ఉచితం - అనుచితం
- Palla Venkata Ramarao
- Jun 17
- 4 min read
#PallaVenkataRamarao, #పల్లావెంకటరామారావు, #UchithamAnuchitham, #ఉచితంఅనుచితం, #TeluguMoralStories, #నైతికకథలు, #TeluguChildrenStories

Uchitham Anuchitham - New Telugu Story Written By - Palla Venkata Ramarao
Published In manatelugukathalu.com On 17/06/2025
ఉచితం - అనుచితం - తెలుగు కథ
రచన: పల్లా వెంకట రామారావు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
అనగనగా ఆనందపురం అనే రాజ్యాన్ని అనంత వర్మ అనే రాజు పాలించేవాడు. సుభిక్షమైన రాజ్యం. ఏడాదికి రెండు పంటలు పండిస్తూ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండేవారు. రాజు గారి ఖజానా కూడా కాసులతో కళకళలాడుతూ ఉంది. అయితే వరుసగా రెండు సంవత్సరాలు వాతావరణ మార్పుల కారణంగా వర్షాలు అరాకొరగా పడ్డాయి. దాంతో వ్యవసాయం కుదేలయింది.
ఆ ప్రభావం మిగతా వృత్తులపై కూడా పడి అందరూ కరువు పరిస్థితులను ఎదుర్కోసాగారు. ఖజానా నిండా ధనం అయితే ఉంది కానీ తిండి గింజలు దొరకడం లేదు. ప్రభుత్వ ఆధీనంలో ధాన్యం లేకపోలేదు, కానీ అది పంచితే కొద్ది రోజులకే ఖాళీ అవుతుంది. తరువాత సైన్యానికి గాని అంతఃపుర వాసులకు గాని ఆహార కొరత ఏర్పడితే పరిస్థితి మరింత దిగజారుతుంది. అది రాజ్య క్షేమానికి ప్రమాదం.
పరిస్థితి ఇలా ఉంటే ఒకరోజు మంత్రి ఒక సమాచారం మోసుకొచ్చాడు. ఆహారకొరత వల్ల కొందరు రాజ్య ప్రజలు అడవుల మీద పడ్డారనీ, జంతువులను వేటాడి వాటిని ఆహారంగా తీసుకుంటున్నారని చెప్పాడు. విన్న రాజు దానిపై ఏమి మాట్లాడలేదు. మరి కొన్ని రోజులకు మంత్రి మళ్లీ అదే విషయంపై తాజా సమాచారం తీసుకొచ్చాడు.
జంతువుల వేట ఉధృతంగా సాగుతోందనీ, ప్రజలు వన్యప్రాణులను చంపి తినడమే కాకుండా వాటిని కరువు లేని పొరుగు రాజ్యాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారని తెలిపారు. అడవుల్లో వన్యప్రాణులు పూర్తిగా నశిస్తే ప్రమాదమని ఆందోళనగా చెప్పాడు.
దాంతో రాజు వెంటనే "మంత్రివర్యా! తక్షణం దండోరా వేయించండి. అడవిలో వేటాడిన జంతువులను మనకే తెచ్చి విక్రయించమని చెప్పండి. బయటి రాజ్యాల్లో విక్రయించినా, వాటిని చంపి తిన్నా కఠిన శిక్ష ఉంటుందని చెప్పండి" అన్నాడు.
వెంటనే గ్రామగ్రామాన దండోరా మోగింది. అడవిలో వేటాడి తెచ్చిన వన్యప్రాణులను చంపి తినరాదని, ప్రభుత్వానికి విక్రయిస్తే తగిన ధర ఇవ్వబడుతుందని ఆ ప్రకటన సారాంశం.
ప్రజలు వందల సంఖ్యలో తాము వేటాడిన వన్యప్రాణాలను తెచ్చి ప్రభుత్వ స్వాధీనం చేశారు. వారికి తృణమో పణమో ఇచ్చి పంపారు అధికారులు.
మంత్రి రాజు వద్దకు వెళ్లి "రాజా! మీరు చెప్పినట్లే చేశాం. ఇప్పుడు వందల సంఖ్యలో వన్యప్రాణులు మన దగ్గరికి చేరాయి వాటిని ఏం చేయాలో చెప్పండి" అని అడిగాడు.
"ఉద్యానవనం పక్కన విశాలమైన ఖాళీ స్థలం ఉంది. అక్కడ ఈ ప్రాణుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయండి. రాజ్యంలోని ప్రజలు ముఖ్యంగా బాలబాలికలు ఆ సంరక్షణ కేంద్రాన్ని విధిగా సందర్శించాలని చెప్పండి" అన్నాడు రాజు.
రాజు చెప్పినట్లే చేశారు అధికారులు.
కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అన్నట్లు కొద్దిరోజులకు అడవుల్లోని వన్యప్రాణులు తగ్గిపోయాయి. ఉన్న కొద్దిపాటి జంతువులు ఎక్కడో దాక్కుని ఉండిపోయాయి. వేటకు దొరకడం లేదు. ఇక్కడ చూస్తే సంరక్షణ కేంద్రం ప్రజలు పట్టి తెచ్చిన జంతువులు, పక్షులతో నిండిపోయింది. ఇదే విషయాన్ని రాజుకు నివేదించాడు మంత్రి.
వెంటనే రాజు సంరక్షణ కేంద్రంలో ఉన్న జంతువులు, పక్షులను అడవిలో వదిలి పెట్టమన్నాడు. రాజు నిర్ణయం కాస్త అయోమయంగా తోచినా, రాజాజ్ఞను వెంటనే అమలు చేశాడు మంత్రి.
అడవిలో జంతువులు దొరుకుతున్నాయని తెలియగానే మళ్లీ ప్రజలు అడవి బాట పట్టారు. వాటిని వేటాడి తీసుకురాగా మళ్లీ రాజు ప్రజల నుండి వాటిని కొని సంరక్షణ కేంద్రానికి తరలించడం మొదలుపెట్టాడు.
ఇదంతా చూసిన మంత్రి రాజు దగ్గరికి వెళ్లి "అదేంటి రాజా! మన సంరక్షణలో ఉన్న జంతువులను తీసుకెళ్లి అడవిలో వదిలేయమన్నారు. మళ్ళీ వాటిని తిరిగి కొంటున్నారు. ఎందుకు అలాగా చేయడం?" అని ప్రశ్నించాడు.
దానికి రాజు సమాధానం ఇస్తూ "ప్రజలు కరువుతో అల్లాడుతున్నారు. మన దగ్గర చాలినంత ధాన్యం లేదు. అలాంటప్పుడు వేటను నిషేధిస్తే వారు ఆకలితో చనిపోయే ప్రమాదం ఉంది. లేదా మనపై తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. అందుకని వాళ్ళని వేటాడనిచ్చాను. అయితే పూర్తిస్థాయిలో వేట కొనసాగితే అడవిలోని జంతువులు, పక్షులు పూర్తిగా నశిస్తే అనేక సమస్యలు కూడా ఎదురవుతాయి. ప్రకృతి సమతుల్యత దెబ్బ తింటుంది. అందుకని వారి నుంచి తిరిగి కొనుగోలు చేశాను.
మన ఖజానాలో డబ్బుకు లోటు లేదు కదా. ఆ విధంగా మనం ఇచ్చిన డబ్బుతో వారు ఇతర రాజ్యాల నుంచి ధాన్యము, ఆహార పదార్థాలు కొనుగోలు చేశారు. అయితే ఆ డబ్బు ఎక్కువ రోజులు ఉండదు కదా అందుకని మళ్ళీ వేట మార్గం ఎంచుకున్నారు. కానీ అక్కడ వన్యప్రాణులు తగ్గిపోయాయి. అందుకని సంరక్షణ కేంద్రంలోని ప్రాణులను మళ్లీ అడవిలోకి వదిలాను. ఇప్పుడు వారు మళ్ళీ వేటకు వెళ్తారు. తిరిగి మనకు జంతువులు తెచ్చి ఇస్తే మనం తగిన మూల్యం చెల్లించి కొనుగోలు చేస్తాం" అన్నాడు.
దానికి మంత్రి "మనమే జంతువులను అడవిలోకి వదిలి, మనమే మళ్ళీ కొనుగోలు చేయడం వల్ల మనం వారికి ఉచితంగానే డబ్బు ఇచ్చినట్లు అవుతుంది కదా! దానికి బదులు అదేదో ప్రత్యక్షంగా ఉచితంగానే దానం చేస్తే సరిపోతుంది కదా! మనకు కీర్తి కూడా లభిస్తుంది" అన్నాడు.
దానికి రాజు నవ్వుతూ "లేదు మంత్రిగారు! ఉచితం అనేది చాలా ప్రమాదం. మనం ఉచితంగా డబ్బు ఇవ్వడం వల్ల దానికి అలవాటు పడి రేప్పొద్దున ఏ పనీ చేసుకునే ఆలోచన వారికి రాదు. అలవాటు పడితే అది ఒక హక్కుగా భావించే ప్రమాదం ఉంది. వారికి ఏదో ఒక పని ఉండాలి. వారు కష్టపడాలి. అలా వచ్చిన ధనము ఒక్క వరహా అయినా సరే వారికి ఎంతో విలువైనదిగా తోస్తుంది. తేరగా వచ్చిన ధనానికి విలువ ఉండదు. అందుకే నేను ఈ పద్ధతిని ఎంచుకున్నాను" అన్నాడు రాజు.
మీ నిర్ణయం సబబే అన్నట్టు తలూపాడు మంత్రి.
-----------------------------------------------------
పల్లా వెంకట రామారావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పల్లా వెంకట రామారావు
Profile Link:
జన్మస్థలం: ప్రొద్దుటూరు, కడప జిల్లా.
జననం: 1974
తల్లిదండ్రులు:కీ.శే. శ్రీ రామయ్య, శ్రీమతి ఓబులమ్మ
చదువు: ఎం.ఎ (తెలుగు), టి.పి.టి, డిప్లమో (కంప్యూటర్స్) (జర్నలిజం)
ఉద్యోగం: స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)
అభిరుచి: సాహిత్యం, దర్శకత్వం, నాణేల సేకరణ, యాత్రలు చేయడం(యూట్యూబ్ వ్లాగ్స్) travel India telugu
(యూట్యూబ్ చానల్ , Id:@travelIndia82)
రచనలు: 'ది అటాక్' నవల, పూలుముళ్ళు, (మినీ నవల) గేయం,
వచన కవితలు, హైకు, నాటిక, కథలు, పద్యం,
బాలల కథలు, జోక్స్, వ్యాసాలు, వంటివి. సాక్షి, ఈనాడు, వార్త,అల
ఉపాధ్యాయ వాణి, బాలభారతం, చంద్రబాల, సూర్య, బాలల
బొమ్మరిల్లు, ఆంద్రభూమి వంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
సత్కారాలు: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, పండిత పరిషత్ వారిచే స్టేట్ అవార్డు,రాజుపాళెం
మండలం వారిచే ఉగాది పురస్కారం; అటా వారిచే , సాహితీ మిత్ర మండలి, యువ
కళావాహిని, కడప జిల్లా రచయితల సంఘం,రామరాజ భూషణ సాహితీ పీఠం, అనంతపురం జిల్లా
రచయితల సంఘం, తెలుగు కళా వేదిక,వేమన సాహితీ కళాపీఠం, కొని రెడ్డి ఫౌండేషన్ , తెలుగు రక్షణ
వేదిక, కర్ణాటక తెలుగు రచయితల సంఘం, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థలచే సత్కారం.
Comments