top of page

మెట్టిల్లు - పుట్టిల్లు


'Mettillu - Puttillu' - New Telugu Story

Written By Pandranki Subramani

'మెట్టిల్లు - పుట్టిల్లు' తెలుగు కథ

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


కొడుక్కి పిఠాపురం సంబంధం వచ్చినప్పుడు భార్య కామేశ్వరి ముఖం విప్పారడం చక్రధరరావు గమనించాడు. కాని తను మాత్రం యెటువంటి ముఖభావమూ కనిపించనీయకుండా చాటేసుకున్నాడు. అంతేకాదు.. మొదట, భార్య వద్ద కాకుండా, ఆ సంబంధం పూర్వాపరాల గురించి కొడుకు విరూపాక్షరావుకి విడిగా వివరించి చెప్పాడు. తమతో పోల్చి చూసుకుంటే తమకంటే పై స్థాయిలో ఉన్నట్లనిపించి విరూపాక్షరావు కూడా పిఠాపురం సంబంధం పట్ల ఆసక్తి కనబరచ లేదు. దానితో తండ్రీ కొడుకులిద్దరూ తమకు తామే డిసైడ్ అయిపోయి నిస్పందనగా ఉండిపోయారు. కాని వాళ్ళనుకున్నట్లు విషయం అంతటితో ఆగలేదు. అటునుంచి ఒత్తిడి పెరిగింది. దానికి భూపతి సతీమణి వేగిరపాటు కూడా తోడైంది. అంచేత తనను తను అంతర్మథనా నికి లోనుచేసుకోవడం యెందుకని మనసు పొరను విప్పి తల్లీ కొడుకులిద్దర్నీ మరొక మారు పిలిచి మాట్లాడాడు చక్రధరరావు; ఆ పెళ్ళి సంబంధం వెనుక ఉన్న కొన్ని గతకాలపు సున్నిత జీవన స్వరాల గురించి. ఇంతకూ కొడుక్కి పిల్లనిస్తానని తనకు మళ్ళీ మళ్ళీ ఫోనుచేస్తూ, ఉత్తరాలపై ఉత్తరాలు వ్రాస్తూన్న వ్యక్తి మరెవ్వరో కాదు. మూడవ మనిషి అంతకన్నా కాడు. తన బాల్య స్నేహితుడే! ఒకప్పటి పొరుగూళ్ళ ఆస్థాన ప్రభువులకి దగ్గరితనం ఉన్న మోతు బరి భూకామందు కుటుంబ వారసుడు భూపతే! ఇక గతకాలపు పరదాను నెట్టి చూస్తే--అప్పట్లో ఆ చుట్టు ప్రక్కల పేరుపొందిన ప్రైవేటు బడులు లేకపోవటాన భూపతి, చెట్టే లేని ఊళ్ళో ఆముదపు మొక్కే భాగ్యమన్నట్టు తమభోంట్ల వాళ్లతో అంటి అంటనట్లు కలసి చదువుకునే వాడు. అలా జరగిడానికి మరొక కారణం-బ్రతుకు బాటలోని చివరి మెట్టు వద్ద నిల్చున్న వాళ్ల బామ్మ కచ్చితంగా చెప్పేసిందట-మనుమడు ఎట్టి పరిస్థి తిలోనూ తన నుండి కనుమరుగవకూడదని. అయితే మాటకు మాటగా చెఫ్పుకోవాలి. భూపతి ఎప్పుడూ జమీందారీ పూర్వ వాసనల్ని నేస్తేల ముందు బాహాటంగా వెదజల్లే వాడు కాడు. ఆఒక్క విషయంబలో ఇంట్లో వాళ్ళమాట చెవికెక్కించుకునే వాడు కాడు భూపతి. స్నేహభావంతో తారతమ్యాలు పాటించకుండా కుర్రాలందరితోనూ కలగలసి పోయేవాడు. అందరూ నిక్కర్లు వేసుకుని పొలం గట్లమ్మట నడుస్తూ బడికి వస్తుంటే; భూపతి మాత్రం గుర్రపు బగ్గీలో బడి ఆవరణలోకి రాజఠీవితో ప్రవేశిస్తుండేవాడు. మరి అదేం విచిత్రమో మరి;అందరూ భూపతికి దగ్గరవడానికి ఆరాటపడుతున్నా, అతడు చక్రధరరావు పట్ల మాత్రం బెట్టన్నది లేకుండా సౌజన్యత చూపించేవాడు. ఎదురు పడినప్పుడల్లా తనను గుర్రపు బండిలోకి యెక్కించుకుని తనతో తీసుకెళ్లేవాడు. ’పెద్దవాళ్ళ కుటుంబాలతో ఆ నేస్తాలేమిట్రా?’ అని అమ్మానాన్నాసూటిగా చూస్తూ మందలించేటప్పటికి తనలో విపరీతమైన జంకు పుట్టుకొచ్చేది. వాడి చూపునుండి వాడి దారినుండి తప్పుకునేందుకు ప్రయత్నించేవాడు తను. కాని ఆ విషయంలో వాడికి దొరికిపోయేందుకు ఎక్కవసేపు పట్టేది కాదు, తనతో బాటు లాక్కుపోయేవాడు. తనేమో పండగ పబ్బాలకు కొత్త నిక్కరు వేసుకుని ముఖాన్ని చాటంత చేసుకుని బడికి వస్తే వాడేమో జిలుగు వలువలతో జిగేల్మనే షేర్వాణీ తొడుక్కుని జమీందారీ దర్పంతో వచ్చేవాడు. సిటీ నుండి తెచ్చుకున్న ముంబాయి చాక్లెట్లు అందరికీ పంచిపెట్టేవాడు. ఎప్పుడూ భూపతిలో ఓ విధమైన జమీందారీ దర్బం వెల్లివిరిసేది. ఒక రోజు భూపతి తను ఎదురు చూడని విధంగా తన కొత్త షేర్వాణీ ఒకటి గిఫ్టుగా ఇచ్చాడు. అది చూసి ఇంట్లోవాళ్ళు సంతోషించలేదు సరి కదా-మొట్టికాయ పైన మొట్టికాయ పెట్టారు తిరిగిచ్చేయమని. తనివ్వలేదు. దానిని తను అందరి ముందూ వేసుకోలేదు గాని- ఇప్పటికీ వాడి జ్ఞాపకార్థం దానిని తన వద్దే ఉంచుకున్నాడు. స్నేహానికి తారతమ్యాలెక్కడుంటాయి మరి! గడుసరి అయిన కామేశ్వరి అదే మాటను నూలుతో వడకిన తాడుగా మార్చుకుని భూపతి కూతురి సంబంధాన్ని ఖాయం చేసేలా చక్రం తిప్పింది. ఆడవాళ్ళకు మాటలా నేర్పాలి! ఆ లోపల భూపతి వాళ్ళ సంబంధం ఖాయం కావడానికి మరొక అంశం కూడా తోడైంది. భూపతి పక్షవాతానికి లోనయాడు. దాదాపు నోరు పడిపోయింది. శ్రీరాముడు తమ్ముడు లక్ష్మణుడికి హితోపదేశం చేస్తూ చెప్పలేదూ- మిత్రుడిలో ఏమైనా అవకతవకలున్నా- దోషాలున్నా మొదట కష్టాల్లో ఉన్న మిత్రుణ్ణి ఆదుకోవాలని. మరి దోషాలే లేని భూపతి కోర్కెను తనెందుకు నెరవేర్చకూడదూ! ఏమో మరి- చక్రధరరావులా ఒక స్థిరమైన ఉద్యోగంలో కుదురకుండా భూపతి కాళ్ళ క్రింద బలపం కట్టుకుని వ్యాపార వ్యవహారాలంటూ బిజినస్ డీల్స్ అంటూ పలు ప్రాంతాలు పలు విదేశాలూ తిరిగేవాడని వాళ్లావిడే ఫోనులో చెప్పింది. అక్కడి నీళ్ళు అక్కడి తిండి పడక అలా ఆరోగ్యం పాడుచేసుకున్నాడేమో! ఇక వాస్తవంగా చూస్తే; మొన్న మొన్న తనకు ఫోను కాల్ వచ్చేంత వరకూ భూపతేం చేస్తున్నాడో, అసలతను ఫిఠాపు రంలోనే ఉన్నాడా లేక మరెక్కడికైనా నివాసం మార్చుకుని వెళ్ళిపోయాడా అన్నది తనకి తెలియనే తెలియని విషయం. ఎట్టకేలకు మిత్రులిద్దరి కుటుంబాలూ బంధుత్వాల పూల హారాలతో ఒక్కటైయాయి. ఎంతలేదనుకున్నా యెంతగా మనసులు విప్పి మెసలినా కొన్ని కుటాంబాలకు కొన్ని కొన్ని ఆనవాయితీలు, జీవన నేపథ్యాలు అతకని బొంతల్లా వాటికవి తేలిపోతూ ఉంటాయి. ఆ రీతిన రమ్యకు అత్త వరసైన మాజీ మ్యునిసి పల్ చైర్మన్ గారి భార్య రమామణి, పెళ్లికి ముందు, పెళ్ళయిన తరవాత కూడా చెప్పవలసినవీ, చెప్పకూడనినీ అన్న విభజన రేఖ పాటించకుండా మనసుని గింగిర్లెత్తించే విధంగా బోధనచేసి వెళ్ళింది. ఇక వరసకి చిన్నమ్మ అయిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ భార్య భామామణి మా త్రం తక్కువ తిందా యేంవిటి! ఆమె కూడా జత కలసి డబుల్ బ్యారల్ గన్నులాగ రమ్య మెదడుని మరింత పదును చేసింది. ఎ లాగంటే-విరూపాక్షరావుకి రిటైర్ కాబోతూన్న తండ్రి ఉన్నాడని, అతనితో బాటు వయసు మళ్ళిన ఆయన భార్య ఇప్పటికే వంగి పోయిన నడుంతో తడబడి నడుస్తున్నదని, వాళ్లిద్దరి మందుల కఖర్చులు కుప్పలుగా ప్రోగు పడ్తాయని, వాళ్లతో బాటు పెళ్ళీడు కొచ్చిన చెల్లి కూడా ఒకతె సిధ్దంగా ఉందని;ఆ కారణాన ఇంటి ఖర్చులన్నీ రమ్య భర్త నెత్తి పైనే పడతాయని, ముందస్తు చూపు తో మెసలకపోతే రమ్య కాపురం కొల్లేరవడం ఖాయమని హెచ్చరిల పైన హెచ్చరికలు జారీ చేసింది. ఇకపోతే-అత్తగారి ఆరళ్ళూ మామగారి ఆజమాయిషీలూ యెలాగూ తప్పవు కాబట్టి, ఊబిలో పడ్డదూడలా గింజుకోకముందే వయసులోని పసిమిలు తగ్గక ముందే మొగుణ్ణి కొంగున కట్టుకుని గట్టు దాటేయమని ఇద్దరూ ఏక మాటగా నూరిపోసారు. అంతటితో ఊరుకున్నారా! లేదు. వెళ్తూ వెళ్తూ గుర్రం వెనుక కాళ్లతో ఒక్కటిచ్చి మరీ ధీమాగా సాగినట్లు మరొకటి కూడా చెప్పారు. మెట్టింటి వాళ్లది మధ్య తరగతి కుటుంబం కాబట్టి, అక్కడి ఆడాళ్లకు అల్పమైన ఆశల పట్ల ఆరాటం ఎక్కువని, ఇరుగు పొరుగువారి మాటల ప్రభావమో, మేనత్త పిన్నిలిద్దరూ కలసిచ్చిన హితోపదేశాల ఫలితమో మరి— పెళ్లి పందిరిలో రమ్య ముఖాన పెళ్ళి కళ తగ్గినట్లే కనిపించింది. గుబులు చోటుచేసుకున్న మనసున సెలయేరు వంటి ఉషారు ఎలా ఉం టుంది!కన్నవాళ్ళను విడిచి, మెట్టింటికి వెళ్ళే కన్నెపిల్లకి ఏది చెప్పాలి-ఎంతవరకు చెప్పాలి-అన్నది బిడ్డాపాపలతో సంసారాలు సాగించే ముత్త యిదువులకి కదా తెలుసుండాలి. బెంబేలు పడిపోయేలా చేయడంలో ఔచిత్యమేముంటుంది. మనుగడుపులు పూర్తయి, పురోహితులు జ్యోతిష్కులు సూచించిన శుభగడియ ప్రకారం రమ్య మెట్టింట కాలు పెట్టింది. అప్పుడు విరూపాక్షరావు చెల్లి కమలం అక్కడ ఇంటి ముంగిట ఉంచిన బ్రీఫ్ కేసుని ఇంట్లోపల పెట్టిరావడానికి వంగి అందుకోబోయింది. చికాకు కనిపించని నవ్వు ముఖంతో రమ్య చటుక్కన దానిని ఆడపడుచు చేతి నుండి అందుకుంది- “దీనిని నా దగ్గరే ఉండనియ్యి కమలా! వీటిలో ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉన్నాయి కదా!” అంటూ. ఎవరు యేమాత్రమూ యెదురు చూడని ఆ సంఘటనకు కమలం మోము విస్మయంతో వెలవెల బోవడం గమనించి “ఆదిలోనే హంసపాదా!” అనుకున్నాడు విరూపాక్ష రావు. ఆ బ్రీఫ్ కేసులో అత్తగారింటి వాళ్ళు పంపిన విలువైన నగానట్రా ఉంటే ఉండవచ్చుగాక. వాటి విషయంలో తన జాగ్రత్తలో తను ఉండటం సముచితమే కావచ్చు గాక-- కాని రమ్య ఆడపడుచుకి కంపరం కలిగించేలా కాకుండా ఇంకొక విధంగా బ్రీఫ్ కేసుని అందుకొని సుతారంగా పరిస్థితిని చక్కబెట్టుకుంటే బాగున్నమో! రమ్య డిగ్రీ హోల్డర్. ఆ పాటి చతురత చూపించి అప్పటికా గడ్డు పరిస్థితిని అవలీలగా అధిగమించవచ్చు కదా! గోటితో పోయేదానికి గొడ్డలి తెచ్చుకోవడం అంటే ఇదే మరి. ఇంటి నుంచి తెచ్చుకున్న వ్యక్తిగత సామానంతటినీ; ముఖ్యంగా మొన్న అబూదబీ నుండి బాబాయి తెచ్చిచ్చిన కాస్మో టిక్స్, లావిష్ సెంటు బాటిల్సుని, సీజనల్ మోయిశ్చరైజింగు క్రీముల్ని లిప్ స్టిక్ ట్యూబుల్ని తన కళ్ళముందే ఉండేలా నిలువు టద్దం షో-కేసులో భద్ర పరుచుకుంది రమ్య. నగలున్న నగిషీ పెట్టెలను యెవరి కంటికీ ఆనని విధంగా బీరువా ఉపరితలం పైకి యెగదోసింది. అటువంటి ఖరీదైన కాస్మోటిక్సు గాని ఆడపడుచుల కళ్లబడితే ఇక ఒక పట్టాన విడిచి పెట్టరని, కన్నూ మిన్నూ తెలియని రీతిన చొరవ తీసుకుని యెగరేసుకు పోతారని మేనత్తలూ పిన్నులూ ఆమెకు శంఖం ఊదినట్లు చెప్పి సమాయత్తం చేసి పంపించలేదూ! మెట్టింటికి వచ్చిన మూడురోజులకే రమ్యకు అనుకున్న దృష్యం యెదురైంది. మునుపటి బిడియాన్ని ప్రక్కన పెట్టి కమలం ఆ రోజు ఉదయమే భార్యా భర్తల గదిలోకి సరాసరి వచ్చేసింది. రెండు చేతు ల్లోనూ కాఫీ కప్పుల్ని ఉంచుకుని ముఖం నిండా ఆప్యాయతల్ని నింపుకుని “ప్లాటినమ్ తీగెలా ఉన్నావొదినా!నిన్ను చూడాలే గాని, ర్యాంపులపై విరగబడి నడిచే ముంబాయి మోడల్స్ దిమ్మెత్తి పోతారనుకో !” అంటూ కప్పుల్ని టీ పాయ్ పైనుంచి రమ్య రెండు చెంపల్నీ నిమిరి- “ఇదిగో మళ్ళీ వచ్చేస్తాను!“ అంటూ వెళ్ళిపోయింది కమలం. మళ్లీ యెందుకు రావడమో! ఇప్పటికీ మెర మెచ్చులు చాలవా! అన్నట్టే భార్యా భర్తలిద్దరూ కాఫీతాగడం పూర్తిచేసే సమయానికి కమలం మళ్లీ వచ్చేసింది, లేచిందే లేడి పరు గులా-- పొడవాటి మల్లెదండను తడిగుడ్డలో చుట్టి అందిచ్చింది- “మల్లె పందిరి మనింటి పెరట్లోనే ఉంది వదినా! ఈ సాయంత్రం కనకాంబరాలు గుదిగుచ్చి యిస్తాలే!” కల్లాకపటం లేని చెల్లెలి ముఖం చూసి విరూపాక్షరావుకి ముచ్చటేసింది. కాని రమ్యకు అలా అనిపించలేదు. ఊహల్లోనే లెక్కలు కడ్తూ అనుకుంది “ఈ పాటికి గదిలోని విలువైన వస్తువుల్ని చూసే ఉంటుంది. సాయంత్రానికొచ్చి యేంచేస్తుందో మరి!” ఆడపడుచులందరూ తెంపరితనంతో చెలరేగిపోయే నంగనాచులని పెద్దమ్మలూ అత్తయ్యలూ ముందుగానే ఉషారు పర్చలేదూ! ఎక్కడేమి జరిగిందో మరి- కమలం మళ్ళీ రమ్య గదిలోకి రాలేదు. సంధ్యా హారతి వేళ అయింతర్వాత కూడా ఆడపడుచు అలికిడి వినిపించ లేదు. ఇక ఉండబట్టలేక భోజనాల సమయానికి ఆమె అలా ఆరుబైటకి వెళ్ళి చూసింది. వసారాగదిలో ట్యూబ్ లైట్ల కాంతిలో కాలేజీ నోట్సు వ్రాసుకుంటూ కనిపించింది కమలం.. అంత బుధ్దిశాలితనంతో ఒదిగి కూర్చుందంటే యేదో జరిగే ఉంటుంది. అత్తయ్య గట్టిగా మందలించే ఉంటుంది- “ఎంత అన్నయ్య అయితే మాత్రం కొత్తగా పెళ్ళి చేసుకున్న వాళ్లగదిలోకి అలా తుర్రు తుర్రున దూసుకుపోవడం సభ్యత కాదు సుమా!” అని. రమ్య నవ్వుకుంటూ గదిలోకి మరలేందుకు తిరిగేటప్పటికి అత్త య్య రానే వచ్చింది యెదురుగా. ఆమెకు పొడవైన కనకాంబర మాలను నవ్వుముఖంతో అందిచ్చి వెళ్లిపోయింది. రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు ఉదయం కాలేజీకి వెళ్తూ కమలం అన్నయ్య వద్దకు వచ్చింది. అప్పుడు రమ్య స్నానం ముగించుకుని స్నానా ల గదినుండి బైటకు వస్తూంది. ”అన్నయ్యా! నేను మా బ్రాంచీ స్టూడెంట్లతో కలసి ఎక్ష్ కర్షన్ వెళ్తున్నాను”. షర్టు వేసుకుంటున్న వాడల్లా చెల్లి వేపు చూసి “ఎవరు వద్దన్నారు? హాయిగా వెళ్ళు” అన్నాడు విరాపాక్షరావు. కమలం నవ్వి “మరి డబ్బులో!” అంది. విరూపాక్షరావు యిక మాట్లాడ కుండా పర్సు తీసి యెంత కావాలని అడిగాడు. మూడు వేల ఐదొందలంది కమలం. అప్పుడక్కడకు దూసుకు వచ్చిన రమ్య భర్త చేతిలో నుంచి నోట్లను అందుకొని “ఏ స్పాటుకి వెళ్తున్నారు ?” అని అడిగింది. సేలం లోని యేర్కాడని చెప్పింది కమలం. అలాగా అని తలూపుతూ రెండు వేల ఐదొందల రూపాయలు లెక్కపెట్టి ఇచ్చింది. “చాలదు వదినా! మధ్యలో యెక్కడైనా షాపింగ్ చేయాల్సి వస్తే--” “హైద్రాబాదులో లేని షాపింగ్ మాల్సా ! ఎక్కడెక్కడి ఊరు వాళ్లో యిక్కడకు వచ్చి మేలిరకం ముత్యాలు పగడాలు రంగులరాళ్లు, డిజైనర్ గాజులు కొనుక్కుంటారు. అదంతా యెందుకు గాని, నువ్వు ముందు టూరు ముగించుకుని రా. ఆ తరవాత మనిద్దరం కలసి షాపింగుకి వెళ్ళొద్దాం. సరేనా!” దానితో కమలం ముఖం మారిపోయింది. అదోలా చూస్తూ నోట్లను పిడికిట్లో బిగించుకుని రివ్వున గది నుండి వెళ్లి పోయింది. తను పుట్టి పెరిగిన ఇంట్లో తనకున్న ప్రాధాన్యత క్రమంగా తగ్గుతుందన్నది గ్రహించింది కమలం. ’మొదట్లోనే అడ్డుకట్ట వేయకపోతే ఈ ఆడపడుచు ఆగడాలకు అంతే ఉండదు మరి!‘-ఇదీ రమ్యలోని నిశ్శబ్ద నినాదం. వదినా ఆడపడుచుల సంభాషణంతా హాలు క్యారిడార్ లో కూర్చుని వింటూన్న చక్రధరరావు కామేశ్వరీ విన్నారు. ఒకరి ముఖం ఒకరు చూసుకుని అర్థవంతంగా నవ్వుకున్నారు. రేవు ఇంటినంతటినీ అదుపాజ్ఞల్లో ఉంచుకుని అందరి అవసరాలూ గమనిస్తూ సంసార నౌకను నడిపించుకుపోవాలంటే, కోడలు పిల్లకు ఆ పాటి పట్టూ చూపూ ఉండాల్సిందే! మూడు రోజుల పిదప అటు కమలం కాలేజీ పరీక్షల పైన దాడి చేయడంలో పూర్తిగా నిమగ్నురాలైన తరవాత-రమ్య భర్త తో ఢిల్లీ వెళ్ళి వెన్నెల వెలుగులో ప్రేమ స్మృతి మందిరం తాజ్ మహల్ని చూసిరావాలని టూరిస్టు కంపెనీతో ప్యాకేజీ టూరు యేర్పాటు చేసుకుంది. ఆమెకున్న వాంఛ ఒక్కటే- ఆడపడుచుకన్నా ముందే తను విహారయాత్రలకు వెళ్ళి రావాలి. ఆడపడుచు ముఖానికి మసి పూసి చూడాలి. కాని అలా జరగలేదు! ఆమె వెన్నెల ఆశ నెరవేరలేదు. అంతా అనుకున్నట్టు అనుకున్న రీతిన జరిగిపోతే ఇకది జీవితం యెలాగవుతుంది! వచ్చిన నెలసరి ఆగకపోవడం వల్ల విపరీతంగా రక్త స్రావం సంభవించి రమ్య అనారో గ్యం పాలయింది. బి పి డౌన్ అయిపోవడం వల్ల ఆమెను ఆస్పత్రిలో స్పెషల్ వార్డులో చేర్పించ వలసి వచ్చింది. అన్ని టెస్టులూ పూర్తయిన పిదప డాక్టర్లు తేల్చిన అంశమేమంటే- ఇంట్లో వాళ్ళనుకుంటున్నట్టు ఆమె అనారోగ్యం మా మూలు సీజనల్ హెల్తు సమస్యకాదని, హార్మోనుల అసమతుల్యత వల్ల క్యాలిషియమ్ ప్రొటీనుల లోపం వల్ల వచ్చిన బెడదని, ఆమె ఆరోగ్యం మునుపులా తేజరిల్లి గాడిలో పడేంత వరకూ బిడ్డా పాపా కలగకుండా చూసుకోవాలని కచ్చితంగా చెప్పారు డాక్ట ర్లు. మొత్తానికామె పదిరోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చింది. పదకొండవ రోజు డిస్చార్జయి వచ్చేటప్పుడు బిల్ సెక్షను లో ఫీజుల వడ్డన బాగానే జరిగింది. వార్టు నుండి కోడలు పిల్లను బైటకు నడిపించుకుంటూ వస్తున్నప్పుడు కామేశ్వరి అనునయంగా అంది-“నాన్నగారికి ఆరోగ్యం పెళుసుగా ఉందనీ, అంచేత ఇంట్లోవాళ్ళకు చెప్పొద్దన్నావు. సరే! మరిప్పుడైనా చెప్పొద్దూ? చెప్పకుండా ఉంటే రేపు అపార్థం చేసుకుంటారేమో! అందునా మీ నాన్నగారు మా వారికి చిన్ననాటి నేస్తమాయె. “ “ఇప్పుడిప్పుడే వద్దత్తయ్యా! గాభరా పడిపోయి ఉన్నదీ లేనిదీ ఊహించుకుని పరుగెత్తుకొస్తారు. మీకు తెలుసో తెలిదో నాన్న గారింకా పక్షవాతం నుండి కోలుకున్నట్లులేరు. సమయం చూసి నేనే చెప్తానత్తయ్యా!“ అంటూ యెదురుగా భర్తతోబాటు వస్తూన్న ఆడపడుచు కమలం వేపు ఆశ్చర్యంగా చూసింది “నువ్వు మీ బ్రాంచి మేట్సుతో యెక్స్ కర్షనుకి వెళ్తానన్నావుగా! ఇక్కడున్నావేంటీ?” “నిన్నీ స్థితిలో విడిచి వెళ్తే నాగతేమవుతుందో తెలుసా వదినా? తోలూడుతుంది” అని నవ్వుతూ బదులిచ్చి తల్లిని పక్కకు జరి పించి, తన చేతుల్ని ఆసరాగా అందిచ్చి “మెల్లగా అడుగులేయి వదినా ! గ్రానైట్ ఫ్లోరు.. మరీ జారుడుగా ఉన్నట్లుంది “ అని హెచ్చ రించి లిఫ్టువేపు నడిపించుకు వెళ్ళింది. రమ్య ఆడపడుచు ముఖంలోకి తేరి చూసింది. ఆ ముఖంలో ఆమెకేమీ కనిపించలేదు. అ రోజురాత్రి భోజనాలయింతర్వాత పడకపైన కళ్ళు మూసుకుని పడుకున్న రమ్యకు వసారానుండి భర్త మామగారితో అంటూన్న మాటలు వినిపించసాగాయి “బిల్లు మొత్తం మనం అనుకున్న దానికంటే యెక్కువే అయినట్లుంది నాన్నగారూ! ఇంకా కొంత ట్రీట్మెంటు ఇవ్వాల్సి ఉంటుంది. నా బ్యాంకు బ్యాలన్సులో యేమీ మిగలనట్లుంది. రమ్య తెచ్చిన నగలు తాకట్టు పెట్టి మిగతా ఖర్చులు చూడాలన్నాను. అమ్మేమో మిమ్మల్ని అడగమంది”. ఆ మాటతో రమ్య చివుక్కున లేచి కూర్చుంది, మామగారే మంటారోనని. “వద్దులేవోయ్! మా ఫ్రెండింటి వాళ్ళు ఆ పిల్లకు ప్రేమతో పెట్టిన నగలు. వాటి జోలికి పోవద్దు. అదేదో నేను చూసు కుంటాలే!” అప్పుడిక రమ్య నెమ్మదిగా కూర్చోలేక పోయింది. దిగ్గున లేచి వచ్చి అంది- “పర్వాలేదు మాఁవగారూ! ఇప్పటికే నా మెడికల్ బిల్లు బాగానే అయుంటుంది. నగలు తాకట్టు పెట్టనీయండి. తరవాత యెలాగూ విడిపించుకుంటాం కదా!” ఆ మాటకు చక్రధరరావు నవ్వాడు. “వద్దమ్మా! నువ్వు మా యింటి పిల్లవు. కష్టమొచ్చినా నష్టమొచ్చినా మేమే చూసుకోవాలి. కమలం మంచాన పడ్తే మేం ఇవన్నీ చూసుకోమా!“ అంటూ అతను అక్కణ్ణించి కదిలాడు. అప్పుడక్కడకు చేరుకున్న కమలం మాత్రం అక్క ణ్ణించి వెళ్ళకుండా రమ్య దగ్గరకు వచ్చింది- “నువ్వు నీరసంగా కనిపిస్తున్నావు వదినా! నీకు తెలుసో తెలియదో గాని నువ్వు ఊపిరి తీయడం అక్కడకు వినిపిస్తుంది. అయినా ఈ ఖర్చుల గొడవంతా మనకెందుకూ? నాన్నగారున్నారుగా!” అంటూ గది లోపలకు నడిపించుకు వెళ్ళింది. రమ్య మరొక మారు అసంకల్పితంగా ఆడపడుచు ముఖంలోకి చూసింది. అప్పుడూ ఆమెకు యేమీ కనిపించ లేదు. అనుకున్నవి అనుకున్నట్లు యెప్పుడో గాని జరగవు. కొన్ని జరిగినా అవి సజావుగా సంభవించవు, నయాగరా జలపాతంలా దూకుడుగా జరిగిపోతుంటాయి. ప్యారాచ్యూట్ నుండి క్రిందపడ్డట్టు-- రమ్య విషయంలో అదే జరిగింది. ఆమె ఒకనాడు దూరాలోచనతో వేసిన నిచ్చెన సరాసరి యెట్టెదుటకొచ్చి విశ్వరూపం దాల్చి నిల్చుంది. ఎలాగంటే- విరూపాక్షరావు కంపెనీ వాళ్ఛు రెండు సంపత్సరాల క్రితం కట్టనారంభించిన నివాస భవన సముదాయం పూర్తయింది. కంపెనీ నిబంధ నల ప్రకారం స్టాఫ్ క్వార్టర్సు ఆఫీసు కట్టడానికి ఆనుకుని ఉండటాన, అలాట్ మెంటు లిస్టులో పేరున్న వాళ్ళందరూ అక్క డికి తరలిపోవాలి. తిరుగులేని కంపెనీ మేనేజిమంటు ఎగ్జక్యూటివ్ ఆర్టరది. ఆ లిస్టులో విరూపాక్షరావు పేరు ఉందని వేరే చెప్పనవ సరం లేదు కదా! కాని రమ్యకు అది ఉపశమనంగా తోచలేదు సరి కదా, ఆమె ముఖాన మాడంత వర్షాకాలపు మబ్బు చోటు చేసుకుంది. జరిగిన విషయం రమ్య చెవిన వేసి ఆఫీసుకి బయల్దేరబోతూన్న భర్తను చేతులు పట్టుకుని గది లోపలకు పిలుచు కొచ్చింది. ”ఏమండీ! ఇది మన స్వంత యిల్లే కదా ?” తలూపాడతను. “దీనిని దొరికినంతలో బాడుగకిచ్చేసి అత్తా మాంవగారూ మనతో బాటు వచ్చేయ వచ్చుగా!” “మరి కమలం సంగతి ?”నవ్వుతూ అడిగాడు విరాపాక్షరావు. “అదేం ప్రశ్నండీ! మా ఆడపడుచు మనతో రాకుండా ఇంకెక్కడుంటుంది?” అతడు కౌన్ని క్షణాలపాటు మౌనంగా భార్య ముఖంలోకి చూస్తూండి పోయాడు. ఆమె అతణ్ణి కుదుపింది బదులివ్వమని. “వాళ్లు మనతో రారు“ ఆమె ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. ”ఎందుకంట?మీ వాళ్ల స్పాఫ్ క్వర్టర్సుకి అమ్మానాన్నలనూ తోబుట్టువులనూ రానివ్వరా యేంవిటి? అటువంటి రూల్ ఏమైనా ఉందా?” అతడు మళ్లీ మౌనంగా ఉండిపోయాడు. “చెప్పండీ!” కంటనీరు పర్యంతమవుతూ భర్తను గట్టిగా కుదుపుతూ అడిగింది రమ్య. అతడు నిదానంగా చూస్తూ అన్నాడు- “అంటే-- ఇంట్లో జరుగుతున్నదంతా నువ్వు గమనించడం లేదన్నమాట ! నాన్న త్వరలో ఉద్యోగ విరమణ చేయబోతున్నారన్నది తెలుసా?” తెలుసన్నట్టు బుర్రూపింది రమ్య. “అందుకని మనకెలాగూ స్టాఫ్ క్వార్ట ర్సు దొరకబోతుంది కాబట్టి ఇల్లు అమ్మకానికి పెట్టే యేర్పాటు చేసారు నాన్న. అడ్వాన్సు కూడా తీసుకున్నారు. అంతేకాదు. కమలానికి పెళ్ళి సంబంధం ఊరుకెళ్ళి చూస్తేనే అనువుగా ఉంటుందన్నది అమ్మానాన్నల అభిప్రాయం. మనం క్వార్టర్సుకి షిప్ట్ అయిపోగానే వాళ్ళందరూ ఊరెళ్ళి పోతారు. అక్కడు మాకు పెంకుటిల్లుంది కదా! ఐదెకరాల మాగాణి కూడా ఉంది కదా! అవన్నీ చూసుకుంటూ అక్కడే ఉండి పోతారు. అదే ఆయన జీవితంలో మిగిలి పోయిన చిరకాల వాంఛ! చుట్టు ప్రక్కలున్న తన చిన్ననాటి నేస్తాలందర్నీ- పలకరించి పొద్దు పుచ్చుతారు. ప్రతిరోజూ రామమందిరం వెళ్లి అక్కడ జరిగే భజనల్లో పాలు పంచుకుంటారు. ఇక నేనెళ్లొస్తాను“ అంటూ అతడు బైటికి నడచి బైక్ స్టార్ట్ చేసాడు. రమ్యకు ఉన్నపళాన నీరసం కమ్ముకొచ్చింది. బుర్ర గిర్రున తిరుగుతున్నట్లనిపించింది. నెత్తిని రెండు చేతులతోనూ గట్టిగా పట్టుకుంటూ “అత్తయ్యా!” అని బాధగా అరిచింది. ఆశ్చర్యం!అప్పుడామెకు పుట్టింట్లోని వారెవరూ జ్ఞాపకం రాలేదు, అత్తయ్య తప్పl ***


పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.



.


123 views0 comments
bottom of page