'Pacchani Samsaram' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 07/09/2024
'పచ్చని సంసారం' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
"అమ్మాయి సరళ.. ! కొత్తగా పెళ్ళైన నువ్వు.. నీ మొగుడుని ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి.. అసలే మీ ఆయన అందగాడు.. పైగా మీరు సిటీ లో కొత్తగా కాపురం పెట్టబోతున్నారు. అసలే కొత్త ప్లేస్.. అక్కడ అందరి ఆడవారి కళ్ళు మీ కాపురం మీదే ఉంటాయి.. ముఖ్యంగా మీ ఆయన మీదే ఉంటాయి. రోజులు అసలే బాగోలేవు.. మీ ఆయనని కొంగున ముడి వేసుకుని జాగ్రతగా కాపాడుకో తల్లీ.. "
"అలాగే అమ్మా.. ! నువ్వు చెప్పినట్టే చేస్తాను.. సిటీకి కొత్తగా వెళ్తున్నా సరే.. మా ఆయన నాకే సొంతం.. " అంది సరళ.
"జాగ్రత్త సరళ.. " అంది తల్లి.
సరళ దంపతులు కొత్తగా సిటీ లో కాపురం పెట్టారు. మర్నాడు పక్కింటావిడ కాంతమ్మ పలకరింపుకి వచ్చింది..
"మీరు కొత్తగా వచ్చారా అమ్మాయి.. ? నీ పేరేమిటో.. ?"
"అవునండీ.. నిన్ననే వచ్చాం.. నా పేరు సరళ.. "
"మీ ఆయన ఏం చేస్తుంటారో.. ?"
"సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి.. "
"మీ పెళ్ళి ఫోటోలో చాలా బాగున్నారే.. మీ ఆయన.. చాలా స్మార్ట్ గా ఉన్నారే.. !"
"మా ఆయన ఎలా ఉంటే, మీకెందుకు.. ?" అంది కోపంగా సరళ.
"బాగుంటే, బాగున్నారని అనకూడదా.. ? ఏమో.. ఎప్పుడైనా అవసరమొస్తే, మా అమ్మాయిని ఇద్దామని అడిగాను అంతే.. "
"ఏమిటండీ... ఆ మాటలు.. ఇలాగేనా మాట్లాడేది.. కొత్తగా పెళ్ళైన అమ్మాయితో.. "
"ముందు ఇలాగే అంటారు చాలా మంది. ఇంతకుముందు ఈ ఇంట్లో ఉండే కొత్త జంట.. నెల తిరగకముందే ఒకటే తిట్టుకోవడం, కొట్టుకోవడం.. ఇంకో నెల తిరిగేసరికి విడాకులు.. కట్ చేస్తే.. మ్యాట్రిమోని లో ఆ అబ్బాయి ఫోటో... అప్పుడే మా పెద్ద అమ్మాయికి ఆ అబ్బాయిని ఇచ్చి వెంటనే పెళ్ళి చేసేసాను.. ఇప్పుడు వాళ్ళు హ్యాపీ గా ఉన్నారు. ఇప్పుడు మీరు అదే ఇంట్లో దిగారు.. "
"మా ఆయన చాలా మంచివారు.. నన్ను చాలా బాగా చూసుకుంటారు.. నేనంటే ఆయనకి ఎంతో ప్రేమ.. " అంది సరళ.
"మొదట్లో అలాగే ఉంటుంది.. పోను పోను చూడాలి.. "
'ఈవిడతో మాట్లాడి గెలవడం కష్టం.. పంపించేస్తే బెటర్.. '
“నాకు వంటింట్లో చాలా పనుంది... మీకూ ఇంట్లో పని ఉంటుందేమో కదా కాంతమ్మ గారు... "
"వెళ్తాను లే అమ్మాయి.. అవసరమైనప్పుడు మళ్ళీ వస్తాను.. "
***
మర్నాడు..
"హలో.. ! నేను ఎదురింట్లో ఉంటాను.. నా పేరు మీనాక్షి.. మీరు కొత్తగా వచ్చారు కదా.. చూసి పోదామని వచ్చాను.. "
"అవునండి.. మీరు చూస్తే మంచివారి లాగా ఉన్నారే.. "
"నువ్వు మంచి దానిలాగా ఉన్నవే.. నీ పేరు.. ?"
"సరళ.. "
"మంచి పేరు.. మీ ఆయన పేరో.. ? "
" శ్రీనివాస్.. "
"మా అమ్మాయి పేరు పద్మ.. ఇద్దరి పేర్లు ముందే కలిసిపోయాయే.. ! మీ ఆయన పెద్ద ఆఫీసర్ అంట కదా.. ఫోటో లో చాలా బాగున్నారే.. " అంటూ ఫోటో చూస్తూ మురిసిపోయింది..
"మీరు ఇలా మాట్లాడడం మర్యాద కాదు.. " అంది సరళ.
"మా అమ్మాయికి రెండో పెళ్ళివాడైనా పర్వాలేదు.. అందంగా ఉండి.. పెద్ద ఆఫీసర్ అయితే చాలు.. "
'ఇదేమిటి అందరూ మా ఆయన మీదే కన్నేశారు... అమ్మ చెప్పింది నిజమే.. ! ఈ సిటీ లో అందరూ ఇంతేనేమో.. కాస్త జాగ్రతగా ఉండాలి.. ' అనుకుంది సరళ.
సాయంత్రం భర్త ఇంటికి రాగానే..
"ఏమండీ.. ! నేనంటే మీకు ఎంత ప్రేమ.. ?" అడిగింది సరళ.
"ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ సందేహం సరళ.. "
"ఏమోనండీ.. మీరేమో చాలా బాగుంటారు... నేనేమో మాములుగా ఉంటాను.. అందుకే అడిగాను"
"నువ్వంటే, ఇష్టమే సరళ.. "
"ఈ ఇంటి గురించి అందరూ ఏదోలాగా మాట్లాడుతున్నారు.. వేరే ఇల్లు చూడండి. ఇక్కడే ఉంటే, మీరు మారిపోతారేమోనని చాలా భయంగా ఉంది.. ఈ మధ్య నా మీద కాస్త కోపం కుడా ఎక్కువైంది మీకు.. "
"ఈ సిటీ లో ఇల్లు దొరకడం కష్టం.. ఇల్లు మారడం కుదరదు. ఇంక కోపం అంటావా.. ఆఫీసులో ఏవో టెన్షన్స్ అంతే.. " అన్నాడు భర్త.
"అమ్మా.. ! నాకు చాలా భయంగా ఉందే.. " అంటూ ఏడుస్తూ అంది ఫోన్ లో సరళ.
"ఇప్పుడు ఏమైందే తల్లీ.. ?"
"ఏం చెప్పనమ్మా.. ! ఈ మధ్య మా ఆయన నా మీద తెగ కోప్పడుతున్నారే.. "
"ఆఫీస్ లో ఏవో టెన్షన్స్ అయి వుంటాయి. ఎందుకైనా మంచిది.. నీ మీద జ్యాస పోకుండా చూసుకో సరళ.. "
"దానికి ఏం చెయ్యమంటావు అమ్మా.. ?"
"సిటీ లో పేరున్న సిద్దాంతి ఒకరు ఉన్నారు. ఆయన పెద్ద పెద్ద వాళ్ళకి జాతకం చూసి, మొత్తం చెప్పేస్తాడు. ఈ మధ్య టీవీ లో కుడా తెగ పాపులర్ అయ్యాడు. ఆయన అడ్రస్ ఇస్తాను.. వెళ్లి కలువు.. "
"అలాగే అమ్మా.. "
అమ్మ చెప్పిన సిద్దాంతిని కలవడానికి బయల్దేరింది సరళ..
"నమస్తే గురూజీ.. ! నన్ను మీరే కాపాడాలి.. "
"నీ సమస్య ఏమిటో చెప్పు బాలిక.. ?"
"మా ఆయన నాకు కాకుండా పోతారేమోనని భయంగా ఉంది.. నా మీద ఎప్పుడూ కోప్పడుతున్నారు.. ఇంటి దగ్గర అందరి కళ్ళు మా ఆయన పైనే.. "
"అర్ధమైంది... మీ వారి జాతకం చూసి చెబుతాను.. "
"సరే.. "
"మీ వారి జాతకం చాలా బాగుంది.. ఇల్లు మారనవసరం లేదు.. కానీ ఒక పని చెయ్యి. మీ ఆయన కుడి చేతికి ఎర్ర రంగు ఉంగరం పెట్టు.. ఆడవారంతా దూరంగా పారిపోతారు.. "
"అలా చేస్తే.. నా మీద ప్రేమ పెరుగుతుందా గురూజీ... ?"
"దానికోసం... నీ జాతకం ప్రకారం నువ్వు పచ్చ రంగు ఉంగరం పెట్టుకో... నీ సంసారం పచ్చగా ఉంటుంది.. "
కాస్త డబ్బులు ఎక్కువైనా.. సరళ రెండు ఉంగరాలు చేయించి.. సిద్దాంతి చెప్పిన విధంగా ఇద్దరూ పెట్టుకున్నారు..
ఉంగరం పెట్టుకోవడమో మరేమో.. సరళ రోజు రోజుకు బ్యూటీ పార్లర్ కెళ్ళి అందంగా తయారైంది.. భర్తకు జుట్టు ఊడిపోతూ, బట్టతల రావడం మొదలైంది. ఒక రోజు కాంతమ్మ గారు, మీనాక్షి గారు ఇంటికి వచ్చారు..
"అమ్మాయి.. మీ ఆయనని చూసాను.. ఏమిటి అలా అయిపోయాడు.. బట్టతల వస్తునట్టుంది. జీతం తక్కువైనా పర్వాలేదు గానీ.. జుట్టు లేకపోతే ఎవ్వరికి నచ్చరు.. "
"మా ఆయన ఎలా ఉన్నా, నాకు ఇష్టమే... నాకే సొంతం" అంది సరళ.
"అలాగే లే.. నీ అదృష్టం బాగుంది.. మా అమ్మాయిల అదృష్టమే బాగోలేదు... " అనుకున్నారు ఇద్దరు.
"మీరు ఇక వెళ్తే నేను తలుపు వేసుకుంటాను.. లోపల నాకు చాలా పని ఉంది" అంది సరళ.
"అలాగే లే.. " అంటూ ఇంతకుముందు మెచ్చుకున్న ఆ ఇద్దరూ వెళ్ళిపోయారు.
"మా ఆయన నాకే సొంతం.. " అంటూ చేతికున్న పచ్చ ఉంగరాన్ని ముద్దు పెట్టుకుని, మురిసిపోయింది సరళ
************
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
********
Comments