top of page

పల్లవి

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

https://youtu.be/6-g684oCegI

'Pallavi' New Telugu Story written by Thirumalasri

రచన : తిరుమలశ్రీ

అతని కోసం ఎదురు చూస్తోంది ఆమె.

కానీ అతను మరెక్కడికో వెళ్ళాడు.

మరి ఆమె ఏమయ్యిందో ప్రముఖ రచయిత తిరుమలశ్రీ గారి పల్లవి కథలో తెలుసుకోండి.

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

ఇక కథ ప్రారంభిద్దాం


అతివలకు అత్యంత ప్రియమైన వస్తువు- అద్దం. ముఖ్యంగా అందగత్తెలకు! మహిళలు రోజులో

అధికభాగం అద్దం ముందు గడుపుతారని ఎవరన్నారోకానీ, దాన్ని అబద్ధం చేయాలనుకోరు!

గత పది నిముషాలుగా అద్దం ముందే నిలుచుని వుంది పల్లవి. అద్వితీయమైన తన అందాలను

రెప్పవేయకుండా అద్దంలో చూసుకుంటోంది. మధ్యమధ్య ముసిముసి నవ్వులు నవ్వుకుంటోంది.

పాతికేళ్ళ పిటపిటలాడే యవ్వనం. పరువం అద్దిన అపురూపమైన అందాలు. ఆల్చిప్పల్లాంటి నీలాల కనుదోయి. కోటేరులాంటి నాసిక. శంఖంలాంటి కంఠం. తళుకులీనే నున్నటి చెంపలు. అరవిచ్చిన గులాబీరేకుల వంటి అరుణాధరాలు…సుందర వదనం. పసిడి, పాలమీగడ రంగరించి అద్దినట్లున్న మేనిసౌందర్యం. అణువణువునా లావణ్యం వుట్టిపడే సుకుమార శరీరం. పిడికిట్లో ఇమిడే నడుము… మనిషి పొడగరి. స్లిమ్ గా వుంటుంది…మళ్ళీమళ్ళీ చూడాలనిపించే రమణీయ రూపం…

విశాల్ కి తనను చీరలో చూడడం మరింత ఇష్టం. అందుకే ఆ రోజు చీర కట్టింది. అతనికి అత్యంత ఇష్టమైన ఫ్లెమింగో పింక్ జరీ-వోవెన్ టిష్యూ సిల్క్ శారీని ధరించింది. అఫీసుకు ఎప్పుడోకానీ, చీర కట్టదు. డ్రెసెసే తొడుగుతుంది, సౌలభ్యం కోసం.

‘తన సౌందర్యం తనకే మత్తెక్కిస్తూంటే…ఇక విశాల్ సంగతి చెప్పాలా!’ అన్న ఊహావీచిక మదిని

అలవోకగా తాకడంతో…అందమైన అరనవ్వు ఒకటి ఆమె అధరాల పైన తళుక్కుమంది.

డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ ముందు నుంచి కదలలేక కదలలేక కదిలింది పల్లవి. టైమ్ చూసింది.

సాయంత్రం ఆరు గంటలు అవుతోంది.

ఆరోజు తమ వివాహపు వార్షికోత్సవం. తమ పెళ్ళయి మూడు వసంతాలు అలవోకగా

గడచిపోయాయి. మూడేళ్ళ వరకు సంతానం వద్దనుకున్నందున, ఇంకా పిల్లలు లేరు.

ప్రతి యానివర్శరీకీ ఏదో ఒక టూరిస్ట్ ప్లేస్ కి వెళ్ళి ఆనందంగా గడపివస్తారు తాము. కానీ, ఆ ఏడాది ఇద్దరికీ బైటకు వెళ్ళడానికి కుదరడంలేదు. ఆఫీసులో అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్స్ తమ కాళ్ళకు బంధాలు వేసేసాయి.

సాయంత్రం టాంక్ బండ్ కు వెళ్ళి సరదాగా గడిపి, ఆ తరువాత హోటల్ కి వెళ్ళి డిన్నర్

చేయాలనుకున్నారు. తాను ఆఫీసుకు సెలవు పెట్టేసింది. విశాల్ మాత్రం ఏవో ముఖ్యమైన ప్రాజెక్ట్ మీటింగ్స్ వున్నాయని ఆఫీసుకు వెళ్ళిపోయాడు. సాయంత్రం త్వరగా ఇంటికి వస్తానని ప్రామిస్ చేసాడు. ‘ఆరయ్యేసరికి దేవి ముందు వ్రాలతాను. సరేనా?’ అంటూ ప్రేమగా వక్షానికి హత్తుకుని ముద్దుల సాక్షిగా హామీ ఇచ్చాడు.

విశాల్ ఇంకా రాలేదు. ఉదయం ఆఫీసుకు వెళ్ళాక ఫోన్ కూడా చేయలేదు. మీటింగ్స్ తో బిజీగా

ఉండివుంటాడు. డిన్నర్ కి హోటల్లో సీట్స్ బుక్ చేయాలన్న విషయం హఠాత్తుగా గుర్తుకు వచ్చింది పల్లవికి. నెట్ లో నంబర్ చూసి, హోటల్ మారియాట్ కి ఫోన్ చేసింది. రిసెప్షనిస్ట్ లైన్ లోకి రాగానే, ఆరోజు రాత్రి తొమ్మిది గంటలకు రెండు సీట్లు రిజర్వ్ చేయమని చెప్పింది. అలాగే, అకేషన్ గురించి చెప్పి కేక్-కటింగ్ కి ఏర్పాట్లు చేయవలసిందిగా కూడా కోరింది. రిసెప్షనిస్ట్ అయిదు నిముషాల అనంతరం రిజర్వేషన్ ని కన్ఫర్మ్ చేసింది. ‘నౌ దటీజ్ సెటిల్డ్’ అనుకుంది పల్లవి సంతృప్తిగా.

తరువాత భర్తకు ఫోన్ చేసింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా, అతని సెల్ ఆఫ్ లో ఉందన్న మెసేజే! బహుశా ప్రాజెక్ట్ మీటింగ్ ఇంకా కొనసాగుతున్నట్లుంది, అనుకుంది. సోఫాలో వెనక్కి చేరగిలబడి కన్నులు మూసుకుంది. మూసుకున్న ఆ కన్నుల వెనుక అందమైన దృశ్యాలు… నాలుగేళ్ళ క్రితం విశాల్ తో తనకు అయిన పరిచయం…ఓ సుందరస్వప్నంలా మదికి ఉల్లాసం కలిగించింది…

తన స్నేహితురాళ్ళు, కొలీగ్సూ అయిన శాంతి, ఉమలతో కలసి ఉత్తరాదికి పిక్నిక్ కి వెళ్ళింది పల్లవి. డెహ్రాడూన్ పరిసరాలలో చూడదగిన సుందరప్రదేశాలను దర్శించి, అక్కడ నుంచి మస్సూరీ వెళ్ళారు. అది సెప్టెంబర్ మాసం. చలిగా ఉంది. కొద్దిగా వర్షం కూడా పడుతోంది. కేబుల్ కార్ రైడ్ చేసారు. మర్నాడు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న కెమ్టీ వాటర్ ఫాల్స్ కి వెళ్ళారు. ఆ ప్రాంతాలలోని వాటర్ ఫాల్స్ అన్నిటిలోకీ పురాతనమైనది, ప్రముఖమైనది, ప్రసిద్ధిచెందినదీను అది.

కెమ్టీ ఫాల్స్ టూరిస్టులతో సందడిగా ఉంది. నీటిలోకి దిగారు స్నేహితురాళ్ళు. వారిస్తున్నా

వినిపించుకోకుండా పల్లవి ఇంకా లోపలికి వెళ్ళింది జలకాలాడేందుకు. అయితే, అనుకోకుండా కాలు జారడంతో నీటిలో పడిపోయింది. స్నేహితురాళ్ళు హాహాకారాలు చేసారు. మిగతావారు కూడా గోలగా అరుస్తూ చూస్తూ వుండిపోయారు.

ఫాల్స్ లో స్నానం ముగించి ఒడ్డున ఒళ్ళు తుడుచుకుంటున్నఓ యువకుడు, ఆ కమోషన్ ఆలకించి అటువైపు చూసాడు. మెరుపులా నీటిలోకి దుమికి, మునిగిపోతూన్న పల్లవిని రెండు చేతులతోనూ ఎత్తి పట్టుకుని ఒడ్డుకు చేర్చాడు.

“మేము చెబితే వినకుండా మొండిగా లోతుకంటూ దిగావు. ఎంత పెద్ద గండం గడచింది! ఏమైనా

అయ్యుంటే మీవాళ్ళకు ఏం సమాధానం చెప్పేవాళ్ళం మేము?” పల్లవి స్నేహితురాళ్ళు అమెను

మందలిస్తూంటే, ఆశ్చర్యంగా చూసాడు ఆ యువకుడు. “మీరు తెలుగువాళ్ళా?” అనడిగాడు.

వాళ్ళు ఔననడంతో వారి మధ్య మాటలు కలిసాయి. తనలాగే వాళ్ళూ హైదరాబాద్ కి చెందినవాళ్ళని తెలిసి సంతోషించాడు అతను. తన పేరు విశాల్ అనీ, తానూ స్నేహితులతో కలసి పిక్నిక్ కి వచ్చాననీ చెప్పాడు.

విశాల్ పొడవుగా, ఫెయిర్ గా, హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతని పెదవుల పైన చిరునవ్వు నర్తిస్తూ వుంటుంది. కన్నెహృదయాలను కవ్వించే రూపం… కాపాడినందుకు ఆమె ‘థాంక్స్’ చెబుతూంటే, రెప్పవేయకుండా ఆమెనే చూసాడు అతను. తొలిచూపులోనే పల్లవి అందం అతన్ని ఆకట్టుకుంది.

“మిమ్మల్ని ఎక్కడో చూసినట్లనిపిస్తోంది” అన్నాడు పల్లవితో. తనకూ అలాగే అనిపిస్తున్నట్లు చెప్పిందామె ఆశ్చర్యపోతూ.

తాను ఓ ఎమ్మెన్సీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడనీ, తన ఆఫీసు హైటెక్ సిటీలోని రహేజా టవర్స్ లో ఉన్నట్టూ అతను చెప్పడంతో మరింత విస్తుపాటుకు గురయిందామె. ఎందుకంటే, ఆమె ఆఫీసు కూడా అదే కాంప్లెక్స్ లో ఉంది. తానూ ఓ ఎమ్మెన్సీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తోంది…

హైదరాబాదుకు తిరిగివచ్చాక, ఇద్దరిదీ ఒకటే క్యాంపస్ కావడంతో తరచు ఒకరినొకరు

చూసుకోవడమే కాక, అప్పుడప్పుడు లంచ్ టైమ్ లో కలుసుకోసాగారు పల్లవి, విశాల్ లు.

మూడు నెలల తరువాత ఓ రోజున చెప్పాపెట్టకుండా తల్లిదండ్రులతో తన ఇంటికి వచ్చిన విశాల్ ని చూసి విస్తుపోయింది పల్లవి.

అతన్ని తన గదికి తీసుకువెళ్ళి అడిగింది, “నా అభిప్రాయం తెలుసుకోకుండా తిన్నగా ఇంటికి వచ్చేయడమేనా!”

“నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అన్నాడతను నవ్వుతూ.

“మరి, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో తెలుసుకోవద్దా?” అడిగింది.

‘నీ కన్నులు చెబుతున్నాయి…నను ప్రేమించావనీ…’- పాటందుకున్నాడు అతను.

“గొప్పే!” అందామె బుంగమూతి పెట్టి.

నవ్వేసారిద్దరూ.

మూడు నెలల తరువాత వారి వివాహం వైభవంగా జరిగిపోయింది…

పల్లవికి వైవాహిక జీవితం స్వర్గతుల్యంగా ఉంది. ఆనందంలో మునకలు వేస్తోందామె… విశాల్ సార్థకనామధేయుడు. అతని పేరే కాదు, హృదయం కూడా విశాలమయినదే. పల్లవిని ఎంతో అపురూపంగా, అత్యంత ప్రేమగా చూసుకుంటున్నాడు. అతను తన ‘జీవనగీతానికి ఓ అందమైన పల్లవి’ అనుకుని మురిసిపోయింది…

తమ హనీమూన్ కి- ‘థాంక్స్-గివింగ్!’ లా తమను కలిపిన ప్రదేశం కెమ్టీ ఫాల్స్ ని

సందర్శించాలనుకున్నారు విశాల్, పల్లవి. అనుకున్నట్లే మస్సూరీ వెళ్ళారు.

మస్సూరీలోని ‘కంపెనీ గార్డెన్’, ‘కె-దేవ్ భూమి వేక్స్ మ్యూజియం’, భూమి నుండి అత్యంత ఎత్తులో వున్న ‘భద్రాజ్ టెంపుల్’ వగైరాలను దర్శించారు. కేబుల్ కారులో జాయ్ రైడ్ చేసారు. అందులోంచి ఎత్తైన ‘గన్ హిల్ పాయింట్’ ని తిలకించారు. హిమనగాల రమణీయ సౌందర్యాన్ని ఆసక్తితో అవలోకించారు. ధనౌల్టి లోని ‘స్కై-రైడ్ మస్సూరీ అడ్వెంచర్ పార్క్’ కు వెళ్ళి గడిపి వచ్చారు. ‘కంపెనీ గార్డెన్’ కి వెళ్ళి అచ్చటి పార్క్ లో విహరించారు. అక్కడ తాను అతని ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంటే, పెదవులతో తన ముఖమంతా ప్రేమగా రాసాడు అతను. ఆ శీతల వాతావరణంలో అతని వెచ్చని కౌగిట్లో ఎంతో హాయిగా అనిపించింది తనకు.

ఎప్పటికీ అలాగే వుండిపోవాలనీ, కాలం స్తంభించిపోవాలనీ…ఓ వెర్రి కోర్కె!

మస్సూరీలోని నైట్ లైఫ్ టూరిష్టులతో అత్యంత సందడిగా ఉంది. మస్సూరీలోని ప్రధాన వీధి అయిన ‘మాల్ రోడ్’ షాపులు, రెస్టారెంట్లతో కూడుకుని టూరిస్టులతో నిత్యమూ కళకళలాడుతుంటుంది. ‘రోక్ బై మనార్’ లోపల ఉన్న ‘ఎమిలెగ్స్ రెస్టారెంట్’ అద్భుతమైన కేక్స్, పేస్ట్రీస్, ‘షెపర్డ్స్ పై’ కి ప్రసిద్ధి. ఆ రెస్టారెంట్ కు వెళ్ళి తమకు కావలసినవి తిని, కొన్నిటిని ప్యాక్ చేయించుకుని హోటల్ కి తెచ్చుకున్నారు…మర్నాడు కెమ్టీ ఫాల్స్ కి వెళ్ళి రోజంతా సందడిచేసుకుని వచ్చారు… ఆ అనుభవాన్ని ఎప్పటికీ మరచిపోలేదు పల్లవి. తన గుండెల్లో గూడు కట్టుకుని మరీ వాటిని పదిలంగా దాచుకుంది…

సెల్ ఫోన్ మ్రోగడంతో ఆలోచనల గొలుసు పుటుక్కుమంది.

విశాల్ అనుకుని చూసింది. స్క్రీన్ మీద శాంతి ఫొటో.

“హాయ్, పల్లవీ! ఏం చేస్తున్నావే?” అంటూ పలుకరించింది శాంతి. “ఈరోజు నువ్వు ఆఫీసుకు

వెళ్ళలేదటగా? నేనూ వెళ్ళలేదులే. ఇందాక ఉమతో మాట్లాడితే నువ్వూ వెళ్ళలేదని తెలిసింది. ఎందుకు వెళ్ళలేదే?”

ఆమెకు ఏదో చెప్పి హడావుడిగా కాల్ ని ఎండ్ చేసింది పల్లవి, విశాల్ కాల్ వస్తుందేమోనని. పల్లవి తలపులు మళ్ళీ గతంలోకి జారిపోయాయి… తమ ఫస్ట్ యానివర్సరీకి హిమాచల్ ప్రదేశ్ లోని కులు, మనాలీ వెళ్ళారు. తనకు, విశాల్ కీ కూడా మంచుప్రాంతాలంటే ఎంతో ఇష్టం…జోగిన్ ఫాల్స్ లో జలకాలాడారు. రోప్ వే రైడ్ ని ఎంజాయ్ చేసారు. ‘వ్యాన్ విహార్’ లేక్ వద్ద పార్క్ లో సీతాకోకచిలుకల్లా స్వేచ్ఛగా ఎగిరారు. రమణీయప్రకృతి నడుమ విలసిల్లే ‘నెహ్రూ కుండ్’ స్ప్రింగ్, హాట్ వాటర్ స్ప్రింగ్స్, నేచర్ పార్క్, సోలాంగ్ వ్యాలీ దర్శించారు. మనాలీలోని హడింబాదేవి ఆలయం, మబు టెంపుల్, చెక్కతో నిర్మింపబడ్డ చారిత్రాత్మక ‘సియాలి మహదేవ్ దేవాలయం’, ఘటోత్కచుడి ట్రీ టెంపుల్, వగైరాలను సందర్శించారు. హిమాచల్ కల్చరల్ అండ్ ఆర్ట్ మ్యూజియం ఎంతో ఆసక్తిదాయకంగా, జ్ఞానదాయకంగా ఉంది. ఇకపోతే షాపులు, రెస్టారెంట్సూ వుండే ‘మాల్ రోడ్’ లో షాపింగ్ చేస్తూ యానివర్శరీ గిఫ్ట్స్ గా తాను అడిగినవన్నీ కొనిపెట్టాడు విశాల్. రెస్టారెంట్స్ లో కొత్తరకపు ఫుడ్ ని టేస్ట్ చేసారు…

వంటమనిషి లక్ష్మమ్మ రావడంతో ఆలోచనలకు మళ్ళీ బ్రేక్ పడింది.

“పల్లవీ! ఈరోజు డిన్నర్ కి ఏం చేయమంటావమ్మా?” అనడిగింది లక్ష్మమ్మ.

యాభై ఏళ్ళుంటాయి ఆవిడకు. కొంచెం స్థూలకాయం. పల్లవికి దూరపు బంధువు.

చూసేవారెవరూ లేకపోవడంతో, తనకు సాయంగా వుంటుందని తనతో తీసుకువచ్చేసింది పల్లవి.

వంట చేసిపెడుతూ ఇంట్లో పెద్దదిక్కుగా ఉంటోందావిడ.

“అన్నట్టు, నీతో చెప్పలేదు కదూ, ఆంటీ! ఇవాళ మా మేరేజ్ యానివర్శరీ కదా. మేం బైటకు వెళ్ళి

తింటాం. మాకోసం వంట చేయనవసరంలేదు” అని చెప్పింది పల్లవి.

లక్ష్మమ్మ ఓ క్షణం ఏమీ మాట్లాడకుండా పల్లవి వంక అదోలా చూస్తూవుండిపోయింది.

“ఏమిటి, ఆంటీ?” అనడిగింది పల్లవి.

తల అడ్డుగా త్రిప్పుతూ, “ఇవాళ నువ్వు మరింత అందంగా వున్నావు తల్లీ! నీకు నా దిష్టే తగిలేలా

వుంది,” అందావిడ. “ఎందుకైనా మంచిది, కాసిన్ని ఎండుమిరపకాయలు తీసిపడేస్తాను, రా”.

పల్లవి హాయిగా నవ్వింది. “అంతా నీ అభిమానం, ఆంటీ!” అంటూ ఆవిడను కౌగలించుకుంది.

ఏదో చెప్పాలనుకున్నట్టు ఓ క్షణం తటపటాయించి నిష్క్రమించింది లక్ష్మమ్మ.

టైమ్ చూసింది పల్లవి. ఆరున్నర కావస్తోంది.

మళ్ళీ విశాల్ కి ఫోన్ చేసింది. ‘షరా మామూలే’! ‘స్విచ్డాఫ్’ అన్న మెసేజ్ వస్తోంది…

`రెండవ వార్షికోత్సవానికి ఊటీ వెళ్ళారు తాము…ఓ రోజంతా లేక్ లో బోట్ షికారు చేసారు.

యూకలిప్టస్ తోటల నడుమ పరుగులిడుతూ ఆ చెట్ల నుండి గాలిలో మిళితమై వచ్చే స్వచ్ఛమైన

యూకలిప్టస్ వాసనలను గుండెల నిండుగా పీల్చుకుంటూ, క్యాచింగ్ గేమ్ ఆడారు. వెస్టర్న్ ఘాట్స్ యొక్క అందాలకు ఫిదా అయిపోయారు. రోజ్ గార్డెన్, బొటానికల్ గార్డెన్స్ లో ప్రేమపక్షుల్లా విహరించారు. మ్యూజియం, సెయింట్ స్టిఫెన్ చర్చ్ లను దర్శించారు. టీ-ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ ప్రాసెస్ ని, టీ-మ్యూజియంనీ ఆసక్తిగా తిలకించారు.

ప్రతిచోటా తనను ఎన్నో ఫొటోలు తీసాడు విశాల్. సెల్ఫీలు కూడా దిగారు. ఒకరి నడుము చుట్టూ ఒకరు చేతులు పెనవేసుకుని స్వేచ్ఛావిహంగాలలా సంతోషంతో కేరింతలతో నడయాడుతూంటే, అందరి కన్నులూ తమ మీదే…

హాల్లోని గోడగడియారం ఏడు గంటలు కొట్టడంతో ఉలికిపడింది పల్లవి.

విశాల్ ఇంకా ఇంటికి రాలేదు. ప్రాజెక్ట్ మీటింగ్స్ లో పడి, ఆ రోజు తమ యానివర్శరీ అన్న సంగతి

మరచిపోయి వుంటాడు!

ఆమెలో అసహనం పెరిగిపోతోంది. విశాల్ కి ఫోన్ చేసింది. అతని సెల్ ఇంకా ఆఫ్ లోనే ఉంది!

కోపం వచ్చింది ఆమెకు. ఓ క్షణం ఆలోచించి, విశాల్ కొలీగ్ రాహుల్ కి ఫోన్ చేసింది.

వెంటనే తీసాడు అతను.

“రాహుల్! నేను పల్లవిని మాట్లాడుతున్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా విశాల్ ఫోన్ స్విచ్డాఫ్ అని

వస్తోంది…” ఫిర్యాదు చేసిందామె. “ఈరోజు ప్రాజెక్ట్ మీటింగ్స్ ఉన్నాయని చెప్పాడు. అవి ఇంకా

ముగియలేదా?..”

రాహుల్, “భాభీ!” అంటూ నీళ్ళు నమిలాడు.

“ఈరోజు మా మ్యారేజ్ యానివర్శరీ. మేము బైటకు వెళ్ళాలనుకున్నాం.. కొంచెం మీ ఫ్రెండ్ కి

గుర్తుచేయవూ? ప్లీజ్…” అంది పల్లవి.

అటువైపు ఓ క్షణం నిశ్శబ్దం. తరువాత, “అలాగే, భాభీ!” అనేసి ఫోన్ కట్ చేసాడు.

నిరుత్సాహంతో సోఫాలో వెనక్కి వాలిపోయింది పల్లవి. సమయం గడచేకొద్దీ విశాల్ మీద కోపం

పెరిగిపోతోంది. డ్రెస్ మార్చేసుకుని, అతను వచ్చినా ఎక్కడికీ రానని చెప్పేయాలనుకుంది.

అంతలో బయట కారు చప్పుడు వినిపించడంతో పరుగెత్తుకు వెళ్ళింది.

విశాల్ కాదు.

అమ్మ, నాన్నాను!

“చూసావా, మమ్మీ! విశాల్ ఇంతవరకు ఆఫీస్ నుంచి రాలేదు” అంటూ ఫిర్యాదు చేసింది పల్లవి.

“ఈమధ్య అసలు నన్ను పట్టించుకోవడమే మానేసాడు! ఆఫీసే పెళ్ళాం అయిపోయింది!”

“తెలిసిందమ్మా. లక్ష్మమ్మ ఫోన్ చేసి చెప్పింది” అంటూ కూతుర్ని కౌగలించుకుని లోపలికి

తీసుకువెళ్ళింది పల్లవి తల్లి సుగుణమ్మ.

తండ్రి మౌనంగా వారి వెనకాలే నడచాడు. ‘నీ విశాల్ ఇక లేడన్న నిజం నువ్వు ఎప్పుడు గ్రహిస్తావు

తల్లీ!?’- అతని మనసు మూగగా రోదించింది.

‘ఆరు నెలల క్రితం ఓ రోడ్ ప్రమాదంలో విశాల్ మరణించడం జరిగింది. ఆ వార్త వినగానే పల్లవి

కొయ్యబారిపోయింది. ఏడవలేదు. కళ్ళమ్మట నీళ్ళు రాలేదు…భర్త ఇంకా బ్రతికేవున్నాడన్న భ్రమలోనే

జీవిస్తోంది. అదొక విధమైన మనోస్థితి. ఆమె ఏడ్చి, హృదయభారాన్ని తీర్చుకుంటే తప్ప వాస్తవం ఆమె మదికి

హత్తుకోదనీ, మామూలు మనిషి కాలేదనీ…’ చెప్పాడు సైకియాట్రిస్ట్.

***సమాప్తం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

స్వప్నవాస్తవం


రచయిత పరిచయం :

‘తిరుమలశ్రీ’ గారి అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ఎమ్.ఎ. (సోషియాలజి), ఎల్.ఎల్.బి., సి.ఎ.ఎస్. భారతప్రభుత్వపుCSIR అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి చెందిన వీరు, జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ అఫ్ అడ్మినిస్ట్రేషన్' గా పదవీ విరమణ చేసారు…వీరి మరో కలంపేరు 'విశ్వమోహిని'. తెలుగులో వీరివి అన్ని జేనర్స్లోను, ప్రక్రియలలోను(బాలసాహిత్యంతోసహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. సుమారు185 నవలలు ప్రచురితమయ్యాయి. పలుకథలు, నాటికలు, నాటకాలు ఆలిండియా రేడియోలోప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్లో ప్రసారంకాగా, మరికొన్నిరంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి. పలుకథలు బహుమతులను అందుకున్నాయి. కొన్నికథలు హిందితోపాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. ఓ మాసపత్రికలో రెండు కాలమ్స్ నిర్వహించారు. ప్రతిలిపి 'కథాకిరీటి', 'కథావిశారద', మరియు 'బాలకథాబంధు' (బాలసుధ-బాలసాహితీసంస్థ, విజయనగరం) బిరుదాంకితులు. 'కలహంస పురస్కార' గ్రహీతలు. ఆంగ్లంలో సుమారు100 కథలు, ఆర్టికల్స్ ప్రముఖ పత్రికలలోను, జాతీయ దినపత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని బహుమతులను అందుకున్నాయి. ఓ ప్రముఖ ఆంగ్ల జాతీయ దినపత్రికలో వీక్లీ (లిటరరీ) కాలం వ్రాసారు. ఓ జర్మన్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా 20 ఈ బుక్స్ ప్రచురిత మయ్యాయి... స్టోరీ మిర్రర్ (ఆంగ్లం), ‘లిటరరీ బ్రిగేడియర్’ బిరుదాంకితులు, మరియు ‘ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020’ నామినీ… హిందీలో అరడజను కథలు ప్రచురితం కాగా,ఓ బాలల నాటిక ఆలిండియా రేడియోలో ప్రసారితమయింది.




57 views0 comments
bottom of page