నర్తనశాల - పార్ట్ 3
- Ayyala Somayajula Subramanyam
- Jun 16
- 7 min read
Updated: Jun 22
#AyyalaSomayajulaSubrahmanyam, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #Narthanasala, #నర్తనశాల, #అజ్ఞాతవాసం, #పురాణం, #Devotional, #TeluguSerialEpisodes

Narthanasala - Part 3 - New Telugu Web Series Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 16/06/2025
నర్తనశాల - పార్ట్ 3 - తెలుగు ధారావాహిక
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
అజ్ఞాతవాసం కోసం పాండవులు విరాటరాజు కొలువులో వివిధ వేషాలలో చేరుతారు. భీముడు మల్ల యుద్ధంలో జీమూతుడిని వధిస్తాడు. కీచకుడు ద్రౌపదిని మోహిస్తాడు.
ఇక నర్తనశాల - పార్ట్ 3 చదవండి..
దానితో అక్క సుధేష్ణ మహారాణిని సమీపించి ఇట్లు విన్నవించెను: సోదరీ, నీవు ఏవిధంగానైనను, ఎలాగైనను నీ సైరంధ్రినీ, నా ప్రేయసి అయ్యేలా చూడుము. నేను ఆమెపై మరులుగొన్నాను. కామకోరికతో దహించుకుపోతుంటిని. నీవు నాకు తోడ్పడకున్నచో నేను నా ప్రాణములు విడిచెదను.
సుధేష్ణ తన దుష్టుడైన సోదరునితో ఇటుల పలికెను: సోదరా, కీచకా; నేను పథకమును రచించెదను. నా సైరంధ్రిని మధిరను తీసుకు రమ్మని నీ వద్దకు పంపెదను. ఆ ఏకాంత వాతావరణంలో నీవు ఆమె అభిమానమును సాధించుటకు ప్రయత్నించుము.
ఆ పలుకులు కీచకునిలో ఆశను రగిలించెను. అతడు తన భవనమునకు తిరిగి వెళ్ళి ఉత్తమ రకపు మధిరను సేకరించి, విలాసవంతమైన విందుకు ఏర్పాట్లు చేసుకొనెను. అట్లు ఏర్పాట్లు పూర్తి చేసుకొని పిమ్మటనే సోదరికి కబురు పంపెను.
దానితో ఆమె ద్రౌపదిని పిలిచి ఇట్లు ఆజ్ఞాపించెను: సైరంధ్రి.. దయచేసి నా సోదరుని భవనమునకు వెళ్ళి కొంత మధిరను తీసుకురమ్ము.
ద్రౌపది ఇటుల సమాధానమిచ్చెను: మహారాణీ; కీచకుడు నిర్లజ్ఞుడైన కాముకుడు. సేవలో చేరకముందు ఎవరిని ఉద్దేశపూర్వకంగా తమ ఆదేశాలను నా పై బలవంతంగా ప్రయోగింపరాదనే నిబంధనతో మీ సేవను అంగీకరించితిని. దయచేసి మరింకెవరినైనను పంపగలరు.
కానీ సుధేష్ణ పట్టుదలగా ద్రౌపది చేతుల్లో ఒక స్వర్ణ పాత్రను పెడుతూ ఇలా పలికెను: సైరంద్రీ, ఈ అర్థరహితమైన భయాలను విడిచిపెట్టుము. నిన్ను నేను పంపుట చేత నా సోదరుడు నిన్ను అవమానించుటకు అవకాశము ఉండదు.
చివరకు ద్రౌపది అయిష్టంగానే వెళ్ళెను. దారిలో వెళుతూ ఆమె తన పాతివ్రత్యానికి రక్షణ కొరకు దేవతల సహాయము అర్థించెను. ద్రౌపది ఆ తరువాత కీచకుడి భవనమునకు పయనమయ్యెను.
తన భవనములో ద్రౌపది ప్రవేశించుట చూచిన కీచకుడు ఎంతగానో ఆనందిస్తూ ఇలా భావించసాగెను: మూర్ఖముగా నన్ను తిరస్కరించినందుకు ఆమె పశ్చాత్తాపం చెంది
ఉండును. కీచకుడు ద్రౌపదిని స్వాగతిస్తూ నేరుగా ఇటుల ప్రతిపాదించెను: ఓ సుందరి, నిన్ను నా రాణిగా అంగీకరించుటకు మరియు నా సమస్తమును నీకు సమర్పించుటకు మిక్కిలి ఉత్సుకత తో ఉన్నాను.
ద్రౌపది ధృడచిత్తముతో ఇటుల బదులిచ్చెను: మహారాణి వారు దప్పిక గొని యున్నారు. వారు మధిరను తీసుకురమ్మని నన్ను పంపిరి. ఆలస్యము లేకుండ తిరిగి ఆమె వద్దకు వెళ్ళ
వలెను. దయచేసి మధిరను ఇవ్వగలరు.
కీచకుడు ఇటుల పలికెను: మరింకెవరెవరైనను మధిరను పట్టుకు వెళ్ళి ఇచ్చెదరు అంటూ ద్రౌపది కుడి చేతిని పట్టుకుని లాగెను. ద్రౌపది తీవ్రమైన క్రోధముతో కీచకుడి నిందిస్తూ ఇలా పలికెను..
”పాపాత్ముడా; త్వరలోనే నీవు శవము కాగలవు. నీ శవమును నా పతులు రుద్రభూమిపై ఈడ్చుటను చూచి ఆనందించెదను.
ద్రౌపది తన చేతిని విదిలించుకుని పారిపోతుండగా కీచకుడు ఆమె చీర కొంగును చేజిక్కించుకొనెను.
ద్రౌపది అది సహింపలేకపోయెను. భారీశ్వాసతో, ఆగ్రహముతో కంపిస్తూ ఆమె కీచకుని బలముగా వెనుకకు త్రోసెను. దానితో అతడు నేలపై పడిపోయెను. ద్రౌపది విరాటరాజు సభాభవనము వైపునకు పరుగెత్తసాగెను. అక్కడ యుదష్టిరుని ఆశ్రయింపదలచెను.
కీచకుడు వెంటనే పైకి లేచి ద్రౌపది ని వెంబడించెను. వారిద్దరూ మహారాజు సమక్షము లోనికి వచ్చిరి. నిర్లజుడు, దుర్మార్గుడు ఆమె జుట్టును పట్టుకుని కింపడవేసెను. ద్రౌపది తన బలము కూడ దీసుకుని గొప్ప బలముతో అతడిని మరల వెనుకకు పడద్రోసెను.
ఆ సమయములో భీముడు మరియు యుధిష్టరుడు రాజ భవనములోనే ఉండిరి. ఆ దృశ్యమును వారు సహించలేక పోయిరి. క్రోధముతో పళ్ళు నూరుచూ, కనుబొమ్మలు పైకి ముడిచినట్టి భీముని మొహము వికృతముగా మారెను. అతడు కీచకుని వైపు పరుగెత్తదలచుటతో వారి
అజ్ఞాతవాసానికి భంగమగుననే భయముతో యుధిష్టరుడు అతడిని వారించెను.
ద్రౌపది లేచి నిలబడి తన భర్తలు స్పందించక పోవుటతో బాధ మరియు ఆగ్రహముతో కళ్ళు ఎర్రబడెను. ఆగ్రహించిన ద్రౌపది వారి కళ్ళ ఎదుటనే కీచకుడు తనను పరాభవించుట చూచిను స్పందించని విరాటరాజును మరియు అతని మంత్రులను కఠిన పలుకులచే దూషించెను.
మహారాజు ఇట్లనెను: నీకు మరియు కీచకుడికి నడుమ వివాద వివరాలను తెలియకుండ నేను ఎట్టి చర్యలు తీసుకొనలేను. ద్రౌపది విషయమునంతటినీ విఫలముగా వివరించెను. యుధిష్టరులు ద్రౌపదిని ఉద్దేశిస్తూ ‘ఓసౌభాగ్యవతి, నీవు మహారాణి సుధేష్ణ భవనమునకు తిరిగివెళ్ళుము. నీ గంధర్వ భర్తలు ఇప్పటికిప్పుడు నీ రక్షణ కొరకు రాకపోయినను వారు తప్పకుండ దీనికి తగిన ప్రతీకారం తీసుకొందురేమో? నీవు వూరికే ఇచట అధిక ప్రసంగము, నాట్యము చేయవద్దు” అని మందలించెను.
చెదిరిన జుట్టు మరియు క్రోధముతో ఎరుపెక్కిన కళ్ళతో. ద్రౌపది ఇటులపలికెను.
“అవును. నా పతులు జూదరులు, నటులు అయినచో నాకు కూడా అవే అబ్బును కదా;” అనెను.
యుధిష్టరుడు తల దించుకొన్నాడు. పిమ్మట ద్రౌపది అచటనుంచి అంతఃపురము వైపునకు వెళ్ళిపోయెను.
ద్రౌపది ఇటుల ఆలోచించసాగెను. ”ఈ దుస్సంఘటన చేత ఏర్పడిన భరింపరాని అవమాన దుఃఖము నుండి నేను ఎలా బయటపడగలను. ? నాకు ఉన్నట్టి ఒకే ఒక ఆశ్రయం భీముడు. అతడు మాత్రమే మర్యాద, నైతికత వంటి పలుకులను లెక్కచేయకుండా ఎల్లప్పుడు నన్ను
సంతోషపరచుటకు సిద్దముగ నుండును.
అలా నిశ్చయించుకొనిన ద్రౌపది అర్ధరాత్రి సమయములో పాకశాలలో భీముడు నిదిరిస్తున్న చోటుకు వెళ్ళెను. దౌత్యనీతిని ఎరిగి పాంచాలరాకుమారి మెల్లగా తట్టుతూ లేపసాగెను.
“భీమసేనా; నిదురలెండు. మీకు నిదుర ఎలా వస్తున్నది? నన్ను అవమానించిన వ్యక్తి జీవించియుండగనే, మీరు ఎటు నిద్రింపోగలుగుతుంటిరి?”
భీమసేనుడు ఉలిక్కిపడి లేచి ఇటుల అడుగును. “దేవీ: ఈ సమయములో మీరు రాకగల కారణము. విషయమేమిటీ? మీ అసంతృప్తి కి గల కారణమును తెలిపినచో, నేను తప్పక తీర్చెదను. ”
తన దీనస్థితి ని భరించు ప్రక్రియలో ఏర్పడిన ఒత్తిడిని ద్రౌపది భరించలేకపోయెను. కనుకనే ఆమె ఇదే అవకాశముగా తీసుకుని తనలోని దుఃఖమును బయటకు వెళ్ళగ్రక్కెను. తన మరియు భర్తల దురదృష్టకర పరిస్థితి పట్ల మిక్కిలి నిరాశతో ఉన్నట్టి ద్రౌపది, యుధిష్టరుని పాచికలాట పట్ల ఆసక్తి యే తమ బాధ లన్నింటికిని కారణమని విమర్శించాను.
అన్నగారి జూదాసక్తి చేత నీకు పాచకునిగా మారవలసి వచ్చుటను నేను భరించలేకుంటిని. భయంకరమైన మదగజములు మరియు సింహాలతో పోరాడ వలసిందిగా నిన్ను ఆజ్ఞాపించినఫుడు నేను మీ ప్రాణాలను గూర్చి భయపడితిని. నిజమునకు నేను అప్పుడు దాదాపు స్పృహ కోల్పోసాగితిని. కానీ నిలద్రొక్కుకుని నిలిచి దగ్గర ఆసనములో కూర్చుంటిని.
అప్పుడు అచటకు రథయోధులలోకి, విలుకాండ్రలోకి అగ్రగామియైన అర్జునుడు ప్రపంచమంతటిని జయించగల సమర్థుడు, ఇఫుడు స్త్రీవేషధారణతో, జుట్టుముడుచుకుని, చేతులకు గాజులు మరియు చెవులకు కుండలాలు ధరించి వచ్చెను.
యుదిష్టరుని ద్రౌపది తూలనాడుట సహించలేక ఈ క్రింది పద్యమును ఆలపించెను.
“ఎవ్వాని వాకిట నిభమద పంకంబు, రాజభూషణ రోజాది నడగు
ఎవ్వాని చారిత్ర మెల్లలోకములకు, నొజ్జయై వినయంబు నొఱపు గఱపు
ఎవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి, మానిత సంపద లీనుచుండు
ఎవ్వాని గుణలత లేడువారాశుల, కడపటి కొండపై గలయు బ్రాకు
నతడు భూరిప్రతాప మహాప్రదీప, దూర విఘటిత గర్వాంధకార వైరి
వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రి, తలుడు కేవల మర్త్యుడె ధర్మసుతుడు.
మనది అంతా వినికిడి భారతము కాబట్టి ఎక్కువగా భీమార్జునులను గూర్చి వారి శౌర్యపరాక్రమాదుల గురించి విన్నాము కానీ ఈ పద్యాన్ని చదివిన తరువాత “ఆ.. ధర్మరాజు నిజంగా యింత గొప్పవాడా;” అని ఎవరూ అనుకోకమానరు.
ఈ పద్యం ఎత్తుగడలోనే మనసులని కట్టి పడేసే అద్భుతమైన అలంకారాన్ని ప్రయోగించినారు తిక్కన్నగారు. దానికి ధీటైన నడక.
ధర్మరాజు వైభవాన్ని మనకు కళ్ళకు కట్టినట్లు చూపించినాడు. రెండవపాదంలో అతని స్వభావాన్ని, ప్రసిద్దిని వర్ణించినాడు. మళ్ళీ మూడవపాదంలో అతని సంపద, వైభవాలను గూర్చి తెలుపుతూ, నాలుగవ పాదములో అతని కీర్తి ప్రతిష్టలను కీర్తించుతాడు.
ఆ పిదప ద్రౌపది నకుల సహదేవుల చేయు వృత్తుల గురించి బాధ పడెను. ఇక నా గురించి ఏమి తెలుపను. నాకు దుఃఖపూరితమైన పరిచారిక జీవితమును గడప
వలసి వచ్చినది.
మనము కూడ త్వరలోనే సుఖసమృద్దులను సాధించగలమనే ఒకే ఒక్క ఆశతో ఈ దౌర్భాగ్యపు జీవితమును అనుభవిస్తుంటిని. కానీ అది కూడ ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేం. ఎందుకనగా మనమందరమూ. విధి చేతిలో ఆటబొమ్మలము.
శక్తిమంతులైన భర్తలు, సోదరులు, పుత్రులు మరియు బంధువుల నడుమ ఉండి కూడా మరే ఇతర స్త్రీ ఇంతటి దుర్భరమైన జీవితమును భరించగలదు. ? ఈ చేతులను చూడుము. గతములో అత్తగారిని కుంతీదేవి కొరకు గంధము అరగదీయుటకు ఉపయోగించితిని.
ఇప్పుడు ఇవే చేతులు ఇతరులకు సేవ చేయుటకు శ్రమించుచున్నవి. ”
ఆమె చేతులు పట్టుకుని భీముడు ఆమెను ఓదార్చుతూ తనను తాను నియంత్రించుకొని ఇటుల అనెను. ’ దేవీ; కీచకుడు నిన్ను పడవేసినప్పుడు చూసిన నేను మత్స్యదేశమును మట్టిపాలు చేయుటకు నిశ్చయించు కొంటిని. అగ్రజులు వారించుటతో నేను నా ఆగ్రహమును నిగ్రహించుకొని ఎట్టి ప్రతీకారము చేయకుంటిని.
నాలో రగులుతున్నట్టి క్రోధము నా ప్రతీకారమును దహిస్తున్న భావనను అనుభవించితిని. దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునిల పై నా ప్రతీకారం ఇంకను తీర్చుకోలేకపోవుట చేత నా గుండెల్లో బల్లెము దిగబడినటులుగా కలదు.
దేవీ; నీవు నీ కోపమును నియంత్రించు కొనుము. గతములో ధర్మాత్ములైన తమ భర్తలను అనుసరిస్తూ పతివ్రతామ తల్లులు ఎట్లు అనేకానేక బాధలను అనుభవించారో
స్మరిస్తూ నిన్ను నీవు స్వాంతన పరచుకొనుము. స్వయం విష్ణుభగవానుని సహచరిణియైన సీతామాతను స్మరించుము. మరికొంతకాలము ఓర్పు వహించుము”
ఆ తరువాత కీచకుడు పదేపదే తనతో వ్యవహరించిన తీరును ద్రౌపది వివరించెను. చివరకు ఆమె ఇటుల అనెను. “స్వామీ; ఇప్పుడు నేను ఈ సంఘటనానంతరము, నేను
తిరిగి అతని కళ్ళ బడినచో కీచకుడు నామీద మరల అఘాయిత్యమునకు పాల్పడును. కనుక ఇక ఏ ఆలస్యం చేయకుండా ఆ దుర్మార్గుని వధింపుము. లేనిచో అట్టి అవమానాలు మరల మరల సంభవింపగలవు. మరల అటువంటి పరిస్థితి ఎదురైనచో నేను తప్పక నా
ప్రాణములు విడిచెదనని’ రోధించెను.
ద్రౌపది భీమసేనుని గుండెలపై వాలి పొగిలి పొగిలి ఏడవసాగెను. భీముడు ఆమె కన్నీరు తుడుస్తూ ఆమెను గుండెలకు హత్తుకుని ఓదార్చెను. అప్పుడు అర్జునుడు ఒక ఉపాయమును చెప్పెను.
”దేవీ; విరాటరాజు క్రొత్తగా నిర్మించిన నర్తనశాల లో ఈ రోజు సాయంత్రము కలుసుకొనెదనని కీచకునికి సమాచారం పంపుము. పగలంతా కన్యలు అక్కడ నాట్య
మభ్యసిస్తుందురు. కీచకునితో అన్న భీమసేనునితో సమావేశము ఏర్పాటు చేయుము. చీకటి పడిన తరువాత అక్కడ నిర్మానుష్యముగా ఉండును.
నీవు కీచకుణ్ణి ఆకర్షించి అక్కడకు రప్పించుము. మిగిలిన కార్యక్రమము అన్నగారు నిరాటంకంగా నిర్వహించెదరు”
అటుపిమ్మట ద్రౌపది ఆ రాత్రి తిరిగి తన గదిని చేరుకొనెను. మరుసటిరోజు ఉదయము కీచకుడు ఆమెను కలుసు కొనుటకు రాజభవనమునకు చేరుకొనెను. మరోసారి ద్రౌపదితో తనను అంగీకరించమని అభ్యర్థించెను.
ఆహ్లాదకరముగా, ఆనందముగా, ఆశ్చర్యమును కలిగిస్తూ ద్రౌపది ఇలా పలికెను. ”ఓ, వీరాగ్రేసరా;మన సమాగమును రహస్యంగా ఉంచవలెను. నిబంధన నీవు అంగీకరించిన, నేను నీ కౌగిలిలోకి చేరెదను. నీ సోదరులకు గానీ నీ పత్నులకు కూడా తెలియకూడదు. ”
కీచకుడు ఆ నిబంధనను సంపూర్ణముగా ఉత్సాహముగా అంగీకరించెను. అప్పుడు ద్రౌపది ఇటుల పలికెను “ఓ సుందరాంగ; ఈ రాత్రికి నర్తనశాల కు విచ్చేయుము. అక్కడ నీ కొరకు ఆతురతతో ఎదురు చూస్తుందును.”
కీచకుడు ఆనందంతో తన భవనమునకు చేరుకొని తన కామవాంఛ తీరబోతోందని భావిస్తూ తనను తాను అలంకరించుకోనారంభించెను. ద్రౌపది ధ్యాసలో మునిగిన కీచకుడు కాలము మందగమనమును కలిగి ఉన్నదని, పగలు ఎంతకూ అంతమగుట లేదని భావించెను. ద్రౌపది కూడ కీచకుని పలుకులను మరియు చేష్టలను స్మరిస్తూ అతని అంతమును చూచు సమయము భారముగా గడుస్తుందని భావించెను.
ద్రౌపది పాకశాలకు వెళ్ళి పథకము ప్రకారము కీచకుడు రాత్రికి నర్తనశాలకు వచ్చునట్లుగా ఏర్పాటు చేసితినని భీమునితో చెప్పెను. భీముడు కీచకుని వధించుటకు అవకాశము లభించినందులకు కడు సంతసించెను. చీకటి పడిన పిమ్మట భీముడు నర్తనశాల లో ప్రవేశించి
అక్కడి మృదువైన పరుపుపై కూర్చుని, సింహము జింక రాకకోసం ఎదురు చూచునట్లు అతడు కీచకుని కొరకు ఎదురు చూడసాగెను.
అందముగా అలంకరించుకొనిన కామాంధుడైన కీచకుడు నర్తనశాల లోకి ప్రవేశించి భీముడు వేచి ఉన్నట్టి శయ్యను సమీపించెను. అంధకారంలో ఆ శయ్యపై ఉన్నది ద్రౌపది
యని భావించెను. అతడిని తన చేతితో స్పృశిస్తూ ఇటుల అనెను. “ఓ, చంద్రవదనా; గొప్ప సంపదలతోనూ, అనేకమంది పరిచారికలతోనూ ఏర్పరచబడిన నా విశాలమైన భవన మందిరమును ప్రక్కనబెట్టి నీ కొరకు ఇక్కడకు వచ్చితిని”
అందుకు భీముడు వ్యంగముగా ఇటుల బదులిచ్చెను. “ఓ వీరుడా; ఈ రాతిరి నిన్ను ఇలా కలుసుకొనుట నా అదృష్టం. ప్రేమికునిగా నీవు ముల్లోకాలలోనూ సాటిలేని వాడివని విని
ఉంటిని. అంతేకాకుండా నా వంటి స్త్రీని నీవు ఇంతవరకూ చూచి ఉండవు. ”
అట్లు పలుకుతూ భీముడు ఒక్కసారిగా శయ్యపై నుండి దూకి నిలుచుని బిగ్గరగా నవ్వుతూ ఇట్లు గర్జించెను. “ఓరీ, కీచకా; నేను సైరంధ్రి గంధర్వపతిని. నీ దుర్మార్గములు నేటితో చెల్లు. నేటితో నీ ఆయువు మూడినది, ”
ఇట్లు పలికి భీమసేనుడు కీచకుని జుట్టు పట్టుకుని లాగెను. కీచకుడు విదిలించుకుని భీముని చేతులు పట్టుకొనెను. ఇరువురు నడుమ తీవ్ర ద్వందయుద్దము జరిగినది. ఆగ్రహముతో కీచకుడు మరియు భీముడు హింసాత్మకముగా ఒకరినొకరు బాధించుకొనసాగిరి. కొంతసమయమునకు కీచకుడు అలసిపోయెను. అతని శరీరమంతయూ కంపించసాగెను. కీచకుడు భీముని మీద గెలువవలెనని చివరిసారిగా ప్రయత్నిస్తూ దూసుకెళ్ళి కాళ్ళతో తన్నెను.
భీముడు కింద పడి వెనువెంటనే లేచి కీచకుని గుండెలపై బలముగా మోదెను. భీముడు తన ప్రత్యర్థి బలహీన పడటం గమనించెను. అతడు కీచకుని జుట్టు పట్టుకుని లాగి తన చేతులతో బలముగా అదిమి పట్టుకొనెను. తరవాత భీముడు కీచకుని స్పృహ కోల్పోయేంతవరకూ గిరగిరా త్రిప్పుతూ బలముగా నేల కేసి కొట్టెను.
క్రూరజంతువును వధించినట్లుగా భీముడు ఒకవైపు కీచకుని గొంతు నులుముతూ, మరోవైపు తన కాళ్ళతో అతని ఊపిరి ఆడకుండా చేసెను. దానితో కీచకుని ప్రాణములు యమపురికి చేరినవి.
భీముడు తన కార్యమును పూర్తిగా నెరవేర్చుకొనుటకు క్రోధముతో కీచకుని శరీరమును ఆకారము లేని మాంసపు ముద్ద వలె మార్చివేసెను. ద్రౌపది అక్కడే ఉండెను. ఆమె తృప్తి కొరకు భీముడు వెలుగు చున్న కాగడాను తీసుకు వచ్చి కీచకుని అవయవాలను ఆమెకు చూపెను. తన భార్య పట్ల తన బాధ్యతను నెరవేర్చిన తృప్తితో భీముడు గొప్ప భారము నుండి విముక్తుడైనట్లుగా భావించెను.
తరువాత అతడు తిరిగి పాకశాలకు చేరుకునెను. ద్రౌపది ఆనందంతో దగ్గరలోని నర్తనశాల పరిచారకులకు కీచకుని తన గంధర్వ భర్తలు వధించారని కీచకుని శవమును చూపెను. వారు దివిటీలతో తల, మెడ, కాళ్ళు మరియు చేతులు లేని మొండెమును చూచి ఆశ్చర్యపడుతూ ఇది తప్పక బలవంతులైన గంధర్వుల కార్యమేనని నిర్ధారించుకొనిరి.
తాను ఒక స్త్రీకోసం దిగజారాను అని తెలియరాదు అని కీచకుడు, అజ్ఞాతవాసం బట్టబయలు కారాదు అని భీమసేనుడు చేసిన రహస్య యుద్ధం ముసుగులో గుద్దులాట
అన్నారు కవిబ్రహ్మ, ఉభయకవిమిత్రులు తిక్కనసోమయాజి గారు విరాటపర్వంలో.
బందుగణమంతా కీచకుడు మరణించుట చూచి దుఃఖముతో బిగ్గరగా రోధించసాగిరి. నిజమునకు, ఛిన్నాభిన్నమైన కీచకుని శరీరమును చూచి ప్రతి ఒక్కరూ భయభ్రాంతులైరి. వారి రోమాలు నిక్కబొడుచుకునెను. అతని బంధువులు అంతిమసంస్కార కార్యక్రమాలను ఆరంభించిరి.
అప్పుడు అక్కడ ఒక స్తంభమును ఆనుకుని నిలుచున్నట్టి ద్రౌపదిపై వారి చూపు పడెను. కీచకుని మరణమునకు కారకురాలైన ద్రౌపదియేనని తెలుసుకుని, ఆగ్రహముతో, , మరణించిన తమ సోదరుని శరీరముతో పాటు ద్రౌపది ని కూడా దహనము చేయవలెనని విరాటరాజును
కోరిరి. కీచకుని సోదరులు ఉపకీచకులు పదే పదే విరాటరాజును కోరగా, మహారాజు అంగీకరించలేదు.
అయినను రాజాజ్ఞకు వ్యతిరేకంగా కీచకుని బందువులు, ఉపకీచకులు ద్రౌపదిని అంత్యక్రియల వాహనమునకు కట్టి నిర్భందముగా శ్మశానము వైపు వెళ్ళగా విరాటరాజు అంతః
పురము చేరుకొనెను.
ద్రౌపది దీనముగా తన గంధర్వ పతుల పేర్లను వారు గతములో నిర్ణయించుకొన్న పేర్లతో జయ- జయంత, విజయ, జయత్సేన మరియు జయధ్వల- అంటూ బిగ్గరగా పిలుస్తూ విలపించసాగెను. పాకశాలలో తన శయ్యపై ఉన్నట్టి భీముడు, ద్రౌపది బిగ్గరగా రోధించుట వినెను.
వెంటనే తన రూపురేఖలు మార్చుకొని గంధర్వునిగా వస్త్రధారణ చేసుకొని వెంటనే బయలుదేరి బయటకు వెళ్ళెను. భీముడు వేగముగా వెడుతూ ఉపకీచకులందరినీ సంహరించాలని అతని తీవ్ర వాంఛకు అనుగుణంగా అతని శరీరము విశాలమవ్వసాగెను.
నగర ప్రహారి గోడను సమీపించిన అతనికి ఒక పొడవాటి భారీతాళవృక్షము అగుపించెను. దానిని వ్రేళ్ళతో
సహా పెరికి ఆయుధముగా ఉపయోగించుటకు భుజముపై వేసుకొనెను.
కీచకుని సోదరులు గంధర్వుడు తమ మీదికే వచ్చుచున్నాడని భావించి భయపడసాగిరి. శవము గల పాడెను ద్రౌపది ని విడిచి నగరము వైపునకు పరుగెత్తసాగిరి. భీముడు వారిని వెంటాడి వెంటాడి తన భుజముపైగల భారీవృక్షముతో నూరుగురు ఉపకీచకులను సంహ
రించెను.
తిరిగి వెనక్కి వచ్చి ద్రౌపదిని బంధ విముక్తురాలను చేసెను. తరువాత వారిద్దరూ విభిన్నదారులలో రాజనగరిలో వారివారి ప్రదేశాలకు చేరుకొనిరి.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


コメント