top of page

ముగ్గురు పనిమంతులు

బాలల కథ


'Mugguru Panimanthulu' - New Telugu Story Written By Kasivarapu Venkatasubbaiah Published In manatelugukathalu.com On 24/06/2024

'ముగ్గురు పనిమంతులు' తెలుగు కథ

రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



పూర్వం ఆస్మక దేశంలో దిస్సెల అనే పల్లెటూరులో ముగ్గురు చురుకైన యువకులు ఉండేవారు. వసంతుడు, హేమంతుడు, శరద్వంతుడు అనే పేర్లు గల వీరు మంచి అందగాళ్ళు. అంతేకాదు, ముగ్గురూ మూడు విద్యలలో ప్రవీణులు. 


మొదటి వాడైన వసంతుడు దూరపు చూపు గలవాడు, ఎన్ని యోజనాల దూరంలో ఉన్న ఏ వస్తువునైనా చూడగలవాడు. 


రెండవవాడైన హేమంతుడు దూరపు గురి గలకాడు. ఇతడు ఎన్ని యోజనాల దూరంలో ఉన్న ఏ వస్తువునైనా బాణంతో కొట్టగలవాడు. 


మూడవవాడైన శరద్వంతుడు దూరపు అడుగులు గలవాడు. ఇతను ఎన్ని యోజనాల దూరమైనా ఐదారు అంగల్లో చేరుకోగలవాడు. 


 ఈ ముగ్గురూ ఏ పనీ చేయకుండా, రూపాయ ఆదాయం ఆర్జించకుండా ఊరికే జులాయిగా తిరిగేవాళ్లు. ఇంట్లో వాళ్లు, వీధిలో వాళ్ళు, ఇరుగుపొరుగు వాళ్ళు ఈసడించుకొనేవారు. సూటి పోటి మాటలు అనేవారు. ఎగతాళి చేసేవారు. చిన్న చూపు చూసేవారు. ఆ మాటలు వినలేక ఒకరోజు ఆ ముగ్గురూ ఎలాగైనా ధనం సంపాదించాలని నిర్ణయించుకున్నారు. 


ఒక సుముహూర్తాన ధన సంపాదనకు దేశ పర్యటనకు బయలుదేరిపోయారు. చీకటి పడే వేళకు ఒక పూటకూళ్ళ అంగడి చేరుకున్నారు. ముగ్గురూ మూడు రూకలు ఇచ్చి భోజనానికి కూర్చున్నారు. భోజనశాల యజమానురాలు భోజనం వడ్డిస్తున్నది. అక్కడే తమ లాగే భోజనం చేస్తున్న ప్రయాణికులు ఏదో ముచ్చటించుకుంటున్నారు. వారి మాటల సారాంశం ఏమిటంటే.. 

ఆ దేశాన్నేలే రాజు దేవవ్రతుడు. అతని కుమార్తె తేజస్విని. ఆమె అంతుపట్టని జబ్బుతో బాధ పడుతుంది. రాజవైద్యులు నయం చేయలేకపోయారు. రాజు దేశదేశాల రాజవైద్యులను రప్పించి చూపించాడు. వారందరూ లాభం లేదన్నారు. 


దశార్ణవ రాజ్యం నుంచి వచ్చిన వైద్యుడు రాకుమార్తె తేజస్విని నాడి, కళ్ళు, ఒళ్ళు పరిశీలించి "రాకుమార్తెకు వచ్చిన జబ్బు సాదారణ జబ్బు కాదు. ఆయుర్వేదంలో ఇప్పుడు అందుబాటులో ఉన్న మూలికలు ఏవీ ఈ జబ్బుకు పని చేయవు. అయితే ఒక అవకాశం మాత్రం ఉంది. అది అసాధ్యమైన వ్యవహారం. సప్త సముద్రాల అవతల మఖర ద్వీపం ఉంది. అందులో ఒక మహా వృక్షం ఉంది. దానికి సంవత్సరానికి ఒకేఒక్క పండు కాస్తుంది. ఆ పండును బాణంతో కొట్టి, పండు క్రింద పడకుండా పట్టుకొని తెచ్చి, ఆ పండు రసం యువరాణికి త్రాపితే రాకుమార్తె జబ్బు తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అవుతుంది. ఈ మొత్తం వ్యవహారం ఒక్క రోజులో జరగాలి. ". అని చెప్పుతాడు. 


“ఆలస్యమైతే పండు చెడి పోతుంది. చెడిన పండు ఉపయోగపడదు. ఇది అసాధ్యమైన కార్యం. దీనిని సాధించు వారు ఎవరూ ఉండరు. కనుక రాకుమారి మరణాన్ని ఆపలేం " వైద్యుడు ఉద్ఘాటిస్తాడు

రాజు దేవవ్రతుడు వైద్యుడి మాటలు విని విపరీతంగా బాధపడతాడు తన ఏకైక కుమార్తెను ఎవరైనా కాపాడుతారా అన్ని ఆశతో మరుసటి రోజు "సప్త సముద్రాల అవతల ఉన్న మఖరద్వీపం చేరుకొని అక్కడ ఉన్న మహా వృక్షానికి కాసిన పండును బాణంతో కొట్టి, అది క్రింద పడకుండా పట్టుకొని తెచ్చి ఇచ్చిన వాడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసి, తన రాజ్యానికి రాజును చేస్తాను" అని తన దేశమంతటా చాటింపు వేయించాడు దేవవ్రతుడు. 


ఈ వార్త తెలుసుకున్న ముగ్గురు మిత్రులు సరాసరి ఆస్మక దేశ రాజధానికి బయలుదేరి కోటకు చేరుకున్నారు. ద్వారపాలకున్ని సమీపించి, తమ గురించి వివరించి, తాము వచ్చిన విషయం రాజుగారికి తెలుపమని చెప్పారు. 


ద్వార పాలకుడు పరుగున పోయి రాజుకు వర్తమానం అందించాడు. రాజు మహానందంగా వారి మువ్వురికి సకల సౌకర్యాలతో విడిది ఏర్పాటు చేసి ‘రేపు ఉదయం వరకు వేచి ఉండండి' చెప్పాడు దేవవ్రతుడు. 


మరునాటి ఉదయం భారీ సభ ఏర్పాటైంది. సభలో రాజుతో పాటు మంత్రి, సైన్యాధిపతి ఆసీనులై ఉన్నారు. రాజు ముగ్గురి మిత్రులను సభకు రప్పించి వారి ప్రతిభా విశేషాలను సభకు తెలుపమన్నాడు. 


వసంతుడు " నేను ఎంత దూరంలో ఉన్న వస్తువునైనా చూడగలను" అని సభాసదులకు విన్నవించాడు. 


హేమంతుడు "నేను ఎంత దూరంలో ఉన్న వస్తువునైనా బాణంతో కొట్టగలను" చెప్పాడు. 


శరద్వంతుడు "నేను ఎంత దూరమైనా పోయి అక్కడి వస్తువును తేగలను" సభకు వివరించాడు.

 

మంత్రి "మా రాకుమారికి వింత జబ్బు సోకింది. ఆ జబ్బు తొలిగి పోవాలంటే తూర్పు దిశగా సప్తసముద్రాల అవతల మఖరద్వీపం అనే ఒక దీవి ఉన్నది. ఆ దీవిలో మహా వృక్షం ఉంది. దానికి ఒకేఒక్క పండు ఉంది. దానిని బాణంతో కొట్టి, అది క్రింద పడకుండా పట్టుకొనితెచ్చి, దాని రసం యువరాణికి త్రాపితే జబ్బు నయమవుతుంది. మీరు తేగలరా! చెప్పండి " మంత్రి ముగ్గురిని ఉద్దేసించి చెప్పాడు. 


"మేము ఈపని సాధించగలం. మేము ముగ్గురం కలిసి పండును తేగలం ప్రభు " రాజుకు చెప్పారు ముగ్గురు మిత్రులు. 


రాజు అనుజ్ఞ ఇవ్వగా వసంతుడు తూర్పు దిశగా నిలబడి సప్తసముద్రాల అవతలికి చూపు సారించాడు. అతని చూపు సప్తసముద్రాల అవతలివైపు ఉన్న మఖరద్వీపం లోని మహావృక్షానికి ఉన్న పండుపై పడింది. వసంతుడు వేలు చూపుతున్న దిశగా హేమంతుడు బాణం సంధించి వదిలాడు. బాణం పోయి పండుకు తగిలింది, అది క్రింద పడేంతలో శరద్వంతుడు మూడు అంగల్లోపోయి పండును అందుకొని, మరో మూడంగల్లో తిరిగి వచ్చాడు. 


పండును చిన్న ముక్కలుగా తరిగి, ఒక పాత్రలో చిలికి యువరాణి తేజస్వినికి త్రాగించారు. మూడు నెలల్లో నూతన రక్తం సంతరించుకొని, జవసత్వాలు పుంజుకొని, సంపూర్ణ ఆరోగ్యంతో సర్వాంగ సుందరంగా రూపు దాల్చింది రాకుమారి. అందరూ సంతోషించారు గాని అసలు సమస్య అప్పుడే మొదలైంది. కార్యం సాధించడంలో ముగ్గురి పాత్ర సమానంగా ఉన్నప్పుడు రాకుమారిని ఎవరికిచ్చి వివాహం చెయ్యాలి అన్నదే సమస్య. 


ఈ చిక్కు సమస్యను పరిష్కరించడానికి రాజు న్యాయమూర్తులను, ధర్మవేత్తలను సమావేశ పరిచాడు. విషయం వివరించి న్యాయపరంగా, ధర్మబద్ధంగా ఈ ముగ్గురిలో రాకుమారిని వివాహం చేసుకోవడానికి ఎవరు అర్హులో నిర్ణయించమని కోరాడు. న్యాయమూర్తులు, ధర్మవేత్తలు చర్చించి, తర్జనభర్జన పడి ఒక నిర్ణయానికి వచ్చారు. 


 వారు రాజుతోను, సభాసదులతోను తమ నిర్ణయాన్ని ప్రకటిస్తూ "మహారాజా! ముగ్గురూ సమర్థులే. ముగ్గురి నైపుణ్యం కార్యం సాధించడంలో సమానంగా ఉంది. కానీ ఇక్కడ సూక్ష్మంగా పరిశీలిస్తే శరద్వంతుడు రాకుమారిని వివాహం ఆడడానికి అర్హుడని తేలుతుంది. వసంతుడు ఇక్కడ నుండే పండును చూడగలడు. హేమంతుడు ఇక్కడ నుండే గురి చూసి పండును కొట్టగలడు. వీరిద్దరూ అక్కడి నుండి పండును తీసుకొని రాలేరు. పండును తీసుకొని రాలేనప్పుడు దూరంనుంచి చూసిన, దూరంనుంచి గురి చూసి బాణంతో పండును గొట్టిన ఉపయోగం ఉండదు కదా! 


కాబట్టి సప్తసముద్రాల అవతలికి బోయి మఖరద్వీపంలో పండు క్రింద పడకుండా పట్టుకొని తీసుకొచ్చి రాకుమారి తేజస్వినిని బ్రతికించిన శరద్వంతుడే వివాహార్హుడు. " అని న్యాయమూర్తులు ధర్మవేత్తలు తీర్పు చెప్పారు. ఆ తీర్పును వసంతుడు, హేమంతుడితో సహా అందరూ అంగీకరించారు. 


ఆతరువాత దూరదృష్టి గల వసంతుడికి మంత్రి సులోచనుడు తన కుమార్తె సుప్రియను, సైన్యాధిపతి వీరసేనుడి కూతురు సుమిత్రను ధనుర్విద్యలో ప్రవీణుడైన హేమంతుడికి ఇచ్చి వివాహం జరిపించడానికి అంగీకరించారు. 


యువరాణి తేజస్వినిని శరద్వంతుడితో, సుప్రియను వసంతుడితో, సుమిత్రను హేమంతుడితో వివాహ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.. 


అటు కొంత కాలానికి శరద్వంతుడు రాజుగాను, వసంతుడు మంత్రిగాను, హేమంతుడు సర్వసైన్యధిపతిగాను రాజ్యాన్ని పరిపాలించారు 

 ---------- 

కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Podcast Link:

Youtube Play List Link:

పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య

చదువు: B.com

పుట్టిన తేది: 1960

తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య

రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.

అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.

సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.

సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.



37 views0 comments

Comments


bottom of page