నిశ్శబ్ద ఛాయలు
- Gorthi Vani
- Jul 1
- 5 min read
#NissabdaChayalu, #నిశ్శబ్దఛాయలు, #Gorthi VaniSrinivas, #గొర్తివాణిశ్రీనివాస్, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Nissabda Chayalu - New Telugu Story Written By Gorthi VaniSrinivas
Published In manatelugukathalu.com On 01/07/2025
నిశ్శబ్ద ఛాయలు - తెలుగు కథ
రచన: గొర్తి వాణిశ్రీనివాస్
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
వినోద్ నాలుగేళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. మంచి ఉద్యోగం. చక్కటి జీతం. సొంత ఇల్లు. కొత్త కారు. భార్య అమృతతో కలిసి సుఖసంతోషాల మధ్య జీవితం గడుపుతూ ఉండగా, అనూహ్యంగా ఓ దుర్వార్త నింగిలో మెరుపులా అతని జీవితాన్ని చీల్చేసింది.
ఆఫీసులో ‘లే ఆఫ్స్’ ప్రకటించారు. వినోద్ విధుల నుంచి తొలగించబడ్డాడు. వీసా కూడా రద్దయింది. ఆశల పల్లకి నేలచూపింది. అన్నీ కోల్పోయి భార్యతో కలిసి తిరిగి ఇండియాకి వచ్చేశాడు.
అమృత, తండ్రి ధనుంజయ్ వద్దకు వచ్చింది.
“నాన్నా, ఉద్యోగం వచ్చేదాకా మా అవసరాలు తీరాలికదా… పెళ్లి సమయానికి ఏమీ అడగలేదు వాళ్ళు. కానీ ఇప్పుడు అదే వాళ్లకి మహద్భాగ్యంగా ఉంది. మీరు ఎంతివ్వగలిగితే అంత, ఆయన అడిగి తీసుకురమ్మన్నారు నాన్నా. ” అంటూ తల వంచి నిలబడింది.
కూతురి మాటల్లో బాధ చూసి కలత చెందిన ధనుంజయ్, “అద్దె ఇంట్లో ఎందుకమ్మా, మన ఇంట్లోనే ఉండండి. అన్నీ కలిసే ఉంటాం, ” అన్నాడు.
ఒక శుభ ముహూర్తాన అమృత, వినోద్ వచ్చారు.
తల్లిలేని కూతురు తనతో ఉండటం తనకు శుభం అనిపించింది. తనకున్న రెండెకరాల పొలం అమ్మి డబ్బు తెచ్చి అల్లుడికి ఇచ్చాడు. దాని మీదే రోజులు నెట్టుకుంటున్నారు.
వినోద్ రోజూ ఉద్యోగం కోసం రోజూ కృషి చేస్తున్నాడు. అన్ని వైపులా పోటీ తీవ్రంగా వుంది. ఎంతో కష్టం మీద ఒక చోట ఉద్యోగం దొరికింది. కానీ, లంచం కావాలని చెప్పారు.
“మావయ్యగారూ, దయచేసి డబ్బు సర్దుబాటు చేస్తారా? ఆ ఉద్యోగం వస్తేనే నేను ఈ ఊళ్ళో తలెత్తుకుని తిరగ్గలను” అన్నాడు వినోద్.
కూతురి ఆనందం కోసం ఏమైనా చేసే తండ్రి తన భార్య నగలు అమ్మి డబ్బు తెచ్చి ఇచ్చాడు. అల్లుడికి ఉద్యోగం వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్. అతనికి ఓ గది వర్క్ కోసం కావాల్సి వచ్చింది. రెండో గది కూతురు, అల్లుడు వుండేందుకు. తానెక్కడైనా పడుకొగలనన్నాడు. ధనుంజయ్. హాల్లో సోఫాలో పడుకునేవాడు.
ఒక రోజు వినోద్ తల్లి చనిపోయింది. వినోద్ తండ్రి రాఘవకు సొంతిల్లు లేదు. బంధువులు సరిగా ఆదరించలేదు. బాధలో వున్న రాఘవను ధనుంజయ్ ఇంటికి తీసుకువచ్చి బట్టలు పెట్టాడు. రెండు రోజులు ఉండి “ఇక మా ఇంటికి వెళతాను” అన్నాడు. “ఇంకొన్ని రోజులు ఉండి వెళ్ళండి” అన్నాడు ధనుంజయ్. మొహమాటంగా ఉండిపోయాడు రాఘవ. అతనికి జ్వరం వచ్చి ఇంకొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది.
ఆ సమయంలో, ధనుంజయ్ తన మంచాన్ని పెరటి గుమ్మం దగ్గర వేసుకుని పడుకున్నాడు.
కూతురు అమృత “ఇక్కడెందుకు నాన్నా?” అంటే “ఇక్కడైతే గాలి బాగుంటుంది తల్లీ” అన్నాడు.
నిజానికి ఇంట్లో పడుకునే చోటు లేదు. రాఘవను చూసేందుకు బంధువులు వచ్చి పోతున్నారు.
కొన్నాళ్ళకు రాఘవకి జ్వరం తగ్గింది. కానీ నీరసంగా వున్నాడు. వినోద్ తన తండ్రితో “ఇక్కడే ఉండండి నాన్నా. ఇంట్లో ఏవుంటారు మీకంటూ? కలసి ఉంటేనే జీవితం హాయిగా ఉంటుంది. ఒంటరిగా ఉండలేరు మీరు” అన్నాడు. కానీ రాఘవ అందుకు ఒప్పుకోలేదు. “మీ మామగారింట్లో నేను వుండటం ఏంటి? ఆయనకు ఇబ్బంది అవుతుంది” అన్నాడు.
అందుకు ధనుంజయ్ నవ్వుతూ “మీరుండటం వలన నాకెలాంటి ఇబ్బందీ లేదండి. పైగా నాకు మాట్లాడుకునేందుకు తోడు ఉన్నట్టవుతుంది. ఇక్కడే ఉండండి” అన్నాడు. వినోద్ బాగా పట్టుబడ్డాడు. ఆయనను ఇంట్లో ఉండేలా చేశాడు.
వినోద్ ఆఫీస్ పనుల కోసం సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. గదిలో ఏసీ పెట్టించాడు. భార్యలేని ధనుంజయ్ మాత్రం హాల్లో ఓ మూల కుర్చీలో కూర్చునే వాడు.
ఆ సమయంలో ధనుంజయ్ జ్వరం వచ్చింది. రాధేశ్యాం అనే పక్కింటిటాయన నాటు వైద్యాన్ని సూచించాడు. వాటిని తెచ్చి వాడాడు. కానీ జ్వరానికి ఉపశమనం రాలేదు. కూతురు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది. పచ్చకామెర్లని చెప్పారు.
ఆహార నియమాలు పాటించాలి అన్నారు. అమృత తండ్రికి వేరుగా వంట చేస్తూ చూసేది. “ఇంత వేర్వేరు వంటలు ఎందుకమ్మా? నాకు మామూలుగా మీరు తినేవే పెట్టుచాలు. మరీ కటిక పథ్యం అవసరం లేదని రాధేశ్యాం బాబాయ్ చెప్పాడు. ” అన్నాడు ధనుంజయ్. కూతురు కష్టపడకూడదని అలా అన్నాడేగానీ నూనెతో చేసిన వంటలు తినకూడదని తనకూ తెలుసు. కాస్త తగ్గించి తింటే అంతా మాయమై పోతుందలేమనుకున్నాడు. కొన్నాళ్ళు సర్దుకున్నట్టుగా అనిపించినా మళ్లీ ఆరోగ్యం క్షీణించింది.
డాక్టర్ స్కాన్ చేసి, గాల్ బ్లాడర్‌లో రాళ్ళు ఉన్నాయి, ఆపరేషన్ చేయాలన్నట్లు చెప్పారు.
“ఇప్పుడు ఆపరేషన్ అంటే మాటలు కాదు. మన కస్తూరి పిన్ని లేదూ. అదే సందు చివరావిడ. ఆవిడ కొండపిండాకు తింటూ, మూలికలు నూరి తాగింది. ఆపరేషన్ లేకుండానే రాళ్ళు కరిగిపోయాయి. నేనూ ఆ వైద్యం చేసుకుంటాను” అని చెప్పాడు కూతురితో. పెరట్లో ఓ చిన్న పాక వేసుకుని, అందులో ఉంటూ మందులు తానే తయారు చేసుకుని వాడుకున్నాడు.
“నాన్నా, అవి వద్దండి. డాక్టరు చెప్పినట్టే చేయండి, ” అని అమృత ఎంత చెప్పినా వినకుండా తనకు తెలిసిన వైద్యాలేవో చేసుకున్నాడు.
ఒకరోజు అమృత తన భర్తతో, “మీరు మన గదిలోనే వర్క్ చేసుకోకూడదా. రెండుగదులూ మనకిందే ఉంటే నాన్నకి ఎలాగా? ఒక గది నాన్నకి ఇచ్చేద్దాం ” అని కోరింది.
“ఆయనకు అలాంటివి నచ్చవేమో. అందుకేగా అలా దూరంగా ఉన్నారు. నువ్వెందుకు రమ్మని బలవంతం చేస్తావు అమృతా.. !పెద్దవాళ్లు వేరుగా ఉండటానికే ఇష్టపడతారు. నిపుణులు కూడా అదే అంటారు. ఏకాంతంలో ఆనందాన్ని వెతుక్కుంటారట” అని తిప్పికొట్టాడు వినోద్.
కొద్ది రోజులకే ఉద్యోగం సెట్ అయ్యాక వినోద్ బొచ్చు కుక్కపిల్లని కొనాలనుకున్నాడు. పెట్ షాప్ లో ఒక కుక్కపిల్లను ఎంచుకున్నాడు.
పక్కనే ఉన్న ఒక వ్యక్తి అడిగాడు, “దీనికి ఏం పెడతారు బాబూ?”
“పాలు, బోన్ సూప్, పెడిగ్రీ, ” అన్నాడు వినోద్ ముద్దు ముద్దుగా.
“పచ్చడి అన్నం?”
“జబ్బు చేస్తుంది. ”
“వేపుడు కూరలు?”
“ఆహా, దానికా?!”
అవతల వ్యక్తి, “మీ మామగారిని ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత నీది కాదా?” అన్నాడు.
వినోద్ గతుక్కుమన్నాడు. వెనక్కి తిరిగి చూస్తే, తన తండ్రే. నిందారోపణగా మాట్లాడింది తండ్రి అని గ్రహించాడు. చుట్టూ ఉన్న వాళ్ళని చూసి తలవంచుకున్నాడు.
“ఓ జంతుప్రేమికుడా! ఇంటి బయటవుండాల్సిన వాటిని గుండెల్లో పెట్టుకుని, పూజించాల్సిన వ్యక్తుల్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. మనిషిని ప్రేమించు. మీ మామగారు భోగాల్ని త్యాగంగా మార్చాడు. ఆ త్యాగానికి తగిన గుర్తింపు ఇవ్వగలాగుతున్నావా? ఆలోచించు” అన్నాడు తండ్రి.
అక్కడున్న వారంతా వినోద్ వైపు తృణీకారంగా చూశారు. తండ్రి తన గురించి ఇలా అనుకున్నాడా? అయితే మామగారు ఇంకేమనుకుంటున్నారో? మామగారి బాధని బహిరంగంగా చెప్పకపోయినా, ఆయన ఆంతర్యం కూడా ఇదే అయ్యుంటుందా!
అలా ఎందుకనుకోవాలి? కట్నం లాంఛనాలు ఏమీ తీసుకోకుండా అమృతని పెళ్లి చేసుకోలేదా తను. తనకి కష్టం వచ్చినప్పుడు మామగారు ఆదుకోవడం పరిపాటి. ఇందులో నాన్న నన్ను నిందించడం దేనికీ? అనుకున్నాడు వినోద్.
షాపు లోంచి బయటకు వచ్చేసాడు వినోద్. వీధిలో నడుస్తూ వెళుతుంటే మామిడి చెట్టు కింద పిల్లలు ఆడుకుంటున్నారు. కాయలకోసం చెట్టుని రాళ్లతో కొడుతున్నారు. గతంలో విరిగిన కొమ్మల దగ్గర కూడా కాయలు వచ్చిన దృశ్యం కనిపించింది.
రాళ్ల దెబ్బలను ప్రతిఘటించని చెట్టుని చూస్తే మామగారు గుర్తొచ్చారు.
ఇంటికి చేరేసరికి మామగారు కల్వంలో ఆకులు నూరుతున్నారు. ఆయన్ని అలా చూడటం బాధనిపించింది.
“ఏదైనా కావాలా మావయ్యా?” అన్నాడు వినోద్.
“నాకు కావలసింది ఏదీ లేదు బాబూ. ”
“డాక్టర్ దగ్గరకు వెళ్ళి మందు తెచ్చుకుందాం రండి”
“ నీ మంచి మాటలకు మించిన మందేముంది?”
“ఇక్కడ ఒంటరిగా ఎందుకుండాలి? లోపలికి రండి మావయ్యా, ” అంటూ చెయ్యి పట్టుకుని లోపలికి నడిపించాడు.
భరతుడి చేయి పట్టుకుని నడిచి వచ్చి పట్టాభిషిక్తుడైన శ్రీరాముడిలా వచ్చి కూర్చున్నాడు ధనుంజయ్.
తన త్యాగానికి గుర్తింపు కావాలని ఎప్పుడూ అనుకోలేదు. కాకపోతే, తనను భర్త పట్టించుకోవట్లేదని అమృత చాలాసార్లు తండ్రి దగ్గర బాధపడింది. ఫర్వాలేదని చెప్పినా ఆమె మనసు కుదుట పడలేదు. అల్లుడి చేతిలో తన చేయి చూస్తే కూతురు సంతోషిస్తుంది. ఆమె ఆనందమే తనకు కావాల్సింది.
“నీ రాకతో కొడుకు లేని లోటు తీరిపోయింది బాబూ. ”అన్నాడు ధనుంజయ్ అల్లుడుని సంతోషంగా చూస్తూ. మామగారు ఇంత అల్ప సంతోషా? ఇన్నాళ్ళూ గుర్తించనందుకు మనసులోనే బాధపడ్డాడు వినోద్.
రాఘవ నవ్వుతూ కొడుకువంక చూశాడు.
తన మామగారు తన బాధను అర్ధంచేసుకుని వినోద్ తో మాట్లాడి, అతనిలో మార్పు తెచ్చినందుకు కృతజ్ఞతగా చూసింది అమృత.
ఫలాలనిచ్చే జామచెట్టు కొమ్మలు నిశ్శబ్దంగా తలలూపాయి.
ఆ నీడలో సేదతీరుతున్న పక్షులు కువకువమన్నాయి.
ఒకరి కోసం ఇంకొరు జీవించడంలోనే అందరి సంతోషం దాగి ఉందన్న ప్రకృతి నియమం నిశ్శబ్ద ఛాయలలో ప్రతిఫలించింది.
………………. శుభం ………
గొర్తి వాణిశ్రీనివాస్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)
నా పేరు గొర్తివాణి
మావారు గొర్తి శ్రీనివాస్
మాది విశాఖపట్నం
నాకు ఇద్దరు పిల్లలు
కుమార్తె శ్రీలలిత ఇంగ్లండ్ లో మాస్టర్స్ చేస్తోంది
అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
రచనల మీద ఎంతో మక్కువతో
కవితలు, కథలు రాస్తున్నాను.
విశాలాక్షి, సాహితీకిరణం, సాహో,సహరి,విశాఖ సంస్కృతి,సంచిక,
ప్రస్థానం, కథా మంజరి, హస్యానందం, నెచ్చెలి, ధర్మశాస్త్రం, ఈనాడు,షార్ వాణి తెలుగుతల్లి కెనడా, భిలాయి వాణి, రంజని కుందుర్తి వంటి ప్రముఖ సంస్థలు నిర్వహించిన పలు పోటీలలో బహుమతి అందుకోవడం ఒకెత్తైతే మన తెలుగు కథలు. కామ్ వారి వారం వారం కథల పోటీలలో బహుమతులు అందుకోవడంతోపాటు
ఉత్తమ రచయిత్రిగా ఎంపిక కాబడి రవీంద్రభారతి వేదికగా పురస్కారం దక్కడం నా రచనా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది.
మానవ సంబంధాల నేపథ్యంలో మరిన్ని మంచి రచనలు చేసి సామాజిక విలువలు చాటాలని నా ఈ చిన్ని ప్రయత్నం. మీ అందరి ఆశీర్వాదాలను కోరుకుంటూ
గొర్తివాణిశ్రీనివాస్
విశాఖపట్నం
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.

@vanigorthy6887
• 3 hours ago
మీ కధ ఒ౦టె,వర్తకుడు కధ గుర్తుచేసి౦ది ,కాని మానవతా విలువలను కూడా జోడి౦చి మ౦చి... ముగి౦పు ఇచ్చారు.చాలా బాగు౦ది........వానపల్లి గంగరాజు.
@kalvalaramakrishna6141
• 17 hours ago
Good story
@XpressStudiosforyou
•20 hours ago
🎉🎉good story
@srinivasgorty3375
•20 hours ago
Good story,keep it up 🎉
@BhagavathulaBharathi-x5t
• 20 hours ago
కథ బాగుంది.సందేశాత్మకంగా వ్రాసారు.ప్రతి అల్లుడూ ఇలాగే ఉంటే జామాతా దేశము గ్రహ: అనే నానుడి నుండి సమాజం బయటపడుతుంది.