'Nannu Nenu Bathikinchukunna' - New Telugu Story Written By Surekha Puli
Published In manatelugukathalu.com On 30/04/2024
'నన్ను నేను బతికించుకున్నా' తెలుగు కథ
రచన: సురేఖ పులి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“తిరపతి వెంకటేశ్వపరా, దొరా నీవే దిక్కని నమ్మినానురా” ట్రైన్ లో బిచ్చగత్తె అడుక్కుంటుంది. నాన్నగారు చిల్లర నాణ్యాలు దానం చేశారు. ప్రతీ ప్రయాణికుడి వద్ద కెళ్ళి ఈ ఒక్క వాక్యన్నే శృతి లేకుండా పాడుతున్నది. నాన్నగారిని అందరూ ‘దొరా’ అని పిలుస్తారు, మరికున్నా దేవుడిని కూడా ‘దొరా’ అని ఎందుకు అంటారో నా చిన్ని వయసుకు అర్థం కాలేదు.
సివిల్ ఇంజనీరింగ్ చదివిన నాన్నగారు పి. డబ్లు. డి. లో ప్రభుత్వ ఉద్యోగం మానేసి హైదరాబాద్ నిజాంగారి ఆధ్వర్యంలో నిర్మించిన భవనాలు, కట్టడాలు, బురుజులు మొదలుగు వాటి సంరక్షణ పని చేపట్టారు. నాన్నగారి కార్యదీక్షత మెచ్చి నిజాంగారు ఆబిడ్స్ వద్ద వేయి గజాల స్థలాన్ని ఇనామ్గా ఇచ్చారు.
తన చదువును, అనుభవ జ్ఞానాన్ని క్రోడీకరించి, ఇల్లు తన కోసమే కాదు, పుత్ర పౌత్రాదికుల కొరకై (విశాలమైన గదులు, ఎత్తైన చూరు, పొడుగాటి కిటికీలు, దళసరి తలుపులు, ఇంటి చుట్టూ అన్ని రకాల మొక్కలు) స్వర్గాన్ని కట్టించారు. నాన్నగారి పేరు ధర్మవరపు శ్రీనాధ పద్మనాభం. మాంఛి హుందా గల ఆరోగ్య అవయవ సౌష్టవం. మ్యాచ్లెస్ మోటార్ సైకిల్ నడుపుతుంటే అందరూ డి. ఎస్. పి. దొరా అనే వారు.
పండిత పుత్ర పరమ శుంఠ! సరిగ్గా నాకు అన్వయించ పడుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా నేను చేయాల్సిన పనులే చేసేవాడిని. ఆ పంధాలో కష్టంగా లైబ్రరీ సర్టిఫికెట్ కోర్సు చేసి సుఖమైన ఊడిగం ఎన్నుకున్నా ప్రభుత్వ సంస్థ లైబ్రేరియన్గా; చాన్నాళ్లకు తెలిసింది, నాన్నగారి పలుకుబడే ఎర అని.
భాగ్యనగరం ఆనవాయితీగా నిజాంగారు భద్రాచల శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ నిమిత్తం ప్రతీ యేటా పట్టు వస్త్రాలు, కెంపు, ముత్యాల తలంబ్రాలను పంపే బాధ్యత నాన్నగారికి కేటాయించారు.
వేసవి కాలం, క్రిక్కిరిసిన జనాలు, ఉక్కపోత! నేను ఎల్లప్పుడూ ప్రశాంత వాతావరణం కోరుకుంటాను. దేవుడి ధ్యాస కంటే అక్కడి దేవాదాయ శాఖ వారు మాకు ఇచ్చిన గౌరవసన్నిధి నాకు గర్వకారణంగా గోచరించింది. అమ్మ రామదాసు కీర్తనల పుస్తకాన్ని కొనుక్కుంది.
“ఇక్ష్వాకుల తిలక ఇకనైన పలుకవా రామచంద్రా!” అని అమ్మ వీనుల విందుగా భక్తితో పాడుతుంటే, అమ్మలో ఇంతటి కళ ఉందా? సంగీతం వచ్చినట్లు ఎప్పుడూ చెప్పలేదు.
***
నాకు నచ్చిన పార్వతిని పెళ్లి చేసుకున్నాను. సామాన్యంగా భార్య పేరు ముందు, భర్త పేరు తర్వాత వుంటాయి. కానీ నేను ధర్మవరపు జ్ఞానేశ్వర పార్వతి అని రాసుకునే వాడిని, అంటే డి. జి. పి. !
నలుగురు అమ్మాయిలే! అబ్బాయి పుట్టాలని పార్వతి తలనీలాలు ఇస్తానని మొక్కుకుంది.
నాన్న పోయాక అమ్మ శారీరకంగా, మానసికంగా కుంగి పోసాగింది. తిరుపతి బయలుదేరాము. ఇసుక వేస్తే రాలని జనం! ఒకటే తోపులాట, తొక్కిసలాట!! బారులు తీరిన మనుష్యులు!!! అమ్మ మరీ నీరస పడుతుంది. రెప్పపాటు కాలం.. అంతే! సెక్యూరిటీ తోసేశారు. భగవంతుడా, కన్నుల నిండా చూసుకునే అదృష్ట భాగ్యమే లేదా? దైవసన్నిధిలో కనీసం అమ్మకు ఒక నిమిషమైనా వ్యవధి ఇవ్వాల్సింది.
అందరూ పరలోకానికి పయనమైనారు. పదవీ విరమణ జీవిని నేను. నలుగురు అమ్మాయిల పెళ్ళిళ్ళు అయి ఆస్ట్రేలియాలో వివిధ రకాల మొక్కలు, పెంపుడు పశు పక్షుల పెంపకం-అమ్మకం; ఆదాయ వ్యాపార వేత్తలై, ఇళ్లు కట్టుకుని సుఖంగా వున్నారు.
“నాన్నా, ఇల్లు నా పేరున వుంటేనే బ్యాంక్ లోన్ ఇస్తారు. ఆబిడ్స్ లో మన ఒక్కరికే ఇంత పెద్ద ఇల్లు ఎందుకు? సూపర్ డీలక్స్ అపార్ట్మెంట్ కడితే బోలెడు ఇన్కమ్. జీవితమంతా కూర్చుని తినొచ్చు. ” జ్ఞానేశ్వర్ చెవిలో శంఖం వూదుతూనే వున్నాడు కొడుకు బాలాజీ. గొప్ప చదువు, లక్షల్లో సంపాదన. పెద్దింటి అమ్మాయితో పెళ్లి జరిగి సంతృప్తిగానే వున్నా, అపార్ట్మెంట్ పిచ్చి పట్టుకుంది అల్లారుముద్దుగా పెరిగిన అబ్బాయికి.
***
ఇంకా మధ్య వయస్కుడు అని నిరూపించాలని నెరిసిన జుట్టుకు నల్ల రంగు వేసినా, వయసు మీరిన పౌరుడనని, ఓటరైడి, ఆధార్ కార్డు నా వెన్ను తడుతూ వుంటాయి; ప్రతీ రోజు తప్పని సరిగా వ్యాయామం, నడక, దినపత్రికలు, అల్ప పౌష్టికాహారం, పుస్తక పఠనం వలన నా మనసు యవ్వనపు ఉరవడి ప్రస్పుటిస్తున్నాయి.
“మామగారు, మీరు జాగ్రత్తగా నడవాలి; జాగ్రత్త, జాగ్రత్త!” ఈ ఊత పదం వినలేక వాళ్ళ నుంచి పారిపోవాలని చాలా మార్లు ప్రయత్నించాను. ఆస్ట్రేలియాకు వెళ్లాలన్నా, అల్లుళ్లకు సీనియర్ సిటిజన్ అడ్డంకులే!
పేరున్న బిల్డర్, లాయర్లతో అపార్ట్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ‘బాలాజీ గ్రాండియర్’ పేరున టవర్ హౌస్ నిర్మించబడ్డది. చూస్తుండగానే బాలాజీ కోటీశ్వరుడు జాబితాలో చేరుకున్నాడు. నా కోసం ఆండ్రోయిడ్ ఫోన్ కొని, దాని వాడుకను చూపించాడు. వంట, ఇంటి పనులకు మనిషిని కుదిర్చాడు. ఆధునిక గృహోపకరణాలు ఎన్నో కొని, నన్ను ఏకాకిని చేసి, పుత్రరత్నం అమెరికాకు వలస పోయాడు. నా వ్యాపకాలు నాకున్నా, ఒంటరి జీవిత నిస్పృహలతో నీరసంగా ఉండేది. మెల్లి మెల్లిగా నిస్సహాయత నన్ను ఓడిస్తుంది.
***
‘పని లేని మంగలి పిలిచి పిల్లి తల గొరిగాడట’ అనే సామెత నిజమైంది. ఇక్కడ చైనా మంగలి, పిల్లి యావత్ ప్రపంచం.
భూగోళాన్ని గడగడ లాడించింది కరోనా వైరస్! లాక్ డౌన్లు, శానీటైజర్లు, మాస్కులు. స్తబ్దత! ఎక్కడి వాళ్ళు అక్కడే!! డాక్టర్లు, విద్య సిబ్బంది నిరంతర సేవలకు తల వంచి పాదాభివందనం చేయాలి. ఎదుర్కున్న నష్టాన్ని, కష్టాన్ని వెలకట్టలేము.
విదేశాల నుండి సంతానం వాక్య: “నాన్నగారు జాగ్రత్త!, సీనియర్ సిటిజన్, అందునా రోగ నిరోధక శక్తి తగినంత లేనివారు, జాగ్రత్తో, జాగ్రత్త! టేక్ కేర్. ”
ఆంగ్ల లిపి, తెలుగు అర్థం. ఇదేం భాష? నపుంసక భాష! నాకేం అయింది? వయసులో ఉన్నప్పుడు శారీరక శక్తి అమితంగా ఉంటుందేమో, కానీ నాకు మానసిక శక్తి, ఆత్మవిశ్వాసం అధిక శాతం నిజాన్ని అధిగమిస్తారెందుకని?
ఎండలు పోయి వానలు వచ్చాయి. కలుషిత వాతావరణం పురిటి స్నానాలు చేసుకుంది. ఆన్లైన్ క్లాసులు, ఆఫీసులు. బాల్కనీ నుంచి ఆబిడ్స్ రోడ్డు చూస్తే హాయిగా వుంది, వాహనాల మోత లేదు, జన సంచారం అసలే లేదు. పండుగ రోజు ఇల్లు కడిగి శుభ్రం చేసినట్లు కనులవిందుగా వుంది.
కమ్యూనిటీ హల్లో కార్యనిర్వాహక సభ్యులు తీర్మానించారు “ఆన్లైన్ టికెట్స్ తెరుచుకున్నాయి, బుక్ చేద్దాం. ఎందుకంటే ఈ పాండమిక్ టైమ్లో మనల్ని ఆ భగవంతుడే రక్షించాలి. ఇంటి నుంచి తిరుమల వరకు బస్సు, ప్రత్యక్షంగా ఆ దేవదేవుడికి మన ఇబ్బందులు విన్నవించుకుందాము. ”
ప్రాణ భయం వలన వందల్లో వున్న అపార్ట్మెంట్ జనాభాలో పదిమంది ఒప్పుకున్నారు. రద్దు చేద్దామన్నారు కొందరు. ‘సరే’ అన్న వాళ్ళల్లో నేనే ప్రధముడ్ని. విదేశీ ఫోన్లు, మెస్సేజ్లు; ‘వద్దు, ఇల్లు కదలొద్దు. ’ గెలుపు నా మనసుదే.
***
అసలే కోవిడ్19, మనుషులందరూ ఇంటి చుట్టూ లక్ష్మణరేఖ గీసుకున్నారు; అందునా సెప్టెంబర్ వానలు. ఆన్లైన్లో దైవదర్శనం స్లాట్ సునాయాసంగా దొరికింది.
తిరుమల ఘాట్ రోడ్డు ఎక్కాము. సాయంత్రం ఐదు గంటల సమయం. నా తోటి ప్రయాణికులందరూ “గోవిందా, హరి గోవిందా” అంటూ స్తుతిస్తున్నారు. నేను మాత్రం ప్రకృతి అందాల ఆనందం అనుభవిస్తున్నాను. చుట్టూ కొండలు-చెట్లు, వృక్షాలు-వంపులు. సన్నటి వాన తుంపర్లు! నీటి బరువును మోస్తూ మెల్లిగా కదులుతున్న మబ్బులు! బస్సు మలుపు తిరిగి నప్పుడల్లా ఓ ప్రక్కగా ఒరిగిపోయే కేరింత! తడిసిన స్వచ్చమైన గాలి, వృక్షాల నుంచి వనమూలికల వాసనకు తోడుగా తడిసిన నేల వెదజల్లుతున్న మట్టి సువాసన. ఈ వాసనలు తోడై ఆరోగ్యంగా వున్న జీవికి ఆక్సిజన్, సలైన్ ఎక్కిస్తున్నట్టు, శరీరంలో హుషారు శాతాన్ని పెంచుతున్నాయి. నా ఈ ఆహ్లాదాన్ని సరితూగే పోలిక ఎక్కడైనా వుందా?
కొండచిలువను పోల్చే క్యూ లేదు. అక్కడక్కడ ఒకరూ, ఇద్దరూ తప్ప మనుషుల రద్దీ లేదు. ఆహా! ఎంత ప్రశాంతత. ప్రతీ అర కిలోమీటర్ దూరంలో శానీటైజర్లు, మాస్కుల హెచ్చరికలు. దారి పొడుగునా కుందేలు పరుగులే! కోవిడ్ వాక్సిన్ల సర్టిఫికెట్ సమర్పించాను. వేలిముద్రల పరీక్ష ఇరుకున పెట్టింది. “సార్ మీ అరచేతి వేళ్ళు అరిగిపోయాయి, ఏజ్ పైన పడుతున్న కొద్దీ” అంటూ వ్రేళ్ళను మారుస్తూ, ఆధార్ ప్రామాణిక తనిఖీ!
నేను ప్రశాంత వాతావరణం చవి చూసి గుడి ప్రాంగణంలో వచ్చాను, అందుకే తనిఖీ అబ్బాయి బ్రతికి పోయాడు, నా వ్రేళ్ళ మొదళ్ళ ముడతలకు ఆధార్ ప్రామాణికం ఒప్పుకోదా? హమ్మా!?
మా గ్రూప్లో మరో ముచ్చటైన, తల నెరిసిన జంట వున్నారు. కీళ్ల నొప్పులట, పాపం. ఆ స్త్రీ ఒక చేత్తో భర్త సాయంగా, మరో చేయి మాలో ఎవరో ఒకరి సాయంతో నడుస్తున్నది.
ఆపద్బంధువు శ్రీ వేంకటేశ్వర స్వామి! నేను, నా ఎదురుగా దేదీప్యమాన దీప్తి! అంతే!! సంతోషం అధిగమించి ఆనందభాష్పాలా లేక వయసుడిగిన అచేతనత్వ ముద్ర వలన కలిగిన దుఃఖమా!? ఉచ్చాశ్వాస-నిశ్వాసలున్నా, నా వునికి భూమండలంలో లేదు.
ఓం. శిరసి వజ్ర కిరీటం - వదనే శశివర్ణ ప్రకాశం - ఫాలే కస్తూరి శ్రీగంధ తిలకం - కర్ణే వజ్ర కుండల శోభితం - నాసికాయాం సువాసిక పుష్ప దళం - నయనే శశిమండల ప్రకాశం - కంఠే సువర్ణ పుష్ప మాలాలంకృతం - హృదయే శ్రీనివాస మందిరం - కరే కరుణాభయసాగరం భుజే శంఖు చక్రాధరం - స్కంధే సువర్ణ యజ్ఞోపవీత భూషణం - సర్వాంగే స్వర్ణ పీతాంబరం ధరం - పాదే పరమానంద రూపం - సర్వపాప నివారకం. శ్రీ వేంకటేశం - శ్రీనివాసం - తిరుమలేశం - నమామి! శ్రావ్యమైన కంఠం.
దైవదర్శనం దివ్యదర్శనం! సమస్తం శ్రీవారిలో లగ్నం. మహత్తర సుధీర్దర్శనం, జన్మ ధన్యమైంది.
జనాల తొక్కిసలాటల్లెవు. అరగంట దాటినా మమ్మల్ని ఎవ్వరూ అభ్యంతర పెట్టలేదు. స్వామిని స్పష్టంగా రెండు కళ్లతో చూద్దామనుకున్నా; మందపాటి కళ్ళ జోడు జేబులోనే దాక్కునే. తృప్తి తీరా కీర్తిద్దామనుకుంటే; గళం, గానం మూగ దాయే. ఆరోగ్యానందం కోరుకుందామంటే; రెండు చేతులెత్తి దండం పెట్టలేక శరీరం-మనసు నా ఆధీనంలో లేక పోయే. ఆత్మ పరమాత్మలో మిళితమై పోయింది.
మరొక స్లాట్ వారు వచ్చారు. తనివి తీరలేదు; అయిష్టంగా, బలవంతంగా పవిత్ర స్థలాన్ని వదిలి కదిలాము.
ప్రసాదాల రుచే రుచి! అమ్మా, నాన్న, పార్వతి గుర్తుకు వచ్చారు. కళ్ళు చెమ్మగిల్లాయి. అన్ని వేళల సమస్త సదుపాయాలు సమకూర్చి, నా మాటకు తిరుగు లేని జీవితాన్ని అందించారు.
తిరుగు ప్రయాణం. ప్రకృతి అందాల తోడుగా నా మనసు నిర్మలంగా మహదానందంగా వుంది. అవే ఉత్తేజ పరిచే సువాసన, వాన తుంపర్లు, అవే గోవిందుడి నామ జపం. రోడ్లన్నీ విద్యుత్ దీపాలు. ఆహా! ఎంత సుందరమైన దృశ్యాలు. ఎక్కడో హిమాలయాల్లో, మరేక్కడో విదేశీ విహారాల్లో కాదు; స్వర్గం యిక్కడే వుంది.
అందమంటే శారీరిక అందమని, ఆనందమంటే వ్యావహారిక ఆనందమని, అనుకుంటే పొరపాటే, ఎందుకంటే, భౌతికత్వాన్నిదాటి చూసే అందంలో, లౌకిక ఆనందాల్నిమించిన ఓ అరుదైన అనుభవం వుంది! అదే అసలైన ఆనందం.. వయస్సుతో తరిగిపోని నిజమైన అందం!
నేను వయసు మళ్ళి, జీవిత చరమాంక దశలో వున్నాననే అపవాదులను పట్టించుకోక, ఏదో మంచి పని చేయాలి. 'నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను. '
***
పుస్తక పఠనం బాల్యం నుండి అలవడాలి, పసి వయసులోనే ఆలోచన విధానం పరిపూర్ణత సంపాదించాలి. గూగుల్ సెర్చ్, రేటింగ్ ద్వారా ప్రముఖ భారతీయ భాషల్లో మరియు పేరుగాంచిన పబ్లిషర్స్ నుండి అమెజాన్ పోస్టల్ డెలివరీ సహకారంతో పిల్లలకు అనువైన పుస్తకాలు తెప్పించి, నా ఇంటిని ‘జ్ఞానోదయ’ బాలల గ్రంథాలయం గా మార్చాను. ఈమేల్, వార్ట్స్అప్, జీపే సహాయంతో నా ప్రణాళిక రూపుదాల్చింది. ఐదు నుంచి పదహేను వయసు బాలబాలికలు అర్హులు. పసి మనస్కుల అనుబంధ సాన్నిహిత్య సాంగత్యంలో నా చురుకుదనపు స్పందన ప్రతిబింబం చూడగలిగాను.
***
జ్ఞానోదయ బాలల గ్రంథాలయం ప్రవేశ ద్వారం ఎదురుగా పరిమళిస్తున్న తాజా పూలదండతో చిరునవ్వు చిందిస్తున్న నా విగ్రహం అందరికీ ఆహ్వానం ఇస్తుంది. నేను భౌతికంగా లేనేమో! కానీ నన్ను నేను బ్రతికించుకున్నాను.
*******
సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
పేరు :సురేఖ
ఇంటి పేరు: పులి
వయసు: 68 సంవత్సరాలు
భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్
ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. ఇద్దరు అమ్మాయిల వివాహమైంది.
పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.
ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.
మా నాన్న స్వర్గీయ అర్జున్ రావు గారు నా మార్గదర్శకులు.
స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.
HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత
ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం పనిచేసాను.
చందమామ, యువ, స్వాతి, ఈనాడు, నెచ్చెలి, మన తెలుగుకథలుడాట్కాంల లో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి.
ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ను. కధలు రాయటము, చదవడం నా హాబి. చిత్ర లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్ ఇష్టపడతాను.
మీ ప్రోత్సాహమే నా బలం 🤝
మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.
సురేఖ పులి
@divikg5573
• 1 hour ago
Superb Nani
@surekhap4148
• 23 hours ago
ధన్యవాదాలు
@divikg5573
• 15 hours ago
Nicely compiled story briefly covering all aspects, coming across various time frames and also phases of life cycle. Hearty congratulations
Anil Gurram
•19 hours ago
👌🥳👌👍🙏