'Parannajivi - New Telugu Story Written By Vidyadhar Munipalle
'పరాన్నజీవి' తెలుగు కథ
రచన: విద్యాధర్ మునిపల్లె
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
కధని త్రేతాయుగంలో స్టార్ట్ చేస్తున్నాను.. ఎందుకంటే మన కధలో కధానాయకుడి జన్మ అక్కడి నుండి మొదలైంది.. త్రేతాయుంగంలో రావణాసురుడి కొలువులో చాలా మంది రాక్షసులున్నారు. వారిలో పరాన్నభుక్కుడు అనే ఒక సైనికుడు కూడా వున్నాడు. వీడి గురించి చాలా మందికి తెలీదులేండి. వీడికి అన్ని విద్యలూ తెలుసనీ, మేఘనాధుడు కూడా వీడి ముందు దిగదుడుపే ననీ ఎప్పటికైనా రావణాసురుని ముందు తన విద్యలు ప్రదర్శించే అవకాశం రాకపోతుందా అని ఎదురుచూస్తున్నాడు.
నిజానికి వీడికి అంత సీన్ లేదు. వీడికి ఏమీరాదు. అన్నీ తనకే వచ్చని అనుకుంటూ వుంటాడు. వీడి నైపుణ్యం తెలిసిన త్రిఝట అనే రాక్షసి రావణునితో చెప్పి ద్వారపాలకునిగా కొలువు ఏర్పాటు చేసింది. కొంతకాలానికి రామరావణ యుద్ధం జరగటం.. రాక్షసకులానికి పెద్దదిక్కుగా వున్న రావణుడు చనిపోవటం.. సౌమ్యుడైన విభీషణుడు లంకకి రాజు అవ్వటం వంటివి జరిగిపోయాయి.
పరాన్నభుక్కుడు ఎదుటివారి నోటివద్ద తిండి లాక్కొని తినటమో, లేక దొంగతనం చేయటమో.. ఎవరైనా ఏమైనా అంటే అది తన స్వార్జితమని బండగా.. మొండిగా వాదించటమూ జరుగుతుండేది. విభీషణుడి ఏలికలోకి లంక వచ్చాక ధర్మం, న్యాయం అంటూ పరిపాలన సాగిస్తున్న అతని పరిపాలన నచ్చలేదు. ఎలాగైనా లంకకు తాను రాజైతే తిరిగి లంకకు పూర్వపు వైభవం వస్తుందని ఆలోచించాడు.
అంతే.. తన ప్రభువు రావణాసుడు చూపినదారే తనదారీ అని పరమేశ్వరుని గురించి ఘోరమైన తపస్సు చేయటం మొదలు పెట్టాడు. అలా రోజులు, సంవత్సరాలు గడుస్తున్నాయి. యుగాలు కూడా గడిచిపోయాయి. కలియుగం ప్రవేశించింది. చివరికి పరమేశ్వరుడు జాలిపడి ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు.
పరాన్నభుక్కుడు దేనికోసం తపస్సుచేస్తున్నాడో మర్చిపోయాడు. తనకి విద్యలేకపోయినా విద్యావంతునిగా గుర్తింపుకావాలి, తనకేమీ తెలియకపోయినా సమాజంలో తనకి ఉన్నతస్థానంలో గౌరవ మర్యాదలు పొందాలి, ఇంతలో ఛటుక్కున అతనికి రావణాసురునిలో వున్న వీణాపాండిత్యం, లలితకళలు మదలిలో మెదిలాయి..
పరమేశ్వరా.. నేను లలిత కళలలో ప్రావీణ్యుడను కాలేకపోయినా నేను ఆచార్యత్వాన్ని పొందాలి. శుక్రాచార్యునివలే శిష్య ప్రశిష్యులచే నిరంతరం నేను కీర్తింపబడాలి. నా పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలబడిపోవాలి..” అన్నాడు.
దీనికి పరమేశ్వరుడు చిన్నగా నవ్వుకొని “అంతేనా.. ఇంకేమైనా వరంకావాలా? బాగా ఆలోచించుకో..” అన్నాడు. ఎంత ఆలోచించినా అతను తపస్సు చేయటానికి కారణం గుర్తురాలేదు.. ఎందుకంటే విధాతకి తెలుసు ఎవరికి ఎప్పుడు ఏదివ్వాలో.. అందుకే అతనికి మరపుని ప్రసాదించాడు. యుగాలుగా తపస్సు చేయటం వల్ల పరాన్నభుక్కునికి బాగా ఆకలిగా వుంది.
అందుకే “పరమేశ్వరా.. యుగయుగాలుగా నేను తపస్సు చేసి వుండటంవల్ల నాకు బాగా ఆకలిగా వుంది. భోజనం పెట్టించండి” అన్నాడు.
దీనికి పరమేశ్వరుడు తలపంకించి.. “ఓయీ పరాన్నభుక్కూ! ఈక్షణంతో నీకు ఆయువు తీరిపోయినది. నీవు ఈ ఆకలితోనే కలియుగంలో నీవు కోరినట్లుగానే జన్మింతువు. నా తపస్సు చేసితివి కనుక నీకు నాపేరు కలిసి వచ్చేట్లు జలగేశ్వరునిగా ఓ పుణ్యదంపతులకి ప్రధమసంతానంగా జన్మిస్తావు. నా అంతటివాడు నిన్ను వరం కోరమంటే తుచ్ఛమైన శారీరక వాంఛలు తీర్చమన్నందుకు గానూ.. నీకోరిక ప్రకారమే.. చుట్టూ ఆహారపదార్థాలున్నప్పటికీ నీకు రుచించవు. కంచంలో వున్న ఆహారంలో కడుపుదాకా పోకుండా శాపమిస్తున్నాను.
ఇక నీవు పైన కోరిన కోరికలన్నీ కూడా ఆజన్మలో తీరతాయి. అయితే అహంకారం పెరిగిన రోజు నీ కొమ్ములు విరగ గొట్టటానికి శ్రీమహావిష్ణువు అంశ ఒకటి పుట్టి అప్పటి వరకూ నీవు సంపాదించుకున్న దొంగఖ్యాతిని బట్టబయలు చేస్తుంది.. నీ పేరు చరిత్రలో నిలచిపోవాలని కోరిన నీకోరికని తీరుస్తూ అత్యంత నీచునిగా నిలిచిపోతుంది..” అని పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు.
పరమేశ్వరుడు అంతర్ధానమవ్వగానే పరాన్నభుక్కునికి అప్పటివరకూ తను ఎందుకు తపస్సుచేశాడో గుర్తొచ్చింది. తనెంత పెద్ద తప్పుచేశాడో అర్థమైంది.. కానీ అతని ఆయువు అంతమైంది. యమభటులు వచ్చి అతన్ని యమలోకానికి తీసుకెళ్ళారు. అక్కడ ఎన్నోశిక్షలు అనుభవించిన తర్వాత పరమేశ్వరుని వరప్రభావంతో అతను భారతదేశంలోని ఆంధ్రదేశంలో అత్యంత సంపన్నునిగా జన్మించాడు. మన హీరో పరాన్నభుక్కుడు ముందు చెప్పినట్లుగా జలగేశ్వరునిగా జన్మించటం జరిగింది. కర్మఫలాన్ని అనుసరించి గత జన్మతాలూకూ వాసనలు వదిలిపోనట్లుగా బుద్ధులు, కోరికలూ, చివరికి ఆకారంతో రాక్షసుని పోలిన విధంగానే జన్మించాడు.
చిన్నతనం నుండీ ఆ పుణ్యదంపతులు అతనికి సద్భుద్దులు నేర్పించారు. చుట్టుపక్కల మంచి సావాసగాళ్ళు దొరికారు. దీంతో అతని బుద్ధి చాలా కాలం వరకూ సద్ లక్షణాలతో వున్నది. అయితే రోజులన్నీ ఒకేలా వుండవు కదా.. అతనిలో రాక్షస లక్షణాలు మెల్లెమెల్లగా నిద్రలేచే వయసు వచ్చింది. అదేనండీ టీనేజ్. ఆ యేజ్ లో అప్పటి వరకూ నిద్రపోతున్న కోరికలన్నీ రెక్కలు తొడిగి ఎగిరే వయసు కదా..
ఆ టీనేజీలోకి వచ్చేసరికి అతనిలో విచిత్రమైన రాక్షస లక్షణాలు బయల్దేరాయి. అందరూ సంతోషంగా వున్న సమయంలో అతని మనసు చాలా బాధపడేది. వారందరూ ఏడిస్తే చూడాలని అతనికి సరదాపుట్టేది. కానీ ఎలా అన్నదే అతనికి అర్ధంకాక అలా తను ఆనందపడే రోజు కోసం ఎదురుచూడ సాగాడు. ఒకసారి తను అతని స్నేహితులతో కలిసి ఏటిలో స్నానానికి వెళ్ళాడు. అందులో ఒక స్నేహితుడు చాలా బాగా ఈదుతూ అందరి మన్ననలూ పొందుతున్నాడు. అది చూసి మన జలగేశ్వరుడిలో ఈర్ష్య మొదలైంది.
అంతే! ఏటిలోపలికి చేరి అతని మిత్రుడిని కాలు పట్టుకొని నీటి అడుగుకు లాగేశాడు. నీట మునిగిన వాడు బయటికి రాలేదేటా అని అందరూ కంగారు పడుతున్నారు. మన జలగేశ్వరుడు కూడా వారితోపాటే కంగారు పడుతున్నట్లు నటించాడు. లోలోపల చాలా ఆనందపడుతున్నాడు. అప్పుడే అతనికి అర్ధమైంది తన మనసులోని భావాన్ని బయటికి కనబడనీకుండా నటించటంలో చాలా ఆనందముందని. అందరూ కూడా నీట మునిగిన మిత్రుని రక్షించేందుకు నీటిలో దూకి వెతికే ప్రయత్నం చేస్తుండగా.. ఆగండీ నేను వాడిని బయటికి తెస్తాను.. అంటూ అందరి ముందూ హీరోలా ఫోజు కొడుతూ నీటిలోకి దూకాడు.
తనకి తెలుసుకదా నీటముంచిన వాడిని నీటి అడుగున ఎక్కడ దాచాడో.. నీటి అడుగున తామర తూళ్ళతో అతని కాళ్ళూ కట్టేసి వచ్చాడు.. అతను నీటిలోకి వెళ్ళి వెతికినట్లు నటిస్తూ తనలో తనే తన నటనకు మురిసిపోతూ మొత్తానికి ఆ నీట మునిగిన కుర్రాణ్ణి రక్షించి బయటికి తీసుకొచ్చాడు. అయితే అప్పటికే అతను చనిపోయి వున్నాడు. దీంతో జలగేశ్వరుని ఈగో శాటిస్ఫై అయింది. తోటి స్నేహితులంతా కూడా జలగేశ్వరుని ధైర్యసాహసాల గురించి చాలా గొప్పగా కీర్తించారు. దీంతో అతను పరమేశ్వరుని కోరిన వరాల్లో కీర్తి అప్పుడే అతన్ని వరించటం మొదలుపెట్టింది.
ఆతర్వాత కాలం గడుస్తోంది. చదువు ఎక్కటంలేదు. అయినా సరే జలగేశ్వరుడు చిట్టీలు పెట్టి పరీక్షల్లో స్కూలు ఫస్ట్, ఆతర్వాత మండలం ఫస్ట్, ఆతర్వాత జిల్లా, స్టేట్ ఇలా వదలకుండా ఫస్ట్, బెస్ట్ అనిపించుకున్నాడు. అతనిలో తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం ఎప్పుడూ హెచ్చరిస్తోంది నువ్వు చేస్తోంది తప్పు అని.. కానీ పూర్వజన్మవాసనలు సంస్కారాన్ని డామినేట్ చేస్తూ.. గెలవటం ముఖ్యం ఎలా అన్నది కాదు. గెలిచిన వాడినే చరిత్ర గుర్తిస్తుంది అని సంస్కారం గొంతు నొక్కేశాడు.
పరమేశ్వరుని వరబలంతో సంస్కారం కూడా అసురుని బుద్ధిబలం ముందు మూగబోయింది. కొంతకాలానికి పరమేశ్వరుని వరాల్లో ఆకరిదైన శుక్రాచార్యుని పోలిన స్థానం కావాలి. అది కూడా అతనికి సమకూరే టైం వచ్చేసింది. అదే సమయంలో జలగేశ్వరుడిలో లలితకళలకు సంబంధించిన అంశం గుర్తుకొచ్చింది.. అంతే మనోడు తనలో లలిత కళలకు సంబంధించిన నైపుణ్యం ఎందులో వుందా అని వెదుకుతున్నాడు.
అదే సమయంలో వారి ఊరికి సురభి వారి నాటకాలు రావటం జరిగింది. ఊరు ఊరంతా కూడా సురభి నాటకాలు చూసేందుకు ఎగబడ్డారు. ఊరిలో ధనవంతుల ఇంట పుట్టటంతో జలగేశ్వరుడికి నాటకం చూసేందుకు టిక్కెట్టు కష్టం లేకుండా పోయింది.. అలా వెళ్ళి ముందు వరుసలో కూర్చున్నాడు. నాటకం స్టార్ట్ అయింది. రావణాసురుడు సీతను చెరబట్టి తీసుకెళ్ళే సన్నివేశాన్ని కళాకారుడు రక్తి కట్టించాడు. అది చూడగానే అతనికి పూర్వజన్మవాసనలు పూర్తిగా గుర్తుకొచ్చేశాయి. తన అభిమాన రాక్షస ప్రభువు పాత్రధారిని కలుసుకొని అతనికి వెయ్యినూట పదహార్లు చదివించాడు. అంతటితో ఆగలేదు.. తను కూడా ఆ పాత్ర పోషించాలని పట్టుపట్టాడు. డబ్బున్నవారు మీకెందుకులెండి అన్నా వినలేదు. మొత్తానికి అతికష్టం మీద పాత్రను నేర్చుకున్నాడు.
ఈ విషయం జలగేశ్వరుని ఇంట్లో తెలిసింది. అంతే అప్పటి వరకూ పన్నెత్తి మాట అనని జలగేశ్వరుని తండ్రి స్థంబానికి కట్టేసి చితక్కొట్టాడు. మరెప్పుడన్నా నాటకం అంటే తంతానని వార్నింగ్ ఇచ్చాడు. జలగేశ్వరుడు కూడా నాటకం పేరెత్తనన్నాడు. అలా కొంతకాలం గడిచిపోయింది.. జలగేశ్వరునిలో నటించాలన్న తపన మరింతగా పెరిగిపోతోంది. అప్పుడే జలగేశ్వరుని బుర్రలో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తల్లితండ్రులు బతికుండగా తను రంగస్థలమెక్కి నాటకం వెయ్యలేడు. అప్పటి వరకూ తన కోరికను ఆపుకోలేడు.. అందుకే నాటకం రాసేప్పుడు ప్రతి పాత్రనూ తనే ఫీల్ అయ్యి నటించచ్చు కదా.. ఒక్క రావణాసురుడి పాత్రేవిటి అన్ని అసురుల పాత్రలు తానే పోషించవచ్చని అనుకున్నాడు.
అంతే! నాటకం రాయాలని డిసైడ్ అయిపోయాడు. కధా వస్తువు ఏంటి అని వెతుకుతున్నాడు. ఎవరో ఒక మిత్రుడు చెప్పాడు “జలగేశ్వరా.. నాటకం రాయాలంటే ముందు చదవాలి. గ్రంధాలయంలో వున్న పుస్తకాలు చదువుతుంటే ఏదో ఒక కధ నిన్ను ఆకట్టుకుంటుంది.. దానిని నువ్వు నాటకంగా మలచవచ్చు” అని.
అంతే! జలగేశ్వరుని సమస్య తీరిపోయింది. అయితే కొత్త సమస్య మొదలైంది.. ఒకటవ తరగతివానికన్నా ఘోరంగా గుణించుకొని గుణించుకొని చదవటం తప్ప స్పష్టంగా చదవటం రాదు అతనికి.. చిట్టీలు పెట్టి చూసి రాయటం తప్ప సొంతగా రాయటం కూడా తెలియదు.. అయినా సరే.. ఏదో ఒకటి రాయాలి. అందరితో శభాషనిపించుకోవాలన్నదే తపన. మొత్తానికి గ్రంధాలయం చేరుకొని చందమామ పుస్తకంలోని కధలు చదువుతున్నాడు. అందులో ఒక కథ అతన్ని బాగా ఆకట్టుకుంది. కధ ఆకట్టుకుంది మరి సన్నివేశాలు క్రియేట్ చెయ్యటం పెద్ద సమస్య అయింది. క్రియేటివిటీలేని వాడు రచయిత అవ్వాలనుకుంటున్నాడు..
అలా క్రియేటివీటి లేకుండా పుస్తకంలో వున్న కధని వున్నట్లు.. పాత్రల సంభాషణని నాటకంలో లా పాత్రల పేర్లు పెట్టి అదే సంభాషణను మక్కికి మక్కీ దించేసి నాటకం రాసేశాను అని అనిపించుకున్నాడు. తన మిత్రడు వద్దకు వెళ్ళే ముందు ఒకటి రెండు సార్లు నాటకాన్ని బాగా చదివి.. గుణించుకోటాలు లేకుండా నాటకాన్ని చదివి వినిపించాడు.
చందమామ కధలు చదవి వుండని ఆ మిత్రుడు నాటకం బ్రహ్మాండంగా వుందని అయితే సమయం చాలా తక్కువగా వుందని మరికొంత సమయాన్ని పెంచితే కొత్తగా వస్తున్న పరిషత్ నాటకాలకి పంపచ్చని సలహా ఇచ్చాడు. అప్పుడప్పుడే ఆంధ్రదేశంలో పరిషత్ నాటకాలు ఏర్పాటవుతున్నాయి లెండి.
అంతే.. జలగేశ్వరుని గొంతులో పచ్చివెలక్కాయ పడింది. “నాటకాన్ని పెంచటం అంటే ఏం చెయ్యాలి?” అన్నాడు..
సన్నివేశాలు సృష్టించాలని చెప్పాడు మిత్రుడు. కొత్త రచనకదా సాయం చెయ్యమన్నాడు మిత్రుడిని.. అతను కొంతమంది పెద్దల దగ్గర పౌరాణిక నాటకాల్లో నటిస్తుంటాడు. ఆ అనుభవంతో అతను కొన్ని సన్నివేశాలను సృష్ఠించి మొత్తానికి దానిని నాటకంగా చేశాడు. నాటక రచన విషయంలో తన పేరే పెట్టాలని పట్టుబట్టాడు జలగేశ్వరుడు. ముందు ఆ మిత్రుడు ఒప్పుకోకపోయినా కొంత డబ్బిచ్చి అతని నోరు మూయించాడు. ఎంతైనా పరాన్నభుక్కుడు కదా.. పూర్వజన్మవాసనలు అట్టేపోవుగా.. నాటక రచన చెయ్యటం అతనికి పూర్తిగా అర్థమైపోయిందనుకున్నాడు.
అంతే.. లైబ్రరీలకు వెళ్ళటం కధలు చదవటం.. కథల్లోని సంభాషణలు మక్కికి మక్కీ దించేయటం నాటకం రాశానని చెప్పుకోవటం వాటిని అందరితో పంచుకోవటం జరుగుతుండేది. దీంతో జలగేశ్వరునికి నాటకరంగంలో కొంత పేరొచ్చింది.
పరమేశ్వరుని వరాల్లో ఆఖరిది ఆచార్యత్వం.. ఇప్పుడు అదే కావాలి. దానికీ టైం వచ్చేసింది. జలగేశ్వరుడు రాసిన రచనలెన్నీ, ప్రదర్శించబడినవెన్ని అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు అతని మిత్రడు ఫైల్ చేస్తూ వచ్చాడు. అయితే ప్రదర్శించబడని నాటకాలే ఎక్కువ.. ప్రదర్శించినవి తక్కువ. అయినా సరే ఎవరో రాసిన కధలను, సంభాషణలనూ తనవి అని చెప్పుకు తిరగే మన పరాన్నజీవి జలగేశ్వరునికి ఇదంతా తెలియదు.. నాకూ సరిగా గుర్తులేదు ఏదో పరిషత్తువారికి ఈ మిత్రడు తన మిత్రుడి రచనల గురించి తెలియజేశాడు. ఇతనికి సన్మానం చేస్తే పదివేల నూటపదహార్లు చందా కూడా ఇప్పిస్తానని పరిషత్తువారికి నమ్మబలికాడు.
అంతే.. జలగేశ్వరునికి సన్మానమంటూ గోడపత్రికలు, చేతి పత్రికలూ ముద్రించి వూరూ, వాడా ప్రచారం చేశారు పాపం పరిషత్ నిర్వవాహకులు. మొత్తానికి జలగేశ్వరుడు కూడా కీర్తికోసం పదివేల నూటపదహార్లు సమర్పించాడు. దీంతో జలగేశ్వరుని పేరు ప్రఖ్యాతలు ఆంధ్రదేశమంతా మారుమోగిపోయాయి. జలగేశ్వరుడు దాదాపు వందకు పైగా నాటకాలు రాశడని తెలియటంతో అతనికి శిష్యరికం చేస్తానంటూ పలువురు యువరచయితలు అతని వెంటపడ్డారు. దీంతో అతను కోరుకున్న ఆచార్యత్వం కూడా వచ్చేసింది.
యువ రచయితల్ని తన చుట్టూ తిప్పుకుంటూ వారి వద్దనుండి తన వ్యసనాలకు సంబంధించిన చుట్టలూ, సిగరెట్లూ, సారా వంటివి తెప్పించుకుంటూ వారు రాసిన కథలు ముందు బాలేదని చెప్పి అందరి కథలూ కలిపి తానే ఒక కథలా తయారు చేయించుకునేవాడు. నోట్ దిస్ పాయింట్.. తయారు చేయలేదు.. తయారు చేయించుకునేవాడు.. దీంతో జలగేశ్వరుడి రచనల్లో నవ్యత్వం ఉట్టిపడేది.. యువరచయితలకు అసలేమీ అర్ధమయ్యేదికాదు. కానీ నాటకం చూసిన తర్వాత తమ సంభాషణలు కొన్ని అందులో కనిపించేవి.. ? అదేమిటి ఆచార్యా అని జలగేశ్వరాచార్యుని అడిగే ధైర్యం వారికి లేదుపాపం.
ఒక రోజు జలగేశ్వరుని శిష్యుల్లో ఒకడైన విష్ణుభొట్లు అనే యువరచయిత జలగేశ్వరాచార్యుని నిలదీశాడు. దీంతో జలగేశ్వరాచార్యునికి అహం దెబ్బతిన్నది. తనంతటివాడి వద్ద నాటక రచన నేర్చుకోవాలని వచ్చిన కుర్రకుంక తననే నిలదీస్తాడా అని ఆవేశంతో ఊగిపోయాడు. విష్ణుభొట్లు కాదు వీడు విషం బొట్టు అని నిర్ణయిచుకున్నాడు. గతంలో అయితే తన దారికి అడ్డం వచ్చిన వారిని కొట్టో, తిట్టో, చంపేసో ఏదైనా చేసి వుండేవాడు. కానీ ఇప్పుడు సమాజం తననే చూస్తోంది. తనేం చేసినా అందరికీ తెలిసిపోతుంది. అందుకే ఆచితూచి మరీ అడుగెయ్యాలనుకున్నాడు.
అప్పుడే అతనిలోని రాక్షసుడు బయటికి వచ్చాడు. ఎక్కడో తను చదివిన విభజించు పాలించు అనే వాక్యం గుర్తొచ్చింది. తన శిష్యగణం.. తనంటే ప్రాణమిచ్చే శిష్యగణం.. తనని ఎవరైనా ఏమైనా అంటే అన్నవారి అంతు చూసే శిష్యగణం నుంచి ఈ విషపు చుక్కని వేరు చెయ్యాలి.. లేదా ఈ విషపు చుక్క అందరినీ చెడగొట్టేస్తుంది.. ఇలా ఆలోచిస్తుండగా పరమేశ్వరుడు గత జన్మలో తనకిచ్చిన వరంతో పాటు శాపమూ గుర్తొచ్చింది. అయితే ఆ శాపం ఇప్పుడు పనిచెయ్యదులే అనుకున్నాడు జలగేశ్వరాచార్యడు.
ఎందుకంటే ఆకలి అని కోరినందుకే కదా తనకి పరమేశ్వరుడు శ్రీమహావిష్ణువు అంశచేతిలో పరాభవం జరుగుతుందని చెప్పాడు. పైగా చుట్టూ వున్నా ఆహారపదార్ధాలు రుచించవు.. తిండికోసం మొహం వాస్తావనని శపించాడు. నాకు అన్ని ఆహారపదార్ధాలూ రుచిస్తున్నాయి. కనుక ఈ విష్ణుభొట్లు శ్రీమన్నారాయణుడు కాదు.. అని తనను తాను సమాధాన పరచుకున్నాడు. కానీ ఏదో ఒక మూల విష్ణుభొట్లు మీద అనుమానం మాత్రం పోలేదు. ఇలా తనలో తనే ఆలోచించుకుంటుండగా విష్ణుభొట్లు మరోసారి జలగేశ్వరాచార్యుని ప్రశ్నించాడు.
దీంతో జలగేశ్వరాచార్యుడు “నాటక రచన అంటే మామూలు విషయంకాదు. నీ సంభాషణలు బాగున్నాయి. నాటకీకరణ విషయంలో నీవు చాలా నేర్చుకోవాలి.. నాదగ్గర నువ్వు నేర్చుకోవాలంటే చాలా అర్థం చేసుకోవాలి. ఇది కూర్చోపెట్టి నేర్పిస్తే రాదు.. చూసి నేర్చుకోవాలి.. నీవు ఇక నుండి ఏ రచన చేసినా నాకు చూపించు.. నేను సరిచేస్తాను” అన్నాడు.. పైకి ప్రేమగా.. లోలోపల రగిలిపోతూ..
కొంతకాలానికి జలగేశ్వరాచార్యుని తల్లితండ్రులు చనిపోయారు. దీంతో రంగస్థలంపై రంగుపూసుకొని నటించాలన్న కోరిక జలగేశ్వరునికి కలిగింది. అప్పటిదాకా ఎంతోమందికి రచనలిచ్చే జలగేశ్వరుడు సొంతగా పరాన్నభుక్క నాటక సమాజం అనే పేరు పెట్టుకుందామనుకున్నాడు.. కానీ అందరూ వ్యతిరేకించగా ఆచార్య నాటక సమాజం అని పెట్టుకోండి.. మీకున్న పేరుతో ఎక్కువ ప్రదర్శనలొస్తాయని చెప్పారు తోటి శిష్యులంతా.. జలగేశ్వరునికి ముందు కొంచెం బాధకలిగినా తర్వాత అది కూడా నాపేరే కదా అని సమాధాన పడ్డాడు.
అంతే.. నాటకసమాజం ఏర్పాటు చేసుకున్నాడు. నటీనటులుగా తన వద్ద రచనలో శిక్షణ పొందటానికి వచ్చిన వారినే పెట్టుకొని తనే ప్రధాన పాత్ర తీసుకొని నటిద్దామని మొదలు పెట్టాడు. అయితే దర్శకత్వ బాధ్యత అంటే మామూలు విషయం కాదన్న సంగతి అతనికి అరగంటలోనే అర్థమైపోయింది. తన మిత్రుడిని పిలిచి అతనికి దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పాడు. అయితే ప్రతి అరగంటకొక సారి అతనితో పక్కకి తీసుకుపోయి తన విద్యార్ధులను చూపిస్తూ ఏవేవో సైగలు చేస్తూ మిత్రునితో మాత్రం వేరే విషయాలు మాట్లాడేవారు.
విద్యార్ధులు మాత్రం తన మిత్రడికి దర్శకత్వ విషయంలో సలహాలిస్తున్నాడేమో జలగేశ్వరాచార్యడు అని అనుకునేవారు. ఆ రకమైన కలరింగ్ ఇవ్వటం జలగేశ్వరునికి కొత్తేం కాదు. ఆ విషయం అతని మిత్రుడికీ తెలియందీ కాదు. ఎటొచ్చీ తెలియనిది ఈ విద్యార్ధులకే.. విష్ణుభొట్లుని మాత్రం ఎవ్వరితో కలవనీకుండా జలగేశ్వరాచార్యుడు చాలా జాగ్రత్తపడేవాడు. మొత్తానికి నాటకం తయారైంది. ప్రదర్శన సమయంలో రచన, దర్శకత్వం జలగేశ్వరాచార్యుడి పేరు అనౌన్స్ అయింది. జలగేశ్వరాచార్యుడిని పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్న విష్ణుభొట్లుకి అతని టాలెంట్ మీద డౌట్ వచ్చింది.
తన తోటి వారు రాసిన నాటకాలను కూడా పూర్తిగా చదివాడు.. అందులోని సంభాషణలూ.. తన రచనల్లోని సంభాషణలూ కలిపి తయారు చేసిన నాటకంగా అతనికి అర్థమైంది. జలగేశ్వరునికి క్రియేటివిటీ లేదనీ.. వేరే వారి రచనలు కాజేసి (తస్కరించి) వాటిని ఒకచోట కూర్చుకొని తన క్రియేటివిటీని వాడి ఒక రూపంలోకి తెస్తున్నాడని అనుకున్నాడు. అయితే ఇక్కడ విష్ణుభొట్లుకి మరో అనుమానం కూడా వచ్చింది. జలగేశ్వరాచార్యుడు నాటకానికి దర్శకత్వం వహించే క్రమంలో ప్రతిసారీ తన మిత్రుడిదగ్గరకెళ్ళి మాట్లాడటం గమనించాడు.
విషయమంతా ఇక్కడే వుందని అనుమానించాడు విష్ణుభొట్లు. అయితే జలగేశ్వరుడికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో నాటకం మొదలైంది.. జలగేశ్వరుడి ప్రధాన పాత్రతో నాటకం కొనసాగుతోంది. జనానికి రాక్షసాకారంలో వున్న ఇతన్ని కధానాయకునిగా ఊహించుకోవటం చాలా కష్టంగా అనిపిస్తోంది. టిక్కెట్లు కొన్న జనంలో కొంతమంది విరక్తితో వెళ్ళిపోతే.. మరికొంతమంది అమ్మనాబూతులు తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు.
అలా బూతులు తిట్టేవారిని జలగేశ్వరుని భజనబృందం పనికట్టుకొని దేహశుద్ధి చేసింది. వారిని బయటికి వెళ్ళనీకుండా గేటుదగ్గర నిలబడి ఈలలు కేరింతలు కొడుతూ నాటకం బ్రహ్మాండంగా వుందని వారిచేత అనిపించి వేరే చోట బుకింగులు ఓపెన్ చేయించారు. ఒకరకంగా చెప్పాలంటే జలగేశ్వరాచార్యునికి డైహార్ట్ ఫ్యాన్స్ అనుకోవచ్చు.. అతని అభిమానులను తయారు చేసే తీవ్రవాద శిక్షణా శిభిరం కావచ్చు.. ఆ రోజు ఆ ప్రదర్శనతో మొదలైంది. ఇదంతా విష్ణుభొట్లు గమనిస్తునే వున్నాడు.
నిజంగా ఇది అరాచకం.. నియంతృత్వం.. ఈతంతుని కచ్చితంగా ఆపాలని నిర్ణయించుకున్నాడు. నాటకాన్ని ప్రేమించే తను నాటకాన్ని భ్రష్టుపట్టించే ఈ పరాన్నజీవికి చరమగీతం పాడాని నిర్ణయించుకున్నాడు. అంతే నటరాజు పాదపద్మాలనుండి ఒక రకమైన వెలుగువచ్చి విష్ణుభొట్లుని ఆవరించింది. ఏదో కొత్త శక్తి వచ్చిన వాడిలా ఫీల్ అయ్యాడు విష్ణుభొట్లు. అయితే విష్ణుభొట్లు ప్రవర్తన జలగేశ్వరాచార్యునికి అస్సలు నచ్చటంలేదు. ఏదో ఒకరోజు తన కొంపవీడు ముంచుతాడనే భయం పట్టుకుంది.
దీంతో అతనికి చుట్టూ ఆహారపదార్ధాలున్నా కూడా రుచించటం లేదు. తినలేక పోతున్నాడు. అప్పుడే పరమేశ్వరుని శాపం గుర్తుకొచ్చింది జలగేశ్వరునికి. నాటినుండి విష్ణుభొట్లు కనిపించినప్పుడల్లా పక్కకి తప్పు కోవటం మొదలు పెట్టాడు. అతనితో మాట్లాడటం మానేశాడు. శిష్యులందరినీ అతనికి దూరంగా వుండమని హుకుం జారీచేశాడు. నాటక ప్రదర్శనలకి పెట్టెలు మోయటానికి మాత్రమే విష్ణుభొట్లుని తీసుకెళ్ళాలని నిర్ణయించుకున్నాడు.
అయితే ఇదే సమయంలో విష్ణుభొట్లు కూడా తన పని తాను మొదలు పెట్టాడు. జలగేశ్వరాచార్యుని గుట్టుమట్లు మొత్తం తెలిసిన వాడు అతని స్నేహితుడే అని పూర్తిగా గ్రహించాడు. అతనిని ప్రసన్నం చేసుకుంటే మొత్తం కథ తెలిసి పోతుందని నిర్ణయించుకున్నాడు. అయితే జలగేశ్వరునికి ప్రాణస్నేహితునిగా వున్న అతను కచ్చితంగా గుట్టు విప్పడని తెలుసు.. అందుకే అతనికి ఎంతటివారితోనైనా నిజాన్ని కక్కించ సుర(మందు) ని ఆయుధంగా వాడాలని నిర్ణయించుకున్నాడు.
అయితే తను పిలిస్తే అతను రాడు.. జలగేశ్వరాచార్యునిలాగే తను కూడా ఆలోచించటం మొదలు పెట్టాడు విష్ణుభొట్లు. విభజించు పాలించు అన్న సిద్ధాంతం. ఇద్దరికీ మిత్రభేదం కల్పించాలి. దానికి చాలా సమయం పడుతుంది. ఇలా ఆలోచిస్తుండగా అతనికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. మొత్తానికి జలగేశ్వరాచార్యుడు నాటక ప్రదర్శన పూర్తవ్వగానే డ్రస్ మార్చుకోటానికి గదిలోకి వెళ్ళాడు. అందరూ ఎవరి హడావుడిలో వారున్నారు.
జలగేశ్వరాచార్యుడు నాటకం అయ్యాక అతని స్నేహితుడికి మందు పంపించే అలవాటున్నది. అయితే ప్రతిసారీ వేరే వాళ్ళకు పురమాయించేవాడు.. ఈ సారి జలగేశ్వరాచార్యుడు గదిలోకివెళ్ళగానే బయట నుండి విష్ణుభొట్లు లాక్ చేశాడు. అందరూ సామాన్లు సర్దుతున్నారు. విష్ణుభొట్లు మందు తీసుకొని జలగేశ్వరుడి స్నేహితుని సమీపించి తానే దగ్గరుండి తమకి మందు తాగించవలసిందిగా జలగేశ్వరుడు ఆర్డర్ వేశాడని అతని స్నేహితునికి నమ్మబలికాడు.
సహజంగానే విష్ణుభొట్లు మీద కోపంగా వున్న మిత్రుడు అతనికి శిక్షవేయటంకోసం అలా చెప్పి వుంటాడేమో అని అనుకున్నాడు మిత్రుడు. అలా విష్ణుభొట్లు అతనికి మరింతగా మద్యం తాగించి తనకి కావాల్సిన విషయాలన్నీ బయటపెట్టించుకున్నాడు. దీంతో జలగేశ్వరుడు ఎలా ఎదిగిందీ.. ఎలా పరాన్నజీవిలా మారి ఎదుటివారి కష్టంతో పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నదీ పూర్తిగా అతనికి అర్ధమైంది.. పైగా ఆచార్యత్వం అనేది తనకి తానే ఎలా ప్రకటించుకున్నదీ పూర్తిగా తెలుసుకొని అక్కడి నుండి జలగేశ్వరుడు వెళ్ళిన గదివద్దకు చేరుకున్నాడు. అప్పటికే జలగేశ్వరుడు లోపల ఊపిరాడక తలుపులు దబదబా బాదుతున్నాడు. విష్ణుభొట్లు వేగంగా వెళ్ళి తలుపులు తీశాడు.
జలగేశ్వరుడు పెద్దపెద్దగా కేకలు పెట్టాడు విష్ణుభొట్లుపై.. క్షమించమన్నాడు విష్ణుభొట్లు.. ఆరోజుతో అక్కడ ప్రదర్శన పూర్తయింది. అందరూ ఎవరింటిదారి వారు పట్టారు. ఇక విష్ణుభొట్లు జలగేశ్వరాచార్యుని నాటకాలను దానికి అతను సేకరించిన కధలనూ సేకరించే పనిలో పడ్డాడు. అలాగే అన్ని ఆధారాలూ సేకరించాడు. వాటిని అందరి ముందూ బయటపెట్టేసరికి జలగేశ్వరచార్యునికి తలకొట్టేసినట్లయింది.
అయితే జలగేశ్వరాచార్యుని వందిమాగధులు, తీవ్రవాదభక్తులు మాత్రం విష్ణుభొట్లుని దుయ్యబట్టారు. సభాముఖంగా అతనిపై నిప్పులు చెరిగారు. జలగేశ్వరాచార్యడు కానీ, అతని స్నేహితుడు కానీ, విష్ణుభొట్లు కానీ ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు.
తర్వాత రోజు జలగేశ్వరాచార్యుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.. విష్ణుభొట్లు ఏమయ్యాడో ఎవ్వరికీ తెలీలేదు. అతని స్నేహితుడు ఆచార్య నాటకసమాజానికి అధ్యక్షుడిగా మారి జలగేశ్వరుని శిష్యులకి శిక్షణ ఇచ్చి మంచి రచయితలుగా తయారు చేశాడు.
(సమాప్తం)
విద్యాధర్ మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నేను గుంటూరుకు చెందిన తెలుగు నాటక మరియు కథా రచయితను. నా తొలి రచన నా 8వ ఏట ప్రారంభించాను. నా తండ్రి సూర్యనారాయణ ప్రోత్సాహంతో అనేక పత్రికలకు రచనలు పంపటం జరిగింది. అలా వాటిలో కొన్ని ప్రచురణకు నోచుకున్నాయి. చిన్నపిల్లల కథలు కూడా రాయటం జరిగింది. అవి కూడా అనేక మాసపత్రికల్లో ప్రచురితమయ్యాయి. అటుపై తెలుగు నాటక సాహిత్యాన్ని నేర్చుకొని నాటక ప్రక్రియలో కొనసాగటం జరిగింది. అనేక నాటక పరిషత్తులలో ఉత్తమ రచయితగా బహుమతులు పొందటం జరిగింది. నేను రాసిన ‘‘శ్రీ గురురాఘవేంద్రచరితం’’ పద్యనాటకానికి రాజమండ్రిలో నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం చే నంది అవార్డు పొందటం జరిగింది. పలు కథలు పలు మాసపత్రికల్లో ప్రచురణకు నోచుకున్నాయి. అటుపై 2015లో దూరదర్శన్ సప్తగిరిలో వెలుగునీడలు అనే టీవీ సీరియల్ కి కథను అందించాను. పలు టీ.వీ ఛానల్స్ లో సీరియల్స్ కి మాటల రచయితగా కూడా కొనసాగాను. కొన్ని సినిమాలకు రచనా సహకారం అందించాను.
@surekhap4148 • 20 minutes ago
Nice presentation