top of page

అమ్మకు మళ్ళీ పెళ్ళి!



'Ammaku Malli Pelli' - New Telugu Story Written By Penumaka Vasantha

Published In manatelugukathalu.com On 28/04/2024

'అమ్మకు మళ్ళీ పెళ్ళి' తెలుగు కథ

రచన, కథా పఠనం: పెనుమాక వసంత



"దివ్య, రామ్మా! అన్నం తిందాం" అంది గిరిజ. 


"నాకు వద్దమ్మా! ఆకలి వేయటం లేదు”. 


" ఇందాక ఆకలేస్తుంది అన్నావు కదే!"

 

"అపుడయింది, ఇపుడు అవ్వటం లేదు. నీకెందుకు! నా ఆకలి గురించి, నా గురించి.. నాకు అన్నం వద్దూ! అంతే. రేపు మార్నింగ్ నాకు ఢిల్లీ వెళ్ళటానికి ట్రైన్ బుక్ చేసుకున్నా!" అంది దివ్య. 

 

 "అదేంటే! ఒక నాలుగు రోజులు ఉంటానన్నావు. ఎందుకు! ముందే వెళ్తున్నా”వన్న గిరిజతో, 

"లీవ్ లేదూ!"అంటూ బట్టలు సర్డుకుంటున్న దివ్యతో గిరిజ, "ఏ బుజ్జులు.. అమ్మ మీద కోపమొచ్చిందా! నువ్వు చెప్పింది వినలేదనీ !" అంటూ దివ్య భుజంపై చెయ్యి వేసిన గిరిజతో చెయ్యి తీస్తూ "అదేమీ లేదు నీ ఇష్టమమ్మా! నువ్వు చెప్పిందల్లా నేను విన్నాను. నేను చెప్పిన ఈ ఒక్కమాట వినమంటే వినవూ! నేనిక్కడ వుండి ఏమి ప్రయోజనమంది"- దివ్య. 

 

"దివ్యా! దేనికైనా ఒక హద్దు వుంటుంది. నువ్వు చెప్పేది వినటానికే, బాగా లేదు. నీకు పెళ్లి చేయాలని నేను సంబంధాలు చూస్తుంటే నువ్వు నాకు పెళ్ళి చేయటం ఏమిటి విడ్డూరం కాకపోతే! ఎవరన్నా వింటే నవ్విపోతారు. "

 

 "ఎవరి గురించో నాకు చెప్పకమ్మా! మా ఆఫీసులో పని చేసే సురేషుగారు నిన్ను పెళ్లి చేసుకుంటానంటే ఎందుకు నువ్వు ఎస్ చెప్పవూ!"అంది దివ్య. 


"దివ్యా! నీకు పిచ్చేక్కిందా?! ఈ వయసులో నాకు మళ్ళీ పెళ్లేంటి. ఎవరన్నా వింటే మొహాన వుమ్ముతారు"

 

"నో అమ్మా! నవ్వేతే నవ్వనీ! నీ వయసెంత! జస్ట్ ఫార్టీ ఫైవ్. ఈ నవ్వే వాళ్ళు ఎపుడు నవ్వుతూనే ఉంటారు. దానికే నువ్వు నీ జీవితమయిపోయిందని చేతులెత్తేస్తే ఎలా అమ్మా! నా జీవితం నేను చూసుకుని పెళ్లి చేసుకుని పోతే నిన్నెవరు చూస్తారు?"

 

"ఎందుకే! నువ్వు లేవా! తర్వాత నీకు పుట్టే బిడ్డలు ఉంటారు. దివ్యా! నీకు ఇరవైమూడు ఏళ్లు వచ్చాయి. ఇపుడు నీకు సరైన టైం పెళ్లి చేసుకోవటానికి! కాదనకు. పిచ్చి గోల చేయకు, మా ఫ్రెండ్స్ వాళ్ల పిల్లలు ఉన్నారిద్దరు. ఎవరో ఒకరిని, సెలెక్ట్ చెయ్యి. ఈ నెలలో కాకపోతే మళ్ళీ ఆరునెలల వరకు ముహూర్తాలు లేవు. సరేనా! నా బంగారు తల్లివి కదూ! ఒక జన్మకు ఒకటే పెళ్ళి. మీ నాన్నగారి స్థానంలో మరోకరిని ఊహించుకోలేను. ఆ ఆక్సిడెంట్తో ఆయన పోకుండా ఉంటే నా జీవితం బావుండేది” అంటూ “అసలు నేను పోతే ఇంకా బావుండేది" అంటూ కళ్ల నీళ్ళు తుడుచుకుంది. 

 

"అమ్మా! నాన్న పోయి పదియేళ్లవుతుంది. నాన్న జాబ్ చేస్తూ.. నన్నింత దాన్ని చేయటానికి నీవు ఎంత సఫరయ్యావో నాకు మాత్రమే తెలుసు. ఒక వేళ నీ ప్రకారమే వద్దాము, నువ్వు పోయి, నాన్న వుంటే, ఎపుడో మళ్ళీ పెళ్ళి చేసుకునేవాడు. ఈ నవ్వే వాళ్లకు తెలియదు, మనం ఎన్ని బాధలు పడ్డామో! ఎవరికైనా వాళ్ల దాకా వస్తె గానీ ఎదుటి వాళ్ల బాధలు తెలియదు. ప్లీజమ్మా! ఒప్పుకో" అంది దివ్య. 


 ఎంతకీ గిరిజ ఒప్పుకోక పోయేసరికి, దివ్య కోపంగా ఢిల్లీ వెళ్ళింది. వెళుతూ "అమ్మా! మా ఆఫీస్లో పనిచేసే నా పై ఆఫీసర్ సురేష్ గారి అబ్బాయి దత్తా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ కోసం కౌన్సలింగుకు వస్తున్నాడు. ఒక టూ డేసు మనింట్లో ఉంటాడు, జాగ్రత్తగా చూడ”ని చెప్పి కోపంగా వెళ్ళింది. 


"అలాగే! నువ్వు జాగ్రత్త. వేళకు తింటూ వుండు. వెళ్ళగానే ఫోన్ చెయ్యి” బై చెప్పి తలుపేసుకుంది గిరిజ. 


 దత్తా వచ్చాడు, చాలా కలివిడిగా మాట్లాడుతున్నాడు కొత్త లేకుండా. గిరిజ ఆఫీస్ కెళ్తూ "దత్తా!, టిఫిన్ భోజనం అన్నీ రెడీగా ఉన్నాయి. టిఫిన్ చేసి రెస్ట్ తీసుకో. " 


"అలాగే ఆంటి మీరు వెళ్లండి. నేను టిఫిన్ తినేసి బయటికి వెళ్ళొస్తా. కీస్ ఇవేగా!" అంటూ చూపించి, తలుపేసుకున్నాడు. 


 దివ్యకు కాల్ చేసింది గిరిజ దత్తా వచ్చాడని, కొత్త లేకుండా చక్కగా మాట్లాడుతున్నాడని. 

"ఒకే అమ్మా! దత్తాను బాగా చూడు. సురేషుగారు మా బాసుకు నా మీద మంచిగా చెపితే నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవుతుం”దని చెప్పింది దివ్య.


"రేపు లీవ్ పెట్టీ దత్తతో పాటూ నేను ఆ ఇంజనీరింగ్ కాలేజు కౌన్సెలింగుకు వెళతాను"అంది గిరిజ. 


"ఒకే, అలాగే చూసుకోమ్మా!" అంటూ ఫోన్ పెట్టేసింది దివ్య. 


ఆ ఈవెనింగ్ దత్తకు బిరియాని, పానిపూరి అన్నీ చేసిపెట్టింది గిరిజ.


అన్నీ తిని "చాలా బావున్నాయి ఆంటీ! మా మమ్మీ కూడా ఇలానే చేసిపెట్టేది" అంటున్నపుడు దత్తా గొంతు గీరబోయింది. 


"అవునా మరి! అన్నీ పారేయకుండా, తింటే పైనున్న మీ అమ్మగారు ఆనందిస్తారు" అంది గిరిజ. 


ఆ మాటకు వెంటనే ప్లేట్లో వున్నవన్ని తినేశాడు దత్తా. 


"గుడ్నైట్ రేపు త్వరగా లేవా”లంటూ తన రూంలోకి వెళ్ళింది గిరిజ. 


"డాడీ! ఆంటీ చాలా చక్కగా అమ్మలాగే నన్ను చూసుకుంటున్నారు. రేపు కౌన్సెలింగ్ అవ్వగానే ఎల్లుండి మార్నింగ్ బయలుదేరుతా”నని చెప్పాడు దత్తా సురేషుతో. 


"అవునా జాగ్రతరా! కొంచం ఆవిడకు హెల్ప్ చెయ్యి. తిన్న ప్లేట్ సింకులో వేస్తూ, దుప్పటి మడతేసి పెడుతూ, స్విచ్లు తీస్తూ వుం”డని చెప్పాడు సురేష్. 


"అలాగే డాడీ" అన్నాడు దత్తా. 


మరుసటిరోజు గిరిజా, దత్తా ఇంజనీరింగ్ కాలేజుకు వెళ్లారు. అంతా అయి ఇంటికి వచ్చేసరికి ఈవెనింగ్ అయింది. నైట్ డిన్నరుకు ఇద్దరు హోటలు కెళ్ళి భోజనం చేసారు. దానికి దత్తనే వద్దన్నా వినకుండా బిల్ పే చేసాడు. మరుసటి రోజు దత్తా వెళ్ళాడు. ఈ రెండు రోజులు ఎంతో కలివిడిగా మాట్లాడిన దత్తా వెళ్ళగానే, బోరుగా అనిపించింది గిరిజకు. అదేమాట ఫోన్లో చెప్పింది దివ్యకు. 


“చాలా మంచిపిల్లాడు. ఈ కాలం కుర్రకారు గా లేడు” అంది. 


"అమ్మా! మా సురేషు సార్ గారు కూడా నిన్ను పొగిడాడు. మా దత్తను వాళ్లమ్మ లాగా చుసుకున్నందుకు నీకు థాంక్స్ చెప్పమన్నారు. మా సురేష్ సారుకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. దత్తాకు అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చిందని ఆయన హైదరాబాద్ వస్తున్నారు. కాలేజీకి దగ్గర్లో ఇల్లు చూస్తున్నారు సారు. ఒక నెలలో వచ్చేస్తారు. వచ్చేలోగా నా ట్రాన్స్ఫర్ సంగతి కూడా చూస్తానన్నారు"అంది దివ్య. 


"ఈ నెలలోగా నీ ట్రాన్స్ఫర్ సంగతి ఆయనకు గుర్తు చేస్తుండు" అంది గిరిజ. 


 దత్తా ఒకరోజు కాల్ చేశాడు "ఆంటీ! ఎలా ఉన్నా”రని!


"థాంక్స్ దత్తా! మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని కాల్ చేసావు. వేళకు తిండి తిని నిద్ర పోతున్నావా!" అని అడిగింది గిరిజ. 

"భలేవారే ఆంటీ! ఎలా మర్చిపోతాను.. దగ్గరుండి కొసరి, కొసరి తినిపించిన మిమ్మలనీ!" అన్నాడు. 


"అదేమి లేదులే కానీ, మీ డాడీకి చెప్పి దివ్యకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు బంగారు" అంది గిరిజ. 


 "ష్యూర్ ఆంటీ, తప్పక చెప్తాను. దివ్యక్క కూడా నన్ను చాలా బాగా చూసుకుంటుంది. మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత మిమ్మలని కలుస్తాను, బై ఆంటీ!"అని ఫోన్ పెట్టేసాడు 


'దత్తా మంచి పిల్లాడు, ఈ దివ్యకు కూడా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయితే నాకు దిగులుండ’దనుకుంది మనసులో గిరిజ. 


 ఒక నెలలో దివ్యకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది గిరిజా. దత్తా వాళ్లు కూడా హైదరాబాద్ వచ్చారు. ఇల్లు తీసుకుని వుంటున్నారు. దత్తా కాలేజుకు వెళ్తున్నాడు. ఒక ఆదివారం సురేష్, దివ్యా వాళ్ళని ఇంటికి భోజనానికి పిలిచాడు. దివ్యా, గిరిజా, వెళ్ళారు. ఇద్దరు మగవాళ్ళున్న ఇల్లు లాగా లేదు. ఎంతో నీటుగా వుంది. 


దత్తా గిరిజను చూసి "ఆంటీ! బావున్నారా!" అని దగ్గరకు వచ్చాడు. 


"ఆంటీని చూడగానే నన్ను మర్చిపోయావా దత్తా!" అని దివ్య అనటంతో "అదేమీ లేదక్కా!" అంటూ దివ్య దగ్గరికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. 


 లోపల్నుండి సురేషు వచ్చి "థాంక్స్ గిరిజగారు! మా అబ్బాయిని అంత బాగా చూసుకున్నందుకు. " 


"అదేమీ లేదు చాలా బాగా కొత్త పాత లేకుండా కలిసిపోతాడు మీ దత్తా! నేనే థాంక్స్ చెప్పాలి మీకు, మా అమ్మాయికి ఆఫీసులో ఎంతో హెల్ప్ చేసినందుకు" అంది గిరిజ. 


"ఇప్పటికే లేటయింది రండి లంచ్ చేద్దా”మంటూ డైనింగ్ టేబుల్ వైపు దారి తీసాడు సురేష్. 


"అమ్మా! నువ్వు కూడా ఇన్ని వంటలు చేసుండవు, సార్ ఎన్ని చేసారో!" అంది. 


"నిజమేనే! ఎందుకండీ ఇవన్నీ చేసారు, మీరు కూర్చోండి నేను వడ్డిస్తా”నంటూ! గిరిజ అందరికి ప్లేట్లలో వడ్డించింది. 


“వచ్చే ఆదివారం మా ఇంటికి లంచుకు రండి సార్!"అంది దివ్య సురేషుతో. 


"అవును తప్పక రండి" దత్త, సురేషును ఇన్వైట్ చేసింది గిరిజ. 


 అలా అపుడప్పుడు కలుస్తున్నారు గిరిజ, సురేషు ఫ్యామిలీస్. ఇపుడు దివ్యకు వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేసింది గిరిజ. మళ్ళీ దివ్య మొండికేసింది. 

"నువ్వూ, సురేష్ సార్ మారేజు చేసుకుని నాకు పెళ్ళి చేస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను లేదా సూసైడ్ చేసుకుంటా”నని గొడవ చేసింది దివ్య. 


"సరే నీకోసం ఒప్పుకుంటాను. కానీ దత్తా నన్ను వాళ్లమ్మ స్థానంలో ఒప్పుకుంటాడో లేదో.. ఎందుకొచ్చిన ఈ తిప్పలు. నన్ను వదిలేయవే!"అని వేడుకుంది గిరిజ, దివ్యను. 


"నీకెందుకు అవన్నీ నామీద వదిలిపెట్టు” అంది దివ్య. 


మరుసటి రోజు దత్తకు కాల్ చేసి మాట్లాడింది, దివ్య. 


" దత్తా! నీకు మా అమ్మను, మీ నాన్న చేసుకోవటం ఇష్టమే కదా!" అడిగింది దివ్య. 


"ఆ ఇష్టమే అక్కా!" అన్నాడు ఆనందముగా. 


"నేను మా అమ్మను ఒప్పించా. మీ డాడితో నువ్వు మాట్లాడు" అంది దివ్య. 


"ఒకే అక్కా!, నేను చూసుకుంటా ఆ విషయం నాకు వదిలే”యన్నాడు దత్తా. 


 దత్తా, సురేషుతో "డాడీ! నాకు అమ్మ కావా”లన్నాడు.


"ఒరేయి! ఇదేమి సినిమా కాదు. సినిమాల్లో లాగా మా నాన్నకు పెళ్లి, మా చెల్లికి మళ్ళీ పెళ్ళి, ఇలాంటివి చూసి నాకు పెళ్ళి చేయాలని చూడొద్దు, ఇది జీవితం. వస్తువు అంతకన్నా కాదు. నువ్వు అమ్మ కావాలనగానే, షాప్ కెళ్ళి తెచ్చుకోవటానికి" అన్నాడు సురేష్. 


“నువ్వు ఒప్పుకుంటే నేను ఒకింటి నుండి అమ్మను తెచ్చుకుంటా”నన్నాడు.  


"ఆహా! అంత పెద్దవాడివి అయ్యావురా! నువ్వు. ముందు నువ్వు నీ చదువు మీద దృష్టి పెట్టవోయి!" అన్నాడు సురేష్ కోపంగా. 


"నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకుంటేనే నేను చదువుకునేది లేదంటే, లే”దని, ఆరోజు కాలేజికి వెళ్ళకుండా ఇంట్లోనే రూంలో తలుపేసుకుని ఉన్నాడు దత్తా. 


ఇక్కడ రెండురోజుల నుండి అన్నం తినకుండా దత్త, అక్కడ దివ్య! ఎలాగో ముందు సురేష్, గిరిజ మాట్లాడుకోవటానికి ఒప్పించారు. 


గిరిజా, సురేష్ కలిసి మాట్లాడుకున్నారు. గిరిజ తను జాబు మానననీ, తన జీతం, తనుండే, ఇల్లు దివ్యకు చెందాలని, మీ జీతం గురించి నేను అడగను, కేవలం ఇది మన పిల్లల కోసమే మరియు తోడుగా వుండటానికి మాత్రమేననీ! 


ఇద్దరు ఒప్పుకుని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 


ఇపుడు పెళ్లికి పెద్దలు, మన దివ్యా మరియు దత్తాలు. పెళ్లి సింపులుగా గుళ్ళో చేసుకున్నారు గిరిజా సురేషులు. 


"అమ్మా ఇపుడు నీ పెళ్లిలో నీ పక్కనే నేనున్నాగా" అని దివ్య ఆనండపడింది. 


"అక్కా నేను కూడా! ఉన్నా, మనిద్దరం, మన అమ్మానాన్న పెళ్లిలో వుండటం నిజంగా గ్రేట్ కదూ!" అన్నాడు దత్తా. 


"అవును తమ్ముడు, మనం అందరితో మా అమ్మానాన్నలు వాళ్ల పెళ్లికి మమ్మలని పిలిచారని చెప్పుకోవచ్చు" నవ్వుతూ! అంది దివ్యా. 


 అందరూ కలిసి ఇపుడు ఒకే ఇంట్లో వుంటున్నారు. నల్గురున్న పెళ్లి ఫోటోని హాల్లో తగిలించారు పిల్లలు. తరవాత దివ్య పెళ్లి గిరిజ సురేషులు కలిసి చేసారు. దివ్యకు చాలా ఆనందంగా వుంది తను వెళ్ళిపోయినా అమ్మ ఒంటరిది కాదని.. 


 కూతురు దొరికినందుకు సురేష్, కొడుకు దొరికినందుకు గిరిజ ఆనందపడ్డారు. దత్తా దివ్యను సొంత అక్కలాగా చూసుకుంటే, దివ్యా దత్తను సొంత తమ్ముడులాగా చూసుకుంది. దత్తాను ఎంతో ప్రేమగా చూస్తున్నందుకు, గిరిజను ప్రేమగా చూసుకుంటున్నాడు సురేషు. 


 కొసమెరుపు;; పిల్లలు వాళ్లకు రెక్కలొచ్చి ఎగిరిన తర్వాత, ఇల్లు ఖాళీ అయితే, వంటరిగా వుండలేక తోడును వెతుక్కునే వాళ్ళను మనం ఎగతాళి చేయకూడదు. వాళ్ల స్థానంలో వుండి మనం ఆలోచించాలి. పెళ్లి అనేది కేవలం శారీరక అవసరాలకే కాదు. మానసికంగా ఇద్దరు వ్యక్తులు, తమ జీవితాల నుండి ఒంటరితనాన్ని పారద్రోలి, బతికినన్నాళ్లు ఆనందంతో బతకటము అనుకుంటే ఎటువంటి ఆక్షేపణ ఉండదు, చేయకూడదు కూడా. 

***

పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


 విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.

56 views0 comments

Comments


bottom of page