top of page

నేను బ్రతికే వున్నానా


'Nenu Bratike Vunnana' New Telugu Story Written By Padmavathi V

'నేను బ్రతికే వున్నానా' తెలుగు కథ

రచన: పద్మావతి విష్ణువజ్జుల


"ఏ.. వండీ.. నేను బ్రతికే ఉన్నానా" పంక్షజాక్షి ప్రశ్న.


"ఏ.. విటా పిచ్చి ప్రశ్న.. పిచ్చిగాని పట్టలేదుగా" పద్మనాభం ఎదురు ప్రశ్న.


"నాకు పిచ్చేవిటీ.. శుబ్బరంగా ఉన్నాను.. కానీ నేను బ్రతికే ఉన్నానా లేదా" మళ్లీ అడిగింది.


"అదేవిటోయ్.. నువ్వు.. నువ్వు బానే ఉన్నావుగా" అంటూ దగ్గరగా వెళ్లి, చేతి మీద గిచ్చాడు.


అది గమనించని పంకజాక్షి "చచ్చానురా.. బాబో.. య్" అంటూ అరిచి "మీ అఘాయిత్యం కూ..లా, అలా.. అల్లా గిల్లారే.. విటి, తేలనుకొని భయపడ్డాను.. థూ థూ థూ. "అనుకుంటూ వీపుమీద చరుచుకుంది, భయం పోవాలని.


"నువ్వు, అడిగిన ప్రశ్ననే మళ్లీ మళ్లీ అడుగుతుంటే సినిమా వాళ్ళ లా.. నువ్వు స్పృహలో ఉన్నావో లేవో అని గిల్లా" అన్నాడు తన తెలివికి తానే మురిసిపోతూ.


"తెలివి తెల్లారినట్లే ఉంది, నా ప్రశ్నకు జవాబు చెప్పలేదు" అంది.


"ఏ ప్రశ్న కు" అన్నాడు.


"అదే.. నేను బ్రతికి ఉన్నానా" అంది మళ్లీ.


"శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం" అంటూ కొద్దిగా వణుకుతున్న గొంతుతో "పంకజం..

పంకజమ్.. బానే ఉన్నావా" అన్నాడు.


"అయ్యో.. మీకు ఏమయ్యింది.. మీరు బానే ఉన్నారా.. అర్ధరాత్రి దాకా తిరిగి వస్తారు.. రోడ్డు మీద ఏం తొక్కి వచ్చారో.. ఉండండీ" అంటూ లోపలికి వెళ్ళింది.


'అమ్మయ్యా.. నువ్వు.. నువ్వు" అంటూనే ఉన్నాడు.


లోపల నుండి వచ్చిన పంక్షజాక్షి ఆంజనేయస్వామి బొట్టు పెట్టి "కాళ్ళు, చేతులూ కడుక్కోండి.. సమయానికి పక్కింటి పిన్నిగారు కూడా లేరు, ఏ మిరపకాయలో, ఉప్పో తిప్పి పడేసేవారు " అంటూ చేతులు కడుక్కొని వచ్చి "ఇంతకీ నేను బ్రతికే ఉన్నానా" అంది మళ్లీ.


పద్మనాభానికి గుండె ల్లో దడ హెచ్చింది. దీనికి పిచ్చి పట్టి ఉండాలి, లేదా ఎదురింటి రంగమ్మ గారు చచ్చి వారం అయింది. ఇద్దరూ మంచి స్నేహితులు. ఆవిడ దెయ్యం అయి పట్టిందా.. ఆ ఊహ రాగానే వెన్నులో వణుకు కాళ్ళలోకి ప్రవేశించి కాళ్ళు వణకడం, అక్కడ నుండి గొంతులోకి, అక్కడ నుండి చేతిలోకి ప్రవేశించింది. అప్రయత్నంగా వేళ్ళు వణుకుతున్నాయ్.


'హే భగవాన్.. ఏవిటీ పరీక్ష. మొన్నటి దాకా హాయిగా ఉంది. మొన్న పెన్షన్ ఆపీసుకు వచ్చింది. నిన్న బాంక్ కి వచ్చింది. అప్పుడూ బానే ఉంది. ఇంతలో ఏమయ్యిందో. ఇప్పుడే అంజనేయస్వామి బొట్టు పెట్టింది. మళ్లీ ఈ సంధి ప్రేలాపన ఏమిటో.. అనుకుంటున్నాడు.


భర్త ను అలా చూసిన పంక్షజాక్షికి కాళ్లాడ లేదు. కంగారు పడింది. గబా గబా కాఫీ తెచ్చి ఇచ్చింది.


"రాత్రి పూట కాఫీ ఎందుకే" అన్నాడు.


"తాగండి" అంటూ కంగారుగా ఉరిమింది. దాంతో ఇంకా భయం పెరిగింది. అలా ఉరుము తోంది.. ఎదురింటి రంగమ్మ గారు భర్త ను అలా గదిమే వారని చాలా సార్లు పంక్షజాక్షి చెప్పింది. ఆవిడ దయ్యమై తిరుగుతోంది ఏమో. తిరిగితే తిరిగింది. కానీ ఇలా భార్య ని పట్టుకోవడం పద్మనాభానికి నచ్చలేదు. ఎవరికైనా ఫోన్ చేద్దామంటే గొంతు తడారి పోయి మాట పెగలట్లేదు.


భర్త ను అలా చూసిన పంక్షజాక్షి గాభరాగా ఫోన్ అందుకొని చేద్దామని చూస్తే స్విచ్ ఆఫ్.


"హేవిటండీ.. అలా ఉన్నారు? డాక్టర్ని పిలుచుకురానా " అని అడిగింది.


"నేను బానే ఉన్నాను. నీకు ఏమయింది" అన్నాడు.


"నాకు ఏమీ కాలేదు" గట్టిగా అంది.


"బావుంటే, సంధి ప్రేలాపనలా ఆ ప్రశ్న ఏవిటీ?" అన్నాడు.


"అదా.. నేను బ్రతికే ఉన్నానా" అంది నవ్వుతూ.


"మళ్లీ అదే ప్రశ్న. భయంతో చస్తున్నాను" అన్నాడు.


"అయ్యో.. అదా.. మీకు ఏమయ్యిందో అని నేను భయపడుతున్నాను" అంది.


"నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే.. కాసేపటికి నేను అడగాలి ఆ ప్రశ్న.. నేను బ్రతికే ఉన్నానా" అని అన్నాడు పద్మనాభం.


"ఇంతకూ నా ప్రశ్న కు బదులేది.. నేను బ్రతికే.." అంటుండగానే "నోరుముయ్యి.. ఆ వెధవ ప్రశ్న వేస్తే నేనే చంపేస్తాను" అన్నాడు ఆవేశంగా.


"చంపేస్తే.. చంపేయ్యండి.. ముందు చెప్పండి.. నేను బ్రతికే.."అంటుంటే


"ఓసి నీ దుంప తెగ! శుబ్బరంగా ఉన్నావు కదే.. నిక్షేపంగా.. గుండ్రాయిలా.. ఈ తెగులు ఏంటి" అన్నాడు ఊగిపోతూ.


"నన్ను గుండ్రాయిలా ఉన్నాను అంటారా" అంటూ ముక్కులు ఎగ బీల్చింది.


"లేకపోతే ఏవిటీ.. గుండె ఆగినంత పనయ్యింది నీ వెధవ ప్రశ్న కు.. నా ఎదురుగా నిక్షేపంగా ఉండి నేను బ్రతికే ఉన్నానా అని అడిగితే, ఏ అర్భకుడికైనా గుండె ఆగిపోతుంది. నేను కాబట్టే " అంటుంటే, పక పకమని నవ్వుతూ "అందుకేనా అంత భయంతో వణుకు తున్నారు. అవును మరి.. ప్రభుత్వం దృష్టిలో నేను బ్రతికే ఉన్నానా" అంది.


"తిక్కగా మాట్లాడద్దు. సరిగ్గా చెప్పు. "అన్నాడు.


"ఇవాళ తారీఖు ఎంత" అంది.


"ఏవిటోయ్.. తారీఖు కి, నువ్వు బ్రతికి ఉండడానికి సంబంధం ఏవిటీ. అవే మరి సంధి ప్రేలాపనలు అంటే" అన్నాడు ఊగిపోతూ.


"ముందు తారీఖు చెప్పండి" అంది.


"తారీఖు గుర్తు లేదే.. కరోనా ధర్మమా అని అన్ని రోజులూ ఒకేలా ఉన్నాయి" అన్నాడు.


"పోనీ మొన్న మనం ఎక్కడకు వెళ్ళాం" అంది.


"ఏవిటీ ఈ క్విజ్ పోటీ.. మొన్న ఎక్కడకు వెళ్ళాం" అన్నాడు గుర్తు తెచ్చుకుంటూ.


"అదే అడుగుతున్నాను. చెప్పండి" అంది.


"ఎక్కడకు వెళ్ళాం.. ఎక్కడకు వెళ్ళాం.. " అంటూ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు. "ఆ.. గుర్తు వచ్చింది.. బాంక్ కి వెళ్ళాం" కరోనా వచ్చి తగ్గినంత ఆనందంగా.


"అదే.. మరి.. వయస్సు వస్తోంది. మీరు మర్చిపోతున్నారు అంటే వింటారా" అంది.


"ఇప్పుడు నా వయస్సు గొడవ ఎందుకే. నాకన్నీ గుర్తు ఉన్నాయి. ఇదిగో నీ పిచ్చి ప్రేలాపన వల్లే హడలి చచ్చి మర్చిపోయా " అన్నాడు గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తూ.


"మీరు గుర్తు చేసుకొని చెప్తే.. నేను బ్రతికి ఉన్నానా? లేదా ? అన్నది తెలుస్తుంది. ఈలోపు కాస్త ఉప్పుడు పిండి చేస్తా. రంగమ్మ గారి కోడలు కొబ్బరి చిప్ప ఇచ్చింది. ఇందాక కొట్టిందట. ' మా అత్తగారు ఉంటే మీకు ఓ కొబ్బరి చిప్ప ఇచ్చేవారు. 'అంటూ అత్తగారిని గుర్తు చేసుకొని నాకూ ఓ చిప్ప ఇచ్చింది" అంటూ లోపలకు వెళ్లి కొబ్బరి చిప్ప పరా పరా కోరుతోంది.


రంగమ్మ గారి మాట వినేసరికి పంచె తడిసిపోయింది. కొబ్బరి కోరుతుంటే ఆ శబ్దం రంగమ్మ గారు పళ్ళు కొరుకుతున్నట్లు ఉంది పద్మనాభానికి. మెడలో ఉన్న అంజనేయుడి బిళ్ళ కళ్ళకు అద్దుకొని, మనసులో తలుచుకుంటూ కూర్చున్నాడు. ఆ భయం లో మొన్న ఎక్కడ కు వెళ్లారో గుర్తు రావట్లేదు. కొబ్బరి తురుమడం అయింది కాబోలు ఆ శబ్దం ఆగేసరికి గుండెల్లో దడ తగ్గింది. పోపు వేస్తోంది కాబోలు క.. మ్మటి వాసన. కడుపులో ఆకలి తెలుస్తోంది.


అంతలోనే పంక్షజాక్షి ప్రశ్న గుర్తు వస్తే భయంతో ముచ్చెమటలు పడుతున్నాయి. బుర్రకు ఆలోచన రావట్లేదు. ఇంతలో ఫోన్ లో మెసేజ్ వచ్చిన సౌండ్ వచ్చింది. ఓపెన్ చేసాడు.


పంక్షజాక్షి మొదటి పెన్షన్ పడింది.


"ఏవోయ్.. ఇదిగో" అంటూ ఆనందంగా పిలిచాడు.


"ఏవిటీ.. నేను బ్రతికే ఉన్నానా" ఆనందంగా అడిగింది.


"ఆ పిచ్చి ప్రేలాపన మానకపోతే.. నా మీద ఒట్టే.. ముందు నేను చెప్పెడిది విను" అన్నాడునాటకీయంగా.


"చెప్పుడు. వినెదను" అంది.


"నీ మొదటి పెన్షన్ పడిందోయ్.. ఇప్పుడే మెసేజ్ వచ్చింది" అన్నాడు.


"అమ్మయ్యా.. నేను బ్రతికే ఉన్నాను" అంది నిండుగా నవ్వుతూ.


"అదిగో.. మళ్లీ అదే మాట" అన్నాడు.


"అవునండీ.. రిటైర్ అయిన మా ఫ్రెండ్స్ మా గ్రూప్ కి పెట్టిన పేరు 'నేను

బ్రతికే ఉన్నాను' అని" అంది.


"అదేమి పేరే.. "అన్నాడు.


"ఔనండీ.. ఇవాళ డిసెంబర్ ఒకటో తారీఖు. అవునా" అంది.


"ఔను.. అయితే" అన్నాడు అయోమయంగా.


"మొన్న మనం పెన్షన్ ఆపీసుకు వెళ్ళాం. అవునా" అంది.


"ఆ.. ఇప్పుడు గుర్తు వచ్చింది. మొన్న పెన్షన్ ఆపీసుకు వెళ్లి లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చి వచ్చాం. " అన్నాడు.


తనకు గుర్తు వచ్చి నందుకు తెగ సంబర పడిపోతూ. "అందుకే అడిగా.. పెన్షన్ పడితే బ్రతికే ఉన్నట్లు, లేకపోతే మళ్లీ వెళ్లి నేను బ్రతికే ఉన్నాను అని లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలి

కదండీ" అంది పళ్ళెంలో వేడి వేడి ఉప్పుడు పిండి పెడుతూ.


"ఓసి నీ హాస్యం కూలా.. చంపేసావ్ కదూ" అన్నాడు నవ్వుతూ.


"కాదండీ.. మొన్న చూసాను.. చాలా మంది వృద్ధులు వున్నారు, వృద్ధాప్యపు పెన్షన్ కోసం. వేలి ముద్ర వేసి వాళ్ళు అడిగిన ప్రశ్న.. 'బాబూ.. నేను బ్రతికే ఉన్నానా" అంది కళ్ళు తుడుచుకుంటూ.


(ఇది హాస్యం గా రాసినా ఏడవలేక నవ్వడం)

***

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం

నా పేరు పద్మావతి విష్ణువజ్జుల. MA హిస్టీరి, MA తెలుగు. 30 ఏళ్ళు టీచర్ గా పనిచేశాను. రేడియో లో స్త్రీల కార్యక్రమంలో పాల్గొన్నాను. కధలు రాయడం సరదా. FB లో సుమారు 100 కధలు రాసాను.

60 views0 comments

Comments


bottom of page