నీ రూపేదీ? నీ పేరేదీ?
- Neeraja Prabhala

- Apr 18
- 1 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #NeeRupediNeePeredi, #నీరూపేదీనీపేరేదీ

Nee Rupedi Nee Peredi - New Telugu Poem Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 18/04/2025
నీ రూపేదీ? నీ పేరేదీ? - తెలుగు కవిత
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
నీ రూపేదీ ? నీ పేరేదీ ? నీ నెలవేదీ?
ఏమని తలచుదును? ఏ రీతిన పూజింతును?
ఆది అంతము లేని సద్యోజాతకుడివైన నీ ఉనికేది?
నిరాకార నిరంజనుడైన నీ ఆవాసమేది?
వేదానికీ- నాదానికీ తేడా తెలియని అజ్ఞానిని.
ఏది మంత్రమో- ఏది తంత్రమో గ్రహించలేని అంధురాలిని.
భక్తికీ- పూజకు తేడా తెలియని అవివేకిని .
స్వార్థాతిశయములు-అహంకారములే మిన్న అన్న భ్రమలో మునిగిపోతిని.
యౌవన, సిరిసంపదలే శాశ్వతమని అహంభావముతో మిడిసి పడితిని.
అజ్ఞానాంధకారములతో నాకనుపాపలు మసకేసినవి.
ముదివయసులో తనువు వడలి, మనసు నిబ్బరము సడలి ఏకాకినై , ప్రాణభయము ఆవరించ గతమంతా తలచి బాధతో వగచితిని.
ఇప్పుడింక ఏమి ప్రయోజనము? జీవితమంతా నిను ధ్యానించక వ్యర్థమాయె.
ఆశలు- కోరికలు బలీయము.
బ్రతకాలన్న ఆశ చావక జీవితకాలము పొడిగింపమని కోరితిని.
కాలము - మృత్యువు ఎవరికోసము, దేనికోసము ఆగదు కదా!
మరణకాలము దాపురిస్తేగానీ నీవు గుర్తురాని పాపిని.
తనువు వడలి అచేతనావస్థలో అంత్యకాలమున జ్ఞానోదయమై నీకై ధ్యానించితిని.
ఇంద్రియాలు సడలి కనులు పూర్తిగా తెరవలేక, నిను ప్రార్థింప చేతులు దరిచేరక, నిను ధ్యానింప పెదవులు విడివడక , నాలుక తడబడి నోటమాట రాక అశక్తుడనైతిని.
స్మశాన సంచారకుడైన నిను అచ్చోటనన్నా దర్శిద్దామంటే నా ఆత్మ నీలో ఐక్యమాయె.
ఐక్యమైన తక్షణమే నీ రూపు అగుపించె.
జ్యోతి స్వరూపుడివిగా నీవు కనిపించి నీలో నను లయం చేసుకున్న లయ కర్తవు.
జీవాత్మ- పరమాత్మలో లీనమాయె.
నీకు-నాకు భేదము లేదని, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకొంటిని.
ఈశ్వరా ! జగదీశ్వరా ! బ్రృహదీశ్వరా !
ఎంత కారుణ్యమూర్తివయ్యా !
సృష్టి కర్తవు నీవే కదా ! ఈ మాయా విశ్వమంతా నీదేనయ్యా!
సమస్త జీవథాత్రి నీ బిడ్డ లేనయ్యా!
అంజలిదే గొనుమా! కుసుమాంజలిదే గొనుమా!
భక్త్యాంజలిదే గొనుమా ! ఆత్మాంజలిదే గొనుమా !
🙏🙏🙏

-నీరజ హరి ప్రభల




Comments