'Prema Guttu' - New Telugu Story Written By Yasoda Gottiparthi
Published In manatelugukathalu.com On 06/09/2024
'ప్రేమ గుట్టు' తెలుగు కథ
రచన: యశోద గొట్టిపర్తి
"నీతా! రోజూ సమయానికే ఇంటిపనికి వచ్చే దానివి ఈరోజు చాలా ఆలస్యమైంది. వస్తావో రావో తెలియదు. ఫోన్ చేస్తే ఎత్తవు? నీవైనా ఫోన్ చేసి చెప్పొచ్చుగా. "
“చెప్పుదామనుకున్నాను అమ్మగారూ! నా ఫోన్లో బ్యాలెన్స్ లేదమ్మా! అయినా నా ఫోన్ కాదమ్మా! అది మాఆయన ఫోన్. ఆయన పనికి పోతే చెప్పలేడు. ఇంట్లో ఉన్నప్పుడు అయితే చెప్తాడు".
"పనివాళ్ళతో పైసలిచ్చి తద్దినం పెట్టుకున్నట్లు". ఆలస్యంగా వస్తుందేమో అని ఎదురుచూడడం, సమయానికి మించిపోయి ఇల్లు ఊడ్వ కూడదు అనే సంప్రదాయ పద్ధతి పాటిస్తూ ప్రొద్దున్నే పాచి ఇల్లు ఊడ్చుకోవాలి. వంటకు అవసర మైన గిన్నెలు కొన్నైనా కడిగేసు కోవాలి. తీరా అంతా పని చేసుకున్న తరువాత మెల్లగా వస్తారు. బయట షాపింగ్ వెళదాం అనుకున్నా.. తాళం చూసి మళ్ళీ రారు అని ఎదురు చూస్తూనే ఉండాలి. వచ్చిన వాళ్ళు మిగిలిన పని గబ గబ చేయరు”.
“అమ్మా! మా ఇంటి ముందు పెద్ద గోల అయిందమ్మా! తల నొప్పి పట్టుకుంది. కొంచెం వేడి చాయి పోయ్యిరమ్మ. "
లేదు అనలేము కదా ! అప్పుడు చాయ చేసి పొయ్యాలి.
చీపురు పట్టుకుంటారు కానీ.. కుర్చీల కిందా ఊడ్వరు, వాళ్ల వెనక ఉండి, కొంచెం వెనక్కి, ముందకి జరిపి ఊడవవే అని చెప్పాలి. అప్పుడు ఊడుస్తుంది. ఇల్లు తడిబట్టపెట్టు అంటే, బకెట్లో అడుగున కొన్ని నీళ్ళు పోసి పైపైన తుడుస్తూ అమ్మయ్య ఐపోయింది అని నీళ్ళు పార పోస్తారు.
“నీతా! ఇక్కడ కలవలేదు. మళ్లీ ఒకసారి తుడువు” అంటే కోపంగా ముఖం పెట్టీ చూస్తారు. మూడు బెడ్ రూమ్లున్న ఇల్లైతే మూడువేల రూపాయలు, మనుషులు ఇద్దరున్నాసరే ఇంట్లో అడుగుపెడితే గిన్నెలు, బట్టలు, వాష్ బేసిన్ కడిగినందుకు ఐదు వేలు ఇవ్వాలి.
“అమ్మా! ఉద్యోగస్తులకు ప్రతి ఆది వారం సెలవు ఇస్తారు కదమ్మా! మేము ఆదివారం కూడా చేస్తున్నాం కదమ్మా! నెలకు రెండు రోజులన్నా సెలవు ఉండాలమ్మా!"
“సెలవులు ఇవ్వొచ్చు నీతా! ఒంట్లో నీరసంగా, పని చేసుకోలేకనే కదా! నిన్ను పనికి కుదుర్చుకున్నది.
మరి ఆపని అంతా ఎవరూ చేస్తారు?”.
“ప్రతి ఆదివారం చర్చ్ కి పోవాలమ్మా! ఆదివారం సెలవు కావాలమ్మ! "
“నీకు ఒంట్లో బాగోలేక పోతే రావు. ఊరికి వెళ్తే రావు. అప్పుడు ఎవర్నైనా పనికి పెట్టీ ఊరికి వెళ్ళు”.
“ఒక్క, రెండు రోజుల పనికి ఎవరొస్తా రమ్మా? వాళ్లకు పనిచేసే ఇండ్లు ఉంటాయి”.
“అన్నిటికీ అన్ని బాగానే చెప్తావు? ఇదివరకు ఉన్న పని అమ్మాయి జీతం తీసుకోగానే సెలవుపెట్టేది పది రోజులు. జీతం ఇచ్చే ముందు చక్కగా పనికి వచ్చి మరిపించేది.
నువ్వు మాత్రం అలా చేయకు నీతా! మీపని వాళ్ల నాటకాలతోటి వేగ లేక చస్తున్నాను" అంటూ విసుక్కుంది.
“నీతా! నీకు రోజు చెపుతున్నాను. మూతి కి మాస్క్ (గొట్టం) కట్టుకొమ్మని రమ్మని. ఒమి క్రాన్ అని కొత్త వేరియంట్ వైరస్ వస్తుంది. మాస్క్ లేకపోతే నేను కొనిస్తా".
“రేపు తెచ్చు కుంటానమ్మా! కొత్తది కొనుక్కుని తెచ్చు కుంటాను”.
***
“మంజులమ్మ గారూ! మీ వాచ్ మ్యాన్ ఊరెల్లుతున్నాడట. "
“అలాగా నాకు తెలియదు. మొన్ననే మా గాస్ బండ తీసుకున్నాడు. చెప్పనుకూడా చెప్పలేదు. అవసరాలకు డబ్బులు అడగడం, చెప్పకుండా బదులు తీసు కోవడం.. మళ్ళీ కొత్త వాళ్లు ఎలా పని చేస్తారో తెలీదు. ఒక్కరూ కూడా పర్మినెంట్ గా పని చేయడంలేదు”.
“ఆయన బిడ్డ ప్రసూతి కి ఉందట. వాళ్ల ఊళ్లోనే చేయాలని బిడ్డ, అల్లుడు అంటున్నారట. అందుకే అక్కడికి పోదామని అనుకుంటున్నారట”.
“కొడుకు ఉన్నాడుగా. ఇక్కడ ఉండి పని చేయవచ్చు” అన్నది.
“కొడుకు వాచ్ మన్ పని చేయడట. ఏదో ఆ చదువు ITI చదివిండట. కరెంట్ పని చేస్తాడట”.
“అవును ఒకసారి మాయింట్ల ఫ్యాన్లు రిపేర్ చేసి, కొన్ని స్విచ్ బోర్డుకు కూడా బాగు చేసిండు”.
“ఆపని వచ్చని వాచ్ మన్ గా చేయడటమ్మా! కొత్తగా కట్టిన అపార్ట్మెంట్స్ లో పని బాగానే దొరుకు తుందట”.
“వాచ్మెన్ కొడుకు రాకేష్ కరెంట్ పని చేస్తూ దూరంగా ఉండే అపార్ట్మెంట్స్ లోని వాచ్మెన్ గా చేసే ఆమె బిడ్డను ప్రేమిoచిండట. ఏడాది నుండి నడుస్తుంది వ్యవహారం.
పెళ్ళి చేసుకుంటే ఇద్దరూ ఒకటైతరు కదా!” అన్నది మంజుల.
“తల్లి తoడ్రి నీకు మంచి పిల్లను చూసి పెళ్లి చేస్తాం, ఆపిల్లను విడిచేయ్యు అని చిలక్కి చెప్పినట్టు చెప్పిండ్రు అమ్మా!
అయినా వినలేదట ఆపిల్లకు తండ్రి లేడట, తల్లి ఉన్నది. ఆయిద్దరిని సాదుకుంట అని ధైర్యం చెప్పి నాడట.
అమ్మా! వాడు బాగా తాగుతాడు. ఆ యిద్దర్ని ఏం సాధు తాడమ్మా! తండ్రి కూడా సారాయి తాగుతాడు”.
"తాను బుక్క తౌడు లేదు బిర్యానీ తిని పిస్త" .
ఆ తల్లి వీడు తాగుబోతు అని బిడ్డను ఇయ్యనంటింది.
ఆ పిల్ల దగ్గరికి పోయి నన్ను పెళ్లి చేసుకో, నాకు ఉద్యోగం, భూమి, ఇల్లు ఉన్నది నిన్ను మీ అమ్మను సాధుకుంట అన్నాడట. మగ దిక్కు లేని సంసారం మీకు అండగా ఉంటా. నా అంత బుద్ధి మంతుడు నీకు దొరకడు. మా అమ్మ నాన్న నిన్ను ఒక మంచి బిడ్డలా చూచుకుంటారు. నామాట విని నాతోటి పెళ్లికి ఒప్పుకోవే డార్లింగ్ అని వెంట బడుతుండట అమ్మగారూ..
ఆ తల్లి మీ కులం వేరు మాకులం వేరు అని ఒప్పుకోవటం లేదట.
***
“బిడ్డా! జాగ్రత్త నేను మన ఊరికి పోయోస్తా ఊళ్ళ రెండు బెడ్రూం ల ఇళ్ళకు స్థలం ఇస్తున్నారట. ఏ ఆధారం లేని వాళ్ళం వచ్చిన ఇచ్చిన అవకాశం పోగొట్టు కోవద్దు కదా!
రెండు మూడు రోజులకంటే ఎక్కువ ఉండను. ఇక్కడ వాచ్మన్ పని చేయాలి, నిగారాని చూడాలి. నువ్వు ఇక్కడే ఉండు. నేను లేను అంటే దొంగలు ఎక్కువైతే సామానులు పోతాయి”.
“నేను ఒక్కదాన్నే ఉండనమ్మా! భయం అవుతాది” అన్నది.
“చుట్టుపక్కల మన పెద్దయ్య కొడుకు, కోడలు పిల్లలున్నారు కదనే ఇంకా భయం దేనికి. నీకేదన్నా జరిగితే వాళ్ళకి చెప్పు”.
“మరి నువ్వు ఒక్కపరి చెప్పు మంచిగా చూసుకోండి అని”.
“అట్లనే బిడ్డా! పోయోస్థా” అని బస్ ఎక్కింది తల్లి కామాక్షి.
సాయంత్రం కాగానే బాగా తాగిoడు రాకేష్.
వచ్చి " డార్లింగ్ పంకజం! ఏం చేస్తున్నావ్? చెప్పినవా? మీ అమ్మకు మన ప్రేమ గురించి, పెళ్ళి చేసుకుంటానని చెప్పు".
“మా అమ్మ ఊరికి పోయింది. వచ్చిన తరువాత చెప్తా. నువ్వు బాగా తాగి ఎందుకు వచ్చినవ్? తాగితే నేను పెళ్ళి చేసుకోను”.
“ఊరికే తాగుడు అంటావ్ ఎందుకు? నీ కోసమే తాగుడలవాటు అయింది. నీ అమ్మ పెళ్ళిచెయ్యనంటుంది. కులం కలవదు అంటుంది. అందుకే తాగుతున్ననే నేను”
ఒక్కసారిగా కొంగు గుంజి, నడుము పట్టుకుని, “ఒక్క ముద్దు ఇయ్య రాదే పోతా” అని బుగ్గలు నిమిరిoడు.
“నువ్వు నాకు ఇష్టమే నయ్యా! కానీ పెళ్ళి అయ్యేదాకా ఆగాలి నువ్వు”.
“మీ అమ్మ అన్న మాటలకు నిన్ను ఇప్పుడే ఎగిరేసుకు పోయి, మాఇంట్లో పెట్టుకుని, ఎన్ని చేయాలో అన్ని చేయాలని ఉంది. మొన్ననే కాళ్ళ గొలుసులు కొనిచ్చిన కదనే.. నా ముద్దూ..”
“నేను వద్దన్ననా తీసుకున్నా గదా! నీవుఇట్లా తాగి నారూం లోకి జోరవడితే ఇటుపక్క, అటు పక్క వాళ్ళు గలీజుది అనుకుంటారు. చాటున గిట్లా ప్రేమించు కుందాము. కానీ ఆ పని చేయను”.
“ఏoదే! అంత సొక్కమా నువ్వు? కాక మీదున్న. వస్తావా! రావా?” అని ముట్టుకో బోతే కసురు కుంది.
కౌగిలి లో బిగించి ముద్దు పెట్టు కొని కోరిక తీర్చుకో బోయిoడు. అరవకుండా నోరు మూసి ఒక్క దెబ్బ తీసాడు రాకేష్ బలం తో..
విదిలించుకుని “ఏందిరా తాగుడు తప్పంటే, ఇంకా పైనుండి కొడుతున్నవు? బయటికిపోయి నీ పని చెప్తా!" అంటూ “నీతా అక్కా, ఓ పెద్దన్న ఇట్లా రాండి. , వీడు రాకేష్ నన్ను కొడ్తుoడు" అని అందర్నీ పిలిచింది.
వాళ్ల పంచాయితీ నాకెందుకు? నా మొగుడు నన్ను ఓర్వడు అని బయటికి రాలేదు నీతా..
బాగా గట్టిగా పిలుస్తుంటే మగనికి చెప్పింది.
నీత మగడు పోయి "రాకేష్ బయటికి రారా! ఆ అడపోరి ఇష్టపడ్డప్పుడు చెయ్యి పట్టుకోవాలి కానీ కొట్టుడు ఏందిరా?"
“నన్ను ప్రేమిస్తుంది అన్నా కానీ పెళ్ళి చేసుకుంటూ పారి పోదాం రావే అంటే వస్తులేదు”.
“ఎట్లోస్తదీరా? నువ్వు ఒక తాగుబోతువి, పైనుండి కొడ్తున్నావ్? ఇవన్నీ ,మంచి గుండు. బక్క ప్రాణం, అంతా బాగా వెంట పడ్డదా నీవెంట వస్తానని. వాళ్ల అమ్మ ఊరికి పోయింది రానీ మాట్లాడుదాము”.
కొట్లాట పంచాయితీ వినపడి పక్కన రాకేష్ బావ బయటకు వచ్చి, “ఏందిరా బామ్మర్ది.. బాగా తాగి ఆపోరి వెంబడి పడ్తున్నావా?” అంటూ వీపు మీద నాలుగు దెబ్బలు వేయగానే పంకజాక్షిని వదిలిపెట్టి పారిపోయినాడు రాకేష్.
ఊరికి పోయిన కామాక్షి ఇంటికి వచ్చిన తరువాత, ఇరుగు పొరుగు వారందరూ |నీకు బుద్ధి లేదా? ఈడోచ్చిన బిడ్డను ఒక్కదాన్ని వదిలి పేట్టి పోయినావు? ఇరవై నాలుగు గంటలు నీ బిడ్డ కావలి ఎవరుంటారు?.. అది ఆరాకేష్ ను ప్రేమించింది అట.. వాడు అప్పుడప్పుడు వస్తున్నాడు, గుంజుతుండు, కొడ్తుoడు. అట్లా వదిలి పెట్టీ పోవద్దు ఈసారి, వెంబడి తీసుకొనీ పో, నీ బిడ్డ నీకు బరువా?” అని మందలించిoడ్రు.
“నా బిడ్డ మంచిదే. వాడే మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నాడు. పచ్చి తాగుబోతు. నా బిడ్డను చక్కగా చూసుకుoటడని నమ్మకం లేదు. మా కులం వేరు, వాళ్ల కులం వేరు. నేను పెళ్ళి చెయ్యను. నా బిడ్డకు మా కులం లో సంబంధం చూసుకుంటున్న”.
“నువ్వు నీ బిడ్డ బాగానే ఉన్నారు. ఇంటి మూడు చుట్లు ఉన్న మా పిల్లలు నేర్చుకుంటారు ఇట్లాంటి చూసి” అని చెడామడా తిట్టిండ్రు.
ఆచుట్టూప్రక్కలఅందరూ చీదరించు కోవడం తల్లి బిడ్డలను మానసికంగా కృంగి దీసింది. పంకజం వీటన్నిటినీ మరచి పోవడానికి నర్స్ ట్రైనింగ్ లో పరీక్షలో పాసయి నర్స్ ఉద్యోగం సంపాదించుకుంది. చూసిన వాళ్ళందరూ మెచ్చుకున్నారు.
ఒకరోజు టూ వీలర్ డ్రైవ్ చేస్తూ రాకేష్ బండి మీదనుండి పడి కాలు ఫ్రాక్చర్ అయి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు.
అదే హాస్పిటల్ లో పనిచేస్తున్న పంకజం చూసి చూడనట్లు వెళ్తుంటే చేయి పట్టుకున్నాడు.
“ఇంకా నీ బుద్ధి మారలేదా? నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పినా వినకుండా ఎందుకు వెంట బడ్తావ్ ?” అని హెచ్చరించింది.
కొన్ని రోజుల తరువాత ఇంటికి వచ్చిన రాకేష్ ను చూచి, తన ఇంటి నుండి వెళ్ళిపోయి, బయట చెట్టు కింద కొందరు మనుషులు న్న గుంపులో కూర్చుంది. అలా ప్రతిసారీ చేసింది.
అప్పుడు తెలిసింది తాగుడు పూర్తిగా మానితే కానీ పంకజం నన్ను పెళ్ళి చేసుకుంటుంది అని తెలుసుకుని పశ్చాతాపం పడ్డాడు. ఇద్దరూ కలిసి తల్లి తండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
సమాప్తం
యశోద గొట్టిపర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి
హాబిస్: కథలు చదవడం ,రాయడం
コメント