top of page

నెమలిపింఛం రంగుచీర


'Nemalipincham Rangucheera' New Telugu Story

Written By Pudipeddi Ugadi Vasantha

'నెమలిపింఛం రంగుచీర' తెలుగు కథ

రచన : పూడిపెద్ది ఉగాది వసంత



"పెళ్లి ఎలా జరిగింది ? మన వాళ్లంతా వచ్చారా ? సుబ్బులత్త, అమ్మలుపిన్ని, మా నానాజీ గాడు వచ్చారా ? అంతా ఎలా వున్నారు? నన్ను అడిగారా?" జడివానని గుర్తు చేసాయి సుబ్బారావు ప్రశ్నలు.


పెళ్లిళ్ల సీజన్, ఆపై అట్నుంచి ఏ సి బస్సు లో సీట్ దొరక్క, నాన్ ఏ సి బస్సు లో రావడం వలన మంజులకి తారకం ఎత్తిపోతోంది. దానికి తోడు వైశాఖమాసపు ఎండలు వడియాల్లా వేయించేస్తున్నాయి. బస్సులో రష్ చూసి, అమ్మలత్త ప్రేమతో చేసిచ్చిన మినప రొట్టి, ఉల్లి పచ్చడి తినడానికి అవ్వదేమో అని, ఆ అరిటాకు పొట్లం అలానే బాగ్ లో ఉంచేసి, ఓ రెండు అరటిపళ్ళు కొనుక్కుని నోట్లో వేసుకుని, ఓ మజ్జిగ ప్యాకెట్ తాగి డిన్నర్ అయిందనిపించేసింది. వేయి సుత్తులతో తలమీద బాదుతున్నంత తలనొప్పి. గుమ్మలోంచే ప్రశ్నల వాన కురిపిస్తుంటే, తిక్క రేగిపోయింది మంజులకి.


"అసలు నేను నేరకపోయి వెళ్ళాననిపించింది సుమండీ, ప్రతి ఒక్కరూ రావడం, మీ గురించి వాకబు చేయడం, వారికి నేను సమాధానాలు చెప్పడం తోనే సరిపోయిందంటే నమ్మండి. "


"మా చంటి ని తీసుకురాలేదా? ఎంత ప్రేమో పిచ్చి సన్నాసికి నేనంటే"అని మీ సుబ్బులు అత్త ఎంత ఇదయిపోయారో? ఇలా ఒకరేమిటి అందరు అదే మాట. వాళ్ళ చంటి ఏమైనా పాలు తాగే పసివాడా? అందరికి మీరెందుకు రాలేదో సర్ది చెప్పడంతోనే, నా నోరెండిపోయిందంటే నమ్మండి. అసలు నేనుండి పోయి, మీరెళ్ళుంటే భేషుగ్గా ఉండేది" ప్రతి అక్షరం మీద గట్టిగా ఒత్తులు పెడుతూ, తన అక్కసుని, చిరాకుని తీర్చుకుంది మంజుల.


అందరు తనగురించి అడిగారని తెలియగానే, ఎంతో ఆనందించిన సుబ్బారావు, మరి మారు మాటాడకుండా, "అయ్యో గుమ్మంలో నిలబెట్టే మాట్లాడేస్తున్నాను, ముందు వెళ్లి ఓ కప్ కాఫీ తాగి కాస్త సేద దీరవే. తర్వాత మాట్లాడుకుందాములే. ” అని మంద్ర స్థాయిలో చెప్పేడు. దాంతో కాస్త చల్లబడింది మంజుల.


తాను ఊరెళుతున్నప్పుడు, సుబ్బారావు కి తోడుగా ఉంటుందని, దూరపు బంధువు అయిన సుభద్రని తమ ఇంట్లో ఉంచింది.


మంజుల చేతిలో బ్యాగులు అందుకుని, చల్లని నీళ్లిచ్చి, ఆపైన మంచి ఫిల్టర్ కాఫీ అందించింది సుభద్ర. అది చూసాక అనుకుంది, సుభద్రని మరో నాలుగు రోజులు తన దగ్గరే ఉంచుకోవాలని, తాను పూర్తిగా సేద తీరిక పంపొచ్చులే అని.

*****

మధ్యాహ్నం భోయినాలయ్యాక, కులాసాగా, ఏ సి రూమ్ లో మంచంపై వాలి, ఓ కునుకు తీసి లేచిన మంజులతో మాటలు కలిపాడు సుబ్బారావు, పెళ్ళిలో విషయాలు తెలుసుకోవాలని. సుబ్బారావు తరఫువారి అమ్మాయి పెళ్లి, సుబ్బారావు కి మోకాలు మార్పిడి ఆపరేషన్ అయి రెస్ట్ లో ఉండడం తో తాను ఉండిపోయి, మంజులని వెళ్ళమన్నాడు.

నెమ్మదిగా విషయాలని పూస గుచ్చింది మంజుల.


"కొత్త జంట చూడ ముచ్చటగా ఉన్నారు. పెళ్లి కూడా ఘనంగా, సాంప్రదాయ బద్ధంగా జరిపించారు. వచ్చిన వారందరికీ బట్టలు పెట్టారు. "అని లేచి వెళ్లి సూట్ కేసు లోంచి, పెళ్ళివారు పెట్టిన నెమలి పింఛం రంగు చీర తెచ్చి చూపించింది.



"నాకు నెమలి పింఛం రంగు ఇష్టమని, అందరూ అదే రంగు చీరలు కొనడంతో, నా బీరువా తెరిస్తే, అన్ని అవే రంగు చీరలు దర్శనమిస్తాయి. అక్కడ అమ్మలత్త కూడా "ఇదిగోనే నీకు ఈ రంగంటే చాల ఇష్టం కదా, గుర్తు పెట్టుకుని మరి ఎంచానే మంజు.. " అని గొప్ప ఘనకార్యం చేసినట్టు మొహం పెట్టింది.

భార్య బాధ చూళ్లేక, "సరెలేవే, నీకు నచ్చకపోతే, “పెట్టుబడి చీరల” ఖాతాలో వేసేసి, దీన్ని పక్కన పెట్టు. మనం ఎవరికైనా చీర పెట్టాల్సిన ఫంక్షన్ వస్తే, ఇది బొట్టు పెట్టి ఇచ్చేద్దువుగానిలే. కానీ మా తరఫువారు ఎవరికీ ఇవ్వకు సుమా! కొంపలంటుకుంటాయి. ” అన్నాడు.


“మా పిన్ని తరపున నే కొంటాలే నీకు. ఈ ఉగాది పండక్కి, నీకు లేని రంగు చీర కొనుక్కో, " అని పర్సు తీసి, రెండు వేలు ఇచ్చాడు మంజులకి. మంజుల మొహం చింకి చేటంతయ్యింది.


"అయినా, మనం మన పిల్లల పెళ్ళిళ్ళకి అందరికీ బట్టలు పెట్టినప్పుడు, ఒక బడ్జెట్ అనుకున్నాము, ఆ ప్రకారం కొనేశాము. కానీ నువ్వంటే మా పిన్నికి చాల ఇష్టం కనక, నీ ఇష్టం మనసులో ఉంచుకుని కొనుంటుందిలే. ఇక ఆ నెమలి పింఛం రంగు చీర గురించి మర్చిపో. " అని వాస్తవాలు చెపుతూనే, ప్రేమగా మంజులని ఓదార్చాడు సుబ్బారావు.

***

"ఒరేయ్ చంటి ఎలా వున్నావురా? నేనురా అమ్మలు పిన్నిని, నువ్వు పెళ్ళికి రాకపోడం చాలా వెలితిగా అనిపించిందిరా వెర్రినాగన్నా! పోనిలే మన మంజుని పంపించావు. ఇంత హడావిడిలో కూడా, నేను తన ఇష్టాన్ని గుర్తు పెట్టుకుని మరీ నెమలి పింఛం రంగు చీర తెచ్చానని ఎంత సంబరపడిపోయిందో ఆ వెర్రి కుంక? అడిగిన వారికీ, అడగనివారికీ కూడా ఈ విషయం చాటింపు వేసేసిందనుకోరా. "


"అవును పిన్నీ, నాతో కూడా చాలా ఆనందంగా చెప్పింది" మనసులో మంజుల ఊరినించి రాగానే చెప్పిన మాటలు మార్మోగుతున్నాయి.


"అవున్రా చంటీ, మన సుబ్బులు లేదూ, నీకు మోకాలు ఆపరేషన్ అయ్యాక నిన్ను చూళ్ళేదని తెగ బాధపడిపోందిరా, నీ దగ్గరకి ఓ పదిహేను రోజులొస్తుందిట. తెలిసినవాళ్లబ్బాయి వచ్చి దిగబెట్టి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ అబ్బాయే వచ్చి తీసుకొచ్చేస్తాడుట్రా, నన్ను నీకు చెప్పామన్నారు. ”

****

ఓ రోజు సుబ్బులత్తని అడిగాడు సుబ్బారావు, పెళ్లిళ్లలో, అసలు ఈ బట్టలు పెట్టె ఆచారం ఎలా వచ్చింది, దాని కధా కమామిషు ఏంటి అని.


"ఆ( అదేమీ అడుగుతావురా ! పూర్వం ఇంట్లో పెళ్లి ఉందంటే, దగ్గర వారంతా ఓ పదిహేనిరవై రోజుల ముందే వచ్చి, పెళ్లి పనుల్లో సాయం చేసేవారు. ఇంట్లో అందరికీ పెళ్ళికి కొత్త బట్టలు కొంటూ, ఇలా వచ్చిన చుట్టాలందరికి కూడా కొత్త బట్టలు కొనేవారు. అన్ని పనులు మానుకుని ముందుగానే మనింటికి వచ్చి, మనకి సహాయ పడినందుకు గానూ, ఇలా బట్టలు పెట్టి కృతజ్యత తెలియచేసుకునే వారు.


ఇప్పుడదే ఆచారం అని ప్రచారం చేసేస్తూ, ఆనవాయితీలా కొనసాగించేస్తున్నార్రా. "


"రాను రాను, యిదొక నామకే వాస్తే పని గా తయారయింది రా. చాలామంది ఆలా వచ్చిన చీరలు తాము కట్టుకోకుండా, వాటిని, వారింటికి వచ్చే అతిధులకు బొట్టు పెట్టి ఇచ్చేస్తూ ఉంటారు. ఆలా ఈ చీరలు గింగిరాలు తిరిగి చివరిగా ఎవరికీ చేరుతాయో, ఎవరు వాటిని కట్టుకుంటారో కూడా చెప్పడం కష్టం. ఇదో డబ్బు దండగ వ్యవహారం రా అబ్బాయి. "


"పెళ్లంటేనే బోల్డు ఖర్చుతో కూడుకున్న పని, దానికి తోడు ఇలాంటి పనికిరాని ఆచారాలు వాటిని మరింత పెంచేస్తున్నాయి. నాగరికత ఎంత పెరుగుతున్నా, ఇలాంటి వాటిల్లో వీసమెత్తు మార్పు కూడా రాకపోవడం విచారించవలసిన విషయం. ” అని పెద్దగా నిట్టూర్చింది సుబ్బులత్త.

***

మంజుల చెల్లి రాధిక, తన కూతురుకి భిలాయ్ సంబంధం చేసింది. రాధిక కూతురి శ్రీమంతానికి పిలుపు రాగానే అనుకుంది మంజుల, తప్పక వెళ్లితీరాలి అని. దారిఖర్చులవరకే ఏదోలా సమకూర్చవచ్చు, కానీ తమ పరిస్థితి చుస్తే ఏమీ కొనిచ్చేట్టుగా లేదు.


అయితే ఏమిస్తే బావుంటుందని, ఆలోచించింది. అమ్మలత్త కూతురి పెళ్ళిలో తనకిచ్చిన నెమలి పింఛం రంగు చీర గుర్తొచ్చింది. ఈ చీర భిలాయికి వెళ్ళిపోతుంది కనక, అమ్మలత్తకి తెలిసే అవకాశమే లేదు అని ఊపిరి పీల్చుకుని, ఈ చీర, స్వీట్లు, పళ్ళు, పూలు బొట్టు పెట్టి ఇచ్చేసింది మంజుల. అది చూసి చెల్లి రాధిక ఎంతో మురిసిపోయింది.


మంజుల వెళ్లిపోయేక, రాధిక కూతురు ఆ చీర చూసి, "పెద్దమ్మ ఏంటమ్మా ఈ రంగు చీర తెచ్చింది నాకు, నేను నలుపు కదా, నాకు అస్సలు నప్పదు కదా. "


“సరే లేరా! పెదనాన్న పెన్షన్ మీద ఇద్దరు బ్రతుకుతున్నారు కదా, ఎదో పాపం ప్రేమతో తెచ్చింది, అదలా ఉంచేద్దాము లే, నేను పెద్దమ్మ తరపున, నీకు నచ్చిన చీర కొంటాలేరా ! అని ఆ చీర తన బీరువాలో "పెట్టుబడి చీరల గుత్తం " లో పెట్టేసింది.

*****

" అమ్మలత్త కూతురు వాళ్ళ గృహప్రవేశం కదా, పెళ్ళై సంవత్సరం తిరక్కుండానే, కొత్తిల్లు కొనుక్కోడం చాల గొప్ప విశేషం. మాకు ఫోన్ చేసి చెప్పేరు, పెళ్ళికి వెళ్లలేక పోయానుకదా, ఇప్పుడు కూడా వెళ్లకపోతే బాగుండదు, నువ్వెళ్తున్నావా" అని మంజులకి ఫోన్ చేసి అడిగింది రాధిక.


"పెళ్లికెళ్ళాము కదా, వయసులో పెద్దవాళ్ళం, అన్ని ఫంక్షన్ లకి హాజరు వేసుకోడం అంటే ఎలా కుదురుతుంది, చూడాలి. "


“గృహప్రవేశానికి ఏవిస్తే బావుంటుందక్కా?”

"దేవుడు కుందులో, లేదా ఆ అమ్మాయికి పసుపు, కుంకం, చీర ఇచ్చినా పరవాలేదు"అంది మంజుల.

*****

శ్రీమంతం పెళ్ళికూతురికి మంజుల బొట్టు పెట్టిచ్చిన నెమలి పింఛం రంగు చీర, రాధిక కూతురు తో పాటు భిలాయ్ వెళ్లకుండా ఇన్నాళ్లు రాధిక బీరువాలో ఉండి, ఇప్పుడు రాధిక సూట్ కేసులో చేరింది, అమ్మలు కూతురి గృహప్రవేశాని వెళ్ళడానికి.


రాధిక బొట్టు పెట్టి ఆ చీర ఫంక్షన్ లో ఇవ్వగానే, అమ్మలు మొహం వైపు చూసింది గృహప్రవేశం పెళ్లికూతురు.. ఏమి అనకు అన్నట్టు సైగ చేసింది అమ్మలు.


ఆరోజు తన కూతురి పెళ్ళిలో తను మంజులకి ఆ నెమలి పింఛం రంగు చీర ఇచ్చినప్పుడు, అంతలా సంబరపడిపోయిన మంజుల ఎందుకిలా చేసింది అనేది అంతు చిక్కలేదు.

ముందు మంజుల చర్యని అపార్ధం చేసుకుంది అమ్మలు. వయసులో పెద్దదాన్ని, తన ఇష్టాన్ని బాగా గుర్తు పెట్టుకుని మరీ, చీర సెలెక్ట్ చేసి తెస్తే, తృణప్రాయంగా అందరిలాగే ఓ పక్కన పడేసి, వేరెవరికో పసుపు కుంకం కింద బొట్టు పెట్టేసి ఇచ్చేస్తుందా ?


కానీ, కాస్త నెమ్మదించాక, సుబ్బారావు, మంజులల మంచితనం, వారి ఆర్ధిక స్థితిగతుల గురించి బాగా తెలిసిన అమ్మలు, పెద్ద మనసుతో అర్ధం చేసుకోడానికి ప్రయత్నించింది. ఆలోచించగా, ఆలోచించగా, ఒక విషయం తట్టింది అమ్మలుకి.

****

అదే రోజు సాయంత్రం రైలుకి బయల్దేరుతున్న రాధికకి, బొట్టు పెట్టి, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి, మరో కవర్ కూడా ఇస్తూ చెప్పింది అమ్మలు " పాపం ఎక్కడ ఏ ఫంక్షన్ ఉన్న, సుబ్బారావు, మంజుల, ఇద్దరిలో ఎవరో ఒకరు తప్పక వస్తుంటారు. పాపం ఈసారి అస్సలు కుదిరి ఉండదు, అందుకే ఏ ఒక్కరూ రాలేకపోయారు. “


“ఈ కవర్ నేను పంపానని చెప్పి, అక్కకి అందజేయమ్మా! నేను మరీ మరీ ఇద్దరినీ అడిగానని చెప్పమ్మా. త్వరలోనే నేను వారింటికి వస్తానని నా మాటగా చెప్పమ్మా. "

****

రాధిక తెచ్చిచ్చిన కవర్ తెరిచి చూసి ఆశ్చర్య పోయారు సుబ్బారావు, మంజుల. అందులో, పసుపు, కుంకం పొట్లాలు, ఖర్జూరం పళ్ళు, రిటర్న్ గిఫ్ట్ బాగ్ లో ఓ వెండి భరిణ, నెమలి పింఛం రంగు చీర ఉన్నాయి, . పక్కనే ఓ చిన్న తెల్ల కవర్ సీల్ చేసి ఉంది. ఆ కవర్ తెరచి చూసారు.


ప్రియమైన చంటికి, మంజులకి, అమ్మలు పిన్ని /అమ్మలు అత్తా దీవించి రాయునది. ఉభయకుసలోపరి. గృహప్రవేశం చాలా బాగా జరిగింది. కానీ మీరు లేని లోటు కొట్టొచ్చినట్టు తెలిసింది. కానీ రావాలంటే, చార్జీలకే బోల్డు అవుతుంది. మా చంటికి వచ్చే ఫించను మీద ఇద్దరు అన్ని ఖర్చులు నెట్టుకు రావాలంటే ఎంత ఇబ్బందో నాకు తెలుసు. అందుకే, రాలేకపోయారని అర్ధం చేసుకున్నాను లెండి.



బహుశా ఈ ఇబ్బందుల కారణంగానే, మంజుల కి నేను నా కూతురు పెళ్ళిలో పసుపు కుంకం గా ఇచిన, తనకిష్టమైన నెమలి పింఛం రంగు చీరని, ఈ మధ్యే రాధిక ఇంట్లో జరిగిన శ్రీమంతానికి, మంజుల కానుకగా ఇచ్చేసి ఉంటుంది.


చెల్లెలి కూతురిది భిలాయ్ కదా, తనతో పాటు భిలాయ్ వెళ్ళిపోతుందని అనుకుని ఉంటుంది పిచ్చిది. రాధిక కూతురుకి ఈ రంగు నచ్చలేదేమో, రాధిక దగ్గరే వదిలేసి వెళ్ళిపోయుంటుంది పాపం.

ఈ చీర నా కూతురుకి గృహప్రవేశంలో రాధిక ఇచ్చినప్పుడు, వాస్తవం గ్రహించి ఎంతో బాధ పడ్డాను. అందుకే, మళ్ళీ పసుపు, కుంకంగా, తనకిష్టమైన అదే నెమలి పింఛం రంగు చీరని మంజులకి పంపుతున్నాను, ఈ రంగంటే తనకెంత ఇష్టమో నాకు తెలుసు. నా కూతురుకి మీ పేరున వెయ్యి నూట పదహార్లు చదివించేసాను లెండి. నేను మీదాన్ని అయినప్పుడు, నా సొమ్ము మీది కాకుండా పోతుందా?


ఇతరులని ఇంత ఇబ్బంది పెట్టె ఇలాంటి ఆచారాల్ని సమూలంగా పెరికి అవతల పడెయ్యాలర్రా.. అలాగే ఈ దండగమారి ఖర్చు లేకపోతే, ఆడపిల్ల తల్లితండ్రుల నెత్తిమీంచి పెద్ద బండరాయి తీసినట్టవుతుంది. మనమంతా మంచి నిర్ణయం తీసుకుందాము వెంటనే.


ప్రేమతో.. ఆశీస్సులతో.. అమ్మలు


ఉత్తరం చదవడం పూర్తయ్యాక, ఇద్దరూ హతాశులైపోయేరు.

***

పూడిపెద్ది ఉగాది వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: పూడిపెద్ది ఉగాది వసంత

నా గురించి స్వపరిచయం...మూడు కథా సంకలనాలలో నా కథలు అచ్చయ్యాయి. తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు సంపాయించుకున్నాయి. ప్రముఖ పత్రికలూ తెలుగు వెలుగు, నవ్య, విపుల, స్వాతి, సాక్షి , సహారి, మొదలైన పత్రికలలో నా కథలు విరివిగా అచ్చయ్యాయి . పోటీలలో కూడా చాల బహుమతులు వచ్చాయి .


నా కథ మీ మన్ననలు అందుకుంటుందని విశ్వసిస్తున్నాను.


కృతజ్యతలతో


ఉగాది వసంత











112 views0 comments
bottom of page