top of page

ఓ గాడిద ఆత్మ ఘోష

#VeereswaraRaoMoola, #వీరేశ్వరరావుమూల, #OGadidaAthmaGhosha, #ఓగాడిదఆత్మఘోష, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు


O Gadida Athma Ghosha - New Telugu Story Written By Veereswara Rao Moola

Published In manatelugukathalu.com On 17/06/2025

ఓ గాడిద ఆత్మ ఘోష - తెలుగు కథ

రచన: వీరేశ్వర రావు మూల


అసలు నేను అన్నా, మా గాడిదలు అన్నా మనుష్యులకు

లోకువ. లోకం లో ఎవరి నైనా తిట్టాలంటే గాడిదా,గాడిద కొడకా, అడ్డ గాడిదా అంటారు. అలా అన్నప్పుడు మా మనో భావాలు దెబ్బ తింటాయి.


కృష్ణ జననం ఎపిసోడ్ లో వసుదేవుడంతటి వాడు నా కాళ్ళని పట్టు కున్నాడు. నేను ఊహ తెలిసి నప్పటి నుండి చాకలి రాజయ్య కొంపలో పడి ఉన్నా. పగలూ,రాత్రి మూటలూ మోస్తూ గాడిద చాకిరి చెయ్యడమే. 


మా యజమాని ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వడు. ఇటీవల నా స్నేహితుడు పట్నం నుంచి వచ్చాడు. బోలెడు కబుర్లు చెప్పాడు. పట్నం లో చీకటే లేదట. రంగు రంగు ల దీపాలు. 

చూస్తే చాలు కడుపు నిండి పోతుందనీ చెప్పాడు. వాడు వచ్చి చెప్పి నప్పటి నుండి ఒకటే ఆలోచన పట్నం పోవాలనీ. కానీ రాజయ్య వదలడు. 


ఒక రోజు రాజయ్య పొరుగూరు పోయాడు. నాకు భలే అవకాశం దొరికింది. సందు చూసుకుని పట్నం పోయాను. 

ఎన్ని రంగులు, ఎన్ని వాహనాలు, ఎంత వేగం, ఎక్కడా నిలబడటానికి చోటు లేదు. తిరిగి,తిరిగి ఒక పార్కు లో చెట్టు కింద నుంచున్నా. ఎదురుగా ప్రేమికుల జంట ఉంది. 


మగాడు ఆడ దాన్ని ఒళ్ళో తల పెట్టుకొని చెబుతున్నాడు. “పెళ్ళి చేసు కుంటానని, దుబాయ్ తీసుకు వెడతానని, ఆ తర్వాత అంతా స్వర్గమని “. 


అన్నీ కోతలే ! గాడిద కొడుకు ! 


పొరపాటున తిట్టేసానే ! అక్కడ నుండి ముందుకు వచ్చాక నా మెదడు లో చాలా ఆలోచనలు వచ్చాయి. సైంటిస్టులు ఎప్పుడూ కోతి మెదడు ని, ఎలకల్ని రిసెర్చి కి వాడతారు. గాడిద మెదడు ని ఎందుకు వాడరో అర్ధం కాదు. 


గాడిదల మనోభావాలు దెబ్బ తిన్నాయి కనుక ప్రపంచ గాడిదల్ని సమావేశ పరిచి,గాడిదల హక్కుల సంరక్షణ కొరకు ఉద్యమం చేపట్టాలి. ఏమిటో అలా టౌన్ కి వచ్చానో లేదో విప్లవ ఆలోచనలు తన్నుకు వస్తున్నాయి. బహుశా పొద్దున్న నేను తిన్న సి పి ఎమ్ పొస్టర్ ప్రభావం కాబోలు. టౌన్ అని మురిసి పోయాను. ఎక్కడా గడ్డి కనబడ లేదు. ఈ జనమే నానా గడ్డి కరుస్తున్నారట. గాడిదలకు ఇళ్ళు, రవాణ సదుపాయం, వైద్య సదుపాయం అన్నీ జరిగేలా చూడాలి. నేను సైతం సమిధ గా మారాలి.డాంకీ డాట్ కామ్   ప్రారంభించాలి. 


నేను రోడ్ కి అడ్డం గా నించున్నా. ట్రాఫిక్ జామయిందని గోల చేస్తున్నారు. పోలీసు వాడు వచ్చి నన్ను కర్ర తో కొట్టాడు. ఎక్కడి నుండో పది మంది ఆడ వాళ్ళు వచ్చారు. జీవ కారుణ్య సంఘం వాళ్ళట. “మూగ జీవాల్ని హింసిస్తారా ? ఇదేనా కరుణ ?” అంటూ రోడ్ మీద ధర్నా చెయ్యడం 

మొదలు పెట్టారు. ఆ హడావిడీలో నేను సీను నుండి తప్పు కున్నా. 


సాయంత్రం ఆరు గంటల మప్పయి నిమిషాలు. కొద్ది సేపటికి పార్కు దగ్గర ఉన్న స్టేడియం కోలాహలం గా ఉంది. ఎవరో చెప్పారు ప్రముఖ హీరో సినిమా ఆడియో రిలీజ్ అని. గాడిదలకి తెలుగు ఇంగ్లీష్ వచ్చా అని సందేహించ రాదు. మనుషుల సహవాసం తో అన్నీ వచ్చాయి. ఎదురు గా జనం. ప్రతీ దానికి ఈలలు. యాంకర్ వచ్చి పాట ఆవిష్కరణ అని చెప్పింది.


“పీ పీ అంటాడు ఆటో అప్పారావు” అంటూ పాడింది. నాకు నచ్చ లేదు. నా పాట కన్నా మధురంగా లేదనిపించింది. స్టేజి దగ్గరికి వెళ్ళి నా పాట వినిపించాలని ఉబలాట పడ్డాను. 

జనం.. ఏలా వెళ్ళాలి ? కష్ట పడి నక్కి నక్కి స్టేజివెనక్కి వచ్చాను. స్టేజి మీద సంగీత దర్శకుడు ‘మ్యూజికల్ హిట్టయి సినిమా వంద రోజులు గ్యారంటీ’ అంటున్నాడు. 


రేపు కే గ్యారంటీ లేదు వంద రోజులు.. అని విసుక్కున్నా. 

స్టేజి ఎక్కి మూలన నక్కాను. ఎవరూ చూడ లేదు. అమ్మాయి పాడుతోంది. కింద కుర్ర వెధవలు గెంతుతున్నారు. పాట ఆగ గానే “దాని బొంద అదేం పాడుతుంది నా పాట వినండి” అంటూ గార్ధభ స్వరాన్ని విసిరాను. కింద సగం మంది పడ్డారు. హార్ట్ వీక్ వాళ్ళు పైకి పోయారు. “ఛీ ఛీ వెధవ గాడిద ఎక్కడ నుండీ వచ్చింది ? ఎవరూ లేరా ?“ అన్నాడు. 


 కేకలు.. గందర గోళం. 

ఎవడో గాడిద కొడుకు ( అరే నోరు జారిందే !). నా అదృష్టం బాగుండి, కరెంట్ పోవడం తో వీళ్ళ కీ సంగీతం తెలీదు అనుకొని బ్రతుకు జీవుడా అని బయటపడ్డాను. కొంచెం దూరం వచ్చాక రాజయ్య ఎదురయ్యాడు. 


“ఓసి నీ.. నువ్వు ఆడియో ఫంక్షన్ కి వచ్చావా ? “ అని నా చెవి నులిమి పల్లెకు తోలుకు పోయాడు. నా మనో భావాలు మళ్ళీ దెబ్బ తిన్నాయి. ఈ సారి సరైన ప్రణాళిక తో వచ్చి గాడిదల హక్కుల కోసం పోరాడాలని అని నిశ్చయించుకున్నా. 


సమాప్తం  


వీరేశ్వర రావు మూల  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

క‌వి, ర‌చ‌యిత‌. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా ప‌నిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో క‌థ‌లు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వంద‌కు పైగా క‌విత‌లు వివిధ వెబ్ ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది. 






Comentaris


bottom of page