top of page

నవరాగం

#Navaragam, #నవరాగం, #Mayukha, #మయూఖ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Navaragam- New Telugu Story Written By Mayukha

Published In manatelugukathalu.com On 30/07/2025

నవరాగం - తెలుగు కథ

రచన: మయూఖ


సావిత్రి ఎంతో ఎదురుచూస్తోంది. ఈరోజు కొడుకు, కొత్త కోడలు వస్తున్నారు. ఇల్లంతా సద్ది ముగ్గులు పెట్టి, పిండి వంటలు తయారు చేసి ఉంచింది. చిన్న పెంకుటిల్లు ఇంటి చుట్టూ పూల మొక్కలు వేసింది. మొక్కలంటే సావిత్రికి ఎంతో ఇష్టం. అందుకే ఇల్లు చిన్నగా కట్టించింది. 


సావిత్రి భర్త రఘురామయ్య 2 ఎకరాల పొలంతో వ్యవసాయం చేస్తున్నాడు. ఊరిలో అందరికీ తలలో నాలుకలా ఉంటాడు. 


******

సావిత్రి, రఘురామయ్యలకి వంశీ ఒక్కడే కొడుకు. పల్లెటూరులో టెన్త్ వరకే ఉంది. పై చదువులు అంటే పట్నానికి వెళ్ళాలి. ఈ సంవత్సరము ఇంటర్లో జాయిన్ అయ్యాడు. రోజు బస్సులో వెళ్లాలంటే చాలా టైం పడుతుందని హాస్టల్లో జాయిన్ అయ్యాడు. సెలవులకి ఇంటికి వచ్చి మళ్లీ వెళ్లేవాడు. కొత్తలో బెంగ పెట్టుకున్నాడు కానీ, తరువాత చదువులో పడిపోయాడు. 


 కాలం గిర్రున తిరుగుతోంది. వంశీ ఇంజనీరింగ్ కి వచ్చాడు. బీటెక్ లో తన క్లాస్మేట్ మైధిలిని ఇష్టపడ్డాడు. మైధిలి చాలా డబ్బున్న అమ్మాయి. వాళ్ళ నాన్న కాంట్రాక్టర్, వంశీ బాగా చదవడం, సోషల్ యాక్టివిటీస్ లో ముందు ఉండడంతో అందరి దృష్టి వంశీ మీదే ఉండేది. మైధిలి కూడా వంశీ వెనకే ఉండేది. ఒకళ్ళని ఒకళ్ళు ఇష్టపడ్డారు. 


 ఇద్దరూ ఉద్యోగాలు వచ్చిన తర్వాతే పెళ్లి విషయం పెద్దలతో చెప్పారు. సావిత్రి, రఘురామయ్య తట పటాయిస్తూనే ఒప్పుకున్నారు. ఎందుకంటే తమది పల్లెటూరు. తాము మధ్యతరగతి వాళ్ళం. మైధిలి ధనవంతుల అమ్మాయి. ఈ పల్లెటూరిలో ఉండగలదా! అనుకున్నారు. కానీ వంశీ పట్టు పట్టడంతో'ఊ'అనక తప్పలేదు. ఎంగేజ్మెంట్ పెద్ద ఫంక్షన్ హాల్లో చేసి ముహూర్తాలు పెట్టుకున్నారు. సావిత్రి వాళ్లు పల్లెటూరు నుంచి చిన్న వ్యాన్లతో కొద్దిమంది చుట్టాలు, స్నేహితులతో పెళ్లికి బయలుదేరారు. పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మైధిలి తండ్రి కాంట్రాక్టర్ అవడంతో పెద్దపెద్ద వాళ్లు అందరూ వచ్చారు. పెళ్లి ఘనంగా జరిగింది. 


పెళ్లి అయిన వెంటనే కొత్త దంపతులు తిరుపతికి వెళ్లి అక్కడి నుంచి సరాసరి పల్లెటూరికి రావాలి. సావిత్రి వాళ్లకోసమే ఎదురుచూస్తోంది. కారు హారన్ మోగడంతో సావిత్రి గబగబా పళ్ళేo లో హారతి తీసుకుని, దంపతులకి దిష్టి తీసి లోపలికి ఆహ్వానించింది. "కుడికాలు పెట్టి లోపలికి రామ్మా!"అంది. ఊళ్లోకి కొత్తగా కారు రావడంతో పిల్లలందరూ దాని చుట్టూ మూగారు. 


మైథిలి లోపలికి వచ్చి ఇల్లంతా కలియతిరిగింది. ఇల్లు మొత్తం తన "అవుట్ హౌస్ అంత ఉంది"అనుకుంది. తను పట్టు పట్టడంతో తండ్రి ఒప్పుకున్నాడు కానీ, లేకపోతే ఈ సంబంధం ఒప్పుకునేవాడా అనుకుంది. 

సావిత్రి వచ్చి"ఎప్పుడు అనగా తిన్నారో, రండి కాళ్లు కడుక్కుని అన్నం తిందురు గాని" అంది. వంశి దొడ్డి వైపు తీసుకు వెళ్ళాడు. బావి దగ్గర పెద్ద సిమెంటు తొట్టె నిండా నీళ్లు ఉన్నాయి. చెంబు తీసుకుని కాళ్లు కడుక్కున్నారు ఇద్దరూ. పెరడు అంతా విశాలంగా ఉంది. పూల మొక్కలు ఒకవైపు, మామిడి, అరటి, సపోటా మొదలైన పళ్ళ చెట్లు ఒకవైపు ఉన్నాయి. ఒకవైపు మూలగా పందిళ్ళకి కూరగాయ పాదులు వేలాడుతున్నాయి. వాడుకునే నీళ్లు అన్ని మొక్కల్లోకి వెళ్ళేటట్టు ఏర్పాటు చేశారు. 


ఇద్దరూ లోపలికి వెళ్లారు. కిచెన్ కి పక్కగా డైనింగ్ టేబుల్ వేసి ఉంది. దానిమీద తెల్లటి క్లాత్ పరిచి చిన్న చిన్న గిన్నెల్లో వండిన పదార్థాలన్నీ సర్దింది సావిత్రి. 


"నా వంటలు నీకు నచ్చుతాయో లేదో మొహమాట పడకుండా తినమ్మా"అంటూ పప్పు, వంకాయ కూర, గోంగూర పచ్చడి, పాయసం అన్ని కంచంలో వడ్డించింది. "అమ్మో! అన్ని తినలేను ఆంటీ"అంటూ సుతారంగా తినడం మొదలుపెట్టింది. 


"నువ్వు తినకపోతే మా అమ్మ ఊరుకోదు" అన్నాడు నవ్వుతూ వంశీ. "పోనీలే మైధిలి నీకు ఎంత కావాలంటే అంతే తిను. ఇబ్బంది పడకు"అంది సావిత్రి. 


భోజనాలు అయిన తర్వాత ఇద్దరు రెస్టు తీసుకున్నారు. సాయంత్రం అయింది. "వంశీ! మైధిలికి మన ఊరు చూపించు. గుడికి తీసుకువెళ్ళు"అంది సావిత్రి. 


అయినా ఈ పల్లెటూరులో ఏముంటాయి? పల్లెటూరు అంటే మైధిలికి ఇష్టం ఉండదు. ఎందుకంటే తన చిన్న తనంలో వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు వెళితే అక్కడి వాతావరణం, కరెంటు పోవడం, ఉక్క పోత, ఇవన్నీ తట్టుకోలేకపోయింది. దాంతో పల్లెటూరు అన్నా, అక్కడి మనుషులు అన్నా అయిష్టత ఏర్పడింది. దాంతో అమ్మమ్మ గారి ఊరు వెళ్లడం మానేసింది. చిన్నతనం నుంచి సిటీలో పెరగడంతో సిటీ వాతావరణానికి అలవాటు పడిపోయింది. వంశీ మీద ప్రేమతో ఈ పెళ్లి చేసుకుంది కానీ, లేకపోతే ఒప్పుకునేదే కాదు. "సరేలే చూద్దాం, ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది"అనుకుని బయలుదేరింది మైధిలి. 


వంశి బుల్లెట్ తీశాడు. ఇద్దరూ బయలుదేరారు. పచ్చని పైరులతో, చల్లటి గాలులు వీస్తూ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. ఊరి చివర కోనేరు, దాని పక్కనే రామాలయం ఉన్నాయి. రామాలయంలో అందరూ వంశీని పలకరిస్తున్నారు. తెల్లగా బొమ్మలా ఉన్న మైధిలిని చూసి అందరూ"రఘురామయ్య గారి కోడలా! చాలా బాగుంది"అనుకున్నారు. గుడికి ఒకపక్కగా కాంతమ్మ కొబ్బరికాయలు, పువ్వులు అమ్ముతుంది. వంశి కొబ్బరికాయలు తీసుకుని డబ్బులు ఇచ్చాడు. 


పూజ చేయించుకుని, ప్రసాదం తీసుకుని బండి మీద ఊరంతా తిప్పాడు. మైధిలికి విసుగ్గా ఉంది. ప్రతి వాళ్లు వంశీని పలకరించడమే. సరదాగా తిరిగి వద్దామంటే ప్రైవసీ లేకుండా పోయింది అనుకుంది. 


ఇంటికి వచ్చిన తర్వాత సావిత్రి తను చేసిన జంతికలు, అరిసెలు పెట్టింది. వంశి ఎంతో ఇష్టంగా తిన్నాడు. మైధిలి వాటి వంక కన్నెత్తి చూడలేదు. "నాకు హెవీగా ఉంది"అంటూ తినకుండా ఊరుకుంది. 


కోడలు ఏమీ తినకపోవడంతో సావిత్రి విలవిలలాడింది. "ఈ పిల్ల తిండి ఇంతేనా, లేకపోతే తను చేసినవి బాగుండవనా! అయినా తిని చూస్తేగా తెలిసేది"అనుకుంది.


రాత్రికి వంశీకి ఇష్టమని పూరి, కూర, పాకం గారెలు చేసింది. మైధిలికి ఎందుకో ఇక్కడ ఉండబుద్ధి అవట్లేదు. వెళ్లిపోవాలి అనుకుని వంశీ తో చెబితే ఆశ్చర్యపోయాడు. రెండు రోజులు ఇక్కడ ఉందామనుకున్నావు కదా! ఒక రోజుకే మొహం మొత్తిందా? అయితే ముందు ముందు నువ్వు ఎలా ఉంటావు"అన్నాడు తమాషాగా. 


"నేనా! అమ్మో!"అంటూ గుండెల మీద చేయి వేసుకుంది భయం వేస్తున్నట్లుగా. 


ఈ విషయం తెలిసి ఉసూరు మంది సావిత్రి. "నేను అనుకున్నట్లే అయింది. వద్దంటే చేసుకున్నాడు. మొదటి రోజుకే ఇలా చేసింది. ముందు ముందు ఏముంటుంది? అయినా నా పిచ్చి గానీ అనుకుని"చేసేదేమీ లేక వాళ్ళ కోసం చేసిన పలహారాలు అన్ని ఇచ్చి"మీ అత్తగారికి ఇవ్వు రుచి చూస్తారు"అంటూ ప్యాక్ చేసి ఇచ్చింది. 


మైధిలి మనసులో ఏది పడితే అది అయిపోవాలి. చేసేదేమీ లేక వంశీ బయలుదేరాడు. "వస్తాను ఆంటీ, అంకుల్" అంటూ బై చెప్పి వెళ్ళిపోయింది. 


రఘురామయ్య అన్నాడు "అందుకే అన్నారు వియ్యానికైనా, కయ్యానికైనా సమవుజ్జి ఉండాలంటారు". 


"అన్ని పిండి వంటలు చేశానా! ఒక్కటి వేలేసి ముట్టుకోలేదు. ఏమిటో ఈ అమ్మాయి మనస్తత్వం" అంది సావిత్రి. 


వంశీ అక్కడ అత్తగారికి తన తల్లి ఇచ్చిన పిండి వంటలు అన్ని ఇచ్చాడు, ఎంతో మెచ్చుకుంది. భర్తకి కూడా రుచి చూపించింది. ఎ౦తో రుచిగా ఉండటంతో ఆయన కూడా ఎంతో ఇష్టంగా తిన్నాడు. 

******

కాలం గిర్రున తిరుగుతోంది. ఇద్దరూ వేరింటి కాపురం పెట్టారు. కానీ రోజు మైధిలి పుట్టింటి నుంచే క్యారేజీలు వస్తాయి. ఇద్దరూ ఉద్యోగాల్లో బిజీగా ఉన్నారు. 


ఒకరోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇద్దరు టీవీ పెట్టుకుని చూస్తున్నారు. చానల్స్ మారుస్తుంటే సావిత్రి మొహం కనిపించింది. టక్కున ఆపి వాల్యూమ్ పెంచాడు. యాంకర్ మాట్లాడుతోంది "ఈవిడ పేరు సావిత్రి. ఆవిడ ముగ్గులు పెడతారు చూడండి. ఎంత అందంగా ఉన్నాయో!" అంటూ కెమెరా అటు తిప్పింది. 

నేలంతా తివాచీ పరిచినట్లుగా రంగురంగుల ముగ్గులు చాలా అందంగా ఉన్నాయి. ఆ చానల్ వాళ్లు నిర్వహించిన ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సావిత్రికి. 


మైధిలి ఆశ్చర్యపోయింది. "ఎంత బావుంది ఈ ముగ్గు, నాకు ఎప్పుడు చెప్పలేదే ఆంటీ కి ముగ్గులు వచ్చని" అడిగింది వంశీని. 


"నువ్వు ఎప్పుడైనా మా అమ్మ గురించి అడిగావా? నీకు పల్లెటూరు అంటే ఇష్టం ఉండదు. అక్కడి మనుషులు నచ్చరు. ఒక్క నేను తప్ప. నువ్వు వెంటనే వెళ్ళిపోయావు. రెండు రోజులు ఉంటే మా అమ్మ గురించి తెలిసేది" అన్నాడు బాధగా. 


మైధిలి ఏం మాట్లాడకుండా మౌనం వహించింది. రెండు రోజులు తీవ్రంగా ఆలోచించింది. తల్లి కూడా చెప్పేది "మీ అత్తగారు వంటలు బాగా చేస్తారని తను ఎప్పుడు తినలేదు" అనుకుంది. 


ఒకరోజు "వంశీ, నేను మా అమ్మ దగ్గరకు వెళుతున్నాను. రెండు రోజులు ఉంటాను. సరేనా!" అని చెప్పింది. 


"సర్లే అయితే క్యారేజీ వద్దు. నేను చేసుకుంటాను" అన్నాడు. 


సరే అంటూ బయలుదేరింది మైధిలి. 

***

హఠాత్తుగా ఊడిపడిన కోడల్ని చూసి సావిత్రి ఆశ్చర్యపోయింది. "రామ్మా! నువ్వే వచ్చావు వంశీ ఏడి? అందరూ బాగున్నారా?" ఆదుర్దాగా అడిగింది. 


"అందరూ బాగున్నారు ఆంటీ. నాకే చూడాలనిపించి వచ్చాను. వంశి అయితే అప్పుడప్పుడు వస్తున్నాడు. నేను మళ్ళీ రాలేదు కదా" క్షమాపణ స్వరంతో అంది. 


"పోనీలే ఇప్పటికైనా వచ్చావు చాలా సంతోషం" అంటూ కోడలు భుజం చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకు వచ్చింది. 


అప్పటికే రఘురామయ్య పొలం కి వెళ్ళిపోయాడు. సావిత్రి ఇడ్లీ చట్నీ చేసి వేడివేడి కాఫీ ఇచ్చింది. నిజంగానే అమృతంలా ఉన్నాయి. తన ఇంట్లో వంట మనుషులు ఉన్న ఎప్పుడూ ఇంత రుచిగా లేవు " అనుకుంది. 


ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు సావిత్రి కి. మైథిలి అంది "ఆంటీ! మీకు ముగ్గులు, పిండి వంటలు అన్ని బాగా వచ్చు కదా! నేను యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తాను. దాంట్లో మీరు వంటలు అన్ని చెయ్యాలి" అంది. 


"ఓహో! ఇందుకా వచ్చింది. టీవీలో తన ప్రోగ్రాం చూసి ఉంటుంది. అప్పుడు తన గురించి తెలిసినట్టు ఉంది" అనుకుని చిన్నగా నవ్వుకుంది. 

మైథిలి మళ్లీ కొనసాగించింది. “మీరు ఒప్పుకోండి నేను మీ ప్రోగ్రామ్స్ అన్ని షూట్ చేస్తాను" ఉత్సాహంగా అంది. 


మధ్యాహ్నం భోజనానికి వచ్చిన రఘురామయ్య కోడల్ని చూసి తెల్ల పోయాడు. విషయం తెలుసుకొని సంతోషించాడు. ఇప్పటికైనా కోడలు మళ్లీ వచ్చినందుకు ఆనందించాడు. 

సాయంత్రం సావిత్రి ఒక్కొక్క పిండి వంట చేస్తూ, దాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పింది. టిప్స్ కూడా చెప్పింది. మైధిలి అంతా షూట్ చేసింది. ఉన్న రెండు రోజుల్లో చాలావరకు చాలా పిండి వంటలు చేసింది సావిత్రి. 


మైధిలి వెళ్ళిపోతూ "మీ అబ్బాయికి చెప్పకండి. నేను ఇక్కడికి వచ్చినట్టు. మళ్లీ 15 రోజులకు వస్తాను" అంటూ వెళ్ళిపోయింది. 


కొత్త ఛానల్ ఓపెన్ చేసింది "పల్లెటూరి వంటలు" అని ఛానల్ కి పేరు పెట్టింది. వీడియోని ఎడిట్ చేసి ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా పదినిమిషాల నిడివితో పూర్తి చేసింది. ఛానల్ లో అప్లోడ్ చేసింది. తన ఫ్రెండ్స్ అందరికీ పంపింది. తన ఫ్రెండ్స్ గ్రూపుల్లో పెట్టింది. విదేశాల్లో ఉన్న తన ఫ్రెండ్స్ అందరికీ పంపింది. మైథిలి “తన అత్తగారే ఇవన్నీ చేశారు” అనడంతో అందరూ కుతూహలంగా చూసి, లైక్ కొట్టారు. అందరూ సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. వీడియోలని బయట వాళ్ళు కూడా చూసి మంచి మంచి కామెంట్స్ పెట్టడం, వాళ్లకి కావలసిన ఐటమ్స్ చేసి, చూపించ మనడంతో మైధిలి వారం వారం రావడం మొదలుపెట్టింది. 


ఇవేమీ మైధిలి తల్లిదండ్రులకు కానీ, వంశీ కి కానీ తెలీదు. సావిత్రి కి కూడా బావుంది. తన వంట అందరూ మెచ్చుకొని, వాళ్లు కూడా చేసి బాగుంది అనడంతో సంతోషంగా ఉండేది. సబ్స్క్రైబర్స్ పెరగడంతో నెమ్మదిగా డబ్బులు కూడా రావడం మొదలుపెట్టాయి. 


వంటలే అంటే బోరు కొడుతుందని పిల్లల పెంపకం గురించి వాళ్ళకి అనారోగ్యాలు వస్తే ఇంట్లో ఉండే దినుసులతో ఆరోగ్య చిట్కాలు మొదలైన వీడియోలు చేయడం మొదలుపెట్టింది. మైధిలి ఫ్రెండ్స్ కొంతమంది "మీ అత్తగారిని అడిగి కూర కారం, ఇడ్లీ పొడి, అల్లం పచ్చడి చేసి పంపిస్తావా" అని అడగడం మొదలుపెట్టారు. 


సావిత్రి సంతోషంగా ఒప్పుకుంది. తన కింద ఇద్దరు పని వాళ్ళని పెట్టుకుని వాళ్ళు అడిగిన టైం కంటే ముందే నీట్ గా ప్యాక్ చేసి పంపేది. మైధిలి అనుకుంది "పల్లెటూరి వాళ్ళ అంటే తనకి ఎంత చిన్న చూపుగా ఉండేది. నిజం చెప్పాలంటే ఆంటీ ని బట్టే తన ఫ్రెండ్స్ మధ్య, కొలీగ్స్ మధ్య తనకి వాల్యూ పెరిగింది. తను చాలా తప్పు చేసింది. అత్తయ్య మామయ్య ఎంత మంచి వాళ్ళు. తనకి డబ్బున్న గర్వంతో వాళ్ళ ఇంటికి వెళ్ళేది కాదు. కానీ ఆ టీవీ ఛానల్ ధర్మమా అని తన కళ్ళు తెరుచుకున్నాయి" అనుకుంది. వచ్చిన డబ్బంతా అత్తగారి ఎకౌంట్లో వేసేది. 


సావిత్రి పనులతో చాలా బిజీ అయిపోయింది. కోడలు తనతో కలిసిపోయినందుకు ఎంతో సంతోషపడింది. తన వంటలు, ముగ్గులు అన్నీ తనకే కాక బయట ప్రపంచానికి తీసుకువెళ్లిన కోడలు అంటే ఎంతో ఇష్టంగా ఉంది. 


వంశి అనుకున్నాడు "ఎందుకు ఈ మధ్యన మైధిలి తరచుగా పుట్టింటికి వెళుతోంది" అనుకుని అత్తగారికి ఫోన్ చేశాడు. మైధిలి ఎలా ఉందని?. 


వాళ్లు తెల్లబోయారు "మైధిలి వచ్చి చాలా నెలలు అయింది. కొత్త దంపతులు సరదాగా ఉన్నారులే" అనుకున్నాము. ఇంతకీ మైధిలి ఎక్కడికి వెళ్ళింది?” అన్నారు కంగారుగా. 


దాంతో విషయం అంతా వివరించాడు వంశీ. అయితే ఎక్కడికి వెళుతోంది? తన ఊరు వెళుతోందా? అవకాసం లేదు. తనకి పల్లెటూర్లు అంటే ఇష్టం ఉండదు. మరి ఎక్కడికి వెళుతున్నట్లు అనుకుని కంగారు పడిపోయాడు. అందరూ కలిసి మైధిలి ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తే "మా ఇంటికి రాలేదు. కానీ తను ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతోంది. దానివల్ల బిజీగా ఉంటోంది. మా ఇంటికి వచ్చి కూడా చాలా నెలలు అయింది" అన్నారు. 


అందరూ ఆశ్చర్యపోయారు వివరాలు తెలుసుకున్నారు. వెంటనే కారు మీద పల్లెటూరు వెళ్లారు. అక్కడ మైధిలిని చూసి ఆశ్చర్యం, ఆనందం వచ్చాయి అందరికీ. ఆ ఊరిలో పుట్టిన పిల్లలా తన వేషధారణ అంతా మారిపోయింది. ఊరగాయల ప్యాకింగ్ లో అత్తగారికి సహాయం చేస్తూ బిజీ బిజీగా ఉంది. గుమ్మం దగ్గర నీడలా కనిపిస్తే వెనక్కి తిరిగి చూసింది. అమ్మ, నాన్న, వంశి. వీళ్ళకి ఎలా తెలిసింది? అనుకుంది. వంశీ విషయం అంతా చెప్పాడు.


"నువ్వు ఇక్కడికి వస్తానంటే మేము ఎంకరేజ్ చేసే వాళ్ళం కదా! రహస్యంగా రావలసిన అవసరం ఏం వచ్చింది?" అన్నాడు నిష్ఠూరంగా. 


"అది కాదు వంశీ! నీకు నామీద ఒక దురభిప్రాయం ఉండిపోయింది. ఆ టీవీ ఛానల్ లో ఆంటీ ని చూడకపోతే అలాగే ఉండేదాన్నేమో! కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంటీ లో ఉన్న మరొక కోణాన్ని చూశాను. మట్టిలో మాణిక్యంలా ఆవిడ అలాగే ఉండిపోయేవారు. 

ఇప్పుడు ఆవిడకు ఉన్న పేరు ఇంత అంతా కాదు. ఎవరికి ఏ డౌట్ వచ్చినా "పల్లెటూరి వంటలు" ఛానల్ కి వెళ్తే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ప్రామాణికాలతో సహా వచ్చేస్తుంది. ఆంటీ ని, పల్లెటూర్లని నేను చాలా అపార్థం చేసుకున్నాను. ఇక్కడికి వస్తుంటే తెలిసింది ఇక్కడి ఆప్యాయతలు, అనుబంధాలు నన్ను కట్టిపడే శాయి. నన్ను క్షమించండి అత్తయ్య!" అంటూ కంటతడి పెట్టుకుంది. 


"పిచ్చి పిల్లా! వంశీ ఎలాగో నువ్వు అలాగే. కోడలివైన, కూతురివైన నువ్వే. పిల్లల పెంపకం వీడియోస్ అన్నీ మళ్ళీ సంవత్సరము నా చానల్ చూసి నేర్చుకోవాలి. అర్థమైందా?" అని నవ్వింది సావిత్రి. ఆ మాటకి మైధిలి సిగ్గు పడింది. అందరూ హాయిగా నవ్వేశారు. 


******శుభం *******


మయూఖ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :

63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం:

  పరిచయ వాక్యాలు:

నా పేరు శారద

విద్యార్హతలు: ఎమ్.ఎ

నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.

నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.

తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.

నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.

ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి

మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.

Comments


bottom of page