top of page
Writer's pictureSimha Prasad

మౌన ఛేదన

గమనిక : ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంక్రాంతి 2021 కథల పోటీలో ప్రత్యేక బహుమతి గెలుచుకుంది. ఎంపికలో పాఠకుల అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకున్నాం.

Mouna Chedana Written By Simha Prasad

రచన : సింహ ప్రసాద్


‘‘స్త్రీని ఆదిదేవతగా, ప్రకృతి మాతగా ఆరాధించే దేశం మనది. తల్లిగా, భార్యగా, కూతురిగా సమున్నత స్థానం ఇచ్చి గౌరవించే సంస్కృతి మనది. సీతారాములు, రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణులు అంటూ స్త్రీకి అగ్రతాంబూలం ఇచ్చే సంస్కారం మనది. పడమటి గాలి ఎంత బలంగా వీచినా చెక్కుచెదరని వారసత్వం మనది. ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతూ కనులు మిరుమిట్లు గొల్పే స్థాయిలో విజయాల్ని సాధిస్తున్నారు. వారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వారు ఆకాశంలో సగం అనిగాక ఆకాశమంతా మాదే అనే స్థాయికి ఎదగాలని మనసా వాచా కోరుకుంటున్నాను...’’

‘న్యూ ఇండియా’ పత్రిక ప్రధాన సంపాదకులు హరీష్‌ ప్రసంగానికి సభ యావత్తూ కరతాళ ధ్వనులతో మార్మ్రోగిపోయింది. అతడు చెయ్యెత్తు మనిషి. ఆకర్షణీయమైన రూపం. అరవై ఏళ్ళు పైబడినా బింకంగా, ఉత్సాహంగా, విజేతలా ఉంటాడు. అతనికి లభించే గౌరవమర్యాదలు సాటిరానివి.

‘‘ఈనాటి ఉత్తమ జర్నలిస్టుల అవార్డుల ప్రదానోత్సవానికి హరీష్‌గారు ముఖ్య అతిథిగా రావడం మన అదృష్టం. ఆయన సుదీర్ఘ అనుభవం జర్నలిస్టులకు గీతాపాఠం. నేల నుండి నింగికి దూసుకు పోయిన ఆయన జీవితం మనకందరికీ ఆదర్శనీయం...’’ అంటూ అతన్ని ప్రశంసల్తో ముంచెత్తారు నిర్వాహకులూ, వక్తలూ.

అనంతరం ఆయన్నే బహుమతి ప్రధానం చెయ్యమన్నారు.

‘‘నేటి మేటి జర్నలిస్టులకు అవార్డులిచ్చే అవకాశం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికీ నేనిచ్చే సందేశం ఒక్కటే. మీరంతా పెట్‌డాగ్స్‌లా గాక, వాచ్‌డాగ్స్‌లా ఉండాలి. సమాజంలోని అవినీతిని, అక్రమాల్ని, అవాంఛనీయ ధోరణుల్ని చీల్చి చెండాడాలి. మీ అందరికీ జయహో!’’ మైక్‌ అందుకుని జర్నలిస్టులకు చెప్పాడు. మళ్లీ చప్పట్ల వర్షం కురిసింది.

పిమ్మట అవార్డులివ్వసాగాడు హరీష్‌.

‘‘ఉత్తమ పరిశోధనాత్మక వ్యాసానికి గాను ‘ది ఎక్స్‌ప్రెస్‌’కి చెందిన నందిని ఎన్నికయ్యారు. వారిని స్టేజి మీదకొచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను’’ నిర్వాహకులు ప్రకటించారు.

ఆ పేరు వింటూనే కళ్ళు విప్పార్చి ఆసక్తిగా చూశాడు హరీష్‌.

మెరుపుల చీరకట్టి, సోయగాలూ, చిరునవ్వులూ వెదజల్లుతూ స్టేజి మీద కొచ్చింది నలభై ఏళ్ళ నందిని.

‘వావ్‌’ నోట్లో అనుకున్నాడు హరీష్‌. ఆమె వంక ఆశగా, ఆబగా చూశాడు.

ఆమె వచ్చి విష్‌ చేసింది. షేక్‌ హ్యాండిస్తూ ఆమె వేళ్ళు నొక్కాడు. చురుగ్గా చూసిందిగాని అతను పట్టించుకోలేదు.

‘‘గుడ్‌. వయస్సు కన్నా వేగంగా నీ అందం పెరుగుతోందే’’ అని ఆమె చెవిలో చెప్పి చిన్నగా నవ్వాడు. ఆమె కించిత్తు అసహనంగా చూసింది. ఆ చూపుల్ని దులిపేసుకుని షీల్డు అందించే నెపంమీద దగ్గరికెళ్ళి రాచుకుంటూ నిలబడి, నవ్వుతూ ఫొటోలకు ఫోజిచ్చాడు. అదే సమయంలో ఎడమ చేత్తో ఆమె పిరుదుల్ని రాస్తూ నడుం చుట్టూ చేయి చుట్టి తనకేసి నొక్కుకున్నాడు. అతడి ధైర్యానికి అచ్చెరువందుతూనే, అతడి చేయి తొలగించి, ఎడంగా జరిగి అవార్డుని పైకెత్తి సభికులకు చూపింది.

‘‘దీన్ని గరల్స్‌ ట్రాఫికింగ్‌కు బలైన అమ్మాయిలకు అంకితం చేస్తున్నాను’’ అని ప్రకటించింది.

తప్పట్లు మిన్ను ముట్టాయి.

ఆమె వెళ్తోంటే దగ్గరి కెళ్ళాడు హరీష్‌. ‘‘నీలోని ఫైర్‌ నాకు నచ్చింది. ఒకసారొచ్చి కలువ్. పుష్‌ ఇస్తాను’’

అతడి మాటలు విననట్టు విసురుగా వెళ్ళిపోయింది. పెదవి కొరుక్కున్నాడు.

ముటముటలాడుతున్న ఆమె మోము చూసి నుదురు ముడివేసి ‘‘అలా వున్నావేం నందినీ’’ అడిగాడామె భర్త.

‘‘ఏం లేదు...’’

‘‘అవార్డు తీసుకున్న ఉత్సాహమే నీలో కనబడటం లేదు’’

తొట్రు పడింది. తెచ్చి పెట్టుకున్న చిరునవ్వుతో ‘‘అయామ్‌ వెరీ హ్యాపీ’’ అంది.

వారి అమ్మాయీ, అబ్బాయీ ముందుకొచ్చి అభినందించారు. వెనక, ముందు సీట్ల వారు కరచానం చేసి బెస్ట్‌ విషెస్‌ చెప్పారు.

ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి ఉత్సాహ తరంగంలా వచ్చి విష్‌ చేసింది ‘‘హాయ్‌. నా పేరు తేజస్వి. ట్రెయినీ జర్నలిస్టుని. న్యూ ఇండియాలో హరీష్‌ సార్‌ దగ్గర ట్రెయినింగ్‌ అవుతున్నా. మీ ఆర్టికల్స్‌ అన్నీ ఫాలో అవుతూంటా. అవి భలే స్ఫూర్తివంతంగా శక్తిమంతంగా ఉంటాయి. మీరీ అవార్డుకి అక్షరాలా అర్హులు...’’

‘‘గ్లాడ్‌ టు మీట్యూ తేజస్వీ’’

‘‘ఆ మాట నేను చెప్పాలి. మీకు అప్పుడప్పుడూ ఫోన్‌ చెయ్యొచ్చా మేడమ్‌?’’

‘‘నిరభ్యంతరంగా’’

సెల్ నెంబర్ చెప్పగా ఫీడ్ చేసుకుందామె.

సభ పూర్తయింది. ప్రముఖులు వెళ్తోంటే సభికులు ప్రక్కకు తొలగి దారిచ్చారు.

నందిని హరీష్‌నే గమనిస్తోంది. అతడు తేజస్వి భుజం చుట్టూ చేతులేసి నడిచెళ్తున్నాడు. ఆసరా కోసం ఆమె మీద ఆనినట్టుగా కన్పిస్తున్నాడు. కాని ఆమె లేత భుజాల్ని నొక్కుతున్న సంగతి నందిని ఒక్కతే గమనించింది. ‘చిత్త కార్తె కుక్క’ అనుకుంటూ తనలో తను రగిలిపోయింది.

‘‘ఈయన దేశంలోనే ప్రముఖ ఎడిటర్‌ కదా నందినీ’’

భర్త మాటకు చిన్నగా తలఊపింది. ‘‘పాత ఇమేజ్‌తోనూ ప్రభుత్వ ప్రకటనలతోనూ నెట్టుకొస్తున్నారు తప్ప పత్రిక స్టాండర్డ్‌ పెరగలేదు, సర్క్యులేషనూ పెరగటం లేదు’’

హరీష్‌ని కారెక్కించి తేజస్వి దిగబడి పోవడం చూసి తనకి తెలీకుండానే నిట్టూర్చింది నందిని.

అనుకోకుండా ఒక రోజున ఆమెకి ప్రెస్‌క్లబ్‌లో ఎదురైంది తేజస్వి.

పోతపోసిన నవయవ్వన రాశిలా ఎంతో అందంగా, చలాకీగా, ఉత్సాహంగా ఉంది. తనే వచ్చి పలకరించింది.

‘‘మీ కొత్త ఆర్టికల్‌ దేని మీద రాస్తున్నారు మేడమ్‌’’

‘‘ ‘ #మీటూ’ చరిత్ర’’

‘‘పాత టాపిక్కేమో?’’

‘‘కాని పాతబడటం లేదుగా!’’

‘‘ఏయే పాయింట్లు టచ్‌ చేస్తున్నారు?’’

‘‘అన్నీను. పంజాబ్‌ మాజీ డీజీపీ కె.ఎస్‌. గిల్‌ని లైంగిక వేధింపుల కేసులో శిక్షింపజేసిన కలెక్టర్‌ రూపల్‌ డేవల్‌ బజాజ్ తో మొదలు పెట్టి, ‘ఇన్ఫొసిస్‌’ ఫణీష్‌ మూర్తి, తహల్కా తరుణ్‌ తేజ్‌ పాల్‌నీ టచ్‌ చేస్తున్నా. హాలీవుడ్‌ నిర్మాత హార్వీ వీన్‌స్టన్‌ లైంగిక వేధింపులు బట్టబయలవ్వడమూ చిత్రిస్తున్నా. శ్రీరెడ్డి క్యాస్టింగ్‌ కౌచ్‌ అంటూ టాలీవుడ్‌ని కుదిపేసిన ఘటనా రాస్తున్నా. పెద్దలు రంగంలోకి దిగి సర్దేశారు గాని లేకపోతే చాలా బాంబులు పేలేవి. తనుశ్రీదత్తా బాలీవుడ్‌లో ముసలం పుట్టించింది. నానాపటేకర్‌, అలోక్‌నాథ్‌, శ్యామ్‌ కౌశల్‌, వికాస్‌ బెహల్‌, లవ్‌రాజన్‌, సాజిద్‌ఖాన్‌ లాంటివారి తలకాయలు ఆల్రెడీ రాలి దుమ్ములో దొర్లుతున్నాయి. మొన్నటి కేంద్రమంత్రి అక్బర్‌ కోర్టుని ఆశ్రయించినా పదవి నుంచి తప్పుకోక తప్ప లేదు. అదీ రాస్తున్నా. లైంగిక నేరగాళ్ళతొ పని చేయమన్న 11 మంది మహిళా దర్శకుల ప్రకటనను కొసమెరుపుగా రాస్తున్నా. ‘# మీటూ’ మంటల్ని ఆరనివ్వకూడదు. ప్రపంచ వ్యాప్తంగా ఆడవాళ్ళ ఆగ్రహం శాంతించరాదు. కామాసుర మర్దన పూర్తయ్యేదాకా ఇంతే!’’

‘‘చాలా బాగా చెప్పారు. మీ రాతలే కాదు మాటలూ స్ఫూర్తినిస్తున్నాయి’’

చిరునవ్వు చిందించి ‘‘మీ బాస్‌ ఎలా ఉంటున్నారు’’ అడిగింది నందిని.

‘‘ఆయనో జీనియస్‌. నడిచే ఎన్‌సైక్లోపీడియా. ఆయన అవగాహన, విశ్లేషణ అమోఘం. మనం ఊహించని కోణాల్ని ఆయన చూస్తారు. ఆయన దగ్గర్నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నాకు చాలా ఇన్‌పుట్‌ ఇస్తున్నారు. లిఫ్ట్‌ ఇస్తామంటున్నారు. ఆయన పత్రికలో చేరడం నా అదృష్టం’’

చందమామని అందుకోబోతున్నట్టు ఎంతో గొప్పగా ఎక్సైట్‌ అవుతూ చెబుతోంటే మౌనంగా విని ఊరుకుంది నందిని.

‘ఏమోలే. అతడు మారాడేమోలే. వృద్ధనారిలా వయస్సు పైబడటంతో బుద్ధి మారిందేమోలే’ అని సమర్థించుకుంది నందిని.

ఒక ఆర్టికల్‌కి తుదిరూపం ఇస్తూ సీరియస్‌గా రాసుకుంటోంది నందిని. రాత్రి 11 గంటలు దాటినా పట్టించుకోలేదు. ఇంతలో సెల్‌ మోగింది. విసుగ్గా దాన్ని చేతిలోకి తీసుకుంది.

లైన్లో తేజస్వి. ‘‘డిస్ట్రబ్‌ చేసుంటే సారీ మేడమ్‌. మీకో గుడ్‌న్యూస్‌ చెబుదామని చేశాను. మా బాస్‌ ప్రధానమంత్రితో కలిసి విదేశీ యాత్ర కెళ్తున్నారు. అసిస్టెంటుగా నన్నూ తీసుకెళ్తానన్నారు. బాస్‌ దగ్గర చేరిన ఆర్నెల్లకే ఇంత గొప్ప ఛాన్స్‌ వస్తుందనుకోలేదు’’

ఉలిక్కి పడింది. పాతస్మృతులేవో మెదడులో బుసలు కొడుతోంటే బలవంతాన అణచేసుకుని ఆమెని అభినందించింది.

మరి పని మీద దృష్టి పెట్టలేక పోయింది. అస్థిరంగా అశాంతిగా ఉంది. లేచి వెళ్ళి మంచినీళ్ళు తాగి పడుకోబోతూ ఆగింది. పెల్లుబికి వస్తోన్న భయాన్ని నిగ్రహించుకోలేక తేజస్వికి ఫోన్‌ చేసింది.

‘‘బాస్‌ నీతో బాగానే వ్యవహరిస్తున్నాడా?’’

‘‘యా. ఎందుకలా అడుగుతున్నారు?’’

‘‘వూరికే...’’

‘‘చాలా నైస్‌గా ఉంటారు. సరదాగానే అయినా కుళ్ళు జోకులు వేస్తుంటారు. అదే నచ్చదు. చేతులు వణుకుతుంటాయి కాబోలు ఎక్కువగా నా మీద చేతులేస్తుంటారు. ఆయన మనవరాలిదీ నా వయస్సే. నాలో ఆమెని చూసుకుంటున్నారనుకుంటా...’’

కసిక్కిన క్రింది పెదవి కొరుక్కుని లైన్‌ కట్‌ చేసింది.

ఆ రాత్రి కలత నిద్ర పోయింది నందిని.

రోజు రోజుకీ అశాంతి మేట వేస్తోంది. ఏదో తెలీని టెన్షన్‌కి లోనవుతోంది. జాగ్రత్తంటూ తేజస్విని హెచ్చరించాలని సెల్‌ చేతుల్లోకి తీసుకునే ఆగిపోయింది.

ఎందుకలా కాషన్‌ చేస్తున్నారని తేజస్వి ఎదురు ప్రశ్నిస్తే ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి?

భర్తా పిల్లల్తో హ్యాపీగా సంసారం చేసుకుంటూ, వృత్తిలో సైతం ఒక స్థాయికి చేరుకున్నాక గతాన్ని తవ్వుకోవడం అనవసరం. కొన్నింటిని సమాధిలో ఉండనిస్తేనే సంతోషంగా ఉండగలం. రహస్యాల్ని బట్టబయలు చేస్తే చాలా చాలా సమస్యలొచ్చి పడతాయి. నిశ్చల మడుగులో సునామీ పుడుతుంది. ఈ రోజుల్లో తగుదునమ్మా అంటూ వీధెక్కే కన్నా ఎవరి బాగు వారు, ఎవరి గోడు వారు చూసుకోవడం మంచిది. తనకు మాలిన ధర్మం నిస్సందేహంగా మొదలు చెడ్డ బేరమే!

ఆ ఆలోచనా ప్రవాహం నందినిని సేద దీర్చింది. మళ్ళీ రొటీన్లో పడిపోయింది.

‘# మీటూ’ వ్యాసానికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మహిళా సంఘాలు ప్రశంసల్తో ముంచెత్తాయి. మృగాళ్ళకు కొత్త హెచ్చరికై కొరడా ఝళిపిస్తుందని మెచ్చుకున్నాయి.

ప్రధానమంత్రి విదేశీ పర్యటనలో ఆయనతో బాటు దక్షిణాది నుంచి వెళ్తున్న ఏకైక సంపాదకుడు హరీషేనంటూ ఎడిటర్స్‌ గిల్డ్‌ ప్రత్యేకంగా ప్రశంసించింది.

ఆ వార్త చూసి వెంటనే తేజస్వికి ఫోన్‌ చేసింది నందిని. ‘‘నువ్వూ వెళ్తున్నావా?’’

‘‘లగేజ్‌ సర్దుకోవడం కూడా అయిపోయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది మేడమ్‌.’’

‘‘ప్రధాని బృందంలో ఒకర్ని కాబోతున్నదాని కన్నా, గ్రేట్‌ ఎడిటర్‌తో వారం రోజులపాటు క్లోజ్‌గా మూవ్‌ అవబోతున్నందుకు ఎంతో ఎక్సైట్‌ అవుతున్నాను. అయామ్‌ రియల్లీ లక్కీ. బాస్‌ నన్ను తన అసిస్టెంటుగా ఎన్నుకోవడం నా

అదృష్టం....’’

ఆమె నాన్‌స్టాప్‌గా చెప్పుకుపోతోంటే అన్యమనస్కంగా వింటూండిపోయింది.

హరీష్‌తో... వారం రోజులు... క్లోజ్‌గా...!

నందిని మెదడు కుతకుత ఉడికి పోసాగింది.

తేజస్వి చిన్న పిల్లేం కాదు. హరీష్‌ ఎలాంటివాడో ఈపాటికి గ్రహించే ఉంటుంది. నో నో. తెలిస్తే అంత ఎక్సైట్‌ ఎలా అవుతుంది? అతడి మాటల జాలంలో పడి కొట్టుకుపోతోందంతే!

ఒకనాడు తనూ అంతేగా!

పదిహేనేళ్ళనాటి ఆ రోజులు కళ్ళముందు గిర్రున తిరిగాయి.

జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేయగానే హరీష్‌ పత్రికలో ట్రెయినీగా చేరింది. తన బ్యాచ్‌ వాళ్ళంతా హరీష్‌ని ఓ హీరోగా భావించేవారు. జర్నలిజంలో ఎప్పటికైనా అతడి స్థాయిని అందుకోవాలని కలలు కనేవారు.

అతడు అబ్బాయిలతో కన్నా అమ్మాయిలతోనే ఎక్కువ చనువుగా ఉండేవాడు. ‘అమ్మాయిలు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. చక్కగా అలంకరించుకుంటారు. ఎంచక్కా మాట్లాడతారు. చలాకీగా పని చేస్తారు. అందుకే వారంటే నాకిష్టం’ అనేవాడు.

తనని ప్రత్యేకంగా పిలిచి టిప్స్‌ చెప్పేవాడు. స్పెషల్‌గా చూసేవాడు. అందరి ముందూ పొగిడేవాడు. అవసరమున్నా లేకపోయినా తన భుజాల మీద చేతులేసేవాడు. భుజాలు నొక్కి పట్టుకుని తన వైపు తిప్పుకుని మాట్లాడేవాడు. రాచుకుంటూ నిలబడేవాడు. ఒక్కోసారి తన బ్యాక్‌సీటుకి అతడి చేయి తగిలేది. అదంతా యాథృచ్ఛికమే అనుకునేది. ఎలాంటి అభ్యంతరమూ పెట్టేది కాదు. కెరీర్‌లో దూసుకెళ్ళడం మీదే తన దృష్టి ఉండేది.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలితని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చెయ్యడానికెళ్తూ తననీ రమ్మన్నాడు. మూడ్రోజులు చెన్నైలో ఉండేలా రెడీ అయి రమ్మన్నాడు.

ఒక పక్క గ్రేట్‌ ఎడిటర్‌ హరీష్‌. మరో పక్క ‘విప్లవ వనిత’ జయలిత.

ఆమెని అతడు ఇంటర్వ్యూ చేస్తోంటే తనూ పాల్గోబోతోంది!

గొప్ప వరం లభించినట్టు పొంగిపోయింది. మిగతా వాళ్ళు ఈర్ష్యతో కుళ్ళిపోయారు. అదోలా చూశారు. వ్యంగ్య నవ్వులు విసిరారు. అవేం పట్టించుకోకుండా ఒక గొప్ప ఎక్స్‌పోజర్‌ కోసం హరీష్‌ వెంట బయల్దేరింది.

హోటల్లో పక్క పక్క రూముల్లో బస చేశారు.

మర్నాటి ఉదయమే పొయస్‌ గార్డెన్స్‌లో జయలితతో బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తూ మొదటిగా భేటీ కాబోతున్నారు. హరీష్‌ సూచించిన అంశాలతో క్వశ్చనీర్‌ తయారు చేస్తోంటే అతడు కాల్‌ చేశాడు. నోట్‌ ప్యాడ్‌ తీసుకుని రమ్మన్నాడు.

తను వెళ్ళేసరికి లుంగీ, టీషర్ట్‌ ధరించి ఉన్నాడు. సోఫాలో తన పక్కన కూర్చోమన్నాడు. తండ్రిలాంటి అతడి పక్కన నిస్సంకోచంగా కూర్చుంది.

జయలిత వ్యక్తిత్వం గురించి వివరిస్తూ, నా భుజం మీద చేతులేస్తూ, వీపు నిమురుతూ, మీద పడుతోంటే ఇబ్బందిగా అన్పించింది. అయినా భరించింది. కానీ అతడి ప్రవర్తన శృతి మించుతూండటంతో లేచి వెళ్ళి ఎదుటి సోఫాలో కూర్చుని, ‘‘ఇక్కడైతే మీ మాటలు కరక్టుగా క్యాచ్‌ చెయ్యగలుగుతాను సార్‌’’ అంది.

అయిష్టంగా చూశాడు. ముఖం ఎర్రబడగా అన్నాడు ‘‘సీ నందినీ. పెద్దవాళ్ళతో మసిలేప్పుడు గౌరవంగా హుందాగా ప్రవర్తించాలి. చీప్‌గా లేకిగా ఉండకూడదు’’

‘‘నా ఉద్దేశం అదికాద్సార్‌...’’

‘‘ష్‌... నా గురించీ నా పలుకుబడి గురించీ నీకు సరిగ్గా తెలిసినట్లు లేదు. నేను తలచుకుంటే నిన్ను ఎవరెస్టు ఎక్కించగలను. లేదా నిర్దాక్షిణ్యంగా పాతాళానికి తొక్కెయ్యగలను. నాతో ఎంత మంచిగా వుంటే అంత వృద్ధిలోకి రాగలవు’’

అతడి భావం అర్థమవుతోంటే కంగారు, భయం కప్పి పుచ్చుకుంటూ అంది ‘‘వృత్తిపరంగా నేనేదైనా పొరబాటు చేస్తే చెప్పండి సార్‌ సరిదిద్దుకుంటాను’’

‘‘వ్యవహారం ఏదైనా కానియ్‌. నాకు కోఆపరేట్‌ చెయ్యి చాలు, నిన్నెక్కడికో తీసుకుపోతాను. మనమిక్కడ మూడు రాత్రులు గడపబోతున్నాం. దీన్ని ప్లెజర్‌ ట్రిప్‌గా మార్చుకుందాం. ఎంజాయ్‌ చేద్దాం. నువ్వు నన్ను సంతోషపెట్టు. నేన్నిన్ను అందలం ఎక్కిస్తా. డీల్‌ ఓకేనా?’’ కామాగ్నితో మండుతోన్న కళ్ళతో చూశాడు హరీష్‌.

నిలువునా వణకిపోయింది. పులి బోనులో ప్రవేశించినట్టు ఆందోళన పడింది. ‘‘సారీ సర్‌. మాది పరువు మర్యాద గల కుటుంబం...’’

‘‘నాదీ అంతే. చీకట్లో మనమేం చేసినా ఎవరికీ తెలీదు. నేను చెప్పను. నువ్వు చెప్పుకోవు. అంతా గప్‌చిప్‌...’’

‘‘అది కాద్సార్‌...’’

‘‘ష్‌... దేన్నైనా విడివిడిగా చూడటం అలవాటు చేసుకో, పైకొస్తావ్‌. ఇవాళ రేపు అమ్మాయిలు ఎందర్తోనో ఎన్నో రకాల రిలేషన్స్‌ పెట్టుకుంటున్నారు. అవన్నీ గుట్టుగా ఉండట్లేదూ. అలాగే మనదీనూ. ఎలాంటి భయాలూ వర్రీలూ పెట్టుకోవద్దు’’ లేచి దగ్గరి కొస్తోంటే చటుక్కున లేచి నిలబడింది. ‘‘సారీ సర్‌...’’

గట్టిగా అరిచినట్టుగా అనేసరికి వెనక్కి తగ్గి వెర్రిగా నవ్వాడు.

‘‘జస్ట్‌ నిన్ను టెస్ట్‌ చెయ్యడానికన్నాన్లే. కూర్చో కూర్చో...’’

ఫ్రిజ్‌లోంచి డ్రింక్‌ బాటిల్‌ తీసి రెండు గ్లాసుల్లో పోశాడు.

‘‘కనీసం కంపెనీ ఇవ్వు. ఇక్కడున్నది మనిద్దరమే’’ ముఖం అప్రసన్నంగా పెట్టుకుని అన్నాడు.

‘‘నాకు అలవాటు లేద్సార్‌’’

‘‘అలవాటు చేసుకోవద్దు. ఇది చాలా బ్యాడ్‌ హేబిట్‌. జస్ట్‌ టేస్ట్‌ చేసి వదిలెయ్‌’’

అతడి కోపం మరింత పెంచ సాహసించలేక ఒక్కసారి సిప్‌ చేసి పెలపరించుకుంది.

‘‘ఓ. నీకాటేస్ట్‌ నచ్చలేదా. వదిలెయ్‌...’’ అంటూ వెళ్ళి కూల్డ్రింక్‌ బాటిల్‌ తెచ్చిచ్చాడు.

కూలింగ్‌ అధికంగా ఉండటంతో మెల్లగా తాగసాగింది.

‘‘సెక్స్‌ గురించి నీ అభిప్రాయం ఏంటి? జస్ట్‌ ఫర్‌ డిస్కషన్‌’’

ముఖం జేవురించగా ఇబ్బందిగా చూసింది.

‘‘చెప్పటానికి ఇబ్బంది పడుతున్నావా? లీవిట్‌. నేను కొన్ని ఫొటోలు చూపిస్తాను. ఏది బావుందో చెప్పు చాలు...’’ సెల్‌లో కొన్ని పోర్న్‌ ఫొటోలు చూపించాడు.

ముఖం తిప్పుకుని లేచింది.

‘‘కూర్చో కూర్చో. స్వర్గ సౌఖ్యమంటే ఇదే ఇదే...’’ వెకిలిగా నవ్వాడు.

నిరసనగా కోపంగా చూసి డోర్‌ దగ్గరకి విసురుగా వెళ్తూంటే ఒళ్ళు తూలింది. అతడొచ్చి పట్టుకున్నాడు.

మెలుకువ వచ్చేసరికి తన మీద అతడు నగ్నంగా... తనూ నగ్నంగానే... తన వక్షం నిమురుతూ ముద్దు పెట్టుకుంటున్నాడు.

గభాలున అతడ్ని తోసేసి లేచింది.

‘‘ఆగాగు... జస్ట్‌ టెన్‌ మినిట్స్‌...’’ అరుస్తూ బ్రతిమాలుతోంటే ఆగ్రహంగా, మాడ్చేశాలా చూసింది. ‘‘యూ బీస్ట్‌...’’ అని తిడుతూ బట్ట చుట్టబెట్టుకుని తన రూంలోకి పరుగెత్తింది.

ఆ రాత్రంతా ఏడుస్తూనే కూర్చుంది.

సమయానికి స్పృహ రాకపోయి వుంటే, ఏం జరిగేదో తలచుకుని వజవజ వణకిపోయింది. తెల్లవారుతూనే హోటల్‌ ఖాళీ చేసి సిటీకి తిరిగొచ్చేసింది. ఆ పత్రికలో మానేసి మరో చోట చేరింది.

తన ప్రవర్తన సిగ్గు పడేట్టుందనీ, అందుకే తనని పంపేశాననీ హరీష్‌ చెబుతున్నాడన్నారు కొలీగ్స్‌. ‘‘డర్టీ పిగ్‌!’’ అని తిట్టింది తప్ప జరిగిందాని గురించి ఒక్క ముక్కా బయట పెట్టలేదు.

గుండెల్లో తుఫాను చెలరేగుతోంటే గ్లాసుడు నీళ్ళు ఒక్క గుక్కలో తాగేసింది నందిని.

తన ‘ఆ’ స్థానంలో తేజస్విని ఊహించుకుని బెంబేలు పడింది.

వారం రోజుల పాటు విదేశీ గడ్డమీద... రకరకాల మాయోపాయాలతో ఆమెని లోబరుచుకుంటాడు. పాడుజేస్తాడు. ఆమె జీవితాన్ని ఛిద్రం చేసేస్తాడు!

ఉద్విగ్నయైంది. అతడి నిజస్వరూపం బయట పెడితే?

గుండె ఆగినంత పనయ్యింది.

మొదట తన సంసారంలో దుమారం లేస్తుంది. తన భర్త అర్థం చేసుకునే వాడే కావొచ్చు. కాని ఒక మగాడు! ఇక బంధువులూ మిత్రులూ ఏకంగా కథలల్లుతారు! ఇన్నేళ్లూ నోరు మూసుకుని ఇప్పుడు కక్కిందంటే ఏదో మర్మమో బ్లాక్‌మెయిలో ఉండి ఉంటుందని ఆడిపోస్తారు. అతడి నుంచి ఏదో ఆశిస్తోందంటారు! ఈమె ప్రోత్సాహం లేకుండా అతడంతకు తెగిస్తాడా అని ఎదురు దాడికి దిగుతారు! అతడేమీ చెయ్యలేదని బుకాయిస్తోందిగాని, నోటి కందిన పండుని కొరక్కుండా వదుల్తాడా అంటారింకో అడుగు ముందుకేసి. శీలహీన అని ముద్రకొట్టి అసహ్యంగా మాట్లాడతారు. తప్పు చేయడం తప్పుకాదు గాని, దానిని నిస్సిగ్గుగా బయట పెట్టడమే తప్పని వాదిస్తారు. మొత్తానికి దాని ప్రభావం తన సంసారం మీదే కాదు, తమ పిల్లల భవిష్యత్తు మీదా పడుతుంది. ఎప్పటికీ చెరగని కళంకంగా నిలిచి పోతుంది!

ఆవేశం తగ్గగా మెల్లగా గుండె దిటవు చేసుకుంది నందిని.

‘ఎప్పుడో జరిగిపోయిన ఘటనని తలచుకుని అతిగా రియాక్టవడం అనవసరం. వయస్సు పైబడింది గనుక హరీష్‌ మారినా మారి ఉండొచ్చు. పైగా ఉన్నతస్థితిలో ఉన్న అతడ్నిప్పుడు వీధిలోకి ఈడ్చడం తన కెరీర్ కీ మంచిది కాదేమో!’ అనుకుందో లేదో అవార్డు ఫంక్షన్లో అతడి అనైతిక ప్రవర్తన గుర్తొచ్చింది. మనస్సు చేదుగా అయ్యింది.

అందరి హక్కుల గురించి టముకు వేసి మరీ చెప్పే మీడియా, తమ రంగంలోని లైంగిక వేధింపుల గురించి గళమెత్తక పోవడం సబబా?

తలపోటుగా ఉందన్చెప్పి ఇంటి కెళ్ళింది నందిని.

పక్కింటి అంకుల్‌ తమ ఇంటి ముందు నిలబడి పెద్ద గొంతుతో దూషించడం చూసి కంగారు పడింది.

‘‘ఏం జరిగిందండీ...’’

‘‘నీ కూతురు చేసిన నిర్వాకం చూడు. కండ ఊడొచ్చేలా కరిచింది. పాము కాటు కన్నా మనిషి కాటు ఎక్కువ విషపూరితమంటారు. ఇప్పుడేం చేసేది దేవుడా.!’’

పళ్ళ గుర్తు పడ్డ ముంజేతినీ, పళ్ళు దిగిన చోట మెరుస్తోన్న రక్తాన్నీ చూపించాడు. పోగైన జనం ‘‘అయ్యో అయ్యో. పాడు కాలం...’’ అంటూ బుగ్గలు నొక్కుకుంటున్నారు.

‘‘సారీ అంకుల్‌. ఎందుకిలా చేసిందో...’’

‘‘ఒళ్ళు పొగరెక్కి. పిల్లల్ని కంటే చాలదు. అదుపులో పెట్టాలి. వినయ విధేయతలు నేర్పాలి...’’ వీధంతటికీ వినపడేలా రెచ్చిపోయి అరుస్తున్నాడు. తల దించుకుని విసురుగా లోపలికెళ్ళి ఎనిమిదేళ్ళ కూతురి మీద విరుచుకు పడింది.

‘‘పెద్దాయన్ని ఎందుకు కరిచావ్‌?’’ కొట్టడానికి చెయ్యెత్తిందల్లా కూతురి కళ్ళనిండా ఉన్న రోషాన్ని చూసి ఆగింది.

‘‘అంకుల్‌ది బ్యాడ్‌ టచ్‌...’’ నిర్భయంగా చెప్పింది.

అదిరి పడింది. ‘‘ఏంటీ!’’

‘‘మా టీచర్‌ గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ చెప్పారు. అంకుల్ది బ్యాడ్‌ టచ్‌...’’ అంటూ జరిగిందంతా వివరించింది.

క్షణకాలం మ్రాన్పడిపోయింది. పిమ్మట కూతుర్ని హత్తుకుంది. ‘‘వెల్‌డన్‌. బాగా చేశావు’’

వీధిలోకెళ్ళి ‘‘మీరు చేసిన భాగోతం ఏంటో నా బిడ్డ చెప్పింది. అందరికీ చెప్పనా?’’ తీవ్ర స్వరంతో ప్రశ్నించింది.

‘‘ఏం... ఏం చెప్పింది...’’ తడబడ్డాడు.

‘‘ఈయన పెద్దమనిషి కాదు. అపర కీచకుడు. మన పిల్లలకి చాక్లెట్లు ఇచ్చి మచ్చిక చేసుకుని మాయ చేసే మృగాడు. థూ. నీదీ ఒక బతుకేనా!’’ కాండ్రించి ఊసింది.

అంతా కోపంతో ఊగిపోతూ అతడికి దేహశుద్ధి చేశారు. లబోదిబోమంటూ పారిపోయాడు.

‘‘ఇది మిగతా వాళ్ళకి గుణపాఠం అవుతుంది’’ అన్నారు ఒగురుస్తూ.

తేలికైన గుండెల్తో లోపలికెళ్ళి, ‘‘అతడికి తగిన శాస్తి చేశారు. ఇంక జన్మలో ఆడపిల్లల జోలికి వెళ్ళడు’’ అంటూ కూతుర్ని మెచ్చుకుంటూనే ధైర్యం చెప్పింది. లైంగిక వేధింపుల్ని ఎదిరించిన వారికి న్యాయం జరుగుతుందంటూ నమ్మకం కలిగించింది.

మనస్సులో మాత్రం ‘నీకున్న గట్స్‌ నాకు లేవు’ అని వాపోయింది.

భోం చేసి టీవీ పెట్టింది. హరీష్‌ ఇంటర్వ్యూ వస్తోంది.

అతడి పత్తిత్తు కబుర్లు విని ఒళ్ళంతా సీసా పెంకుతో గీరి కారం పూసినట్టుగా అనుభూతించింది నందిని.

నైతికంగా పతనమైన మనిషి, మహిళా విలేఖర్ని లైంగికంగా వేధించిన మనిషి ఒక గొప్ప సంపాదకుడిగా ప్రధాని వెంట విదేశాల కెళ్తున్నాడు. వెంట లేలేత గులాబీలాంటి తేజస్వినీ తీసుకెళ్తున్నాడు!

అతడు అంతా అనుకుంటున్నట్టు ఉత్తమ వ్యక్తి కాదనీ, గోముఖ వ్యాఘ్రం అనీ లోకానికి చాటితే?

తేజస్విలో తన చిన్నారి కూతురు కన్పించింది. కంపించిపోయింది.

‘నీతులు వల్లించే వాళ్ళు కాదు నిజాలు చెప్పే వాళ్ళు కావాలి. చాటున దాక్కునే వాళ్ళు కాదు తెరలు చించే వాళ్ళు ముందుకు రావాలి. ‘# మీటూ’ ఉద్యమాగ్ని చల్లారనివ్వకూడదు. నిత్యాగ్ని గుండంలా మార్చాలి...’ తను రాసిన వ్యాసంలోని ముగింపు వాక్యాలు చెవుల్లో మార్మ్రోగాయి.

వీరావేశంతో ఊగిపోయింది. ల్యాప్‌టాప్‌ తెరచింది నందిని. మూగవేదన బ్రద్దలైంది. మౌన వ్యధ ముక్కలైంది.

‘# మీటూ’ లో హరీష్‌ తన మీద చేసిన లైంగిక దాడి గురించి వివరించి గుండె భారం దించుకుంది.

మర్నాటి కదో సంచలన వార్త అయి ప్రింటు, ఎక్ట్రానిక్‌ రంగాన్ని ఊపేసింది. పదిహేను మంది మహిళా పాత్రికేయులు తామూ అతడి లైంగిక వేధింపులకు గురయ్యామంటూ పోస్టులు పెట్టారు. ఎందరో ప్రముఖులూ మహిళా సంఘాలూ నందినికి వత్తాసు పలికారు.

మహిళా జర్నలిస్టుల సంఘం తీవ్రంగా స్పందించింది. వారి విజ్ఞప్తిని మన్నించి ప్రధాని బృందంలోంచి హరీష్‌ని తొలగించినట్లు ప్రకటించారు.

తేజస్వి నందినిని వెదుక్కుంటూ వచ్చింది. కృతజ్ఞత నిండిన తడి కళ్ళతో చూస్తూ చేతులు జోడించింది.

ఆ ఆడబిడ్డని అక్కున చేర్చుకుంది నందిని.

‘‘మన మౌనమే మన పాలిట శాపమవుతుందని ఆలస్యంగా గ్రహించాను. అప్పట్లోనే నేను బయట పడివుంటే కొందర్నైనా వేధింపుల నుంచి, వేదనల నుంచి రక్షించే దాన్నయ్యే దానిని!’’ పశ్చాత్తాప పడుతూ అంది.


* * *


రచయిత పరిచయం

సింహ ప్రసాద్ పేరుతొ కథలు రాసే నా పూర్తి పేరు చెలంకూరి వరాహ నరసింహ ప్రసాద్ . 1973 నుండి రచనలు చేస్తున్నాను . ఇంతవరకు 408 కథలు,66 నవలలు ప్రచురితమయ్యాయి . 82 కథలకు,18 నవలలకు,2 నాటకాలకు బహుమతులందుకున్నాను. వివాహ వేదం,తిరుమల దివ్యక్షేత్రం ,స్వేచ్చా ప్రస్థానం ,స్త్రీ పర్వం,ధిక్కారం ,అభయం ,63 బహుమతి కథలు బాగా పేరు తెచ్చి పెట్టాయి. నివాసం హైదరాబాద్ లో.


164 views0 comments

Comments


bottom of page