పండుగకో పట్టుచీర
- Sammetla Venkata Ramana Murthy
- Jan 5
- 4 min read
#SusmithaRamanaMurthy, #సుస్మితారమణమూర్తి, #PandugakoPattucheera, #పండుగకోపట్టుచీర, #TeluguKathalu, #తెలుగుకథలు

Pandugako Pattucheera - New Telugu Story Written By Susmitha Ramana Murthy
Published In manatelugukathalu.com On 05/01/2025
పండుగకో పట్టుచీర - తెలుగు కథ
రచన : సుస్మితా రమణ మూర్తి
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
అయ్యగారు వాలు కుర్చీలో కూర్చుని పేపరు చదవడంలో లీనమైపోయారు.
“ఏమండీ! ఎదురింటి కాంతం పండక్కి రెండు పట్టు చీరలు వాయిదాల పద్ధతిలో తీసుకుందండీ! ఒక్కో చీర అయిదేసి వేలు. పదివేలు ఒకసారే కట్టనవసరం లేదు. మొదట అయిదు వేలు కట్టి రెండు చీరలు తీసుకోవచ్చు. తర్వాత వెయ్యేసి కట్టొచ్చండీ! మీరెలాగూ పండుగకు చీర కొంటారుగా? ఇలాగైతే రెండు చీరలు వస్తాయి” పేపరు ధ్యాసలో ఉన్న అయ్యగారు తలూపారు. అమ్మ గారి ముఖం వెలిగి పోయింది.
*****
“ఏమండీ! పట్టు చీరలతను పక్కింటిలో ఉన్నాడు. అయిదు వేలిస్తే, రెండు చీరలు తెచ్చుకుంటాను” అయ్యగారు ఆశ్చర్య పోయారు. వారి వాలకం చూసి అమ్మగారు విస్తుపోయారు. “అదేనండీ! నిన్న వాయిదాల పద్ధతిలో రెండు చీరలు తీసుకుంటానంటే, మీరు తలూపారుగా!”
అయ్యగారి ముఖంపై ఆశ్చర్యార్థకం ఇంకా వేలాడుతూనే ఉంది. అమ్మ గారికి అయ్యగారి ధోరణి అర్థం కాలేదు. ‘తను చెప్పే ఉంటుంది. పేపర్లోని ఏదో వార్తా కథనం బుర్ర ఊపుతూ చదివి ఉంటాను. దానిని తను అవునన్న సంకేతంగా భావించి ఉండొచ్చు. ఇంటింటికి వచ్చి వాయిదాల పద్ధతిలో బట్టలు అమ్మేవారి దోపిడీ ఆడాళ్ళకు చెప్పినా అర్థం కాదు.
వీరికి డబ్బు విలువ ఎప్పటికీ తెలియదు. పొదుపు గురించి అసలు పట్టించుకోరు. మొన్నటికి మొన్న మన అందరి బాగు కోసం మొక్కుకున్నాను. అమ్మ వారికి చీర ఏదో ఊరిలో ఇవ్వాలంది. ఉన్న ఊరి గుడిలోనే ఆ మొక్కు తీర్చుకునేలా చేయడానికి ఎంత ఇబ్బంది పెట్టిందని!.. ఎలాగైనా ఈ వాయిదాల పద్ధతికి చెక్ పెట్టాలి. ఎలా?.. ’
అయ్యగారి ఆలోచనలకు అమ్మగారు బ్రేకు వేసారు. “నిన్న అవునన్నారు. ఇప్పుడు మాట్లాడరేం !?..”
అయ్యగారు లేచారు.. సీరియస్గా టేబులు సొరుగులు వెదకసాగారు. “ దేని కోసం వెతుకుతున్నారండీ?”
“పేపరు చూద్దామంటే నా కళ్ళజోడు కనిపించటంలేదే!”
“మహాప్రభో! మీ నెత్తిపైనే ఉందిగా!”
అయ్యగారు సంతోషంగా కళ్ళజోడు పెట్టుకుని పేపరులో తల దూర్చారు. అమ్మగారి కోపం అవధులు దాటింది. “ఇందాకట్నుంచి చీరల గురించి గొంతు చించుకుంటున్నా మాట్లాడరేం!”
“ఆఁ!.. ఏమంటున్నావ్?..”
‘వీరి మతిమరుపు, చెవుడు నిజమేనా?.. అవసరమైతే ఎంతయినా ఖర్చు పెడతారు. మహా పొదుపరి. డబ్బు విషయంలో తప్ప, మిగతా వ్యవహారాల్లో బాగుంటున్నారు. ఎప్పడూ లేనిది ఇలా వ్యవహరించడం పొదుపు కోసమేనేమో?.. ’ అమ్మ గారి ఆలోచనలు ఓ కొలిక్కి వచ్చాయి.
*****
“నమస్తే మేడమ్!”
“నమస్తే! ఏమిటి ఇబ్బంది?”
“నాక్కాదండి. మావారికి జ్ఞాపకశక్తి అంతగా ఉండటం లేదండీ! నిన్నటి విషయాలు ఈరోజుకి గుర్తుండటం లేదు. వస్తువులు ఎక్కడ పెట్టారో మరచి పోతున్నారు”
“మతిమరుపు సాధారణంగా మధ్య వయసు చివరలో కాని, వృద్ధాప్యం ప్రారంభంలో గాని వస్తుంది. వయసైన వారిలో ఈ లక్షణం మామూలే! మీరు బయట కూర్చోండి. మీవారిని పరీక్షించి మంచి మందులు రాస్తాను“
“ప్రమాదం ఏమీ లేదు కదండీ?”
“జ్ఞాపకశక్తి తగ్గుతుండటం వలన, మెదడు పనితీరు మారుతుంది. ఆలోచనల్లో, ప్రవర్తనలో, వ్యక్తిత్వంలో కాస్త తేడా రావచ్చు. గాభరా పడకండి”
అమ్మగారు బయటకు వచ్చేసారు.
“మీ పేరు?”
అయ్యగారు దిక్కులు చూస్తున్నారు. డాక్టర్ స్వరం పెంచి అడిగేసరికి వారు పేరు చెప్పారు.
“వెరీ గుడ్! ఎప్పుడైనా మీరు పడడం గాని, తలకు దెబ్బ తగలడం గాని జరిగిందా?“
“అలాంటిదేమీ లేదండీ!”
“మీకున్న రుగ్మత ఈ వయసులో అందరికీ వచ్చేదే! భయపడకండి”
“రుగ్మత అంటే!?..”
“ఇదొక న్యూరో డీజెనరేటివ్ వ్యాధి. నెమ్మదిగా తీవ్రమవుతుంది. క్రమంగా చిత్త వైకల్యాన్ని కలిగిస్తుంది. జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది”
“అలాగా!”
“వైద్య పరిభాషలో దీనిని ‘అల్జీమర్స్’ అంటారు. అంటే జ్ఞాపకశక్తి తగ్గడం”
“నాకు జ్ఞాపకశక్తి తగ్గిందాండీ!?..”
“మీ శ్రీమతి గారు అన్ని వివరాలు చెప్పారు. మీరు బాగానే ఉన్నారు. కాస్త మతిమరుపు వచ్చినట్లుంది”
“అవును. నేను బాగానే ఉన్నాను. మతిమరుపు ఎందుకు వస్తుందండి?”
“కారణాలు అనేకం. మెదడులోని కణాల్లో మార్పుల వలన రావచ్చు. మెదడులోని నరాల కణాల మధ్య కనెక్షన్లు బలహీన పడితే రావచ్చు. ప్రమాదాలలో తీవ్రంగా గాయపడితే రావచ్చు. అందరికీ వస్తుందని చెప్పలేం. వయసైన వారిలోనే ఎక్కువ వస్తుంది“
“ఓహో! అలాగా?..”
“పెద్ద వయసు వారిలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రోజువారీ కార్య క్రమాలకు ఇబ్బంది పడతారు. మరుపు ప్రారంభం అవుతుంది. ఒక చోట వస్తువులు పెట్టి మరోచోట వెతుకుతుంటారు. ఎక్కడెక్కడికో తమకు తెలియకుండానే వెళ్ళిపోతుంటారు“
“మీ సైన్సు పాఠం బాగుందండీ! మెదడులో నరాల బలహీనత సంగతైతే నాకు తెలియదండీ! అప్పుడప్పుడు ఒకచోట పెట్టిన వస్తువులు మరచిపోయి, వేరే చోట నేనేమీ వెతకడం లేదు. నెత్తిమీద కళ్ళజోడు ఉంచుకుని వెతకడం, వినపడనట్లు నటించడం అంతా మా ఆవిడను ఆట పట్టించడానికే !”
“మీ ఆవిడ నాకు అన్నీ చెప్పారు. ఈ వయసులో మీరు కొన్ని టెస్టులు, స్కేనింగులు చేయించుకోవడం చాలా మంచిది. నెల రోజులకు మందులు రాస్తాను. అవి వాడిన తర్వాత టెస్టులు మా ఆస్పత్రిలోనే చేయించుకుని రిపోర్టులు తీసుకురండి. వాటిని బట్టి మరల మందులు రాస్తాను”
“స్కేనింగులకు, టెస్టులకు, మందులకు ఎంతవుతుందండీ?”.
“పదిహేను వేలు అవొచ్చు. ఆ తర్వాత మందులకు మరో అయిదు వేలు అవొచ్చు. మీ ఆరోగ్యం ముఖ్యం కదా? అన్ని మందులు ఇక్కడి షాపులో కొంటే తగ్గింపు ఉంటుంది. బయట కొంటే నకిలీవి రావచ్చు”
“అలాగే డాక్టర్ గారూ!” అంటూ బయటకు వచ్చేసారు అయ్యగారు.
“డాక్టరు గారు ఏమన్నారండీ? అమ్మగారు అడిగారు.
“అంతా బాగుందన్నారు. టెస్టులు, మందులు రాసారు. ఇరవైవేలు ఖర్చు!“
“పదండి. ముందు మందులు తీసుకుందాం“
“అవన్నీతర్వాత చూద్దాం. ముందు ఇక్కడనుంచి పోదాం పద”
అమ్మగారు మౌనం వహించారు. అయ్యగారికి ఆస్పత్రి వ్యవహారం వ్యాపార ధోరణిలా అనిపించింది. తమ కంపెనీ ఆసుపత్రి డాక్టర్ గారి సలహా తీసుకుంటే మంచిదనిపించింది. అయ్యగారు పండుగకు పట్టుచీర, మరోచీర అయిదు వేలలో షాపులోనే కొన్నారు.
*****
“ఏమిటే గీతా! నా డయాగ్నోసిస్ కి, మందులకు, టెస్టుల ఖర్చులకు ఇరవై వేలంటే మీవారు బెదిరిపోయారా?.. ”
“అదేమీ లేదులేవే! ఉచిత కన్సల్టేషను అంటేనే వచ్చారు. వెయ్యిరూపాయలు ఫీజు అంటే, నీ దగ్గరకు వచ్చేవారే కాదు”
“నీవు చెప్పినట్టే వైద్య పరిభాషలో పకడ్బందీగా మాట్లాడేను”
“వారు ప్రస్తుతానికి బాగానే ఉన్నారు. ముందు ముందు వయసురీత్యా మతిమరుఫు ఇబ్బంది రావచ్చని అర్థమయిందే నాకు“
“ఇంతకీ మీవారు చీరలకు అయిదు వేలు ఇచ్చారా?”
“లేదే! డాక్టరు ఖర్చనే పెద్దగీత ముందు వాయిదాల పద్ధతే చిన్నగీతని వారిని ఒప్పిద్దామని అనుకున్నాను. ఫలితం లేకపోయింది. వారు అయిదు వేలలో రెండు చీరలు షాపులోనే కొన్నారు”
అమ్మగారికి ఒకనాటి ఇంటరు స్నేహితురాలే ఆ డాక్టర్ గారన్నది అయ్యగారికి తెలియని విషయం. అమ్మగారి ఆశ తీరలేదు. అయ్యగారు షాపులో కొన్న చీరలతోనే ఆమె సంతృప్తి చెందక తప్పలేదు.
/ సమాప్తం /
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
సుస్మితా రమణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం : సమ్మెట్ల వెంకట రమణ మూర్తి
కలం పేరు : సుస్మితా రమణ మూర్తి
పుట్టుక, చదువు, వుద్యోగం, స్వస్థలం .. అన్నీ విశాఖలోనే.
విశ్రాంత జీవనం హైదరాబాద్ లో.
కథలు, కవితలు, కొన్ని నాటికలు .. వెరసి 300 పైచిలుకు వివిధ వార, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి లో కూడా ప్రసారం అయ్యాయి.
బాగా రాస్తున్నవారిని ప్రోత్సహిస్తూ , కలం కదిలితే రాయాలన్న తపనతో
మీ సుస్మితా రమణ మూర్తి.
Comments