top of page

శిఖండి పూర్తి జీవిత కథ



'Sikhandi Purthi Jivitha Katha' - New Telugu Story Written By Kasivarapu Venkatasubbaiah Published On 16/05/2024

'శిఖండి పూర్తి జీవిత కథ' తెలుగు కథ

రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



శిఖండి మహాభారతంలో ఒక విచిత్రమైన పాత్ర. పట్టుదల, పౌరుషం గల పాత్ర. మహారథుడు. ప్రతీకారంతో భీష్ముని మరణానికి కారణమైనవాడు శిఖండి. 


శిఖండి ముందు జన్మలో స్త్రీ. కాశీరాజు పెద్ద కుమార్తె, యువరాణి. పేరు అంబ. కాశీరాజు ముగ్గురు కుమార్తెలలో మిగతా ఇద్దరు అంబిక, అంబాలిక. వీరికి యుక్త వయసు రాగానే కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడు. ఆ స్వయంవరానికి నానాదేశపు రాజులతో పాటు సాళువరాజు, భీష్ముడు కూడా వచ్చారు.


ఆహ్వానితులైన వివిధ దేశాల రాకుమారులు ఆశీనులై ఉన్న సభా భవనంలోకి కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలను స్వయంవర వేదిక పైకి రప్పించాడు. రాకుమార్తెలు రాగానే రాకుమారులలో కలకలం రేగింది. ఎవరికి వారు తామే సొంతం చేసుకోవాలని ఒకరి పై ఒకరు సంకుల సమరానికి దిగారు. 


భీష్ముడు తన ఆసనంపై నుంచి లేచి స్వయంవరం వేదిక పైకి పోయి, సకల రాజన్యులను ఉద్దేశించి 

"రాకుమారులారా! ఈ రాకుమార్తెలను నా సోదరుడు విచిత్రవీర్యుడికి వివాహం చేయడానికి తీసుకెళ్ళుతున్నాను. మీలో ఎవరైనా నన్ను ఎదిరించి ఈ రాకుమార్తెలను దక్కించుకోవచ్చు!” అని ప్రకటించగానే రాకుమారులంతా ఒక్కుమ్మడిగా భీష్మునితో తలపడగా, వారందరినీ తృటిలో దునుమాడినాడు భీష్ముడు. 


సాళ్వుడు భీష్ముని ఎదుర్కోన రాగా అతనిని కూడా పడగొట్టి, రాకుమార్తెలు ముగ్గురిని రథంపై వేసుకుని, వాయువేగంతో హస్తినాపురం దిశగా రథాన్ని పరుగులు పెట్టించాడు భీష్ముడు. 


హస్తినాపురం చేరాక మువ్వురు రాజకుమార్తెలలో పెద్దదైన అంబ భీష్ముడితో " మహాత్మా! నేను సాళ్వభూపతిని ప్రేమించాను. స్వయంవరంలో నేను అతనినే వరించే దానిని. ఇంతలోపల నన్ను బలవంతంగా తెచ్చారు. మనువు ఒకచోట మనసు ఒకచోట ఉండడం సరైనది కాదు కదా! కావున నన్ను సాళ్వుడి దగ్గరకు చేర్చండి. నా సోదరీ మణులను మీ సోదరుడికి వివాహం జరిపించండి. " అని విన్నవించింది.

 

భీష్ముడు ఆమె కోరికను మన్నించి సాళ్వుడి సన్నిధికి పంపాడు. సాళ్వుడు "నన్ను ఓడించి గెలుచుకున్న నిన్ను నేను పరిగ్రహించను. నీవు అతని సొంతం. నాకు వలదు వెళ్లిపో " అని ఆమెను తిరస్కరించాడు. 


అంబ భీష్ముడి దగ్గరకు తిరిగి వచ్చి "నా ప్రేమను నాశనం చేశావు గనుక నీవే నన్ను వివాహం చేసుకో " అన్నది.


అందుకు భీష్ముడు "నేను వివాహం చేసుకోనని, ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిన బూనాను. ఎట్టి పరిస్థితుల్లోనూ పతిజ్ఞ నియమాన్ని ఉల్లంఘించను. " అన్నాడు.. 


అంబ భీష్ముడిని బతిమిలాడిలాడింది, బంగపోయింది, దూషించింది, శాపనార్థాలు పెట్టింది. అయినా భీష్ముడు ససేమిరా కాదు పొమ్మన్నాడు. అంబ భీష్ముడి గురువైన పరశురాముడిని ఆశ్రయించింది. పరశురాముడు ఆశ్రయమిచ్చి అభయమిచ్చాడు. 


భీష్ముడిని రప్పించి "నీ వలనే అంబ వివాహ జీవితం సర్వనాశనం అయ్యింది కనుక నువ్వే వివాహం చేసుకుని ఆమె జీవితాన్ని సరిచేయి. నీకు శస్త్రాస్త్రాలు నేర్పిన గురువుగా నిన్ను శాసిస్తున్నాను" అన్నాడు పరశురాముడు. 


"గురువర్యా! నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను. ప్రాణమైనా వదులు కుంటాను గానీ మాట తప్పను. ఆమెను పెళ్ళాడడం తప్ప ఏమైనా అడగండి. మీ శిష్యునిగా తలదాల్చి నిర్వర్తిస్తాను" వినమ్రంగా బదులిచ్చాడు భీష్ముడు. 


 "అట్లైన నాతో యుద్ధం చేయాల్సి ఉంటుంది గాంగేయా! " పరుషంగా గద్దించాడు భార్గవ రాముడు. 


"గురువర్యా! ఆమెను పెళ్ళాడి నియమం తప్పే కన్న, మీతో యుద్ధానికి సిద్ధపడి మీ చేతుల్లో మరణించడమే మేలు"

 

"అయితే సమరానికి సిద్ధపడు" అని ధనుర్బాణాలు అందుకున్నాడు పరశురాముడు. 


భీష్ముడు కూడా విల్లంబులు అందుకున్నాడు. ఇద్దరి మధ్య భీకర రణం సాగింది. ఒకరిపై ఒకరు శర పరంపరలు సంధించుకున్నారు. అంతకంతకు యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. మహాశక్తివంతమైన అస్త్రాలు ప్రయోగించు కున్నారు. యుద్ధం ఇరవై రెండు దినముల పాటు కొనసాగింది. పరశురాముడు వయోభారంతో అలసి పోయాడు.


 యుద్ధం విరమించి అంబతో "అంబా! భీష్ముడు మహావీరుడు. ఈ భూమండలంలో ఇతన్ని జయించువాడు మరొకడు లేడు. అంతే గాక నాకు వార్ధక్యం మీదపడింది. నేను నీకు సహాయం చేయలేక పోతున్నాను" అని పలికాడు.

 

అప్పుడు అంబ భీష్ముడితో "భీష్మా! నిన్ను జయించు వీరుడే లేడని అహంకారంతో ఉన్నావు కదూ. ఎప్పటికైనా నిన్ను నేనే సంహరిస్తాను. ఇది సత్యం " అని మహా కోపోద్రిక్తురాలై శపథం చేసింది. 


అది విన్న భీష్ముడు " నీవు ఆయుధంను చేపట్టి యుద్ధానికి సిద్ధపడితే, నేను అస్త్ర సన్యాసం చేస్తాను " అని పలుకుతాడు. 


ఆమె అక్కడ నుంచి నిష్క్రమించి తన తాత అయిన హోత్రవాహన రాజర్షి చెంతకు చేరింది. తనకు భీష్ముడి వల్ల జరిగిన అన్యాయం గురించి చెప్పింది. హోత్రవాహనుడు తన మనుమరాలికు జరిగిన అన్యాయానికి ఉగ్రుడై, తపోశక్తితో ఒక గులాబీమాలను సృష్టించి, అంబకు ఇచ్చి "అంబా! ఈమాల ఎవడు మెడలో ధరిస్తాడో, వాడి చేతిలో భీష్ముడు మరణిస్తాడు. కావున నీవు ఎవరైనా వీరుడి మెడలో వేసి యుద్ధానికి పురిగొల్పు. విజయం నీదే!" అని దీవించి పంపాడు హోత్రవాహనుడు. 


మాలను గైకొన్న అంబ దేశదేశాల రాజులను కలిసి విషయాన్ని వివరించి ఈమాలను ధరించి భీష్ముడిని సంహరించమని అర్థించింది. అందులకు ఏ రాజు సాహసించక నిరాకరించారు. చివరకు ద్రుపద మహారాజును వేడుకుంది. 


"జగదేకవీరుడైన భీష్ముడితో యుద్ధంలో గెలువడం అసాధ్యం" అని చెప్పి అంబను పంపి వేశాడు. 


అంబ నిరాశ చెంది గులాబీ మాలను కోట గుమ్మానికి తగిలించి అడవులకు వెళ్ళిపోయింది. అక్కడ భీష్ముడిని వధించడం కోసం ఈశ్వరుడిని గూర్చి తపస్సు చేసింది.


 ఈశ్వరుడు ప్రత్యక్షమై "భీష్ముడిని సంహరించడం ఈ జన్మలో నీ వలన సాధ్యపడదు. వచ్చే జన్మలో శిఖండిగా పుట్టి నీ కోరిక నెరవేర్చుకుంటావు. " అని చెప్పి అంతర్ధానమైనాడు. ఆనంతరం అంబ చితి పేర్చుకుని ఆత్మాహుతి చేసుకుంది. 


అటు కొంత కాలానికి ద్రుపదుడు తనకు సంతానం లేని కారణంగా బిడ్డల కోసం ఈశ్వరుని గూర్చి తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై " ద్రుపదా! నీ భార్యకు తొలి కాన్పులో ఆడబిడ్డ పుడుతుంది. ఆడబిడ్డను మగబిడ్డగా పెంచు. కాలక్రమంలో నీ రాకుమార్తెకు పురుషత్వం సంక్రమిస్తుంది. కావున సకల విద్యలు నేర్పు. వీరుడిగా తీర్చిదిద్దు. మరికొంత కాలానికి నీకు ఒక మగ బిడ్డ, ఒక ఆడబిడ్డ పుడుతారు. " 

వరమిచ్చాడు శివుడు. 


అచిరకాలంలోనే ఆడబిడ్డ జన్మించింది. శిఖండి అని పేరు పెట్టి, మగ దుస్తులు వేసి పెంచాడు. ద్రోణుడి దగ్గరకు పంపి సమస్త విద్యలు నేర్పించాడు. శస్త్రాస్త్రాలు అధ్యయనం చేయించాడు. వీరాధివీరుడిగా మలిచాడు. ఒకనాడు శిఖండి కోట గుమ్మానికి వ్రేలాడుతున్న గులాబీమాలను మెడలో వేసుకొనగా ద్రుపదుడు చూసి తీవ్రంగా మందలిస్తాడు. 


శిఖండికి యుక్త వయసు రాగానే, పురుషుడిగా మారక మునుపే దశార్ణ దేశపు రాజు హేమవర్మ కుమార్తె యువరాణితో వివాహం జరిపించాడు. ఆనాటి రాత్రి శోభన సమయంలో యువరాణి శిఖండి స్త్రీ అని గుర్తించి, కోపంతో బాధతో తండ్రి దగ్గరకు పోతుంది. తండ్రి, జరిగిన మోసానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సైన్యంతో యుద్ధానికి బయలుదేరుతాడు. 


శిఖండి ఏమి చేయడానికి పాలుపోక చింతాక్రాంతయై  అడవిలోకి పోయింది. అడవిలో స్థూలకర్ణుడనే యక్షుడు చాల కాలంగా అక్కడే నివాసం ఉంటున్నాడు. స్థూలకర్ణుడికి భయపడి ఆ సమీపములోకి ఎవరు పోరు. యక్షుడు ఏమైనా చేయనీ అని యక్షుని ఆశ్రమ సమీపంలోనికి పోతుంది శిఖండి. 


స్థూలకర్ణుడు శిఖండిని చూసి " కుమారి! నీకు భయం లేదా? ఇక్కడిదాకా వచ్చావు " అడుగుతాడు. 


శిఖండి "చావడానికే వచ్చాను" అంటూ తాను ఎంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదీ.. తన కథనంతా చెబుతుంది. శిఖండిపై జాలిపడి స్థూలకర్ణుడు "నా పురుషత్వాన్ని పది రోజుల పాటు నీకు ఇస్తాను. నీ స్త్రీత్వం నాకు ఇవ్వు. సమస్యలన్నీ పరిష్కరించుకున్నాక తిరిగి వచ్చి నా పురుషత్వం నాకు ఇచ్చి నీ స్త్రీత్వం నీవు తీసుకో" అంటాడు. 


అందులకు శిఖండి అంగీకరించి కృతజ్ఞతలు తెలుపుకొని పురుషత్వాన్ని పొంది కోటకు పోతుంది. తనకు పురుషత్వం ప్రాప్తించిన విషయం తల్లిదండ్రులకు తెలుపుతుంది. వారు మహానందపడతారు. 


తన కూతురికి అన్యాయం జరిగిందన్న ఆవేశంతో, ససైన్యంతో ద్రుపదుడిపై దండెత్తి వస్తున్న దశార్ణ దేశ ప్రభువైన హేమవర్మకు ఎదురేగి స్వాగతం పలుకుతాడు శిఖండి. ఉగ్రుడైన హేమవర్మకు తన పురుషత్వాన్ని నిరూపించుకుంటాడు శిఖండి. 


హేమవర్మ "తన తొందరపాటు చర్యకు క్షమించమ" ని ద్రుపదుణ్ణి , శిఖండిని కోరుతాడు. హేమవర్మకు, అతని సైన్యానికి వారం రోజుల పాటు గానాభజాలతో ఆతిథ్యమిచ్చి సంతృప్తిగా పంపుతాడు ద్రుపదుడు. 


కుబేరుడు స్థూలకర్ణుడు ఉన్న అడవి గుండా పుష్పవిమానములో పోతూ స్థూలకర్ణుడి ఆశ్రమంలో దిగి స్థూలకర్ణుడిని పిలుస్తాడు. స్థూలకర్ణుడు స్త్రీరూపం నందు ఉన్నందున సిగ్గుతో ఇంటి బయటికి రాలేడు. తన సహచరుడిని పంపి స్థూలకర్ణుడిని బయటికి రప్పించాడు కుబేరుడు. స్థూలకర్ణుడు స్త్రీరూపంలో ఉండడం చూసి కోపించి "ఇక నుండి స్త్రీగానే ఉండు" అని శపించాడు. 


స్థూలకర్ణుడు కుబేరుడి పాదాలపై బడి వేడుకొనగా "స్థూలకర్ణా! ఇది దైవ సంకల్పంతో జరిగినది. ద్రుపదుడు కుమారుడి కోసం ఈశ్వరుని గూర్చి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై "ద్రుపదా! కుమార్తె జన్మిస్తుంది. ఆమెకు కాలక్రమంలో పురుషత్వం సంక్రమిస్తుంది” అని వరమిచ్చాడు. అది నీ వలన జరిగింది. కావున ఇలా జరగడం దైవ సంకల్పం. శిఖండి మరణించగానే నీ పురుషత్వం నీకు వస్తుంది" అని తెలిపి కుబేరుడు అక్కడ నుండి వెళ్లిపోయాడు. 


పది దినముల తరువాత శిఖండి స్థూలకర్ణుడి దగ్గరకు వచ్చి "మహాత్మా! నీ పురుషత్వం తీసుకుని నా స్త్రీత్వం నాకు ఇవ్వు. నీ సహాయానికి కృతజ్ఞుడను మహానుభావా!" అంటాడు. 


స్థూలకర్ణుడు శిఖండికి జరిగిందంతా చెప్పి " నా పురుషత్వం జీవితాంతం నీవే ఉంచుకో" అంటాడు. శిఖండి అందులకు సంతషించి మహానందంతో స్వగృహానికి పోతాడు. 


కాలాంతరంలో ద్రుపదునికి ఒక కుమారుడు దృష్టద్యుమ్నుడు, ఒక కుమార్తె ద్రౌపది జన్మిస్తారు. కాలక్రమంలో ద్రౌపది పాండవులను పెళ్లాడుతుంది. దృష్టద్యుమ్నుడు కురుక్షేత్రం యుద్ధంలో పాండవ సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడై యుద్ధభూమిలో సైన్యాన్ని నడుపుతాడు. 

కౌరవ పాండవులకు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో శిఖండి పాల్గొని పాండవుల పక్షాన యుద్ధం చేస్తాడు. 


పాండవుల సేనాధిపతులలో ఒకడిగా వ్యవహరిస్తాడు. యుద్ధంలో కౌరవుల వీరులను అనేకులను సంహరిస్తాడు. కృపాచార్యుని ఓడిస్తాడు. శిఖండి అశ్వద్ధామతో యుద్ధంలో తలపడినప్పుడు ఇద్దరూ సమాన స్థాయిలో యుద్ధం చేస్తారు. ఇద్దరూ గాయపడతారు. 


కౌరవుల పక్షాన సర్వసైన్యాధ్యక్షుడై సమరం సలుపు తున్నప్పుడు భీష్ముడు దుర్యోధనుడితో "సుయోధనా! యుద్ధంలో నా వలన నీకు మేలు జరగాలంటే యుద్ధం భూమిలో శిఖండి నాకు ఎదురు పడకుండా చూడండి. నేను ఆడవారితోను, మధ్యలో పురుషత్వం సంక్రమించిన వారితోనూ యుద్ధం చేయను. నేను వారిని చూడగానే అస్త్ర సన్యాసం చేస్తాను. శిఖండి అంగనాపూర్వుడు. కాబట్టి జాగ్రత్త పడండి. " అని చెబుతాడు.

భీష్ముడి మరణ రహస్యం భీష్ముడి ద్వారా తెలుసుకున్న పాండవులు యుద్ధం పదవరోజున భీష్ముడు అర్జునుడు ద్వంద్వ యుద్ధానికి దిగగా వారి మధ్యకు శిఖండి వచ్చి భీష్ముడిని ఎదుర్కుంటాడు. శిఖండిని చూడగానే భీష్ముడు అస్త్ర సన్యాసం చేశాడు. శిఖండి భీష్ముడి మీదకు తొలి బాణం ప్రయోగించాడు. ఆ తరువాత అర్జునుడు భీష్మునిపై అనేక బాణాలను శరపరంపరగా సంధించాడు. ఆ శరాఘాతాలకు భీష్ముడు నేలకు ఒరిగాడు. భీష్ముడు నేలపై పడకుండా అర్జునుడు శరములతో అంపశయ్య అమర్చుతాడు. ఆ అంపశయ్యపై ఉత్తరాయణ పుణ్యకాలం వరకు విశ్రాంతి తీసుకుని ఉత్తమ లోకాలకు వెళ్లిపోతాడు భీష్మ పితామహుడు. శిఖండి భీష్ముడిని సంహరిస్తానన్న శపథం నెరవేరింది. 


పద్దెనిమిదవ రోజు కౌరవుల పక్షాన అందరూ చనిపోయి అశ్వద్ధామ, కృతవర్మ, కృపాచార్యుడు మిగిలి ఉంటారు. రణభూమిలో, చీకటిలో, మృత కళేబరాల మధ్య దుర్యోధనుడు తోడలు విరిగి దీనావస్థలో పడి ఉండడం చూస్తారు ముగ్గురు. అశ్వద్ధామ సార్వభౌముడిని అట్లా దీనస్థితిలో చూడగానే ఉద్వేగానికి గురై " రాజా ఏదైనా కోరిక ఉంటే చెప్పు నెరవేరుస్తాను. " అంటాడు స్థిరచిత్తుడై. 


"అశ్వద్ధామా! పంచ పాండవులను సంహరించడమే నా కోరిక, అశ్వత్థామా! నిన్ను సర్వ సైన్యాధిపతిని చేస్తున్నాను. వారిని సంహరించి నా కోరిక తీర్చు!" అంటాడు దుర్యోధనుడు మరణిస్తూ.. 

"ఎలాగైనా పాండవులను సంహరించి దుర్యోధనుడి చివరి కోరిక తీర్చాలి" అనుకుంటాడు అశ్వద్ధామ. కృతవర్మ కృపాచార్యులతో చర్చిస్తాడు. 


"ఈరాత్రి సమయంలో పాండవులు గాడ నిద్రలో ఉంటారు. ఇప్పుడైతే వధించడం సులువు” అని తలచి అశ్వద్ధామ కృతవర్మను, కృపాచార్యుడిని వెంటబెట్టుకొని పాండవుల శిబిరాలలోకి ప్రవేశించి, నిద్రిస్తున్న ఉపపాండవులను పాండవులే అని భ్రమపడి వధిస్తాడు. ప్రక్కనే ఉన్న దృష్టద్యుమ్నుడిని కూడా సంహరిస్తాడు. అదే శిబిరంలో నిద్రిస్తున్న శిఖండి అలికిడికి మేల్కొని ఆయుధం అందుకొని అశ్వద్ధామను ఎదుర్కొంటాడు. ఏమి జరుగుతుందో తెలియని అయోమయంలో ఉండడం వలన అశ్వద్ధామ ఖడ్గానికి బలై మరణిస్తాడు శిఖండి. 


 శిఖండి మరణించడంతో అతని లోని పురుషత్వం తొలగి, స్థూలకర్ణుడిని చేరుతుంది. 

***

కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Podcast Link:

Youtube Play List Link:

పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య

చదువు: B.com

పుట్టిన తేది: 1960

తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య

రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.

అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.

సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.

సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.


45 views0 comments

Comments


bottom of page