కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Pannasa Vari Padanisalu' written by M R V Sathyanarayana Murthy
రచన : M R V సత్యనారాయణ మూర్తి
పన్నాస వారి దగ్గర సంగీతం నేర్చుకుంది కృష్ణ కుమారి.
ఆమె గొంతులోని మాధుర్యం నోటిలో కూడా ఉందేమో...
ఆమెను దొంగముద్దు పెట్టుకున్న బావ మురళి ఆమెను మరిచి పోలేక పోయాడు.
ఆమెనే పెళ్లి చేసుకున్నాడు.
ప్రముఖ రచయిత ఎం.ఆర్.వి.సత్యనారాయణ మూర్తి గారు ఈ అమలిన శృంగార కథను రచించారు
పెనుగొండ గ్రామంలో పన్నాస వారి కొట్టు తెలియని వారు ఎవరూ ఉండరు. ఎందుకంటే ఊళ్ళో సగం మంది బస్సు ఎక్కాలంటే ఈ కొట్టు దగ్గరకు వచ్చి తీరాల్సిందే. బస్సు కండక్టర్లకు కూడా ఈ స్టాప్ బాగా పరిచయమే. విజ్జేశ్వరం – నర్సాపురం కాలువగట్టున ఉన్న పెద్ద చింతచెట్టు దగ్గర ఉంది పన్నాస వారి కొట్టు. కాలవగట్టు రోడ్డు నుండి పెనుగొండ మెయిన్ బజార్ కు వెళ్ళే దారి ఇక్కడనుండే ప్రారంభం అవుతుంది.
రోడ్డుని ఆనుకుని ముప్ఫై అడుగుల పొడవు,పదిహేను అడుగుల వెడల్పు ఉన్న రేకుల ఇంటిలో ఉంది పన్నాస వారి కొట్టు. పన్నాస సోదరులు లవకుశులు వంటి వారు. ఈ ఇంటిలో పన్నాస సూర్య నారాయణ సోడా షాప్, పన్నాస రామచంద్ర రావు పటాల కొట్టు రెండూ ఉన్నాయి.
పాలకొల్లు,భీమవరం నర్సాపురం వెళ్ళేవారు, తణుకు,నిడదవోలు,రాజమండ్రి వెళ్ళేవారు పన్నసవారి కొట్టు వద్దే బస్సు ఎక్కుతారు. పెనుగొండ గ్రామం కాలవగట్టు వెంబడి కిలోమీటర్ మేర విస్తరించి ఉంది. అందుకుని ఊర్లో సగం మంది అటు మినర్వా టాకీసు దగ్గర ఉన్న బస్సు స్టాండ్ కి వెళ్లి బస్సు ఎక్కితే, మిగతా సగం మంది ఇటు పన్నాస వారి కొట్టు దగ్గర బస్సు ఎక్కుతారు.
పన్నాస వారి కొట్టు దగ్గర బస్సు ఎక్కేవారికి కొంత సౌకర్యం ఉంది. కొట్టు ముందు రెండు పెద్ద చెక్క బల్లలు ఉంటాయి.ప్రజలు అక్కడ కూర్చోవచ్చు.పైగా చింతచెట్టు నీడ కూడా వుంటుంది.కొట్టుకి పది గజాల దూరంలో చాకళ్ళ చెరువు ఉంది.దాంట్లోని కలువపువ్వులు, తామరఆకులు చూస్తూ ఉంటే పిల్లలకే కాదు పెద్ద వారికి కూడా మనసు హాయిగా, ఉత్సాహంగా ఉంటుంది. చెరువులో బట్టలు ఉతికే చాకళ్ళు పాడే జానపద గీతాలు చాలా రంజుగా ఉంటాయి.అన్నిటినీ మించి పన్నాస సోదరుల ఆత్మీయ పలకరింపులు గ్రామస్తులకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి.
“ఏం రమణమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు?” అని రామచంద్రం ఆప్యాయంగా అడిగాడు.
“పాలకొల్లు అమ్మాయి దగ్గరికి బయల్దేరాను”అంది రమణమ్మ.
“వెంకటలక్ష్మి బాగుందా?పిల్లలు ఇద్దరూ ఏం చదువుతున్నారు?”నవ్వుతూ అడిగాడు రామచంద్రం.
“అమ్మాయి బాగుంది అన్నా .పెద్ద పిల్లాడు ఎనిమిది, చిన్నాడు ఆరు చదువుతున్నారు. నీకు అందరూ గుర్తే”ముసి ముసిగా నవ్వుతూ అంది రమణమ్మ.
’అమ్మాయిని అడిగానని చెప్పు’అని పనిలో పడతాడు రామచంద్రం. కొంతమందిని రామచంద్రం పలకరిస్తే, మరి కొంతమందిని సూర్యనారాయణ పలకరిస్తాడు. అలాగే చిన్నపిల్లలతో వచ్చిన ఆడవారికి బస్సు ఎక్కడంలో, సామాన్లు అందివ్వడంలో సోదరులు ఎవరు ఖాళీగా ఉంటె వాళ్ళు వచ్చి సాయం చేస్తారు. బస్సు రావడం ఆలస్యం అయి పిల్లలు ఏడుస్తూ ఉంటె సూర్యనారాయణ వారికి నిమ్మతొనలు ఇచ్చి వారితో కబుర్లు చెప్పి వారిని ఊరడిస్తారు.
ఓ పక్కన వ్యాపారం చూసుకుంటూనే ఇవన్నీ చేస్తారు పన్నాస సోదరులు. ఊళ్ళో ఇంకా చాలా సోడా కొట్టులు ఉన్నా పన్నాస వారి కొట్టుకి వచ్చి గోలీ సోడా తాగే వాళ్ళు కూడా ఎక్కువే. వాళ్ళో బీళ్ల అప్పలస్వామి గారి అబ్బాయి అప్పారావు, సానబోయిన రామదాసు గారి అబ్బాయి సత్యనారాయణ, చెట్లపల్లి శివరావు గారి అబ్బాయి నరసింహం పంతులు ప్రముఖులు. సూర్య నారాయణ సోడా కొడుతుంటే సీసాలోంచి వచ్చే గ్యాస్ వేడి వేడి కాఫీ కప్పు లోంచి వచ్చే పొగలాగా భలేగా ఉంటుంది.
“ఏమిటో సూర్యనారాయణ గారూ మీ సోడా ముందు పాలకొల్లు లీలా మహల్ సెంటర్లో తాగిన సోడా కూడా బలాదూర్ ”అంటాడు అప్పారావు తరుచుగా.
అసలు గోలీ సోడా తయారే ఒక అద్భుతం. ఖాళీ సోడా సీసాలో మూడువంతులు నీళ్ళతో నింపుతారు. మూడు సీసాలు పట్టే ఒక రేకు బాక్స్ లో పెట్టి మూతవేస్తారు.తర్వాత ఆ పెట్టెకి ఉన్న హేండిల్ ని నాలుగు, అయిదు సార్లు తిప్పుతారు. అది ఆగాకా సోడా గ్యాస్ సిలండర్ నుంచి కొద్దిగా గ్యాస్ ని రేకు బాక్స్ లోని మూడు సీసాలలోకి పంపుతారు. అప్పుడు ఆ గ్యాస్ కి సీసాలోని గోలీ పైకి వచ్చి సీసా మూతి దగ్గరకు వచ్చి ఆగుతుంది.అప్పుడు రేకు బాక్స్ ని మరలా నాలుగు,అయిదు సార్లు హేండిల్ తో తిప్పి ,అది ఆగాకా బాక్స్ లోంచి సోడా సీసాల్ని తీసి తొట్టిలో పెడతారు. సోడా కావాలని ఎవరైనా అడగగానే సోడా సీసా తీసి చెక్క మూతతో సీసా పైని బాగా నొక్కుతారు. అప్పుడు సీసాలోని గోలి కిందకు వెళ్లి గ్యాస్ బయటకు వస్తుంది. సోడా తాగగానే మనిషికి ఒక విధమైన తృప్తి కలుగుతుంది.
పన్నాస వారి కొట్టుకి దగ్గరలోనే ఉన్న రైస్ మిల్ షావుకార్లకు సూర్యనారాయణ గోలీ సోడా బాగా అలవాటు. వాళ్ళ మిల్లుకి ఎవరైనా అతిధులు వచ్చినప్పుడు సుబ్బారావు స్వీట్ షాప్ నుండి మైసూరుపాక్, ఉల్లి పకోడీ తెప్పించి ఇస్తారు.కాఫీ టీలకు బదులుగా సూర్యనారాయణ సోడా ఇస్తారు. అంత ప్రత్యెకత ఉంది పన్నాస వారి గోలీ సోడాకు.
****
పెనుగొండలో సంగీత విద్వాంసులు ఎక్కువ మంది వున్నారు. హరి నరసింహమూర్తి వయోలిన్, చల్లా సుబ్బయ్య, డొక్కా సుబ్బారాయుడు వీణ, చంద్రాభట్ల సత్యం గాత్రం నేర్పుతున్నారు పిల్లలకు. మన పన్నాస సోదరులు ఇద్దరూ పిల్లలకు హార్మొనీ నేర్పుతున్నారు. వీరవల్లి సూర్యనారాయణ మృదంగంలో దిట్ట. కానీ మృదంగం నేర్చుకునే వారు చాలా తక్కువ. కొంచెం ఉన్నత వర్గాల కుటుంబాల వారు తమ పిల్లలకు వీణ నేర్పిస్తున్నారు. రెండు మూడు కుటుంబాల వారి పిల్లలు నరసింహ మూర్తి దగ్గర వయోలిన్ నేర్చుకుంటున్నారు.మధ్యతరగతి పిల్లలు పన్నాస వారి దగ్గర హార్మొనీ నేర్చుకుంటున్నారు. వీణ, వయోలిన్ నేర్చుకునే వారు తప్పకుండా ఆయా వాయిద్యాలు కొనుక్కోవాలి. కానీ హార్మొనీ నేర్చుకునే వారికి ఆ ఇబ్బంది లేదు.పన్నాస వారి దగ్గర రెండు హార్మొనీ పెట్టెలు ఉన్నాయి. వాటిమీదే పిల్లలు సంగీతం నేర్చుకోవచ్చు. సోదరులు ఇద్దరూ గాత్రం కూడా నేర్పుతారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళకు.పైగా ఫీజు పట్టింపు లేదు. పిల్లలు ఎంత ఇస్తే అంతే తీసుకుంటారు.రోక్కించరు. అదీ వాళ్ళ ప్లస్ పాయింట్.
రోజూ నాలుగు గంటలు దాటితే పన్నాస వారి కొట్టు దగ్గర సంగీత సరస్వతి కొలువై ఉంటుంది. బస్సు దిగి ఇళ్ళకు వెళ్ళే వారు సంగీతం నేర్చుకునే వారిని పరిశీలనగా చూస్తూ ఉంటారు. తమ పిల్లలు కూడా పెద్దయ్యాకా అలా చక్కగా సంగీతం నేర్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంటారు కూడా.
అయితే ఈ సంగీత సాధన బలే గమ్మత్తుగా ఉంటుంది. ఒక పక్క సంగీతం పాడే పిల్ల…..’లంబోదర లకుమికరా’అని పాడుతూనే ఉంటుంది. ఈలోగా ‘సూర్యనారాయణ గారూ సోడా’ అంటాడు ఓ పెద్దాయన. ఖయ్యి మని చప్పుడు చేసిఆయనకు సోడా కొట్టి ఇచ్చి,’అంబా సుత’ అంటూ ఆ అమ్మాయికి పాటం చెబుతాడు సూర్యనారాయణ. చూసేవాళ్లకు తమాషాగా ఉంటుంది కానీ, సంగీతం నేర్చుకునే పిల్ల లోనూ ,సంగీత పాటం చెప్పే గురువు లోనూ ఏకాగ్రత ఉంటుంది.
పటాల కొట్టులో రామచంద్రం ఒక అమ్మాయికి హార్మొనీ చెబుతూ ఉంటె, సూర్యనారాయణ తన కొట్లో ఇంకో అమ్మాయికి గాత్రం చెబుతూ ఉంటాడు.తమ వ్యాపారాలు చూసుకుంటూనే సంగీతం నేర్పుతారు పిల్లలకు పన్నాస సోదరులు. తెలుగు సంస్కృతి కి ప్రతినిధులుగా ఎప్పుడూ, పంచె, చొక్కా పైన కండువాతో కనిపిస్తారు సోదరులు ఇద్దరూ. ఉదయం పదిగంటల సమయం. మార్చి నెల. సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.సోడాల బేరం జోరుగా ఉంది సూర్యనారాయణ షాప్ లో. రామచంద్రం కూడా కూనిరాగం తీస్తూ దేముడి బొమ్మలకు అద్దం బిగించి పటాలు కడుతున్నాడు. అప్పుడే ఆగిన నిడదవోలు-నర్సాపురం బస్సు లోంచి దిగింది కమలమ్మ , తన ఇద్దరి మనవలతో.
“సూరీడు అన్నయ్యా, ఒక సోడా కొట్టు”అంది కమలమ్మ మొహానికి పట్టిన చెమటను చీర చెంగుతో తుడుచుకుంటూ.
“బాగున్నావా కమలమ్మా”అని ఆమెని పలకరించి సోడా కొట్టి ఇచ్చాడు సూర్యనారాయణ. సోడా తాగి సీసా బల్లమీద పెట్టి డబ్బులు ఇవ్వడం కోసం, చేతిసంచి లోని పర్సు కోసం వెదికింది కమలమ్మ. పర్సు కనిపించలేదు. సంచీలోని బట్టలు తీసి కింద పెట్టి మరలా వెదికింది.అయినా పర్సు కనపడలేదు.
మనవల్ని అడిగింది “ఏరా, పర్సు కానీ తీశారా?”అని. “లేదు అమ్మమ్మా”అన్నారు ఇద్దరూ ఒకేసారి. కమలమ్మ గుండె ఝల్లుమంది. మళ్ళీ ఇంకోసారి సంచీ అంతా వెదికింది పర్సు కోసం. కనపడలేదు.
ఈ హడావిడి అంతా చూసి “ఏమైంది కమలమ్మా?”అని అడిగాడు సూర్యనారాయణ.
“పర్సు కనిపించడం లేదు”అంది ఆందోళనగా.
“నిడదవోలు లో బస్సు ఎక్కగానే టికెట్ తీసుకుని, కండక్టర్ ఇచ్చిన చిల్లర, టికెట్ కూడా పర్సు లోనే పెట్టుకున్నాను.ఇప్పుడు చూస్తె పర్సు కనిపించడం లేదు”విచారంగా అంది కమలమ్మ.
ఒక్క నిముషం ఆలోచించాడు సూర్యనారాయణ.కమలమ్మ అబద్ధం ఆడే మనిషి కాదు. ఎవరో పర్సు కొట్టేసారని గ్రహించాడు.
“బస్సు లో నీ పక్కన ఎవరు కూర్చున్నారు?”అడిగాడు సూర్యనారాయణ.
“ముప్పవరం లో ఒకావిడ బస్సు ఎక్కి నా పక్కనే కూర్చుంది. చాలా బాగా మాట్లాడింది. మా మనవలు ఇద్దరికీ రెండు చాక్లెట్లు కూడా ఇచ్చింది. పెరవలి లో దిగిపోయింది. అప్పటినుంచి నా పక్కన ఎవరూ కూర్చోలేదు” చెప్పింది కమలమ్మ.
ఆమె మాటలకు చిన్నగా నవ్వాడు సూర్యనారాయణ.
“నిన్ను కబుర్లలో పెట్టి, తెలివిగా సంచీలో ఉన్న నీ పర్సు కొట్టేసింది ఆవిడే. అందుకే నీ మనవల్ని కూడా మచ్చిక చేసుకుని చాక్లెట్లు కూడా ఇచ్చింది. డబ్బులున్న పర్సు ఎప్పుడూ పైకి కనిపించేటట్టు పెట్టుకోకండి. సంచీలో బాగా అడుగున పెట్టుకోవాలి. లేదా సంచీ లోపలవైపు ఒక జేబులా కుట్టుకుని పర్సు అందులో దాచుకోవాలి”సలహా ఇచ్చాడు సూర్యనారాయణ.
పర్సు పోయినందుకు కలిగిన బాధ కంటే, డబ్బులు ఇవ్వకుండా సోడా తాగినందుకు చాలా సిగ్గు పడింది. ఆ మాటే సూర్యనారాయణతో అంది. “డబ్బులు ఉన్నాయో,లేవో చూసుకోకుండా సోడా తాగాను. నీ ముఖం చూడాలంటేనే సిగ్గుగా ఉంది అన్నా”అంది కమలమ్మ తలదించుకుని.
“సోడా డబ్బులు సరే, మీ ఊరు మునమర్రు ఎలా వెళ్తావ్?”అడిగాడు సూర్యనారాయణ.
“ఏం చేస్తాను. పిల్లలతో నడుచుకుంటూ వెళ్తాను”అంది కమలమ్మ, కింద పెట్టిన బట్టలు అన్నీ మళ్ళీ సంచిలో సర్దుతూ.
“భలేదానివే. ఎదురెండలో నాలుగు కిలో మీటర్లు చిన్నపిల్లల్ని నడిపిస్తావా?నువ్వంటే నడుస్తావు. వాళ్లకు అలవాటు ఉండదుగా” అని గల్లాపెట్టె లోంచి పది రూపాయలు తీసి ఆమెకిచ్చాడు. “కామాక్షి గుడి దగ్గర రిక్షా ఉంటుందిగా. రిక్షా ఎక్కి వెళ్ళండి”అని పిల్లలు ఇద్దరికీ నాలుగు బిస్కట్లు,నాలుగు నిమ్మ తొనలు ఇచ్చాడు సూర్యనారాయణ. అతనికి మరీ మరీ కృతజ్ఞతలు చెబుతూ మనవల్ని తీసుకుని కామాక్షి గుడివైపు బయల్దేరింది కమలమ్మ.
****
కొవ్వూరివారి వీధిలో ఉండే మంగమ్మ మామ్మ గారు నెల క్రితం అరసవిల్లి వెళ్లి సూర్యనారాయణ మూర్తిని దర్శించుకుని వచ్చింది. అక్కడ నుంచి తెచ్చుకున్న స్వామి వారి ఫోటోని, పటం కట్టించమని కొడుక్కి చెబుతూనే ఉంది. ‘అలాగే’అంటున్నాడే గానీ ఆ పని చేయడంలేదు ఆమె కొడుకు.
ఎనిమిదో తరగతి చదువుతున్న మనవడు రామాన్ని పిలిచి”ఒరేయ్ రాముడూ, పన్నాస వారి కొట్టుకి వెళ్లి ఈ ఫోటోకి అద్దం వేసి చక్కగా పటం కట్టి ఇమ్మని, రామచంద్రం తో చెప్పు. నా పేరు చెప్పు. జాగ్రత్తగా కడతాడు”అని స్వామి వారి ఫోటో,డబ్బులు ఇచ్చింది మామ్మగారు. అలాగే అని వీధి చివరఉన్న తన క్లాసు మేటు సత్యనారాయణని తోడు తీసుకుని వెళ్ళాడు రామం. వీళ్ళు ఇద్దరూ మంచి దోస్తులు. సాయంకాలాలు నగరేశ్వర స్వామి గుడిలో ఆటలు అయ్యాకా, పన్నాస వారి కొట్టుకేసి వెళ్లి రామచంద్రం పటాలు కట్టడం చాలా ఆసక్తిగా చూడటం వాళ్లకు అలవాటు.
రామచంద్రం అద్దాన్ని తీసుకుని, దానిని తనకు కావాల్సిన సైజులో పెన్ను లాంటి దానితో గీతలా గీసి, రెండు చేతులతో గీత దగ్గర బలంగా నొక్కుతాడు. వెంటనే అద్దం రెండు ముక్కలుగా విడిపోతుంది.
వీళ్ళు ఇద్దరికీ అది చాలా విచిత్రంగా ఉండేది. అటూ,ఇటూ వంకరలు రాకుండా ఆ గీత వెంబడే అద్దం ఎలా రెండుగా వస్తుందా?అన్నది వాళ్ళ ధర్మసందేహం. ఈ రోజు రామచంద్రాన్ని అడిగేయాలని నిర్ణయించుకున్నారు ఇద్దరూ. కొట్టు దగ్గరకు రాగానే”మా మామ్మగారు ఈ ఫోటోకి మంచి అద్దం వేసి బాగా పటం కట్టి ఇమ్మన్నారు”అన్నాడు రామం.
“అలాగే.కూర్చోండి పంతులు గారూ”అని రామం చేతిలోని ఫోటో తీసుకున్నాడు రామచంద్రం. బ్రూక్ బాండ్ టీ పొట్లాల పార్సిల్లు వచ్చే చెక్క పెట్టె మీద రామం, సత్యనారాయణ సర్దుకుని కూర్చున్నారు. రామచంద్రం నాలుగు అడుగుల పొడవు ఉన్న రంగుల ఫ్రేము కర్రను తీసుకుని, ఫోటోకి తగిన సైజులో,రంపంతో నాలుగు ముక్కలుగా కోసి, సన్నని మేకులతో దానిని నలుచదరంగా చేసాడు.
అప్పుడు అద్దం తీసుకుని, ఆ ఫ్రేము మీద ఉంచి పెన్ను లాంటి దానితో గీతలు గీసి, ఫ్రేముకి తగిన విధంగా అద్దాన్ని తయారుచేసుకున్నాడు రామచంద్రం. అద్దాన్ని ఫ్రేము వెనుక ఉన్న గాడిలో ఉంచి, ఆ తర్వాత ఫోటోని పెట్టి, దానికి గోధుమరంగులో ఉన్న అట్టని జతచేసి, చిన్న చిన్న మేకుల్ని గట్టిగా కొట్టి పటాన్ని అందంగా తయారుచేసి, దానికి ఒక న్యూస్ పేపర్ చుట్టి రామానికి ఇచ్చాడు రామచంద్రం.
రామం, మామ్మ ఇచ్చిన డబ్బులు రామచంద్రానికి ఇచ్చాడు. “ఏవండీ, మీరు ఇందాకా అద్దాన్ని కొయ్యడానికి పెన్ను లాంటి దానితో గీత గీసి ముక్కలు చేసారు కదా. దానితో చెక్క మీద కూడా గీసి ముక్కలుగా కత్తిరించవచ్చా?”అడిగాడు రామం.
అతని ప్రశ్నకి చిన్నగా నవ్వాడు రామచంద్రం.
“అది అద్దాన్ని మాత్రమే కత్తిరిస్తుంది పంతులుగారూ. అది చాలా ఖరీదైనది. చెక్కలు కత్తిరించాలంటే నేను ఇందాకా నేను వాడిన రంపం ఉపయోగించాలి.”చెప్పాడు రామచంద్రం.
రామం ఇంటికి వచ్చి మామ్మకు స్వామి వారి పటాన్ని ఇచ్చాడు.”మా నాయనే, నీకు పని చెబితే చిటికెలో చేసుకువచ్చావు. మీ నాన్నకు నెల అయినా ఖాళీ దొరకలేదు”అని రామాన్ని మెచ్చుకుంది మామ్మగారు.
*******
శివాలయం వీధిలోని కృష్ణకుమారి పన్నాస సోదరుల దగ్గర మూడేళ్ళ నుంచి సంగీతం నేర్చుకుంటోంది. కీర్తనలు పాడటం కూడా ప్రారంభించింది. జమీందారు గారి హై స్కూల్ లో పదవతరగతి చదువుతోంది. గాంధిబోమ్మల దగ్గర ఉన్న రేణుక కూడా రెండేళ్ళ నుంచీ పన్నాస వారి దగ్గర హార్మొనీ నేర్చుకుంటోంది. స్కూల్ అయిపోగానే ఇద్దరూ సంగీతానికి వెళ్లి వస్తారు.
కృష్ణకుమారి స్కూల్ నుంచి ఇంటికి వచ్చి, తల్లి ఇచ్చిన మిరియాల పాలు తాగి రేణుక ఇంటికి వచ్చింది. “రేణూ,రెడీ అయ్యావా?”అని పిలిచింది.
రేణుక బయటకు వచ్చి మెలికలు తిరిగిపోతూ ముసి ముసిగా నవ్వుతూ “రాజమండ్రి నుంచి మా అత్తయ్య,బావ వచ్చారు. నేను ఇవాళ రాను” అని వెంటనే లోపలకు వెళ్ళిపోయింది. పైన ఆకాశం కొద్దిగా మబ్బుగా ఉంది. తను కూడా మానేద్దామా, అనుకుంది కుమారి. కానీ నిన్న రాత్రి, ఈరోజు తెల్లారగట్ల ‘మరుగేలరా ఓ రాఘవా’ కీర్తన బాగా ప్రాక్టీసు చేసింది. మాస్టారుకి ఆ కీర్తన వినిపించి ఆయన నుంచి ప్రశంసలు అందుకోవాలని మనసు చాలా తహ తహ లాడుతోంది. చేతిలో కీర్తనల పుస్తకం పట్టుకుని నెమ్మదిగా నడవడం ప్రారంభించింది.
లింగాలవీది దగ్గరకు వచ్చేసరికి సుప్రజ “నువ్వు ఒక్క దానివే వెళ్తున్నావేమిటి? నీ తోక ఏది?” అని అడిగింది.
“ఆ, దాని బావ వచ్చాడుట. ఈరోజు మానేసింది”అని గబ గబా నడిచి పన్నాస వారి కొట్టు దగ్గరకు వచ్చింది.
రామచంద్రం “ఏం అమ్మా, ఈరోజు రేణుక రాలేదేం?”అని అడిగాడు.” వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారండి.అందుకు రాలేదు.”నెమ్మదిగా చెప్పింది కృష్ణకుమారి. కొట్లో లోపలకు వచ్చి తుంగచాప మీద కూర్చుంది కృష్ణకుమారి. రెండు నిముషాలు గడిచాకా గొంతు సవరించుకుని’మరుగేలరా ఓ రాఘవా’ కీర్తన పాడింది. రామచంద్రం చాలా ఆనందించి “బాగా పాడావు తల్లీ”అని మెచ్చుకున్నాడు. తర్వాత ‘నగుమోము కనలేని’కీర్తన తను పాడుతూ, కుమారి చేత పాడించాడు రామచంద్రం. చాలా సేపు ప్రాక్టీసు చేసింది కుమారి. ఒక గంట గడిచాకా రామచంద్రానికి ‘వస్తాను మాస్టారు’ అని చెప్పి ఇంటికి బయల్దేరింది.
ఈరోజు ఆమెకి చాలా ఆనందంగా ఉంది. రిపబ్లిక్ డే కి స్కూల్ లో ‘మరుగేలరా ఓ రాఘవా’ కీర్తన పాడి, హెడ్ మాస్టర్ అభిననదనలు కూడా అందుకోవాలి అని ఆలోచిస్తోంది. అకస్మాత్తుగా ఆమెకి గుర్తు కొచ్చింది.తను చీకట్లో నడుస్తున్నానని. పన్నాస వారి కొట్టుకి, నగరేశ్వర స్వామి గుడికి మధ్యన ఉన్న వీధి లైట్ వెలగడం లేదు.ఆమెకి కొద్దిగా భయం వేసింది.పుస్తకం గుండెలకు హత్తుకుని ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ నడవసాగింది. కుడిపక్కన కొండారెడ్డి గారి పొలం కంచే ఉంది. ఎడం పక్కన పంటకాలవ ఉంది. ‘శ్రీ ఆంజనేయం ..ప్రసన్నాంజనేయం’ అనుకుంటూ నెమ్మదిగా నడుస్తోంది కుమారి. తన వెనకే ఎవరో గబ గబా నడుస్తున్న శబ్దం వినిపించింది ఆమెకి.
భయం ఎక్కువైంది కుమారికి.తనూ స్పీడుగా నడవసాగింది. కానీ ఆ వెనుక వ్యక్తి ఆమెకి దగ్గరగా వచ్చేసి ‘కృష్ణా’అని నెమ్మదిగా పిలిచాడు. వెనక్కి తిరగ్గానే అతను ఆమె భుజం మీద చెయ్యివేసాడు. భయంతో అరవబోతే కుడి చేతితో ఆమె నోరు మూసేసాడు. కళ్ళు పెద్దవిచేసి అతని కేసి చూసింది కుమారి. లీలగా ఆ రూపం గుర్తుకు వస్తోంది ఆమెకి. వెంటనే ఒక చేత్తో పుస్తకం పట్టుకుని, రెండో చేతితో తన నోటిమీద ఉన్న అతని చేతిని తొలగించాలని ప్రయత్నించింది కుమారి. అతను తన రెండో చేతితో ఆమె చేయి గట్టిగా పట్టుకున్నాడు.
కుమారి పెనుగులాడుతోంది. అకస్మాత్తుగా అనుకోని సంఘటన జరిగిపోయింది. అతను
కుమారి నోటిమీద ఉన్న తన చేతిని తీసి మెరుపు వేగంతో ఆమె పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. కుమారి ఖిన్నురాలైపోయింది అతని చర్యకి. మార్టేరు నుంచి సైకిల్ మీద ఇంటికి వెళ్తున్న పుల్లారెడ్డి కంట పడింది ఈ సంఘటన. చీకట్లో ఎవడో అమ్మాయిని అల్లరి చేస్తున్నాడని గ్రహించాడు
పుల్లారెడ్డి.వెంటనే సైకిల్ దిగి స్టాండ్ వేసి ‘ఎవడ్రా అది’అని గట్టిగా కేకలేసాడు. అతను కుమారిని వదిలేసి పారిపోయాడు. పుల్లారెడ్డి అతణ్ణి వెంబడించినా దొరకలేదు ఆ వ్యక్తి. ఈలోగా కుమారి పరిగెత్తుతూ నగరేశ్వర స్వామి గుడి ముందుకు వచ్చింది.అక్కడ వీధి లైట్ వెలుగుతోంది. ఆమెకి ధైర్యం వచ్చింది. అదురుతున్న గుండెలతో స్పీడ్ గా నడుచుకుంటూ ఇంటికి వచ్చింది. ఇంక ఎప్పుడూ తోడు లేకుండా ఒక్కత్తీ సంగీత సాధనకు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. ఈ సంఘటన ఇంట్లో చెప్పలేదు కుమారి. చెబితే సంగీతం మానిపించేస్తారని ఆమెకి బాగా తెలుసు.
*****
ఆ రోజు బుధవారం సంత. పన్నాస వారి కొట్టు చాలా సందడిగా ఉంది. మార్టేరు,జగన్నాధపురం నుండి సంతకు వచ్చే జనం , పశువుల్ని సంతకు తీసుకువెళ్ళేవారు అందరూ కొట్టుముందు నుంచే వెళ్తున్నారు. సోడా తాగేవారు, బిస్కట్లు, మిఠాయి ఉండలు కొనుక్కునే వాళ్ళతో హడావిడిగా ఉంది. సరిగ్గా అప్పుడే వచ్చింది వెంకటలక్ష్మి ‘నాన్నగారూ’ అంటూ.
బేరాలు చూసుకుంటూనే ‘ఆ బాగున్నావా లక్శ్మీ’ అని పలకరించాడు సూర్యనారాయణ.
సిమెంట్ రాయి మీద అడుగు వేసి సోడా కొట్లోకి వెళ్ళింది లక్ష్మి. తను తెచ్చిన పళ్ళు,బట్టలు సూర్యనారాయణ చేతిలో పెట్టి “నన్ను దీవించండి నాన్నగారూ”అని ఆయన పాదాలకు నమస్కరించింది.
“దీర్ఘాయుష్మాన్ భవ” అని దీవించి “ఇవన్నీ ఏమిటమ్మా”అన్నాడు ఆయన.
“మీరు నేర్పిన సంగీతమే ఈరోజు నాకు జీవనాధారం అయ్యింది.మా ఆయన టెక్స్టైల్ మిల్లులో పని చేస్తున్నారని చెప్పానుగా. పిల్లలు ఇద్దరూ పెద్దవాళ్ళు అయ్యారు. మావారి ఆదాయం సరిపోక నేను సంగీతం పాఠాలు చెబుతున్నాను. ఇప్పుడు మా పరిస్థితి బాగుంది. తణుకు పెద్ద హై స్కూల్ లోనే పిల్లలు ఇద్దరూ చదువుతున్నారు.అంతా మీ దయ. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నాకు సంగీతం చెప్పారు. మీ ఋణం ఎప్పటికీ తీర్చుకోలేను. ఒక్కసారి మా ఇంటికి వచ్చి మమ్మల్ని అందరినీ దీవించండి. తణుకు, బొమ్మల వీధిలో ఉంటున్నాం.మర్చిపోకండి”అని మరోసారి నమస్కారం చేసి వెళ్ళింది వెంకటలక్ష్మి.
సోడా తాగుతున్న పుల్లారెడ్డి ఆశ్చర్యపోయాడు. వెళ్తున్న వెంకటలక్ష్మి కేసి చూసి’ఈ పిల్ల చాకలి వెంకన్న కూతురు కదూ’ అన్నాడు పుల్లారెడ్డి.
“అవును రెడ్డి గారూ. వెంకన్న ఈ పిల్ల చిన్నతనంలోనే చనిపోయాడు.సూరమ్మ కష్టపడి లక్ష్మిని పెంచి,పెద్ద చేసింది.కొన్నాళ్ళు ఆ అమ్మాయికి సంగీతం చెప్పాను.అదీ అభిమానం”అన్నాడు సూర్యనారాయణ వినయంగా.
అతని సంస్కారానికి ఆశ్చర్యపోయాడు పుల్లారెడ్డి.సరదా కోసం, పెళ్లి చూపులు కోసం కొంతమంది సంగీతం నేర్చుకుని తర్వాత దాని సంగతీ,గురువు సంగతీ కూడా మర్చిపోతున్నారు. కానీ లక్ష్మి తన గురువునే తండ్రిగా కొలవడం పుల్లారెడ్డికి ఆనందం కలిగించింది. తనకి సంగీతం నేర్పిన గురువుని గుండెల్లో గుడి కట్టి పూజిస్తోందని పుల్లారెడ్డికి అవగతమయ్యింది.
“నువ్వు ‘ఊరికి ఉపకారివయ్యా ‘సూర్యనారాయణా “అని అభినందించాడు పుల్లారెడ్డి.
****
కాలచక్రంలో ఐదేళ్ళు గిర్రున తిరిగాయి. కృష్ణకుమారి కి వాళ్ళ బావ మురళీమోహన్ తో పెళ్లి జరిగింది నగరేశ్వర స్వామి గుడి ముందున్న వాసవీ నివాస్ సత్రంలో. మర్నాడు శోభనం. పాలరంగులో ఉన్న తెల్లని చీర,మల్లెపూల జడ,చేతిలో పాల గ్లాసుతో గదిలోకి వచ్చింది కృష్ణ కుమారి. పువ్వులతో అలంకరించిన పందిరి మంచం మీద కూర్చుని భార్య రాక కోసం ఎదురు చూస్తున్నాడు మురళి. పాల గ్లాసు టేబుల్ మీద పెట్టి తలుపు గడియ వేసి వచ్చింది కుమారి. ఆమెని దగ్గరగా తీసుకుని ఆమె మొహం కేసీ చూస్తున్నాడు మురళి. క్షీరసాగర మధనం నాటి జగన్మోహిని లా వెలిగిపోతోంది కుమారి అందం. ఇంక ఆపుకోలేక ఆమె పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు మురళి. కుమారి పరవశంతో కళ్ళు మూసుకుంది.
మురళిలో ఏదో అసంతృప్తి తొంగి చూసింది.
“ఇదేమిటి ఇలా ఉంది?” అన్నాడు మురళి.
ఏమిటి? అన్నట్టు భర్త కేసి చూసింది కుమారి.
“ఐదేళ్ళ క్రితం నిన్ను మొదటిసారి ముద్దు పెట్టుకుంటే తియ్యగా ఉంది. ఈ ఐదేళ్ళు ఆ అందమైన అనుభూతితోనే గడిపాను. కానీ ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకుంటే, ఆ తియ్యదనం లేదు”అన్నాడు మురళి బుంగమూతితో.
అతని మాటలకు కిసుక్కున నవ్వింది కుమారి.
ఆమె నవ్వు అతనికి మరింత బాధ కలిగించింది. కుడి చేతితో అతని ముక్కు పట్టుకుని అటూ,ఇటూ ఊపి ‘అలక చాలించండి శ్రీ వారూ’ అంది తమాషాగా. ఇంకా అతను ఆమె కేసి బేలగానే చూస్తున్నాడు తనకి సరిఅయిన జవాబు రాలేదని.
మరోసారి కిల కిలా నవ్వింది కుమారి.
“మహానుభావా, ఆరోజు ఒక విశేషం జరిగింది”అంది కుమారి కళ్ళు చక్రాల్లా తిప్పుతూ.
“ఏం జరిగింది?”తన చిన్న కళ్ళనే పెద్దవి చేసి ఆసక్తిగా అడిగాడు మురళి.
“ఆ రోజు నేను మా మాష్టారు నేర్పిన కీర్తన బాగా పాడాను.మాస్టారి తమ్ముడు సూర్యనారాయణ గారు వాళ్ళ సోడా కొట్టులోని సీసాలోంచి ఒక పంచదార చిలక తీసి నాకు బహుమానంగా ఇచ్చారు.నేను ఆ చిలకని తినేసి వస్తుంటే దారిలో అటకాయించి మీరు నన్ను ముద్దు పెట్టుకున్నారు.అందుకని ఆ ముద్దు అంత తియ్యగా ఉంది.ఇప్పుడు కూడా స్వీట్ తినమంటారా?”అంది కొంటెగా అతని కేసి చూస్తూ.
“ఏ స్వీటూ అక్కరలేదు. నువ్వే నా నలభై కేజీల స్వీటువి”అని ఆమెని గట్టిగా తన కౌగిలిలో బంధించాడు మురళి. ఆ దృశ్యం చూసి చందమామ మబ్బుల చాటుకి వెళ్ళిపోయాడు.
*****
Comments