నర్తనశాల - పార్ట్ 4
- Ayyala Somayajula Subramanyam
- Jun 22
- 6 min read
Updated: 6 days ago
#AyyalaSomayajulaSubrahmanyam, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #Narthanasala, #నర్తనశాల, #అజ్ఞాతవాసం, #పురాణం, #Devotional, #TeluguSerialEpisodes

Narthanasala - Part 4 - New Telugu Web Series Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 22/06/2025
నర్తనశాల - పార్ట్ 4 - తెలుగు ధారావాహిక
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
అజ్ఞాతవాసం కోసం పాండవులు విరాటరాజు కొలువులో వివిధ వేషాలలో చేరుతారు. భీముడు మల్ల యుద్ధంలో జీమూతుడిని వధిస్తాడు. కీచకుడు ద్రౌపదిని మోహిస్తాడు. నర్తన శాలలో జరిగిన భీకర యుద్ధంలో కీచకుడు, భీముని చేతిలో హతమవుతాడు. ఉప కీచకుల బారి నుండి ద్రౌపదిని రక్షిస్తాడు భీముడు.
ఇక నర్తనశాల - పార్ట్ 4 చదవండి..
ముందుగా వధింపబడిన ఉప కీచకులందరికీ అంత్యక్రియలు దగ్గరుండి విరాటమహారాజు
జరిపించెను. మరియు మహారాణి సుధేష్ణ కు ఆజ్ఞ ఇచ్చెను. “మహారాణీ, సైరంధ్రిని తనకు కావలసిన చోటుకు వెళ్ళమని మా ఆజ్ఞగా తెలియపరుచుము “.
నిజమునకు, విరాటరాజు కూడ గంధర్వుని ఆగ్రహము పట్ల భయమును కలిగి ఉండెను. ఏమైనను అతడు తన దేవేరితో ఇట్లనెను. ”దేవీ; ఒక స్త్రీ ప్రవర్తన చేత పురుషుడు అవమానించబడ కూడదు. కనుక నీ పరివారము లోని పరిచారికను తొలగించ వలసింది కూడా నువ్వే”.
మరో వైపు ద్రౌపది ని చూడగనే పురజనులందరూ గంధర్వుల భయంతో పారిపోయిరి. తరువాత బృహన్నల అనేకమంది యువతులతో కలిసి భవనము నుండి బయటకు వస్తూ ద్రౌపది కి కనిపించెను. అర్జునుడు ద్రౌపది రక్షింపబడుట పట్ల తన సంతోషమును వ్యక్తపరచగా ఆమె విసురుకుంటూ ఇలా సమాధానమిచ్చెను.
“బృహన్నలా;ఈ విషయములో మీకేమి సంబంధం? నా బాధ గురించి నీకేమి అవసరము? నీవు స్త్రీలతో కాలక్షేపం చేస్తూ సమయము వృధా గా గడుపుతూ ఆనందముగా ఉండుము”
అర్జునుడు విచారంగా ఇటుల అనెను. “ఓసైరంధ్రీ; నేను అనుభవిస్తున్నట్టి దుఃఖమును నీవెరుగవా? నీకు వచ్చిన ఆపదకు ఎవరికి దుఃఖము కలుగదు”
పిమ్మట అక్కడి యువతులు కూడ ద్రౌపది రక్షింపబడుటను సంతోషమును వ్యక్తపరచి, ఆమెను తిరిగి సుధేష్ణాదేవి భవనము లోనికి తీసుకువెళ్ళిరి. అప్పుడు అయిష్టముగానే మహారాణి ఇలా ఆదేశించెను. ”ఓ, సైరంధ్రీ, మహారాజు గంధర్వులని భయపడుచుండెను. కనుక నీవు ఇక్కడి నుండి ఇష్టమైన మరో ప్రదేశమునకు వెళ్ళుము”
ద్రౌపది ఇట్లు అర్థించెను. “మహారాణి; నన్ను ఇంకను మరొక పదమూడు రోజులు మాత్రమే ఇక్కడ ఉండుటకు అనుమతించగలరు. అప్పుడు గంధర్వులు వచ్చి నన్ను తీసుకువెళ్ళెదరు. ఈ స్వల్ప సహాయము చేసినచో నా గంధర్వపతులు మీకు మేలు చేయగలరని మహారాజుకు
హామీ ఇవ్వగలరు. ”
————————————————————-
పరిస్థితులు ఇక్కడ ఈవిధంగా ఉండగా, మరోవైపు కౌరవుల గూఢచారులు అనేక అడవులు, పట్టణాలు పల్లెలు రాజ్యాలను పాండవుల ఉనికి కొరకు వెదికివెదికి ఫలితము లేక చివరికి తిరిగి హస్తినాపురమునకు చేరుకొనిరి.
వారందరూ కురువృద్దులు, గురువృద్దులు పరివేష్టితులయివున్న దుర్యోదనుని రాజ సభాభవనమునకు వెళ్ళిరి.
గూఢచారులు ఇట్లు విన్నవించిరి. “మహాప్రభూ; మేము పాండవుల రథచక్రాల గుర్తులను అనుసరిస్తూ ధ్వారక వరకూ వెళ్ళితిమి. కానీ, అచటగానీ మరోచోట గానీ మేము వారి జాడలను కనుగొనలేకపోతిమి. కానీ ఒక ఆసక్తికరమైన సంఘటన యేమనగా త్రిగర్తల రాజులకు బద్ధ
శత్రువులైన కీచకుడు మరియు అతని సహోదరులు నూరుమంది ఒక అదృశ్య గంధర్వుల చేతిలో చంపబడిరి.”
ఆ పలుకులు వినిన దుర్యోదనుడు సభను ఉద్దేశించి ఈ విధముగా పలికెను. ” సభికులారా; ఇప్పుడు ఏమి చేయవలెనో మీరందరూ నాకు తెలుపవలెను. ”.
కర్ణుడు ఈ విధముగా పలికెను. ” మహారాజా; మరింత అధిక నైపుణ్యము గల మరికొంత మంది గూఢచారులను మరింత క్షుణ్ణంగా వెదుకుటకు అంతటా పంపుదుము “.
దుశ్శాసనుడు ఈ విధముగా అభిప్రాయపడెను. “పాండవులు ఎవరూ కనిపెట్టలేనంత కట్టుదిట్టంగా దాగుకొని ఉండవచ్చును. లేక ఎట్టి గురుతులు మిగులకుండా ఎప్పుడో మరణించి వుందురు. ఇది నిశ్చయము. ఇంతకాలము వారు జీవించివుండుట దుర్లభం.” అనెను.
ద్రోణుడు ఆ మాటలను ఖండిస్తూ ఇట్లు పలికెను. “దుర్యోధనా, ఇది మూర్ఖపు ఆలోచన, అభిప్రాయము. అంతటి గొప్ప వ్యక్తులు ఎట్టి క్లిష్టపరిస్థితుల్ల లోనూ ఎన్నడునూ నశించరు. గడువు ముగిసిన పిమ్మట పాండవులు తప్పక హస్తినకు చేరుకొందురు. కనుక వారితో నీవు శాంతి
ఒప్పందమునకు సిద్దపడుట మంచిది. ”
భీష్ముడు ద్రోణాచార్యుల మాటలు బలపరుస్తూ ఈ విధముగా పలికెను. ”పౌత్రా;దుర్యోధనా; ద్రోణాచార్యుల మాటలలో వాస్తవము కలదు. ఏమైనను నీవు ఇంకను పాండవుల జాడను ఎరుగదలచినచో, ధర్మము ఎక్కడ ఉన్నతముగా విరాజిల్లుతున్నదో, ప్రజలు ఎక్కడ సంతోషముగా ఉండి భౌతిక దుఃఖముల చేత బాధింపబడకుండిరో, ఎక్కడ ప్రకృతి పుష్కలముగా కానుకలను అందిస్తున్నదో అట్టి ప్రాంతము లని వెదకవలెను. పాండవుల మంగళకరమైన
ఉనికి చేతనే అట్లు సాధ్యపడును “
త్రిగర్తల రాజు సుశర్మ ఈ విధముగా పలికెను. “మహారాజా; గతములో నేను విరాటరాజు బావమరిది కీచకుని చేతిలో పలుమారులు పరాభవింపబడి, ఓడితిని. ఇఫుడు కీచకుడు మరణించి నందున విరాటుడు బలహీనపడి వుండును. దీనిని సదవకాశముగా తీసుకుని మనము మత్స్యదేశము మీద దండెత్తవలెను. విరాటుని సంపదను ప్రత్యేకించి లక్షలాదిగా గల గో సంపదను మనము అపహరించవలెను. భీష్ములవారు చెప్పినట్లుగా ఒకవేళ వారు విరాటుని
రాజ్యములో వున్నచో బయటపడుదురు.”
అప్పుడు దుర్యోధనుడు ఆలోచనలో పడెను. కీచకుడు మరణించుట ఒక శుభవార్తే కానీ దానిలోని మర్మములు అతనికి మెల్ల మెల్లగా భోదపడసాగినవి. బకాసురుడు, జరాసంధుడు, కీచకుడు, భీమసేనుడు మరియు దుర్యోధనుడు సమ బలశాలురు. మరియు ఇందులో మొదట
ఎవరు ఎవరి చేతిలో వధింపబడెదరో మిగిలిన వారు అతని చేతిలో చచ్చెదరు. ఇది ఒక దైవశాసనం లాంటి శాపము.
బకాసురుడు, జరాసంధుడు భీముని చేతిలో మరణించారు. ఒకవేళ కీచకుడు కూడా భీముని చేతిలో హతుడై వుండవచ్చు కదా; తాతగారు చెప్పినట్లు పాండవులు వున్నచోట సస్యశ్యామలముగా ఉండునని చెప్పిరి. దాని ప్రకారము మత్స్యదేశము సుభిక్షంగా వున్నది. కావున పాండవులు అక్కడే వుండవచ్చును.. ”
కర్ణుడు సుశర్మ ప్రతిపాదనను మెచ్చుకొనెను. “పాండవులు ఇప్పుడు నిరాశ్రయులు మరియి బలహీనులైనందున వారి గురించి చింతించుట కంటెను, మత్స్యదేశముపై దాడి చేయుట ఉత్తమం “ అని చెప్పెను.
*****
మహాభారతం స్ఫూర్తికి విరుద్ధంగా కర్ణునిమీద సినిమాలు వచ్చాయి. పెనువక్రీకరణ జరిగింది. కర్ణుడు గొప్పవాడు అన్న తప్పుడు భావన ఇప్పుడున్నంతగా అరవై వ దశాబ్ది వరకూ లేదు. కర్ణుడు మహోన్నతుడు, అర్జునుని కన్నా గొప్పవాడు అంటూ గత కొద్దికాలంగా వినవస్తున్న వాదనలు సరియైనవి కావు.
ఆ వాదనలు, ఆలోచనలూ మానసిక దౌర్బల్యం వల్ల, చింతనా వక్రతవల్ల, చెడగొట్టబడితే చెడిపోయినందువల్ల వచ్చినవే. ఈ వాదనలు, ఆలోచనలూ హిందూత్వంపై
పరోక్షంగా దాడి చెయ్యడానికి పనికివస్తున్నాయి. కర్ణుడు మంచివాడా? మహాభారతం ప్రకారం కర్ణుడు మంచివాడు కాదు. అర్జునుడు స్థాయి వీరుడు కూడా కాదు.
———
దుర్యోదనునికి కూడా సుశర్మ సలహా నచ్చెను. దానితో అతడు దృతరాష్ట్రుని అనుమతి లభించినంతనే సైన్యమును సిద్దము చేయవలసిందిగా దుశ్శాసనుని ఆజ్ఞాపించెను. దుర్యోధనుడు సుశర్మ వైపు తిరిగి ఇలా పలికెను. “ఈ రోజే నీ సైన్యముతో బయలుదేరి విరా
టుని గోసంపదను స్వాధీనపరచుకొనుము. మా సోదరులతో కలిసి మేము రేపు బయలు దేరెదము.
అంతట త్రిగర్తల రాజు సుశర్మ విరాటుని గోసంపదను అపహరించనారంభించిరి. గోపకులు రాజ్యసభకు పరుగెత్తి పరిస్థితినంతటిని మహారాజుకు వివరించి సంశప్తకుల బారినుండి గోవులను రక్షించవలసినదిగా విరాటుని వేడుకొనిరి. విరాటుడు వెంటనే తన సోదరులు
శతానికుడు మరియు మకిరక్షుడు, ఇంకను పెద్దకుమారుడు శతానికుడు అధీనములో గల సైన్యమును సమావేశపరిచెను.
విరాటుడు శతానికుని ఇలా ఆజ్ఞాపించెను “ రథాలను కంకుభట్టు, వల్లభుడు, ధామగ్రంధి, తంత్రీపాలుడు అధిరోహించి మన సైన్యాన్ని ముందుండి వ్యూహాత్మకంగా నడిపించవలెను. వారు మనకు విజయమును చేకూర్చ
గలరని నేను దృఢముగా విశ్వసిస్తుంటిని”.
అంతట ఆ నలుగురు హృదయము వుప్పొంగగా ఆనందముతో కవచములు మరియు ఇతర యుద్దసామగ్రితో తమ రథాలను అధిరోహించి బయలుదేరిరి.
మత్స్యసైన్యము మధ్యాహ్నమునకు త్రిగర్తల సైనికులతో తలపడెను. భీకరమైన పోరు చేత విపరీతమైన ధూళి చెలరేగుతోంది సైనికులు కనిపించకుండిరి. ఆ ప్రాంత మంతయు అసంఖ్యాకముగా తెగిపడిన తలలతో మరియు అవయవములతో రక్తసిక్తమయ్యెను.
ఏమైనను పోరు తీవ్రముగా కొనసాగుచున్నది. చివరకు విరాట రాజు సుశర్మతో తలపడెను. భయంకరమైన ఆ యుద్దం రాజులిరువురూ ఒకరిపైనొకరు అసంఖ్యాకముగా బాణాలను ప్రయోగించుకొనిరి.
సూర్యస్తమయము పిమ్మట అంధకారమగుటతో యుద్దమునకు విరామము ఇచ్చిరి. యుద్దము తిరిగి ఆరంభమైన పిమ్మట సుశర్మ మరియు అతని సోదరుడు మత్స్యసైన్యము పై విరుచుకుపడిరి. సుశర్మ విరాటుని వైపునకు దూసుకువెళ్ళి అతని రథసారథిని, అశ్వాలను తుదముట్టించిరి. విరాటుడు నిరుపయోగమైన తన రథము పైనుండి దిగెను.
సుశర్మ వెంటనే వెళ్ళి విరాట మహారాజును బంధించి తన రథముపైకి ఎక్కించెను. మత్స్యయోధులు తమ మహా
రాజును బంధించుట చూసి భీతితో యుద్దభూమి నుండి పారిపోసాగిరి.
అంత యుదిష్టరడు భీముని చూచి ఇటుల ఆజ్ఞాపించెను. “సోదరా; నీవు వెళ్ళి విరాటరాజును విడిపించవలెను. అతడు మనకు ఏడాది నుంచి వాసము, గ్రాసములు ఏర్పాటు చేసెను. కావున ఉపకారమునకు ప్రత్యుపకారము చేసిన వారగుదుము. ”
భీముడు ఈ విధముగా బదులిచ్చెను. “నకుల సహదేవులతో కలిసి మీరు ఈప్రక్కన నిలుచుని నా యుద్దము, వీరప్రతాపము చూడగలరు”.
యుధిష్టరుడు ఇటుల హెచ్చరించెను. ” భీమా; నీవు సాధారణ ఆయుధములతోనే యుద్దము చేయుము. నకుల సహదేవులు నీకు తోడుగా వచ్చెదరు. ”
భీముడు విధేయతతో తన బలమైన విల్లును అందుకుని సుశర్మకు ఎదురుగా వెళ్ళుచూ, అతనిని సమీపించెను. సుశర్మ వెనక్కి తిరిగి చూడగా, యమదండం పట్టుకున్న యమునివలె భీముడు అగుపించెను. సుశర్మ తన సైన్యముతోపాటు దూసుకు వస్తున్నట్టి భీముని
ఎదురుకొనుటకు వెనుకకు తిరిగెను.
క్షణములో భీముడు అనేకమంది త్రిగర్తల సైనికులను వధించెను. శరవృష్టిని కురిపించెను. మత్స్యసైనికులు శత్రుసైన్యమునకు భారీనష్టము కలిగించిరి. ధర్మరాజు సుశర్మ వైపునకు దూసుకు వెళ్ళెను. అంత భీముడు ధర్మరాజును నిలువరించి సుశర్మ వైపునకు దూసుకుపోయెను. వెనువెంటనే ఆతని రథసాథిని, గుర్రములను వధించెను. అప్పుడు మదిరాక్షుడు విరాటుని తన రథముపై ఎక్కించుకొనెను.
దానితో సుశర్మ విరధుడై యుద్దభూమి నుండి పారిపోయెను.
విరాటుడు వృద్దుడైనను రథమునండి క్రిందికి దిగి సోదరుని చేతిలోని గదతో సుశర్మను. వెంబడించెను. భీముడు. సుశర్మ పారిపోతున్నందులకు అపహాస్యం చేస్తూ పోరాడమని
కవ్వించెను. సమన్యాయము పాటించుటకు సుశర్మ ఆగెను.
అంత భీముడు కూడా రథము పైనుండి క్రిందికి దిగెను. ఇరువురును ఒకరినొకరు ఎదురుకొనుటకు సన్నద్దులు కాసాగిరి. సుశర్మ భీముని సమీపించగనే సుశర్మ జుట్టు పట్టుకుని నేలమీద బాదెను. సుశర్మ బాధతో
విలవిలలాడెను. అటుపిమ్మట తన కాలిని తీసుకుని సుశర్మ ఛాతీ మీదనొక్కి పట్టెను.
అది చూచి త్రిగర్తల సైన్యము భయపడి తాము అపహరించిన విరాటుని గోసంపదను విడిచి పారిపోయెను. విరాటుని గోసంపద విడిచి పారిపోయెన. విరాటుని సంపద రక్షింప బడినందున, మహారాజు యుధిష్టరుని ఉదార స్వభావములను దృష్టిలో పెట్టుకొని, భీముడు సుశర్మ వధింలేదు. అతడు సుశర్మను బంధించి తన అగ్రజుడిని వద్దకు తీసుకు వెళ్ళెను. సుశర్మ దీనస్థితి చూసి ధర్మరాజు నవ్వుతూ అతడిని బంధ విముక్తుని చేయమని
భీమసేనుని ఆజ్ఞాపించెను.
భీముడు సుశర్మతో ఈ విధముగా పలికెను. ” సుశర్మా; యుద్ధములో ఓడిన వ్యక్తులు పాటించవలసిన నియమములు. నీవు మా రాజసభలో బానిసవని బహిరంగముగా ప్రకటించినచో నేను నిన్ను విడిచిపెట్టెదను”.
యుధిష్టరుడు కల్పించుకొని ఎట్టి నిర్బంధము లేకుండ సుశర్మ కు స్వేచ్ఛను ప్రసాదిస్తూ ఇలా హెచ్చరించెను. “మరొకసారి ఇట్టి హేయమైన కార్యాలను చేయవద్దు. ధర్మబద్ధముగా లభించిన దానితో సంతృప్తి చెందుము.”
బంధవిముక్తుడైన సుశర్మ ధర్మరాజు కు, విరాటరాజు కు నమస్కరించి సిగ్గుతో తల దించుకుని నిష్క్రమించెను.
పాండవులు ఆ రాత్రిని యుద్దభూమిలోనే గడిపిరి. విరాటుజు తనను రక్షించిన పాండవులను తగురీతిని సత్కరించెను. “మహారాజా; మేము కేవలము మీ క్షేమమును వాంచించువారము. అంతకుమించి మాకేమీ వద్దు. కొంతమంది దూతలను పంపి మీ విజయమునకు బహిరంగంగా ప్రకటించ”మని కోరిరి.
========================================================================
ఇంకా వుంది..
నర్తనశాల - పార్ట్ 5 త్వరలో..
========================================================================
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


Comments