నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి చరిత్ర
- Palla Venkata Ramarao
- Aug 1
- 4 min read
#PallaVenkataRamarao, #పల్లావెంకటరామారావు, #NandavaramSriChowdeswariDeviCharithra, #నందవరంశ్రీచౌడేశ్వరిదేవిచరిత్ర, #TeluguDevotionalStories

Nandavaram Sri Chowdeswari Devi Charithra - New Telugu Story Written By - Palla Venkata Ramarao Published In manatelugukathalu.com On 01/08/2025
నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి చరిత్ర - తెలుగు కథ
రచన: పల్లా వెంకట రామారావు
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
నందవరం ప్రాంతాన్ని నందనుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన దత్తాత్రేయుడి భక్తుడు. నందభూపాలుడు ప్రతిరోజు దత్తాత్రేయుడిని నిష్టగా కొలిచేవాడు. ఈ క్రమంలో ఒకరోజు దత్తత్రేయుడు అతని భక్తికి మెచ్చి ప్రత్యక్షమవుతాడు. ఏం కావాలో కోరుకోమంటాడు.
సంతోషభరితుడైన నందుడు తనకు ఒక తీరని కోరిక ఉందని అని తీర్చితే సంతోషిస్తానని అంటాడు. ఆ కోరిక ఏమిటో తెలుపమంటాడు దత్తాత్రేయుడు. అది ఎలాంటిదైనా తీరుస్తానని చెబుతాడు. తనకు నిత్యం గంగలో స్నానం ఆచరించాలని కోరికగా ఉందని చెబుతాడు నందుడు. అతని కోరికను గ్రహించిన దత్తాత్రేయుడు కోరిన చోటుకు తీసుకువెళ్లే పావుకోళ్లు (పాదరక్షలు) నంద భూపాలుడికి అందజేస్తాడు. అంతేకాకుండా రోజూ కాశీకి వెళ్లి అక్కడి గంగలో స్నానం చేయాల్సిందిగా సూచిస్తాడు.
అయితే ఈ పావుకోళ్ల విషయం ఎవరికీ చెప్పకూడదని, రహస్యంగా ఉంచమని చెబుతాడు. ఇందుకు అంగీకరించిన రాజు ఆ పావుకోళ్లను స్వీకరిస్తాడు. దత్తత్రేయుడు చెప్పినట్లు ప్రతి రోజు బ్రహ్మముహుర్తంలోనే కాశీకి వెళ్లి, అక్కడి గంగానదిలో స్నానం చేసి, కాశీ విశ్వనాథుడిని, విశాలక్షిని సందర్శించుకొని తిరిగి తన రాజ్యానికి వచ్చేవాడు.
అంతా సవ్యంగా జరిగిపోతూ ఉండగా నందభూపాలుడి భార్యకు అనుమానం వస్తుంది. ఒక రోజు తొందరగా మెలకువ వచ్చిన రాణి తన భర్త తెల్లవారుజామున ఎక్కడికో వెళ్లడం గమనిస్తుంది. ఇదే విషయాన్ని భర్త నందనుడిని అడిగి గొడవ పెట్టుకొంటుంది. నీవు మరొక స్త్రీ ని కలవడానికి వెళ్లడం లేదు కదా అని అనుమానంగా అడుగుతుంది. దీంతో విధిలేని పరిస్థితుల్లో నందభూపాలుడు అసలు సంగతి చెప్పి, మరుసటి రోజు తన భార్యను కూడా తనతోపాటు కాశీకి తీసుకొని వెళతాడు.
అక్కడ స్నానాలు ముగించుకొన్న తర్వాత రాజు భార్యకు నెలసరి వస్తుంది. దీంతో ఆ పాదుకలు తమ శక్తిని కోల్పోతాయి. కంగారు పడిన రాజు తనకు సహాయం చేయల్సిందిగా అక్కడే ఉన్న పండితులైన బ్రాహ్మణులను కోరుతాడు. తాను త్వరగా రాజ్యాన్ని చేరుకోకపోతే రాజ్యంలోని ప్రజలు కలవరపడతారని బాధపడతాడు. అంతేకాకుండా రాజ్యంలో రాజు లేడని తెలిస్తే శత్రురాజులు దాడులు చేసే అవకాశం ఉందని అంటాడు.
అది విన్న ఆ బ్రాహ్మణులు తమ తపఃశక్తిని రాజుకు, ఆయన భార్యకు అందజేస్తారు. ఇందుకు సంతోషించిన రాజు వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తాను తప్పక సాయం అందిస్తానని వాగ్దానం ఇచ్చి, భార్యా సమేతుడై నందవరానికి తిరిగి వస్తాడు.
కొంతకాలం గడిచిన తర్వాత ఒకానొక సమయంలో కాశీలో కరువు వస్తుంది. అప్పుడు బ్రాహ్మణులకు నందుడు చేసిన వాగ్దానం గుర్తుకు వస్తుంది. దీంతో బ్రహ్మణులు నందవరానికి వచ్చి రాజును అర్థిస్తారు. అయితే రాజు మీరు నాకు సహాయం చేశారన్నదానికి సాక్ష్యం ఎవరు అని ప్రశ్నిస్తాడు. కాశీలో మన మధ్య జరిగిన ఒప్పందానికి అక్కడి విశాలాక్షి దేవి సాక్ష్యమని ఆమె తప్ప మరెవ్వరూ ఆ సమయంలో అక్కడ లేరని, ఆ బ్రాహ్మణులు చెబుతారు.
దీంతో రాజు మీరు నిజంగా కాశీ బ్రాహ్మణులైతే ఆ చౌడేశ్వరీ దేవిని ఇక్కడకు రప్పించి సాక్ష్యం చెప్పించమని వినయంగా కోరుతాడు. దీంతో బ్రాహ్మణులు తిరిగి కాశీకి వెళ్లి అక్కడ విశాలాక్షి అమ్మవారికి జరిగిన విషయం మొత్తం చెప్పి తమతో పాటు నందవరం రావాల్సిందిగా కోరుతారు.
ఇందుకు విశాలాక్షి దేవి అంగీకరిస్తుంది. అయితే ఒక షరతు విధిస్తుంది. మీరు దారి చూపిస్తూ ఉంటే నేను మీ వెనుక వస్తానని చెబుతుంది. మీలో ఏ ఒక్కరు వెను తిరిగి చూసినా తాను శిలగా మారిపోతానని చెబుతుంది. దీనికి అంగీకరించిన బ్రహ్మణులు విశాలాక్షి అమ్మవారిని వెంటబెట్టుకొని నందవరానికి ఒక సొరంగం గుండా బయలు దేరుతారు.
నందవరం రాజ్యంలోకి వారు ప్రవేశించగానే ఒక బ్రాహ్మణుడు వెనక ఏ శబ్దము వినపడకపోవడంతో వెనక్కు తిరిగి దేవి వస్తోందో ? లేదో ? అని చూస్తాడు. దీంతో దేవి అక్కడే శిలరూపంలో నిలిచిపోతుంది. తాను ఇక్కడే చౌడేశ్వరి దేవి రూపంలో ఉండి భక్తులకు అభయం ఇస్తానని వారికి తెలుపుతుంది.
విషయం తెలుసుకొన్న రాజు అక్కడికి వచ్చి బ్రాహ్మణులకు తన మనసులోని మాట చెబుతాడు. మీ గొప్పతనాన్ని తన రాజ్యం వారికి కూడా తెలియజేయాలన్న ఉద్దేశంతోనే అలా పరీక్ష పెట్టానని చెబుతాడు. ఇక మీరు కూడా తన రాజ్యంలోనే ఉండి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతాడు. ఇందుకు బ్రాహ్మణులు అంగీకరిస్తారు.
అలా నందవరం ప్రాంతంలో స్థిరపడిన బ్రాహ్మణులను నందవరీక బ్రాహ్మణులని పిలుస్తారు. వీరు ఇప్పటికీ తమ కులదేవతగా చౌడేశ్వరీ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అమ్మవారు వచ్చిన సొరంగం ఇప్పటికీ ఉంది. అయితే అందులోకి ఎవరినీ అనుమతించరు. అమ్మవారు మొదట ఉగ్రరూపంలో ఉండేది. సాధారణ ప్రజలు అమ్మవారిని దర్శించుకోలేకపోయేవారు. అందువల్ల రాజు అమ్మవారు శిలా రూపం దాల్చిన చోటు పై భాగంలో అంటే భూమి పైన అలాంటిదే మరో విగ్రహం ఏర్పాటు చేసి గుడి కూడా కట్టించాడు.
ఇక అమ్మవారి విగ్రహం ఒక చేతిలో ఖడ్గం, మరోచేతిలో కుంకుమ భరిణే ఉంటుంది. అమ్మవారి గర్భగుడికి బయట ఒక కలివి చెట్టు ఉంటుంది. ఇటువంటి చెట్లు కాశీలో తప్ప మరెక్కడా కనిపించవు. అందువల్ల ఈ చెట్టు కూడా అమ్మవారితో పాటు ఆమె చీర చెంగుకు తగులుకుని కాశీ నుంచి ఇక్కడికి వచ్చిందని భక్తులు భావిస్తుంటారు. ఈ చెట్టుకు సంతానం లేని వారు ముడుపులు కూడా కడుతుంటారు.
నందవర చౌడేశ్వరీ అమ్మవారిని సందర్శించుకొంటే సకల శుభాలు జరుగుతాయని, భయాందోళనలు సమసిపోతాయని భక్తులు చెబుతుంటారు. అందువల్లే మహారాష్ట్ర, కర్ణాటక వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. వసంత ఋతువులో చైత్ర మాసంలో ఇక్కడ జరిగే జ్యోతి ఉత్సవాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రకరకాల రూపాలలో జ్యోతులను అలంకరించి చౌడేశ్వరి అమ్మవారిని ఆరాధిస్తారు.
పల్లా వెంకట రామారావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పల్లా వెంకట రామారావు
Profile Link:
జన్మస్థలం: ప్రొద్దుటూరు, కడప జిల్లా.
జననం: 1974
తల్లిదండ్రులు:కీ.శే. శ్రీ రామయ్య, శ్రీమతి ఓబులమ్మ
చదువు: ఎం.ఎ (తెలుగు), టి.పి.టి, డిప్లమో (కంప్యూటర్స్) (జర్నలిజం)
ఉద్యోగం: స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)
అభిరుచి: సాహిత్యం, దర్శకత్వం, నాణేల సేకరణ, యాత్రలు చేయడం(యూట్యూబ్ వ్లాగ్స్) travel India telugu
(యూట్యూబ్ చానల్ , Id:@travelIndia82)
రచనలు: 'ది అటాక్' నవల, పూలుముళ్ళు, (మినీ నవల) గేయం,
వచన కవితలు, హైకు, నాటిక, కథలు, పద్యం,
బాలల కథలు, జోక్స్, వ్యాసాలు, వంటివి. సాక్షి, ఈనాడు, వార్త,అల
ఉపాధ్యాయ వాణి, బాలభారతం, చంద్రబాల, సూర్య, బాలల
బొమ్మరిల్లు, ఆంద్రభూమి వంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
సత్కారాలు: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, పండిత పరిషత్ వారిచే స్టేట్ అవార్డు,రాజుపాళెం
మండలం వారిచే ఉగాది పురస్కారం; అటా వారిచే , సాహితీ మిత్ర మండలి, యువ
కళావాహిని, కడప జిల్లా రచయితల సంఘం,రామరాజ భూషణ సాహితీ పీఠం, అనంతపురం జిల్లా
రచయితల సంఘం, తెలుగు కళా వేదిక,వేమన సాహితీ కళాపీఠం, కొని రెడ్డి ఫౌండేషన్ , తెలుగు రక్షణ
వేదిక, కర్ణాటక తెలుగు రచయితల సంఘం, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థలచే సత్కారం.
Comments