top of page
Original.png

కొత్త శ్లోకం

#కొత్తశ్లోకం, #KotthaSlokam, #KarlapalemHanumanthaRao, #కర్లపాలెంహనుమంతరావు, #TeluguMoralStories, #నైతికకథలు

Kottha Slokam - New Telugu Story Written By Karlapalem Hanumantha Rao

Published In manatelugukathalu.com On 13/05/2025

కొత్త శ్లోకం - తెలుగు కథ

రచన: కర్లపాలెం హనుమంతరావు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



కాళిదాసు భోజరాజు ఆస్థానకవి. ఏదో కారణం మీద రాజుకు ఆగ్రహం కలగటంతో కాళిదాసు ఆస్థానం విడిచి వెళ్ళవలసి వచ్చింది. 


ఆ కవి పండితుడి స్థానంలో మరో కవి పండితుడు వచ్చి చేరాడు. అతను చురుకైన వాడు, ఏకసంధాగ్రాహి.  ఏదైనా ఒకసారి వింటే ఇట్టే పట్టెయ్యగలడు. కాని బుద్ధి మంచిది కాదు. పరులకు మేలు జరగటం గిట్టేది కాదు. తనకు సాధ్యమయినంత వరకు మంచి పనులు జరిగేటప్పుడు అడ్డేవాడు. 


కవి ఎవరైనా ఆస్థానానికి వచ్చి కొత్త శ్లోకం వినిపిస్తే,  రాజుగారు తగిన బహుమతి ఇచ్చే సంప్రదాయం ఉండేది. కొత్తకవి వచ్చిన తరువాత ఈ ఆచారానికి విఘాతం కలిగింది.  సభకు ఎవరొచ్చి ఏ కొత్త శ్లోకం   చదివినా ఏకసంధాగ్రహి ఆ శ్లోకం  విన్నవెంటనే తిరిగి తాను వల్లించేవాడు. కొత్త పద్యం కాదని తెలిసిన తరువాత రాజుగారు మాత్రం బహుమానం   ఎంచుకు ఇస్తారు?


బహుమానానికి బదులు పరాభవంపొందే కవులు ఆవిధంగా ఎక్కువయిపోయారు. అలా నిరాశకు గురైన  ఒక చురుకైన కవి కాళిదాసుకు తటస్థపడ్డాడు.


భోజరాజు ఆస్థానం ఎలా తయారయిందీ  కాళిదాసుకు అర్ధమయింది. కుక్కకాటుకి చెప్పుదెబ్బ అన్నారు కదా పెద్దలు! ఏకసంధాగ్రహికి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు కాళిదాసు.  తానొక శ్లోకం  రాసి పండితుడికిచ్చి, పారితోషికం తప్పక లభిస్తుందని  భరోసా ఇచ్చి భోజరాజు సమ్ముఖానికి  పంపించాడు.  


పండితుడు ఆ  శ్లోకంతో  మళ్ళీ భోజరాజు ఆస్థానానికి వెళ్ళాడు.

"మహారాజా, ఈసారి మరో కొత్త శ్లోకం రాశాను. విని, తగిన పారితోషికం ఇప్పించండి!" అని వేడుకొన్నాడు. భోజరాజు  ఒప్పుకున్న మీదట పండితుడో శ్లోకం చదివాడు. 


"స్వస్తి, శ్రీ భోజరాజ ! త్రిభువనవిదితో ధార్మికస్తే పితా భూ 

త్పిత్రాతే వై గృహీతా నవనవతిమితా రత్నకోట్యోమదీయాః, 

తా మేదేహీతి, రాజన్ ! సకల బుధజనై ర్జాయతే సత్యమేత 

న్నోవా జానంతితే తన్మమకృతి మధవా దేహిలక్షంతతో మే.”


ఈ శ్లోకానికి  అర్థం ఏంటంటే  "శ్రీ భోజరాజుకు స్వస్తి ! ధార్మికుడని మూడులోకాల్లో  ప్రసిద్ధిగాంచిన మీతండ్రి గారు 99 కోట్ల రత్నాలు నా వద్ద నుంచి  తీసుకున్నారు . వాటిని నాకు తిరిగి ఇప్పించండి!  ఈ మాట నిజమేనని ఇక్కడున్న  పండితులందరికీ తెలుసు. ఒక వేళ వాళ్ళకు తెలియని పక్షంలో  నా యీ శ్లోకానికి అధమం ఒక లక్ష రత్నాలయినా ఇప్పించండి! "  


ఈ శ్లోకం వినగానే ఏకసంధాగ్రాహి గొంతులో పచ్చివెలక్కాయ పడ్డది. శ్లోకం అప్పటికే విని వున్నది అంటే, భోజరాజుగారి  తండ్రి నిజంగానే ఈ పండితుడివద్ద 99 కోట్ల రత్నాలు తీసుకుని ఉన్నమాట తమకు మునుపే  తెలిసినట్టు సాక్ష్యం చెప్పినట్లవుతుంది. తనకు ఆ శ్లోకం తెలియదన్నపక్షంలో అది సరికొత్త శ్లోకం అవుతుంది. భోజరాజు పండితుడికి లక్ష రత్నాలు  ఇవ్వవలిసి వస్తుంది. సాటి  కవికి మరీ అంత మేలు   జరగటం  గిట్టని  ఏకసంధాగ్రాహి, చేసేదిలేక పండితుడు చదివింది కొత్తశ్లోకమే  అని ఒప్పుకున్నాడు. 


భోజరాజు పండితుడికి లక్ష రత్నాలు  పారితోషికంగా  ఇప్పించి " అయ్యా, మీరు ఈ శ్లోకం ఈ విధంగా ఎందుకు రాసారు? ఇలా రాయడానికి కారణమేంటి ?" అని అడిగాడు.


తాను పూర్వం వచ్చి ఒక కొత్తశ్లోకం చదివిన సంగతీ, సభలోని ఏకసంధాగ్రహి  అది పాతశ్లోకమని బుకాయించిన సంగతీ వివరంగా చెప్పుకొచ్చాడు పండితుడు." నా  కథ అంతా విన్న  కాళిదాసు జాలిపడి   ఈ శ్లోకం  ఇలా రాసిచ్చి మీ దగ్గరకు పంపించాడు " అంటూ అసలు గుట్టు విప్పేసాడు.  


ఏకసంథాగ్రాహి ఆడే నాటకం భోజరాజుకు అర్థమయింది. ఈ అసూయాపరుడి మూలకంగా  నిజమైన పండితులు ఎందరికి   అన్యాయం జరిగిందో ? అని బాధపడ్డారు.  టక్కరి కవికి  వెంటనే చెరసాల శిక్ష విధించారు. కాళిదాసు వంటి మేధావి, మంచి  మనసున్న కవి ఆస్థానంలో లేకపోవడం తన వంశ ప్రతిష్టకు ఎంత భంగకరమో  గ్రహించి ఆ మహాకవికి  కొలువులో చేరమని వేడుకుంటూ వర్తమానం పంపించాడు భోజ మహారాజు. 


***

కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

కర్లపాలెం హనుమంతరావు -పరిచయం


రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోదీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.

 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page