దరూ. అప్పుడు గమనించాడు సుమారు పన్నెండు సంవత్సరాలు వయసున్న పిల్లలు కొన్ని మూలికలను కవ్వం లో నూరుతున్నారు. ఆయన శిష్యులేమో అనుకున్నాడు. కానీ ద్వారం ప్రక్కనున్న లాండ్ లైన్ ఫోన్ గమనించలేదు.
*
ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాంబర్.
“సార్ నల్లమలకు నన్నే పంపిస్తారని ఎదురుచూశాను. కానీ చివర్లో రాజగోపాల్ని పంపారు” వైస్ ఛాన్సలర్తో నిష్టూరంగా అంది ప్రొఫెసర్ బృందా.
“అది కాదమ్మా. పది రోజులూ అడవిలో ఉండాలి, తిరగాలి. నీకవన్నీ కష్టం అని అతన్ని పంపించాను.”
ఆమె నమ్మదని తెలుసు. “అయినా నీకెందుకమ్మా అడవంటే అంత ఇంట్రెస్ట్”.
“ఇంట్రెస్ట్ కాదు సార్, ఇష్టం. నేను కూడా అదే ప్రాంతానికి చెందిన దాన్ని, నా చిన్నతనంలో అమ్మతో కలిసి అడవిలో కోవెలకు వెళ్తుంటే..” ఆమె కళ్లలో నీళ్ళు చూసి వైస్ ఛాన్సలర్ చలించిపోయాడు.
“ఎక్కడ నుండి వచ్చిందో ఓచిరుత, అమ్మపై దాడి చేసింది. దూరం నుండి చూసిన కొంత మంది కేకలు వేయడంతో చిరుత పారిపోయింది.. కొన ఊపిరితో ఉన్న అమ్మ.. ‘బాగా చదువుకో, ఊరికి చేతనైనంత మేలు చేయ’మని చెప్పి చచ్చి పోయింది. తరువాత మా నాన్న కూడ బెంగతో, చనిపోతే ఆ ఊరిలో ఉన్న ఒక దొర నన్ను పెంచి ఇంత దాన్ని చేశాడు. అందుకే నాకు అవకాశం ఉన్న అన్ని మార్గాలలో కూడా ఆ అడవికి సహాయం చేస్తుంటాను.
అడవి తల్లినే నా తల్లిగా భావించాను. ఇప్పుడు కూడా ఆ ఊరి గురించి, అక్కడ వసతుల గురించి, నివేదిక మీ ద్వారా ఇవ్వాలని మంచి ఉద్దేశంతో ఎదురు చూశాను సార్.”
ఆమె మాటలో నిస్స్వార్థం కన్పించింది.
“సారీ అమ్మా.. నీ వెనుక ఇంత కథ ఉందని నాకు తెలియదు. అతనిలానే సరదాగా టూర్ ప్లాన్ చేశావు, అని భావించాను. త్వరలోనే నిన్నక్కడికి నా స్పెషల్ రైట్స తో తప్పకుండా పంపిస్తాను, ”
“అతను మాత్రం సరదాగా టూర్ ప్లాన్ చేయలేదు, ఒక ప్లాన్ మీద వెళ్ళాడు సార్ ”
*
నాలుగు రోజులూ గడిచాయి. వీర్రాజు, రాజగోపాల్ అడవిలో చాలా వరకూ తిరిగారు. పురాతన రహస్య దేవాలయాల గురించి, అటవీ సంపదను దోచుకొనే దొంగల గురించి, చాలా తెలుసుకున్నాడు. మధ్యలో కన్నప్ప దగ్గర చాలా విషయాలు గ్రహించాడు.
“వీర్రాజూ.. ఈరోజు రాత్రి అడవిలోకి నన్ను తీసుకొని వెళ్లాలి ”
“సార్ ఎందుకు” ఆశ్చర్యంగా అడిగాడు.
“నీలిరంగు పుట్టగొడుగులకోసం”
“చాలా ప్రమాదం సార్, నాకు రేంజర్ గారు అనుమతివ్వరు”
“అందుకే నిన్న డుగుతున్నాను. దయచేసి సీక్రెట్గా అక్కడకు తీసుకెళ్లు”
చాలా సేపు బ్రతిమలాడిన తరువాత ‘వస్తాను గానీ.. జీపు మాత్రం దిగ’నని చెప్పాడు వీర్రాజు.
*
రాత్రి సుమారు 2 గంటలు..
చాలా పవర్ఫుల్ టార్చ్ లైట్ పట్టుకొని బయల్దేరారు.
వీర్రాజుకి అడవిలో రాత్రి వెళ్ళడం కొత్త కాదు, కానీ చాలా భయంగా ఉంది, అనధికారికంగా ఒకరిని అడవిలోకి తీసుకెళ్లడం.. అందులో రాత్రి. ఏదో జరగబోతుం దనుకున్నాడు.
“సార్ ఈ విషయం బయట పడితే నా ఉద్యోగం ఊడిపోతుంది ”
“మనిద్దరికీ కాక ఇంకెవరికి తెలుస్తుంది” నోరు తెరవగానే ఆల్కహాల్ వాసన గుప్పుమంది. “ఇంత రాత్రిలో అడవిలో ప్రయాణం అంటే నాకు కూడా భయమే ” కావాలంటే నువ్వు కూడా కొంచెం మాన్షన్ హౌస్ తీసుకో”
“నేను తాగను సార్.. జీవితంలో మళ్ళీ మందు ముట్టనని బాలెమ్మ తల్లి మీద ప్రమాణం చేశాను.”
గిద్దలూరు వైపు జీపు వెళ్తుంది.
“నువ్వు నాకు సహాయం చేస్తే జీవితంలో నువ్వు చూడనంత డబ్బు నీకిస్తాను ” ఆశపెట్టాడు రాజగోపాల్. మత్తులో ఏవేవో మాట్లాడుతున్నాడు.
చిన్న గాలితిమ్మెర కొట్టింది. వీర్రాజు ముఖంలో మార్పు అతను గమనించలేదు. వాతావరణం చాలా చల్లగా ఉంది జీపు హెడ్లైట్ వెలుతురులో రోడ్డు తప్ప ఎదురుగా ఏం కనిపించడం లేదు, పగలు అందంగా ఉన్న అడవి రాత్రి భయంకరంగా ఉంది. చాలా సేపు ఇద్దరిలో మాటలు లేవు, గంట ప్రయాణం తరువాత అడవిలో ఒక కంకర దారిలోకి జీప్ ప్రవేశించింది.
ఎక్కడ నుండి వచ్చిందో ఒక గుడ్లగూబ జీప్ బానెట్ మీద వచ్చి కూర్చుంది. ఉలిక్కి పడ్డాడు.
“సార్ ఇదేదో అపశకునంలా ఉంది, వెనక్కు వెల్లిపోదాం ”
“దానికి దారి తెలియక మనతో వస్తుంటే.. అపశకునం అంటావేన్టీ.. ఇప్పుడు చూడు దాన్నెలా పంపిస్తానో”,
టార్చ్ పట్టుకొని కిటికీలో నుండి చెయ్యి బయటకు పెట్టి.. దాని మీద ఒక్క సారిగా ఫ్లాష్ చేశాడు. గట్టిగా అరుచుకుంటూ ఎటో ఎగిరిపోయింది.
జీప్ ఆగింది. “సార్ దిగండి ఎదురుగా ఉన్న రావి చెట్టు క్రింద అవి దొరకొచ్చు, కానీ టార్చ్ వెళుతురులో అవి కనిపించవు, మధ్యలో ఒక సారి ఆఫ్ చేయండి కనిపిస్తాయి. ఒకవేళ కనిపించకపోతే ఎక్కువ సమయం ఎదురు చూడకండి, మరి దొరకనట్టే ”
అలాగే అంటూ వెనక్కు తిరక్కుండా, టార్చ్ వేసుకొని బయల్దేరాడు.
చుట్టూ చిన్న చిన్న మొక్కలు, పొదలు ఉన్నాయి, ప్రత్యేకంగా దారంటూ లేదు, రావి చెట్టు వైపు వెళ్తున్నాడు, పెద్ద దూరం లేదు రెండు నిముషాల్లో చేరుకున్నాడు, చెట్టు దగ్గరకు రాగానే లైట్ అపాడు. అడుగు దూరంలో.. చిమ్మ చీకట్లో ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి.. గుత్తులు గుత్తులుగా “నీలిరంగు పుట్టగొడుగులు”.
అతనికి ఇంకేమీ కనిపించడంలేదు, ఆత్రంగా వాటిని తీయడానికి ముందుకు ఒంగొని చేయి చాచాడు, కాలు క్రింద ఏదో మెత్తగా తగిలింది.. అంతే ఒకే ఒక్క సెకన్లో వాటిని చుట్టుకున్న విష సర్పం బుసకొడుతూ.. వేలు మీద కాటేసింది. చురుక్కు మన్న నొప్పికి టార్చ్ వేశాడు.. ఎదురుగా “రక్తపింజర” మెలికలు తిరుగుతూ రెండు సెకెన్లలో మాయమయ్యింది.
“వీర్రాజూ..!”
అతను వేసిన కేక అప్పుడే ఉరిమిన శబ్ధంలో కలిసిపోయింది. రాజగోపాల్ పరిగెట్టడం ప్రాయంభించాడు, దూరంగా జీపలో ఉన్న వీర్రాజు స్టీరింగ్ పై తలపెట్టుకుని కునుకుతున్నాడు. పరిగెత్తుకుని వచ్చిన రాజగోపాల్ జీప్ తట్టిన శబ్దానికి మెల్లగా చూశాడు.
“సార్ ఏం జరిగింది”
“వీర్రాజు.. పాము కరిచింది.. అర్జంటుగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పద”
“సార్ ఇంకా గిద్దలూరు వెళ్ళడానికి గంట పడుతుంది”
“మరేం చేద్దాం. టైమ్ లేదు” ఆయాసపడుతున్నాడు.
“సార్ కంగారు పడకండి, కన్నప్ప దగ్గర మంచి మందు ఉంది. ”
“పాము కాటుకి ఆయుర్వేద మందులు పనిచేయవు. ప్లీజ్ దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళు..” రొప్పుతూ అన్నాడు.
“సార్. ముందు మీ వేలుకి కట్టు కదతానుండండి..” అని రుమాలుతో కరిచిన వేలుకి కట్టు కట్టాడు. కరిచింది విషసర్పమని వీర్రాజుకి అర్ధం అయింది, ‘తన ఉద్యోగం పోయినట్టే’నని అనుకున్నాడు.
గిద్దలూరు గవర్నమెంట్ హాస్పిటల్ వైపు జీప్ తిప్పాడు. అక్కడ ఒక వేళ పాము మందు లేకపోతే ఏమిటి పరిస్థితి.. అసలే సౌకర్యాలు లేవని ఈ మధ్య పేపరోళ్ళు రాశారు.
పెద్ద కుదుపుతో జీప్ ఆగింది. దభేల్న ముందు అద్దానికి గుద్దుకున్నాడు రాజగోపాల్.
ఏం జరిగినది ముఖమ్ మాడ్చుకొని అడిగాడు.
“సార్ బండి ప్రాబ్లం, దిగి చూస్తానుండండి.”
‘దేవుడా.. అరిగిపోయిన గేర్ల తో ఈ బండి ఇంతకాలం నడిపాను. సమయం చూసుకొని ఇది ఇబ్బంది పెట్టింది. ఏం చేయాలి..’
బోనెట్ ఎత్తి చూశాడు, టార్చ్ వెళుతురులో.. అంతా పరిశీలించాడు, ఎప్పుడూ ఉన్నదే, కొత్తదేమీకాదు. బాటరీ కూడా వీక్గా ఉంది. ప్రస్తుతమ్ ఫర్వాలేదు. బోనెట్ దించాడు జీప్ లో రాజగోపాల్ కిరకిర లాడుతున్నాడు.
“అయ్యిందా”
“సార్ ఓకే”
సమయం ఉదయం నాలుగు గంటలు అయింది. ఎంత వేగంగా వెళ్లాలన్నా జీప్ 40 km కంటే వెళ్ళదు, ఎదురుగా కొంతమంది జనం నడుచుకొని వస్తున్నారు, వాళ్ళను చూసి వీర్రాజుకి గుండెలో రాయి పడింది.
“సార్. మీతో వారం రోజుల తిరుగుతుండడంలో, ఈరోజు శివరాత్రి అన్న సంగతి మరిచిపోయాను.. ప్రతీ శివరాత్రికి గుండ్లబ్రహ్మేశ్వరం ఆలయ ధర్శనానికి సాధారణ ప్రజలకు మా డిపార్ట్మెంట్ వాళ్ళు అనుమతిస్తారు. వీళ్ళను దాటుకొని వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది.”
వీర్రాజుకి చెమటలు పడుతున్నాయి.
ఒక కాగితమ్ మీద అడ్రసు, మొబైల్ నెంబర్ రాసి వీర్రాజు చేతిలో పెట్టాడు.
మెల్లగా కళ్ళు మూతలు పడుతున్నాయి.. రాజా గోపాల్ కి.
** *
“ఎంతసేపయింది” నాడి పరిశీలిస్తున్నాడు కన్నప్ప.
“గంట దాటింది ” టైమ్ దాటిపోయిందని భయపడుతూ అన్నాడు వీరాజు.
నాలుగు రకాల ఆకుపసర్లు ఇచ్చి నూరమన్నాడు, తాను కూడా ఏవో మూలికలు నూరుతున్నాడు, రెండు కళ్ళలో రెండేసి చుక్కలు వేశాడు, నోట్లో మూలికలతో చేసిన పసరు మందు వేశాడు. అదేమిటో వీర్రాజుకు తెలియదు కానీ వాటిమీద ఎంతో నమ్మకం ఉంది.
మధ్య మధ్య లో నాడి పరిశీలిస్తున్నాడు, అంతా బానే ఉంది.
గంట గడిచింది.. మెల్లగా కళ్ళు తెరిచాడు. బ్రతికున్నందుకు ఆశ్చర్యంగా ఉందతనికి, లేవాలని చూశాడు.
వారించి “మరేం ఫర్వాలేదు అలా పడుకోండి. తర్వాత మాట్లాడదాం” అంటూ ఇంకో గదిలోకి వెళ్ళి పోయాడు.
వీర్రాజుకి చాలా సంతోషంగా ఉంది.. అతని మాట ప్రకారం గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్తే ఇంకో గంట పట్టేది. మెల్లగా భుజం పట్టి పైకి లేపాడు. ఇంతలో కన్నప్ప ఇద్దరికీ సుగంధి వేర్ల తో చేసిన టీ ఇచ్చాడు.
రెండు చేతులతో నమస్కరిస్తూ “నువ్వు నిజంగా అడవి దేవుడవు”. అన్నాడు రాజగోపాల్.
చిన్నగా నవ్వుతూ “ఇదే మీపట్నం వాళ్ళ మందులైతే, మూత్రపిండాలపై ప్రభావమ్ చూపుతాయి” అంటూ ఏదో చూర్ణం ఇచ్చి, “మీరు రెండు పూటలా వేడి నీళ్ళతో రెండు నెలలు వేసుకోండి” అన్నాడు కన్నప్ప.
ఇది దేనికి ఆశ్చర్యంగా అన్నాడు.
“ఆరోజు క్రిందన కూర్చోమన్నది మిమ్మల్ని తక్కువ చేయడానికి కాదు. ఎముకల సమస్యలు ఏవైనా ఉంటే క్రిందన కూర్చోలేరు.. మాదగ్గర అదోపరీక్ష. మీకు తుంటి నొప్పి మొదటి దశలో ఉంది. ఈ మందు వాడితే తగ్గు తుంది. కళ్ళతో చూసి పరీక్ష చేయడం కూడా మా విధానం.”
రాజగోపాల్ కి ఆశ్చర్యంగా ఉంది, తనకు ‘అవాస్కులర్ నెక్రొసిస్’ స్టేజ్ వన్ అని ఎంత బాగా గ్రహించాడు. రాత్రి జరిగిందాని గురించి ఆడగకపోవడం కొంత హేపీగా ఉందతనికి.
***
ఆరోజు రాత్రి గెస్ట్ హౌస్ లో ఎవరితోనో ఫోన్లో మాట్లాడు తున్నాడు రాజగోపాల్.
“సార్ ఇక్కడ నాకు తెలియని ఎన్నో మూలికలు ఉన్నాయి, కన్నప్ప దగ్గర అనేక ఫార్ములాలు ఉన్నాయి. కరోనాలో పాపులర్ అయిన గోవిందయ్య మెడిసిన్ కూడా ఉంది. ఆయుర్వేదిక్ యాంటీ వెనమ్ ఫార్ములా కూడా ఉంది. అదిగానీ ఫార్మా కంపెనీలో పెడితే కోట్లు గడించొచ్చు. ” ఆనందంగా చెప్పసాగాడు. బయట చిన్న అలికిడి అయ్యింది. చూస్తే ఎవరూ లేరు.
*
మరునాడు ఉదయం ఏమీ జరగనట్టు కన్నప్ప వద్దకు వెళ్ళాడు.
కన్నప్ప కూడా ఏమీ జరగనట్టు సాదరంగా ఆహ్వానించాడు.
“పుత్ర జీవక మూలికలు చూపినస్తానన్నావు. ”
ఇక రెండు రోజుల్లో ఇక్కడ నుండి వెళ్ళి పోవచ్చు ఈలోగా ఇది కూడా తెలుసుకుంటే తాను వచ్చిన పని పూర్తైనట్టేనని భావించాడు.
“అవి మూలికలు కాదు దొరా గింజలు. ఇక్కడ పెద్దగా అవసరం ఉండదు. కొంతదూరంలో అవున్నాయి. నడుచుకొని వెళ్ళాలి.. చూపిస్తాను పదండి. ”
ఇద్దరూ ఆశ్రమం వెనుక వైపు నుండి వెళ్ళడం ప్రారంభించారు. మెయిన్ రోడ్డుకి కలిపే దారది. కొంత దూరం వెళ్ళిన తరువాత, పెద్ద పెద్ద ఆకులతో కుంకుడు కాయ పరిమాణంలో గుబురుగా కనిపించింది “పుత్రజీవక ” మొక్క. వాటి కాయలను ఎలా వాడలో చెప్పాడు.
“ఇది నీకు అవసరం దొరా ”
“నాకు అవసరం అని నీకెలా తెలుసు.” ఆశ్చర్యపోయాడు రాజగోపాల్.
గొంతు సవరించి మొదలు పెట్టాడు. “ఇక్కడ నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది దొరా, మీరు ఇక్కడ అడుగు పెట్టిన దగ్గరనుండి, మొత్తం మాకు తెలుసు. అడుగడుగునా మిమ్మల్ని గమనిస్తూ మా వాళ్ళు ఉన్నారు. ఆ రాత్రి విడిది గదిలో మీరు కొంత మంది అల్లరి మూకతో చేసిన పనులు కూడా మాకు తెలుసు. అంతే కాదు కొంత మంది తో కలిసి మా ఆటవిక సంపదైన ఆయుర్వేద విద్యను అమ్మ చూశారు. అది జరగని పని.”
కొంచెం సేపు ఆగి, “పాము విషానికి విరుగుడు మందు మాఅయ్య నాతో చెప్పినప్పుడు, చెప్పిన మొదటి మాట ‘పాము కంటే మనిషే ప్రమాదం’.. నిన్ను చూస్తే అర్ధం అయింది దొరా.. నీ లాంటి మోసపూరితమైన మనిషితో ఇంత కంటే ఎక్కువ మాట్లాడను.. విషం చిమ్మే పామునైనా విషం నిండిన మనిషినయినా చంపకూడదు.. జాగ్రతగా విడిచిపెట్టాలి మళ్ళీ దగ్గరకు రాకుండా..”
తననేమీ అనకుండా మెయిన్ రోడ్డు వరకు తీసుకొచ్చాడు.. అందుకన్నమాట.
చిన్న చినుకులు ప్రారంభమైయ్యాయి.
కన్నప్ప అక్కడే నిలబడిపోయాడు.
రాజగోపాల్ వెనక్కి చూడకుండా మెల్లగా మెయిన్ రోడ్డు దారి పట్టాడు. అవమాన పడడం, అవమానించడం తనకు క్రొత్త కాదు. ఇంత మంది గూఢచారులు తనచుట్టూ ఉన్నారని అనుకోలేదు. ఉదయం నుండి వీర్రాజు ఎందుకు కనిపించలేదో అర్ధం అయింది.
అయినా ఏం నష్టం, ఇక్కడ కాక పోతే ఇంకో దగ్గర.
“పులికి ఏ అడవైనా ఒకటే ”
క్రాఫ్ దిద్దుకుంటూ మెయిన్ రోడ్డు మీదకు వచ్చాడు.
ఎదురుగా బృందానాయక్..
కాలేజీ నుండి తనతో పరిచయం. ప్రేమా, డబ్బూ పోటీలో.. డబ్బే గెలిచింది. తరువాత ఇద్దరూ ఒకే ఉద్యోగం, ఒకేదగ్గర సంపాదించారు.
నిజమే.. తనని ఆశ పెట్టాడు, లోబర్చుకున్నాడు. అయినా పశ్చాత్తాపం లేదు, ఎందుకంటే తనేమ్ చేసినా క్షమించే మనుషులు తన చుట్టూ ఉన్నారు.
వర్షం ప్రారంభం అయింది.. పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెకు గొడుగు పట్టాడు వీర్రాజు.
తనని దోచుకున్నట్టు ప్రకృతి ని దోచుకోలేవు.
ఆమె కళ్ళలో భావం అర్ధం అయింది. ఆమె గతంలో అన్న మాట గుర్తొచ్చింది. విషం చిమ్మే పామునైనా విషం నిండిన మనిషినయినా చంపకూడదు.. జాగ్రతగా విడిచిపెట్టాలి.. మళ్ళీ దగ్గరకు రాకుండా..
******
కృష్ణమోహన్ పుల్లేటికుర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పుల్లేటికుర్తి కృష్ణ మోహన్,M.A.PGDCA., జర్నలిస్ట్ మరియు రచయిత, శ్రీకాకుళం
Comments