నా వంతు
- BVD Prasada Rao
- 2 days ago
- 3 min read
#BVDPrasadaRao, #బివిడిప్రసాదరావు, #NaVanthu, #నావంతు, #TeluguStory, #తెలుగుకథ

Na Vanthu - New Telugu Story Written By BVD Prasada Rao
Published In manatelugukathalu.com On 14/05/2025
నా వంతు - తెలుగు కథ
రచన: బివిడి ప్రసాదరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఆయన రంగారావుగారు.
తొలినాళ్లులో ఆయన కదలికలు నన్ను కించిత్ విస్మయపర్చేవి.
నేను నర్సుని. నేనున్న హాస్పిటల్ కు ఆయన రోజూ టంచనగా ఉదయం ఎనిమిదయ్యే సరికి వచ్చేవారు. వచ్చే పేషంట్స్ సహాయకులతో కోరి మాటలు కలిపేవారు. వారితో బాతాఖానీ పెట్టేవారు. వారికి ధైర్యం చెప్పుతుండేవారు.
ఆయన.. కొంత మంది పేషంట్ లకు పళ్లు కొని పెట్టడం.. కొంత మంది పేషంట్ లకు మందులు కొని ఇవ్వడం నేను అడపదడప చూసాను.
నా డ్యూటీ కాగానే ఇంటికి వెళ్లిపోయేదాన్ని. కానీ ఆయన మాత్రం సాయంకాలం ఆరు వరకు హాస్పిటల్ లోనే ఉండే వారట. తన పనులను కొనసాగించేవారట. ఇది నేను నా కో-నర్సుల ద్వారా తెలుసుకున్నాను.
రంగారావుగారి రీతి మా డాక్టర్ గారి వరకు చివరికి చేరిపోయింది. ఓ రోజున.. నేను డ్యూటీలో ఉన్నప్పుడే.. నా సమక్షంలోనే.. రంగారావుగారిని పిలిపించుకొని మా డాక్టర్ గారు మాట్లాడడం జరిగింది.
"డాక్టర్ గారూ.. టీచర్ గా రిటైరయ్యేక.. ఇంట్లో తోచక.. అటు ఇటు తిరగలేక.. హైరానా ఐయేది. రోజు మొత్తంలో నాకు ఉదయం వాకింగే బయటికి వెళ్లే అవకాశం. తర్వాత అంతా ఖాళీయే.. ఇంటికే పరిమితం.. దాంతో ఏవేవో ఆలోచనలు.. వాటిని తట్టుకోలేక.. ఇలా హాస్పిటల్ కి వచ్చేసి.. తిరుగాడుతున్నాను." చెప్పారు రంగారావుగారు.
"మీది టీచింగ్ వృత్తి. సో. ట్యూషన్ లాంటివి చెప్పుకుంటూ సాఫీగా కాలం గడపొచ్చుగా. ఈ హైరానా ఎందుకు." డాక్టర్ గారు అన్నారు.
"ఇబ్బడిముబ్బడిగా ట్యూషన్ సెంటర్లు ఉండగా నా దగ్గరికి ఎవరు చేరుతారు." రంగారావుగారిలో నిరాశ తెలిసింది.
అంతలోనే పేషంట్ రావడంతో డాక్టర్ గారు.. రంగారావుగారిని పంపించేసారు.. తర్వాత మాట్లాడుకుందామన్నారు.
ఆ తర్వాత.. నాలో రంగారావుగారి విషయాలకై కుతూహలం కలిగింది. దాంతో.. నేనే ఆయన్ని వీలు వెంబడి కలుస్తూ మాట్లాడుతుండేదాన్ని.
అలా ఆయన గురించి తెలిసినవి..
ఆయన భార్య చనిపోయిందట.. తన రిటైర్మెంట్ కి ముందే. కొడుకు ఎప్పుడో దుబాయ్ వెళ్లిపోయాడట. అతడు ఇటు రావడం లేదట.. చూడడం లేదట. ఇక బంధువులు ఉన్నా అంతంత మాత్రం కలయికలేట.
ఆయన హాస్పిటల్ కి దరిలోనే ఓ అద్దింటిలో ఉంటున్నారట. ఆస్తులంటూ ఏమీ లేవట. పెన్షన్ డబ్బులే ఆధారమట. ఆయన సంభాషణ సందర్భాలలో చాలా మార్లు నొక్కి నొక్కి చెప్పారు.. ఒంటరితనం తనని భయపెడుతోందని..
అంచేతనే హాస్పిటల్ కి వస్తున్నానని.. కోరి అందరితో మాటలు కలుపుతూ రాత్రి వరకు గడిపేస్తున్నానని. రంగారావుగారికి వంటలు రావట. తన మూడు పూటల తిళ్లన్నీ ఇప్పుడు హాస్పిటల్ కేంటిన్ లోనేనట.
ఓ సందర్భంన నేను స్నేక్స్ లాంటివి ఇవ్వబోయాను. ఆయన సున్నితంగానే వద్దన్నారు.
నిజమే.. రంగారావుగారిని ఎరిగేక.. ఆయన రీతి నాకు తెలిసింది. తన పరిధిన తాను మెసులుతారు.
రంగారావుగారి నుండి మాటల్లో ఓ మారు ఓ సంగతి తెలియవచ్చింది.
"మీరు ప్రతి నెల మెడికల్ టెస్టులు చేయించుకుంటున్నారు. డాక్టర్ గారికి చూపుతున్నారు. పైగా డాక్టర్ గారు.. ప్రతి నెల అక్కరలేదని వారిస్తున్నా మీరు వినిపించుకోవడం లేదు." ఆయనతో ఓ రోజున అనేసాను.
"లేదమ్మా. జాగ్రత్త పడాలి. అలా అని నాకు చావు అంటే భయం కాదు. ఎత్తి దించడాల బారిన పడరాదనే నా గుంజులాట." ఆయన చెప్పారు.
ఆ వెంబడే..
"నాకు ఎవరూ లేరు తల్లీ.. చచ్చే వరకు ఇలా తచ్చాటలు సాగాలనే తలుస్తున్నాను." ఆయనే చెప్పారు.
నాకే ఏదోలా తోచింది. ఆయన మీద మరింత గురి ఏర్పడింది.
రోజులు గడిచిపోతున్నాయి.. ఆయనగారితో సాంగత్యం సాగిపోతోంది..
నాకు పెళ్లి కుదిరింది. వెడ్డింగ్ కార్డ్ ఇస్తూ.. "మీరు తప్పక రావాలి. ఆశీర్వదించాలి." కోరాను.
రంగారావుగారు ఒప్పుకున్నారు.
"పెళ్లి తర్వాత ఉద్యోగం కొనసాగిస్తావా." అడిగారు.
"ఆఁ. పెళ్లి వాళ్ల అనుమతి పొందేకే పెళ్లికి సమ్మతించాను." చెప్పాను.
రంగారావుగారు హర్షించారు. నాకు హాయి అనిపించింది.
రంగారావుగారు నా పెళ్లికి హాజరయ్యారు. కలివిడిగా తిరిగారు. హాజరైన మా డాక్టర్ గారితో.. వచ్చిన మా హాస్పిటల్ స్టాపుతో కలిసి సందడి చేసారు. నా పెళ్లిలో రంగారావుగారిలో హైపిచ్ ఆనందాన్ని తనివితీరా ఆస్వాదించాను. నా భర్తతో కలిసి రంగారావుగారి పాదాలకు నమస్కరించాను. ఆయన ఆశీర్వదించారు.
పది రోజుల తర్వాత..
ఈ రోజు రంగారావుగారి పుట్టిన రోజు అని తెలిసి.. సాయంకాలం నా భర్తతో ఆయన్ని హాస్పిటల్ లో కలిసాను. ఆయనకు కొత్త బట్టలు పెట్టాను. అలాగే.. ఆయన పుట్టిన రోజు అని తెలిసిన మా డాక్టర్ గారు చొరవ చూపారు. అప్పటికి ఉన్న స్టాఫ్ మధ్యన.. రంగారావుగారి చేత కేక్ కట్ చేయించారు.
నాకు అదంతా తెగ ఆనందపర్చింది. కాల గమనం తానంతట తాను ఉంది.
ఉదయం డ్యూటీకి వచ్చిన నాకు.. రంగారావుగారు అనీజీగా ఉండడం అగుపించింది. వాకబు చేసాను.
"కొద్దిపాటి నీర్సమమ్మా. డాక్టర్ గారికి చెప్పాను. రెస్ట్ లో ఉంటే సర్దుకుంటుంది అన్నారు. అందుకే ఇలా కూర్చొని ఉన్నాను." చెప్పారు ఆయన.
నేను అక్కడే ఉండిపోవడంతో.. "పర్వాలేదమ్మా. హాస్పిటల్ వద్దేగా ఉన్నాను. ఏమున్నా పిలుస్తాను. నువ్వు నీ పనులు చూసుకో." చెప్పారు ఆయన.
నా డ్యూటీకి వెళ్లిపోయాను.
మధ్య మధ్యన రంగారావుగారిని కలుస్తుండేదాన్ని.
రంగారావుగారు అటు ఇటు తిరుగాడుతుండడం చూసాక స్తిమితపడ్డాను. నా డ్యూటీ ముగిసేక..
"నేను ఇంటికి వెళ్తున్నాను. మీకు బాగుందిగా." అడిగాను రంగారావుగారిని.
ఆయన.. "ఉదయం మీద బాగుంది." చెప్పారు.
"రేపు కలుద్దాం." అంటూ నేను వెళ్లి పోయాను.
వారం తర్వాత..
ఉదయం హాస్పిటల్ కు వెళ్లేందుకు తయారవుతుండగా.. నా కో-నర్స్ ఫోన్ చేసింది.
"రంగారావుగారు హాస్పిటల్ లోనే ఒక్క మారుగా కూలిపోయారు.. చనిపోయారు." చెప్పింది.
నేను ఎకాఎకీగా హాస్పిటల్ కి వెళ్లాను.
రంగారావుగారి అంతిమ యాత్రకు ఏర్పాట్లు పరివేక్షిస్తున్నారు డాక్టర్ గారు స్వయంగా.
స్టాఫ్ తో పాటు నేనూ వంతయ్యాను.. భారమైన మనసుతో.
***
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
