
'Peddala Mata Chaddannam Muta' New Telugu Story
Written By Kolla Pushpa
'పెద్దల మాట చద్దన్నం మూట' తెలుగు కథ
రచన: కొల్లా పుష్ప
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
"మమ్మీ దసరా సెలవులు కదా! నానమ్మ వాళ్ళ ఊరు వెళ్తామమ్మ" అని అడిగారు 12 ఏళ్ల కూతురు రమ్య, ఎనిమిదేళ్ల కొడుకు రవి.
"అక్కడ ఏముంటుంది బురదమట్టి, పేడ కంపు తప్ప, ఇక్కడైతే ఎగ్జిబిషన్స్, వాటర్ వరల్డ్, వండర్ లాండ్స్ ఉన్నాయి, వెళ్దాము" అన్నది సుప్రియ.
"అలా కాదు మమ్మీ మా ఫ్రెండ్స్ అందరూ పల్లెటూర్లు వెళ్తున్నారు. అక్కడ చాలా బాగుంటుందట. పచ్చని పొలాలు, చల్లటి గాలి వేస్తుందట. మాతోపాటు మరో ఇద్దరు ఫ్రెండ్స్ వస్తామన్నారు.
వాళ్లకి పెద్దవాళ్ళు ఎవరూ లేరట" అన్నారు పిల్లలు.
ఇదంతా పేపరు చదువుతున్న హర్ష "పోనీ పంపరాదా సుప్రియ, పిల్లలు సరదా పడుతున్నారు కదా! అలాగే మా అమ్మని కూడా చూసినట్టు ఉంటుంది" అన్నాడు ఆశ గా.
"వెళ్తే వెళ్లండి.. తండ్రి, పిల్లలు ఒకటయ్యాక ఏం చేయగలం" అంది సుప్రియ రుస రుసలాడుతూ.
@@@
పిల్లలు నలుగురిని తీసుకొని బయలుదేరాడు. పిల్లలు ఆనందం ఒకలాంటిది అయితే హర్షకు 'తల్లిని చూడబోతున్నానని ఆనందం ఒకపక్క'.
సాయంత్రానికి రామాపురం చేరారు ఊర్లోకి కారు రావడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.
బ్యాగులు తీసుకుని దిగి నడవడం మొదలెట్టాడు అప్పుడే కొంచెం వర్షం పడి ఆగినట్టు ఉంది. నేలంతా మంచి మట్టి వాసన వస్తుంది రెండు వీధులు తిరిగి తల్లి ఇంట్లోకి నడిచాడు.
వాళ్ళ రాకను చూసిన తల్లి సుశీలమ్మ ముందు ఆశ్చర్యంతో తర్వాత సంబరంతో కొడుకుని దగ్గర తీసుకుంది. చాలా సంవత్సరాల తర్వాత కొడుకును చూసిన ఆనందంలో కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి సుశీలమ్మకు.
హర్ష కూడా తల్లి ఆలింగనం తో చిన్నపిల్లాడి లా అయ్యాడు.
పిల్లలు ఇంటిని వింతగా చూస్తున్నారు చాలా పెద్ద ఇల్లు, గాలి వెలుతురు ధారాళంగా వస్తుంది. అలాంటి ఇంటిని వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. వాళ్లకి చిన్న చిన్న గదులు, అటాచ్డ్ బాత్రూం ఆడుకోవడానికి చిన్న బాల్కనీ తప్ప ఏమీ తెలియదు. హర్ష ఒక రోజు ఉండి ఇంటికి వెళ్ళిపోయాడు.
"మళ్లీ వస్తాను" 'ఈరోజు వెళ్లకపోతే భార్యతో యుద్ధం తప్పదని' తప్పని సరిగా బయలుదేరాడు.
పిల్లలు మొదటి అడిగిన ప్రశ్న మేము "మిమ్మల్ని ఏమని పిలవాలి" అని.
"మా మనమల లాగే మీరు కూడా నానమ్మ అని పిలవండి" అని చెప్పి పిల్లల్ని నూతి దగ్గరికి తీసుకెళ్లింది స్నానం పోయించడానికి.
"నీకు కొళాయిలు లేవా? " అని అడిగారు.
"లేవమ్మా చూడండి నూతిలో ఎన్ని నీళ్లు ఉన్నాయో మనము చక్కగా చేద పెట్టి మనకు కావాల్సిన నీళ్లు మాత్రమే తోడుకోవాలి, అప్పుడే నీళ్లు ఆదా అవుతాయి. మీలాగా కొళాయి తిప్పి నీళ్లు వృధా చేస్తే, నీళ్లు లేక మీరు కొనుక్కుంటున్నారు కదా. అందుకని ఇక్కడ నీళ్లు ఇలాగే వాడతాం.
చూడండి పిల్లలు.. భూదేవి మనకి అన్ని వనరులు ఇస్తుంది. పుష్కలంగా నీళ్లు, ఖనిజాలు.. ఖనిజాలు అంటే మీకు తెలియదు కదా.. ఇనుము, రాగి, వెండి, బంగారం, నూనె అన్నీ కూడా భూదేవి ప్రసాదిస్తుంది. మనం తినే అన్నం కూడా భూదేవి ఇస్తుంది" అన్నది సుశీలమ్మ.
"ఏం కాదు మేము సూపర్ మార్కెట్ కెళ్ళి కొనుక్కుంటాము"అన్నాడు చింటూ.
"సరే అయితే.. వాళ్లకి ఎక్కడవి సరుకులు" అని అడిగింది.
" మాకు తెలియదు నానమ్మ"అన్నారు పిల్లలు.
"నేను మీకు రేపు చూపిస్తాను కానీ ఇప్పుడు అన్నం తినండి. "
క్రిందన పీట వేసి కంచం పెట్టి అన్నం, కూరలు వడ్డించింది. "మేము నేల మీద కూర్చొని తినము మాకు టేబుల్ కావాలి" అన్నారు పిల్లలు.
"చూడండి పిల్లలు.. క్రింద కూర్చుని తింటే మీరు ఎంత తినగలరో అంతే మీ పొట్టలోకి వెళ్తుంది. దానివల్ల మీకు అజీర్తి రాదు. చక్కగా అరిగిన ఆహారం శరీరానికి బలం ఇస్తుంది" అని చెప్పగానే వాళ్లు నానమ్మ చెప్పినట్టు కింద కూర్చొని శుభ్రంగా తిన్నారు.
"అవును నానమ్మ.. మేము వచ్చినప్పుడు రోడ్డు మంచి వాసన వస్తుంది. ఏమైనా సెంటు చల్లారా" అని అడిగింది పాప రమ్య.
"కాదమ్మా వర్షం పడినప్పుడు మట్టి తడిచి అటువంటి చక్కటి వాసన వస్తుంది. అది దేముడు మనకి ఇచ్చిన వరం" అన్నది సుశీలమ్మ.
"మరి మా మమ్మీ ఇక్కడ అంతా పేడ వాసన అని చెప్పింది" అడిగింది మనవరాలు రమ్య.
"అది కూడా చెపుతానురా.. ఆవుని మనం గోమాత అని పిలుస్తాం, ఆ పాలు మన శరీరానికి చాలా బలాన్ని ఇస్తాయి. అలాగే ఆవు పేడతో కల్లాపి చల్లి సున్నంతో ముగ్గులు వేస్తే చీమలు, పురుగు పుట్రా రావు రేపు ఉదయం మీకు చూపిస్తాను చూడండి. " అని చెప్పి "పిల్లలు మీకు మంచి కథ చెప్పనా"? అడిగింది సుశీలమ్మ.
@@@
"భలే, భలే నానమ్మ చెప్పు"అన్నారు పిల్లలు.
ఆరు బయట మంచాలు ఏర్పాటు చేసింది.
"ఒక అడవిలో ఒక చెట్టు ఉండేదట దానిమీద ఎన్నో పక్షులు, చిలకలు నివాసం ఉండేవి గూళ్ళు కట్టుకుని. అయితే అప్పుడు ఒకసారి చెట్టు ఎండిపోయింది.
అన్ని పక్షులు ఎగిరిపోయాయి కానీ ఒక్క చిలుక మాత్రం ఆ చెట్టుని వదిలిపెట్టలేదు. ఒక పావురం వచ్చి" చిలకా, చిలకా అందరూ ఎగిరిపోయారు కదా! నీవు ఒక్కదానివే ఈ చెట్టును పట్టుకొని ఉన్నావేంటి" అని అడిగింది పావురం.
అప్పుడు చిలక అన్నదట "ఇన్నాళ్లుగ మనకు నీడనిచ్చింది ఈరోజు ఎండిపోయిందని వెళ్ళిపోతే చెట్టు చాలా బాధపడుతుంది. మళ్లీ వానలు పడితే చెట్టు చిగురిస్తుంది, నేను ఇక్కడే ఉంటాను" అందట చిలక.
ఈ మాటలు విన్న చెట్టు చాలా సంతోషించింది. కనీసం ఒకళ్ళయినా నన్ను అర్థం చేసుకున్నారు అని. కొన్నాళ్ళకు మళ్ళీ వానలు పడితే చెట్టు చిగురించిందట"
అని చెప్పి "పిల్లలు.. మీరు చాలా తెలివైనవారు కదా! మీకు ఈ కథ లో నీతి ఏమిటి ? మీకు ఏమిఅర్థం అయింది"? అని అడిగింది సుశీలమ్మ.
వాళ్లు చాలా తెలివైన పిల్లలు. బాగా ఆలోచించి "మనం ఎవరినీడలో పెరిగి పెద్దయేమో వాళ్ళని ఎప్పటికీ వదిలిపో కూడదు అని చిలక చెప్పింది" అన్నారు పిల్లలు.
"చక్కగా చెప్పారు పిల్లలు.. మీరు ఎప్పుడూ మీ తల్లిదండ్రులని వదలకండి" అని వారికి దుప్పటి కప్పింది. వెన్నెల, చల్లటి గాలి చక్కటి పూల పరిమళం వస్తుంటే పిల్లలు హాయిగా నిద్రపోయారు.
@@@
మర్నాడు పిల్లలందరినీ సూర్యోదయానికి ఎదురుగా నిలబెట్టి వాళ్ళ చేత సూర్య నమస్కారాలు చేయించింది.
"ఎందుకు నానమ్మ.. ఇంత తొందరగా లేపావు"? అని అడిగారు పిల్లలు.
"ఉదయాన్నే ఒంటి మీద ఎండ పడితే డి. విటమిన్ శరీరానికి అందుతుంది. పైగా ఈ నమస్కారాల వలన ఒంటికి శ్రమ కలిగి, రాత్రి తిన్న ఆహారం చక్కగా జీర్ణమై ఆరోగ్యంగా ఉంటారు."
పిల్లలకు వేడి, వేడి కుడుములు, అల్లం చట్నీతో తినిపించింది. పెరట్లోకి పదండి అని వాళ్ళని తీసుకుని వెళ్లి చుట్టూ ఉన్న పొలాలను చూపించింది. చేతిలో కొన్ని గింజలను చూపించి "ఇవి ఏమిటివి" అని అడిగింది.
"మాకు తెలీదు" అన్నారు పిల్లలు.
"వీటిని నవధాన్యాలు అంటారు అంటే ఇందులో తొమ్మిది రకాల విత్తనాలు ఉంటాయి. ఇందులో దాన్యం, పెసలు, మినుగులు, ఉలవలు, అనుములు, నువ్వులు, గోధుమలు, సెనగలు" ఉంటాయి.
ఉదాహరణకు ఇవి చూడండి.. ఇప్పుడు మీరు తిన్న ఇడ్లీ ఈ మినుములలో నుంచి వచ్చినవే. అలాగే మీ ఇంటి దగ్గర చపాతీలు తింటారు కదా? అవి గోధుమలు తో చేసేవి. అలాగే మీరు సాంబార్ తింటారు కదా అవి కందుల నుంచి వచ్చినవి. అలాగే అన్ని రకాల పంటలు వేసి రైతు ఆరు నెలలు కష్టపడి పండిస్తే పట్టుకెళ్ళి ఇంకొకరికి అమ్ముతాడు. వాళ్ళని దళారీలు అంటారు వాళ్లు కొని షాపులకి అమ్ముతారు. మీ అమ్మా, నాన్నలు వాటిని కొని మీకు భోజనం పెడుతున్నారు" అంది సుశీలమ్మ.
"అమ్మో.. దీని వెనుక ఇంత కథ ఉందా? ఇంత కష్టం ఉందా!" అన్నారు పిల్లలు.
"అందుకే అన్నారు.. అన్నం పరబ్రహ్మ స్వరూపమని. తినేది ఏ వస్తువు అయినా పారేయకూడదు. సరిపడా పెట్టుకొని తినాలి" అన్నది సుశీలమ్మ.
@@@
మర్నాడు మనవరాలు స్నానం చేసి ఏడుస్తూ వచ్చింది. "ఏమైందిరా తల్లి" అని అడిగింది. చెప్పింది రమ్య.
"అంతేనా.. ఏడవకూడదు. ఇది సంతోషించవలసిన విషయం, అమ్మాయి అమ్మ అవ్వడానికి కావలసిన అవయవ సౌష్టవం సృష్టిస్తాడు భగవంతుడు. అందుకు కొన్ని మార్పులు చేస్తాడు. అందులో ఇది ఒకటి" అని మనవరాలికి ధైర్యం చెప్పి, ఊరివారందరినీ పిలిచి ఐదు బస్తాల ధాన్యము పరిపించింది నేలపై, దానిమీద తాటాకుల చాపను వేసి పాపను లంగా, వోణీ లో చక్కగా ముస్తాబు చేసి పేరంటాలందరితో పాపని కూర్చోబెట్టింది.
కొడుకు హర్ష కి కబురు చేసింది. పాపకి కడుపు నొప్పి రాకుండా మంచి ఆహారం పెట్టేది. "బలంగా తింటే ముందు ముందు ఏ ప్రాబ్లమ్స్ రావు రా తల్లి" అని చెప్పింది. వాళ్ళ నానమ్మ చెప్పినట్టు అన్ని తినేది.
@@@
"పాపను ఇక్కడ తీసుకొచ్చేయండి, ఇక్కడే ఫంక్షన్ చేద్దాము" అన్నది సుప్రియ.
"ఎలాగూ అమ్మ పాపని అక్కడే కూర్చోబెట్టింది కదా! కాకపోతే మళ్లీ ఇక్కడికి వచ్చాక ఫంక్షన్ చేద్దాంలే. పద, పద.. ముందు బయలుదేరుదాం" అన్నాడు బట్టలు సర్దుకుంటూ.
కొంతమందిని తీసుకొని ఆ ఊరు ప్రయాణమయ్యారు హర్ష, సుప్రియ.
కార్లు దిగి నడుస్తుంటే అందరి ఇళ్ల ముందు కొబ్బరాకుల పందిర్లు చక్కటి ముగ్గులు కనిపించాయి.
" ఇంతకీ మీ అత్తవారిల్లు ఏది సుప్రియ.. అందరి ఇళ్ళు చక్కని అలంకరణలతో ఉన్నాయి" అని అడిగింది వనజ.
"ఏమో నేనైతే గుర్తు పట్టలేక పోతున్నాను, ఒకసారి ఎప్పుడో వచ్చాను" అన్నది సుప్రియ.
"ఇక్కడ ఎవరి ఇళ్లల్లో శుభకార్యం జరిగినా అందరూ తమ ఇంట్లో జరిగినట్టుగా భావిస్తారు అందుకే అందరి ఇళ్ళు చక్కగా అలంకరించి ఉన్నాయి"అన్నాడు ముందుకి దారి తీస్తూ.
హర్ష ముందు దారి చూపిస్తుంటే ముందుకి నడిచారు. తల్లి ఇంటి ముందు ఖాళీ స్థలంలో కొబ్బరి ఆకుల పందిరిలు, మొత్తం అంతా మామిడాకు తోరణాలు కట్టి ఉన్నాయి.
"నానమ్మ.. ఇన్ని మావిడాకులు ఎందుకు" అని అడిగాడు రవి.
"రవి.. నీకు తెలుసు కదా! మనకి చెట్ల నుంచి ఆక్సిజన్ వస్తుందని.. మనం వదిలిన కార్బన్డయాక్సైడ్ చెట్లు పీల్చుకుంటాయి. ఏ చెట్టు నుంచి అయినా ఆకు రాలిన వెంటనే దాని ఉనికిని కోల్పోతుంది, కానీ మావిడా కులు మాత్రం వారం రోజులైనా అవి ఆక్సిజన్ని మనకి ఇస్తుంటాయి. ఎక్కువ మంది జనం ఉన్నప్పుడు కార్బన్డైక్సైడ్ ఉంటుంది కదా! దానిని పోగొట్టడానికి ఈ మావిడాకుల్ని కడతాము" అన్నది సుశీలమ్మ.
ఆలకించిన సుప్రియ 'ఏ చదువు చదువుకోకపోయినా మామిడి ఆకుల గురించి ఎంత సైంటిఫిక్ రీజన్ చెప్పారు కదా' అని అనుకుంది సుప్రియ.
ఇంటిలోంచి పిండి వంటల ఘుమఘుమలు వస్తున్నాయి. ఇంటి నిండా పేరంటాళ్ళు తన కూతుర్ని చక్కగా బుట్ట బొమ్మ లాగా పట్టు చీర కట్టి ముస్తాబు చేసి పసుపు, పారాణి, గంధం రాసి కూర్చోబెట్టారు. అది చూసిన సుప్రియ ఒళ్ళు పులకించిపోయింది.
'సిటీలో పార్టీ అంటే మగవాళ్ళందరూ మందు గ్లాస్ పట్టుకొని తిరుగుతారు, ఆడవాళ్ళందరూ స్లీవ్ లెస్ బ్లౌజులతో సిల్క్ చీరలతో కబుర్లు చెప్పుకుంటారు'. కూతురు తనకి కేటాయించినా కుర్చీలో నీరసంగా కూర్చుంటుంది.
"ఏంటోయి ఆలోచిస్తున్నావు" అన్నాడు హర్ష.
"అక్కడ మనం ఫంక్షన్ చేస్తే ఎలా ఉండేదో అని ఆలోచిస్తున్నాను. పాపకు ఇక్కడ ఫంక్షన్ చేయడమే కరెక్ట్ అని అనిపిస్తుంది. పాపని చూడండి చక్కగా వాళ్ళ నాన్నమ్మ పెట్టిన ఆహారం తిని బొద్దుగా తయారైంది.
అదే మనమైతే హాస్పిటల్ కి తీసుకెళ్లి మందులు ఇప్పించేవాళ్ళం. చూడండి ఎంత ఆనందంగా ఉందో,, అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు" అంటూ భర్త చేతిలో చేయివేసి పట్టుకొని ముందుకు నడిచింది.
"మరి అదే కదా నేను ఇన్నాళ్ళ నుంచి చెప్పేది. పెద్దవాళ్లు పాత చింతకాయ పచ్చడి అని తీసిపారేస్తారు నీలాంటి వాళ్ళు. అందుకే అన్నారు పెద్దలు! పెద్దవాళ్ల మాట చద్దన్నం మూట అని.. వాళ్లకు అన్ని విషయాలు తెలుసు" అన్నాడు హర్ష, తల్లిని చూస్తూ.
"నిజమేనండి.. పెద్దవాళ్లుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. వాళ్లకు చక్కని నడవడిక నేర్పుతారు. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతారు" అన్నది ఆనందంగా కూతురుపై అక్షంతలు వేస్తూ సుప్రియ.
*శుభం*
కొల్లా పుష్ప గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొల్లా పుష్ప
Comments