నీది నీది కాదు
- Dr: Kiran Jammalamadaka

- 7 hours ago
- 7 min read

స్త్రీ జీవితం నిజంగా తనదేనా? లేక సమాజం నియంత్రించే ఒక ప్రయాణమా? యుగాలుగా మారని ఈ ప్రశ్నను “నీది నీది కాదు” అనే కథ గుండెల్లో తాకేలా ప్రతిబింబిస్తుంది.
Needi Needi Kadu - Telugu Story on Social Problems | Dr. Kiran Jammalamadaka
నీది నీది కాదు - తెలుగు సామాజిక కథ | డా: కిరణ్ జమ్మలమడక
Published In manatelugukathalu.com On 06/04/2026
దేజావు నేపథ్యంతో కథనం, భిన్న యుగాల్లో ఒకే సమస్య, స్త్రీ స్వాతంత్ర్యం పై ప్రశ్న సమాజపు ద్వంద్వ వైఖరి, మహిళా ప్రేరణ కథలు, ఆధునిక కథలు |
కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు, "ఇది ఎప్పుడో జరిగినట్టు ఉందే" అని అనిపిస్తూ ఉంటుంది. దానినే 'దేజావు' అని అంటారు. అలాంటి 'దేజావు' సందర్భమే ఇప్పుడు సార్వాణికి వచ్చింది. వేగంగా వెళ్లే కారు, కారుమబ్బులు, వాన, వెనకాతల తరుముతున్న జనం, ఇదే ఆవేదన, ఇదే భయం. ఎక్కడో తను ఇదివరకే అనుభవించిందన్న అనుమానం తనను మరింత ఆందోళనకు గురి చేసింది.
ఈ పరిస్థితికి కారణం సార్వాణి సమాజానికి సుపరిచితమైన తన భర్త నుండి విడిపోవాలని, వేరే పెళ్లి చేసుకోవాలని అనుకోవడం. అంతే! ప్రపంచంలో ఇంక ఎవరికీ ఏ పని లేనట్టు సోషల్ మీడియా అంతా అతలాకుతలం అయిపోయింది. ప్రతి ఒక్కరూ ఆమెను ప్రశ్నించేవారే, "నువ్వు ఎలా అలా వేరే ఎవరినో చేసుకుంటావ్?"... "మరి తను చేసుకుంటున్నాడుగా?" అన్న ప్రశ్నకు మాత్రం సమాధానమివ్వాల్సిన అవసరం లేదనుకున్నారు ఆరాధకులు, అడిగిన ప్రశ్నలే గుచ్చి గుచ్చి అడిగే పాత్రికేయులు.
ఆ ఆలోచనలతో నడుపుతున్న సార్వాణి కారు అదుపు తప్పింది, కారు బ్రేకులు కీచు మంటూ అరుస్తున్నాయి. అలా రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్లి ఒక పెద్ద మర్రి చెట్టును గుద్దుకుంది. తను ఇంకా స్పృహలోనే ఉంది, తన కళ్ళపై కెమెరాల కాంతి, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానకు పోటీ ఇస్తోంది. మరి కాసేపటిలో తన జీవితం అంతం అవబోతోంది అని తెలుస్తూనే ఉంది. ఇంతలో కారుమబ్బులు ఆమెను కమ్మేశాయి, తనను ఎవరో లాక్కుపోతున్నట్టుగా అనిపించింది.
***
"మీ గౌరవం శాశ్వతం అవ్వాలంటే 'జోహార్' ఒక్కటే మార్గం. శత్రువు మీపై కన్నేయకముందే మీరు అగ్నిదేవునిలో లీనం అవ్వాలి!" అన్న కేకకు సార్వాణికి మెలుకువ వచ్చింది. చుట్టూ చూసింది.
అది ఒక అంతఃపురం. అక్కడ ఉన్న మంటల కాంతి భయానకంగా కనిపిస్తోంది. అక్కడ ఆత్మాహుతి సిద్ధమవుతున్న మహారాణిని, సేనానాయకులు, పూజారులు ఉత్సాహపరుస్తూ నినాదాలు చేస్తున్నారు. వెనకాతల రాణులు తెల్లని వస్త్రాలలో, చేతులలో దీపాలతో తాము కూడా ఆత్మాహుతికి సిద్ధంగా నిలబడి ఉన్నారు.
"మీ ఆత్మసమర్పణ, నీకు పుణ్యాన్ని, మన రాజ్యానికి, ప్రజలకు మేలు చేస్తుంది. మీ త్యాగం గురించి తరతరాలు చెప్పుకుంటారు."
"చనిపోయాక వచ్చే గౌరవం, కీర్తి కోసం ఇప్పుడే చనిపొమ్మంటున్నారా?" ఇదెక్కడి న్యాయం? నిలదీసింది సార్వాణి.
ఆమె ఎవరో? ఎక్కడి నుండి వచ్చిందో? ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతోందో అర్థం కావటం లేదు అక్కడ ఉన్న ప్రజలకు.
"నువ్వెవరమ్మా? వీరత్వం అంటే నీకు తెలియదా?" అన్నాడు సేనాధిపతి ఆవేశంగా.
"వీరత్వం పోరాడే శక్తిలో ఉండాలి, మృతదేహంలో కాదు. జీవించాలా వద్దా అన్నది ఆమె హక్కు. ఆ నిర్ణయాన్ని మీరు బలవంతం చేస్తే, అది పుణ్యం కాదు... పాపం. ఆత్మహత్య కూడా పాపమే కదా, దానిని మహోన్నతంగా చిత్రించి ఆమెను మభ్య పెట్టడం మహా పాపం!" సమాధానమిచ్చింది సార్వాణి.
ఒక్కసారిగా, అక్కడి సైనికులు ఆమె మీదకు రాబోయారు. వారిని వారించాడు అక్కడే ఉన్న ఒక పెద్దమనిషి. "చూడమ్మా, ఇప్పుడు వీరు చనిపోకపోతే, శత్రువుల చేతిలో వీరు చిత్రహింసలకు గురవుతారు. దాని కంటే వీరు ఇప్పుడే చనిపోతే వారికీ మేలు, వారి భర్తలకు గౌరవం." అన్నాడు.
"అలా అయితే ఆ శత్రువులు మిమ్మల్ని కూడా చిత్రహింసలు పెట్టొచ్చు కదా?"
"మగాళ్లు కదా" అన్నాడు సందేహపడుతూనే ఆ పెద్దమనిషి.
"అంటే మీ దృష్టిలో లైంగిక హింసలే హింసలా? అదీ ఆడవారికి చేసేవి మాత్రమేనా? మగాళ్లను బానిసలుగా చేస్తారు కదా, అలాంటప్పుడు మీరు కూడా ఆత్మత్యాగం చెయ్యాలి కదా!" అన్న సార్వాణి తర్కానికి అక్కడ త్యాగానికి సిద్ధంగా ఉన్న రాణి సార్వాణి వైపు చూసింది.
అదే ముఖం. తను ఎక్కడో చూసింది. తనకి బాగా పరిచయమున్న ముఖం. తనకు బాగా తెలిసిన ముఖం ఎక్కడ అని ఆలోచిస్తోంది సార్వాణి.
ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక మౌనంగా ఉండిపోయాడు ఆ పెద్దమనిషి. అప్పుడు అక్కడే ఉన్న ఒక సైన్యాధికారి:
"ఎందుకంటే నీ జీవితం నీది కాదు కాబట్టి..." అని అంటూ తన మనుషులతో సార్వాణిపైకి రావటంతో, సార్వాణి వెంటనే పరుగు పెట్టడం మొదలుపెట్టింది. వెనకాతల సైనికులు పరుగెత్తుతున్నారు. చివరిసారిగా ఆ మహారాణి వైపు చూసింది. అది ఎవరో కాదు, తనే! అది తన ముఖమే... తను పరుగు ఆపలేదు. అదే వణుకు, అదే భయం, తాను ఇది వరకు అనుభవించినదే! మళ్ళీ, మళ్ళీ తనను వెంటాడుతోంది... వర్షం, కారుమబ్బులు. శక్తినంతా కూడదీసుకుని పరిగెడుతోంది. కొండలు, గుట్టలు దాటింది. అయినా వెనకాతల జనం ఆగటం లేదు. ఇంతలో తలకి ఏదో తగిలింది. చూస్తే అదే మర్రిచెట్టు. మళ్ళీ తను అక్కడే పడిపోయింది. చుట్టూ జనం బతికే ఉందో లేదో చూస్తున్నారు. తనని వెంటాడే వాక్యం మాత్రం అదే: "నీది నీది కాదు".
***
'యువర్ హైనెస్! ఆర్ యూ ఆల్రైట్?' ఎవరో తట్టి లేపుతున్నారు. అతి కష్టం మీద సార్వాణి కళ్ళు తెరిచింది. కానీ అది తను ఉన్నాను అనుకున్న ప్రదేశం కాదు, మరో కొత్త ప్రదేశం. చూస్తే పారిస్ లాగా ఉంది. చుట్టూ కెమెరాలతో, మైకులతో చుట్టుముట్టారు. తనను ఎందుకు 'హైనెస్' అని అంటున్నారో తెలియదు. తన తలకి బలమైన గాయం తగిలింది. చుట్టూ చూసింది. అక్కడ మర్రిచెట్టు ఉండాలి కదా... కానీ ఒక సిమెంట్ పిల్లర్ ఉంది. కారు నుజ్జునుజ్జు అయ్యింది... కానీ అది తన కారు కాదు. తను మాట్లాడే స్థితిలో లేదు. అయినా ప్రశ్నల వర్షం ఆగటం లేదు. "మీరు ఒక రాజవంశపు కోడలై ఉండి, అదంతా వదిలి ఇతడిని పెళ్లాడదామని అనుకుంటున్నారా?... మీ రాజవంశం అందుకు అనుమతిస్తుందా?... మీరు ఈ సమాజానికి ఏమి సంజాయిషీ ఇస్తారు?..." అని ఇంగ్లీష్‌లో అడుగుతున్నారు...
శరాఘాతాల్లాంటి ప్రశ్నలు తనను గుండెల్లో గుచ్చుతున్నాయి. ఇప్పుడు తనుకు మాట్లాడే స్థితి లేదు. తన తల పక్కకు ఒరిగిపోతోంది. ఆ కారు పగిలిన అద్దాల్లో నుండి తనను తాను చూసుకుంది. తానే కానీ, తనకు బంగారపు రంగు జుట్టు ఉంది. తన చర్మం రంగు కూడా వేరేలాగా ఉంది. అది తనేనా? అని అనుమాన పడుతోంది. ఇంతలో మరికొంతమంది తన మీదకు రాబోయారు మరిన్ని ప్రశ్నలు అడగటానికి. మళ్ళీ అదే వాక్యం, 'నాది నాది కాదా?' తనకి ఇదివరకు అనుభవించిన వణుకు. ఇది ఎక్కడో జరిగినట్టుగా అనిపిస్తోంది... ఎక్కడో? గుర్తుకు రావటం లేదు. ఇంతలో ఒక కారుమబ్బు తనను కమ్మేసి తనలోకి లాక్కుపోయింది.
***
సార్వాణి ఎదురుగా ఉన్న ఒక మరమనిషితో మాట్లాడుతోంది. కాదు, వాదిస్తోంది. అది భవిష్యత్తులో ఒక రోజు అని ఆమెకు అర్థమైంది. తనకు సిస్టమ్ చే మ్యాచ్ చేసిన వ్యక్తి వద్దు అని, అసలు తనకు తోడే వద్దని, కానీ ఆ మరమనిషి అందుకు అంగీకరించడం లేదు. "స్త్రీగా సంతానోత్పత్తి తన జీవిత పరమావధి. అది చేసి తీరాలి. లేనిపక్షంలో తనను శిక్షించే హక్కు తనకు ఉంది" అని ఆ మరమనిషి బదులిస్తోంది. "నా జీవితం నా ఇష్టం" అని గట్టిగా అరిచి, ఆ మరమనిషిని ఒక్క తోపు తోసేసి, పరిగెత్తడం మొదలుపెట్టింది. పరిగెడుతోంది...
పరిగెడుతోంది... తనను ఆ మర మనుషులు వెంబడిస్తున్నాయి. పదుల సంఖ్యలో తాము చెప్పినట్టుగా నడుచుకోవాలని వెంటాడుతున్నాయి. సార్వాణి పరుగు వేగం పెంచింది. ఆ మరమనుషులు కూడా వేగం పెంచాయి. ఇంతలో అదే వణుకు, అదే భయం! ఇది ఎక్కడో జరిగింది అనుకునే లోపు తన తల ఒక మర్రి చెట్టుకు ఢీకొంది. తల నుండి రక్తం... మర మనుషులు చుట్టుముట్టాయి. "ఇది ఎక్కడో జరిగింది" అని అనిపిస్తోంది. 'నీది నీది కాదు' అనే వాక్యం తనను ఇక్కడా వెంటాడుతోంది. మళ్ళీ కారుమబ్బు తనను కమ్మేసి తనలో ఇంకించుకుంది.
***
"అమరుడైన నీ భర్తతో నువ్వు కలిసి పోవాలి. అదే నీ కర్తవ్యం, ధర్మం... స్త్రీగా అది నీకు మోక్షం, పుణ్యం!" అన్న మాటలకు సార్వాణికి మెలుకువ వచ్చింది. గంధపు చెక్కల వాసన, పసుపు కుంకుమలతో కలిసి ఒక రకమైన వింత వాసన వస్తోంది అక్కడ. ఆ వాసన తనకు పరిచయం లేదు. చుట్టూ పరికించి చూసింది. అక్కడ ఒక పెద్ద అగ్నిగుండం. దాని ఎదురుగా ఎర్రని వస్త్రాలతో ఒక నడివయస్కురాలైన స్త్రీ, ఆ అగ్నిగుండం వైపు తిరిగి దూకడానికి సిద్ధంగా పూజారి ఆజ్ఞ కోసం వేచి ఉంది. అక్కడ ఉన్న ప్రజలు:
“సతీ మాతకు జై!” అని గట్టిగా జేజేలు కొడుతున్నారు.
సార్వాణి గుండె వణికింది. ఇది... సతీ వేడుకా? ఇప్పుడు ఆమె ఆ అగ్నిగుండంలోకి దూకేస్తుందా? ఆమెను ఆపాలి అని ఒక్క ఉదుటున సార్వాణి ఆమెను చెయ్యి పట్టుకొని ఆపింది. ఆ ప్రాంతం అంతా ఒక్క క్షణం నిశ్శబ్దం. ఆ ఊహించని సంఘటనకు ఆ స్త్రీ సార్వాణి వైపు చూసింది. ముఖం ప్రశాంతంగా ఉంది. కళ్ళలో దాచలేని భయం, ఉబికి వస్తున్న కన్నీటిని అదుపు చేసుకుంటోంది. కానీ ఆ ముఖాన్ని తను ఎప్పుడో చూసింది, గుర్తుకు రావటం లేదు.
“అమ్మా! ఇది నీ జీవితం. నీకు జీవించే హక్కు ఉంది. ఎందుకు ఇలా?” అని అరిచింది సార్వాణి.
ఆమె నైరాశ్యంతో కూడిన ఒక చిరునవ్వుతో:
"భర్తను మించిన ఆత్మీయత నాకేముంటుంది? నేను బతికి ఏమి సాధించాలి? ఎవరిని ఉద్ధరించాలి?"
"నువ్వు నీ భర్తను ప్రేమించవచ్చు. కానీ నీ ప్రాణం కంటేనా? అదీ తను చనిపోయాక? నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికైనా నువ్వు బతికి ఉండాలి కదా? ప్రాణం అంటే తీపి ఎవరికి ఉండదు?" అని నచ్చజెప్పబోయింది సార్వాణి.
"నాకు బతకాలని ఉన్నా... నన్ను ఎవరూ గౌరవించరు. దుర్మార్గురాలిని అంటారు. నా బతుకు నాది కాదని ఈ సమాజం చెబుతోంది."
"అదెలా సాధ్యం? "నీది నీది కాదు!" అని ఎవరో అరిచారు.
"ఈ సమాజాన్ని లెక్క చెయ్యకు!"... అని ఇంకా ఏదో చెప్పే లోపు తనను ఎవరో తోసేశారు.
మంది అంతా తన మీదకు దూకుతున్నారు, తన ప్రాణం రక్షించుకోవాలని. సార్వాణి పరిగెత్తడం మొదలు పెట్టింది. చివరిసారిగా ఆ స్త్రీ వైపు చూసింది... ఆ ముఖం తను ఎక్కడ చూసిందో తెలిసింది. అది తన ముఖమే... పరుగు పెడుతోంది. అలుపు వస్తోంది. కానీ వెనకాతల జనం ఆగటం లేదు. శక్తినంతా కూడదీసుకుని పరిగెత్తుతోంది. ఇంతలో వర్షం... పైగా చీకటి... మళ్ళీ అదే భావన, "ఇది ఎప్పుడో జరిగింది". ఆ భయం, ఆ వణుకు అన్నీ తనకు ఇది వరకు అనుభవించినట్టుగా అనిపిస్తోంది. ఇంతలో తన తలకి ఏదో బలంగా తాకింది. అది ఒక మర్రి చెట్టు. తన తలకి రక్తం. కళ్ళు మూతబడుతున్నాయి. ఆ జనం సార్వాణి మీద విచక్షణా రహితంగా దాడి చేస్తున్నారు. తను చనిపోతానని అనిపిస్తోంది సార్వాణికి. తనను వెంటాడుతున్న ఒకే ఒక్క వాక్యం: 'నీది... నీది... కాదు...' ఇంతలో కారుమబ్బు మళ్ళీ కమ్మేసింది. తన ప్రమేయం లేకుండానే తను ఎక్కడికో లాగబడుతోంది.
***
సార్వాణి కళ్ళు తెరిచింది. ఎదురుగా రాష్ట్రపతి చేతిలో 'కీర్తి చక్ర' పురస్కారంతో నిలబడి ఉంది. రాష్ట్రపతి తనను ఓదార్పుతో చూస్తోంది. తన భర్త గురించి, తన భర్త సైన్యంలో ఎంత వీరోచితంగా పోరాడి నేలకొరిగాడో... మైక్‌లో వినపడుతోంది. సార్వాణి అక్కడికి ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు. రాష్ట్రపతి ఆ వీర సైనికుడికి అందించాల్సిన పతాకాన్ని, ప్రశంసాపత్రాన్ని తన చేతికి అందించారు. మౌనంగా అది తీసుకొని ఆమె ఆ ప్రాంగణం బయటకు వచ్చింది.
"మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా?" అక్కడ ఉన్న పాత్రికేయుడు అడిగిన మొదటి ప్రశ్న.
ఆమె సమాధానమివ్వలేదు.
"మీకు వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులో మీ అత్తామామలకు వాటా ఇస్తారా? మొత్తం మీరే ఉంచుకుంటారా?" ప్రశ్న మీద ప్రశ్న. ఆమె సమాధానమివ్వకుండానే తన కారు ఎక్కబోయింది.
"ఇంతలో మీరు పెళ్లి చేసుకుంటే మీ భర్తకు అగౌరవం అని సోషల్ మీడియా అంతా అభిప్రాయపడుతోంది. దానికి మీ సమాధానం?"
ఆమె ఏమీ మాట్లాడలేదు. కారులో ఆ జనాన్ని తప్పించుకుంటూ ముందుకు సాగుతోంది.
"మీరు కనీసం... ఆ వార్తని ఖండించటం లేదు. అంటే మీకు మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందని మేము అనుకోవచ్చా? మీరు మన దేశానికి సమాధానం ఇవ్వాల్సిందే!" అని అరుస్తూ తన కారు వెంట పడ్డారు కొంతమంది. వారిని తప్పించుకుంటూ కారు వేగంగా పోనిస్తోంది. వారు వెంబడిస్తూనే ఉన్నారు. తనకి మళ్ళీ అదే వణుకు, అదే భయం, ఎక్కడో అనుభవించిన అదే భావన. ఇంతకు ముందెప్పుడో జరిగింది. కారు మళ్ళీ అదుపు తప్పింది. వాన, చీకటి. మర్రిచెట్టు. తలకి గాయమై రక్తం ప్రవహిస్తోంది. తనను మళ్ళీ అదే వాక్యం వెంటాడుతోంది: 'నీది నీది కాదు'. మెల్లిగా తన కనులు మూతబడ్డాయి.
***
ఎవరో ముఖం మీద నీళ్లు జల్లి స్పృహలోకి తీసుకువచ్చారు. పక్కనే అంబులెన్స్ ఉంది. దానిలోకి తనను ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. స్పృహలోకి రావటం గమనించిన అక్కడి పాత్రికేయులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కానీ ఆ ప్రశ్నలు ఎవరు ఎవరిని అడుగుతున్నారో అర్థం కావటం లేదు సార్వాణికి. తను సతీ సహగమనం చేయబోయిన స్త్రీనా? రోబోలచే అణగదొక్కబడిన స్త్రీనా? జోహార్ చేయబోయిన స్త్రీనా? ఒక సైన్యాధికారికి భార్యగా ఉన్న స్త్రీనా? ఒక సెలబ్రిటీ భార్యగా ఉన్న స్త్రీనా? ఎవరు నేను?... ఈ ప్రశ్నలు ఎవరికి సంధిస్తున్నారు? ఎవరు ఎవరిని అడిగినా, ప్రశ్న అడిగింది 'స్త్రీ'నే... చెప్పింది స్త్రీకే, 'నీది నీది కాదు' అని.
"నాది నాది కాకపోతే ఎవరిది?" గట్టిగా అరిచింది. ఆ అరుపు ప్రతిధ్వని అందరికీ రకరకాలుగా వినిపించింది.
"నా బతుకు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నా ప్రాణం నా ఇష్టం, నా మనసు నా ఇష్టం, నా కలలు నా ఇష్టం, నా అడుగులు నా ఇష్టం, నా గమ్యం నా ఇష్టం, నా ఆనందం నా ఇష్టం, నా కన్నీళ్లు నా ఇష్టం,
నా మౌనం నా ఇష్టం."
'సార్వాణి' ఒక పేరు కాదు. ప్రతి స్త్రీ గుండె చప్పుడు ప్రతిధ్వనికి ప్రతినిధి.
***
కాలాలు మారినా, యుగాలు మారినా, తరాలు మారినా, దేశాలు మారినా, రాష్ట్రాలు మారినా, మారనిది ఒక్కటే: 'నీది నీది కాదు'. మరి ఎవరిది? సమాజానిదేనా? అంతరించి పోయానుకున్న సామాజిక రుగ్మతలు 'దేజావు' లాగా మన వెంటే వేరే వేరే రూపాల్లో వస్తూనే ఉన్నాయి. అవశేషాల శేషాల్లా, శతాబ్దాల నిశ్శబ్దానికి రుజువులుగా.
***
***
కిరణ్ జమ్మలమడక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: Dr: కిరణ్ జమ్మలమడక
డా. కిరణ్ జమ్మలమడక , కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్ పట్టా పొందారు.ప్రస్తుతం GE హైదరాబాద్ లో సీనియర్ సాఫ్ట్వేర్ మేనేజర్ గా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. "స్ప్రింగ్" అనే సంస్థ ను స్థాపించి, తద్వారా విద్యార్థులకు మోటివేషనల్, లైఫ్ కోచింగ్ తరగతులను నిర్వహిస్తూవుంటారు. పిల్లలు , పెద్దలు ప్రపంచం పట్ల సానుకూల దృక్పథం తో ముందుకు సాగాలనే ఉద్దేశం తో కథలు రాయటం కూడా మొదలుపెట్టారు. "చినుకు","ఆంధ్రభూమి", "తెలుగు వెలుగు ", "తానా","ఖమ్మం ఈస్థటిక్స్" మొదలైన ప్రముఖ పత్రికలు, సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో ఈయన కథలు బహుమతి సాధించాయి. ఆ కథల్లో మిరప మొక్క , మోహపు మరకలు,ఆమె అతడిని జయించెను, యాత్ర (పిల్లల బొమ్మల పుస్తకం ) మరియు అతీతం, అస్తిత్వం అనే సైన్స్ ఫిక్షన్ (నవలలు) ప్రేక్షకాదరణ పొందాయి. మరికొన్ని కథలు అంతర్జాలం మాధ్యమం లో కూడా ప్రచురితమయ్యాయి.




Comments