top of page
Original.png

తాతయ్య కోరిక

#GSSKalyani, #GSSకళ్యాణి, #ThatayyaKorika, #తాతయ్యకోరిక#TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Thatayya Korika -Telugu Inspirational Story | G. S. S. Kalyani

Published in manatelugukathalu.com on 13/03/2026

తాతయ్య కోరిక - తెలుగు కథ |G. S. S. కళ్యాణి

“నిజమైన పేరు సోషల్ మీడియాలో వస్తుందా… లేక మనుషుల హృదయాల్లో వస్తుందా?”

ఆలోచన రేకెత్తించే G.S.S. కళ్యాణి గారి తాతయ్య కోరిక కథ వినండి.


శ్రీవిద్యాపురం ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊళ్ళో ఉంటున్న జానకిరాం, జగదభిరాంలు అన్నదమ్ముల పిల్లలు. ఇద్దరూ ఒకే వయసువాళ్ళు. ఇద్దరి చదువులూ పూర్తి కావడంతో ఉద్యోగాలు వెతుక్కోవడానికి తమ ఊరినుండీ పట్నం బయలుదేరుతూ, తమకెంతో ఇష్టమైన తమ తాతయ్య సీతారామయ్య పాదాలకు నమస్కరించారు.  


"బాగుందర్రా పిల్లలూ! ఇద్దరూ చక్కగా చదువుకున్నారు. మంచి ఉద్యోగాలు తెచ్చుకుని, మంచి పనులు చేస్తూ నలుగురూ నాలుగు కాలాలపాటూ గుర్తుంచుకునేటంత గొప్ప పేరు తెచ్చుకోండి. అదే నా కోరిక!", అన్నాడు సీతరామయ్య జానకిరాం, జగదభిరాంలను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ. 

"తప్పకుండా తాతయ్యా!", తాతయ్య కోరిక తీర్చగలనన్న నమ్మకంతో అన్నాడు జగదభిరాం. 


"నీ కోరిక తీర్చేందుకు నేను చెయ్యగలినదంతా చేస్తాను తాతయ్యా", పట్టుదలతో అన్నాడు జానకిరాం. 


జానకిరాం, జగదభిరాంలు పట్నం వెళ్ళి అనుకున్నట్లుగా మంచి ఉద్యోగాలు సంపాదించారు. వారి మనసుల్లో తాతయ్య కోరిక తీర్చాలన్న తపన కొనసాగుతూనే ఉంది. అందుకోసం ఎవరి దారిలో వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎనిమిది నెలలు గడిచాయి. 


ఓరోజు సీతారామయ్య జానకిరాం, జగదభిరాంలకు ఫోన్లు చేసి, "పిల్లలూ! మిమ్మల్ని చూసి చాలా కాలమైంది. ఉగాది పండుగ వస్తోంది. ఓసారి మన ఊరికి వచ్చిపొండి", అని అప్యాయంగా పిలిచాడు. 


సరేనని తమ తాతయ్యను చూసేందుకు జానకిరాం, జగదభిరాంలు ఒకేసారి ఒకే బస్సులో శ్రీవిద్యాపురానికి బయలుదేరారు. 


“ఏమయ్యా జానకిరామా! ఇన్నాళ్ళూ ఎక్కడున్నావ్? ఎలా ఉన్నావ్?”, జానకిరాంను అడిగాడు జగదభిరాం.


"కొత్త ఉద్యోగం కదా! పనులతో క్షణం తీరిక లేకుండా రోజులు గడిచిపోతున్నాయ్. నీ సంగతేంటీ?", జగదభిరాంను అడిగాడు జానకిరాం.


"నేనైతే నాకెన్ని పనులున్నా తాతయ్య కోరిక తీర్చడమే నా ధ్యేయంగా పెట్టుకున్నాన్రా. ఇంతవరకూ నేనెంత పేరు సంపాదించానో తెలుసుకుంటే ఆశ్చర్యపోతావ్. సోషల్ మీడియా ప్రపంచమంతా నన్నిట్టే గుర్తుపడుతుంది తెలుసా? ఆన్-లైన్లో నేను పెట్టే ప్రతి పోస్టుకీ బోలెడు లైకులు వస్తాయి. నాకు ప్రతి దేశంలోనూ ఫాలోవర్లు ఉన్నారు", జానకిరాంతో గర్వంగా అన్నాడు జగదభిరాం. 


"మంచిది!", చిరునవ్వుతో అన్నాడు జానకిరాం. 

శ్రీవిద్యాపురం రాగానే బస్సు దిగి ఇంటికి కాలినడకన బయలుదేరారు జానకిరాం, జగదభిరాంలు. దారి పొడవునా తమకెదురైన వారంతా జానకిరాంకు వినయంగా నమస్కరించడం జగదభిరాంకు ఆశ్చర్యం కలిగించింది. జానకిరాం, జగదభిరాంలు ఇల్లు చేరుకునేసరికి సీతారమయ్యతో శ్రీవిద్యాపురానికి కొత్తగా బదిలీ అయి వచ్చిన బ్యాంకు మేనేజర్ అనంత్ బ్యాంకు వ్యవహారాలు మాట్లాడుతున్నాడు. 


జానకిరాం, జగదభిరాంలను చూస్తూనే సీతారామయ్య, "రండర్రా పిల్లలూ! ఎలా ఉన్నారూ?", అంటూ వారిని ప్రేమతో పలకరించి, "వీళ్ళు నా మనవళ్ళండీ", అంటూ అనంత్ కి జానకిరాం, జగదభిరాంలను పరిచయం చేశాడు. 


అనంత్ జానకిరాం వంక చూస్తూ, "నాకు ఈయన తెలుసండీ! ఈయన పేరు జానకిరాం కదూ?”,  అని అడిగాడు సీతారామయ్యని.


"అవునండీ!", అన్నాడు సీతారామయ్య.


వెంటనే అనంత్ నిలబడి జానకిరాంతో చేయి కలుపుతూ, “ఈ ఊరివాళ్ళ మాటలనుబట్టి మీరు చాలా మంచి మనసున్న వ్యక్తి అని విన్నాను. మిమ్మల్ని ఈ విధంగా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది", అన్నాడు. 


"అయ్యో! ఇందులో నా గొప్పతనమేమీ లేదండీ. అంతా మా ఊరివాళ్ళ అభిమానం. అంతే!", అన్నాడు జానకిరాం వినయంగా.


జరిగినదంతా చూసి అవాక్కవ్వడం జగదభిరాం వంతైంది. జానకిరాం, సీతారామయ్య, అనంత్ లు కాసేపు మాట్లాడుకున్నాక అనంత్ వెళ్ళిపోయాడు. అప్పటికి జగదభిరాం ఒక పక్కగా కూర్చుని దీర్ఘాలోచనలో ఉన్నాడు. 


అది గమనించిన సీతారామయ్య, "ఏరా జగదభిరాం! ఏంటంతగా ఆలోచిస్తున్నావ్?", అని అడిగాడు. 


"అదే తాతయ్యా! ఆ బ్యాంక్ మేనేజరు సోషల్ మీడియాలో ఎంతోమంది ఫాలోవర్లు ఉన్న నన్ను గుర్తుపట్టకుండా ఎవ్వరికీ తెలియని జానకిరాంను గుర్తుపట్టడమేమిటీ? మన ఊరి జనం జానకిరాంకు ఇస్తున్న గౌరవం చూస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు నా చుట్టూ ఏం జరుగుతోందో ఏమీ అర్థంకావడం లేదు", అన్నాడు జగదభిరాం. 


అందుకు సీతారామయ్య, "జానకిరాం మన ఊరి బాగు కోసం చాలా కష్టపడుతున్నాడు. ఆ కష్టానికి ప్రతిఫలంగా ఈ మంచి పేరు సంపాదించుకున్నాడు", అన్నాడు. 

"తాతయ్యా! నా ఫాలోవర్లంతా నాకు ఊరికే రాలేదు. అందుకు నేను కూడా చాలా కష్టపడ్డాను. చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో నా ప్రాణాలను సైతం లెక్క చెయ్యలేదు తెలుసా?", అన్నాడు జగదభిరాం కాస్త అసహనంగా. 


"నాన్నా జగదభిరామా! నీ సందేహం నాకర్థమైంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. సోషల్ మీడియా ఒక పదునైన ఆయుధంలాంటిదిరా! దాన్ని మంచికీ చెడుకీ - రెండింటికీ వినియోగించచ్చు. అక్కడ నువ్వెంత పేరు సంపాదించినా అది తాత్కాలికమే. భూమి మీద కొన్ని కోట్లమంది ఉన్నారు. వారందరినీ తృప్తి పరచి వారి మన్ననలు పొందటం అసాధ్యమైన పని. నువ్వు చేసిన సాహసంకన్నా గొప్పగా చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఈ విశాల ప్రపంచంలో ఎక్కడో అక్కడ ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. జనం వాళ్ళ వైపు తిరిగిన వెంటనే నిన్ను మర్చిపోతారు!


భగవంతుడిచ్చిన ఈ శరీరాన్ని ఇహ-పరాలలో మంచిని పొందటానికి వాడాలి. అలాకాకుండా అశాశ్వతమైన పేరు కోసం నువ్వేదో సాహసకృత్యం చేసి నీ ప్రాణాలమీదకు తెచ్చుకుంటే అది నీ కన్నవారికి తీర్చలేని బాధగా మిగిలిపోతుంది. కలకాలం అందరి మనసుల్లో నిలిచిపోయే నిజమైన మంచి పేరు సంపాదించాలంటే ఎలక్ట్రానిక్ ప్రపంచం వదిలి నీ చుట్టూ ఉన్న అసలైన ప్రపంచం గురించి ఆలోచించు.


మన జానకిరాం చేస్తున్న పని అదే! వాడు నిస్వార్ధంగా మన ఊరి బాగుకోసం పాటుపడుతున్నాడు. ఆర్ధిక సహాయం కోరిన వారికి తనకు చేతనైనది చేస్తున్నాడు. పేరు సంపాదించాలని వాడు తాపత్రయపడకపోయినా అదే వాడి దగ్గరకు వస్తోంది. ఆలోచించు!" , అన్నాడు సీతారామయ్య జగదభిరాం భుజం తడుతూ.


సీతారామయ్య మాటలు వినగానే జగదభిరాంకు తన మనసును అల్లకల్లోలం చేస్తున్న ప్రశ్నకు సరైన సమాధానం దొరికినట్లనిపించింది.


"తాతయ్యా! నాకిప్పుడంతా అర్థమైంది. నేను కూడా జానకిరాం ఎంచుకున్న మార్గాన్ని అనుసరిస్తాను. మన ఊరికోసం జానకిరాం చేస్తున్న పనుల్లో పాలుపంచుకుని నాకు తోచిన సహాయం చేస్తాను", అన్నాడు జగదభిరాం.   


"విజయోస్తు! అయితే ఒక్క విషయం. నేను ఇందాక చెప్పినట్లు సోషల్ మీడియాను మంచి పనులకి కూడా ఉపయోగించుకోవచ్చు. నువ్వక్కడ సంపాదించిన ఫాలోవర్లను నువ్వు చెయ్యదల్చుకున్న మంచి పనుల్లో భాగస్వాములను చెయ్యగలవేమో చూడు! అలా చేస్తే నువ్వింతవరకూ పడిన కష్టం వృధా అయిపోయిందన్న బాధ నీకు ఉండదు", అన్నాడు సీతారామయ్య.    

  

"భలే ఆలోచన ఇచ్చావ్ తాతయ్యా! ఆ ఆలోచన ఇవాళే ఆచరణలో పెడతా", అంటూ ఉత్సాహంగా అన్నాడు జగదభిరాం.


విషయం తెలుసుకున్న జానకిరాం, తమ ఊరికోసం తలపెట్టనున్న పనుల వివరాలన్నీ జగదభిరాంతో పంచుకున్నాడు. ఒక మూడేళ్ళు గడిచేసరికి శ్రీవిద్యాపురాన్ని బాగా అభివృద్ధి చేసి, సకలసదుపాయాలతో తీర్చి దిద్దారు జానకిరాం, జగదభిరాంలు. ఆ ఊరు ఊరంతా వారిని మెచ్చుకుంటూ పొగడ్తలతో ముంచెత్తింది. అంతేకాకుండా వారికోసమే ప్రత్యేకంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి, అందులో జానకిరాం, జగదభిరాంలను ఘనంగా సన్మానించి వారికి తమ కృతజ్ఞతలను తెలుపుకున్నారు శ్రీవిద్యాపురం వాసులు. 


సన్మానం అందుకుని పూలమాలలతో, పుష్పగుచ్ఛాలతో ఆశీర్వాదంకోసం తనవద్దకు వచ్చిన మనవళ్లను చూసి, "మంచి పేరు సంపాదించి నా కోరిక తీర్చారర్రా పిల్లలూ!", అంటూ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు సీతారామయ్య.


జానకిరాం, జగదభిరాంలు కొద్దిసేపు సీతారామయ్యతో గడిపి పట్నం బయలుదేరి వెళ్ళిపోయారు.


"గొప్పవాళ్ళ కోరికలు లోకానికి మంచి చేస్తాయంటే ఏమిటో అనుకున్నాను. ఇవాళ అది ఋజువు కావడం నా కళ్ళారా చూస్తున్నాను. మీరు కోరిన కోరిక మన ఊరికి మంచిని చేసింది", అంది సీతారామయ్య భార్య నీరజాక్షి వేడి కాఫీని సీతారామయ్యకు అందిస్తూ.


అందుకు సీతారామయ్య చిన్నగా నవ్వి, "నువ్వన్నది నిజమేనే! నా దృష్టిలో మా తాతయ్య జానకిరామయ్య చాలా గొప్పవాడు. ఆ రోజుల్లో మన ఊళ్ళో ఎవరికేసాయం కావాలన్నా ఆయన మరో ఆలోచనలేకుండా చేసేవాడట. నిజానికి ఈ ఊరు ఇలా అభివృద్ధి చెందాలన్నది మా తాతయ్య కోరిక! ఆయన కోరిక ఇలా నెరవేరింది", అన్నాడు ఆనందంతో మురిసిపోతూ.

కథ సమాప్తం. 


*****


G. S. S. కళ్యాణి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు G. శ్రీ శేష కళ్యాణి. మాది హైదరాబాదు. ప్రస్తుత నివాసం కాలిఫోర్నియా, USA. మా తల్లిదండ్రులవల్ల నాకు సాహిత్యం పట్ల అభిమానం ఏర్పడింది. వారి ప్రోత్సాహంతో నేను రచనలు చెయ్యడం ప్రారంభించి, మా కుటుంబసభ్యుల సహకారంతో కొనసాగిస్తున్నాను. నా మొదటి రచన టీ.టీ.డీ. వారి 'సప్తగిరి' మాసపత్రికలో ప్రచురితమయింది. 2018 సంవత్సరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో(TAGS) వారు నిర్వహించిన ‘శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ’ లో నా మొట్టమొదటి కథ 'సంక్రాంతి సంబరం - ఒక మధుర జ్ఞాపకం'  కన్సోలేషన్ బహుమతి గెలుచుకుంది. ఆ తరువాత నేను రాసిన కథలు ప్రముఖ ఆధ్యాత్మిక పత్రిక 'భారత ఋషిపీఠం'తో సహా వివిధ వెబ్-పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇంతవరకూ నేను రాసిన కొన్ని కథలను, “కదంబవన కుసుమాలు” - VOL 1, VOL 2, మరియు VOL 3 అన్న పేర్లతో మూడు పుస్తకాలుగా విడుదల చెయ్యడం జరిగింది. నేను రాసిన "శ్రీరామనామము పలికెదము" అనే పాటను ‘స్వర’ మీడియావారు 2023 సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా యూట్యూబ్ లో విడుదల చెయ్యడం జరిగింది. సమయం దొరికినప్పుడల్లా నాకు కలిగిన భావాలను రచనలుగా మలచి, వాటిని సకలకళాస్వరూపిణి అయిన ఆ అమ్మవారి పాదాలకు పుష్పాలుగా సమర్పిస్తున్నాను. 





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page