top of page
Writer's pictureMohana Krishna Tata

ఆన్‌లైన్ బిర్యానీ



'Online Biryani' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 27/01/2024

'ఆన్‌లైన్ బిర్యానీ' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



సుబ్బారావు కి చిన్నప్పటినుంచి దెయ్యాలంటే చాలా భయం. ఆ భయం తనతోపాటు అలానే పెరుగుతూ వచ్చింది. అందుకే, హారర్ సినిమాలంటే, చాలా దూరంగా ఉంటాడు. అలాంటి మనిషికి పెళ్ళయింది. తలంటు పోసుకుని జుట్టు ఆరబెట్టుకుంటున్న తన పెళ్ళాన్ని దగ్గరగా చూస్తే.. ఆ రోజు సుబ్బారావు కు గుండె దడే..! ఇద్దరు పిల్లలతో జీవితం హ్యాపీ గానే సాగిపోతుంది.


ఒక రోజు తన భార్య పుట్టింటి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడి భర్త దగ్గరకు వచ్చింది పెళ్ళాం..


"ఏమండీ! మా నాన్నకి ఒంట్లో బాగోలేదంట. నా గురించి కలవరిస్తున్నారు. నేను ఇప్పుడే బయల్దేరతానండి..ఇలా వెళ్లి, నాన్నను చూసి..అలా వచ్చేస్తాను. ఒక్క రోజు అడ్జస్ట్ చేసుకోండి. పిల్లల్ని మీరు చూసుకోలేరు..నాతో తీసుకెళ్తాను. ఇలాంటి పరిస్థితిలో 'నో' అని అనలేడు సుబ్బారావు. పెళ్ళయిన దగ్గర నుంచి ఎప్పుడూ పెళ్ళాన్ని విడచి ఒంటరిగా ఉన్నది లేదు.


మా ఆవిడ ఊరు ఉదయం వెళ్లి.. సాయంత్రానికి వస్తే బాగుండేది. ఇలా సాయంత్రం బయల్దేరితే..రాత్రంతా నేను ఒక్కడినే ఇంట్లో ఉండాలా..? తలుచుకుంటేనే చాలా భయం వేస్తోంది. అసలే మొన్న దెయ్యం కనిపించిందని ఆ రామారావు వీధిలో అందరికీ చెప్పాడు. పైగా, ఈ పండుగ టైం లో దొంగతనాలు ఎక్కువనీ... రాత్రి పూట జాగ్రతగా ఉండమని పోలీసుల హెచ్చరిక ఉండనే ఉంది.


ఇదంతా మరచిపోయి..కాసేపు టీవీ చూద్దాం అనుకున్నాడు సుబ్బారావు. అదే టైం లో, టీవీ లో క్రైమ్ ప్రోగ్రాం వస్తోంది. అందులో..ఇంట్లో ఒక్కడే ఉన్న ఇంటి ఓనర్ పై దొంగలు దాడి చేసి..హత్య చేసి ఇల్లంతా దోచుకున్నారని చూపిస్తున్నారు. 'ఇదేదో నన్ను ఇబ్బంది పెట్టడానికే చెబుతునట్టు ఉంది' అని భయమేసి ఛానల్ మార్చేశాడు సుబ్బారావు. మరొక ఛానల్ లో..చనిపోయిన మనిషి దెయ్యంగా ఇంటికి వచ్చి తలుపు కొట్టాడని చూపిస్తున్నారు...అంతే..! భయమేసి టీవీ ఆపేసాడు.


నా పెళ్ళాం అర్జెంటు గా వెళ్లిపోయింది. వంట కుడా ఏమీ చెయ్యలేదు. వెళ్తూ..తన పెళ్ళాం ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకోమని చెప్పినట్టు గుర్తు వచ్చింది. ఏం చేస్తాం...? ఆకలి ఆగదు కదా..! అనుకున్నాడు సుబ్బారావు. ఫోన్ తీసి..ఆన్‌లైన్ యాప్ లో తనకి ఇష్టమైన బిర్యానీ ఆర్డర్ చేసాడు. అది కుడా ఫేమస్ హోటల్ నుంచి..ఆ హోటల్ చాలా దూరంగా ఉండడం చేత, డెలివరీ టైం ఒక గంటకు పైగానే చూపించింది.


ఈ లోపు అలా వరండా లోకి వెళ్లి చూసాడు. చల్లటి గాలి వేస్తోంది. గాలికి కదులుతున్న కొబ్బరి ఆకుల నీడ గోడ పై పడి..ముందుకు వెనక్కు కదులుతుంది. అసలే భయానికి కేర్ అఫ్ అడ్రస్ అయిన మన సుబ్బారావు...దానిని చూసి భయపడి వెంటనే తలుపు వేసేసాడు. సోఫా లో కూర్చొని..ఫుడ్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నాడు.


ఈ లోపు మెల్లగా వాన మొదలైంది. చిన్న చినుకు గా మొదలైనది కాస్త పెద్దది అయ్యింది. అలా వాన లో సిటీ అంతా తడిసి ముద్దవుతున్నాది. ఈలోపు న్యూస్ కోసం టీవీ పెట్టాడు సుబ్బారావు. బ్రేకింగ్ న్యూస్ లో సిటీ అంతా జలమయం..ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరిక చేసారని న్యూస్. ఆకలి వేస్తున్న సుబ్బారావు, నా బిర్యానీ ఎప్పుడు వస్తుందో అని తన యాప్ ఓపెన్ చేసి.. ట్రాకింగ్ చూసాడు. 'హమ్మయ్యా! నా ఆర్డర్ క్యాన్సిల్ చెయ్యలేదు...దారిలో ఉంది..'..


ఇలా అనుకున్నాడో లేదో...ఆ కరెంటు కాస్తా పోయింది. ఒకేసారి ఇల్లంతా చీకటిమయం. ఫోన్ లో టార్చ్ వెయ్యడానికి కుస్తీ పడ్డాడు. మొత్తానికి వెలిగింది.. అంతా నిశ్శబ్దంగా ఉంది. సడన్ గా కిచెన్ లో ఏదో చప్పుడు.. సుబ్బారావు గుండె జారింది..దొంగా? అని కంగారు పడుతూ..మెల్లగా వెళ్లి చూసాడు. పెరటి తలుపు తీసి ఉంది..మొదట్లో దొంగ అని భయపడ్డాడు..తర్వాత 'మియావ్' అని వినిపించడం తో...ఊపిరి పీల్చుకున్నాడు సుబ్బారావు.


చాలాసేపు తర్వాత..కరెంటు వచ్చింది. అప్పుడే.. కాలింగ్ బెల్ మోగింది. బిర్యానీ వచ్చిందేమోనని ఆనందంలో తలుపు తీసాడు. ఎదురుగా ఒక మనిషి ఫుడ్ పార్సెల్ పట్టుకుని పూర్తిగా తడిసిపోయి ఉన్నాడు.


"సర్! పూర్తిగా తడిసిపోయాను..ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి ఇంకా వర్షం తగ్గలేదు. నాకు ఆకలి వేస్తోంది. నేను మీతో పాటు డిన్నర్ ఇక్కడే చేయవచ్చా?" అడిగాడు వచ్చిన డెలివరీ బాయ్


"ఒంటరిగా ఉండలేక...తోడు దొరికిందన్న ఆనందంలో...లోపలికి రమ్మన్నాడు సుబ్బారావు"


లోపలికి వచ్చిన తర్వాత ఇద్దరు డిన్నర్ చేస్తున్నారు..డెలివరీ బాయ్ తన ఇంట్లోంచి తెచ్చుకున్న బాక్స్ ఓపెన్ చేసి తినడం మొదలుపెట్టాడు.. సుబ్బారావు పార్సెల్ లో బిర్యానీ తింటున్నాడు.


"సర్..ఇంట్లో ఒక్కరే ఉన్నారా?" అడిగాడు డెలివరీ బాయ్

"అవును.."

"కొంచం మంచి నీళ్ళు ఇస్తారా సర్!.."


కిచెన్ లోకి వెళ్లి సుబ్బారావు గ్లాసు తో నీళ్ళు తెచ్చాడు. హాల్ లోకి వచ్చి చూస్తే.. డెలివరీ బాయ్ లేడు. మొత్తం అంతా చూసాడు. ఎక్కడా లేదు. 

ఇప్పటివరకు ఇక్కడే ఉన్న మనిషి సడన్ గా ఎక్కడకు వెళ్ళాడు? అని అనుకుంటుండగానే..భయానికి చెమటలు పట్టేసాయి సుబ్బారావు కు. సుబ్బారావు సోఫా మీద ఉన్న రిమోట్ పై అనుకోకుండా కూర్చున్నాడు...వెంటనే టీవీ ఆన్ అయ్యింది..


బ్రేకింగ్ న్యూస్...ఫుడ్ డెలివరీ బాయ్...వర్షం లో గల్లంతు..ఫుడ్ డెలివరీ కోసం వెళ్తుండగా ఘటన..అని అతని ఫోటో చూపించారు..


న్యూస్ చూసి సుబ్బారావు కు చెమటలు ఇంకా ఎక్కువ అయ్యాయి...చూపిస్తున్న వ్యక్తి గల్లంతైతే.. మరి ఇప్పటివరకు ఇక్కడ ఉన్నది ఎవరు...?అతనే ఇతను కదా! కొంపదీసి దెయ్యం అయి వచ్చాడా..? తలచుకుంటూ...గజ గజ వణికిపోయాడు సుబ్బారావు. ఇంక జన్మలో ఆన్‌లైన్ లో బిర్యానీ తెప్పించనని డిసైడ్ చేసుకుని.. టీవీ ని ఆపేసాడు.


ఈలోపు..సుబ్బారావు భార్య నుంచి ఫోన్ వచ్చింది..


"ఏమండీ! ఫుడ్ ఆర్డర్ వచ్చిందా? భోజనం చేసారా?" అని ప్రశ్నల వర్షం కురిపించింది 

"వచ్చింది...ఏదో చేసాను..."

"ఏం తిన్నారు...బిర్యానీ యే కదా ..!" అంది భార్య 

"ఆ మాట ఎత్తకు...నాకు ఒణుకు వస్తుంది..."

"మీకు ప్రతిదానికి భయమే...! ఇప్పుడు మా నాన్నకు బాగానే ఉంది. నేను రేపు ఉదయాన్నే వచ్చేస్తాను లెండి...కమ్మగా వండి పెడతాను.."


పెళ్ళాం మాటలతో కొంచం రిలీఫ్ వచ్చినా..మరో పక్క డెలివరీ బాయ్ విషయంలో.. భయం ఇంకా పోలేదు సుబ్బారావు కు..


టీవీ న్యూస్ లో...ఆన్‌లైన్ డెలివరీ బాయ్ తమ్ముడు.. తన అన్న డెలివరీ కోసం వెళ్లి చనిపోయాడని బాధపడుతున్నట్టు చూపిస్తున్నారు. "మేము ఇద్దరమూ ట్విన్స్..చూడడానికి ఒకేలాగ ఉంటాము. ఆన్‌లైన్ డెలివరీ చేస్తాము. నేను ఇప్పుడే ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత..ఫోన్ రావడంతో వెంటనే ఇక్కడకు వచ్చేసాను. ఈ రోజు నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు మా అన్నయ్య..!" అని విలపిస్తున్నాడు..సుబ్బారావు కు బిర్యానీ డెలివరీ చేసిన బాయ్


ఈ విషయం తెలియక సుబ్బారావు..పాపం! రాత్రంతా భయపడుతూనే ఉన్నాడు..


*****

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ



62 views0 comments

Comments


bottom of page