'I Hate Number 2 But I Like It' New Telugu Story
Written By Penumaka Vasantha
'ఐ హేట్ నంబర్ 2 బట్ ఐ లైక్ ఇట్' తెలుగు కథ
రచన: పెనుమాక వసంత
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
రెండవ ప్లాట్ ఫామ్ లో కూర్చుని రాబోయే రైలు కోసం ఎదురు చూస్తూ కూర్చుంది సుజిత. ఎందుకంటే ఆ రైలు లో వచ్చే వ్యక్తి తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వాడు కనుక. అప్పుడే మైక్ లో ‘రెండవ నంబర్ ప్లాట్ ఫామ్ పైకి వచ్చే రెండు, రెండు, రెండు నంబర్ గల ఎక్స్ప్రెస్ గంట ఆలస్యంగా వచ్చుచున్నది’ అని వినిపించింది. సుజిత ఎదురుచూసేది ఈ రైల్ బండికే. అయినా... మళ్ళీ చెవులు రిక్కించి విన్నది. తను విన్నది కరెక్టా, కాదా.. అని! నిజమే ఈ రైల్ ఒక గంట లేట్ గా నడుస్తున్నది. ఈలోగా రైల్వే స్టేషన్ అంతా ఒకసారి పరీక్షించింది సుజిత. కొంతమంది తనలాగే ఎదురు చూస్తున్న వారు అక్కడక్కడ కనపడ్డారు. చాయ్, చాయ్ అని ఒకవైపు, ఫ్రూట్స్.. అని మరోవైపు, ఇంకా కొన్ని వచ్చే రైళ్ళ రాకపోకల వివరాలు అనౌన్స్మెంట్స్ తో చాలా గందరగోళంగా ఉంది. ఎవరో ఒకావిడ వచ్చి ‘కొంచం మీ బాగ్ కింద పెట్టరా’ అని పక్క సీట్ వైపు చూస్తుంటే సుజిత వెంటనే బాగ్ కింద పెట్టీ ‘కూర్చోండి’ అంది. "థాంక్స్" చెపుతూ వచ్చినావిడ కూర్చుంది. వచ్చినావిడ "మీరు ఎక్కడకు? వెళ్ళాలి" అంటే సుజిత "నేను వెళ్ళటం కాదు, రిసీవ్ చేసుకోవటానికి వచ్చా" ఇంకా ఆవిడ ఏమి? మాట్లాడుతుందోనని ఫోన్లో తలదూర్చింది సుజిత. సుజిత పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళింది. సుజిత జీవితానికి, రెండవ నంబర్ కు దగ్గరి సంబంధం ఉంది. సుజిత, వాళ్ళ ఇంటిలో రెండవ పిల్ల. ఫస్ట్ పుట్టిన పిల్లకు లక్ష్మి అని పేరు పెట్టుకొని గారాబం గా పెంచారు. రెండో సారి అబ్బాయి పుడతాడు అనుకొంటే మళ్ళీ ఆడపిల్ల పుట్టటంతో సుజిత కు బారసాల చేయలేదు. సుజిత పేరు ఇష్టమని వాళ్ల అమ్మ వనిత, సుజితా! అని పిలుస్తుంటే అందరూ సుజిత అనే వాళ్ళు. ఆ తర్వాత కూడా సుజిత కు చెల్లెలు పుట్టింది. సుజితకు అన్నీ వాళ్ల అక్క బట్టలే వేసే వాళ్ళు. సుజిత గొడవ చేసేది, అక్క బట్టలు కాదు.. నాకు కొత్త బట్టలు కొనమని. "లేదమ్మా! బోల్డ్ డబ్బులు అవుతాయి మనదగ్గర అంత డబ్బు లేదు" వనిత అంటే సరే అని సర్డుకొనేది సుజిత. స్కూల్ లో కూడా సెకండ్ బెంచ్ కాదు అని ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటే టీచర్స్ ప్రశ్నలు వేస్తుంటే సెకండ్ బెంచ్ బెటర్ అనుకుని సెకండ్ బెంచ్ లో కూర్చోడం చేసేది. టెన్త్ క్లాస్ సెకండ్ క్లాస్ లో పాస్ అయింది. ఆ తర్వాత ఇంటర్, డిగ్రీ కూడా సెకండ్ క్లాస్ లో పాస్ అయితే అప్పుడు డిసైడ్ అయింది సుజిత. నాకు రెండో నంబర్ అచ్చివచ్చింది అని. కానీ సుజిత మనసులో మటుకు సెకండ్ హ్యాండ్ అనే మాట మటుకు ఎందుకో.. నచ్చదు. సుజిత నాన్న సెకండ్ హ్యాండ్ సైకిల్, స్కూటర్ కొంటే సుజిత గొడవ చేసింది. ‘ఎందుకు నాన్నా సెకండ్ హ్యాండ్ వి కొంటారు అన్నీ? కొంచం ధర ఎక్కువైనా ఫస్ట్ హ్యాండ్ కొన’మని. అలా... చిన్నప్పటి నుండే రెండు అంటే ఒక రకమైన అయిష్టత ఉన్నా... ఎలాగో నెట్టుకు వచ్చింది. ఫస్ట్ పిల్ల అని సుజిత అక్క లక్ష్మి కి బాగా చేసారు పెళ్ళి. ఆ అప్పులు తీర్చటానికి సుజిత జాబ్ చేసి అప్పు తీర్చింది. ఈలోగా సుజిత నాన్న గారు జబ్బున పడటం వల్ల సుజిత ఇంటికి పెద్ద దిక్కు అయింది. సుజిత వాళ్ల నాన్న తను పోతే సుజిత కు పెళ్ళి కష్టమని తన అక్క కొడుకు తో పెళ్ళి నిశ్చయం చేశాడు. వాళ్లకు ఆస్తి ఉంది సుజితను పెళ్ళి చేసుకుంటామన్నారు. కానీ సుజిత మనసులో తనతో పాటు కాలేజి లో చదువుకున్న విజయ్ మీద ఉంది. విజయ్ పై చదువులు చదవటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అదీ కాక ఒకే కులం కాదు. సుజిత వాళ్ల లానే విజయ్ ది కూడ మధ్యతరగతి కుటుంబం. ఆ విషయం ఇంట్లో చెప్పింది సుజిత. "నువ్వు అలా విజయ్ ని పెళ్ళి చేసుకుంటే చెల్లిని ఎవరు పెళ్ళి చేసుకుంటారు? ససేమిరా వద్దన్నారు. అలా చేసుకుంటే తల్లి, తండ్రి ఇద్దరు చస్తామన్నారు. ఇక తల వంచుకుని బావ మురళి చేత తాళి కట్టించుకుంది. విజయ్ చాలా బాధపడ్డాడు సుజిత ను చేసుకోనందుకు. సుజిత కు బాధగా ఉన్నా ఫ్యామిలీ కోసం సర్దుకుంది. మురళి కి లేని అలవాటు లేదు.పెళ్ళి అయిన కొన్నాళ్ళు బాగానే ఉంది. రానురానూ మురళి తాగుడికి బానిస అయ్యి, అప్పులు చేయటం మొదలెట్టాడు. సుజిత అత్త మేనత్త అయినా... పుట్టింటికి వెళ్ళి డబ్బు తెమ్మని పోరు పెట్టేది. పాపం సుజిత నాన్న, సుజిత కాపురం చూసి దిగులుతో కన్ను మూశాడు. సుజిత ఉద్యోగం చేసి అత్త, మామ, భర్తను పోషిస్తున్నది. ఒక రోజు మురళి బాగా తాగి డ్రైవ్ చేయటం వల్ల ఏక్సిడెంట్ అయి చనిపోయాడు. పెళ్ళి అయి మూడు సంవత్సరాలకే పుట్టింటికి చేరింది. ఈ వార్త తెలియగానే విజయ్ వచ్చి సుజిత ను పలకరించాడు. సుజిత చూడగానే విజయ్ కు చాలా బాధ కలిగింది. ఎలా ఉండే సుజిత ఇలా అయింది! చిక్కిపోయి, రంగు తగ్గి ఉన్న సుజిత ను చూసి "ఏంటి సుజిత.. అలా డల్ గా వుంటే ఎలా...? ఆంటీని చూడు.. నిన్ను ఇలా చూస్తూ ఎలా అయిపోయారో? ఆంటీ కోసమైనా నువ్వు మామూలు అవ్వాలి" అన్నాడు విజయ్. “అవునక్కా! నువ్వు ఎన్నాళ్ళు దిగులు పడినా బావ రాడుగా..." అంటూ గీత ఓదార్చింది సుజితను. ఇదివరకటి జాబ్ లో చేరి ఇపుడిపుడే మనుషుల్లో పడుతున్నది సుజిత. ఇంటి బాధ్యతను నెత్తి మీద వేసుకుంది. చెల్లిని చదివిస్తూ మళ్ళీ బిజీ అయింది. చెల్లెలు గీత కు మంచి సంబంధం చూసి పెళ్ళి చేసింది. కొన్నాళ్ళు గడిచాయి. వనిత మళ్ళీ పెళ్లి చేసుకోమని సుజితను అడిగింది. "లేదమ్మా! నాకు పెళ్ళి అచ్చిరాదు. ఇంకోసారి అడగకు. నాకు పెళ్ళి అంటే ఏమాత్రం ఇష్టం లేదు" "అది కాదే.. ఎన్నాళ్ళు ఇలా ఒంటరి గా ఉంటావు? నా మాట వినవే" అని బతిమాలింది. సుజిత అసలు ఒప్పుకోలేదు. "అమ్మా! ఇంకోసారి నా పెళ్ళి మాట ఎత్తావో... నేను చచ్చినంత ఒట్టు" అంది సుజిత. ఒకరోజు విజయ్ వచ్చాడు. సుజిత, "విజయ్! బావున్నావా" అని మంచినీళ్ళు ఇచ్చింది. ‘బావున్నా’ అంటూ తలవూపాడు. తనకి సెంట్రల్ గవర్న్మెంట్ జాబ్ వచ్చిందని, ఇంకో రెండురోజుల్లో వెళ్ళిపోతున్నానని అన్నాడు విజయ్. "కంగ్రాట్స్ విజయ్! ఉద్యోగం వచ్చింది. మరి పెళ్ళి ఎపుడూ?” అంది సుజిత. "అపుడే కాదు. ఇంకో రెండు ఏళ్ళు ఆగి చేసుకుంటా. కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అవి పూర్తి అయితే తప్పక చేసుకుంటా” అన్నాడు విజయ్. ఆ మాట అంటూ సుజిత మొహం లోకి చూసాడు. సుజిత తన లోని భావాలు విజయ్ కు కనపడకుండా జాగ్రత్త పడింది. వనిత అపుడప్పుడు గొడవచేస్తూ... ఉంది.తెలిసిన వాళ్లు ఎవరో వాళ్ల అబ్బాయి ఉన్నాడు. అతనికీ రెండో పెళ్లిట. మంచి ఉద్యోగం చెడు అలవాట్లు లేవు. మీ అమ్మాయి సుజిత ఉందిగా అని అడిగారు. అందుకని వనిత "పెళ్ళి చేసుకో సుజిత! వయసు అయిపోతుంది నీకూ..." అంది. కానీ సుజిత ఒప్పుకోవడంలేదు. రెండు ఏళ్ళు త్వరగా గడిచాయి. ఒక రోజు విజయ్ సుజిత కు ఫోన్ చేశాడు.తను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు. "మంచిది ఎప్పుడైనా ఒక ఇంటి వాడివి కావాల్సిందేగా.. ఇప్పటికే లేట్ అయింది. ఆల్ ది బెస్ట్” అంది సుజిత "నువ్వు ఒప్పుకుంటే నువ్వే నా భార్యవు " అన్నాడు విజయ్. ఇలా డైరెక్ట్ గా అడుగుతాడని అస్సలు అనుకోని సుజిత ఒక్కసారిగా విస్తుపోయింది. వెంటనే తమాయించుకుని "లేదు విజయ్! పెళ్ళి అనే మాట నా దగ్గర ఎత్తకు ప్లీజ్.. ఎవరికైనా ఒక్కసారే జీవితంలో పెళ్ళి జరుగుతుంది. నాకు అది అయిపోయింది. నువ్వు అయినా పెళ్ళి చేసుకొని హ్యాపీ గా ఉండు" అంటూ విజయ్ "అదికాదు సుజిత..” అంటుంటే ఫోన్ కట్ చేసింది. విజయ్ ఆ తర్వాత ఎన్ని సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు సుజిత. ఇలా కాదు అని సుజిత చెల్లి గీత కు కాల్ చేసి సుజిత ను పెళ్లి కి ఒప్పించమని అడిగాడు విజయ్. నేను అక్క తో మాట్లాడుతానని చెప్పి విజయ్ కి భరోసా ఇచ్చింది గీత. గీత పుట్టింటికి వచ్చింది. "ఏంటే సడెన్ గా వూడిపడ్డావు అన్న సుజితతో "మా అక్కని చూడాలనిపించి వచ్చా" అంది గీత. "సర్లే గానీ పిల్లలు, మరిది గారు ఎలా ఉన్నారు?” అని అడిగింది సుజిత. "బావున్నారు అక్కా! నిన్ను ఒక మాట అడుగుతాను కోపం తెచ్చుకోకు." "ఏంటే అది? పెళ్ళి కాకుండా ఇంకేమి అడిగినా నాకు కోపం రాదు. కానీ నస లేకుండా సూటిగా చెప్పు” అంది నవ్వుతూ సుజిత. "అదే అడుగుదామని భయంగా.." గీత అడిగే లోపు సుజిత “నీకు ఎన్ని సార్లు చెప్పాను గీతా, నేను పెళ్ళి చేసుకోనని... ఆరింద మాటలు కాకుండా మిగతా మాటలు మాట్లాడు" అంది కోపం గా సుజిత. వీళ్ల మాటల మధ్యలో వనిత వచ్చి “అవునే! అది ఏమి తప్పుగా మాట్లాడింది. ఇలాగే ఉంటావా? జీవితాంతం పెళ్ళి పెటాకులు లేకుండా!" అన్న అమ్మ తో "అలా చెప్పమ్మా! దీనితో కలిసి చదువుకున్న విజయ్ అక్కని ఇప్పటికీ ఇష్టపడుతున్నాడు. అక్క ఓకే అంటే పెళ్ళి చేసుకుంటాను మీ అమ్మ గారు, అక్కతో మాట్లాడి ఏ సంగతీ చెప్పమని నాకు ఫోన్ చేసాడు" అంది గీత. "ఎవరూ.. ఆ విజయ్ నా! ఢిల్లీ లో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. మన ఇంటికి వస్తుంటాడు.. అతనేనా?” అన్న వనితతో గీత "అవునమ్మా! అతనే.. అపుడు చేసుకుంటాను అంటే నాన్న, నువ్వు ఒప్పుకోలేదు. విజయ్ కి ఉద్యోగం లేదు అని, మన కులం కాదని. కానీ ఆ విజయ్ అక్కని ఇప్పటికీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. నువ్వైనా అక్కని ఒప్పించు అమ్మా! మన కులంలో వారినే చేసుకొని నేను, అక్క మా భర్తలతో ఏమి సుఖ పడుతున్నాం చెప్పూ! అక్క కోసమే విజయ్ ఇప్పటి వరకు పెళ్ళి కూడా చేసుకోలేదు. అమ్మా! ఇకనైనా నువ్వు కులం, గోత్రం అంటూ అక్క పెళ్లికి అడ్డు చెప్పకు" అంది గీత. “లేదే... ఇప్పుడు ఇక అడ్డు చెప్పను. అది మేము చెప్పామని ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఎన్ని బాధలు పడ్డదో నాకు మాత్రమే తెలుసు! ఇపుడు ఎటువంటి అడ్డంకులు లేవు.. పెళ్ళి వద్దు అని చెప్పటానికి. విజయ్ బంగారం లాంటి పిల్లాడు. వాళ్ల అమ్మ కూడా నాకు తెలుసు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. మరీ సుజిత కు ఇది రెండో పెళ్లి. వాళ్ల ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేదో?" అని సందేహం గా వనిత అంది. "విజయ్, వాళ్ల అమ్మ, నాన్న ఒప్పుకున్నారని చెప్పాడు. సో మనం దిగులు పడక్కర్లేదు. ముందు మనమూ ఈ అక్కని ఒప్పించాలి” అంది గీత. వెంటనే వనిత "ఒప్పుకో తల్లీ! నేను పోతే నీకు దిక్కేవరు?" అంటూ కన్నీళ్ల టాప్ వదిలింది. అక్కా! ఒప్పుకో లేకపోతే అమ్మ కన్నీటి వరదల్లో మనం కొట్టుకుపోతాము" అంటూ గీత సుజిత గడ్డం పట్టుకుని బతిమాలింది. ఎంతకూ సుజిత వినకపోయేసరికి గీత "సరే అక్కా! నీ ఇష్టం.. నేను వెళ్లిపోతున్నా మా ఇంటికి. కానీ తెల్లవారేసరికి నా చావు కబురు వినండి. అమ్మానాన్న చనిపోతాము అంటే నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావు. మరీ నేను చనిపోతేనైనా నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటే నా ఆత్మ హ్యాపీ గా ఉంటుంది" అని బాగ్ తీసుకుని వెళ్తున్న గీత ను పట్టి ఆపింది సుజిత. “ఎవరూ నా మాట వినరేం? నాకు విజయ్ మీద ప్రేమ ఉంది. నన్ను చేసుకుంటే నా దరిద్రం అతనికి పట్టుకుంటుంది. విజయ్ సుఖంగా ఉండాలనే నేను ఈ నిర్ణయం తీసుకుంటే ఎవరు నన్ను అర్థం చేసుకోరూ!" అంటూ గీత గట్టి గా అరిచింది. "పిచ్చి అక్కా ! బావ చెడు అలవాటు వల్ల పోయాడు. అంతేకాని నీ వల్ల అని ఎందుకు నిన్ను నువ్వు బ్లేం చేసుకుంటావు. నీకు ఇక్కడ ఒక విషయం అర్థం కావటం లేదు. నీకూ చిన్నప్పటి నుండి రెండు నంబర్ కలిసి వస్తుంది" అన్న గీత తో "ఇష్టం కన్నా అసహ్యం కూడా” అని మొహం చిట్లించింది సుజిత. “అక్కా! ఫస్ట్, లో బావను పెళ్ళి చేసుకోవటం ఒకందుకు నీకు మంచే జరిగింది. బావ తోనే ఆ దురదృష్టం కాస్త పోయి నీకు ఇపుడు రెండో పెళ్లి ద్వారా అదృష్టం రాబోతుంది" అంది గీత. “నిజమే? గీత చెప్పింది చూస్తే నువ్వు ఇపుడు విజయ్ ని చేసుకుంటే నీకు కల్సివస్తుందేమో ? సుజిత ఒప్పుకో తల్లీ!" అని వనిత బతిమాలింది సుజిత ను. ఎట్టకేలకు ఓకే అంది సుజిత. "అక్కా! ఇపుడే విజయ్ తో మాట్లాడు" అని సెల్ తీసి ఇచ్చింది గీత సుజిత కు. సుజితకు ఏమి? మాట్లాడాలో తెలియక "హాలో! బావున్నావా విజయ్" అంది. సుజిత ఇంకా ఏమైనా చెప్తుందేమో? అని విజయ్ చెవులు రిక్కించినా... సుజిత ఏమి చెప్పకపోతే గీత సుజిత చేతి లోని సెల్ లాక్కుని "విజయ్ బావ.. మా అక్క ఓకే అంది" అని చెప్పగానే "అవునా! చాలా చాలా థాంక్స్ గీత.. నేను ఎల్లుండి ఢిల్లీ నుండి వస్తున్నాను. మీ అక్కను రైల్వే ప్లాట్ఫారం కు రమ్మను" అని చెప్పాడు విజయ్. "ఒకే బావా! అలాగే” అని ఫోన్ పెట్టేసి “అక్కా! విన్నావు గా.. ఎల్లుండి విజయ్ వస్తున్నాడు. వెళ్తావు కదా?" అన్న గీత తో వెళతానంటూ సిగ్గుతో తల ఊపింది సుజిత. యాదృచ్ఛికం గా రెండవ నంబర్ ఫ్లాట్ ఫాం మరియు రైల్ బండి నంబర్ కూడా మూడు రెండులు కాబట్టి ఈసారి అయినా సుజిత జీవితం సుఖంగా... ఉండాలని కోరుకుందాం. అదిగో రైల్ వచ్చేసింది, విజయ్ కోసం ఆతృత తో ఎదురు చూస్తూ ఉంది సుజిత. సుజిత ముందు నిలబడి "హాయి! సుజి" అన్న కేకతో తెప్పిరిల్లి "హాయ్! విజయ్" అంది సిగ్గుతో సుజిత. "పద బయటకెళ్ళి మాట్లాడుకుందాం" అని సుజిత చేయి పట్టుకుని బయటకు నడిచాడు విజయ్. ఆ చేయిని అపురూపంగా పట్టుకుని విజయ్ మొహం లోకి ఆనందంగా చూస్తూ వెంట నడిచింది సుజిత. *** |
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు
Comments