top of page

పంచాంగ శ్రవణం


'Panchanga Sravanam' New Telugu Story

Written By Jidigunta Srinivasa Rao

'పంచాంగ శ్రవణం' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

కాఫీ తాగుతో ఫోన్లో యూట్యూబ్ చూస్తున్న భర్త రవీందర్ తో “అలా ఉదయమే ఆ రాజకీయనాయకుల తిట్టుకోవడాలు చూడకపోతే, ఈ రోజు ఉగాది కదా.. టీవిలో పంచాంగశ్రవణం వస్తుంది. విని మీ రాశి కి, నా రాశి కి, పిల్లల రాశి కి ఈ ఏడాది ఎలా వుందో చూడండి” అంది రమణి పూజ చేసుకుంటో.

పండగపూట ఎందుకొచ్చిన గొడవ అని, ఫోన్ పక్కన పడేసి టీవీ పెట్టాడు రవీందర్. ఏ ఛానల్ చూసినా పంచాంగశ్రవణం తో హడావిడి చేస్తున్నారు.

భార్య వినమంది కదా అని ఒక ఛానల్ లో ప్రతిపక్ష నాయకుడి ఆఫీసులో జరుగుతున్న పంచాంగశ్రవణం పెట్టాడు.


“అయ్యో రాత, అన్ని రాశులు గురించి చెప్పే పంచాంగశ్రవణం వినమంటే ఆ రాజకీయనాయకుడి జాతకం వింటున్నారేమిటండి, ఏమైనా అరిస్తే అసలే ఉగాది, సంవత్సరం అంతా అరవాలి, అంత ఓపిక లేదు నాకు. ఆర్డమైందా మీకు..” అంటూ పూజ గదిలో నుంచి అరుపులకి టీవీ ఛానల్ అదంతటికి అదే భక్తి టీవీ లోకి మారిపోయింది.నుదుట పెద్ద కుంకం బొట్టు, మెడ నిండా రుద్రాక్షలు, భారీ ఆకారం పంచాంగశ్రవణం చేస్తున్నారు. ఆయనని చూడగానే రవీందర్ కి భక్తిభావం కలిగింది.


ఒక్కొక్క రాశి గురించి చెప్పటం మొదలుపెట్టారు శాస్త్రిగారు. భర్త రాశి చెప్పటానికి ముందే పూజ ముగించి, వచ్చి కూర్చుంది రమణి.“యిప్పుడు తులా రాశి వారి జాతకం” అన్నారు శాస్త్రి గారు గట్టిగా ఊపిరి తీసుకొని.

“మీదే.. వినండి జాగ్రత్తగా. ఏ ఫోన్ వచ్చినా తీయద్దు” అంది రమణి.

“తులారాశి లోని స్వాతి జాతకులకి ఈ సంవత్సరం అద్భుతంగా వుంటుంది, పట్టిందల్లా బంగారమే. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి” అన్నారు శాస్త్రి గారు.


రవీందర్ ముసిముసి నవ్వులు నవ్వుతో “నాకు సంతానం కలుగుతుందిట” అన్నాడు.

“బాగానే వుంది వరస, 70ఏళ్ళు పెట్టుకుని యింకా సంతానం అనగానే ఆ మురిసిపోవడం ఏమిటండి.. సిగ్గులేకుండా” అంది రమణి.


“స్వాతి వారికి అన్నీ రోజులు బాగున్నాయి, అయితే ఆగష్టు లో జాగ్రత్తగా వుండాలి. పెద్ద ప్రమాదం పొంచి వుంది. రాహువు కాటు వేయడానికి సిద్ధంగా వుంటాడు. డిసెంబర్ లో కొడుకుకి పెళ్లి చేస్తారు” అని చెప్పిన శాస్త్రి గారి మాటలు విని, “మన అబ్బాయి పెళ్లి అయ్యింది గా, బహుశా ఆయనని పెళ్ళికి పిలవకపోవడం వలన తెలిసి వుండదు” అన్నాడు, మనసులో రాబోయే ఆగస్టు సంక్షోభమ్ గురించి ఆలోచిస్తో.


“యిప్పుడు మకరరాశి వారికి.. ఈ సంవత్సరం వీళ్ళకి బాగా కలిసివస్తుంది. వివాహం జరుగుతుంది, ఉద్యోగం లో పెద్ద లాభం కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది, కోర్టు కేసులు గెలుస్తారు” అని సెలవిస్తున్న టీవికి సెలవిచ్చింది రమణి.


టీవిలో తన జాతకం విన్న దగ్గరనుంచి రవీందర్ కి భయం పట్టుకుంది. తమ వంశంలో తనకి తెలిసి ఎవ్వరూ డెబ్బై సంవత్సరాలు దాటింది లేదు. తనే ఈ నెల ఆరో తేదికి డెబ్బై దాటి డెబ్బై ఒకటి లో పడ్డాడు అనుకుంటే, “ఈ శాస్త్రి గారు నాకు ఆగస్టు లో గండం వుంది” అన్నాడు.

‘అంటే మా ఆవిడ చేసిన పూజలకి ఆరునెలలు బోనస్ బతుకు యిచ్చాడా దేముడు’ అనుకున్నాడు.

“ఏమిటి అలా పిచ్చ చూపులు చూస్తున్నారు?” అన్న రమణి మాటలకి “ఉత్తరాయణం ఎప్పుడు వస్తుంది?” అన్నాడు.


“ఏమిటో మీ మాటలు ఎప్పుడు అర్ధం అయ్యాయి కనుక” అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది.

“యిదిగో.. ఎందుకైనా మంచిది, ఆగష్టు దాటేదాకా గారెలు వండకు, గారెలు అంటే భయంగా వుంది” అన్నాడు రవీందర్.


“అదేమిటి.. ఈరోజు గారెలు వండు అంటేనే కదా పప్పు నానపెట్టాను, యిప్పుడు వద్దంటే ఎలా? ఉదయం పూలరంగడు లాగానే వున్నారుగా, యిప్పుడు ఏమైంది.. వారం రోజుల క్రితం కోసిన పొట్లకాయల తయారయ్యారు” అంది.


‘అలాగే అంటారులే’ అని గారెలు, పాయసం, పులిహోర తో పాటు రెండు కూరలు, పచ్చడి చేసి భోజనంకి పిలిచింది రమణి.


వెండికంచంలో వున్న పదార్దాలని చూసి, “యింకో రెండు కూరలు, రెండు పచ్చళ్ళు చేయలేకపోయావా, పండుగ భోజనం లా అనిపించడం లేదు..” అంటున్న భర్త నుదుట చెయ్యి వేసి చూసి, “చల్లగానే వుంది, ఏమైంది మీకు, వింతగా మాట్లాడుతున్నారు” అంది కంగారుగా రమణి.

ఇంతలో వీధి తలుపు చప్పుడు అయితే లేవబోయిన రవీందర్ ని, “మీరు తినండి, నేను చూస్తాను” అని రమణి వెళ్లి తలుపు తీసి, ఎదురుగా నిలబడి దానం కోసం వచ్చిన పంతుళ్ళని చూసి, “భోజనం చేస్తున్నాం” అని చెప్పి తలుపు వేసేసింది.


“ఎవ్వరో వేద బ్రాహ్మన్స్, ఉగాది కదా, దానం కోసం వచ్చారు, ఉదయం వస్తే బాగుండేది, అపరాండం తిరిగిన తరువాత దానం ఎవ్వరు యిస్తారు?” అంది.

ఆపరాండం మాట, బ్రాహ్మణుల మాట వినగానే చలిజ్వరం వచ్చినట్టు వణికిపోయాడు రవీందర్. కంచంలో చేతులు కడుగుకుని లేచి వెళ్లి మంచం మీద పడుకున్నాడు.


“ఏమైయంది మీకు.. అన్నం అంతా వదిలేసారు” అని అడిగిన భార్యతో, “నిజంగా జాతకాలు జరుగుతాయా..” అన్నాడు.

ఏదో ఆలోచిస్తో, “జరగకపోతే అంతమంది జాతకాలు, ముహూర్తలు ఎందుకు పెట్టుకుంటారు. అయినా ఏ నమ్మకం లేని మీకెందుకండి వీటి గొడవ, ఏదో నాలాంటి పిచ్చ వాళ్ళు దేముడు, దెయ్యం, పూజలు అనుకుంటూ బ్రతికేస్తాము” అంది రమణి.


రోజులు గడుస్తున్నాకొద్ది తిండి తగ్గించేసాడు రవీందర్. 80 కేజీలు వున్నవాడు 70 కేజీలకి తగ్గిపోయాడు.

ఎందుకు భర్త అలా తయారు అయ్యాడో రమణికి అర్ధం కావడంలేదు. అడిగితే చేతులు తిప్పుతూ అయిపొయింది అంటున్నాడు.


దానితో భయం పట్టుకుని, “కొన్నాళ్ళు బెంగళూరు వెళదాం అండీ.. అబ్బాయి దగ్గరికి, మీకు కూడా కాలక్షేపం అవుతుంది” అంది.

“సరేలే. నాకు కూడా అబ్బాయిని, మనవరాలని, కోడలిని చూడాలి అని వుంది చివరిసారిగా” అన్నాడు.


“అదేమిటి పాడు మాటలు, చివరిసారి ఏమిటి? మీకు యిప్పుడు ఏమైంది అని, మొన్ననేగా అన్ని టెస్టులు చేయించుకుని డాక్టర్ కి చూపిస్తే, యిలాగే మెయింటైన్ చేస్తే తొంబై దాకా వుంటారు అన్నాడుగా” అంది.

“వుంటే మంచిదే, రేపు ఆదివారం బయలుదేరి వెళ్లదాం లే” అన్నాడు.


తల్లిదండ్రుల కోసం ఎయిర్పోర్ట్ కి వెళ్లిన అశ్విన్ వాళ్ళ పెట్టెలు కారులో పెట్టి, “ఏమిటి డాడీ నీరసంగా కన్పిస్తున్నారు?” అని ఆడిగాడు.


“అబ్బే.. బాగానే వున్నాను” అని సమాధానం చెప్పాడు రవీందర్.

యింటికి వచ్చిన తరువాత తల్లిని ఆడిగాడు, ‘నాన్న ఎందుకు అలా ముభావంగా వున్నాడు, ఏమైంది’ అని.


“ఎందుకు అలా వున్నారో తెలియటం లేదు, వాకింగ్ కూడా మానేసారు. ఏది వండిన రెండు మెతుకులు తిని, యింకా ఎన్నాళ్ళు తింటాను అనడం, ఆగష్టు లోపు మనం చేయాలిసిన పనులు ఏమున్నాయి అని అడుగుతున్నారు. ఆయన వాలకం చూస్తోవుంటే భయంగా వుంది రా” అంది రమణి.


“నాన్నకి మొన్నటి దాకా డబ్భై ఏళ్ళు అంటే భయం, యిప్పుడు యింకో కారణం వెతుక్కుని వుంటారు. నాలుగు రోజులు మనవరాలితో గడిపితే మాములు అవుతారు లే. రేపు మిమ్మల్ని దొడ్డగణపతి టెంపుల్ తీసుకుని వెళ్తాను” అన్నాడు.


తండ్రికి కూడా అదే చెప్పితే, “యిప్పుడు నేను ఎక్కడకి రాను, మీరు వెళ్ళండి” అన్నాడు.

“లేదు డాడీ! ఆ గణపతి చాలా మహిమ కలవాడు. ఒక్కసారి చూస్తే, అక్కడ నుంచి రావాలి అనిపించదు. వచ్చేడప్పుడు అక్కడ దగ్గరలోనే మంచి ఉడిపి హోటల్ వుంది వెళ్దాం, సాంబార్ ఇడ్లీ ఫేమస్” అన్నాడు. కొడుక్కి తెలుసు తండ్రికి సాంబార్ అంటే యిష్టమని.


మొత్తానికి బయలుదేరి దొడ్డగణపతి ఆలయం కి వెళ్లారు. కొడుకు చెప్పింది నిజమే, ఆ వినాయకుడిని చూడగానే మనసులోని ఆందోళన తగ్గినట్టు అనిపించింది. ఒక చేతిలో పుస్తకం, ఒక చేతిలో కలం పట్టుకుని ఏదో రాస్తున్నారు అనుకున్నాడు.


జనం తక్కువగా వుండటంతో “కాసేపు అక్కడే కూర్చొని వుందాము” అన్నాడు అశ్విన్.

“సరే మీరు కూర్చొని వుండండి, నేనూ, నా మనవరాలు అలా గుడి చుట్టూ తిరిగివస్తాము” అని మనవరాలి చెయ్యి పట్టుకుని నడవటం మొదలుపెట్టాడు రవీందర్.


గుడిలో పూజారిగారు పుస్తకం చదువుకుంటూ చూసి, రవీందర్ ఆయన దగ్గరికి వెళ్లి, “స్వామి.. నాకు ఒక అనుమానం వుంది, అది మిమ్మల్ని అడగవచ్చా” అని ఆడిగాడు.


పూజారిగారు పుస్తకం పక్కన పెట్టి, “యిటువైపు కూర్చొని అడగండి” అన్నారు.

“స్వామి.. ప్రతీ ఉగాది నాడు చెప్పే జాతకాలు నిజం అవుతాయా? మొన్న ఉగాది పంచాంగశ్రవణం లో రాబోయే ఆగస్టులో నా నక్షత్రం కి చాలా పెద్ద ప్రమాదం వుంది అని చెప్పారు, మా కుటుంబం లో ఎవ్వరూ డబ్భై సంవత్సరాలు దాటి బ్రతకలేదు, యిప్పుడు ఈ మాట విన్నాకా నాకు కూడా మరణం ఆగస్టు లో వుంటుంది అని భయంగా వుంది” అని చెప్పాడు రవీందర్.


పూజారిగారు ఒక్కసారి రవీందర్ వంక చూసి, “మీ వయసు యిప్పుడు ఎంత?” అన్నారు. “డబ్భై దాటి నాలుగు నెలలు అయ్యింది” అన్నాడు. పూజారిగారు చిరునవ్వు నవ్వి, “ఒకవేళ జాతకం నిజమైతే మీరు ఈ వయసులో కోల్పోయేది ఏముంది అనేది ఒకటి, రెండు.. ఒకసారి ఆ గణపతి వంక చూసి ఆయన ఏమిరాస్తున్నాడో చదివి చెప్పండి” అన్నాడు.


“దేముడు రాసినది మనం ఎలా చదవగలము స్వామి” అన్నాడు రవీందర్.

“ఈ జాతకాలు చదివి చెప్పినవాళ్ళు కూడా కొన్ని సూచనలు చెయ్యగలరు కానీ, అవి వందశాతం నిజం అవుతాయి అని చెప్పలేము. దేముడు ప్రతీ మనిషికి జాతకం రాసి భూమి మీదకి పంపుతాడు. దానిని ఎవ్వరు చదవలేరు, మార్చలేరు. పంచాంగశ్రవణం లో మంచిని తీసుకోండి, చెడుని భగవంతుడుకి వదిలేయండి. అంతా ఆయన రాసిన రాత ప్రకారం జరుగుతుంది. మిగిలిన జీవితం ఆనందంగా గడపండి. మనుషులు రాసిన జాతకం ప్రకారం జరిగేడట్లయితే ఈపాటికి నేను గతించి రెండు సంవత్సరాలు అవ్వాలి” అన్నాడు.


“కృతజ్ఞతలు స్వామి, దేవుడు చేసిన, రాసిన రాతలని ఎవ్వరు అనువాదం చెయ్యలేరు అని తెలిసింది. మళ్ళీ స్వామి దర్శనం కి సెప్టెంబర్ లో వస్తాను” అని లేచాడు.గుడి మెట్ల మీద కూర్చుని మాట్లాడుకుంటున్న భార్య, కొడుకు, కోడలు దగ్గరికి వెళ్లి, “అబ్బాయి.. పదరా, హోటల్ కి వెళ్దాం” అన్నాడు రవీందర్.

“యిప్పుడేనా, యింకా ఏడు గంటలు కూడా అవ్వలేదు డాడీ, యింకో రెండు ప్రదక్షణలు చెయ్యండి” అన్నాడు అశ్విన్.


“పదవే అలా తిరిగొద్దాం” అన్నాడు మనవరాలితో.

“నేను యింక తిరగలేను తాతయ్య, నువ్వు వెళ్ళు” అంది.

“సరే, ఎలాగో టైమ్ వుంది అన్నావుగా, పదకొండు ప్రదక్షణలు చేసి వస్తాను” అని బయలుదేరాడు రవీందర్.


హోటల్ కి బయలుదేరినప్పుడు, “డాడీ.. మీరు జాతకం విని భయపడి పోయారా, పాపాయి చెప్పింది” అన్నాడు.


“ఏమండీ.. మీ రాశి వారికి సంతాన యోగం వుంది అన్నాడని మీకు యిప్పుడు పిల్లలు ఎలా పుడతారు అనుకున్నారు, నాకు నా రాశి వాళ్ళకి ఈ ఏడాది వివాహయోగం ఉందని చెప్పాడు, అలా అని నాకు పెళ్లి అవుతుందా యిప్పుడు, ఒకే రాశి వాళ్ళు కోట్ల మంది వుంటారు. అన్ని మనకే జరుగుతాయి అని ఎలా అనుకున్నారండి? పేరుకి నాలుగు వందల కథలు రాసాను అంటారు, చివరికి టీవిలో జాతకం కి బయపడి పోయారా” అంది రమణి.


“నిజం కానివి వినడం ఎందుకు?” అన్నాడు.

“విని జాగ్రత్తగా వుండటం కోసమే తప్పా నుదుటి రాత ని ఎవ్వరు చదవలేరు, మార్చలేరు” అంది. “దిగండి.. హోటల్ వచ్చింది. మీకు బటన్ ఇడ్లీ, సాంబార్ చెప్పనా..” అన్న కొడుకు తో “వడాసాంబార్ కూడా” అన్నాడు మనవరాలి వంక చూస్తో.

శుభం

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


Podcast Link

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


34 views0 comments

Comentarios


bottom of page