top of page

నిజాయితీకి విలువ కట్టలేం సుమా!



'Nijayithiki Viluva Kattalem Suma' - New Telugu Story Written By Pandranki Subramani

Published In manatelugukathalu.com On 30/03/2024

'నిజాయితీకి విలువ కట్టలేం సుమా' తెలుగు కథ

రచన: పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



పరంధామయ్య పెద్ద కుమార్తె మౌనికకు పెళ్ళి సంబంధం కుదిరింది. రాబోయే శుభకార్యం ఇంటిల్లిపాదినీ సంతోషం సాగరంలో ముంచింది. అంత సంతోషం ఎందుకంటే-పెద్దమ్మాయి పెండ్లి పీటలపైన కూర్చున్న తరవాతనే కదా మిగతా ఇద్దరు అమ్మాయిల వంతూ వస్తుంది!అప్పుడే కదూ పూర్ణ సుస్వరాలతో మంగళ వాద్యం ఇంటి వాకిట వినిపించేది!ఒకటి తరవాత ఒకటిగా— ఒకరు తరవాత ఒకరుగా ముందుకు సాగడం అన్నమాట-- ఆ మంగళ మృదంగ తతంగమంతా పూర్తయేంత వరకూ పరంధామయ్య దంపతులిద్దరికీ గుండెలపైన కుంపటి జ్వలిస్తూనే ఉంటుంది.


మరి--జాప్యం చేస్తే- పెద్దపిల్లకు మరొక మంచి సంబంధం ఎదురవదన్న ఆతృతలో ఆయన తన రెండెకరాల మాగాణీ కొదువ పెట్టి ఆ డబ్బుతో భార్య సమేతంగా భాగ్యనగరం చేరాడు పరంధామయ్య. అంతటి హడావిడి యేర్పాటు యెందుకు కావలసి వచ్చిందంటే-కాబోయే వియ్యంకుడు వియ్యంకురాలూ నగానట్రా కళ్ళ చూస్తే గాని మరు మాటకు తావులేదని, కొడుకు పెండ్లి పీటల పైన కూర్చునే ప్రసక్తే ఉండదని తేల్చేసారు. ఇకపోతే-నగల పొందిక పసందుగా కుదరాలంటే ఆడాళ్ళేగా దానికి సరైన నిర్ణేతలు! అంతేకాక మీదు మిక్కిలి దొంగల బెడదు కూడాను-- అంచేతనే అతడు భార్య తోడుతో భాగ్య నగరానికి వచ్చాడు. 

-------------------------------------------------------------------------------

దంపతులిద్దరూ తెలిసిన దగ్గరి బంధువులింట్లో ముందు రాత్రి మకాం వేసి, మరునాడు పంజాగుట్టలో వరసగా ఉన్న నగ ల దుకాణాల వేపు ఆటోరిక్షాలో సాగిపోయారు. సరైన రంగులో కుదురైన నమూనాలో కూతురు కోసం నగలు ఎంపిక చేసి పంజా గుట్టలోనే మరొక ఆటోరిక్షా పట్టుకుని ఆనందావేశంలో తేలుతూ భార్యా భర్తలిద్దరూ కాబోయే పెళ్లి ఏర్పాట్ల గురించి తెగ ఇదయి పోతూ వచ్చి చేరారు. రిక్షావాడికి కిరాయి చెల్లించి ఇంట్లో సామాను లెక్కించి చూసుకునేటప్పటికి ఇద్దరి గుండెలూ గుభేలుమన్నాయి. నగలుంచిన జరీ అంచు మఖ్ మల్ సంచి కనిపించలేదు.


ఇద్దరూ గుండెలు బాదుకుంటూ”పాహిమాం ! పాహిమాం!“అంటూ మళ్ళీ మళ్నీ వెతికారు. వాకిటంతా తిరిగి చూసారు. వాళ్ళకు తోడ్పాటుగా వాళ్ల బంధుమిత్రులు ఇరుగు పొరుగులు కూడా వాళ్ళతో చేరి వెతకనారంభించారు. కాని—కనిపించలేదు. దురదృష్టం వెంటాడితే ఏది మాత్రం మిగులుతుందని! అందులో భాగ్యనగరమంటే; అందునా భాగ్యనగరంలోని పాతబస్తీ అంటే దోపిడీలు దొంగతనాలూ చేసే వాళ్ళకు పుట్టినిల్లని చెప్పుకుంటారు కదూ! లేకపోతే ఎందుకంత తరచుగా పోలీసులు మెరుపు దాడితో ఎదురు చూడని విధంగా రాత్రుళ్ళు నలువైపులా జల్లెడ పట్టినట్లు ముట్టడి పర్యవేక్షణలు చేస్తుంటారు! ఎంతమంది నేరస్థుల్ని అప్పటికప్పుడు శ్రీ కృష్ట జన్మస్థానంలోకి తరలిస్తుంటారు! ఇక తమకు పోలీసులే గతి. కాని రక్షక భటులు మాత్రం తక్షణ ముట్టడి యెలా చేస్తారు? పెళ్ళి ముహూర్తం దగ్గరపడిపోవచ్చింది. అంతలో పోలీసులు దొంగల ఆచూకీ తెలుసుకుని నగలు అప్పచెప్పగలరా! పెండ్లి జరిపించగల రా! అసలే ఇక్కడి దొంగలు ఆరితేరిన ప్రొఫెషనల్ క్రిమినల్స్ అట-- ఈ పాటికి బంగారు నగలన్నిటినీ కరిగించేసి ఉంటారు. కొన్న ఒక్కగా నొక్క వజ్రాల హారాన్నీ చౌకగా అమ్మేసి ఉంటారు. నోట మాట రాక చేష్టలుడిగి అరుగు పైనే సొమ్మసిల్లి పోయినట్టు ఒరిగి పోయారిద్దరూ-- అతి కష్టంపైన బంధువుల బలవంతంపైన ఊపిరి తీసుకుని పోలీసులకు రిపోర్టు ఇచ్చారు. పెండ్లి వ్యవహారం కాబట్టి వాళ్ళూ భార్యా బిడ్డలు కలవారే కాబట్టి ప్రత్యేక రక్షక దళాలు యేర్పాటు చేసి యుధ్ధ ప్రాతి ప్రదికన గాలింపు చర్యలకు పూనుకున్నారు. 


నగలు పోయి మూడు రోజులయిపోయాయి. దొంగల అయిపు లేకుండా పోయింది. ఇక యెంత వెతికినా పోయిన నగలు అప్పట్లో దొరికే ప్రసరక్తి లేదని తీర్మానించుకున్నారు పరంధామయ్య దంపతులు. కొదువ పెట్టిన రెండకరాలూ పూర్తిగా అమ్మివే సి ఇంకా మిగిలి ఉన్న రెండకరాలూ తాకట్టు పెట్టి ముహూర్తానికి పెద్ద కూతురు పెళ్ళి జరిపించేయాలని తలపోస్తూ గోడకు చేరబడి వాళ్ళ ముందు పరచిన విస్తళ్ళ వేపు తదేకంగా చూస్తూ కూర్చున్నారు. అంతటి పెను ముప్పు యెదురైన తరవాత ఆకలి యెలా పుడ్తుంది?నిజానికి దంపతులిద్దరూ మూడు రోజులుగా మజ్జిగ నీళ్లు మాత్రం తాగుతూ గడుపుతున్నారు. అకటా!అటువంటి పరిస్థితి గర్బ శత్రువుకి కూడా రాకూడదు సుమా!చెప్పకూడదు గాని—అదంతా దంపతులిద్దరి పూర్వజన్మ సుకృతమేనేమో!పూర్వజన్మ నుండి తరుముకొస్తూన్న వాసనల ప్రభావమేనేమో-- 


అప్పుడు ఎవరో వచ్చి-“అయ్యా!”అని పిలిచినట్లనిపించి దంపతులిద్దరూ కళ్లు తెరిచి చూసారు. ఎవడో మనిషి కాకీ దుస్తుల్లో కనిపించాడు. పోలీసు కానిస్టేబులా!ఊ హుం--కానట్లుంది. అతగాడు చిర్నవ్వుతో చూస్తూ-“భయపడకండి మీ నగల జరీ సంచీ ఎక్కడికీ పోలేదండీ. నా బండి వెనుక సీట్లోనే పడి ఉంది. యధా ప్రకారం శుక్రవారం నాడు నేనూ మా ఆవిడా ఆటో రిక్షా క్లీన్ చేస్తున్నప్పుడు ఈ సంచీ నా చేతికి తగిలింది. నాకు భద్రంగా దొరికింది. బండిలో వస్తున్నప్పుడు మీరిద్దరూ మీ పెద్దమ్మాయి పెండ్లి గురించి మాట్లాడుకున్న ఊసులన్నీ నాకు వెంటనే గుర్తుకు వచ్చాయి. ఇవి మీవేనని, అవన్నీ పెండ్లి కోసం కొన్న నగలేనని తేల్చుకున్నాను. నాకూ వయసుకి వచ్చిన కూతురొకతె ఉంది కదండీ!ఆడ కూతురు పెండ్లి యెంత కష్టమో నాకు తెలుసు కదండీ!” అంటూ నగల సంచీని వాళ్ళకు అందిచ్చి వెనుతిరిగాడు. అప్పుడు పరంధా మయ్య చివ్వున అరుగుపైనుండి లేచి రిక్షా మనిషిని అందుకున్నాడు. 


“ఇదిగో!వద్దనకుండా తీసుకో!ఐదు వేలున్నాయి. ఇంకా కావాలంటే అడుగు ఇస్తాను”


అప్పుడు రిక్షామనిషి నిదానంగా వెనక్కి తిరిగి చూసాడు-“నాకేమీ వద్దయ్యా!మీ పెద్దమ్మాయి పెళ్ళి సజావుగా జరిగితే నాకదే సంతోషం. మీకే కాదు-నాకూ కూతురుందిగా— దానికి పెళ్ళి లక్షణంగా జరగాలని మీరు మనసార ఆశీర్వదిస్తే అదే నాకు పదివేలు” అంటూ అతడు నడచుకుంటూ అరుగు దాటి వెళ్లి తన ఆటో రిక్షాలోకి ఎక్కి కూర్చున్నాడు.


ఇకపైన భార్యా భర్తలిద్దరూ నోరు తెరవక మౌనంగా చూస్తూ చేతులెత్తి నమస్కరించారు. అప్పుడూ యిప్పుడని కాదు- ఎప్పుడూ నిజాయితీకి విలువ కట్టలేం కదా!


***

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





80 views0 comments
bottom of page