పితృదోషం
- Srinivasarao Jeedigunta
- May 13
- 5 min read
#JeediguntaSrinivasaRao, #Pitrudosham, #పితృదోషం, #JeediguntaSrinivasaRao, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Pitrudosham - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 13/05/2025
పితృదోషం - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
రాఘవ రావు, కృష్ణారావు యిద్దరు అన్నదమ్ములు. రాఘవరావు గవర్నమెంట్ స్కూల్ లో ప్రధానోపాధ్యాయుడు. ముగ్గురు మగపిల్లలు, తను, భార్య సీత తో ఒక చిన్న యింట్లో అద్దెకు వుంటున్నాడు.
కృష్ణారావు డిగ్రీ చదువు అయిపోయిన తరువాత తనకి పై చదువులు చదువుకునే స్థోమత లేకపోవడం తో నూజివీడు జమిందర్ గారి సత్రం లో వుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి లెక్చరర్ గా కర్ణాటక గవర్నమెంట్ కాలేజీ లో చేరి కర్ణాటక లో స్థిర పడిపోయాడు. అక్కడే యిద్దరు మగపిల్లలు పుట్టారు.
ప్రతీ వేసవికాలం అన్నగారు ఉంటున్న మచిలీపట్నం వచ్చేసి రెండు నెలలు హాయిగా గడిపేవాడు. సాయంత్రం తాటి ముంజెలు నాలుగు డజన్స్ వరకు కొని అందరికి తినిపించేవాడు. రాఘవ రావు కూడా తమ్ముడు, పిల్లలు వచ్చారని మామిడిపళ్ళు సీజన్ అయ్యే అంతవరకు కొనేవాడు. కృష్ణారావు వదినగారిని అడిగి తనకు యిష్టమైన వంటలు చేయించుకుని తినేవాడు. అప్పుడప్పుడు కృష్ణారావు భార్య కాంతం, ఏమిటి తిండికి మొహం వాచినట్టుగా అడిగి వండించుకుని తినడం అని భర్తని దెప్పిపొడిచేది. కాని తినే అప్పుడు సగం కూర వేసుకుని తినేది.
“అయ్యా రాఘవరావు గారు! రేపు సోమవారం మీ అమ్మగారి తిథి, గుర్తు చేస్తున్నాను. ఆ రోజు ఉదయమే భోక్తలతో సహా వచ్చేస్తాను” అన్నాడు యింటి పురోహితుడు మాణిక్యం శాస్త్రి గారు.
“అలాగే గుర్తుకు వుంది, నిన్ననే మినప గుళ్లు తో సహా అన్నివస్తువులు తీసుకుని వచ్చాను. కూరగాయలు ఒక రోజు ముందు తెస్తాను” అన్నాడు రాఘవ రావు.
“ప్రతియేడు చేస్తున్నదే కదా, ఎందుకు శాస్త్రి గారు గుర్తుచెయ్యడం” అంది సీత.
“ఏదో మన యింటి పురోహితుడు కాబట్టి గుర్తు చేసాడు, రాబోయే కాలం లో యిలా గుర్తుకు తెచ్చేవాళ్ళే వుండరు” అన్నాడు రాఘవ రావు.
రాఘవ రావు తల్లిదండ్రుల తిథి ఎంతో శ్రద్ధతో పెట్టేవాడు. అతని తల్లిదండ్రులు వేసవి కాలంలో పోవడంతో బ్రాహ్మణులకు ఆరేసి మామిడిపళ్ళు దక్షిణతోపాటు యిచ్చేవాడు.
కృష్ణారావు కి అవకాశం లేదు, అన్నగారు చేస్తో వుండటంతో. అదికాక అతనికి యిటువంటి కార్యక్రమం మీద నమ్మకం కూడా లేదు. తల్లిదండ్రులు బతికివున్నప్పుడు బాగా చూసుకుంటే చాలు, ఈ తద్దినాలు ఖర్చులు వృధా అని ఏ సంవత్సరం కూడా అన్నగారు పెడుతున్న తల్లిదండ్రుల తిథి కి కూడా వచ్చే వాడు కాదు.
రాఘవ రావు ఎన్నోసారులు తమ్ముడికి చెప్పాడు.. “పితృదేవతలకు కోపం వస్తే శాపం పెడ్తారు. దానితో మన పిల్లలు వాళ్ల పిల్లలు కూడా వృద్ధిలోకి రారు. నిన్ను చూస్తోవుంటే నా తరువాత నువ్వు అమ్మానాన్నకి తర్పణం కూడా వదలవేమో అని భయంగా వుంది” అన్నాడు. “మొదటి నుంచి నువ్వు వేరే స్టేట్ లో ఉద్యోగం లో ట్రాన్స్ఫర్స్ తో వుండి అమ్మానాన్నలని నీ దగ్గర ఉంచుకోలేక పోయావు. ఇప్పుడైనా ఎలాగో వేసవి సెలవలకు నా దగ్గరికి వస్తున్నావు కదా. ఆ వచ్చేది వాళ్ల తిథి రోజులలో యిక్కడ ఉండేడట్లు రావచ్చు కదా” అని ఎన్నో విధాలుగా చెప్పినా కృష్ణారావు తన అభిప్రాయం మార్చుకోలేదు.
రాఘవ రావు ముగ్గురు పిల్లలు పెద్ద చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళకి మంచి సంబంధాలు వెతికి పెళ్లిళ్లు చేసాడు.
కృష్ణారావు ఇద్దరు కొడుకులని కన్నడం లో చదివించడం ఇష్టం లేక, తన పెద్ద బావమరిది వూరిలో వుంచి చదివించాలని చూసాడు. అయితే యిటు కన్నడం అటు తెలుగు రెండు భాషలలో వెనక పడిన రెండవ కొడుకు మెట్రిక్ ఎక్సమ్ కూడా పాస్ కూడా కాలేకపోయాడు.
పెద్దకొడుకు అతికష్టం మీద డిగ్రీ పరీక్ష పాస్ అయ్యి బెంగళూరు లో తండ్రి పనిచేస్తున్న కాలేజీలో గుమస్తా గా చేరాడు. ఆ విషయం అన్నగారికి చెప్పుకుని చాలా బాధపడ్డాడు కృష్ణారావు.
రాఘవ రావు తమ్ముడి బాధని చూసి, “నీ రెండవ కొడుకుని నా దగ్గరికి పంపించు, వాడికి నేను సరైన విధంగా కోచింగ్ యిచ్చి వాడిని డిగ్రీ చేయించి పంపుతాను” అన్నాడు.
అయితే తమ్ముడి కొడుకు ఇంటర్మీడియట్ లో వుండగా రాఘవ రావు పైలోకం లోకి వెళ్ళిపోయాడు. దానితో కొడుకుని తిరిగి తనతో తీసుకుని వెళ్ళి వాళ్ళకి చెప్పాడు “పెద్దనాన్న పోయిన తరువాత చేసిన కార్యక్రమాలు నాకు మీరు చేయించి డబ్బులు పాడుచేసుకోకండి. పెద్దనాన్న పిల్లలు బాగా చదువుకుని డబ్బు సంపాదించుకుంటున్నారు.
మిమ్మల్ని చూస్తే నేను పోషించితే గాని గతి లేదు. నేను నా తదనంతరం యిచ్చే కొద్దిపాటి ఆస్తితో మీ జీవితం గడపాలి. యింకా మీ మొహాలు, పోయిన మాకు ఏ కార్యక్రమం చేస్తారు” అని చివాట్లు పెట్టాడు.
“మీకే యిటువంటి వాటిమీద నమ్మకం లేనప్పుడు మేము ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టి దానధర్మాలు చేస్తాము” అన్నాడు పెద్దకొడుకు.
“మా అన్నయ్య ఎప్పుడో చెప్పాడు పితృదేవతలకు కోపం వస్తే వంశం వృద్ధి లోకి రాదు అని, నేను నమ్మలేదు, యిప్పుడు మిమ్మల్ని చూస్తే నిజమే అనిపిస్తోంది. అందుకే నా మరణం తరువాత నా శరీరాన్ని మెడికల్ కాలేజీ కి డొనేట్ చేసాను. బాడీ వుంటే చుట్టాలు కోసం అయినా మీరు ఆ పది రోజులు కొన్ని కార్యక్రమాలు చెయ్యాలిసి వస్తుంది” అన్నాడు.
అతి కష్టం మీద పెద్ద కొడుకుకు పెళ్లి చేసాడు. రెండో కొడుకుకు చదువు లేకపోవడం దానికి తోడు అతను పెళ్లి చేసుకోను అని అనడం తో అతని పెళ్లి చూడకుండానే తన అన్నగారిని కలుసుకోవడానికి పైలోకంకి వెళ్ళిపోయాడు.
ఆశ్చర్యం తన అన్నగారితో తల్లిదండ్రులు కూడా కనిపించడం చూసి, ‘అంటే పోవడం అంటే పోవడంతో ఆగదు అన్నమాట, నరకం, స్వర్గం అన్ని వున్నాయి యిక్కడ.. యిప్పుడు ఎలా.. స్వంత అన్నగారు తల్లిదండ్రులు కూడా గుర్తించకుండా వెళ్లిపోతున్నారు’ అనుకున్నాడు కృష్ణారావు.
ఇంతలో యిద్దరు నల్లటి వ్యక్తులు కృష్ణారావు పెడరెక్కలు విరిచి పట్టుకుని ఎవ్వరి ముందుకో తీసుకుని వెళ్లి నిలబెట్టారు. బహుశా ఆయన యమధర్మరాజు అనుకుంటా.. నరకం నుంచి వచ్చే వాసనలకి ముక్కు పగిలిపోతుంది అనుకున్నాడు.
“నేను పిల్లలకి మంచి బోధిస్తో జీవితం నిజాయితీగా గడిపినవాడిని, నన్ను ఎందుకు ఇక్కడకి తీసుకుని వచ్చారు” అన్నాడు కృష్ణారావు.
“నిజమే. నువ్వు నిజాయతీ గా బతికావు. అయితే వేద కర్మలని తక్కువగా చేసి ‘తల్లిదండ్రుకి అంత్యక్రియలు కూడా అక్కరలేదు, చనిపోయిన తల్లిదండ్రులకి తద్దినం పెట్టి వాళ్ళకి తర్పణం కూడా యివ్వటం అనవసరపు ఖర్చులు, కాలిపోయిన వాళ్ళ జీవితం యింతటితో ఆఖరు, మరో జన్మ లేదు’ లాంటి ముఢనమ్మకం తో బతికి నీ పిల్లలని కూడా అలాగే చేసావు.
పితృదేవతలకు నావాళ్ళు అనేది ఏమి వుండదు. వాళ్ళు ఆశించేదే కొద్ది నీరు, వాళ్ళ మీద భక్తి. నీ అన్నగారు తల్లిదండ్రుల తిథి తప్పకుండా శ్రద్దతో చెయ్యడం వలన మరణం తరువాత అతను తన తల్లిదండ్రుల దగ్గరికి చేరగలిగాడు,
ఒకసారి క్రిందకి చూడు, నీ కుటుంబం ఎలా వుందో అన్నాడు ఆయన.
ఆశ్చర్యం తన యిల్లు కనిపిస్తోంది. కోడలు మంచం మీద పడుకుని దగ్గుతోంది.
“నీ రోగం తగ్గేది కాదు, నీ మందులకి ఎక్కడలేని డబ్బు ఖర్చు అవుతోంది, మా నాన్న నిజాయితీ అంటూ ఉద్యోగం చేసి జీతం తప్పా ఒక్క పైసా ఎక్కువ సంపాదించలేదు. ఆయన తో పనిచేసిన వాళ్ళు పరీక్ష పేపర్స్ దిద్ది మార్కులు ఎక్కువ వేసి డబ్బు సంపాదన తో రెండు మూడు ఇళ్ళు కట్టుకున్నారు” అంటున్న కొడుకుని చూసి, ‘అంటే వాళ్ళు కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగం చేసి సుఖపడరు కాని తండ్రి మాత్రం అవినీతికి పాల్పడి డబ్బులు సంపాదించాలి అన్నమాట. ఎంత స్వార్థం’ అనుకుని “యమధర్మ రాజా! నేను, 'భూలోకం లో ఉన్నదే నిజం, మనిషి చనిపోతే అతని చరిత్ర అంతటితో ఆఖరు' అనుకున్నాను. కాని తరువాత కూడా ఇంత కథ వుంటుంది అనుకోలేదు. ఒకసారి నా చిన్న కొడుకు ఏం చేస్తున్నాడో చూడాలి అని వుంది” అని అడిగాడు.
“అతను కూడా నీ వెనుకే యిక్కడికి చేరుకున్నాడు, బతకటానికి ఎన్నో అవకాశాలు వున్నా ఉపయోగించు కోకుండా బలవంతం చావు తెచ్చుకున్నాడు. యిప్పుడు వంటశాల లో వున్నాడు. కొద్దిసేపట్లో వేడి నూనెలో వేయించుతారు” అన్నాడు.
“నాకు చెప్పినట్టు గానే వాడికి కూడా మీరు హితబోధ చెయ్యండి. అంత పెద్ద శిక్ష వద్దు” అని ఏడుస్తున్న కృష్ణారావుని చూసి “పిచ్చావాడా! నీకు నన్ను, నీ అన్నగారిని, తల్లిదండ్రుల ని చూసే భాగ్యం కలిగింది అంటే కారణం నీ అన్నగారి కొడుకులు గయా క్షేత్రం లో నీకు కూడా పిండప్రధానం చెయ్యడం వలన మాత్రమే. అయితే మీ తల్లిదండ్రుల తిథికి వెళ్లకుండా నాకు నమ్మకం లేదు అని అనడం వలన నీకు శిక్ష తప్పదు. అయితే నీకు గయా క్షేత్రం లో పిండప్రదానం జరిగింది కాబట్టి నీకు నేను వేసే శిక్ష నీ కొడుకు అనుభవించే శిక్షలు చూడటమే” అని తీర్పు యిచ్చాడు యమధర్మరాజు.
యిక్కడ నుంచి గూగుల్ పే చేస్తే ఎక్కడో వున్న వాడి అకౌంట్ లో డబ్బులు పడుతున్నాప్పుడు ఋషులు చెప్పిన మంత్రాలతో చనిపోయిన వారికి తర్పణం వదిలితే ఎందుకు చెందదు ఆలోచించండి. తల్లిదండ్రులు బతికి వున్నంతవరకు వాళ్ళని బాగా చూసుకోండి. ఆ తరువాత వాళ్ళకి ఏడాది కి ఒకసారి శాస్త్రం ప్రకారం శ్రద్ద తో శ్రాద్ధ కార్యక్రమం చేసి వారు మీకు ఈ శరీరం యిచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకోండి.
అంతే కాని పోయిన తరువాత గుర్తుపెట్టుకో అక్కరలేదు, మన బాధ్యత వదిలిపోయింది అనుకుంటే తిప్పలు తప్పవు. పిల్లలకి పూజలు, గుడికి తీసుకొని వెళ్లడం లాంటివి చేస్తే వాళ్ళు వక్రమార్గం లోకి వెళ్లకుండా వుంటారు. ఈనాడు నువ్వు నేర్పిన మంచి వల్లే రేపు నీ పిల్లల నడవడిక బాగుంటుంది.
దేవుని శాపానికి విరుగుడు వుంది గాని పితృదేవతల శాపానికి విరుగుడు లేదు జాగ్రత్త.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


Comments