top of page

నా ప్రియ‌మైన నీకు... నీ ప్రియ‌మైన నేను!

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.

Video link

'Na Priyamaina Niku Ni Priyamaina Nenu' Telugu Story Written By Ayyagari Sarma

రచన: అయ్యగారి శర్మ


పెళ్లి రోజు వెరైటీగా సెలెబ్రేట్ చేసుకోవాలనుకున్నారు.

పెళ్ళికి ముందు పరిచయాల గురించి నిజాయితీగా బయట పెట్టుకోవాలనుకున్నారు.

మరి నిజాన్ని ఒప్పుకోగలిగారా? పెళ్లి రోజు కలతలు మొదలయ్యాయా ?

అయ్యగారి శర్మ రచించిన ఈ ఆసక్తికరమైన కథలో తెలుసుకోండి.

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.


ర‌మకి న‌వ్వొచ్చేసింది. త‌ల వెన‌క్కి వాల్చి గ‌ట్టిగా న‌వ్వేసింది. ఇంకా ఆగ‌ని న‌వ్వును కొన‌సాగిస్తూనే, “అరె... ఇదేం వెరైటీ?” అంది.

ఆ న‌వ్వు నానీకి ఎంతో ఇష్టం. న‌వ్వేప్పుడు సొట్టలు ప‌డే ఆమె బుగ్గ‌లంటే ఇంకా ఇష్టం. అప్పుడు ఆమె క‌ళ్ల‌ల్లో త‌ళుక్కుమ‌నే వెలుగు మ‌రీ ఇష్టం. త‌ను కూడా న‌వ్వుతూనే ర‌మ కేసి అపురూపంగా చూస్తున్నాడు.

ర‌మ న‌వ్వాపుకుని, “ఇంకా నువ్వెక్క‌డున్నావ్ నానీ? వాట్సాప్‌లు, ఫేస్బుక్కులు, ఈమెయిళ్లు ఇవ‌న్నీ కాద‌ని... ఉత్త‌రాలా? అస‌లంత తీరికేదీ?” అంది.

“అది కాదు ర‌మా! ఆలోచించు. ఇద్ద‌రం ఒకే ఇంట్లో ఉంటున్నాం. అన్ని ప‌నులూ క‌లిసే చేసుకుంటున్నాం. హ‌డావుడిగా మాట్లాడేసుకుంటున్నాం. ఎవ‌రి ఆఫీస్‌కి వాళ్లు వెళ్లిపోతున్నాం. మ‌ధ్య‌లో మెసేజింగ్ చేసుకుంటున్నాం. కానీ... మ‌నసులో భావాలు చెప్పుకుంటున్నామా? అందుకే ఇది వెరైటీగా ఉంటుంది. ఏమంటావ్‌?” అన్నాడు ఒప్పించే ధోర‌ణిలో.

వాళ్ల పెళ్ల‌యి ఏడాదైంది. మ్యారేజ్ డే రాబోతోంది. దాన్ని వెరైటీగా జ‌రుపుకోవాల‌నుకున్నారు. ర‌క‌ర‌కాలుగా ఆలోచించారు. అప్పుడే నానీ ఈ కొత్త ఆలోచ‌న చెప్పాడు. చెప్ప‌గానే ఫ‌క్కుమంటూ న‌వ్వేసింది ర‌మ‌.

“ఆ మాత్రం దానికి ఉత్త‌రాలు దేనికి? డైరెక్ట్‌గా మాట్లాడేసుకోవ‌చ్చుగా?” అంది ర‌మ‌.

“ఏం మాట్లాడుకుంటున్నాం మ‌నం? వీకెండ్స్ ఎక్క‌డికి వెళ్లాలి? రేప్పొద్దున్న కూరేం చేసుకోవాలి? నీ ప్రాజెక్ట్ ఎంత వ‌ర‌కు వ‌చ్చింది? నీ ఈఎమ్మైలు ఎంత‌? నా ఎమ్మెఫ్‌లు ఎంత‌? ఇలాంటివేగా? నేనంటున్న‌వి అవి కావు...” అన్నాడు

నానీ, మంచం మీద బాసింప‌ట్టు వేసుకుని ఉత్సాహంగా ముందుకు కూర్చుని.

“మ‌రింకేం ఉంటాయి, మాట‌లు?” అంది ర‌మ ఒళ్లు విరుచుకుని వెన‌క్కి త‌ల‌గ‌డ మీద‌కి వాలుతూ. ఆరోజు ఆదివారం.

ఇద్ద‌రూ తీరిగ్గా ఉన్నారు. పొద్దున్నే అన్నం, పప్పు వండేసుకుని తినేసి మంచం మీద‌కి చేరారు. ఇద్ద‌రి సెల్లులు తీసేసి దూరంగా టేబుల్ మీద పెట్టి వ‌చ్చి, అప్పుడు మొద‌లు పెట్టాడు నానీ పెళ్లి రోజు ప్ర‌ణాళిక‌లు.

“ఇంకేమీ ఉండ‌వా? ఇవి త‌ప్ప మ‌నం షేర్ చేసుకోవ‌ల‌సినవేవీ లేవా?”

“ఏమో... నానీ! మ‌నం పెళ్ల‌యిన కొత్త‌లోనే చాలా చెప్పేసుకున్నాం క‌దా, నీ ఫ్యామిలీ గురించి నువ్వు, నా పేరెంట్స్ గురించి నేనూ. ఏం? నువ్వు చెప్పాల్సిన‌వేమైనా ఇంకా ఉన్నాయా? లేక‌పోతే...నేనేమైనా నీ ద‌గ్గ‌ర దా..స్తు..న్నా...న‌ని అనుమాన‌మా?” అంది ర‌మ ఆఖ‌రి మాట‌లు సాగ‌దీస్తూ సాలోచ‌న‌గా.

“అదిగో... అలా టాపిక్ డైవ‌ర్ట్ చేయ‌కు. నా ఉద్దేశం అర్థం చేసుకో. మ‌న మ్యారేజ్ డే ఇంకా టూ వీక్స్ ఉంది కదా? ఇది కేవ‌లం మ‌న పెర్స‌న‌ల్ అన్న‌మాట‌. ఈ ఏడాది కాలంలో నాలో నీకు న‌చ్చ‌నివి, న‌చ్చిన‌వి ఉంటాయి క‌దా? అలాగే ఇంత‌వ‌ర‌కు మ‌నకి మ‌నం చెప్పుకోని చిన్న‌నాటి మ‌ధురమైన జ్ఙాప‌కాలు... అంటే అదే... ఫ‌స్ట్‌క్ర‌ష్ అంటారే... అలాంటివ‌న్న మాట‌... అవ‌న్నీ కూడా సిన్సియ‌ర్‌గా ఓ ఉత్త‌రంలాగా రాయాలి. నాకు నీవు, నీకు నేను. స‌రేనా? జ‌స్ట్... థింక్ ఎ వైల్‌... యూ విల్ ఫైండ్ ఎ థ్రిల్ ఇనిట్‌...” అన్నాడు నానీ.

ర‌మకి కూడా ఆస‌క్తిగానే అనిపించింది.

“కానీ... నీ గురించి నాకు న‌చ్చ‌నివి, ఫ‌స్ట్‌క్ర‌ష్‌లు అవీ లేక‌పోతే?” అంది.

“అదిగో... అలా చెప్ప‌డ‌మే హిపోక్ర‌సీ. ఇద్ద‌రు క‌లిసి ఒక చోట ఉన్న‌ప్పుడు ఒక‌రికి న‌చ్చ‌నివి ఒక‌రికి డెఫినిట్‌గా ఉంటాయి.

కానీ మ‌నం జ‌న‌ర‌ల్‌గా ఎక్స్‌ప్రెస్ చేసుకోం. ఎడ్జెస్ట్ అయిపోతూ, కంఫ‌ర్ట‌బుల్‌గా మూవ్ అయిపోతాం. అలా మ‌నం ఎవాయిడ్ చేసిన ఎలిమెంట్సే ఆ త‌ర్వాత అసంతృప్తిగా మారి ఓ గ్యాప్‌ను ఏర్ప‌రుస్తాయి. ఆపై లైఫ్ మెకానిక‌ల్ అయిపోతుంది. అలా కాకుండా ఉండాలనే నా త‌ప‌నంతా... ఇక చిన్న‌నాటి అనుభూతులంటావా? అలాంటివి షేర్ చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న బంధం మ‌రింత గ‌ట్టిప‌డుతుంద‌ని నా న‌మ్మ‌కం...” అంటూ ఓపిగ్గా వివ‌రించాడు నానీ.

“ఏమో బాబూ... నాక‌స‌లు రాయ‌డం స‌రిగా రాదే.. "

“రాక‌పోవ‌డం కాదు... అల‌వాటు లేక‌, అవ‌స‌రం రాక‌. కానీ రాయ‌డం మొద‌లు పెట్టి చూడు ఎంత స‌ర‌దాగా ఉంటుందో? నా ఉత్త‌రం నువ్వు, నీ ఉత్త‌రం నేను చదువుకుంటుంటే ఇంకెత థ్రిల్లింగ్‌గా ఉంటుందో?”

ర‌మ‌కి కూడా ఇదేదో బాగానే ఉంద‌నిపించింది. “ఊ...” అంటూ కాసేపు ఆలోచించి, “మ‌రైతే ఎప్పుడు రాయాలి?” అంది.

నానీకి హుషారొచ్చింది. “నీకెప్పుడు వీలైతే అప్పుడు నాకు నువ్వు రాయి. నాకెప్పుడు వీలైతే నీకు నేను రాస్తాను. ఇద్దరం మ‌న ఉత్త‌రాల‌ని మ్యారేజ్ డే ముందు రోజు ఒక‌రికొక‌రు ఇచ్చుకుందాం. వేర్వేరు గదుల్లో చదువుకుందాం. ఆ త‌ర్వాత హాయిగా న‌వ్వుకుందాం” అన్నాడు.

“అయితే... స‌రే” అంది ర‌మ కూడా అంతే ఉత్సాహంగా.

“అయితే ఒక్క ష‌ర‌తు. ఇద్ద‌రం ఉన్న‌దున్నట్టు... నిజాల‌ను నిజాయితీగా రాస్తామ‌ని ఒట్టేసుకోవాలి మ‌రి...” అన్నాడు నానీ.

“ఓహో...ఓథ్ ఆఫ్ సిన్సియారిటీ అన్న‌మాట. అలాగే... నువ్వు కూడా ఒట్టేయి మ‌రి...” అంది ర‌మ‌.

ఇద్ద‌రూ స‌ర‌దాగా ఒక‌రి చేతిలో ఒక‌రు చెయ్యి వేసుకున్నారు. త‌ర్వాత ఆ చేతులు పెన‌వేసుకున్నాయి.

*****************

వాళ్లు అనుకున్న రోజు రానే వ‌చ్చింది. సాయంత్రానికి ఇద్ద‌రూ ఇంటికి చేరారు. స్నానాలు చేసి, నైట్ డ్ర‌సెస్‌లోకి మారిపోయి హాళ్లో టీవీ ముందు సోఫాలో కూర్చున్నారు.

నానీ న‌వ్వుతూ ర‌మ ద‌గ్గ‌ర‌కి వ‌చ్చి “పోస్ట్‌...” అంటూ జేబులోంచి ఓ క‌వ‌ర్ తీసి అందించాడు. దాని మీద ‘నా ప్రియ‌మైన నీకు...’ అంది ఉంది.

ర‌మ “అబ్బో...” అని న‌వ్వుతూ అందుకుని, త‌న హ్యాండ్‌బ్యాగ్‌లోంచి క‌వ‌ర్ తీసి నానీకి అందించింది.

నానీ ఆ క‌వ‌ర్ తీసుకుని, “స‌రే అయితే... నేను గెస్ట్ రూమ్‌లోకి వెళ్లి చ‌దువుకుంటా. నువ్విక్క‌డే చ‌దువుకో. చ‌దివాక బెడ్ రూమ్ లోకి వ‌చ్చేయ్” అంటూ వెళ్లిపోయాడు.

ర‌మ తీరిగ్గా సోఫా మీద వాలి, నానీ ఇచ్చిన క‌వ‌ర్ విప్పింది.

“మైడియ‌ర్ ర‌మా!

ఐ లవ్యూ. నీతో ఏదో అన్నానే కానీ, నాక్కూడా ఉత్త‌రం ఎలా రాయాలో తెలియ‌దు. ఎప్పుడైనా రాస్తేగా? ఛాటింగ్‌లు, వీడియో కాల్సూ వ‌చ్చేశాక అవ‌స‌రం ఏదీ? అందుకే ఈ ఆలోచ‌న వ‌చ్చింది. ఇంత‌కీ ఏం చెప్పాలి? నువ్వు వ‌చ్చాక ఎన్ని మార్పులో నా జీవితంలో! అప్పుడంతా పైలా ప‌చ్చీస్ అంటారే... అలా ఉండేది. ఇప్పుడు ఏదో రెస్పాన్స్‌బులిటీ ఉన్న‌ట్టుంది. ఎప్పుడో అర్థ‌రాత్రి ఇంటికి వ‌చ్చేవాడిని. స్నాన‌మైనా చేయ‌కుండా అలా ప‌డుకుండిపోయే వాడిని. ఇప్పుడు అదేంటో ఆఫీస్ అయిపోగానే తిన్న‌గా ఇంటికి వ‌చ్చేయాల‌నిపిస్తోంది. నా కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటావ‌నే ఆలోచ‌నే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. నేను ఇంటికి వ‌చ్చేలోపు నీ నుంచి నాలుగైదు మెస్సేజ్‌లు వ‌స్తాయి, ఎక్క‌డున్న‌వంటూ. ఆ కేరింగ్‌... నాకెంతో హాయిగా అనిపిస్తుంది. అఫ్‌కోర్స్‌... నేనూ నీకు అలాగే మెసేజింగ్ చేస్తాన‌నుకో. ఇంత‌వ‌ర‌కు ఇంత క‌న్స‌ర్న్ నాకు ఎవ‌రి మీదా లేదు. ఇదేనేమో క‌దా, బంధమంటే?

నా ఫ్రెండ్స్ ఆట‌ప‌ట్టిస్తున్నారు. వీడింక పంజ‌రంలో చిలకైపోయాడ్రా... అని! నిజ‌మేనేమో అంత‌క్రితం ఎంతో స్వేచ్చ‌గా ఉన్న‌ట్టుండేది. కానీ ఆ స్వేచ్ఛకో తీరూతెన్నూ ఉండేది కాదు. ఇప్పుడు అంత ఫ్రీగా ఉండ‌లేను... కానీ ఈ బంధంలో ఏదో తృప్తి ఉంది. బాధ్య‌త ఉంది. లైఫ్‌కి ఓ లక్ష్యం ఉన్న‌ట్టు అనిపిస్తోంది. నీకూ అలాగే ఉందా?

ఇక నీలో నాకు నచ్చ‌నివా? అస్సలు లేవు. న‌చ్చిన వాటినే ఇంకా పూర్తిగా చూసుకోలేదూ. ఏమంటావ్‌? ఇక న‌చ్చిన‌వంటావా? అన్నీ! నీ న‌వ్వు నా కోసమే అనిపిస్తుంది, నువ్వు ఎవ‌రితో క‌లిసి న‌వ్వుతున్నా స‌రే. నీ మాట‌ల‌న్నీ నావే అనిపిస్తుంది, నువ్వు ఎవ‌రితో మాట్లాడుతున్నా స‌రే. నీ చూపులన్నీ నావే అనిపిస్తుంది, నువ్వు ఎటు కేసి చూస్తున్నా స‌రే. ఇవి చ‌దువుతుంటే నీ మొహంలో ముసిముసి న‌వ్వు వ‌చ్చే ఉంటుంది క‌దా, అది కూడా నాదేన‌నిపిస్తుంది.

క‌విత్వం రాస్తున్నాన‌నుకుంటున్నావా? అవునేమో... ఎందుకంటే నీ గురించి వాస్త‌వాలు కూడా క‌విత్వంలాగే ఉంటాయి నాకు. నీ గురించి ఇప్పుడు ఆలోచిస్తుంటే, నాకు ఎప్పుడో హైస్కూల్ రోజుల్లో ఓ అమ్మాయి గుర్తొస్తోంది. ఎందుకో ఆ అమ్మాయిని కూడా ప‌దే ప‌దే చూడాల‌నిపించేది. అప్ప‌ట్లో దాన్ని నేను ప్రేమే అనుకున్నాను. ఇన్నేళ్ల త‌ర్వాత, నువ్వు నా లైఫ్‌లోకి వ‌చ్చాక వెనుతిరిగి ఆలోచిస్తే నీతో ఉన్న‌దే నిజ‌మైన ప్రేమ అనిపిస్తోంది. అయితే ఆ అమ్మాయి గురించి ఎందుకు రాస్తున్నాన‌నుకుంటున్నావా? మ‌రి అనుకున్నాం క‌దా, చిన్న‌నాటి క్ర‌ష్‌ల గురించి చెప్పుకోవాల‌ని. అందుకే అప్ప‌టి నా జ్ఞాప‌కాల‌ని నీ కోసం గుర్తు చేసుకుంటున్నాను. నిజాయితీగా నిజాలు చెప్పుకోవాల‌ని ఒట్టేసుకున్నాం కాబట్టి... నీకు మ‌రో విష‌యం కూడా చెప్పాలి. ఆ అమ్మాయి కూడా నాతో చాలా స్పెష‌ల్ గా ఉండేది. ఎలా అంటే నేనంటే త‌న‌కిష్ట‌మ‌ని నాకు అనిపించేలా. ఎన్నేసి క‌బుర్లో.

అప్ప‌ట్లో సెల్‌ఫోన్లు అవీ లేవుగా? ఆ అమ్మాయి నోట్స్ పుస్త‌కంలో ఆఖ‌రి పేజీలో పెన్సిల్ తో రాసి, నాకు అందించేది... రేపు గుడికి వెళుతున్నాన‌నో, మార్కెట్‌కి వ‌స్తున్నాన‌నో. నేను అది చ‌దువుకుని అక్క‌డికి సిద్ధం. కుదిర్తే నాలుగు న‌వ్వులు, వీలుంటే నాలుగు మాట‌లు. ఆ నోట్స్‌లో త‌ను రాసింది చెరిపేసి, నేనేదో రాసేవాడిని. అది త‌ను చ‌దువుకునేది.

ఓ సారి నేను ఆదివారం మ‌ధ్యాహ్నం మా స్కూల్ వెన‌క ఉన్న మామిడి తోట‌లోకి ర‌మ్మ‌ని రాశా. త‌ను వ‌చ్చింది. కాసేపు మామూలు క‌బుర్లే. కానీ నేనే కొంచెం చొరవ తీసుకున్నా, దాంతో పాటు త‌న చెయ్యి కూడా. త‌ను ఏమీ అన‌లేదు. దాంతో చొర‌వ‌ని దాటి చ‌నువు తీసుకున్నా, ఆమె భుజం మీద చెయ్యి వేసి. త‌ను కాద‌న‌లేదు. అప్పుడు నేను... చ‌నువుతో పాటు సాహ‌సం కూడా చేశా. త‌న మొహం నా చేతుల్లోకి తీసుకుని, ద‌గ్గ‌ర‌గా నా మొహం పెట్టి... ఆమె పెదాల‌పై ముద్దు పెట్టుకున్నా. త‌ను అక‌స్మాత్తుగా న‌న్ను తోసేసి ప‌రిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. నాకొక‌టే భ‌యం. త‌ను ఇంట్లో చెప్పేస్తుందా? రేపు న‌న్ను చిత‌గ్గొట్టేస్తారా? స్కూల్‌లోంచి డిబార్ చేస్తారా? ఇలా... ఏవేవో ఆలోచ‌న‌లు.

మర్నాడు భ‌యం భ‌యంగానే స్కూల్‌కి వెళ్లా. నేన‌నుకున్న‌ట్టు ఏమీ జ‌ర‌గ‌లేదు. నా దిగాలు మొహం చూసి త‌ను న‌వ్వింది. ఆ త‌ర్వాత మామిడి తోట‌, పార్క్‌లో మూల బెంచి, గుడి వెనుక నిద్ర‌గ‌న్నేరు చెట్టు... ఇలా ఎన్నో స్థ‌లాల‌ను నా పెన్సిల్ రాసింది. త‌న ర‌బ్బ‌ర్ చెరిపేసింది. అవ‌న్నీ ఇప్పుడు త‌ల్చుకుంటే అదొక మైకం అనిపిస్తుంది. కేవ‌లం ఓ ఆక‌ర్ష‌ణ అనిపిస్తుంది. ఆ త‌ర్వాత ఇంట‌ర్, ఇంజినీరింగ్‌, చ‌దువు, ఉద్యోగం... నీతో పెళ్లి. ఇంతే,ఇక చెప్పాల్సింది ఏమీ లేదు. నీ ద‌గ్గ‌ర దాచాల్సింది కూడా ఏమీ లేదు.

బై... నీ నానీ!"

****

గెస్ట్ రూమ్ లో నానీ కూడా ర‌మ ఇచ్చిన క‌వ‌ర్ విప్పాడు.

"మైడియ‌ర్ నానీ!

నువ్వు చెప్పాక ఎలా రాయాలో తెలియ‌లేదు కానీ, నీ ఆలోచ‌న మాత్రం భ‌లేగా ఉంద‌నిపించింది. ఈ వారం రోజులూ ఏం రాయాలో అనే ఆలోచ‌న‌లే. నాకు చిన్న‌ప్ప‌టి నుంచి పూజ‌లు అవీ పెద్ద‌గా అల‌వాటు లేదు. కానీ ఆ దేవుడు మాత్రం నాకొక గొప్ప వ‌రం ఇచ్చాడు.

అది నువ్వే.

ఏమిటో... నా ఆలోచ‌న‌లు నేను చెప్ప‌కుండానే నీకు తెలిసిపోతాయ‌నిపిస్తుంది ఎప్పుడూ నాకు. నేనేది చెప్పాల‌నుకుంటానో అదే నీ నోటి వెంట వ‌చ్చేస్తూ ఉంటుంది. నాకు అమ్మా నాన్నా గుర్తొచ్చి డ‌ల్‌గా అనిపించ‌గానే నువ్వు వీడియో కాల్‌తో వాళ్ల‌తో మాట్లాడతావు. నాక‌న్నా ఎక్కువ‌గా, ప్రేమ‌గా వాళ్ల‌ని ప‌ల‌క‌రించి నాతో మాట్లాడిస్తావు. అల‌సిపోయిన‌ట్టు ఎలా గ‌మ‌నిస్తావో ఏమో, వేడి కాఫీ చేసి నేను బాత్రూమ్ లోంచి రాగానే అందిస్తావు. చ‌లికి ఎప్పుడైనా లేవ‌లేక‌పోతే, నాకేమాత్రం మెల‌కువ రాకుండా స్నానం చేసి కిచెన్‌లోకి వెళ్లి లంచ్ బాక్స్‌ల ప్రిప‌రేష‌న్‌లో ప‌డిపోతావు. లేచాక నాకు గిల్టీగా అనిపించినా అదేం ప‌ట్టించుకోకుండా చాలా మామూలుగా ప‌ల‌క‌రిస్తావు.

నీకేమ‌న్నా ఫేస్ రీడింగ్ ఉందా? ఏమో మ‌రి!

ఇంత బాగా న‌న్ను చూసుకుంటుంటే... ఇక నీలో న‌చ్చ‌నివి ఏముంటాయి నాకు?

ఒకోసారి అనిపిస్తూ ఉంటుంది... నేను నిజంగా నీకు త‌గిన దాన్నేనా అని. కాదేమో...నానీ! రేపు మ‌న మొద‌టి పెళ్లి రోజు. ఈ ఏడాదిగా నీతో చాలా చెప్పాల‌నుకున్నా కానీ... చెప్ప‌లేక‌పోయాను. నువ్వ‌న్నావుగా... నిజంగా, నిజాయితీగా అన్నీ షేర్ చేసుకోవాల‌ని?

ఆడ‌పిల్ల‌ని. పూర్తి పేరెంటింగ్‌లో, ఎక్స్ ట్రా కేరింగ్‌లో పెరిగాను నేను. చిన్న‌త‌నంలో నువ్వ‌న్న‌ట్టు క్రష్‌లేవీ లేవు నాకు.

కానీ... నానీ... నీకో సంగ‌తి చెప్పాలి. అది చెబితే... రేప‌టి నుంచి నీ క‌ళ్ల‌లో క‌ళ్లు పెట్టి చూడ‌లేను. కానీ... చెప్ప‌క‌పోతే... అద్దంలో నా మొహం నేనే చూసుకోలేను. అందుకే చెప్పాల‌నే నిర్ణ‌యించుకున్నా. ఇది ఇప్ప‌టివ‌ర‌కు నా పేరెంట్స్‌కి కూడా తెలియదు.

ఎమ్మెస్ చేయ‌డానికి అమెరికా వెళ్లాల్సి వ‌చ్చింది. అక్క‌డ న‌న్ను రిసీవ్ చేసుకోడానికి మా రెలిటివ్స్ అబ్బాయితో మాట్లాడారు నాన్న‌. అత‌డు ఎయిర్‌పోర్ట్‌కి వ‌చ్చాడు. త‌ను ఉండే ఇంటికే తీసుకెళ్లాడు. త‌న ఆఫీస్‌కి సెల‌వు పెట్టి మ‌రీ ద‌గ్గ‌రుండి నా యూనివ‌ర్శిటీకి తీసుకెళ్ల‌డం, ప్రొఫెస‌ర్స్‌తో మాట్లాడ‌డం అన్నీ చూసుకున్నాడు. నాలో ఉన్న భయాల‌న్నీ పోగొట్టాడు. అమెరికాలో ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్ర‌వ‌ర్తించాలో అన్నీ ఓ ఫ్రెండ్‌లాగా చెప్పాడు. అత‌డితో నా వీకెండ్స్ అన్నీ పిచ్చి హ్యాపీగా మారిపోయాయి.

ఎన్నెన్ని చోట్ల‌కి తిప్పాడో! ఏన్ని చూపించాడో! అత‌ని హాస్పిటాలిటీ, మెంటాలిటీ, బిహేవియ‌ర్‌, మేన‌ర్స్ అన్నీ నాకెంతో న‌చ్చేశాయి. అలాగే మా మ‌ధ్య చ‌నువు కూడా బాగా పెరిగింది. ఎంత‌గా అంటే... ఎంత ద‌గ్గ‌ర‌గా ఉన్నా ఎబ్బెట్టుగా అనిపించ‌నంత‌. నానీ... అంత‌వ‌ర‌కు స్ట్రిక్ట్ కేరింగ్‌లో పెరిగిన నాకు ఒక్క‌సారిగా రెక్క‌లు వ‌చ్చిన‌ట్టు అనిపించింది.

ఏదో తెలియ‌ని స్వేచ్ఛగా అనిపించింది. అమెరికా వాతావ‌ర‌ణ‌మో, ఇక్క‌డి క‌ల్చ‌ర్ ప్ర‌భావ‌మో తెలియ‌దు కానీ... అత‌డెంత చ‌నువు తీసుకుంటున్నాడో, నేను అంత‌కు రెట్టింపు చొర‌వ చూపించేదాన్ని. అలా మామ‌ధ్య డేటింగ్ కూడా చాలా స‌హ‌జంగా జ‌రిగిపోయింది నానీ!

ఆ త‌ర్వాత అనుకోకుండా నా పేరెంట్స్ నీతో ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేశారు. ఆ త‌ర్వాత అంతా నీకు తెలిసిందే. ఇలా రాయ‌డానికి నీ మాట‌లే నాకు ధైర్యాన్నిచ్చాయి నానీ. నువ్వంటావుగా... పెళ్లికి ముందు నా జీవితం అంతా నా వ్య‌క్తిగ‌త‌మ‌ని. దానిపై కామెంట్ చేయ‌డానికి కానీ, జడ్జిమెంట్ ఇవ్వ‌డానికి కానీ ఎవ‌రికీ హ‌క్కు లేద‌ని! ఇక పెళ్లి త‌ర్వాత నువ్వే నా లోకం! నీకు త‌ప్ప ఎవ‌రికీ నాలో చోటు లేదు నానీ! ఇది న‌మ్ముతావా?

నీ ర‌మ‌."

*********

ర‌మ నిశ్శ‌బ్దంగా బెడ్రూమ్‌లోకి న‌డిచింది. అప్పటికే నానీ అక్క‌డ ఉన్నాడు, ఏదో మ్యాగ‌జీన్ చ‌దువుతూ. ర‌మ నెమ్మ‌దిగా వెళ్లి బెడ్ మీద కూర్చుంది. ఓసారి భుజాలెగ‌రేసి నెమ్మ‌దిగా ద‌గ్గింది. నానీలో క‌ద‌లిక లేదు.

"నానీ..."

"ఊ..."

"ఉత్త‌రం చ‌దివావా?"

"ఊ..."

"నేనూ నీ ఉత్త‌రం చ‌దివాను. చాలా బాగా రాశావు"

"ఊ..."

"నేనొక‌టి అడుగుతాను చెబుతావా?"

"ఊ..."

"ఎవ‌రా అమ్మాయి?"

"ముందు నువ్వే చెప్పు. ఎవ‌రా అబ్బాయి?"

"అది ఇప్పుడు అవ‌స‌ర‌మా?"

"పోనీ... అత‌డు ఇక్క‌డే… ఐమీన్‌... అమెరికాలోనే ఉన్నాడా?"

"ఉన్నాడు..."

"అయితే ఎవ‌ర‌త‌ను?"

"ఏం? నీకు తెలీదా?"

"నీ నోటి వెంట విందామ‌ని!"

"అయితే ముందు ఆ అమ్మాయి ఎవ‌రో చెప్పు?"

"ఏం? నీకు తెలియ‌దా?"

"నీ నోటి వెంట విందామ‌ని!"

అంతే... ఆపై ర‌మా, నానీ ఇద్ద‌రూ ఫ‌క్కున న‌వ్వేసుకున్నారు. నానీ త‌ల‌గ‌డ తీసి ర‌మ‌ని కొట్ట‌డానికి ఎత్తాడు. ర‌మ మ‌రో త‌ల‌గ‌డ‌తో త‌ల‌బ‌డింది.

అప్పుడు నానీ అన్నాడు, "ఏంట‌మ్మా... నీ పేరెంట్స్‌కి కూడా తెలియ‌ని ర‌హ‌స్యం నాకు చెప్పావా?"

"కాదా మ‌రి? చిన్న‌ప్ప‌టి నుంచి ఇద్ద‌రం ఒకే స్కూలు, ఒకే కాలేజీ. మామిడి తోట‌, పార్క్ బెంచీ, నిద్ర‌గ‌న్నేరు చెట్టు... పెన్సిల్ రాత‌లు, ర‌బ్బ‌ర్ కబుర్లు అంటూ నువ్వే క‌థంతా నడిపేశావు. నాకంటే ముందు న‌వ్వు అమెరికా వ‌చ్చి ఉద్యోగంలో చేరావు. నాకు ఎమ్మెస్ సీటొస్తే రిసీవ్ చేసుకుని ఇంకా ముందుకి దూసుకుపోయావ్‌. ఆపై మ‌న పేరెంట్స్‌తో నువ్వే మాట్లాడి పెళ్లికి ఒప్పించావు. త‌ర్వాత లాక్‌డౌన్‌లో ఇక్క‌డే ఆన్‌లైన్ పెళ్లి చేసేసుకున్నావ్‌.

పాపం... ఇండియాలో మ‌న పేరెంట్స్ జూమ్‌లో మ‌న పెళ్లి చూసి అక్క‌డి ల్యాప్‌టాప్‌పై అక్షింత‌లు వేసేశారు. ఇక ఇక్క‌డి ర‌హ‌స్యాల‌న్నీ ఎలాగ‌మ్మా చెప్పేది?" అంటూ ర‌మ త‌ల వెన‌క్కి వాల్చి ప‌క‌ప‌కా న‌వ్వేసింది.

నానీకి ఆ న‌వ్వంటే చాలా ఇష్టం. న‌వ్వేట‌ప్పుడు సొట్ట‌లు ప‌డే ఆ బుగ్గ‌లంటే మ‌రీ ఇష్టం. అప్పుడామె క‌ళ్ల‌లో మెరిసే వెలుగు ఇంకా ఇష్టం.

ఇంత‌లో గ‌డియారం ప‌న్నెండు గంటలు కొట్టింది.

"హ్యాపీ మేరేజ్ డే" అంటూ ఇద్ద‌రూ ఒకేసారి అరిచారు. ఆనందంగా హ‌త్తుకున్నారు.

ఆపై వాళ్ల ముచ్చ‌ట్లేంటో చూడాల‌ని చంద్రుడు చాలా ప్ర‌య‌త్నించాడు. కానీ ఇంత‌లోనే సూర్యుడొచ్చేశాడు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం :

అయ్య‌గారి శ‌ర్మ‌.

పూర్తి పేరు: ఎ.వి.ఎన్‌.హెచ్. ఎస్‌. శ‌ర్మ‌,

హైద‌రాబాద్‌-500 045


153 views5 comments

5 commenti


Sankara Narayana • 2 hours ago

Chala baagundi sarma garu

Mi piace

usha rani • 3 hours ago

Voice chala chala clear ga undi very nice 👌👌

Mi piace


V V Satya Prasad • 4 hours ago శర్మగారికి అభినందనలు..

Mi piace

V V Satya Prasad • 4 hours ago

శర్మగారు కథను చక్కగా నడిపించారు. సంభాషణలు సహజసిద్ధంగా ఉన్నాయి.. చదివిన వారు చక్కని ఫీల్ కలిగించేరు.వింటున్నత సేపు హాయిగా ఆనందించాము..

Mi piace

revati kumari • 6 hours ago

Chala bavundi..

Mi piace
bottom of page