top of page

పంచమ వేదం

Writer's picture: Vagumudi Lakshmi Raghava RaoVagumudi Lakshmi Raghava Rao


'Panchama Vedam' - New Telugu Story Written By Vagumudi Lakshmi Raghava Rao

Published In manatelugukathalu.com On 26/07/2024

'పంచమ వేదం' తెలుగు కథ

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు


బదరీ వనం ప్రశాంతంగా ఉంది. పసిడి వన్నెల రేగుపళ్ళ కాంతి, ఆకు పచ్చని ఆకుల కాంతి, రంగు రంగుల పూల కాంతి యజ్ఞ యాగాదులనుండి వచ్చిన హయ్యంగ వీనాది యాగ దినుసుల సువాసనల న డుమ బదరీ వనం మహా పవిత్రంగా ప్రకాశిస్తుంది. అక్కడి సువాసనలను అనుక్షణం ఆస్వాదించాలనే మక్కువతో సుర కిన్నెర యక్ష గంధర్వ కిన్నెరాది దేవతలు అక్కడి మహర్షులు ఎప్పుడు ఏ యాగం చేస్తారా? ఎ ప్పుడు ఏ దేవతను పిలుస్తారా? అని అందరు దేవతలు ఎదురు చూస్తున్నారు. 


ఆకాశాన ఉన్న దేవతలు బదరీ వనంలో ఉండి వ్యాస భగవానుడు చెప్పిన జయ సంహిత అనబడే మహా భారతాన్ని వ్రాస్తున్న గణపతిని చూసి, "ఆహా! పార్వతి తనయుడు ఎంత అదృష్టవంతుడు.. ఒక వైపు బదరీ వన పవిత్ర సువాసనల నడుమ మహా ఆనందం గా, ఆరోగ్యంగా ఉన్నాడు. మరో వైపు చతుర్వేద సార మనదగిన పంచమ వేదం మహా భారతం ను వేద వ్యాసుడు చెప్పగా వ్రాస్తున్నాడు. వినాయకుని బాదరాయణ సంబంధం నభూతో నభవిష్యతి. ఇలాంటి పవిత్ర సంబంధం సమకూరినప్పుడు వారిది బాదరాయణ సంబంధం అనాలి. 


 ఇక నరనారాయణులు సుర యక్షగంధర్వ కిన్నెర కింపురుషాదులు, ఋషులు, మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు ఇంకా ఎందరెందరో మహానుభావులు బదరీ వనంలో తపస్సు చేసి ప్రశాంత చిత్తంతో ఉన్నారు. వారి జన్మ ధన్యం." అని అనుకున్నారు. మహా భారతం వ్రాస్తున్న గణపతిని, చెబుతున్న వ్యాస భగవానుని అనునిత్యం ఏదో ఒక సమయంలో ఆకాశం నుండి దేవతలు చూస్తూనే ఉన్నారు.


 ఇలా మూడు సంవత్సరాలు గడిచిపోయింది. ఆ మూడు సంవత్సరాలు వేద వ్యాసుడు చెప్పే మహా భారత శ్లోకాలను గణపతి వ్రాసి ఆలపిస్తుండగా,అక్కడి ముని పుంగవులు తదితరులు వంత పాడుతున్నారు.


"ధర్మ క్షేత్రే కురుక్షేత్రే.... యత్ర యోగేశ్వరో కృష్ణో యత్ర పార్థో ధనుర్థరః..." వంటి మహా భారతం లోని భగవద్గీతా శ్లోకాలను రెట్టించిన ఉత్సాహంతో ముని పుంగవు లు ఒకటికి నాలుగు సార్లు ఆలపించారు. భగవద్గీత లోని మొదటి శ్లోకం "ధర్మ క్షేత్రే" శ్లోకం లోనీ మొదటి పదం "ధర్మ" భగవద్గీత లోని చివరి శ్లోకం "యత్ర యోగే శ్వరో'," శ్లోకం లోని చివరి పదం "మమ". ఈ రెండు పదాలను కలిపితే ‘మమ ధర్మః’ అనగా నా యొక్క ధర్మం అని అర్థం. భగవద్గీత అంటే ఇది నా యొక్క ధర్మం అని తెలుసుకునే పవిత్ర గ్రంథం అని ముని పుంగవులు చర్చించుకుంటున్నారు. 


మహా భారత రచన పూర్తి అయ్యింది. ఆ రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి. కృష్ణ ద్వైపాయన వేద వ్యాసుని జన్మ దినోత్సవం. ఆ రోజు మునులందరూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించే ప్రయత్నం లో ఉన్నారు. 


వ్యాసుడు అప్పటికే మహోన్నత వేదంగా, వేదత్రయిగా ఉన్న వేద తేజాన్ని చతుర్వేదాలుగ విభజించాడు. అందలి ఉదాత్తానుదాత్తాది స్వరాలను, అంత్యమ ధ్యోదాత్తాదుల స్వరూపాలను శాస్త్రోక్తంగా, గణితోక్తంగ తెలుసుకున్న మహర్షులు వేదాలను శాస్త్రోక్తంగా పఠించాలని అనుకుంటున్నారు. వేద వ్యాసునిచే విభజించ బడిన ఋగ్వేదం లోని "అగ్ని మీళే పురోహితం" అన్న మధుచ్ఛందసుని మొదటి ఋక్కు లోని 8 అక్షరాల గురించి, 13 స్వరాల గురించి 18 ఉచ్ఛారణా స్వరాల గురించి, అందలి గణ ధర్మాల గురించి, గుణ ధర్మాల గురించి ముని పుంగవులు చర్చించుకుంటున్నారు.

 

"చతుర్వేద విభజన చేసిన నేను ఆయా వేదాల సారమంతా జయ సంహిత అనబడే మహా భారతంలో పొందుపరిచాను. కాబట్టి ఈ మహా భారతం ను పంచమ వేదం అనవచ్చును." అని మహా తృప్తి గా తన మనసులో అనుకున్నాడు వేద వ్యాసుడు.


వినాయకుడు తను వ్రాసిన జయ సంహిత ను తృప్తిగ ఒకసారి చూసుకున్నాడు. "వ్యాసో నారాయణో హరిః" అనుకుంటూ పంచమ వేదం అనదగిన మహా భారతం ను వేద వ్యాసునికి సమర్పించాడు.


మూడు సంవత్సరాల పాటు వాగ్దేవి తన నోట పంచమ వేదం రూపం లో ఎంత పవిత్రంగా, సశాస్త్రీయంగా నిలిచిందో తలచుకుంటూ అవ్యక్త బ్రహ్మానందం తో తన కళ్ళ ముందున్న జయ సంహితను వ్యాసుడు చూసాడు.

ఆషాఢ శుద్ధ పౌర్ణమి వేడుకలు మహోన్నతంగా జరిగాయి. వేద వ్యాసుని జన్మ దినోత్సవం ను వినాయకుని ఆద్వర్యంలో ముని పుంగవులందరు బ్రహ్మాండంగా జరిపించారు. అనంతరం వేద వ్యాస మహర్షి దగ్గర వినాయకుడు సెలవు తీసుకుని కైలాసం కు బయలు దేరాడు.. కుడుములు, ఉండ్రాళ్ళు, పాల తాలికలు, చక్కర పొంగలి వంటి పవిత్ర పదార్థాలను ముని పుంగ వులు వినాయకునికి పెట్టి అతనిని సంతృప్తి పరిచారు. కొంత కాలం తర్వాత బదరీ వనానికి నారద మ హర్షి వచ్చాడు. నారద మహర్షికి బదరీ వనం లోని మునులందరూ స్వాగతం పలికారు. 


నారద మహర్షి మునులందరి స్వాగత సత్కారాలను స్వీకరించాడు. అనంతరం వేద వ్యాస మహర్షి కి నమస్కారం చేస్తూ," కృష్ణ ద్వైపాయన వేద వ్యాస! శివపార్వతులకు గణపతి చెప్పగ విన్నాను. మీ వదనాన వాగ్దేవి ధారాపాతంగా ప్రవహిస్తుండగా మీరు జయ సంహిత అని పిలవబడే మహా భారతం చెప్పారటగదా? దానిని గణపతి వ్రాసాడట గదా? దానిని మ హా భారతం అనేకంటే పంచమ వేదం అంటే బాగుంటుందని గణపతి కైలాస వాసులందరికి చెబుతున్నాడు. ఏమిటా కథ?" అని నారద మహర్షి వ్యాసుని అడిగాడు.


నారద మహర్షి మాటలను విన్న వ్యాసుడు,

"అవును మహర్షి.. భారతీ సరస్వతీ శారదా దేవీ, హం స వాహినీ,జగద్విఖ్యాతా, వాగీశ్వరీ, వాణీ,గీర్వాణీ, కౌమారీ, బ్రహ్మ పత్ని అని నానారకాల నామధేయాలతో పిలబడే వాగ్దేవి కరుణాకటాక్ష వీక్షణ క్షీరసంద్ర ప్రభావాన నేను మహా భారతం చెప్పగలిగాను. నేను చెప్పెదాని కంటే వేగంగా గణపతి మహా భారతం ను వ్రాయడమే గాక అందలి శ్లోకాలను తను ఆలపిస్తూ, ముని పుంగ వుల చేత ఆలపింపచేసాడు. 


మహా భారతం కథ కాదు. నా మాతృ మూర్తి వంశానికి సంబంధించిన కథ. మహా భారతం కేవలం కథ కాదు. చతుర్వేద మూలాల తేజం తో కూడిన కథ. దీనిని సమస్త లోకాలకు వ్యాపింప చేయాలి. అలా సమస్త లోకాలను విజ్ఞానవంతం, జ్ఞాన వంతం చేయాలి." అని అన్నాడు.


" తప్పుకుండా సమస్త లోకాలకు వ్యాపింప చేయాలి " అన్నాడు నారద మహర్షి.


 పంచమ వేదం అనదగిన మహా భారతం కథను

వేద వ్యాసుడు నారద మహర్షి కి చెప్పాడు. మహా భార తం ను. వ్యాస మహర్షి చెప్పగా విన్న నారద మహ ర్షి," కేవలం ఇది పంచమ వేదమే కాదు. వర్తమాన భూత భవిష్యత్ ల విజ్ఞాన తేజం. జీవన రూపం "అని వ్యాస మహర్షి తో అన్నాడు. అంత వ్యాస మహర్షి" దీనిని స్వర్గ లోకం లో ప్రచారం చేయమని నారద మహర్షి అన్నాడు.. 


అందుకు నారద మహర్షి అలాగే అని,"నారాయణాయ ఘన చరిత నవ రస భరితం శ్రీ కృష్ణ లీలామృతం పంచమ వేదం మహా భారతం " అంటూ స్వర్గ లోక వాసులకు కృష్ణ ద్వైపాయన వేద వ్యాసుడు వ్రాసిన మహా భారతం కథను వినిపించసాగాడు. 


 ఆపై మహా భారతం కథను పితృ లోకం లో చెప్పడానికి దేవలుడిని నియమించాడు. 


 వేద వ్యాస మహర్షి ఒకసారి తన కుమారుడు అయిన శుక మహర్షి వైపు చూసాడు.తను కర్ణికా వనమున తపస్సు చేసిన రోజులు అతనికి గుర్తుకు వచ్చాయి

............

వేద వ్యాస మహర్షి మేరు పర్వతము అందాలను చూస్తూ కర్ణికావనమునకు వెళ్ళాడు. అక్కడ పర మశివుని గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. వేద వ్యాస మహర్షి తపస్సు కు మెచ్చి శివుడు ప్రత్యక్ష మై ఏం వరం కావాలని అడిగాడు. 


వ్యాస మహర్షి "నీరు నిప్పు నేల గాలి ఆకాశము తో సమానమైన కుమారుడు కావా”లని పరమ శివుని ప్రార్థించాడు. పరమశివుడు తథాస్తు అన్నాడు.


వ్యాసుడు మహదానందం తో హోమము చేయడానికి అరణిని మధించసాగాడు. అప్పుడు అక్కడికి ఘృతాచి అనే అప్సరస వచ్చింది. వ్యాసుడు ఘృతాచి ని చూసాడు. అతని మనసు ఆమె మీదకు పోయింది. ఘృతాచి చిలుక రూపం ధరించింది.


వ్యాసుని మనసు చిలుక రూపంలో ఉన్న ఘృతాచి మీదనే ఉంది. ఘృతాచి తేజస్సు వ్యాసుని తేజస్సు ఏకమవ్వడంతో కాంతులు వెదజల్లే సుపుత్రుడు వ్యాస మహర్షి ముందు పచ్చికతో చేసిన ఉయ్యాలలో కిలకిల నవ్వసాగాడు. అతని వదనం చిలుక ఆకారంలో ఉంది.


ఘృతాచి శుకాకార పసికూనను చూచి మాతృ హృదయం తో వ్యాసుని ముందుకు వచ్చి రెండు చేతులు జోడించి అతని ముందు రెండు మోకాళ్ల మీద నిలబడింది. వ్యాసుడు ఘృతాచిని చూసాడు.


"ఘృతాచి! నువ్వు అప్సరసవైనప్పటికి నన్ను చూడగానే నీలోని సురకామ తేజస్సు నిలువున దహించుకు పోయి ద్వాపర యుగ మానవోత్తమ మగువ తేజస్సు ఆవిర్భవించింది. అది సుర తేజస్సు కన్నా వంద రెట్లు మహోన్నతమైనది. ఆ తేజస్సే నన్ను ఆవహించింది. ఈ పసి బాలుని పుట్టుకకు కారణమైంది. ఈ పసి బాలుడు శుక మహర్షి అనే పేర ప్రసిద్ధి చెందుతాడు. నీలో ప్రస్తు తం మానవోత్తమ మగువ తేజం కనపడటం లేదు. కావున నువ్వు అప్సర ఘృతాచిగ దేవ లోకం వెళ్ళు. " అని ఘృతాచి తో వ్యాసుడు అన్నాడు.


"అలాగే" అని ఘృతాచి దేవ లోకం వెళ్ళిపోయింది.


శుకునకు గంగ స్నానం చేయించింది. శివపార్వతులు శుకునకు ఉపనయనం చేసారు. బృహస్పతి విద్య నేర్పించాడు. ఆవు పాలు పితికినంత సేపు కూడా ఒక చోట ఉండని శుకుని వ్యాసుడు మోక్షాది మార్గాలు తెలుసుకు రమ్మని జనకుని దగ్గరకు పంపాడు

.................

గతాన్ని గుర్తు చేసుకుంటూ జనకుని దగ్గరకు వెళ్ళి వచ్చిన శుక మహర్షి ని వ్యాసుడు పిలిచా డు.. అంత శుక మహర్షి తో, "నాయనా శుక! నువ్వు గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకాదులకు వెళ్ళి పంచమ వేదం అనదగిన నేను వ్రాసిన మహా భారతం చెప్పు." అని వ్యాసుడు ఆన్నాడు. 


శుక మహర్షి చిత్తం తండ్రి అన్నాడు.. ఆ తర్వాత సర్ప లోకంలో మహా భారతం చెప్పడానికి సుమంతుడిని నియమించాడు. మానవ లోకం లో చెప్పడానికి వైశంపాయనుని నియమించాడు. అలా వ్యాస భగవానుని శిష్యాదుల వలన తన పంచమ వేదం అనదగిన మహా భారతం సమస్త లోకాలకు తెలిసింది.


పంచమ వేదం మహా భారతం పరమ పవిత్రం మహోన్నత విజ్ఞానం. 

ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి 


 సర్వే జనాః సుఖినోభవంతు 


వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు







53 views0 comments

Comentarios


bottom of page