top of page

నగ్నసత్యాలు

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #Nagnasathyalu, #నగ్నసత్యాలు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 126


Nagnasathyalu - Somanna Gari Kavithalu Part 126 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 29/09/2025

నగ్నసత్యాలు - సోమన్న గారి కవితలు పార్ట్ 126 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


నగ్నసత్యాలు

-------------------------------------------

గాలిపటానికి దారము

పరికింపగ ఆధారము

విజయానికి మూలము

మదిని ఆత్మవిశ్వాసము


అమ్మానాన్నల సేవలు

చేసుకుంటే దీవెనలు

తొలకరి జల్లులవుతాయి

జీవితంలో శుభములు


ఉపయోగపడే చేతలు

కన్నీళ్లు తుడుచు చేతులు

అమూల్యమైనవి మహిలో

ప్రేమలొలికే మనసులు


విలువలుంటే బ్రతుకులు

నిలకడ ఉన్న మాటలు

పరిమళించే సుమములు

కాంతులీనే ప్రమిదలు




ree












ఉండాలోయ్! బ్రతుకులో

---------------------------------------

మధురమైన మాటలా

మనసు దోచు పాటలా

ఉండాలోయ్! బ్రతుకులో

పదిమందికి బాటలా


పేదోళ్లకు కోటలా

జీవజలపు ఊటలా

ఉండాలోయ్! బ్రతుకులో

మమకారపు మూటలా


గుబాళించు తోటలా

స్ఫూర్తినిచ్చు ఆటలా

ఉండాలోయ్! బ్రతుకులో

ఉపకరించు నోటిలా


పుడమిలోని మొక్కలా

వెలుగులీను చుక్కలా

ఉండాలోయ్! బ్రతుకులో

విహరించే పక్కిలా

ree













అక్షరాల నివేదన

--------------------------------------

తాత చూపు ప్రేమలో

బామ్మ చెప్పు మాటలో

బంగారు భవిత ఉన్నది

గురువు గారి బోధలో


అమ్మకున్న త్యాగంలో

నాన్నకున్న బాధ్యతలో

కుటుంబమే భాసిల్లును

పెద్దోళ్ల నడిపింపులో


విజ్ఞానపు బాటలో

చదువులమ్మ గూటిలో

అభివృద్దే అపారము

అజ్ఞానము బహు దూరము


సజ్జనుల స్నేహంలో

మహనీయుల సన్నిధిలో

నలుదిక్కులా క్షేమము

సుసంపన్నం జీవితము

ree









మనసు మాట ముత్యాలు

-----------------------------------------

ఓ చిన్న అబద్దము

బంధాలను తెంచును

కాసింత అపార్ధము

మనస్పర్థలు తెచ్చును


కఠినమైన ఓ మాట

అవుతుందోయ్! తూటా

దూసుకెళ్లి సూటిగా

గాయముచేయునుగా


చూపొద్దు భేదాలు

విరుగునోయ్! హృదయాలు

సమ భావన చూపించి

కట్టుము జీవితాలు


అవగాహన లోపము

అనర్థాలకు హేతువు

ఆదిలో సరిచేసిన

ఇక ఆనంద సేతువు

ree

















శ్రేష్టమైనది జ్ఞానము

---------------------------------

విలువైనది జ్ఞానము

ఆర్జించుము అమితము

అజ్ఞానము తొలగును

గౌరవమే దక్కును


ఎక్కించును అందలము

సరిచేయును జీవితము

జ్ఞానానికి మించినది

కనుకొనుట దుర్లభము


జ్ఞానం ఆభరణము

దానికేది సమానము!

బ్రతుకంతా వెదికినా!

ఇట్టిది దొరికేనా!


జ్ఞానంతో స్నేహము

సతతంబు నివాసము

చేయాలోయ్! మానక

దరి చేరును తప్పక


-గద్వాల సోమన్న

bottom of page