top of page

ఒక్కడే కొడుకు


'Okkade Koduku' New Telugu Story Written By Varanasi Bhanumurthy Rao

'ఒక్కడే కొడుకు' తెలుగు కథ

రచన: వారణాసి భానుమూర్తి రావు

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)



''క్షమించండి నాన్నా.. ''


పరంధామయ్య ఏదో వ్రాసుకొంటున్న వాడల్లా ఠక్కున తలెత్తి చూసాడు. ''ఏమైంది అబ్బాయ్ ?''


రాఘవ తల దించుకొని ఏదో చెప్పాలన్నట్లు తనలో తాను మాట్లాడు కొంటున్నాడు.


''చెప్పు.. ఏమి కావాలి ? డబ్బు ఏమైనా సర్దాలా? పాప ఫీజ్‌ కట్టాలా ?.. చెప్పు రాఘవా?'' కుర్చీ లోంచి లేవ బోయాడు పరంధామయ్య.


పరంధామయ్యకు ఇప్పుడు డెబ్భై ఏళ్ళు. సరిగ్గా చూపు ఆనదు. లేచి సరిగా నిలబడ లేడు కూడా. మెల్లగా నడవాలి. బాత్ రూమ్ కి గూడా తన సతీమణి అన్నపూర్ణమ్మ లేనిదే వెళ్లలేడు. గవర్నమెంట్ టీచర్ గా నలభై ఏళ్ళు పని చేసిన తరువాత రిటైర్ అయ్యాడు.


గవర్నమెంట్ పుణ్యమా అని మంచి పెన్షన్ వస్తుంది. కొడుకు మంచి వుద్యోగం లో ఉన్నాడు. కోడలు బాంక్ లో పని చేస్తుంది. ఇపుడు దాదాపు రెండు సంవత్సరాల నుండి కొడుకు దగ్గర వచ్చి ఉన్నారు ఇద్దరు. అది గూడా అన్నపూర్ణమ్మ బాత్ రూ లో పడి కాలు విరిగింది. అప్పుడు రాఘవ తన దగ్గరే వచ్చి ఉండ మన్నాడు.

''చెప్పురా.. ఎందుకు భయం ?''


“అమ్మ ఎక్కడ ?''


''అమ్మ వంట ఇంట్లో ఏదో పని చేస్తోంది. రమ్మంటావా ?''


రాత్రి ఎనిమిది గంట లయింది. భోజనాల లయిన తర్వాత ఇల్లు క్లీన్ చేసి అప్పుడే అక్కడికి వచ్చింది అన్నపూర్ణమ్మ.


''ఏరా రాఘవా దిగులుగా ఉన్నావు? '' అన్నది.


''ఏమీ లేదమ్మా. ఒక ముఖ్య మైన విషయం మాట్లాడాలి.. అందుకే వచ్చా. '' అన్నాడు రాఘవ.


''కోడలు పిల్ల ను గూడా పిలుస్తావా? అందరము కలిసే మాట్లాడుదాము '' అన్నది.


''లేదమ్మా.. తను ఎప్పుడో నిద్ర పోయింది.. బ్యాంకు లో చాలా పని ఉందని తల నొప్పి తో పడుకొంది '' అన్నాడు రాఘవ.


''కూర్చో.. ఏం మాట్లాడాలని ?'' అన్నారు పరంధామయ్య గారు.


''అదే నాన్నా.. ఉష కి బాంక్ లో ఎక్కువ పని అయి పోయిందట. నాకు గూడా టూర్ లు, టార్గెట్లు అని ఆఫీసులో చాలా పని ఉంది. గాబట్టి మిమ్మల్ను చూసు కోవడానికి మాకు కొంచెం యిబ్బంది గా ఉంది''


''అయితే.. ఏమంటావ్? మన ఊరికి వెళ్లి పొమ్మంటావా ?''


''అక్కడ హాస్పిటల్స్ ఉండవు, .. ఆ పల్లెలో మీరు ఉండలేరు. వంటకి అంతా కష్టం గదా నాన్నా ''


'సరే.. నువ్వేం చెప్పదలచు కొన్నావు ?''


''నేను, ఉషా వారం నుండి చర్చించు కొన్నాం. మిమ్మల్ని ఇద్దరినీ 'స్పందన ఓల్డ్ ఏజ్ హోమ్' లో చేర్పించాలని అనుకొంటున్నాము. ఆక్కడ డాక్టర్స్ ఉంటారు. వేళకి భోజనం అన్నీ దొరుకు తాయి. ఇక్కడ కష్టం గదా నాన్నా! ఆక్కడ నెలకు పది వేలు కట్టాలట, ఇద్దరికీ ఇరవై వేలు కట్టినా, ఇంకా చాలా పెన్షన్ మిగిలే ఉంటుంది. '' అన్నాడు రాఘవ.


రాఘవ మాటలు విన్న పరంధామయ్యకు తల తిరిగి నట్లయింది. గుండె వేగంగా కొట్టుకొనింది. కళ్ళు బైర్లు కమ్మినట్లైయింది. కళ్ళలోంచి కన్నీళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి.


''అంటే.. నీకు ఈ ముసలి అమ్మ నాన్న బరువై పోయార్రా ?” చిన్న పిల్లాడిలా ఏడిచాడు పరంధామయ్య.


ఆయన ఏదీ మనసులో దాచు కోలేడు. చిన్న పిల్లాడిలా ఏడుస్తాడు. అన్నపూర్ణమ్మ పరంధామయ్యని గట్టిగా హత్తుకొని, ఆయన తల నిమురుతూ ''ఊర్కోండి.. ఏదో చిన్నపిల్లాడు అంటున్నాడు. అలా కంగారు పడతారేంటి. ''


అన్నపూర్ణమ్మ తన చిన్నతనంలో కష్టాలు పడి గట్టి తనం అలవాటయియింది. ఆమె సమస్యలకు భయపడదు.


''రాఘవ.. నువ్వంటున్నది నిజమేనా ? మమల్ని వృద్ధాశ్రమం లో చేర్పిస్తావా? మేము అప్పుడే నీకు బరువై పోయ్యామా ?''


'అలా అను కోవద్దు నాన్నా ! ఇందులో తప్పేముంది? ఇప్పుడు అందరు ఓల్డ్ ఏజ్ హోమ్ లలో చేరి హాయిగా ఉన్నారు. ''


''హాయి.. కన్న పిల్లల్ని వదలి, మనమండ్ల, మనమరాళ్లను వదలి ఏకాంతంగా ఈ వయస్సులో బ్రతకమని చెపుతున్నార్రా.. మీ ఫ్రీడమ్ కి మేము అడ్డొస్తున్నామని మమ్మల్ని ఆశ్రమాల్లో చేర్పిస్తున్నార్రా.. చెప్పండ్రా ?''


ఒక్క కొడుకు చాలు అని, వాడ్ని బాగా చదివించ వచ్చని ఆనాడు అనుకొన్నాడు పరంధామయ్య. గానీ అన్నపూర్ణమ్మ ఇంకొక ఆడ బిడ్డ కావాలంటే గూడా బలవంతగా ఫామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసు కొన్నాడు. ఒక్కగానొక్క కొడుకు ఈ రోజు ఆశ్రమం పాలు చేస్తుంటే భరించడం చేత గావడం లేదు పరంధామయ్యకి.


''అంటే.. ఉషా.. ఇంట్లో పనులు, ఆఫీసులో పనులు చెయ్యలేనంటున్నది. జాబ్ మానేసి ఇంట్లో ఉంటాను అంటోంది. '' అన్నాడు రాఘవ.


''అంటే మా వల్ల ఆమెకు పని ఎక్కువయి పోతోందా ? సరే.. నీ ఇష్టం !'' పరంధామయ్య రాఘవ ముఖం చూడ్డానికి గూడా ఇష్టపడ కుండా లైట్ ఆఫ్ చేస్ బెడ్ మీద పడు కొన్నాడు.


రాఘవ భారంగా ముందుకు అడుగు లేసు కొంటూ వెళ్లి పొయ్యాడు.


''భార్యామణికి కష్ట మవుతుందని మనల్ని ఇంటి నుండి వెళ్ళ గొడుతున్నాడే నీ సుపుత్రుడు. నేను రాఘవ ఇలా చేస్తాడని కలలో గూడా అనుకోలేదు " అని బాధ పడ్డాడు పరంధామయ్య.


'' అన్నింటికీ కాలమే సమాధానం చెపుతుంది. కాస్త హాయిగా నిద్ర పొండి. '' అంది అన్నపూర్ణమ్మ.

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------


రాఘవ ఆ వారం ' స్పందన ఓల్డ్ ఏజ్ హోమ్ ' లో చేర్పించాడు అమ్మ నాన్నని. ఆహారం బాగున్నా, ఆ వాతావరణం రుచించ లేదు తమకి. అక్కడున్న వాళ్లంతా ఎందుకు ఇక్కడికి వచ్చారని గుచ్చి గుచ్చి అడుగు తున్నారు.

'మా అబ్బాయి, కోడలు అమెరికా వెడతారు త్వరలో.. అందుకే ఇక్కడ చేర్పించాడని' చెప్పింది అన్నపూర్ణమ్మ.


రాఘవ, పిల్లలు కళ్లలో మెదులు తున్నారు. పిల్లలు తమని వదలి ఒక నిముషం గూడా ఉండ లేరు. పాపం.. పిల్లలు ఏమి చేస్తున్నారో.. వేళకు తింటున్నారో లేదో.. రాత్రి అయిందంటే ఎన్ని కథలు చెప్పాలో! హాయిగా తన ప్రక్క పడుకొని నిద్ర పొయ్యే వాళ్ళు. రోజూ జోల పాటలు పాడాలసిందే! లేదంటే వాళ్లకి నిద్ర పట్టదు. రాఘవ ఎందుకు ఇలా చేసాడో తెలియదు..


అన్నపూర్ణమ్మ కు అక్కడ నిద్ర బట్ట లేదు. పిల్లల్ని తలచుకొని ఏడుస్తూ ఉంది ఆ రాత్రంతా. ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారగా వర్షిస్తున్నాయి.

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------

తెల్ల వారింది. తమ రూమ్ కి ఒక బాయ్ కాఫీ, ఇడ్లీలు పట్టు కొచ్చి పెట్టి వెళ్లి పొయ్యాడు. ఎవ్వరూ మాట్లాడే వాళ్ళు లేరు. ఎవరెవరి రూమ్ లలో వాళ్లు ఉన్నారు. సాయంత్రం అలా అందరు ఒక చోటికి చేరి మాట్లాడకొంటారంతే ! మిగతా సమయాల్లో ఎవరెవరి రూముల్లో వాళ్లు ఉండాల్సిందే.


పరంధామయ్య దిగాలుగా ఏదో పరధ్యానంలో ఉన్నాడు. అంతలోనే ఒక ఐదారు మంది లోపలికి వచ్చారు. వాళ్ళ చేతుల్లో పూలు, పళ్ళు, బిస్కట్స్, కొత్త బట్టలు ఉన్నాయి.


''ఈ రోజు మా కిషోర్, వాళ్ళ అమ్మ నాన్నా సంస్మరణార్థం ఇవన్నీ ఆశ్రమంలో ఉండే పెద్దవాళ్లకి ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొంటాడండీ. ఇదో.. మా వాణ్ని దీవించండి '' అని ఒకతన్ని చూపిస్తూ పెద్ద పాకెట్ పరంధామయ్య చేతిలో పెట్టాడు ఒకతను.


తల వంచి ఆయన పాదాల్ని తాకాడు కిషోర్.


'' పది కాలాల పాటు చల్లగా వర్ధిల్లు నాయనా ! '' అని ఇద్దరు ఒకే సారి దీవించారు కిషోర్ ని.


కిషోర్ ఒక్క సారిగా తలెత్తి పరంధామయ్య ముఖంలో కి చూశాడు.


అంతే!


“సార్.. మీరా ? మీరు ఇక్కడ.. ఇక్కడ ఏమి చేస్తున్నారు ?" కిషోర్ పరంధామయ్య రెండు చేతులు పట్టుకొని అడిగాడు ఆశ్చర్యంగా.


' కిషోర్.. నువ్వా.. ఇక్కడా.. ఏమి చేస్తున్నావు ?”

పరంధామయ్య ముఖంలో ఆనందం ప్రస్ఫుటమయ్యింది.


“నేను పెద్ద సాఫ్ట్ వెర్ కంపెనీ లో వైస్ ప్రెసిడెంట్.. మీరిక్కడ ఎందుకు చేరారు ?' మీ అబ్బాయి రాఘవ ఎక్కడ ? '' అని అడిగాడు కిషోర్.


జవాబు చెప్పలేక మౌనంగా రోదించారు అన్నపూర్ణ, పరంధామయ్య ఇద్దరూ.


“నాకు విద్యా భిక్ష పెట్టింది మీరు. నన్ను మీ ఇంట్లో పెట్టుకొని కన్న బిడ్డలా చూసుకొని చదివించారు మీరు.. నన్ను ఇంత వాడ్ని చేసింది మీరు '' అని కన్నీటిని ఆపుకొంటూ పాదాభివందనం చేయ బోయాడు కిశోర్.


''నాన్న అమ్మ చదువు రాని వారు.. మీ ఇంట్లో మా అమ్మ పని చేస్తూ ఉంటే మీరొక్క రోజు నన్ను పిలచి నువ్వు చదువు కొంటావా అని అడిగారు. ఆ రోజు నుండి మీరే నాకు తల్లి తండ్రి అన్నీ అయి చూసుకొన్నారు. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే మీరే కారణం. కానీ మిమ్మల్ని ఇలా ఇక్కడ చూడటం నా వల్ల కావడం లేదు సార్.. అమ్మ నాన్న ఇద్దరు ఇప్పుడు లేరు. అనారోగ్యంతో వాళ్లు చని పొయ్యారు.. ” అంటూ తన కన్నీళ్లను తుడుచు కొన్నాడు కిశోర్.


ఎంత వద్దన్నా వినలేదు కిశోర్. ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్లకి చెప్పి ఖాళీ చేయించి తను ఉన్న ఇంటికి తీసుకు వెళ్లాడు. వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద గదిని తమ కోసం కేటాయించి, అన్ని తానై చూసు కొన్నాడు.


''పద్మా.. ఈ రోజు నుండి మనకు అమ్మ నాన్న వీళ్లే.. నువ్వు వారిని బాగా చూసు కోవాలి. '' భార్యతో అన్నాడు కిషోర్.


పద్మ, కిశోర్ ఇద్దరు అన్నీ తామై చూసుకొన్నారు. అన్నపూర్ణమ్మ, పరంధామయ్యల ఆనందానికి అవధుల్లేవు.

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------


ఆరు నెలల తరువాత ఒక రోజు అది వారం.. తొమ్మిది గంట లయింది. తలుపు బజర్ ఎవరో వేశారు. కిషోర్ వెళ్లి తలుపు తీసాడు


''కిషోర్ గారి ఇల్లు ఇదేనాండి ? ''


''అవును.. మీరు ఎవరు ''


''నేను రాఘవ.. అమ్మ నాన్న ఇక్కడున్నారని ఆశ్రమం వాళ్లు చెప్పారు. చూడ్డానికి వచ్చాను.. అన్నాడు రాఘవ.


''నన్ను గుర్తు పట్టలేదా రాఘవా! నేను కిషోర్ ని.. మంగమ్మ కొడుకుని''


''నువ్వా కిషోర్.. చాలా మారి పోయావు.. నిన్ను చూసి పాతిక సంవత్సరాలు అయి ఉంటుంది గదా ! నేను రాఘవను. ''


రాఘవ కంటే కిషోర్ పదేళ్లు పెద్ద వాడు. కిషోర్ చదివేటప్పుడు రాఘవకు రెండు ఏళ్ళు ఉంటాయి.


''రాఘవ.. అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారు.. రూములో ఉన్నారు.. పిలుస్తాను. ''


అన్నపూర్ణ, పరంధామయ్య హాల్లోకి వచ్చారు. రాఘవ వాళ్ళను చూస్తూనే ఏడపు ఆపుకోలేక పొయ్యాడు.


''నన్ను క్షమించండి నాన్నా.. నేను ఉండి గూడా మిమ్మల్ని ఇక్కడ ఇలా చూడాల్సి వస్తోంది. ''


“చెప్పమ్మా.. ఉషా, పిల్లలు కులాసాగా ఉన్నారా ? అని అడిగింది అన్నపూర్ణమ్మ.


''అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి '' అంటూ చిన్న పిల్లాడిలా చుట్టేశాడు రాఘవ తన అమ్మని.


అన్నపూర్ణమ్మ కి ఏడుపు ఆగలేదు.


''రాఘవా.. రిలాక్స్.. కాఫీ తాగు.. '' అని పద్మ తెచ్చి ఇచ్చిన కాఫీ అందించాడు కిషోర్.


రాఘవ వద్దని సైగ చేసాడు.


''కిషోర్! ఐ ఆమ్ సో సారీ.. అమ్మ నాన్న ని ఈ ఆరు నెలలు చూసు కొన్నందుకు, ఐ ఆమ్ సో గ్రేట్ ఫుల్ టు యు'' అన్నాడు రాఘవ.


'' రాఘవ.. ఒక్క మాట చెబుతాను. మనల్ని కనీ పెంచి పెద్ద చేసిన అమ్మ నాన్నలు మనకు బరువెట్లా అవుతారు ? పిల్లలు, పెళ్ళాం బరువు కాదు కానీ అమ్మ నాన్నలు బరువైపోతారా? వాళ్ళ అవసాన దశలో మనం ఆ మాత్రం బాధ్యతలు తీసుకోలేమా? తల్లితండ్రులను చూసుకోవడం ఒక ఆబ్లిగేషన్ అంటే నేను ఒప్పుకోను. అది మన జీవితంలో ఒక భాగం. ''


'' అవును. నేను అమ్మా నాన్న పట్ల బాధ్యతా రహితంగా ప్రవర్తించాను. నేను అమ్మా నాన్నను ను ఇంటికి పిలుచుకొని పోతాను''


'' అమ్మా నాన్నను అడుగు.. వాళ్ళు వెళతామంటే నాకేమీ అభ్యంతరం లేదు.. అవును.. ఉషా, పిల్లలు ఎక్కడ ? అని అడిగాడు కిషోర్.


''వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు '' అన్నాడు రాఘవ.


''అయితే అమ్మా నాన్న గూడా ఇక్కడే ఉంటారు. వాళ్ళు రారు. '' అన్నాడు కొంచెం కటువు గానే.


ఎంత అడుగుతున్నా రాఘవ వెంట పోవడానికి సాహసించ లేదు అన్నపూర్ణమ్మ, పరంధామయ్య. చేసేదేమీ లేక వెను తిరిగి పొయ్యాడు రాఘవ.


''సార్.. రాఘవ కి పూర్తిగా జీవితం పట్ల అవగాహన లేదు. తాను నిజంగా మారి ఉంటే తన భార్య, పిల్లల్తో వచ్చి క్షమాపణ కోరే వాడు. ఇంట్లో కొడుకు, కోడలు, పిల్లలు అందరూ వయసు బడిన అమ్మ నాన్నలు తమ తోనే ఉండాలి అనుకోవాలి. వాళ్ళ మనస్సులో ప్రేమ పొంగాలి. కళ్లలో నీళ్లు రావాలి. తల్లి తండ్రి అంటే ఒక దైవ సంబంధం. ఆ అనుబంధాన్ని త్రుంచేసు కొంటే జీవితాంతం నరక యాతన అనుభవించాలి. రేపు మన పిల్లలు గూడా అలాగే మనకు చెయ్యరని గ్యారంటీ ఏమిటి ? ''


రెండు గంటల తరువాత మళ్ళీ బజర్ నొక్కారు ఎవరో. రాఘవ, పెళ్ళాం, పిల్లలతో లోపలికి వచ్చారు. వస్తూనే పిల్లలు తాతా, బామ్మని చుట్టేసి కొన్నారు. ముద్దులతో ముంచెత్తారు. ఉష ఒక్కసారిగా అన్నపూర్ణమ్మ, పరంధామయ్య లకు పాదాభివందనం చేసింది. ఆమె కన్నీళ్లు వాళ్ళ పాదాల మీద పడి బొట్టు బొట్టుగా జారి పడుతున్నాయి. రాఘవ గూడా కళ్ళు వత్తుకొంటూ నాన్నను పొదివి పట్టు కొన్నాడు.


'' లే అమ్మా.. నువ్వేమి తప్పు చేసావని ? అన్నది అన్నపూర్ణమ్మ.


''మీరు క్షమిస్తానంటే నేను లేస్తానత్తయ్యా. మిమ్మల్ని క్షోభ పెట్టిన దాన్ని నేను. మీరు వెళ్లి నప్పటి నుండి ఇల్లు బోసి పోయింది. పిల్లలు ఒక్కటే కలవరం.. అన్నం గూడా తినడం లేదు.. మా ఆఫీస్ కోల్లీగ్స్ చెప్పిన మాటలు విని మిమ్మల్ని ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్ లో నేనే చేర్పించ మన్నాను. నా బాధ్యతల నుండి దూరంగా పారి పోవాలను కొన్నాను. మీరు ఇంట్లో ఉంటే ఆ ధైర్యం, ఆ మానసిక బలం ఇప్పుడు అర్థ అయ్యింది నాకు. నన్ను క్షమించి ఇంటికి రండి. నేను గూడా మీ బిడ్డనే అనుకోండి. '' అంది ఉష.


ఉష పశ్చాత్తాపంతో కుమిలి పోయింది.

'' పోదాం పదండి.. ఒరేయ్ పిల్లలూ.. రండర్రా. మనం కార్ బ్యాక్ సీట్ లో కూర్చోని రైమ్స్ చెప్పుకొందాము '' అంటూ చిన్న పిల్లాడిలా గెంతుతున్న పరంధామయ్య ను చూసి అక్కడున్న వాళ్ళు అందరూ నోరెళ్ళ బెట్టారు.


కిషోర్, పద్మ లకు వీడ్కోలు చెబుతూ గాఢంగా హత్తుకొని కృతజ్ఞతగా రెండు చేతులూ జోడించి సెలవు తీసు కొన్నారు రాఘవ, ఉష దంపతులు.


ఐశ్వర్యము అక్కర లేదు. బంగళాలు, బంగారాలు అక్కర లేదు. ఇంట్లో అందరు కలిసి మెలిసి ఆప్యాయతలు, మమతానురాగాలుతో ఉంటే అదే ఆనందం, అదే ఆరోగ్యం.. అదే అందరికి శ్రీ రామ రక్ష .

గోతెలుగు. కాం లో ప్రచురితం.

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------

వారణాసి భానుమూర్తి రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

వారణాసి భానుమూర్తి రావు గారు ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని మహల్ రాజుపల్లె లో జన్మించాడు. అతను వృత్తిరీత్యా కార్పొరేట్ కంపెనీలల్లో ముఖ్య ఆర్థిక కార్య నిర్వహణాధికారిగా పనిచేసాడు. ప్రవృత్తి రీత్యా కథలు , వచన కవితలు రాస్తున్నాడు. ఇప్పటికి అతను 60 కథానికలు, 600 దాకా వచన కవితలు రాశాడు. అతని కథలు ఆంధ్ర జ్యోతి , విజేత , ఆంధ్ర ప్రభ మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. మొదటి కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో 1981 లో 'జీవన గతులు ' అనే కథ అచ్చయ్యింది. తరువాత ' ఈ దేశం ఏమై పోతోంది? ' అనే అదివారం ఆంధ్రప్రభ దిన పత్రిక లో అచ్చయ్యింది. ఆంధ్ర జ్యోతిలో పది కథలు దాకా అచ్చయ్యాయి. నల్లటి నిజం , జన్మ భూమి , అంతర్యుద్ధం , వాన దేముడా! లాంటి కథలు అచ్చు అయ్యాయి. 2000లో "*సాగర మథనం* ", 2005 లో " *సముద్ర ఘోష*" అనే కవిత సంపుటిలను ప్రచురించాడు. అందులో "సముద్ర ఘోష" పుస్తకాన్ని అక్కినేని నాగేశ్వర రావు గారికి అంకితం చేశారు. ఈ పుస్తకాన్ని జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి. నారాయణ రెడ్డి విడుదల చేసారు. అతను రాసిన కథ "పెద్ద కొడుకు" ( రాయల సీమ రైతు బిడ్డ మీద కథాంశం) భావగీతి ప్రతిలిపి 2014 కథల పోటీలో ప్రతిలిపి ద్వారా ప్రత్యేక బహుమతి పొందింది.ఈ కథను 60000 మంది పాఠకులు చదివారు. 4500 మంది స్పందించారు.

వారణాసి భానుమూర్తి రావు రాయలసీమ వ్యవహారిక బాషలో వ్రాయడానికి ఇష్టపడతారు.ఇప్పుడు " రాచపల్లి కథలు " , " నాన్నకు జాబు " అని తమ చిన్ననాటి అనుభవాలన్నింటినీ అక్షర రూపంలో నిక్షిప్తం చేస్తున్నారు.‌ .అలాగే తన మొట్టమొదటి నవలా ప్రక్రియను " సంస్కార సమేత రెడ్డి నాయుడు " తెలుగు వారి కోసం వ్రాశారు .ఆ తరువాత '' వరూధిని - ప్రవరాఖ్య '' శృంగార ప్రబంధ కావ్యాన్ని తమ దైన శైలిలో నవలీ కరణ చేశారు . కరోనా పై వీరు రాసిన కవిత ఆంధ్ర ప్రభలో ప్రచురించారు. సాహిత్య రంగంలో విశేషమైన ప్రతిభ ను కనబరచిన వీరికి సాహితీ భూషణ , ప్రతిలిపి కవితా ప్రపూర్ణ ,సహస్ర కవి రత్న అనే బిరుదులు లభించాయి.

వారణాసి భానుమూర్తి రావు గారు ఇటీవల అనగా ఏప్రిల్‌ నెల 2022 లో రెండు పుస్తకాలు పాఠక లోకానికి అందించారు. 1. *మట్టి వేదం* కవితా సంపుటి 2. *సంస్కార సమేత రెడ్డి నాయుడు* తెలుగు నవల . గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ వారిచే సాహిత్య రంగంలో విశేష మైన సేవలు చేసినందుకు గానూ , వీరి *మట్టి వేదం* కవితా సంపుటికి , *గిడుగు రామమూర్తి సాహిత్య పురస్కారం -2022* ని అందు కొన్నారు.

తెలుగు కవులు లో వారణాసి వారి కథలు రాయల సీమ గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో కలిగి వుంటాయి.చిత్తూరు జిల్లాకు చెందిన వారణాసి భానుమూర్తి గారి కథలు , కవితలు వివిధ ఆన్ లైన్‌ పత్రికలలో వచ్చాయి. త్వరలో మరి కొన్ని నవలలు , కథల సంపుటాలు , కవితా సంకలనాలు వెలువడుతున్నాయి.ఇంతవరకు మూడు కవితా సంపుటిలు , ఒక నవలను పాఠక లోకానికి అందించారు.

*వీరి ముద్రిత రచనలు* ------------------

1. *సాగర మథనం* : 2000 సంవత్సరంలో అవిష్కరించారు. డాక్టర్ గోపీ గారు , తెలుగు అకాడమీ ప్రధాన సంచాలకులు , ఈ కవితా సంపుటి మీద ముందు మాట వ్రాశారు.

2. *సముద్ర ఘోష*: 90 కవితలున్న ఈ కవితా సంపుటి 2005 సంవత్సరంలో జ్డానపీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు ( సినారె) అవిష్కరించారు. ఈ పుస్తకాన్ని , పద్మ విభూషణ్ డాక్టర్ నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకిత మిచ్చారు .

3. *మట్టి వేదం* : 70 కవితలున్న ఈ కవితా సంకలనాన్ని 2022 ఏప్రిల్‌ నెల 17 వ తేదీ వెలువరించారు.‌ ఈ పుస్తకానికి కే రే జగదీష్ గారు , ప్రముఖ కవి , జర్నలిస్టు ముందు మాట వ్రాశారు

4. *సంస్కార సమేత రెడ్డి నాయుడు* : ఇది రచయిత గారి తొలి నవలా ప్రక్రియ. ఈ నవల 17 ఏప్రిల్ 2022 నాడు అవిష్కరణ జరిగింది. ఈ నవల రాయల సీమ కక్షలు , ఫాక్షన్ ల మధ్య ఎలా రెండు కుటుంబాలు , రెండు గ్రామాలు నలిగి పొయ్యాయో తెలిపిన కథ. శ్రీమతి రాధికా ప్రసాద్ గారు ఈ నవలకు ముందు మాట వ్రాశారు. ఈ నవలకు ప్రతిలిపి సాహిత్య అవార్డు - 2021 అందు కొన్నారు.

5. *పెద్ద కొడుకు* : 19 కథల సంపుటి. వారణాసి భానుమూర్తి రావు గారు వ్రాసిన కథల సంపుటి *పెద్ద కొడుకు* తుమ్మల పల్లి కళా క్షేత్రం , విజయ వాడ లో మల్లె తీగ వారు నిర్వహించిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాల సందర్భంగా శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు , ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చేర్ పర్సన్ , కళారత్న శ్రీ బిక్కి కృష్ణ , తదితరుల చేతుల మీదుగా 20.11.2022 తేదీన అవిష్కరించారు. ఇందులో 19 కథలు ఉన్నాయి. ప్రతి కథ ఆణి ముత్యమే. కళా రత్న శ్రీ బిక్కి కృష్ణ గారు ముందు మాట వ్రాసిన ఈ పెద్ద కొడుకు కథల సంపుటి మానవీయ విలువల్ని అనేక కోణాల్లో రచయిత స్పృశించారు. వారణాసి గారు ఈ " పెద్ద కొడుకు " కథల సంపుటిని పాఠక లోకానికి అందించారు. ఇందులోని కథలన్నీ ఆణి ముత్యాలే! సమాజానికి సందేశ మిచ్చే కథలే!

*అముద్రిత రచనలు*

1 . *వరూధిని ప్రవరాఖ్య* : అల్లసాని పెద్దన గారి మను చరిత్రము నవలీ కరణ చేశారు‌. ఇది ఇంకా అముద్రితము.త్వరలో ప్రచురణకు వస్తుంది.

2 .*రాచ పల్లి కథలు* : తన చిన్న నాటి అనుభూతుల్ని , గ్రామీణ ప్రాంతాల్లో తను గడిపిన అనుభవాల్ని క్రోడీకరించి వ్రాసిన కథానికలు . త్వరలో ప్రచురణకు వస్తుంది.

3 . *నాలుగవ కవితా సంపుటి* త్వరలో వస్తుంది.

4 . *నాయనకు జాబు* అనే ధారావాహిక ఇప్పుడు వ్రాస్తున్నారు. లేఖా సాహిత్యం ద్వారా కథను వాస్తవిక సంఘటనలతో చెప్పడం ఈ జాబుల ప్రత్యేకత.

*విద్యాభ్యాసం* -----------

వారణాసి భానుమూర్తి గారి విద్యాభ్యాసం అంతా చిత్తూరు జిల్లాలో జరిగినది.

ఐదవ తరగతి వరకూ ప్రాధమిక పాఠశాల మహల్ లో , తరువాత ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకూ మహల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జరిగింది. ఆ తరువాత తొమ్మిది , పది తరగతులు మేడికుర్తి కలికిరి చిత్తూరు జిల్లా జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల లో చదివారు.‌ ఇంటర్మీడియట్ మరియు బి కాం బీ.టీ కాలేజీలో చదివారు.‌ తరువాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు ఎస్ వీ యూనివర్సిటీ లో చదివారు.‌ వుద్యోగ నిమిత్తం హైదరాబాదు వెళ్ళిన తరువాత అక్కడ కాస్ట్ అండ్ మేనేజ్ మెంట్ అక్కౌంటన్సీ ( FCMA) చేశారు.‌ ప్రొఫెషనల్ అక్కౌంట్స్ లో నిష్ణాతులయ్యారు.

*వృత్తి* ------

వారణాసి భానుమూర్తి గారు అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ జనరల్ మేనేజర్ గా వివిధ కార్పోరేట్ కంపెనీలల్లో పని చేశారు. హైదరాబాదు మహా నగర మంచి నీటి సరఫరా మరియు మురుగు నీటి సంస్థలో చీఫ్ జనరల్ మేనేజర్ (అక్కౌంట్స్) గా పని చేశారు.ఒక పేరు పొందిన నిర్మాణ సంస్థలో సీనియర్ జనరల్ మేనేజర్ (అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ ) గా పని చేసి వివిధ బాధ్యతలను 36 సంవత్సరాల పాటు నిర్వర్తించారు. కాస్ట్ అక్కౌంట్స్ హైదరాబాదు చాప్టర్ కి వైస్ చేర్మన్ హోదాలో బాధ్యతలను నిర్వర్తించారు.

వృత్తి ఏమైనప్పటికీ , ప్రవృత్తిగా కవిగా , రచయితగా రాణించారు. పదవ తరగతి నుండీ కవితలు , కథానికలు వ్రాశారు.ఇతని కథలు , కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ‌

ఇతనికి ఇంత వరకు లభించిన బిరుదులు; 1. ప్రతిలిపి కవితా ప్రపూర్ణ 2. సహస్ర కవి రత్న 3. సాహితీ భూషణ 4. గిడుగు రామమూర్తి వారి సాహిత్య పురస్కారం 2022 లో. 5. ప్రతిలిపి సాహిత్య అవార్డు - 2021 6. కళావేదిక వారి సాహితీ పురస్కారం 31.12.2022 న అందుకొన్నారు.

118 views0 comments
bottom of page