top of page

నీ ప్రేమకై వేచి చూస్తున్న నేను


'ni premakai vechi chustunna nenu' written by N. Dhanalakshmi

రచన : N. ధనలక్ష్మి

కాలేజీ, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, స్టూడెంట్స్.. ఇవే నా ప్రపంచం. ఇలాంటి నా ప్రపంచంలోకి అనుకోని అతిథిగా వచ్చి, ప్రేమ అంటే ఏంటో జీవితం అంటే ఏంటో నాకు నేర్పిన నా చెలికాడు నా సూర్య. రోజులానే సూర్యని నేను కలవడానికి వెళ్తున్నా! నా లైఫ్ లోకి తాను ఎలా వచ్చాడో వింటారా ?

రోజు మాదిరి కాలేజీకి నడిచి వెళ్తున్నా.. అనుకోకుండా ట్రాఫిక్ జామ్ లో ఉండిపోయాను. ఒక అతను కావాలనే నా మీద పడుతున్నాడు . కోపంగా నేను చూస్తే “అయ్యో మేడం! నేను కావాలని పడలేదు. వెనుక ఎవరో తోశారు" అన్నాడు. కోపం వచ్చింది. వాడు కావాలని చేశాడు అని తెలుస్తోంది. అరవలేను.. అలా అని వాడిని వదిలి పెట్టకూడదు అని .. నేను నా బాగ్ ని వాడి కాలి మీద వేసి “సారీ అండీ! బరువుగా ఉంది అండీ! పైగా వెనుక ఎవరో తోశారు” అని చెప్పాను. వాడు దెబ్బకి సైలెంట్ అయ్యాడు. ట్రాఫిక్ జామ్ క్లియర్ అవ్వడం వల్ల నేను కూడా నడకను మొదలుపెట్టాను. నా వెనుక ఎవరో ఫాలో అవుతున్నారు అనిపించింది. చూస్తే ఎవరో అతను వచ్చి “నిన్ను ఇబ్బంది పెట్టిన వాడిని, వాడికి తగ్గట్టు చాలా బాగా బుద్ది చెప్పావు” అని మాట్లాడడం మొదలు పెట్టాడు .

అప్పటికే ‘టైమ్ అయింది’ అని నాకు కాలేజీ నుంచి ఫోన్ వస్తే, తాను పిలుస్తున్నా వినకుండా ఇగ్నోర్ చేస్తూ వెళ్లిపోయాను. కాలేజీకి చేరిన తరువాత ప్రిన్సిపాల్ సర్ పిలవడంతో వెళ్ళాను.

“చూడమ్మా! ఈ ఆదివారం జరిగే మన కాలేజీ ఫెస్ట్ మనకు ఎంతో అవసరం. ఎందుకంటే మనకు అవసరమైన ఫండ్స్ ఇవ్వడానికి విఐపి వస్తున్నారు. మన స్టూడెంట్స్ చేసే పర్ఫామెన్స్, వాళ్ళ ప్రవర్తన బాగా ఉండాలి. ఈ బాధ్యత అంతా నీ మీదే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి” అని చెప్పారు. ఫంక్షన్ కోసం నేను మరోసారి చెక్ చేసుకున్నా! ఆదివారం రోజు, నా కొలీగ్, కొంతమంది స్టూడెంట్స్ కలసి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాము.

ఈవెనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. విఐపి రావడం జరగింది. విఐపి ని మాట్లాడమని చెప్పాను. ఆయన మాట్లాడి మేము ఇలా క్షేమంగా ఉన్నాము అన్నా .. నేను ఇలా వచ్చి మీ కాలేజీ కి డొనేషన్ ఇచ్చాను అన్నా.. దానికి ఒక వ్యక్తి కారణం. తానెవరో కాదు. ఈ సిటీకి ఈ రోజు కొత్తగా వచ్చిన ACP సూర్య. ముంబైలో ఒక మీటింగ్ కు లాస్ట్ ఇయర్ అటెండ్ అయ్యాను. అక్కడ కొంతమంది నన్ను చంపాలి అనుకున్నప్పుడు తాను తన ప్రాణాలను అడ్డు వేసి మరీ నన్ను కాపాడాడు. తను ఒక పోలీస్ అని నాకు తెలియక నేను ఏదైనా సహాయం చేస్తాను అంటే తాను ‘వద్దు! ఏదైనా కాలేజీకి , స్కూలుకి సహాయం చేయ’మన్నారు.తరువాత తాను పోలీస్ అని తెలిసింది. ఈ రోజు తాను మన సిటీకి వచ్చారని తెలిసి, తనని రమ్మని ఆడగడంతో తాను రావడానికి ఒప్పుకున్నారు. అదిగో సూర్య వస్తున్నారు” అనడంతో అటువైపు చూశాను. తాను ఎవరో కాదు! రెండు రోజుల క్రితం నా వెంట పడిన వాడు.

స్టూడెంట్స్ అందరూ “సూర్య సర్! మాట్లాడండి..” అని గట్టిగా అరవడంతో తాను వచ్చి మాట్లాడటం స్టార్ట్ చేశాడు.

“మీరు ఏసిపి అవ్వడానికి ఇన్స్పిరేషన్ ఎవరు?” అని స్టూడెంట్స్ అడిగారు.

సూర్య నవ్వుతూ " నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ఒకతను నాకు ఇష్టమైన అమ్మాయిని ఏడిపించినపుడు కొట్టాను. తాను ఒక మాట అంది ’నేను నీ ఫ్రెండ్ ని కాబట్టి కాపాడవు. అందరినీ అలా కాపాడలేవు. ఎదిరించలేవు కూడా! ఒక పోలీస్ కి మాత్రమే కొట్టే అధికారం ఉంటుంది. ఫస్ట్ అది సాధించి అప్పుడు నీ కోపాన్ని చూపించు’ అని. తాను చెప్పింది నిజమే కదా! అందుకే డే అండ్ నైట్ కష్టపడి సివిల్స్ సాధించాను. నేను ఈ జాబ్ చేయడానికి కారణం ఆ అమ్మాయే! అన్నాడు.

ఇది విన్న నా కంట్లో నీళ్ళు! అంటే తను నా సూర్య.. నా మాటకు అంత విలువ ఇచ్చాడా !

‘నేను పోలీస్ అయిన తరువాత నువ్వే నా భార్యవి’ అన్న తన మాటలు గుర్తుకు రావడంతో నా పెదాలపై చిరునవ్వు వచ్చింది. సూర్యని చూస్తూ నాలో నేనే పొంగి పోతున్నా! అందరూ అరవడంతో ఈ లోకంలోకి వచ్చా ..

స్టూడెంట్స్ అంతా “సర్! మీరు మేడమ్ ని మళ్ళీ మీట్ అయ్యారా? ఒక వేళ మీట్ అయితే ఏమి చేస్తారు? అసలు మేడమ్ పేరు ఏంటి సర్” అని ఆతృతగా అడిగారు.

సూర్య ఏమి చెబుతాడా అని చూస్తున్నా!

“తన పేరు సాధన . అనుకోకుండా మా నాన్న గారికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో మేము అనుకోకుండా షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. తను నాకు దూరం అయింది. తన పేరు తప్ప తన గురించి ఏమీ తెలియదు.స్నేహితుల ద్వారా వెతకడం మొదలు పెట్టాను. అయినా.. నో.. తను దొరకలేదు . అనుకోకుండా తనని మళ్ళీ ఇక్కడే రెండు రోజుల క్రితం చూసాను. కానీ తను గుర్తు పెట్టుకోలేదు. తనని కలిస్తే పెళ్లి చేసుకుంటా. తను అంటే ప్రాణం” అన్నాడు సూర్య.

ప్రిన్సిపాల్ సర్ నన్ను స్టేజ్ పైకి రమ్మని పిలవడంతో వెళ్ళవలసి వచ్చింది. సూర్యని చూస్తూ వెళ్తూ ఉంటే గుండెల్లో దడ మొదలైంది. సూర్య నన్ను చూస్తూ షాక్ అయ్యాడు. తన కళ్ళలో నాపై ప్రేమ కనబడుతోంది.

నేను ప్రోగ్రాం స్టార్ట్ చేశాను. నేను అనుకున్న విధంగా అన్ని పాటలకు స్టూడెంట్స్ చాలా బాగా డాన్స్ చేశారు కూడా . ప్రోగ్రామ్ అవడంతో అందరూ వెళ్లిపోతున్నారు. ఆఫీస్ రూం లో పని ఉండి వెళ్తున్నాను. సడన్ గా సూర్య నా చేతిని పట్టుకుని నన్ను చూస్తూ ఏడుస్తూ హగ్ చేసుకున్నాడు.

“ఏమైపోయావు ఇన్నాళ్లు? ఇంక నిన్ను వదిలి వెళ్ళే ప్రసక్తి లేదసలు” అంటూ నా నుదిటి మీద ముద్దు పెట్టి గట్టిగా హగ్ చేసుకున్నాడు. నన్ను చాలా మిస్ అయ్యాడు అని తెలుస్తోంది.

నా చేయి పట్టుకొని “చూడు! నేను ఉన్న ప్రొఫెషన్ లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. బయటకి వెళ్ళిన తరువాత నేను తిరిగి వస్తానో లేదో తెలియదు. కానీ నేను దేశం కోసం నిన్ను అయినా సరే వదలుకుంటాను. రేపు పెళ్లి అయిన తరువాత నీతో కలసి ఎక్కడికీ రాలేను. ఇవన్నీ నీకు ఓకే అంటే మనం పెళ్లి చేసుకుందాము” అన్నాడు సూర్య.

“సూర్యా! నేను నీకోసం ఎంతటి బాధను ఐనా భరించడానికి సిద్ధంగా ఉన్నా! నువ్వు నాతో క్షణం ఉన్నా చాలు . నా ప్రాణం నువ్వే అయినప్పుడు .. నిన్ను, నీ ప్రేమను భరించడానికి నేను సిద్ధం” అనడంతో తాను నన్నుహగ్ చేసుకొని నా పెదాలపై ప్రేమ సంతకం చేశాడు..

నన్ను వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి తీసుకొని వెళ్ళాడు . అప్పటికే మా అమ్మ నాన్నను కూడా పిలిపించాడు. పెద్దలు కూడా మా ప్రేమను ఒప్పుకున్నారు. మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా చాలా ఘనంగా చేశారు.

సూర్య ప్రేమలో నాకు కాలం తెలియలేదు. ఒక రోజు నన్ను లాంగ్ డ్రైవ్ అంటూ తీసుకొని వెళ్ళాడు. తాను నడుపుతున్న ఆశ్రమానికి నన్ను తీసుకొని వెళ్ళాడు. అక్కడ కొద్ది సేపు ఉన్న తరువాత టెంపుల్ కి , చుట్టూ ఉన్నఅన్ని ప్రదేశాలకి తీసుకొని వెళ్ళాడు. దగ్గరలో ఉన్న హోటల్ కి వెళ్ళాము. అక్కడ లంచ్ చేద్దాం అని కూర్చున్నాము . ఇంతలో సూర్య సెల్ కి ఫోన్ కాల్ వచ్చింది, ‘ఎవరో ఉగ్రవాది సిటీలోకి వచ్చాడు’ అని. వెళ్లిపోవాలని అనుకున్నాము. ఇంతలో ఒక పర్సన్ కంగారుగా ఉండడం సూర్య అబ్సర్వ్ చేశాడు. ఆ పర్సన్ సూర్యని చూసి పారిపోవడంతో తన వెంట పడ్డాడు. సూర్య అనుమానం బలపడింది. వాడి వెంట పడ్డాడు. హోటల్ పైకి వెళ్ళారిద్దరూ. వారి మధ్య జరిగిన గొడవలో సూర్యని పైనుంచి తోసివేశాడు. కానీ నా సూర్య అలా పడిపోయేటప్పుడు కూడా తన వృత్తి ధర్మం వీడలేదు. అలా పడి పోయేటప్పుడు ఆ ఉగ్రవాదిని కూడా లాగి ఇద్దరూ కలసి కింద పడ్డారు. ఆ ఉగ్రవాది పడినప్పుడు క్రింద ఉన్న రాయికి తన తల తగిలి చనిపోయాడు. సూర్య కి కూడా దెబ్బ బాగా తగిలింది.

ఏడుస్తూ సూర్య దగ్గరకి వెళ్ళాను. సూర్య నన్ను చూస్తూ “లవ్ యు సాధన” అంటూ కళ్ళు మూశాడు. తనని వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాము. లోపల ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు.

డాక్టర్ వచ్చి చెప్పేంత వరకు భయపడతూ, దేవుళ్ళను కొన్ని వేల సార్లు మొక్కుకున్నా!

డాక్టర్ వచ్చి “సూర్య తలకి బలమైన దెబ్బ తగలడంతో తాను కోమాలోకి వెళ్ళాడు. తను మా ఆధ్వర్యంలోనే ఉండాలి అన్నారు. తనకి మీ మాటలు వినబడతాయి కానీ తిరిగి సమాధానం ఇవ్వలేడు”అన్నాడు. అంతే! నా సూర్య అప్పటి నుంచి హాస్పిటల్ లోట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు.ఇది జరిగి సెవెన్ ఇయర్స్ అయింది.

హాస్పిటల్ దగ్గరకి వచ్చేశాను. తన దగ్గరికి వెళ్తున్నా! హ్యాపీ బర్త్డే సూర్య .. ఈ రోజు అత్తమ్మ వాళ్ళు తిరుపతికి వెళ్లారు. అది కూడా నీ కోసం నడిచి ! నువ్వు త్వరగా వచ్చెయ్ సూర్యా! మనం కూడా కలిసి వెళ్ళాలి.స్టూడెంట్స్ చేసిన అల్లరిని చెప్పాను. సూర్య పెదాలపై చిరునవ్వు ..

ఇప్పడు నా మాటలకు స్పందిస్తున్న సూర్య అతి త్వరలో మామూలు మనిషి అవుతాడు. మళ్లీ మా ప్రేమ ప్రయాణం మొదలవుతుంది.

నీ కోసం .. నీ ప్రేమకై .. సెవెన్ ఇయర్స్ ఏంటి! ఎన్ని ఇయర్స్ ఐనా ఎదురు చూస్తూ ఉంటాను. నా ప్రేమ .. నీతోనే మొదలై నీతోనే అంతమవుతుంది.

***శుభం***


రచయిత్రి పరిచయం :

నమేస్తే నా పేరు ధన లక్ష్మి ..వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను ..మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా ..కథలు, కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందంవేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలకు, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.



121 views0 comments

留言


bottom of page