top of page

మూగప్రేమ

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #మూగప్రేమ, #Mugaprema


'Mugaprema' - New Telugu Story Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 01/10/2024

'మూగప్రేమ' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


గోపన్న.... పాలవ్యాపారి....

వాళ్ళ తండ్రి ఆంజనేయులు అరవై సంవత్సరాలు అదే వ్యాపారం సాగించి చెన్నైలో వాషర్ మెన్ పేటలో ఇల్లు, తోట, దొడ్డి(పశువుల) ఏర్పరచుకొన్నాడు. సైకిల్ మీద ఇల్లిల్లూ తిరిగి స్వఛ్ఛమైన ఆవుపాలు, గేదెపాలు పోసేవాడు. మనిషి చాలా మంచివాడు. అబద్ధం చెప్పడు. అన్యాయంగా ఒకరి సొమ్మును ఆశించడు. ఎనభై సంవత్సరాలు జీవించి, అందరి చేత మంచిమనిషి అనిపించుకొని రెండూ సంవత్సరాల క్రిందట గతించారు. వారికంటే ముందు సంవత్సరం క్రింద వారి సతీమణి లక్ష్మి (మేనమామ కూతురు) గతించింది.


వారికి మొదట కూతురు పార్వతి... ఆరు సంవత్సరాల తర్వాత కొడుకు గోపన్న జన్మించారు.

ఆంజనేయులు కూతురును, ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదివించి పదహారవ ఏటనే తన చిన్న బావమరిది ముత్యాలుకు ఇచ్చి ఘనంగా వివాహం చేశాడు. ఆ తరువాత డిగ్రీవరకూ చదివిన గోపన్నకు తన బంధువుల అమ్మాయితోనే వివాహం జరిపించి, తన బాధ్యతలను తీర్చుకొన్నాడు. వారి ఇరవైఏళ్ళ ప్రాయంలో నెల్లూరు ప్రాంతం నుండి వారు చెన్నై (మద్రాసు)కు వచ్చారు. అరవై సంవత్సరాల క్రిందట. చెన్నైలో బాగా స్థిరపడిపోయిన కుటుంబం వారిది. గోపన్నకు ఇరువురు మగపిల్లలు. రాముడు, లక్ష్మణుడు. ఇరువురూ ఇంజనీరింగ్ చదువుతున్నారు. భార్య కోమలి హౌస్ వైఫ్.


గోపన్న తన తండ్రి లాగానే పాల వ్యాపారాన్ని సాగిస్తూ ఒక పాల డిపోను పెట్టాడు. అతనికి ఇరవై బర్రెలు (గేదెలు) పదిహేను ఆవులు వున్నాయి. పెద్దాయన పూండమల్లి దగ్గర ఇరవై ఎకరాల భూమిని కొని, అందులో వారి పశువులకు అవసరమైన పచ్చిగడ్డిని పెంచుతూ కొంత కోయించి దాన్ని ఇంటికి లారీలో తెప్పించి పచ్చిమేతను ఆవులకు, గేదెలకు వేసేవాడు. గోపన్న ఆ తండ్రి విధానాన్నే సాగిస్తున్నాడు. ప్రతి ఆవుకూ ఒక పేరు. గంగ, గౌరి, రాణి పేర్లు పెట్టి, ఆ పేర్లతో పిలిస్తే అవి తన వద్దకు, భార్యాపిల్లల దగ్గరకు వచ్చేలా ట్రైనింగ్ ఇచ్చాడు.


వీటికి తోడు ఇంట్లో ఒక పిల్లి, ఒక కుక్కనూ పెంచుతున్నాడు. ఆ కుక్క పిల్లులకు, ఆవులకు మంచి స్నేహం. కుక్క, పిల్లి ఆప్యాయంగా ఆవులను నాకేది. ఆవులు కుక్కకు, పిల్లిని తమ బిడ్డలుగా ఆప్యాయంగా నాకేవి. వాటికి పరస్పరం ఎంతో ప్రేమ.


ఉదయాన్నే పాలు పిండిన తరువాత.... ఆవులను, గేదెలను బయటికి వదిలేస్తాడు గోపన్న. అవి రోడ్ల పక్క కొంత దూరం నడిచి (షికార్) తిరిగి ఇంటికి వచ్చేస్తాయి. ఇలా ప్రతిరోజూ జరుగుతుంది. ప్రస్తుతంలో రోడ్లనన్నింటినీ మున్సిపల్ కార్పోరేషన్ వారు రోడ్డుకు రెండువైపులా వున్న షాపులను, దుకాణాలను కొంత కట్ చేసి రోడ్ల వెడల్పును పెంచారు. వాహనాలు, కార్లు వగైరా ఫ్రీగా తిరిగే రీతిగా.

కుక్క పేరు వీర. పిల్లి పేరు నిమ్మి. ఆ పేర్లతో పిలిస్తే అవి తోక ఆడిస్తూ పిలిచిన ఇంటి వారందరి దగ్గరకూ వచ్చేవి.


ఒక్కోరోజు కుక్క వీర ఆవులతో కలిసి తనూ బయటికి వెళ్ళేవాడు. మరలా వాటితో పాటే తిరిగి ఇంటికి వచ్చేవాడు. ఆ మూగ జంతువుల నోరు (మాట్లాడేదానికి) తినేదానికి తప్ప మాట్లాడేదానికి పనికిరాదు కదా!... కానీ.... వాటికీ మనస్సు వుంది. మనస్సు మూగది. కానీ దానికి భాష ఉంది. ఆ పశువులు కుక్క, పిల్లి ఆ వారి మూగ భాషలో మాట్లాడుకొనేవి. ఆనందించేవి. దైవ సృష్టి ఎంతో విచిత్రం కదా!...


ఆ రోజు ఆవులు ఇంటి ఆవరణం నుండి పాలు పిండిన తర్వాత మామూలు ప్రకారం రోడ్లో ప్రవేశించాయి. తోటే కుక్క వీరా కూడా నడుస్తున్నాడు. కొంతదూరం వెళ్ళి మామూలు ప్రకారం ఆవులు వెనుతిరిగాయి. వరుసగా వస్తున్న ఆవులలో చివరన వుండినది గంగ. వాటన్నింటి కన్నా ముందు వున్నది వీర (కుక్క).


వేగంగా వచ్చిన ఒక లారీ గంగ ఎడమ కాలికి తగిలి నిలవకుండా ముందుకు వెళ్ళిపోయింది. గంగ అంబా... అంటూ నిలబడలేక నేలకూలింది. ఆవులన్నీ గంగ చుట్టూ చేరాయి. బాధతో గంగ కళ్ళల్లో కన్నీరు. దాన్ని చూచిన మిగతా ఆవుల కళ్ళల్లో కన్నీరు. వీర (కుక్క) వెనక్కు పరుగున వచ్చి గంగను సమీపించింది. దాని కళ్ళల్లోకి దీనంగా చూచింది.


గౌ...గౌ...గౌ, అని అరిచింది. ప్రీతిగా గంగ మూతిని నాకింది. వాహనాలు వస్తూ వున్నందువలన ఆవులు ప్రక్కకు తప్పుకొన్నాయి. వాటి వదనాల్లో విచారం. అన్ని గంగనే చూస్తున్నాయి. గంగ కళ్ళనుండి ఆశ్రుధారలు కారిపోతున్నాయి. బాధతో ’అంబా... అంబా’ అంటూ అరుస్తుంది గంగ.

కొంతమంది జనం గుమికూడారు.


’కాలు ఇరిగినట్టుంది’ ఒకరు....

’తొడకు దెబ్బ తగిలినట్టుంది’ మరొకరు...


"ఈ ఆవులు కలవారికి బుద్ధిలేదు. నోరులేని జీవాలను ఇలా రోడ్డుకు వదులుతారా!.... వారు అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో!" ఒక మహా జ్ఞాని విమర్శ.


కొద్ది నిముషాల్లో గుమికూడిన అందరూ వెళ్ళిపోయారు. ఎవరి పని, అవసరం వాడిది. మనిషినే పట్టించుకోని ఆంగ్ల చదువుల పండితోత్తములు ఇక ఆవు బాధను గురించి, దానికి జరిగిన ప్రమాదాన్ని గురించి ఏం పట్టించుకొంటారు!!!


వీర (కుక్క) నాలుగు వైపులా చూచింది. గంగ కళ్ళల్లోకి చూచింది. ’భౌ....భౌ’ అని అరిచింది. వేగంగా తన యజమాని ఇంటివైపుకు పరుగెత్తింది. అప్పుడే ఇంట్లోనించి వరండాలోనికి వచ్చిన గోపన్నను సమీపించింది. ’భౌ...భౌ....భౌ...’ అరిచింది. దాని కళ్ళల్లో కన్నీరు.

గోపన్నకు విషయం అర్థం కాలేదు.


వీర... ఇంకా పెద్దగా ’భౌ....భౌ....భౌ’ అని అరిచింది. అతని ప్యాంట్‍ను తన నోట్లోకి తీసుకొని గోపన్నను ముందుకు లాగింది. వీర (కుక్క) ఆ చర్యకు గోపన్న హృదయంలో సంచలనం ’ఏదో జరిగింది’ అనుకొన్నాడు.


"ఏంది వీరా!..." తలను జవురుతూ అడిగాడు గోపన్న.


వీర ’భౌ...భౌ...భౌ’ అని అరిచి గోపన్న ప్యాంటును బలంగా లాగింది.


‘ఎక్కడో ఏదో జరిగింది!...’ అనుకొన్నాడు గోపన్న.


వీరా అరుపులు విని భార్య కోమలి, కొడుకు రామ లక్ష్మణులు వరండాలోకి వచ్చారు.

"ఏంది నాన్నా!....వీరా ఎందుకు అరుస్తున్నాడు?" అడిగాడు రాము.


కోమలి, రామ లక్ష్మణులు వీరా (కుక్క) ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూచారు.

వీర (కుక్క) ’భౌ...భౌ...భౌ’ అరిచింది. రామూ ప్యాంట్‍ను పట్టుకొని లాగింది.

"నాన్నా! ఏదో జరిగింది మనల్ని అక్కడకు రమ్మంటూ పిలుస్తున్నాడు వీరా!... పదండి" అన్నాడు రాము.


"కోమలీ!... వెళ్ళొస్తా!" అన్నాడు గోపన్న.


"సరేనండి జాగ్రత్త!" అంది కోమలి.


"నాన్నా!... నేనూ రానా!" అడిగాడు లక్ష్మణుడు.


"నీవు వద్దులే అయ్యా!... అమ్మ దగ్గర వుండు. నేను, అన్నా వెళ్ళిస్తాం" అన్నాడు గోపన్న.


ముందు వీరా, వెనుక గోపన్న, రామూ బయలుదేరారు. వీరా వేగంగా పరుగెత్తసాగింది. దాని ఆతృతను, వేగాన్ని చూచిన గోపన్న, రాములు పరుగెత్తారు.


పదిహేను నిముషాల్లో గంగ, ఆవులు వున్న స్థానానికి చేరారు. ముందుగా వీర గంగను సమీపించి ’భౌ...భౌ...భౌ’ అరిచింది. అంటే దాని ఆ అరుపులోని అర్థం ’మన వాళ్లను తీసుకొచ్చానని’

గంగ కన్నీటితో వీర ముఖంలోకి, యజమాని రాజన్న, రాము ముఖాల్లోకి దీనంగా చూచింది. ’అంబా...’ అని అరిచింది. 


రామూ, రాజన్నలు గంగ కాలును పరీక్షించారు. గిట్టలపై భాగం వాచి వున్నందున విరిగిందని భావించారు. వారి లారీ డ్రైవర్‍కు ఫోన్ చేసి అడ్రస్ చెప్పి వెంటనే రావాలని చెప్పారు. క్రైన్ పిలిపించారు. గంగ పొట్ట కింది మోకులను వేసి మెల్లగా లేపి లారీలో పడుకోబెట్టారు.


వీర ’భౌ...భౌ...భౌ’ అని అరుస్తూ వుంది. ఆ అరుపు అర్థం ’జాగ్రత్త.... జాగ్రత్త’ అని.


వీర లారీలో ఎక్కింది. గంగ ముఖంలోకి విచారంగా చూడసాగింది. రాము, రాజన్న లారీలో వెటర్నిటీ హాస్పిటల్‍కు గంగను తీసుకొని వెళ్ళారు. డాక్టర్ గారిని కలిసి విషయాన్ని చెప్పారు. డాక్టర్ దయానిధి గంగను పరీక్షించాడు.


"సార్! గిట్టలపైన కాలు విరిగింది. నేను ట్రీట్‍మెంట్ చేస్తాను. మూడు వారాల్లో సెట్ అవుతుంది. ఇంజక్షన్ వేస్తాను. మందులు ఇస్తాను. క్రమంగా రెండు వారాలు వాడండి సరిపోతుంది. ఆవు లేచి పూర్వంలా నడుస్తుంది." ఎంతో అభిమానంగా చెప్పాడు డాక్టర్ దయానిధి.


ఇంజక్షన్ చేసి కాలుకి కట్టు కట్టాడు.


"నేను రేపు మీ ఇంటికి వచ్చి చూస్తాను. ధైర్యంగా వెళ్ళండి" చిరునవ్వుతో చెప్పాడు దయానిధి.


వీరా, గంగ ప్రక్కనే వున్నాడు. డాక్టర్ చర్యను గమనించాడు. అంతా ట్రీట్మెంటు అయిన తరువాత...

గంగ ముఖం దగ్గర తన మూతిని వుంచి ప్రీతిగా నాకింది...


’భౌ...భౌ...భౌ’ మని అరిచింది. అంటే... ’నీకేం భయం లేదు తగ్గిపోతుంది’ అని.


గోపన్న, రాము లారీలో గంగను వీరాను ఇంటికి చేర్చారు. క్రైన్‍తో గంగను మెల్లగా గడ్డి పడకపై దించారు. ఆవులన్నీ ఇంటికి చేరాయి. పిల్లి నిమ్మి పరుగున గంగను సమీపించింది. దాని చుట్టూ తిరిగి చూచింది. గంగ నోటి దగ్గర తన నోటిని వుంచి ’మియావ్... మియావ్..’ అంది. అంటే ’గంగ ఏమైంది అమ్మా!’ అని అర్థం.


వీరా తన నోటితో పచ్చి గడ్డిని గంగకు అందించింది. వీర, నిమ్మి గంగ మూతిని ప్రీతిగా నాకారు.


ఆ మూగ జీవుల సఖ్యతకు, పరస్పర ఆదర అభిమానాలకు, వారి మధ్యన వున్న ’మూగ ప్రేమ’కు ఆ ఇంటిల్లి పాదీ ఆశ్చర్యపోయారు. వారి పరస్పర అభిమానాలకు సంతోషించారు.

*

సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


27 views0 comments

Comments


bottom of page