నీ కోసం.. నీ కోసం
- T. V. L. Gayathri
- Jul 14
- 1 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #నీకోసంనీకోసం, #మంచిమర్యాద

గాయత్రి గారి కవితలు పార్ట్ 34
Nee Kosam Nee Kosam - Gayathri Gari Kavithalu Part 34 - New Telugu Poems Written By
T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 14/07/2025
నీ కోసం నీ కోసం - గాయత్రి గారి కవితలు పార్ట్ 34 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
నీ కోసం.. నీ కోసం.
(కవిత)
**********************************
ఒక్కసారి వచ్చిపోర!
ఊపిరింత ఇచ్చిపోర!
చుక్కలన్ని నీ కోసం
చూచిచూచి అలిగాయి.
గోవులెల్ల నీ కోసం
గోడుగోడుమన్నాయి
జీవమేదో పోయినట్లు
చింతలోన మునిగాయి
క్షీరధారలేవి లేవు!
చిన్నలేగ లేడ్చాయి
నీరసంగ నీకోసం
నిక్కినిక్కి చూశాయి
పాపమా గొల్లవాళ్ళు
పలవరించుతున్నారు
దాపులున్న అడవిలోన
దారి తప్పిపోయారు
తల్లులనే మరిచావా?
తలుచుకోవ ఒక్క క్షణం!
కల్లలాడు వాడవెలే! నీ
కబురులన్ని బహుమోసం!
నీడలేక మిగిలామని
నేస్తులెల్ల బెంగతో
వాడవాడతిరుగుతూ నీ
జాడ వెదకబోయారు.
రమణులతో విలాసంగ
రాసలీలలాడు వాడ
రాచబిడ్డవయ్యావట!
రావేలర మా కోసం!
దాచివున్న వెన్ననంత
దోచువాడ! దయలేదా?
వేచి వేచి నీకోసం
వెఱ్ఱివాళ్ళమయ్యాము.
వెన్నెలంత చీకటితో
వెక్కిరిస్తు వెళుతుంటే
దీనంగా నీకోసం
ద్రిమ్మరుతూ పిలిచాము
మధురలోన నీకేదో
మందుపెట్టి ఉంటారు.
మత్తులోన మునిగి నీవు
మమ్ములనే మరిచావు!
తలుపులన్ని తెరిచిపెట్టి
నీ రాకకెదురు చూస్తూ
తలవాకిట నిలుచుండి
దారివంక చూచెదము
గాలి సవ్వడికే నీ వేణు
గానమంటు తలిచి నీ
కథలు తలుచుకుంటు
కాలాన్ని గడిపెదము.
పిలుపువినుము మాధవా!
ప్రేమించు వారమయ్య!
గురుతులేద? నీ చిన్న
గొల్లపల్లెవారమయ్య!//
************************************

మంచి- మర్యాద.
(ఇష్టపది)
************************************
ధనముపై నాశతో దారితప్పిన మనిషి
ఘనుడంచు దుష్టమౌ కార్యములు చేస్తాడు.
మనిషియే మృగముగా మానవత్వము వీడి
క్షణముకొక వేషమును చక్కగా వేస్తాడు.
నమ్మకము లేదకట!నయవంచనత్వమును
నిమ్మళముగా నేర్చి నీచుడై పోయాడు.
ప్రేమగా నటియించి పీకలను తెగకోసి
కాముకత్వముతోడ ఖలుడుచరియిస్తాడు.
తనువు శాశ్వతమౌన? ధనము శాశ్వతమౌన?
వెనువెంట వచ్చునా? వీధికొనదాకైన?
మంచి మర్యాదతో మసలుకొనుటే చాలు!
కొంచెమైనా సత్వ గుణముండుటే మేలు!
పరులకుపకారంబు పరమ ప్రీతిగ జేసి
నిరతంబు విబుధుడై నిష్ఠతో మెలగాలి.
ధర్మవర్తనముతో దయఁగూడిమానవుడు
కర్మలను సలుపుతూ కరుణతో బ్రతకాలి.//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comentários