top of page

మిరప మొక్క


'Mirapa Mokka' New Telugu Story Written By Dr. Kiran Jammalamadaka

'మిరప మొక్క' తెలుగు కథ

రచన: డా: కిరణ్ జమ్మలమడక

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


మూఢ నమ్మకం అనేది తర్కానికి అందని నమ్మకం. దానికి ఒక వ్యక్తి యొక్క మేధస్సు, చదువు తో సంబంధం లేకుండా, చేతలను నిర్ణయించగల సామర్ధ్యం వుంది, అందుకే నూతన తన పెరటి లో వున్న మిరప మొక్కను పని వాడు తుంచి వేయగానే ఆమె మనసు కీడు శంకించింది. వేరే ఏ మొక్క అయినా వేరేలా ఉండేదేమో కానీ ఆ మిరప మొక్కకి నూతన కి ఒక బంధం వుంది.


"అదేంటి ఆలా పీకేశావ్" అంది ఆందోళనగా.


"బాగా చీడ పట్టింది అమ్మగారు ఇంక బతకదు. ఇదివరకే మందులు వేసాను. అయినా లాభం లేదు, ఈ మొక్క పని అయిపోయింది అమ్మగారు " అనేసి తన పని లో తను నిమగ్నమైపోయాడు.

ఏ చదువూ, తర్కం దగ్గరవారి ముందు నిలబడవు. అనుకున్నదే తడవుగా తనకు తెలిసిన కొద్దిపాటి వివరాలతో ఊరు బయలుదేరింది నూతన, పల్లె వెలుగు బస్సు కొంత అసౌకర్యం గా వున్నా తన ఆలోచలని కొండయ్య చుట్టూ తిరగ సాగాయి.


కొండయ్య తో తన పరిచయం ఒక ఏడెనిమిది ఏళ్ళ నాటిది, తను రేడియో స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ గా భాద్యతలు తీసుకున్న కొత్తలో జానపద కళాకారుల మీద కార్యక్రమాలు చేసేది, ఒక ఆదివారం రోజు మధ్యాహ్నం ఏదో పుస్తకం చదువుతూ ఉండగా, ఒక బాగా అలసిన, నలిగిన గొంతు తో, ఒక జానపద పాట లీలగా వినపడసాగింది, రాను రాను అది శ్రావ్యం గా తనకి పనికొచ్చే అంశం గా మారింది.


తను గబగబా వీధిలోకి వచ్చి చూసింది వీధి చివర చెట్టు కింద ఓ వయసు మళ్ళిన ఒకతను కూచుని పాడుతున్నాడు గబగబా తను అతని దగ్గరుకు వెళ్లి ఆతనిని పరిచయం చేసుకొని తనతో పాటు తీసుకు వచ్చి హాల్లో కూచోపెట్టింది, తనది వియజయవాడ పక్కన వుండే ఒక చిన్న తండా అని, అప్పుడప్పుడు ఇలా అడివిలో పెరిగిన చింతపండు, మిరపకాయలు ఇక్కడకు తెచ్చి అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడని అర్థం అయ్యింది నూతన కి.


"నీ పేరేమన్నవ్ ?" అని అడిగింది నూతన.


"కొండయ్య అంటారు, కూసిన్ని మంచి నీళ్లు ఇయ్యి దావతి అవుతోంది " అన్నాడు కొండయ్య చాల చనువుగా.


సరే అని కొన్ని నీళ్లు తెచ్చి, కొన్ని మిరపకాయలు, చింతపండు కొని, ఆ పాట వివరాలు అడిగి తెలుసుకొంది నూతన.


"ఊరికొచ్చినప్పుడల్లా ఇక్కడకు రా" అని చెప్పింది, సరే అనేసి వెళ్ళిపోయాడు కొండయ్య.


ఆ తరువాత ఇంకో నెలకి మళ్ళీ వొచ్చి, కొన్ని మిరపకాయలు, చింత పండు తెచ్చి ఇవ్వటం, నూతన కాసేపు పిచ్చా పాటి మాట్లాడం జరగ సాగింది. ఇలా రెండు మూడు సార్లు కలిసాక ‘రేడియో లో పాట పాడతావా’ అని అడిగింది నూతన. దానికి కొండయ్య, "నా పాటలు ఎవరికీ నచ్చవంట గా, నా బిడ్డ అన్నాడు కానీ నువ్వు పాడ మంటే పాడతా లే.. " అన్నాడు.


నూతన కి 'నువ్వు' అనే పదం తో నొసట మొదట ముడి పడినా, తరువాత అతని అమాయకత్వం ఆ నొసట ముడి ని విప్పింది.


నూతన కు ఏక వచన సంబోధన అలవాటు లేక పోయనా కొండయ్య పిలుపులో తండ్రి కూతురితో చూపించే చనువు, ఆప్యాయతే తప్ప, అగౌరవం కనిపించ లేదు.


"రేడియో వాళ్ళు డబ్బులు ఇస్తారు లే ఊరికే కాదు.. " అని నవ్వేసింది.


"నీతో పాటు ఇంకా పాడే వాళ్ళు, డప్పు వాయించేవాళ్ళు ఉంటే ఇంకో ఐదుగురిని తెచ్చుకో" అంది.


అప్పటినుంచి, కొండయ్య తన మంది తో రావటం కొన్ని పాటలు పాడేసి డబ్బులు తీసుకొని వెడుతూ ఉండేవాడు, ఇంతలో నూతన కు కొండయ్య వివరాలు కొద్ది కొద్ది గా తెలియ సాగాయి, అదీ కొండయ్య తన మాటల్లో అప్పుడప్పుడు చెపుతూ ఉండేవాడు, ఒక రోజు మిరప కాయలు తెచ్చి.


"ఇగో బయట ఆరుకి ఇత్తన్న, నీకు మూడుకే ఇత్త.. లోపలకి పోయి గంప అట్టుకు రా పో.. ", అన్నాడు.


నూతన నవ్వు కుంటూ సరే అని చిన్న గంప తెచ్చిపెట్టింది, మాటల్లో "నీ కొడుకు ఏమి చేస్తున్నాడు" అని అడిగింది.


"ఆడికి, పటాలం యేసుకొనే ఉద్యోగం కావాలట, సైనేమ పాటలే పాడతాడంట నాతొ రా రా నువ్వు డబ్బులు ఇత్తావ్ అంటే రాను పొమ్మన్నాడు, ఎదవ అస్సలు మాట ఇనటం లేదు..

ఓ తూరి, నువ్వు ఆడికి నచ్చ చెప్పు, పాటలు బాగా పాడతాడు కానీ మంకుతనం ఎక్కువ” అని చెప్పాడు.


మరో సారి,


"ఇగో నువ్వు, మాకు ప్రతి నెల, పాట పాడ మనచ్చు కదా ? మాకు బాగుంటది కాస్త ", అవసరానికి డబ్బులు అడగ కుండా, పని అడిగే పద్దతి నచ్చింది నూతన కి.


"అలా కుదరదు.. కొండయ్య.. ఆరు ఏడు నెలలు ఆగాల్సిందే గవర్నమెంట్ ఒప్పుకోదు "


"నువ్వు చెప్పు ఒప్పుకుంటాది" అని ఆశగా చూసాడు కొండయ్య.


ఆ కళ్ళలో అవసరం కనపడింది నూతన కి. వేంటనే ఒక ఐదు వందలు, ఒక పాత పంచె తీసుకొచ్చి ఇచ్చింది. ‘ఈ సారికి వాడుకో, తరువాత ఇద్దువు లే’ అని చెప్పి సాగనంపింది.


పాపం ఏ కష్టం వొచ్చిందో అనుకొంది నూతన. మామూలు గా ఇరవై ముప్ఫయ్ రోజులకు వొచ్చే కొండయ్య ఈ సారి, పది రోజులకే వొచ్చి, ఒక మిరప మొక్క తానె ఇంటి పెరడు లో పాతేసి, "మంచి మొక్క, బాగా కాస్తది. కొంచెం నీళ్లు పోయి" అన్నాడు.


దానికి నూతన "ఇదెందుకు, నువ్వు తెస్తున్నావు కదా.. " అని అంటూ వుండగా,


" నా కోసం పడి కాపులు కాస్తావేంటి నువ్వు.. , నేనున్న లేక పోయిన ఈ మొక్క మిరపకాయలు ఇత్తాది" అనీసి వెళ్ళిపోయాడు.


తన అమాయకత్వం కి జాలేసింది నూతన కి. తనకి తోచిన సాయం చేస్తూ కొండయ్య పాటలు రేడియో లో ప్రసారం చెయ్యటం చేస్తూ ఉండేది. ఆ పాటలకు ఆదరణ బాగానే ఉండటం తో కొన్ని ప్రశంసల ఉత్తరాలు కూడా వొచ్చేవి. అవి చదివి వినిపించేది నూతన కొండయ్యకి. ఆ తరువాత కొండయ్యకి వొంట్లో బాగోలేదని, అందుకే రావటం లేదని తెలిసింది నూతన కి. ఎన్నో సారులు అనుకున్న ఇంటికి వెళ్లి కలవలేక పోయింది. ఆ తరువాత తనకు కొండయ్య వివరాలు తెలియలేదు. కొండయ్య జ్ఞాపకాలు మరుగున పడుతున్న సమయం లో, మిరప మొక్క పీకివేసే ఘట్టం కొండయ్యని గుర్తు చేసి కలచివేసింది.


ఇంతలో కండక్టర్ ఊరు పేరు గట్టిగ అరవడం తో ఈ లోకం లోకి వచ్చింది నూతన. బస్సు ఆగిన చోట ఊరు పేరే గాని అక్కడ ఊరు లేదు. లోపలకు రెండు మూడు కిలో మీటర్లు వెళ్ళాలంట.. కష్టమే, కానీ బయలుదేరి ఊరు చేరింది నూతన.


ఊరు, ఇల్లు చేరుకునే సరికి, మధ్యాహ్నం అయ్యింది, ఇల్లు శుభ్రం గా వుంది ఇంటి ముందు చిన్న వసారా, కట్టెల పొయ్య, చిన్న చిన్న గదులు వున్నాయి, పెద్ద సామాను ఏమి లేదు కానీ టీవీ, డిష్ యాంటీనా మాత్రం వున్నాయి. బస్సులు, రోడ్లు లేవు గాని ఊరి నిండా డిష్ యాంటీనాలు వున్నాయి.


ఇంతలో కొండయ్య భర్య రావటం తో నూతన తనని తానూ పరిచయం చేసుకుంది, మొదట కొంత ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకుంది. ఎప్పుడూ కొండయ్య కోసం ఎవరు రాలేదుట. కొండయ్య ఎలా మంచాన పడింది, ఏమి మిగల్చకుండా ఎలా కాలం చేసాడు అన్ని చెప్పుకొచ్చింది..


తను ఇప్పుడు ఆ ఊరిలోనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతూ.. తనూ, తన కొడుకూ ఎలా కాలం వెళ్లబుచ్చుతున్నారో చెప్పింది. ఆ మాటల్లో కొండయ్య వాళ్ళకి చేసిన అన్యాయం మే ఎక్కువ గా కనపడింది నూతన కి, ఆమె చేతిలో ఒక ఐదు వేల రూపాయలు పెట్టి వెళ్లబోతుండగా.. ఒక పాతికేళ్ల కుర్రాడు, చిరిగినా అంటే చింపుకున్న జీన్ ప్యాంటు, అక్కడక్కడా బంగారపు రంగు అద్దిన జుట్టు, చెవికి ఒక పోగు, పుర్రె బొమ్మ వున్న రెండు ఉంగరాలతో లోనికి వొచ్చాడు.

అతని వాలకం కి కారణాలు అర్థమవడానికి నూతన కు ఎక్కువ సమయం పట్టలేదు, వెళ్ళబోయేదే మళ్ళీ కూర్చొని అతని వివరాలు అడగ సాగింది, అతని పేరు రాజు, అతను డిగ్రీ సగం చదివాడంట, విజయవాడ లో కార్ డ్రైవర్ గా చేరి మెల్లగా ధనవంతుడయి, జీవితం లో సెటిల్ అవ్వలని అనుకుంటున్నాడు. కానీ అతనికి ‘మెల్లగా’ అంటే అర్థం తెలుసా అని ఒక సందేహం ఐతే కలిగింది నూతనకి.


"కొండయ్య లాగా నువ్వు కూడా వ్యాపారం చేయొచ్చు కదా" అని అడిగితె,


" నేను, అమ్మ.. మా అయ్యకి చాలా సార్లు చెప్పం.. మిరపకాయలు, చింతపండు అమ్మితే మన అవసరాలు తీరవు.. , పట్నం పోదాం అక్కడ బోలెడు డబ్బులు సంపాదిద్దాం, అక్కడ వాచ్మాన్ కె బోలెడు జీతం ఇస్తారు, చాల డబ్బులు సంపాదించవచ్చు అని, ఇనలే, ఏం చేస్తాం ఆలా చేసివుంటే ఇప్పటికి కొంత డబ్బులు ఉండేవి, నేను ఈపాటికే సొంత కార్ కొని డ్రైవర్ గా ఉండేవాడిని” అన్నాడు అసహనం అతని మొహం మీద ప్రస్ఫుటం గా కనపడుతోంది.

అయితే సిటీ లో క్యాబ్ డ్రైవర్ కష్టాలు ఇతను తట్టుకోగలడా? అసలు తెలుసా? అని అనుమానం వెంటాడుతూనే వుంది.


"పోనీ పాటలు పాడు మీ నాన్న లాగ" అంటే ఆ పాటలు ఏం బాగోవు అని, అవి అసలు పాటలే కావు అని, వాటివల్ల ఉపయోగం లేదు అనే స్థిర అభిప్రాయం లో వున్నాడు, ఏతా వాత గా నూతన కు తెలిసిందేమిటంటే తల్లి కొడుకులకి కొండయ్య పైన సదభిప్రాయం లేదు, ఏదో పని కి పోతాడు చాలి చాలని డబ్బులు తెస్తాడు అనే తప్ప, కొండయ్య గురించి ఏం పెద్దగా తేలీదు.


అంతే కదా పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు.. అని అనుకుంటూ తిరుగు ప్రయాణం అయ్యింది నూతన.


ఇంటికి చేరింది కానీ, మనసు మసులో లేదు, తల్లి దండ్రులను గౌరవించలేని వాడు సమాజం లో ఎవరిని గౌరవించలేడు, రాబోయే తరం యెంత ప్రమాదం లో ఉందొ నూతన కి అర్థం అవుతోంది, తను వంతు గా ఒక్కరిని మార్చినా అది మార్పే అని అనుకొంది, కానీ ఏమి చెయ్యాలి వాళ్ళ ఆలోచన దృక్పథం ని తను ఎలా మార్చ గలదు అన్న ఆలోచనలతోనే మరో రెండు మూడు రోజులు గడిచాయి.


సరే అని ఒక నిర్ణయానికి వోచ్చిన నూతన వెంటనే రేడియో స్టేషన్ డైరెక్టర్ ని కలిసింది, నూతన అభ్యర్ధనని, అయన మంచి మనసు తో అంగీకరించి అవసరమైన సాయము చేసాడు, రెండు మూడు రోజులు ఇష్టం గా కష్ట పడి పెట్టె నిండా కొండయ్య కి వోచ్చిన ప్రశంస ఉత్తరాలు, ఆయా ప్రసారాలు చేసినందుకు తనకి వోచ్చిన ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు, అన్ని పోగేసి ఒక పెట్టె నిండా సద్ది, ఆ పైన స్వయం గా తను రాసిన చిన్న ఉత్తరం పెట్టి, రాజు కి చేరేలా ఏర్పాటు చేసి ఆతృతగా ఎదురు చూడ సాగింది ప్రత్త్యుత్తరం కోసం.


కానీ అటు వైపునుండి ఎలాంటి సమాధానం రాలేదు నూతన కి, ప్రతి రోజు పోస్ట్ వొచ్చే వరకు అక్కడే తచ్చాడుతూ గడిపేది నూతన, ఇంక తనది వృధా ప్రయాస అని నిర్ణయించుకుని, కొంత కాలానికి పోస్ట్ కోసం ఎదురు చూడడటం మానేసింది.


ఒక రోజు, ఎవరో కాలింగ్ బెల్ కొడితే బయట కు వెళ్లి చూసింది నూతన, అక్కడ రాజు ఉండటం చూసి ఆశ్చర్యపోయింది, "రా.. రా.. రాజు.. లోపలి కి రా.. ఏంటి ఇలా వోచ్చావ్ లోపలకి రా " అని నూతన పలకరించింది దానికి రాజు "పని మీద ఈ ఊరు వొచ్చాను, మీకు ఈ మిరప విత్తనాలు ఇద్దామని.. " అని నూతన చేతిలో ఆ పొట్లం పెట్టి, నూతన ఇంకా ఏదో మాట్లాడబోయేంతలో వెంటనే వెళ్ళిపోయాడు.


ఆ తరువాత రాజు మళ్లీ కనిపించలేదు, ఏడెనిమిది నెలలు గడిచాయి, నూతన కూడా పెద్ద గా రాజు గురించి ఆలోచించడం తగ్గించింది, అంతకంటే తను ఏమి చెయ్యలేను అని ఆమెకు అనిపించింది. ఇంతలో నూతనని, జానపద పాటలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించమని ఏదో యువ కళాకారులని ప్రోత్సహహించే సంఘం వారు నూతనను పిలిచారు, నూతన కూడా సరే అని సభ కు వెళ్ళింది. చాల మంది పాటగాళ్లు వున్నారు. ఒక్కక్కరూ వొచ్చి పాడుతున్నారు..

నూతన కు కొద్దిగా విసుగు పుట్టింది, అంతా గొంతుతో పాడేవారే కానీ మనస్సు తో పాడేవారే కనపడలేదు, మళ్లీ కొండయ్య గుర్తుకువొచ్చాడు నూతనకి. నూతన ఆ ఆలోచనల్లో ఉండగానే కొండయ్య గొంతు లాగా ఒక పాట వినపడసాగింది.. ఒక్కసారి గా ఉలిక్కి పడి "ఏంటి.. ఇది హాలోజినేషన్ కాదు కదా?" ఇంతలోనే పాట సాహిత్యం ని మెదడు మనసుకు అర్థం అయ్యేటట్టు చేసే ప్రక్రియ మొదలుపెట్టింది.


"యేడ వున్నాడో నా నాన్న..

గెట్ల వున్నాడో నా నాన్న..


నీ అవసరాలకి ఖాళీ జేబులు నిన్ను వెక్కిరించినా, నా విలాసాలకు అవి అక్షయ పాత్రలైనాయి..

నువ్వు గొప్పుడివి కాదని ఈ లోకం అన్నా.. , నిన్ను గుర్తించేంత గొప్పది కాదు ఈ లోకం అని నేను అంటున్నా..


యేడ వున్నాడో నా నాన్న..

గెట్ల వున్నాడో నా నాన్న.. "


అని వినపడతూ వుండగా పాట పాడే వ్యక్తి వైపు చూసింది, చూడగానే ఆమె మొహం లో చిరునవ్వు పాడేది కొండయ్య కొడుకు రాజు.. ఇప్పుడు తృప్తి గా వుంది నూతనకు..


రాజు పాట పాడుతూ ఉండగానే తాను రాసిన ఉత్తరం గుర్తుకు వచ్చింది నూతనకు.


"రాజు,

చరిత్ర ఎప్పుడూ గొప్ప వ్యక్తుల గురించే చెపుతుంది, ఎందుకంటె సమాజం చే నిర్వచించబడిన 'విజయం' సాధించిన వాళ్లే చరిత్ర రాస్తారు కాబట్టి, కానీ శ్రమించే, ప్రతి వ్యక్తి విజయానికి, గౌరవానికి, అర్హుడే.


మీ నాన్న నీకు ఏమి ఇవ్వలేదో చూస్తున్నావ్ కానీ, నీకు ఏమి ఇచ్చాడో నువ్వు గుర్తించట్లేదు, ఐశ్వర్యం అంటే ఖరీదయినా బట్టలు, సెల్ ఫోన్స్, డబ్బు కాదు అంతకు మించి..

ఏ చదువు చదవని మీ నాన్న, నిన్ను చదివించాలనుకోవడమే ఒక విజయం, మీకు రెండు పూటలా తిండి పెట్టటం కోసం తాపత్రయ పడటమే ఒక విజయం, మీకోసం కోసం తపన పడటమే ఒక విజయం, ఇన్ని విజయాలు ఉన్నా నీకు సరి పోక పొతే మీ నాన్న సాధించిన విజయాలు ఈ పెట్టెలో వున్నాయి చూడు, యెంత మంది కి మీ నాన్న పాట తెలుసో, యెంత మంది కి మీ నాన్న గురించి తెలుసో.. మీ నాన్న పెరటి చెట్టే కావచ్చు కానీ తులసి చెట్టు లాంటి వాడు గౌరవించక పోయిన పరవాలేదు కానీ అగౌరవ పరచకు.


--మీ అక్క. "


పాట అవటం, సభ అంతా కరతాళ ధ్వనులతో మోగిపోవటం, ఆ సంఘం వారు రాజు ప్రతిభకు పట్టం కట్టడం వంటివి నూతనకు పెద్ద విషయాలు గా కనపడలేదు, రాజు లో వచ్చిన మార్పే అతని భవితకు నాంది, అదే అన్నిటి కంటే పెద్ద విషయం గా కనపడింది నూతనకి.


మార్పు ఎందుకు వొచ్చింది ఎలా వొచ్చింది ఎందుకు మారాడు? ఎలా మారాడు?, నా ఉత్తరం ఆందిందా? తను చదివాడా? లాంటి ప్రశ్నల కంటే కనపడిన మార్పు ఆస్వాదించడానికి మొగ్గు చూపింది నూతన.


ఆనందం తో ఇంటికి వొస్తున్న నూతనకు కొత్తగా చిగురిస్తున్న మిరప ముక్క స్వాగతం

పలికింది.

***

కిరణ్ జమ్మలమడక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: Dr: కిరణ్ జమ్మలమడక

కంప్యూటర్ అప్లికేషన్స్ లో మాస్టర్స్ చేసి, GE లో సీనియర్ మేనేజర్ గా, భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. కిరణ్ , "స్ప్రింగ్" అనే సంస్థ ను స్థాపించి, తద్వారా విద్యార్థులకు మోటివేషనల్, లైఫ్ కోచింగ్ తరగతులను నిర్వహిస్తూ వుంటారు. తన సంస్థ ద్వారానే కాకుండా పిల్లలు , పెద్దలు ప్రపంచం పట్ల సానుకూల దృక్పథం తో ముందుకుసాగాలనే ఉద్దేశం తో కథలు రాయటం మొదలుపెట్టారు, ప్రముఖ పత్రికల్లో ఆయన కథలు కొన్ని ప్రచురితమయ్యాయి ,తెలుగు వెలుగు 'కథా- విజయం 2019' పోటీలో భాగంగాఎన్నిక అయ్యిన "మిరప మొక్క " ప్రజాదరణ పొందినది. పదేళ్లలోపు పిల్లల కోసం రాసిన "యాత్ర", పదేళ్ల పైబడిన పిల్లల కోసం రాసిన నవల "అతీతం" లను తానా - మంచిపుస్తకం 2021 లో ప్రచురించింది.


50 views0 comments

Kommentare


bottom of page