top of page

మీ కోసం ఎదురుచూస్తూ..

#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #MeeKosamEduruChusthu, #మీకోసంఎదురుచూస్తూ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #కొసమెరుపు


Mee Kosam Eduru Chusthu - New Telugu Story Written By - Malla Karunya Kumar

Published In manatelugukathalu.com On 22/06/2025

మీ కోసం ఎదురుచూస్తూ - తెలుగు కథ

రచన: మళ్ళ కారుణ్య కుమార్

కథా పఠనం: పద్మావతి కొమరగిరి

"నక్షత్రాలు స్వయం ప్రకాశాలు!. అదుగో సప్తర్షి మండలం. విశ్వామిత్రుడు అందులో ఒకరు. అతని గురించి నిన్న చెప్పావు. మన దగ్గర వున్న శక్తిని అనవసరంగా ఉపయోగించ కూడదని అతని కథ ద్వారా తెలియజేసావు. చాలా బాగుంది. మరి ఈ రోజు ఏ కథ చెప్తావు?." బాల్కనీ లో నుండి నక్షత్రాలను చూస్తూ, ఎదురుగా వున్న నాన్నమ్మ లక్ష్మమ్మని అడిగాడు ధృవ కుతూహలంతో.


మనవడి ప్రశ్నలకు, కథల పట్ల తనకున్న ఆసక్తికి సంతోషించి, "ఈ రోజు నీ పేరు కలిగిన వ్యక్తి కథ చెప్తా." అంది లక్ష్మమ్మ.


"నా పేరు కలిగిన వ్యక్తా!, ఎవరతను?."


"ధృవుడు, మన పురాణాల్లో పేరుగాంచిన వ్యక్తి. కఠోర సాధన, ఏకాగ్రత తో ఉత్తమ స్థానం సాధించిన అతని జీవితం మనకు ఆదర్శం. అతని గురించి చెప్తాను విను." అని ధృవుని కథ చెప్పడం మొదలుపెట్టింది.


ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తూ వింటున్నాడు. లక్ష్మమ్మ తనదైన బాణీలో కథ చెప్పడం పూర్తి చేసింది. 


మొత్తం విని ఆశ్చర్యపోతూ, "అంటే అంత చిన్న వయస్సులో అంత కష్టపడి ధృవ తారయ్యాడతను. అయితే నేను కూడా అతని లానే ఉన్నత స్థానాలకు చేరుకుంటాను." అని ఆరవ తరగతి చదువుతున్న ధృవ అన్నాడు.


మనవడి మాటలకు నవ్వుతూ, "అలాగే ధృవ." అని మురిసిపోతూ అంది లక్ష్మమ్మ.


ఇంతలో లక్ష్మమ్మ ఫోన్ మ్రోగడం మొదలైంది. వేగంగా దాన్ని తీసుకొని అమ్మమ్మకు అందించాడు ధృవ.

 

ఫోన్ అందుకొని చూసి, "కొత్త నెంబర్ లా వుంది?." అంటూ వేగంగా ఫోన్ ఎత్తింది లక్ష్మమ్మ.


"హలో, మీరు తులసి నాథ్ తాలూకా?." ఓ స్త్రీ గొంతు అవతల వైపు నుండి గంభీరంగా వినిపించింది.


"అవునండీ!, మీరు ఎవరో తెలుసుకోవచ్చా?." అడిగింది లక్ష్మమ్మ.


"మేడం!, మేము ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఫోన్ చేస్తున్నాం. మీ అబ్బాయికి, కోడలికి యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడే చికిత్స పొందుతున్నారు. మీకు ఇన్ఫామ్ చేయమని చెప్పారు. అందుకే నేను ఫోన్ చేశాను." చెప్పింది నర్స్.


ఆ వార్తకు ఆమె గుండాగినంత పనయ్యింది. క్షణం ఆమె శిలలా అయిపోయింది. మళ్ళీ తేరుకొని, వణుకు తున్న స్వరంతో, "ఇప్పుడు ఎలా ఉందమ్మా?." అడిగింది.


"ప్రాణాలుకైతే ప్రమాదం లేదు. కానీ దెబ్బలు బాగా తగిలాయి. మీరు వెంటనే రండి." ఆసుపత్రి చిరునామా చెప్పి ఫోన్ పెట్టేసింది నర్స్.


అప్పటి వరకు వెలుగుతూ చంద్రబింబం లా వున్న లక్ష్మమ్మ ముఖం ఒక్కసారిగా అమావాస్య తో కప్పేసిన చీకటిలా మారిపోయింది, "నాన్నమ్మ!, ఏమైంది?. ఎవరు ఫోన్ లో?. నాన్న, అమ్మ రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది?." ప్రశ్నల వర్షం కురిపించాడు ధృవ.


సమాధానం చెప్పకుండా వేగంగా ధృవను తీసుకొని అక్కడ నుండి బయలుదేరి కొంత సమయం లో ఆసుపత్రి కు చేరుకుంది. 


అప్పటికే వాళ్ళకు వైద్యం చేసి దెబ్బలకు కట్లు కట్టున్నారు. తల్లి, తండ్రి ఆ విధంగా దెబ్బలతో, కట్టులతో వుండడం చూసి వేగంగా వాళ్ళ దగ్గరకు పరుగుతీశాడు ధృవ.


 "అమ్మ, నాన్న!. మీకు ఇలా ఎలా జరిగింది?. మీకు ఇలా అవ్వడానికి కారణం ఎవరు?." బాధతో ఏడుస్తూ, 

 "మీకు ఈ గతి పట్టించిన వాళ్ళకు శిక్ష పడాలి." అని కోపంతో అన్నాడు ధృవ.


ఆవేశం తో వున్న ధృవ ను దగ్గరకు తీసుకొని, "ధృవ, కంట్రోల్. ముందు నువ్వు స్థిమితంగా వుండు." తన కన్నీటిని తుడుచుకుంటూ ధృవ ను శాంతింప జేసింది లక్ష్మమ్మ.


"నాన్నమ్మ!, చూసావా అమ్మానాన్న ల పరిస్థితి. వాళ్ళకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను. చూస్తుంటే ఎవరో అడ్డంగా వచ్చినట్టున్నారు.నువ్వు చెప్తుంటావు కదా తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడాలని." ఆవేశంతో అన్నాడు ధృవ.


"రేయ్ ధృవ, నువ్వు ఊరుకో నీకేమి తెలియదు." మెల్లగా పెదవి తెరుస్తూ అన్నాడు తులసి.


"అన్నీ పూర్తయ్యాయి మేడం. పోలీసులు కూడా వచ్చి, మొత్తం వివరాలు తెలుసుకొని వెళ్ళిపోయారు. మీ అబ్బాయి దీనంతటకి కారణమైన వ్యక్తిని వదిలేయమని చెప్పారు." పక్కనే వున్న నర్స్ చెప్పింది.


ఏ చిన్న విషయానికైనా కోపంతో చెలరేగిపోయే కొడుకు ఈరోజు ఇలా మౌనంగా వుండడం చూసి ఆశ్చర్యపోయింది లక్ష్మమ్మ. కాసేపు ఆలోచనలో పడింది.


"అతన్ని వదిలి పెట్టను. మీకు ఈ గతి పట్టించిన వాడిని నేను వదలను." ఆవేశంతో పలికాడు ధృవ.


"బాబు, అతను ఇంకా ఇక్కడే వున్నాడు. అదుగో అక్కడ కూర్చొని వున్నాడు." అని అటువైపుకు చూపిస్తూ అంది నర్స్ ధృవ మాటలు విన్నాక.


"ఇక్కడే వున్నాడా?." అని నర్స్ చూపించిన వైపుకు చూసాడు. కొంత దూరంలో కుర్చీలో కూర్చొని తల కిందకు పెట్టుకొని వున్నాడు ఒక వ్యక్తి.


ఆవేశంతో అతని వైపుకు చేరుకున్నాడు. అప్పటికి కూడా ఆ వ్యక్తి తల కిందకు పెట్టుకొని వున్నాడు. 

"హలో, తల కాస్త పైకి ఎత్తుతారా?." ఆవేశం, బాధతో కూడిన స్వరంతో అన్నాడు ధృవ.


ధృవ పిలుపుతో ఉలిక్కి పడి పైకి తలెత్తి ధృవ వైపుకు చూసాడు. అతని కళ్ళు బాధతో వున్నాయి. అతన్ని చూసిన ధృవ మరో మాట మాట్లాడకుండా చూస్తూ వుండి పోయాడు. ఇంతలో అక్కడకు చేరుకున్నది లక్ష్మమ్మ.


ధృవ వైపు చూస్తూ, "ఎవరు బాబు నువ్వు." అడిగాడు అతను. అతని స్వరంలో ఏదో తెలియని బాధ స్పష్టంగా కనిపిస్తూ ఉంది.


అతను అడగడం తో, అతని వైపు చూస్తూ, "మీరు!, మీరు!." అని ఆశ్చర్యంతో అంటూ మాట్లాడకుండా స్థానువైపోయాడు ధృవ.


 అంతవరకు ఆవేశంతో వున్న ధృవ ఇలా నిశబ్ధంగా ఉండిపోవడం తో ఆశ్చర్య పోయింది లక్ష్మమ్మ.


 తర్వాత తాను కల్పించుకొని, "మేము, అదుగో అక్కడ దెబ్బలతో పడి వున్నారు కదా వాళ్ళ తాలూకా. అతను నా కొడుకు, ఇదుగో వీడు నా మనవడు." అని అంది లక్ష్మమ్మ.


"అమ్మ, మీరా!. నన్ను క్షమించండమ్మ. నా భార్య ఆసుపత్రిలో వుంది. ఆమె ఆపరేషన్ కు డబ్బులు అవసరమయ్యాయి. ఆ టెన్షన్ లో వస్తుండగా ఇలా జరిగిపోయింది." ప్రాధేయ పడుతూ చేతులు జోడిస్తూ అన్నాడు అతను.


"అయ్యో మీరు క్షమాపణలు అడగాల్సిన అవసరం లేదు. ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ముందు ఆంటీ ఆరోగ్యం సంగతి చూడండి." అన్నాడు ధృవ.


ధృవ మాటలు లక్ష్మమ్మ కు అర్థం కావడం లేదు. 

'అసలు ఎందుకు ధృవ ఇలా మాట్లాడుతున్నాడు?. ఇంతకు ముందు తులసి కూడా ఇలానే అన్నాడు?." అని తనలో అనుకుంటూ, 

"ధృవ, ఇతను మీకు ముందే తెలుసా?. అసలు ఇతను మీకు ఎలా పరిచయం?." అడిగింది లక్ష్మమ్మ.


"నాన్నమ్మ, నీకు తర్వాత చెప్తాను. ముందు అతన్ని ఇక్కడ నుండి వెళ్ళనివ్వు." అని అంటూ ఆ వ్యక్తిని అక్కడ నుండి వెళ్లేలా చేశాడు. 


"బాబు, నువ్వు ఎవరో నాకు తెలియదు?. కానీ నా బాధను మీరు అర్థం చేసుకున్నారు. ఇంత సమస్యలో వుండి కూడా నా గురించి ఆలోచించారు. ఇదుగో నా అడ్రస్ నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను." అని అడ్రస్ రాసి ధృవ కు ఇచ్చి అక్కడ నుండి వేగంగా వెళ్ళిపోయాడు అతను.


అక్కడ పరిస్థితి ఏమిటో తనకు అర్థం కావడం లేదు. కానీ 'తులసి, ధృవ ఏదొక కారణం లేకుండా ఇలా చేయరని' తనలో అనుకోని కొడుకు దగ్గరకు తిరిగి వెళ్ళింది. 


"రేయ్ తులసి!, ఏమిటిరా మీ ఇద్దరి ప్రవర్తన?. నాకేమీ అర్ధం కావడం లేదు?. అతన్ని మీరు క్షమించడానికి కారణం ఏమిటి?." అడిగింది లక్ష్మమ్మ.


"అమ్మ!. సరిగ్గా ఆరునెలల క్రితం ఇలాంటి పరిస్థితి నేను ఒకసారి ఎదుర్కొన్నాను. నేను, ధృవ బండి మీద వేగంగా వెళ్తున్న సమయంలో ఒక టర్నింగ్ దగ్గర ఎదురుగా వస్తున్న బండిని తప్పించ బోయే వేరొక బండిని గుద్దుకోవడం జరిగింది. దాంతో ఎదురుగా వస్తున్న బండి మీద వున్న ఇద్దరూ కింద పడ్డారు. వాళ్ళ బండి కూడా దూరంగా పడింది. వాళ్ళలో పెద్ద వ్యక్తికి తలకు గాయం అయ్యింది. నెత్తురు కూడా చిమ్మింది. చిన్న పిల్లాడు కి గాయాలయ్యాయి. జనం చుట్టూ చేరి రచ్చ రచ్చ చేశారు. ఆ మాటలు ఇప్పటికీ కూడా నా మదిలో మారుమ్రోగుతున్నాయి. నాకు ఏమి చేయాలో తెలియని స్థితి అది. అలాంటి సందర్భంలో కూడా అతను నన్ను తిట్టకుండా అక్కడున్న జనాన్ని వెళ్లగొట్టి, నన్ను ఏమీ అనకుండా అక్కడ నుండి వెళ్ళిపోయారు. అతని ప్రవర్తన నాకు ఆశ్చర్యం కలిగించింది. అతనికి ఎంత ఉదార స్వభావం వుంటే నన్ను ఇలా క్షమిస్తారు." అని అన్నాడు తులసి.


"ఇప్పుడు నాన్నకు యాక్సిడెంట్ కు కారణమైన వ్యక్తి ఎవరో కాదు నాన్నమ్మ. ఆ రోజు మమ్మల్ని ఏమీ అనకుండా విడిచిపెట్టిన వ్యక్తి. ఆ రోజు నాకు చాలా భయం వేసింది. ఆ అబ్బాయి కూడా నా అంతే వుంటాడు. అతని తండ్రికి ఏమైనా అయివుంటే ఆ అబ్బాయి ఎంత బాధపడే వాడని నాకు అనిపించింది. అవన్నీ గుర్తుకు వచ్చాయి. అందుకే ఇప్పుడు ఆ అంకుల్ ను వెళ్ళిపోమని చెప్పాను." అని అన్నాడు ధృవ.


మనవడిలో ఇంత ఆలోచన పరిజ్ఞానం ఉన్నందుకు లక్ష్మమ్మ చాలా సంతోషించింది. "అయితే ధృవ, ఆరోజు అతను నిన్ను కాపాడారని ఇప్పుడు అతన్ని విడిచి పెట్టావు. లేకపోతే అతన్ని విడిచి పెట్టేవాడివి కాదు కదా." అని అడిగింది లక్ష్మమ్మ.


"అమ్మమ్మ!, నువ్వే చాలా సార్లు చెప్పావు కదా. సరైన కారణం వుంటే క్షమించ వచ్చని. నువ్వే అన్నావు కదా పశ్చాతాపానికి మించిన శిక్ష లేదని. అతని కళ్ళలో నాకు పశ్చాతాపం కనిపించింది." అని అన్నాడు ధృవ.


"అమ్మ గడుగ్గాయి!, నా మాటలు నాకే చెపుతున్నావా?." నవ్వుతూ అంది లక్ష్మమ్మ.


"అమ్మ, నీ కారణంగానే వాడు ఇప్పుడు ఇలా ఆలోచించ గలిగాడు. నిజానికి నేను అయినా ఇలా ఆలోచించ లేను. చిన్నప్పుడు నీ మాటలు సరిగా అర్దం చేసుకో లేకపోయాను. ఇప్పుడు కూడా కొన్ని సార్లు నీ మాట వినక నిన్ను ఇబ్బంది పెడుతూ వుంటాను" అని వాపోయాడు తులసి నాథ్.


"తులసి!, ఇప్పుడు నువ్వు ఏమి ఆలోచించకు. ముందు రెస్ట్ తీసుకో. ఇవన్నీ తర్వాత మాట్లాడుదాం." అని కొడుకుతో అంది లక్ష్మమ్మ.


అక్కడకు వారం రోజులు గడిచాయి. ప్రతి రోజూ కూడా అమ్మమ్మ దగ్గర నుండి కొత్త విషయాలు, కొత్త కథలు తెలుసుకుంటున్నాడు ధృవ.


"అమ్మమ్మ, ఆ రోజు ఆ అంకుల్ ఆంటీ కి బాగోలేదని చెప్పారు. చాలా బాధలో వున్నట్టు కనిపించారు. రేపు ఎలాగూ ఆదివారం కదా. రేపు ఒకసారి మనం వాళ్ల ఇంటికి వెళ్దామా?." అని అడిగాడు ధృవ.


"తప్పకుండా ధృవ. నువ్వు చెప్పిన తర్వాత వెళ్లకుండా వుంటామా?. తప్పకుండా వెళ్దాం." అని అంది లక్ష్మమ్మ.


మరుసటి రోజు ధృవ కు చెప్పినట్టే ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళడానికి సిద్ధం అయ్యింది లక్ష్మమ్మ. 

"సుజాత, తులసి నాథ్. నేను, ధృవ ఒకదగ్గరకు వెళ్తున్నాం. వచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి. మన పని మనిషి మీకు సహాయంగా వుంటుంది లేండి. సరే, ఇంతకీ వీడు ఎక్కడ?." అడిగింది లక్ష్మమ్మ.


"ఇప్పుడే బయటకు వెళ్ళాడు అమ్మ. ఆడుకోవడానికి ఏమో?." అన్నాడు తులసి.


"అవునా, నిన్న చెప్పాను కదా, ఈ పోగ్రాం గురించి అయినా వీడు బయటకు ఎందుకు వెళ్లాడు?. సర్లే వాడే వస్తాడులే." అని అనుకుంటూ అక్కడే వున్న సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసింది. 


ఒక్కసారిగా టీవీ లో వస్తున్న ప్రత్యక్ష ప్రచారం చూస్తూ ఆశ్చర్య పోయారు ముగ్గురూ.


"అమ్మ!, ధృవ టీవీ లో వస్తున్నాడు?." అని ఆశ్చర్యంతో అన్నాడు తులసి.


"రోడ్డు యాక్సిడెంట్ అరికట్టేందుకు ఈ చిన్నారులు నడుం బిగించారు. దాని గురించి అవగాహన నలుగురిలో కలిపిస్తూ ఇదుగో ఇలా ప్లకార్డులు పట్టుకుంటూ ముందు కు నడుస్తున్నారు. వాళ్లకు రక్షణ గా మన ట్రాఫిక్ పోలీసు గారు వున్నారు. పదండి వాళ్లకు ఈ ఐడియా ఎలా వచ్చిందో తెలుసు కుందాం." అని టీవీ రిపోర్టర్ వాళ్ల దగ్గరకు చేరుకున్నాడు.


"చెప్పండి పిల్లలు, మీరు ఎందుకు ఇలా ప్లకార్డులు పట్టుకొని తిరుగుతున్నారు. పైగా ' మీ కోసం ఎదురుచూస్తూ ' అని రాసి వుంది. అసలు ఏమిటి దీని కథ. మీ అందరికీ ఈ ఐడియా ఎలా వచ్చింది?." మైక్ వాళ్ల వైపుకు తిప్పుతూ అడిగాడు రిపోర్టర్.


సమాధానంగా అందరూ ధృవ వైపు చూపించారు.


"ఓహో, మీ బృందానికి నాయకుడు ఇతనా?. సరే, బాబు మీ పేరేమిటి?. నీకు ఈ ఐడియా ఎందుకు వచ్చింది?. ఎలా వచ్చింది?."


"నమస్కారం సర్, నా పేరు ధృవ. నాకు ఈ ఐడియా రావడానికి కారణం ఒక చిన్న సంఘటన. ఆ సంఘటన నన్ను చాలా బాధించింది, భయపెట్టింది. తరచూ రోడ్డు ప్రమాదాలను గురించి వింటూ ఉంటాం. ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. నేను రోజూ స్కూల్ కు వెళ్ళేటప్పుడు మా నాన్నమ్మ ఎన్నో జాగ్రత్తలు చెప్తుండేది.


మా నాన్నమ్మ ను ప్రతి విషయం అడిగి తెలుసుకున్నాను. ప్రమాదాలు అరికట్టాలంటే ఎవరికి వాళ్ళు స్వీయ క్రమశిక్షణ పాటించాలని మా నాన్నమ్మ చెప్పారు. ప్రతి వ్యక్తి ఇంటి నుండి కాలు బయట పెట్టేటప్పుడు. గుర్తు తెచ్చుకోవాల్సిన ఒక మాట ఏమిటంటే వాళ్ల ఇంటి వాళ్ళు వాళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఇంటి వాళ్ళు కూడా తమ వాళ్ళు క్షేమంగా రావాలని కోరుకుంటారు. అందుకే ప్రతి వ్యక్తికి తమ బాధ్యత గుర్తు చేయడానికి నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టను. దీని పేరు 'మీ కోసం ఎదురుచూస్తూ'. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. వేరే చోట్ల వున్న నా స్నేహితుల సహాయంతో ఈ కార్యక్రమం అక్కడ కూడా అమలు చేయడానికి కృషి చేస్తాను. మేము ఈ విషయం ట్రాఫిక్ పోలీస్ అంకుల్ తో చెప్పగానే అతను మాకు సహాయం అందించారు. మేము ఈరోజు మా మొదటి యాత్ర మొదలు పెట్టాం." అని చెప్పాడు ధృవ.


టీవీలో ధృవ మాటలను, అతని నాయకత్వ లక్షణాలను చూసి లక్ష్మమ్మ కళల్లో నీరు తిరిగాయి. అనుకోకుండా తను ఎప్పుడో రాసుకున్న 'మీ కోసం ఎదురుచూస్తూ' ఆర్టికల్ లో వున్న సారాంశం అది. ప్రజల్లో రోడ్డు ప్రమాదాలను పట్ల అవగాహన కల్పించాలని. అలాగే పిల్లల్లో ఎక్కువ కలిగించాలని తాను ఎప్పుడో అనుకుంది కానీ అది కార్య రూపం దాల్చలేదు. ఎప్పుడో ఒకసారి దాని గురించి ధృవ దగ్గర ప్రస్తావించడం జరిగింది. ఈ రోజు ధృవ ఆ ఆలోచనకి ప్రాణం పోసాడని చాలా సంతోషించింది లక్ష్మమ్మ.


"అమ్మ, నువ్వే గెలిచావు. పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తి, డబ్బు మాత్రమే కాదు. ఇలా నాయకత్వ లక్షణాలు, సమస్యలు పై అవగాహన కలిగించి. వాటిని రూపుమాపేందుకు కృషి చేయడం. ఇలాంటివి కూడా నేర్పాలని అప్పుడే మరోప్రపంచానికి నాంది అవుతుందని మళ్ళీ నిరూపించావు." అని ఆనందంతో అన్నాడు తులసి నాథ్.


సమాప్తం..


మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.

విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.

సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.


Comments


bottom of page